Tuesday, January 31, 2012

కథాజగత్ - భద్రాచలం యాత్ర ... వాళ్ళక్క కథ?

  
కథ : భద్రాచలం యాత్ర ... వాళ్ళక్క కథ? 
రచయిత : వంశీ


వంశీ అన్న పేరు తలుచుకుంటేనే ముందుగా గుర్తొచ్చేది గోదావరి. గోదావరి అందాలని వర్ణించటంలోనూ, ఆ యాసని జనులకి పరిచయం చేస్తూ పాఠకులని భూతల స్వర్గంలో విహరింపచేయటంలోనూ ఈయనది ప్రత్యేక శైలి. ఆ విధముగా సాగిపోయేదే ఈ భద్రాచలం యాత్ర. శీర్షికకు తగ్గట్టు రాజమండ్రీ నుండి పాపికొండల మీదుగా భద్రాచలం యాత్రా విశేషాలు, దారిలో తగిలే పల్లెలు - వాటి ప్రాముఖ్యత, గోదావరితో పెనవేసుకున్న వాళ్ళ జీవితాలను ఎంతో చక్కగా రూపొందించినదే భద్రాచలం యాత్ర ... వాళ్ళక్క కథ?

కథలోకి వస్తే అమెరికాలో ఉండే తెలుగు జనాలకి అఖండ గోదావరీ నదిలో ప్రయాణించి ఆనందించాలనిపించి మనదేశం వచ్చినపుడు రాజమండ్రీ నుండి గూటాల మూర్తి గారి లాంచీలో ప్రయాణం మొదలుపెడతారు. చక్కని, రుచికరమయిన భోజనం వండి వడ్డించే బోసు; రాత్రి పూట వెలుతురు కోసం జనరేటరు, లైట్లు పెట్టే కోరుకొండ బాబ్జీ; దారిలో ఎదురయ్యే ప్రాంతాలని వర్ణించి, విశేషాలను విడమరిచే గైడు మంగరాజు కూడా వెంట వెళతారు.

గోదావరీ నది ఒంపు సొంపులను, ఎత్తైన పాపికొండల అందాలను ఆస్వాదిస్తూ, ఆయా ప్రాంత విశేషాలు తెలుసుకుంటూ, వెన్నెలలో, ఇసుక తిన్నెలలో జనాలు జగాన్ని మైమరచిపోతున్నా, సమయానికి కోరినవి వండి వడ్డించే బోసు, వేమూరి రవికిరణ్ అనే ప్రయాణీకుడి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆంధ్రులు భోజన ప్రియులు అన్నట్టుగా వారి జిహ్వకి కోరిన రుచులను అందించే గోదావరిలాంటి బోసు చిఱునవ్వు వెనుక అగాధం ఉందని, దానిని ఎలాగయినా తెలుసుకోవాలనే కోరిక అతనిలో పెరిగి, బోసు చేసే ప్రతీ పనినీ తీక్షణంగా గమనిస్తూ ఉంటాడు. బోసు తన గతం తాలూకు జ్ఞాపకాలను రవికిరణ్ తో పంచుకోవటంతో కథ ముగుస్తుంది.

నా వరకూ ఈ కథలో కథానాయకుడు బోసే. మనసు లోతుల్లో ఎన్ని ఆటుపోట్లున్నా, జీవితంలో సుడిగుండాలు ఎదురయినా, అనుకోని సంఘటనలు దొంగ ఊబుల్లోకి కూరేసినా అన్నిటినీ జయించి, దేనికీ చలించక, నిబ్బరంగా, గంభీరమయిన గోదావరిలా నవ్వులు చిందిస్తూ నిలబడ్డ మనీషి. అలానే సొంత నేల మీద అతనికున్న మమకారం, కాసుల మీద అతనికి లేని వ్యామోహం రెండూ కూడా అతను అమెరికా ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా తేట తెల్లమవుతాయి. "కాశీలో ప్రాణం పోతే ముక్తి, కురుక్షేత్రంలో దానం చేస్తే ముక్తి, జాహ్నవీ తీరంలో తపస్సు చేస్తే ముక్తి, ఈ మూడు ఫలితాలను ఇచ్చే గోదావరీ నదీతీరంలో క్షణంకాలం నివసించినా ముక్తి" అన్న మాటలు జ్ఞప్తికి వస్తాయి మనకు. ఈ కథకు వర్ణనలు ప్రధానమయిన ఆకర్షణ. చదువుతున్నంత సేపూ మనం కూడా ఆ లాంచీలోనే ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుంది.  

ఏ విధముగానయితే నిలకడగా ఉన్న గోదావరి అందాలే కాక, పోటు మీదున్న గోదావరి విధ్వంసాన్ని కూడా చూపిస్తుందో అదే విధముగా ఈ కథలో బోసు వాళ్ళక్క అయినటువంటి సుశీల జీవిత సంబంధిత విషాద ఛాయలని కూడా రచయిత ఎంతో పొందికగా మన ముందుకు తెస్తారు.  బోసుకి అక్క మీదున్న ప్రేమ అతని ప్రతీ మాటలోనూ కనిపిస్తూ ఉంటుంది. కొన్ని గాయాల తాలూకు గుర్తులు మదిలోతుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. పచ్చబొట్టు చెరిగిపోదులే........

