Monday, April 30, 2012

అనూప్



చాలా కాలం తరువాత మళ్ళీ నాకు ఇష్టమయిన మరొక చిత్రకారునితో మీ ముందుకి వచ్చాను. ఆయనే "అనూప్ గోమే". ఈయన ఇప్పుడిప్పుడే ఈ కళలో స్థిరపడుతున్న వ్యక్తి కాని కుంచె పట్టింది మాత్రం తన అయిదవ ఏట. 

తనకి తండ్రీ, గురువు అయినటువంటి మదన్ గోమే గారికి చేదోడు వాదోడుగా ఉంటుందని పట్టిన కుంచె ఇప్పుడు ఎన్నో అద్భుతాలను చిత్రిస్తోంది అనటంలో అతిశయోక్తి లేదు. వీళ్ళ నాన్నగారికి ఢిల్లిలో కళార్తి అనే స్టూడియో ఉండేది. వారి నాన్నగారు ఎన్నో సినిమాలకి బేన్నర్లు వేస్తుంటే చూసి నేర్చుకున్న విద్య. వీరి నాన్నగారు వద్దని చెప్పినా ఈయన మాత్రం అక్కడ చెక్కలను కోసి, కుంచెలు సర్ది ఇలా ఏదో ఒక వంకతో అక్కడక్కడే ఉండి మరీ నేర్చుకున్నారుట. అది ఆయనకి కళ మీద ఉన్న శ్రద్ధ!  అలా తన పదమూడవ ఏట మొట్టమొదటి బేనరుని వేయటం జరిగింది. 



అప్పటిదాకా శ్రద్ధ మాత్రమే ఉన్న ఈయనకి మెల్లిగా కళ మీద మక్కువ పెరిగింది. ఏదో వెయ్యాలన్న తపన కానీ ఏం వేయాలో, ఎలా వేయాలో తెలియని రోజుల్లో రవివర్మ గారి చిత్రాలు ఈయనని ఎంతగానో ఆకర్షించాయి. అప్పటినుండీ ప్రముఖులు వేసిన చిత్రాలను ఎన్నో ఈయన వేసేవారు. అలా గోపాల్ గారి పెయింటింగ్స్ కూడా ఈయన వేశారు. 

ఈయన చిత్రాలలో సహజత్వం, అలంకరణ ప్రధానాంశాలు. ఊహాత్మకత, సమాజాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఎన్నో దురాచారాల వలన కలిగే నష్టం, మానసిక బాధ కూడా అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటాయి అని నాకనిపిస్తుంది.


 ఇలా ఎంతో మంది వేసిన బొమ్మలనే వేయటం కన్నా సొంతంగా ఏదయినా వెయ్యాలి అన్న తపనతో తైల చిత్రానికి శ్రీకారం చుట్టారు. అదే ఇది. మొట్టమొదట కుడిపక్కన ఉన్న బొమ్మ వేశారుట. కాని తృప్తి చెందక ఎడమ పక్కన ఉన్న బొమ్మ వేశారుట. కొంచెం పరికించి చూస్తే కేవలం రంగులే కాదు, ఆభరణాల తీరుబాటు,తీగల సర్దుబాటు ఎన్నో చేసి సంతృప్తి చెందాక అప్పుడు విడుదల చేసారుట. ఈ చిత్రం ఎంతో మంది మదిని దోచుకుంది. 

అప్పుడు ఈయన చిత్రాలకు ఎంతో ముచ్చటపడిన మీనా ఠాగూర్ గారు ఈయనకి శిక్షణ ఉంటే ఇంకా రాణించగలరని గుర్తించి ఈయనని 'Delhi College of Art' లో బాచిలర్సు లో చేరమని సలహా ఇచ్చారుట. ఆవిడ మాటని కాదనలేక, ఇంకా గొప్ప గొప్ప చిత్రాలను మలచాలన్న తపనతో 1999-2003 వరకు అక్కడ  బాచిలర్సు డిగ్రీలో పట్టా పొందారు. తరువాత మెల్లిగా ఢిల్లిలో మంచి పేరు ప్రఖ్యాతలు గడించుకున్నా ప్రపంచ వ్యాప్తంగా తన చిత్రాలను అందరకీ పరిచయం చేయాలన్న కోరిక అయితే ఉందని చెప్పారు.

