Wednesday, June 29, 2011

గొబ్బి గోపెమ్మ


ఎక్కడనుంచో దూరంగా తిరుప్పావై వినిపిస్తోంది. అది వినగానే నాకు ఇవాల్టినుంచి ధనుర్మాసం మొదలయ్యిందన్న విషయం అర్ధమయ్యింది. అసలు పరిపూర్ణమయిన పండగ వాతావరం చూడాలన్నా, ఆ అనుభూతిని పొందాలన్నా మా ఊరు రావలసినదే. గోదావరి జిల్లాలలో ఏ పల్లెటూరికి వెళ్ళినా ఆ పండగ వాతావరణమే వేరు. ధనుర్మాసం వచ్చిందంటే అసలే ఆడపిల్లలకి ఎన్ని పనులు చెప్పండి? పొద్దున్నే లేవాలి మంచి మంచి ముగ్గులు వేయాలి. వెచ్చని, స్వచ్ఛమయిన ఆవు పేడ తీసుకుని రావాలి. దానితో గొబ్బెమ్మలను చేయాలి, చేసిన గొబ్బెమ్మలను పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. వీటిల్ని ముగ్గు మధ్యలో పెట్టిన తరువాత మన వీధిలో అందరికంటే మన ముగ్గే అందంగా ఉండాలి. అప్పుడు కాసేపు మన నైపుణ్యాన్ని మనం మెచ్చుకుంటుండగానే ఏ పాలవాడో, వార్తా పత్రికలు వేసే వాడో వచ్చి మన ముగ్గు తోక్కబోతాడు. వాడికి కాసేపు హిత బోధ చేయాలి లేదా వాడు తొందరపడి చెరిపేస్తే వాడితోనే మన ముగ్గుని దిద్దించాలి. ఇన్ని పనులయ్యి మనం వెళ్లేసరికి అప్పుడే అందమయిన  రంగు రంగుల పూలన్నీ విచ్చుకుంటాయి. కృష్ణ బంతులు, ఊక బంతులు, ముద్ద బంతులు, ఎన్నో రంగులలో డిసెంబరాలు, గొబ్బి పూలు, మొదలయినవాటన్నిటినీ కోసి మాల కట్టి గుడికి సరిగ్గా బలిహారం (సూర్యోదయ సమయం అప్పుడు స్వామికి పెట్టే నైవేద్యం) సమయానికి తీసుకెళ్ళి ఇస్తే మనకు పూజారి గారు వరమిచ్చి వేడి వేడి ప్రసాదం ఇస్తారు. 

ఇప్పుడే అసలు పని మొదలవుతుంది. పొద్దున్న తెచ్చిన ఆవు పేడలో కొంచెం సాయంకాలానికి దాచామా, గొబ్బిళ్ళు పెట్టుకోవడం కోసం మరి ముత్తయిదువులని పిలవాలి కదా? కాబట్టి అలా ఇంట్లో మన పని ముగించుకుని మిగతా పనిని అమ్మకి వదిలేసి మనం అలా ఊరిలోకి వెళ్లి మిగతా వాళ్ళందరినీ పిలవాలి. పిలవడమంటే మాటలనుకున్నారా? ఇదే అసలయిన చిక్కు మా ఇంట్లో ఇవాళ అంటే మా ఇంట్లో ఇవాళ అని వాదులాడుకోవడం సాధారణంగా జరిగే పనే కనుక అందరం కలిసి ఒక్కొక్కళ్ళకి ఒక్కో రోజు ఇచ్చేసి నెలంతా పంచేసుకుంటాం. ఇవన్ని మొదటి రోజే జరగాలి అప్పుడే నెలంతా చీకు, చింత లేకుండా హాయిగా గొబ్బిళ్ళు పెట్టుకోవచ్చు. ఇదంతా కుదుర్చుకుని ఇంటికెళ్ళి అమ్మతో ప్రసాదం చేయించాలి కదా మరి? ఇది కూడా ముందే ఒక మాట అనేసుకోవాలి తిన్న ప్రసాదమే మళ్లీ మళ్లీ ఏమి తింటాం? కాబట్టి ఆ ప్రసాదం కూడా రకరకాలు ఏమేమి ఉండాలో అనేసుకుంటే బాగుంటుంది. ముఖ్యముగా అప్పుడే వచ్చే రాసుసిరి కాయలతో చేసే పిండి పులిహార అంటే నాకు చాలా ఇష్టం! ఇదంతా అయ్యి మనం పట్టు పరికిణీ తీసుకుని సిద్ధంగా పెట్టుకునే సరికి సాయంకాలమవుతుంది. 