Sunday, January 22, 2012

మాయలోకంఓసి పువ్వా ఎందుకే పరిమళించేవు
వాడిపోయేవా తావి పరితపించేను
ఓసి నవ్వా ఎందుకే పరిహసించేవు
వీడిపోయేవా జీవి పలవరించేను

పువ్వు నవ్వులు ఆగిపోయినా
నవ్వు పువ్వులు రాలిపోయినా
జీవితం మోడు అవ్వదా ఆ వనం బీడు అవ్వదా

కలలలోకంలో ఉన్నావంటే కలత తీరక కలవరిస్తావు
గాలిమేడలే కట్టావంటే గాలిపటమై తిరిగిరావు నువ్వు
ఓ గమ్యమన్నదే లేకపోతే అగమ్యమవ్వదా ఆ పయనం
మాయలోకంలే ఇది మోసగించేదే విధి

ఆదమఱపుగా ఉన్నావంటే కసి కాలం కాటుకి బలి అవుతావు
ఏమీ చెయ్యక ఉన్నావంటే నువ్వెందుకూ కొరగాక పోదువు

అర్థమన్నదే లేకపోతే వ్యర్థమవ్వదా ఆ జీవితం
మాయలోకంలే ఇది మోసగించేదే విధి

Tuesday, January 17, 2012

పండుగ కబుర్లు ౩

ఇప్పటిదాకా ధనుర్మాసమంతా కనిపించే పండుగ కబుర్లు చెప్పుకున్నాం కదా! ఈ టపాలో పండుగ మూడు రోజుల ముచ్చట్లూ చెప్పుకుందాం.

పండుగ వాతావరణమంతా ప్రస్ఫుటముగా కనిపించే ఈ ధనుర్మాసమంతా ముద్దబంతుల అందాలతో, ముద్దుగుమ్మల సోయగాలతో, క్రొత్త అల్లుళ్ళతో, ఇంటిముందర గొబ్బిళ్ళతో, పాడి పంటలతో, కన్నెపిల్లల ఆటపాటలతో, పోతుపేరంటాళ్ళ (మగవారు ఆడవారి పేరంటానికి వెళితే ఇలానే అంటారు) కుతూహలంతో, హరిదాసు కీర్తనలతో, పశుపక్ష్యాదులకు వితరణతో, ఇలా ఎన్నో విషయ తివాచీలతో సంక్రాంతి పురుషునికి స్వాగతం పలుకుతాము. ఈ పండుగ మూడు రోజులయిన భోగి, సంక్రాంతి, కనుమ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం.

భోగి:

భగ (అనగా మంటలు లేదా వేడిని పుట్టించడం) అనే పదం నుండి భోగి అనే పదం ఉద్భవించినది. ఈరోజున తెల్లవారుఝామునే నిద్ర లేచి భోగిమంటలు వేస్తారు. మనిషిలో దాగి ఉన్న పాత చెడు అలవాట్లను, ఈర్ష్య, ద్వేషం, అసూయ మొదలయిన వాటిని జ్ఞానం అనే అగ్నిలో దహించివేసి నూతన జీవితాన్ని ఆరంభించడమే ఈ భోగి మంటలోని అంతరార్థం.


ఇంట్లోని పాత వస్తువులయిన చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లలు, కర్ర పుల్లలు, మొదలయినవాటిని ఏడాది పాటుగా దాచి ఉంచడాన్ని భౌతిక లోభ గుణం అంటారు. వీటిని అగ్నికి ఆహుతి చేయుట వలన వైరాగ్యం కలుగుతుంది అనేది లౌకికార్థం. ఈ మంటలలోని ఉన్న వెచ్చదనం ఇంకెక్కడా ఉండదేమో! దీనిని ముఖ్యముగా రోడ్ల కూడలి (నాలుగు దారులు కలిసే చోటు)లో వేస్తారు. దీని వలన చెడు అనేది ఏ ద్వారమునుండి కూడా మన ఇంట్లోకి ప్రవేశించదు అని నమ్మకం. ఇందులో ముఖ్యముగా ఆవు పేడతో చేసిన పిడకలను తప్పక వేస్తారు. గోమయం అనేది ఎన్నో రోగములకు మంచి మందు కనుక దీని నుండి వచ్చే పొగ ఎన్నో రోగాలను నివారిస్తుంది. అలానే దక్షిణాయనంలో పడిన కష్టాలను అగ్నిలో వేసి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు అనే భోగాలని ఇమ్మని వేసే మంటలే భోగి మంటలు అని కూడా అంటారు. మనది వ్యవసాయ ప్రధాన దేశం కనుక ఏడాది పొడువునా కష్టపడిన భోగికి (భోగములను అనుభవించేవాడు భోగి ఇక్కడ సందర్భములో రైతు అని అర్థం) పంట చేతికొచ్చే రోజున కుప్పలు నూర్పిడి అవ్వగానే మిగిలిన పదార్ధాలతో వేసిన ఈ భోగి మంట వలన పుష్యమాస లక్షణమయిన చలి తగ్గి వాతావరణం కొంచెం వేడెక్కుతుందని ఒక నమ్మకం. అలాగే రాబోయే కాలంలో వేడిని తట్టుకునే వస్తువులేవో తెలుసుకోడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ మంటలో వేసిన వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయిన తరువాత దానిమీదే నీళ్ళు కాచుకుని స్నానాలు చేస్తారు.