ఆయన కోరిక నెరవేరి ఆయన చిత్రాలు ఎంతో మంది ఆదరణని పొందాలని కోరుకుంటూ... ఆయన వేసిన చిత్రాలలో నాకు నచ్చిన కొన్నిటిని మీ ముందుకు తెస్తున్నాను. ఇంకెందుకాలస్యం చూసి ఎలా ఉన్నాయో చెప్పండి మరి!

 

Thursday, April 12, 2012

పింకీ


పింకీ అంటే ఏంటి? చెప్పుకోండిచూద్దాం!!!! ఏంటి తెలియదా? సరే ఇది విన్నారా
చిటికిన వేలు సింగారం
ఉంగరపు వేలు బంగారం
నడిమి వేలు నాన్న
చూపుడు వేలు నీకేసి
బొటన వేలు బొట్టేట్టి
ఐదు వేళ్ళ అరచెయ్యి
అరచెయ్యి అరచెయ్యి అంటించి
దేముడికి దణ్ణం పెట్టు

ప్చ్ వినలేదా? పోనీ ఇది విన్నారా?
చుట్టాల సురభి - బొటనవేలు
కొండేల కొరవి - చూపుడువేలు
పుట్టు సన్యాసి - మధ్యవేలు
ఉంగరాల భోగి - ఉంగరపు వేలు
పెళ్ళికి పెద్ద - చిటికిన వేలు

పింకీ అంటూ వేళ్ళ గురించి చెప్తుందేమిటి ఈ పెంకి పిల్ల అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా! పింకీ అంటే చిటికిన వేలు. దీనినే కనిష్ఠిక అంటారు. అంటే ఆఖరిది లేదా చివరిది అని. ఉన్నట్టుండి ఈ చిటికిన వేలు మీదకి ధ్యాస ఎందుకు మళ్ళింది అంటే మొన్న నాకు చిటికిన వేలు గోరులోకి ముల్లు దిగి బాగా నొప్పి పెట్టింది. అప్పుడు తెలిసింది నాకు దీని విలువ. దీనిని పెద్దగా పట్టించుకోము కానీ ఇది మనకి చాలా ముఖ్యమయినది. ఎలా అంటారా? పూర్తిగా చదివెయ్యండి మరి!!!

శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని చిటికిన వేలితో ఎత్తాడు అని మనందరికీ తెలిసినదే కదా! అంటే గోవర్ధనోధ్ధారణం (గోవర్ధన ఉద్ధరణ) జరిగింది. గోవర్ధన గిరి మీద ఎక్కువగా ఉండేవి ఏమిటి అంటే గోవులు, గోపాలురు కదా! గోవులు అంటే జ్ఞానులు, వేద వాక్కులు అనే అర్థాలు కూడా ఉన్నాయి. అలానే గోవర్ధనము అంటే జ్ఞానుల శిఖరము, భక్తుల పర్వతం అనే అర్థాలు కూడా ఉన్నాయి. చిటికిన వేలు జ్ఞానానికి ప్రతీక అని ఉండనే ఉందిగా. కనుక అటువంటి జ్ఞానానికి ఈయన (శ్రీ కృష్ణుడు) జ్ఞానాన్ని జోడించి, ఈయన జ్ఞాన ప్రకాశం చేత భక్తులనీ, జ్ఞానులనీ ఉద్ధరించాడు అంటే పెంచాడు అని దీని అంతరార్ధం. 