ఇంక పూజకి కావలసినవన్నీ సిద్ధం చేయాలి. ఇక్కడ మనం కొన్ని ముఖ్య విషయాల గురించి మాట్లాడుకోవాలి. అవేమిటంటే? గొబ్బిళ్ళు అంటే ఏమిటి? వాటిల్ని  ఆవు పేడతోనే ఎందుకని చేస్తారు? మొదలయినవన్నమాట.
గోమాత వేద స్వరూపిణి. ముఖ్యముగా గోమయాన్ని (అంటే ఆవు పేడ) మనం గౌరీ దేవి ప్రతీకగా పూజిస్తే మనం కోరుకున్న వరునితో త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం. ఇది ఒక భావన అయితే ఇంకొక భావన ఏమిటంటే మనం గొబ్బిళ్ళు పెట్టేటప్పుడు మనం మధ్యలో పెద్ద గొబ్బెమ్మని పెడతాము. అది గోదా దేవికి ప్రతీక. పక్కన పెట్టే సందె గొబ్బెమ్మలు మిగిలిన గోపికలకి ప్రతీక. వీటిని అందుకనే అలా ముద్దలా వదిలేయకుండా పసుపు, కుంకుమ, పూలు పెట్టి అలంకరిస్తాము. ఇలా పెట్టిన గొబ్బెమ్మల చుట్టూ కన్నె పిల్లలందరూ ఆడుతూ, కృష్ణుని ఊహించుకుంటూ పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ గుండ్రముగా తిరుగుతారు. ఇలా పాడే పాటలనే గొబ్బి పాటలు అంటారు. వీటికి జానపద  వాజ్ఞ్మయములో ప్రత్యేకమయిన స్థానం ఉంది. 


"సుబ్బీ గొబ్బెమ్మా.. సుబ్బణ్ణీయవే..
 చామంతి పువ్వంటీ చెల్లెల్నీయవే
తామర పూవంటీ తమ్ముణ్ణీయవే
బంతి పువ్వంటి బావ నివ్వవే
తాటి పండంటి తాత నివ్వవే
మల్లె పూవంటి మామా నివ్వవే 

అరటి పండంటి అత్త నివ్వవే
మొగలి పూవంటీ.. మొగలి పూవంటీ.. మొగుణ్ణీయవే.."  అంటూ పూజని ముగించే సమయములో సిగ్గు పడే అమ్మాయిలని చూడటానికి పోతు పేరంటాళ్ళు (అబ్బాయిలు కనుక అమ్మాయిల పేరంటానికి వస్తే మా ఊరిలో ఇలానే అంటారు) కూడా వస్తారు. కొంతమంది దాక్కుని చూస్తే కొంతమంది ఏకంగా పెరంటానికే వచ్చేసి మరి చూస్తారు. సరే ఈ పూజ అయ్యాక ఇష్టం వచ్చినంత సేపు గొబ్బి పాటలు పాడుతూ ఆడచ్చు. ఇక్కడ మచ్చుకకి నాకు గుర్తున్న కొన్ని పాటలని ఇస్తున్నాను.
పాట - : అన్నమాచార్య కీర్తన