సాయంత్రం చిన్నపిల్లలకు తలపైన భోగిపండ్లు పోస్తారు. ఈ భోగిపళ్ళలాగా రేగుపండ్లని వాడతారు. వీటితోపాటు పూలరేకులు, చిల్లర డబ్బులు అన్నీ కలిపి దృష్టి దోషం పోవడానికి తలపైన పోస్తారు. రేగుపండ్లనే సంస్కృతంలో బదరీఫలాలు అంటారు. బదరీ నారాయణుడయిన ఆ శ్రీహరి కరుణా కటాక్షాలు పిల్లలపై పడి ఆశీర్వచనంగా ఉంటుంది. అలానే రేగుపండ్లని అర్కఫలాలు అంటారు. సూర్యునికి ప్రతినిధిగా శక్తిని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చే శక్తి రేగుపండ్లకు ఉంది కనుకనే వాటిని పిల్లలపై పోయడం వలన ఆ స్పర్శకి వారికి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి అని నమ్మకం. పిల్లలకు భోగిపళ్లు పోయటం అంటే సూర్యునికి ఆరాధన చేయటం అనే భావన కూడా ఉంది. ఈ రోజున సందడి అంతా పిల్లలదే. తెగ హడావిడి చేస్తూ అటూ ఇటూ తిరిగేస్తూ భలే ముద్దొచ్చేస్తూ ఉంటారు.

మకర సంక్రాంతి:

మకరం అంటే మొసలి. మానవుని ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డు తగులుతూ మోక్ష మార్గానికి అనర్హునిని చేయడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అందువలన దీని బారి నుండి తప్పించుకునేందుకు ఏకైక మార్గం దాన ధర్మాలు చేయటం. అందుచేత ఈ పండుగ దినాన వీలయినన్ని దాన ధర్మాలు చేస్తూ, పశుపక్ష్యాదులకు సైతం గింజలు పెడుతూ దాని బారి నుండి తప్పించుకుని మోక్ష మార్గాన్ని చేరుకునే అర్హత సంపాదించుకుంటాము.


ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగా ఉంటుందిట. అందువలననే దక్షిణాయనంలో అంపశయ్య మీద పడిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం దాకా వేచి స్వచ్ఛంద మరణాన్ని కోరుకున్నాడని కూడా ఉంది కదా! ఈ రోజున మరణించిన వారికి స్వర్గ లోక ప్రాప్తి ఉంటుందని కూడా పురాణాలు చెపుతున్నాయి. కనుక ఈ రోజున కోళ్ళ పందాలు, పొట్టేళ్ల పందాలు పెడతారు.


ఇంటికి చేరిన క్రొత్త బియ్యంతో మొదటగా పాలు పొంగించి సూర్యనారాయణునికి పొంగలి నైవేద్యం పెడతాము. అలానే గాదికి చేరిన క్రొత్త పంటతో ఎన్నో రుచికరమయిన పిండివంటలతో జిహ్వకి రసోస్వాదన. ఉత్తరాయణ పుణ్యకాలం పితృ దేవతలకి ఆరాధనా కాలం. ప్రతీ సంక్రమణానికీ పితృ తర్పణలు ఇవ్వాలి కాని మిగతా పదకొండు సంక్రమణాలకీ ఇచ్చినా, ఇవ్వకపోయినా మకర సంక్రమణం నాడు మాత్రం తప్పకుండా ఇవ్వాలి. ఈ రోజున ముఖ్యముగా అరిసెలు చేస్తారు. కేవలం అరిసెలు మాత్రమే పితృ దేవతల గ్రాసం, ఏడాదికి సరిపడా భక్ష్యంట.


ఎగిరింది ఎగిరింది నా గాలిపటం
గాలిలో ఎగిరింది నా గాలిపటం
పైపైకి ఎగిరింది నా గాలిపటం
పల్టీలు కొట్టింది నా గాలిపటం
రంగురంగులదండి నా గాలిపటం
రాజ్యాలు దాటింది నా గాలిపటం
మబ్బును దాటింది నా గాలిపటం
పందెమే గెలిచింది నా గాలిపటం

అంటూ గాలిపటాన్ని ఎగురవేయటం భలే సరదాగా ఉంటుంది కదూ! దీనిని పతంగుల పండుగ అని కూడా అంటారు. ఇదివరకు ఐతే ఎన్నో రకాల గాలిపటాలను ఇంట్లోనే తయారుచేసుకునేవాళ్ళం. కాని ఇప్పుడు పిల్లలను ఆకర్షించేలా రక రకాల బొమ్మల ఆకారాలలో దొరుకుతున్నాయి. రాత్రి గోదా కళ్యాణంతో ఈ రోజు ఘట్టం ముగుస్తుంది.

కనుమ:

దీనినే పశువుల పండుగ అని కూడా అంటారు. పంట చేతికి రావడానికి రైతుకి చేదోడు వాదోడుగా నిలిచినవి గోవులు. కనుక ఈ రోజు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమ కడుపు నింపిన గోమాతకి క్రొత్త బట్టలు తొడిగి, పసుపు, కుంకుమలతో పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ రోజున ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు.చేతికందిన పంటను తమతో పాటూ, పశువులూ, పక్షులూ కూడా పాలు పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకి కడతారు. అలానే ఈ రోజున గారెలు, ఆవడలు (పెరుగు గారెలు), పొంగు బూరెలు వేసి గ్రామాన్ని చల్లగా చూసి సుభిక్షంగా ఉంచినందుకు కృతజ్ఞతగా గ్రామదేవతలకి నయివేద్యాలు పెడతారు. ఈ రోజున గరగ నృత్యం చూడటానికి రెండు కళ్ళూ చాలవు.


మా కోనసీమ కనుమ ప్రత్యేకమయిన ప్రభల తీర్థం చూడటానికి ఇంద్రునిలా ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నా చాలవు. సుమారు 400 సంవత్సరాల క్రితం మొదలయిన ఈ పండుగ ఈ నాటికీ నిర్విరామంగా, కోలాహలంగా, కన్నుల పండుగగా జరుగుతూ ఎంతో మందిని ఆకర్షిస్తుంది. ఈ తీర్థం జగ్గన్న తోటలో జరుగుతుంది. ఈ జగ్గన్నతోటలో ఏ విధమయిన గుడి కానీ, గోపురం కానీ ఏమీ ఉండవు అంతా కొబ్బరి తోట. ఈ తీర్థంలో గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వర స్వామి, గంగలకుర్రు - చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం - వ్యాఘ్రేశ్వర స్వామి, పెదపూడి - మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ - ఆనంద రామేశ్వర స్వామి, వక్కలంక - కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు - చెల్లమల్లేశ్వర స్వామి, ముక్కామల - రాఘవేశ్వర స్వామి, మొసలపల్లి - మధుమానంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి - న్నెమల్లేశ్వర స్వామి, పుల్లేటికుర్రు - అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి మొత్తం ఏకాదశ రుద్రులను ప్రభలపై మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో, ఆనంద పారవశ్యంతో జగ్గన్న తోటకి ఊరేగింపుగా తీసుకుని రావటం అనాదిగా వస్తున్న ఆచారం. అలా ఈ తోటకు ఏకాదశి రుద్రులు తరలి వచ్చి లోక కళ్యాణం గురించిన చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


వెదురు కర్రలను చీల్చి వాటిని వర్తులాకారంలో వంచి కట్టి, వాటిని రంగు రంగుల వస్త్రాలతో, పూలతో అలంకరించి వేద మంత్రాల మధ్య గంటలను మ్రోగిస్తూ అహోం-ఒహోం అంటూ కులమతాలకి అతీతంగా ఈ ప్రభలను మోసి భక్తులు పులకిస్తారు. శివుని వాహనంగా పిలువబడే వీరభద్రుని ప్రతిరూపాలే ఈ ప్రభలు అని త్రికరణ శుద్ధిగా నమ్ముతారు. పచ్చని పంట పొలాల మీదనుంచి, కొబ్బరితోటలో ప్రభలను ఊరేగిస్తున్న దృశ్యం చూడటానికి నలు మూలల నుండీ జనాలు తరలి వస్తారు.


ఇక్కడ ప్రవహించే గోదావరి పాయని కౌశిక అంటారు. ప్రభలు కౌశికలో ప్రవేశించడానికి ముందు పంట పొలాలను తొక్కుకుంటూ జనాలు వచ్చినా రైతులు బాధపడక పోగా సంతోషిస్తారు. వారి వారి పొలాల మధ్యనుంచి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వెళ్ళటం వలన పంట బాగా పండుతుందని, పూర్వ జన్మ సుకృతం అని కూడా నమ్ముతారు. అందమయిన ఏకాదశి రుద్రుల ప్రభలతో ఉన్న ఈ తోటని, తీర్థాన్ని వర్ణించడం మానవతరం కాదు. ఆ అనుభూతిని ప్రతీ ఒక్కరూ ఒక్కసారయినా తప్పక పొందవలసినదే!

అవండీ నాకు తెలిసిన పండుగ విశేషాలు అన్నీ మీతో పంచుకున్నాను. ఇంతటితో సమాప్తం. మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

Friday, January 13, 2012

పండుగ కబుర్లు ౨

ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు తరువాత ఈ పండుగలోని మిగతా విషయాల గురించి ఈ టపాలో చర్చించుకుందాం. 

బుడబుక్కల వాళ్ళు:
అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు అంటూ స్వరయుక్తంగా పలుకుతూ ఢమరుకాన్ని మ్రోగిస్తూ జరగబోయే సంగతులన్నిటినీ గమ్మత్తుగా చెప్పే ఈ బుడబుక్కల వాళ్ళ రాక ఈ పండుగకి క్రొత్త అందాన్నిస్తుంది. తెల్లటి పంచ, నల్లని కోటు, ఎఱ్ఱని తలపాగా కట్టుకుని, నడుముకి గంట చేతిలో ఢమరుకంతో వాకిట్లో నిలిచే ఈ బుడబుక్కల వాళ్ళు ఈ మధ్యన బొత్తిగా నల్లపూసవుతున్నారు. బుడబుక్కల వాయిద్యాలయిన ఉడుక్క, పలుడక్క, డుక్క, డబ్డక్క చాలా మంది చూసి కూడా ఉండరేమో! 