కొలని  దోపరికి  గొబ్బిళ్ళో  
యదుకుల  స్వామికి  గొబ్బిళ్ళో  ll 2 ll

కొండ  గొడుగుగా   గోవుల  గాచిన  
కొండుక  శిశువుకు  గొబ్బిళ్ళో
దుండగంపు  దైత్యుల  కెల్లను  తల 
గుండు  గండనికి  గొబ్బిళ్ళో                ll కొలని  దోపరికి ll

పాప  విధుల  శిశుపాలుని తిత్తుల 
కోపగానికిని  గొబ్బిళ్ళో 
యేపున  కంసుని  యిడుమల  బెట్టిన 
గోప  బాలునికి  గొబ్బిళ్ళో                     ll కొలని  దోపరికి ll

దండివైరులను  తరిమిన  దనుజుల 
గుండె  దిగులునకు  గొబ్బిళ్ళో 
వెండి  పైడి  యగు  వేంకట గిరిపై 
కొండలయ్యకును  గొబ్బిళ్ళో                     ll కొలని  దోపరికి ll
పాట -౨ :

గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ 
సంక్రాంతి  పండగొచ్చె గొబ్బియళ్ళొ
అహ  సంక్రాంతి   పండగొచ్చె  గొబ్బియళ్ళొ

సీతా దేవి  వాకిట  వేసిన గొబ్బియళ్ళొ
మన  సీతా  దేవి  వాకిట  వేసిన  గొబ్బియళ్ళొ    llగొబ్బియళ్ళొll


మాణిక్యాల  ముగ్గులు  వేసి గొబ్బియళ్ళొ 
  ముగ్గుల  మీద  మల్లె  పూలు  గొబ్బియళ్ళొ 
నవరత్నాల  ముగ్గులు  వేసి  గొబ్బియళ్ళొ 
  ముగ్గుల  మీద  మొగలి  పూలు  గొబ్బియళ్ళొ  llగొబ్బియళ్ళొll


రంగు  రంగుల  ముగ్గులు  వేసి  గొబ్బియళ్ళొ
  ముగ్గుల  మీద  మందారాలు  గొబ్బియళ్ళొ
ధాన్యపు  రాసుల  ముగ్గులు  వేసి గొబ్బియళ్ళొ
  ముగ్గుల  మీద  సంపెంగలు  గొబ్బియళ్ళొ         llగొబ్బియళ్ళొll


భూదేవంత  ముగ్గులు  వేసి  గొబ్బియళ్ళొ 
  ముగ్గుల  మీద  నక్షత్రాలు  గొబ్బియళ్ళొ 
లక్ష్మి  రధముల  ముగ్గులు  వేసి  గొబ్బియళ్ళొ 
  ముగ్గుల  మీద  గుమ్మడి  పూలు  గొబ్బియళ్ళొ   llగొబ్బియళ్ళొll

ముంగిట  ముగ్గులు  వేసి  గొబ్బియళ్ళొ
  ముగ్గులోన  పొంగళ్ళు  గొబ్బియళ్ళొ 
భోగి  పళ్ళ  సందళ్ళు  గొబ్బియళ్ళొ
మరదళ్ల  సరదాలు  గొబ్బియళ్ళొ            llగొబ్బియళ్ళొll 

పాట - ౩ :

గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
దుక్కు దుక్కు దున్నారంట - ఏమి దుక్కు దున్నారంట
రాజా వారి తోటలో జామ దుక్కు దున్నారంట
అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

విత్తు విత్తు వేశారంట - ఏమి విత్తు వేశారంట
రాజా వారి తోటలోన జామ విత్తు వేశారంట

అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

మొక్క మొక్క మొలిచిందంట - ఏమి మొక్క మొలిచిందంట
రాజా వారి తోటలోన జామ మొక్క మొలిచిందంట
అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

పువ్వు పువ్వు పూసిందంట - ఏమి పువ్వు పూసిందంట
రాజా వారి తోటలోన జామ పువ్వు పూసిందంట  
అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ 