వీరి ప్రస్తావన త్రేతాయుగంలో వస్తుంది. త్రేతాయుగములో ఈశ్వరుడు ఢంబికాసురుడు అనే రాక్షసుడిని సంహరించి, ఆ రాక్షసుడి వెన్నుముకని బుడబుక్క గుల్లగా, నరములను తాళ్ళుగా, చర్మాన్ని మూతలుగా, మెదడుని మైనముగా ఉపయోగించి ఢమరుకం తయారుచేసి దానిని వాయిస్తూ అయోధ్యా నగర పాలకుడయిన దశరథ మహారాజు వద్దకు బుడబుక్కల వాని వేషములో వెళ్ళి నలుగురు కుమారులు పుడతారని చెప్పినట్లు ఉంది. ఈ విధముగా వీళ్ళు మన పురాణేతిహాసాల కాలం నుండి ఉన్నారని తెలుస్తోంది. వీరు మనకి జ్యోస్యం చెప్పినప్పుడు భిక్షని స్వీకరించి చల్లని ఆశీర్వచనాలు అందిస్తారు.

గంగిరెద్దు మేళం:
గంగిరెద్దు అంటే తెలియని తెలుగు వారు ఉండరు అనటంలో కించిత్ కూడా అతిశయోక్తి లేదు. దీని ప్రస్తావన కూడా మన పురాణాలలో ఉంది. గజాసుర సంహారం కోసం బ్రహ్మాది దేవతలు గంగిరెద్దు మేళం వలే, నంది గంగిరెద్దువలే, శ్రీహరి ఆ ఎద్దుని ఆడించేవాని వలే వచ్చి పరమశివునికి గజాసురుని పొట్టనుంచి విముక్తి కలిగించారని ఉంది కదా! 


గ్రామంలో ఎవరయినా చనిపోయినప్పుడు కానీ, ఏదయినా కార్యక్రమాలప్పుడు కానీ శుభం జరగటం కోసం రైతులు వారి ఆవుదూడలను గంగిరెద్దు ఆడించే వారికి దానమిస్తారు. అప్పుడు వీరు నృత్యం తదితర అంశాలలో శిక్షణను ఇచ్చి డోలు, సన్నాయిలు వాయిస్తూ మన ఇంటి ముందుకి బసవన్నను తీసుకు వచ్చి ఎన్నో విన్యాసాలు చేయించి అయ్యవారికి దణ్ణం పెట్టు, అమ్మగారికి దణ్ణం పెట్టు అంటూ ఆడించి తగిన పారితోషకం పొందుతారు. ఈ గంగిరెద్దు నృత్యం ఎంతో ఆకట్టుకుంటుంది.

జంగమ దేవరలు:
వీరు కూడా ఈ పండుగ సమయములో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.  వీరు కూడా పురాణాల కాలం నుంచి ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే సీతాదేవిని అపహరించడానికి పరమశివుని భక్తుడయిన రావణాసురుడు జంగమ దేవర వేషంలోనే వెళ్తాడు కదా! 


తెల్లవారే సరికల్లా జోలె తగిలించుకుని, నుదుటి మీద పెద్ద పెద్ద విభూది రేఖలు పెట్టుకుని, హర హర మహాదేవ అనుకుంటూ ఒక చేతితో గణ గణ గంటలు మ్రోగిస్తూ, దిక్కులు పిక్కటిల్లేలా  శంఖాన్ని పూరిస్తూ సాక్షాత్తూ పరమశివుడే కైలాసం వదిలి ఇంటి ముందు నిలిచాడా అన్నట్టు కనిపించే వీరి ఆహార్యం అనిర్వచనీయం. ధనుర్మాస ప్రారంభ రోజు మొదలుకొని వీరు కూడా ఏక భుక్తం చేస్తూ, నేల మీద పడుకుని, నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో భిక్షాటనం చేస్తూ ఊరూరా తిరుగుతారు. వీరిని చూస్తే నాకు ఆ మహేశ్వరుడే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ముందు నిలిచినట్టు అనిపిస్తుంది. వీరు కూడా భిక్షను తీసుకుని సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదిస్తారు.

ఈ మువ్వురూ కూడా కుటుంబమంతా సుభోజ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు. 

బొమ్మల కొలువు:
మనిషి అనే బొమ్మని చేసి ప్రాణం పోసి ప్రాణిగా మలిచిన బ్రహ్మ గారి సభకు ప్రతిరూపమే ఈ బొమ్మల కొలువు. ఈ సమస్త సృష్టి ఆయన కొలువులో భాగమేగా? అందుకనే రక రకాల బొమ్మలతో ఈ కొలువును ఏర్పాటు చేస్తారు. నాకసలు ఇదంటే చిన్నప్పటినుండి ఎంతో ఇష్టం ఎన్నో రకాల బొమ్మలు భద్రంగా దాచుకున్నాను. మీరు కూడా చూడండి కావాలంటే? 


బొమ్మల కొలువుకి మెట్లు బేసి సంఖ్యలో పెట్టాలి. అన్నిటికన్నా పై మెట్టు మీద దేవతా విగ్రహాలను పెట్టి, తరువాత జలచరాలు, భూచరాలు ఇలా సృష్టిలోని పరిణామ క్రమాన్ని ప్రతిబింబించేలా పెట్టాలి. ఇదివరకు దేవాలయం, జంతు ప్రదర్శనశాల, అంగడి, ఇల్లు, రాసలీల, ఇలా కొన్ని బొమ్మలే ఉండేవి కాని ఇప్పుడు బోలెడు రకాల బొమ్మలను పెడుతున్నారు. ప్రతీసారీ క్రొత్త బొమ్మ తప్పనిసరిగా చేర్చాలి. 


దీని వలన పిల్లలకి చాలా ఉపయోగాలున్నాయి. అవేమిటంటే ముందుగా పిల్లలకి పూజ చేయటం అలవాటవుతుంది. పేరంటానికి వచ్చినవారికి మర్యాదగా కుంకుమ పెట్టి, చందనం అద్ది, పసుపు రాయటం అలవాటవుతుంది. మనకున్నది పది మందితో పంచుకోవటం వాయినాలు ఇవ్వటం ద్వారా అలవడుతుంది. ఇరుగుపొరుగు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పిలవటం, వాళ్ళ ఇళ్ళల్లో పేరంటాలకి వెళ్ళటం వలన సత్సంబంధాలను పెంపొందించుకుంటారు. వారికున్న కళాత్మకతకి పదును పెట్టే సమయం కూడా ఇదే. 


ఎన్ని బొమ్మలున్నా సరే పసుపు వినాయకుడినీ, పసుపు గౌరీ దేవినీ పెట్టి, రెండు పూటలా ధూప, దీప నైవేద్యాలతో పూజ చేసి కర్పూరం వెలిగించాలి. ఈ బొమ్మల కొలువుని మూడు రోజులు కాని, అయిదు రోజులు కాని, వారం రోజులు కాని, తొమ్మిది రోజులు కాని ఉంచుతారు. ఎలా ఉంది మా బొమ్మల కొలువు?

మరిన్ని కబుర్లు వచ్చే టపాలో.....

 

Thursday, January 12, 2012

పండుగ కబుర్లు ౧


సంక్రాంతిలో "సం" అంటే మంచి లేదా మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే పండుగ కనుక దీనిని "సంక్రాంతి" అని అంటారని పురాణాలలో ఉంది. ఈ ఒక్క పండుగ మాత్రమే నెలంతా చేసుకుంటాము. ఈ నెల రోజులూ కూడా కోనసీమ పల్లెటూర్లల్లో ఎంతో కోలాహలంగా ఉంటుంది. 


నింగిలోని తారలన్నీ వాకిట్లో చుక్కల పరుపు వేయగా
మెరుపులన్నీ ఆ చుక్కలని కలిపి ముగ్గుల దుప్పటీ కప్పెను
పౌష్యలక్ష్మి ఆ ముగ్గులోని గొబ్బెమ్మగా మారి
గుమ్మడి పూలతో అలంకరించుకుని
 ఆ శ్రీహరి కోసం ఎదురుచూడసాగెను 
తుంబుర నారదులు కరములలో తాళం వేయగా
నటరాజు కాలి అందియలలో ఘల్లు ఘల్లు మనగా
త్యాగయ్య, గోపన్నాదులు గళములో శ్రుతి కలుపగా
ముక్కోటి దేవతలు విరులుగా మెడలో నాట్యములాడగా
సూర్య భగవానుడు పారాణిగా రంగును అద్దగా
భూదేవి అక్షయపాత్రగా మారి సిగను చేరగా
ఊర్ధ్వ పుండ్రాలతో పీతాంబరాలతో భక్తి పారవశ్యంతో
శ్రీమద్రమారమణ గోవిందో హరి అంటూ వచ్చెను శ్రీ హరి


ఈ పండుగలో ముఖ్యమయిన వాటిల్లో ముందుగా ఈ టపాలో ముగ్గులు, హరిదాసు గురించి ముచ్చటించుకుందాం.

సంక్రాంతి ముగ్గులు:

పూర్వం లక్ష్మీదేవి... పేదలకు వరాలిస్తూ అస్పృశ్యుల ఇండ్లలోకి ప్రవేశించిందట. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుని ప్రేరణతో ఆమెను వెలివేశాడట. దీంతో లక్ష్మీదేవి ఏ విధమైన చింతా లేకుండా ఈ మార్గశిర, పుష్య, ధనుర్మాసాల్లో.. మరింత మంది పేదల ఇళ్ళకు వెళ్లి వరాలు ఇవ్వడం ప్రారంభించిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే ధనుర్మాసంలో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముంగిట ప్రతీ ఒక్కరూ పోటీ పడి, వారి నైపుణ్యమంతా జోడించి మరీ ముత్యాల ముగ్గులు, చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు, గీతల ముగ్గులు ఇలా ఎన్నెన్నో కలబోసి రంగు రంగుల ముగ్గులు పెడతారు. ఈ ముగ్గులు కూడా ఏది పడితే అది పెట్టకూడదు.భోగి రోజున భోగి కుండలతో లేదా చెఱకు గడలతో లేదా గాలిపటాలతో లేదా గంగిరెడ్లతో లేదా హరిదాసులతో నిండిన ముగ్గుని వేయాలి. పెద్ద పండుగయిన సంక్రాంతి నాడు దార్ల ముగ్గు వేయాలి. ఈ రోజున అన్ని వైకుంఠ ద్వారాలూ  తెరుచుకుంటాయని, ఈ రోజున మరణించిన వారు సరాసరీ వైకుంఠానికే వెళతారని చెప్తారు. కనుక  దానికి  ప్రతీకగా  ముగ్గు మధ్యనించి అన్ని వైపులా ద్వారాలను తీస్తున్నట్టు ఈ దార్ల (ద్వారాల) ముగ్గు పెడతారు.


ఇహ కనుమ నాడు రథం ముగ్గు వేయాలి. ఈ రోజున సంక్రాంతి పురుషుడిని (అనగా ఈ పండుగని)  చక్కగా ముత్యాల పల్లకీలో పంపడానికి ఏర్పాట్లు చేస్తాము. అందుచేత ఈ రోజున రథం మన ఇంటి వైపు వస్తున్నట్టు వేయాలి.