పిందె పిందె వేసిందంట - ఏమి పిందె వేసిందంట
రాజా వారి తోటలోన జామ పిందె వేసిందంట
అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

కాయ కాయ కాసిందంట - ఏమి కాయ కాసిందంట
రాజా వారి తోటలోన జామ కాయ కాసిందంట  
అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

పండు పండు పండిందంట - ఏమి పండు పండిందంట
రాజా వారి తోటలోన జామ పండు పండిందంట 
అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

పాట - ౪ :

ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను
ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను 
ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను

ఉట్టి మీద పాలు పెరుగు ఎట్టా దించెను?  
ఉట్టి మీద పాలు పెరుగు ఎట్టా దించెను?
వాణ్ని కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు   ll ఏల ll

చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు  
చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు
పొన్న మాను పైన పెట్టి పంతమాడెనే           
ll ఏల ll   


పాట - ౫ :

అటవీ స్థలములు కడుగుదమా
చెలి వట పత్రమ్ములు కోయుదమా  ll 2 ll

చింత గింజ లాడుదమా 
చిరు చిరు నవ్వులు నవ్వుదమా  ll
అటవీ ll

వీసెడు గంధం పూయుదమా
వీధిలో ముగ్గులు వేయుదమా   
ll అటవీ ll

పూలను మాలగా కట్టుదమా
స్వామికి మేడలో వేయుదమా   
ll అటవీ ll

పాట - ౬ :

ఒక్కేసి పూవు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

రెండేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

మూడేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

నాలుగేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

ఐదేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

ఆరేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

ఏడేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

ఎనిమిదేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

తొమ్మిదేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

పదేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

ఇలా పూలు, గంధం, ఓపిక, ఆకలి అయ్యే దాక పూలను పెంచుకుంటూ వెళ్ళచ్చు.
ఈ తతంగమంతా ఈ రోజుల్లో ఎందుకనో కనుమరుగవుతోందనిపిస్తోంది. ఈ కాలంలో గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళు తక్కువే,పాటలు తెలిసిన వాళ్ళు కూడా తక్కువే. పైగా పేడని పట్టుకోవడానికి అసహ్యించుకునే జనాలు ఎక్కువయ్యారు. ఆవుపేడ క్రిమిసంహారిణి పైగా ప్రకృతికి ఎంతో మేలు చేస్తుంది కనుకనే ఇంటి ముందు దానితో కళ్లాపి చల్లుతారు. ఈ గొబ్బిళ్ళ  సాంప్రదాయం కేవలం హిందువులకే పరిమితం కాదండోయ్ మేము గొబ్బిళ్ళు పెట్టుకునే రోజుల్లో మత భేదాలు లేకుండా అందరూ వచ్చేవారు అందరం కలిసి చేసుకునే వాళ్ళం. కనుక మనకున్న సంస్కృతిని కాపాడుకుందాం. 
గొబ్బిళ్ళు పెట్టుకోవడం తరువాత వాటిల్ని ఏమి చేయాలి అనా అడుగుతున్నారు? ఏముంటుంది? వాటితో పిడకలని కొట్టి, బాగా ఎండిన పిడకలని తీసుకెళ్ళి భోగి మంటల్లో వేయవచ్చు లేదా అలా దాచి రథ సప్తమికి సుర్యభగవానునికి పొంగలిని చేయడానికి ఈ గొబ్బి పిడకలని వాడచ్చు. అదండీ సంగతి! ఇక మీరు కుడా ఈ సారి సంక్రాతికి గొబ్బిళ్ళు పెడతారు కదూ! నన్ను పిలవడం మర్చిపోకండే!    

పాటలు కావాలంటే తీసుకోవడానికి వీలుగా ఇక్కడ జతచేశాను. 


గొబ్బి పాటలు 

14 comments:

nanda said...

గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
u have got some god damn patience to write abt it.....nice one........

రసజ్ఞ said...

@nanda gaaru
thanks andi

BHARATHeeyudu said...

Rasgna gaaru mimmalni pogada koodadhu anukuntoone pogadakundaa vunda leka pothunnaanandi...asale ee kaalamlo ammailu ((achcha telugu ammailu )) kanumarugayyaru ani andharoo anukuntunna samayamlo oka swatchamaina godhavaree gopemmannu maa mundhunchi...gobbemmala andhalni ... godhavaree gopemmala(gopikala) goppathananni ee sahasra maaya jagaththu ( internet ki nenu pettukunna telugu peru) lo petti...padhahaaru anaala telugu ammaila manh palakaalni maa mundhu vunchi nandhuku mimmalni abhinandhimcha kundaa vundalekunnaanu.

BHARATHeeyudu said...

emandoyy...annattu meeru disti theepimchu kovaalandi....paadu janula paadu drusti mee meedha padakundaa...

రసజ్ఞ said...

@BHARATeeyudu gaaru
dhanyavaadamulu

Anonymous said...

ఇది ఆషాఢమాసం కదా! ఇప్పుడు గొబ్బిళ్ళేమిటి చెప్మా!

రసజ్ఞ said...

@అచంగ గారు
హహ్హహ బాగుంది మీ ధర్మ సందేహం. రాయాలనిపించింది రాసేసాను అంతే అండి. ఇప్పుడు గొబ్బిళ్ళు పెడతారని కాదు.

Anonymous said...

హబ్బ ఎంత ఓపికండి మీకు! ఇన్ని పాటలు ఎలా గుర్తున్నాయి చెప్మా? అచ్చమయిన తెలుగమ్మాయి అనిపించుకున్నారు! తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ టపాలో. పోతు పేరంటాళ్ళు అనే పదానికి బోలెడు నవ్వేసాను. ఎప్పుడూ వినలేదు.

రసజ్ఞ said...

@అజ్ఞాత గారు
ధన్యవాదాలండి.

kallurisailabala said...

ఈ పోస్ట్ నాకు బాగా నచ్చేసింది.
మేము కూడా గొబ్బిళ్ళు పెట్టి సంది గొబ్బెమ్మల పేరంటం చేసేవాళ్ళం.

రసజ్ఞ said...

@శైల గారు
మీకు బాగా నచ్చినందుకు చాలా సంతోషమండీ! ఇక్కడ నేను రాసిన గొబ్బి పాటలు కాకుండా మీకింకా ఏమయినా పాటలు తెలిస్తే నాకు చెప్పండి!

Madhu Latha (Dogiparthi) Srungavarapu said...

రసజ్ఞ గారు, నేను చిన్నప్పటి నుంచి పట్ణంలో పెరిగాను, పండుగలంటే పాఠాలలో వ్యాసాలాగా ప్రద్దున్నే లేవటం కొత్తబట్టలు కట్టడం అనే అనుకొన్నాను కానీ మీ వ్యాసాలు నాకు చాలా విషయాలను తెలియజేస్తున్నాయి. నేను తెలుగు భాషాభివృద్ధికై ఒక వెబ్ సైట్‌ను పొందుపరుచుతున్నాను. దీనికి మీరు సహకరిస్తారని ఆశిస్తున్నను, నాకు ఏమైనా సందేహాలు వస్తే మెమ్మల్ని అడగవచ్చా?

రసజ్ఞ said...

@ మధులత గారూ
మీకు క్రొత్త విషయాలు తెలుస్తున్నాయంటే అంతకన్నా ఏం కావాలి? తప్పకుండా నిస్సంకోచంగా అడగండి. నాకు తెలిస్తే తప్పక చెప్తాను. ధన్యవాదాలు!

Anonymous said...

Incredible points. Solid arguments. Keep up the good work.My web-site: dating sites (bestdatingsitesnow.com)