ముక్కనుమ నాడు కూడా రథం ముగ్గే వేయాలి. ఈ సంక్రాంతి పురుషుడు మనమిచ్చిన ఆతిధ్యాన్ని అంతా స్వీకరించి చక్కగా ఈ పల్లకిలో తిరిగి వెళిపోతాడు కనుక రథం మన ఇంటినుంచి బయలుదేరినట్టు వేయాలి. తరువాత రోజున ఆ రథాన్ని సాగనంపాలి. దీనినే రథం ఈడ్చటం అంటారు. 

ఈ మాసంలో ముగ్గుల మధ్యలో గొబ్బిళ్ళని పెట్టి పూజించడం  మన ఆచారం.

హరిదాసు:

సంక్రాంతి శోభ ఈయనతోనే వస్తుంది. హరి దాసు అంటే హరికి దాసుడు అని కనుక ఈ పేరు వినగానే నాకు నారద మునీంద్రులే కళ్ళ ముందు మెదులుతారు. హరిదాసులు మూడు రకాలుట. మొదటి రకం వారు హరికధ అనే ప్రక్రియ ద్వారా శ్రీహరి గాధలని వ్యాప్తి చేస్తూ ఉంటారు. రెండవ రకం వారు హరిదీక్షను తీసుకుని భజన, గానం, నృత్యాలు చేస్తూ హరి నామాన్ని వ్యాప్తి చేస్తారు. మూడవ రకం వారు హరినామ సంకీర్తన చేయుచూ కార్తీకమాసము మరియు సంక్రాంతి సమయాల్లో గ్రామములలో భిక్షాటన చేసేవారు. మనకి పండుగ సమయములో కనిపించేది ఈ మూడవ రకం వారు.  హరిదాసు వాయించే సంగీత వాయిద్యాన్ని బట్టి వీరు తుంబుర హరిదాసు, గంట హరిదాసు, చిడతల హరిదాసు, కొమ్మ హరిదాసు అని పిలుస్తారు. మనకి ఎక్కువగా కనిపించే హరిదాసుల చేతుల్లో తుంబుర, చిడతలు తప్పనిసరిగా కనిపిస్తాయి. ఏక భుక్తం (ఒంటి పూట భోజనం చేయటం), అథః శయనం (క్రింద లేదా నేల మీద పడుకోవటం), శీతల స్నానం (చన్నీటితో స్నానం చేయటం), బ్రహ్మచర్యం (మనసా, వాచా కర్మణా) పాటిస్తూ సర్వావస్థలలోనూ ఆ భగవంతునికే దాఖలు పడుతూ భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో అకుంఠిత దీక్షతో ఉండే హరిదాసుని తలుచుకోగానే నాకు అన్నమాచార్య కీర్తన గుర్తుకువస్తుంది.

ప|| అన్నిటాను హరిదాసు లధికులు |
కన్నులవంటివారు కమలజాదులకు ||

చ|| అందరును సమమైతే నరుహానరుహము లేదా |
అందరిలో హరియైతే నౌగాక |
బొందితో విప్రునిదెచ్చి పూజించినట్టు వేరే |
పొందుగాని శునకము బూజింపదగునా ||

చ|| అన్నిమతములు సరియైతేను వాసిలేదా |
చెన్నగుబురాణాలు చెప్పుగాక |
యెన్నగ సొర్ణాటంక మింతటాను జెల్లినట్లు |
సన్నపుదోలుబిళ్ళలు సరిగా జెల్లునా ||

చ|| గక్కున బైరు విత్తగా గాదము మొరచినట్లు |
చిక్కినకర్మములెల్లా జెలగెగాక |
తక్కక శ్రీవేంకటేశు దాస్యమెక్కుడైనట్టు |
యెక్కడా మోక్షోపాయమిక జెప్పనున్నదా ||

అందమయిన రంగవల్లుల మధ్యలో గొబ్బిళ్ళను పెట్టి భక్తితో హరిని కీర్తిస్తే సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడనీ, ఆయన తల మీద గుమ్మడికాయ ఆకారములో ఉండే అక్షయపాత్ర మన భూమికి సంకేతమని జనుల విశ్వాసం.

అక్షయపాత్ర విశిష్టత:
అక్షయము అనగా ఎప్పుడూ నిండుగా ఉండేదని అర్ధం. ఈ పాత్రను శ్రీమహావిష్ణువు సూర్యభగవానుడికి ఇచ్చాడనీ దానినే పాండవుల వనవాస సమయంలో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇచ్చాడనీ తదుపరి ధర్మరాజు పట్టాభిషేక సమయంలో ఈ పాత్రను ఎవరికి అందించాలన్న ప్రశ్నకు కృష్ణుడు బదులుగా వేయిగంటల మండపాన్ని కట్టించి బ్రాహ్మణులకు భోజనం పెట్టమని ఆ సమయంలో గంటలు మ్రోగినప్పుడు వారికే ఇవ్వమని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ ప్రకారం ధర్మరాజు బ్రాహ్మణులకు భోజనం పెట్టినా గంటలు మ్రోగకపోవడంతో ధర్మరాజు శ్రీకృష్ణున్ని ప్రార్ధించగా చాత్తాది శ్రీవైష్ణవునకు భోజనం పెట్టమని సూచిస్తాడు. చాత్తాది శ్రీవైష్ణవుడు తాను భోజనం చేయనని స్వయంపాకం ఇమ్మని కోరగా ఆ ప్రకారం అతడు స్వయంపాకాన్ని తీసుకువెళ్ళి వండి గోదాదేవీ సహిత శ్రీకృష్ణమూర్తిని అర్చించి నివేదన చేసి అప్పుడు అతను భుజించగా గంటలు మ్రోగుతాయి. అప్పుడు ధర్మరాజు అక్షయపాత్రను చాత్తాది శ్రీవైష్ణవునకు ఇచ్చినట్లు నాటి నుండి వారే హరిదాసులుగా వంశపారంపర్యంగా కులవృత్తిగా ఈ అక్షయపాత్రను ధరించి గ్రామసంచారం చేస్తున్నట్లు పురాణ కథనం. ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయానికి మునుపే శ్రీకృష్ణ గోదాదేవీలను అర్చించి తిరుప్పావై పఠించి అక్షయపాత్రను ధరించి గ్రామ సంచారం ప్రారంభిస్తారు. గ్రామ సంచార ప్రారంభం నుంచి తిరిగి వచ్చేవరకు హరినామ సంకీర్తన తప్ప ఇతరులతో సంభాషణ చేయడంకానీ, అక్షయపాత్ర దింపుట కానీ చేయరు. ఇంటికి చేరిన పిదప ఇల్లాలు పాదాలు కడిగి అక్షయపాత్ర ఆమె దింపి అందులోని పదార్ధములతోనే వండి నైవేద్యం పెడుతుంది.
ఈ టపా వ్రాసినది రసజ్ఞ. చదువుతూనే ఉండండి మరికొన్ని సంక్రాంతి విశేషాల కోసం.  

Saturday, January 07, 2012

అమ్మాయి సమాధానం
అబ్బాయి తన మదిలోని ప్రేమను అమ్మాయికి వ్యక్తపరిచాక ఆలోచించుకుని ఎన్నో తర్జనభర్జనల తరువాత అమ్మాయి ఇలా సమాధానమిచ్చింది!


నిండు పున్నమి వెన్నెల్లో పండు వెన్నెల కోనల్లో
పొన్న చెట్టు నీడల్లో అందని ఆశల దాపుల్లో
వేయి వేణువుల రాగంతో కోటి భావాల పల్లవితో
నా మనసు పాట పాడింది ప్రతి మనసూ వంత పాడింది

సవ్వడి చేసే గుండెల్లో సన్నని రాగం పుట్టింది
అల్లరి చేసే వయసేమో తెలియని మమతను కోరింది
మల్లెమాలల మధురిమలు ఈ మౌనవీణకు సరిగమ నేర్పితే
తారాచంద్రుల కలయికలు తియతియ్యని రేయికి జ్ఞాపికలు

పువ్వుల నవ్వుల మాటల్లో ఆశల పేరడి పుట్టింది
గాలికి రేగిన మనసేమో గగనాల అంచులే దాటింది
నింగీ నేల కలయికలు ఈ గాలి పాటకు వరవడి నేర్పితే
ఒక చల్లని చూపుల కిరణాలు మమతల కోవెలకే మకుటాలు

కోరిక ముంగిట గంటల్లో కోకిలగానం పుట్టింది
కమ్మని భావపు తలపేమో వీనులవిందులు చేసింది
వెలుగులు చిందే దీపాలు మన చక్కని చెలిమికి ప్రతిరూపాలై
ప్రియుని చెంతకు చేరేందుకై ప్రేమ తేరు నాకై వేచి ఉన్నది 

Tuesday, January 03, 2012

సుస్వరాల అక్షర మాలనా అక్షరాల తొలి పూజ వేటూరికే
ఈ సుస్వరాల మల్లెమాల సినారెకే
సమర్పించుకుంటాను సగర్వంగ నేను
పాట పాడుకుంటాను సిరివెన్నెల లోనూ

చంద్రబోసు జాలాది చైతన్యం నింపగా
భువనచంద్ర విశ్వ సౌఖ్యాలే పంచగా
ఆత్రేయుడు ఆరుద్రుడు నా మనసే దోచగా
జొన్నవిత్తుల కందికొండ వెన్నెలకంటి కొసరాజు
సాహితీ సౌరభాలు ఆలకించరా
నే కీరవాణి రాగంలో ఆలపించగా

రాజశ్రీ శ్రీశ్రీలు యదార్ధాన్ని తెలుపగా
సుద్దాల గద్దరు సుద్దులెన్నో పలుకగా
దాశరధీ ఆ దాసరి నా మదిలో నిలువగా
దేవులపల్లి గురుచరణు భాస్కరభట్ల పైడిశెట్టి
ఓ సామవేద భావాన్ని పండించరా
ఆ సాహిత్యం అనంతంగా వర్ణించగా

సముద్రాల పింగళ హై హై నాయకులు కాగా
జోగయ్య దానయ్య పద జిగిబిగిలే తెలుపగా
రసరాజు ఘంటసాల నా హృదయ వీణ మీటగా
భానుమతి రామకృష్ణ మల్లేపల్లి మైలవరపు
మన కేశవులే కవులకు ఆదర్శం అవ్వరా
గంధర్వ గానంలో మన బాలు విహరించగా