తరువాత, చిటికిన వేలు ప్రాధాన్యంగా కనిపించే అంశం సప్తపది. ధియో యోనః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః అని కరన్యాస మంత్రం. నూతన వధూవరులు ఒకరి చిటికిన వేలు మరొకరు పట్టుకుని అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయటంలోని ఆంతర్యం ఇద్దరూ పరస్పర సహకారముతో అన్ని విషయాల్లోనూ సమస్త జ్ఞాన అన్వేషణలో ఒకరికి ఒకరు తోడుగా ఉండి జీవితంలో తరిస్తారు అని. అదే కాక చిటికిన వేలు పట్టుకుంటే మనకి ఎదుటి వారి మీదున్న ప్రేమ, నమ్మకం, భరోసా అన్నీ తెలుస్తాయిట. అందుకనే చిన్న పిల్లలని చూడండి జాగ్రత్తగా చిటికెన వేలు పట్టుకుని అడుగులేస్తారు.

మన చేతిలోని బొటన వేలు పరమాత్మను సూచిస్తే, చూపుడు వేలు జీవుడిని, ప్రక్కన ఉన్న మూడు వేళ్ళూ వరుసగా శరీర స్వభావాలయిన తమస్సు, రజస్సు మరియు సాత్వికాన్ని సూచిస్తాయి. దీనిని బట్టీ మనకు చిటికిన వేలు సాత్వికాన్ని తెలిపేది అని తెలుస్తోంది. మనకు లభించిన ఈ శరీరం కర్మ వలననే ఏర్పడింది కనుక దీనికి సాత్విక ప్రవృత్తి చాలా తక్కువ. మనిషి బాగుపడటం అనేది కేవలం సాత్వికం వలనే అవుతుంది. చూపుడు వేలు అనే జీవుడిని మామూలుగా వదిలేస్తే సత్వ గుణములో కానీ, రజో గుణములో కానీ, భయంకరమయిన తమో గుణములో కానీ పడి కొట్టుకుంటాడు. దీని ప్రకారముగా ఆలోచించి చూస్తే పరమాత్మలో జీవుడిని ఏకం చేసి వారిరువురూ వేరు కాదు ఒకరే అని తెలుసుకోవటమే జ్ఞానం. కనుక చూపుడు వేలును బొటన వేలు వైపు వంచడమే జ్ఞాన ముద్ర లేదా చిన్ముద్ర అని అంటారు. 

మన శరీరములో నిరంతరం శక్తి ప్రవహిస్తూ ఉంటుంది అని మనకి తెలిసినదే కదా! అలానే ఆ శక్తి మన చేతుల్లో కూడా ప్రవహిస్తుందనీ, మన చేతిలోని అయిదు వేళ్ళూ పంచ భూతాలూ అనే అయిదు తత్వాలకి సంకేతాలనీ అంటారు. ఆ ప్రకారముగా బొటని వేలు అగ్నికీ, చూపుడు వేలు వాయువుకీ, మధ్య వేలు ఆకాశానికీ, ఉంగరం వేలయిన అనామిక భూమికీ, చిటికిన వేలు జలానికీ సంకేతాలు. ఈ అయిదిటికీ సమతుల్యత లేకపోవడం వలననే రోగాలు వస్తాయనీ వాటిని నివారించడానికి ఈ వేళ్ళతో రక రకాల ముద్రలను నిత్యం సాధన చెయ్యాలనీ గాయత్రీ మంత్రం చెప్తుంది.

బాబోయ్! ఆధ్యాత్మిక విషయాలు చాలా ఎక్కువ చెప్పేశానా? సరేలే మళ్ళీ మీకు బాగా తెలిసిన విషయానికి వచ్చేస్తా. అదేమిటంటే పాండు రాజు చనిపోయినప్పుడు తన శవాన్ని దహనం చేయవద్దనీ తన శరీరాన్ని మొత్తం తన అయిదుగురు కుమారులూ తినెయ్యాలనీ కోరతాడు. కానీ శ్రీ కృష్ణుడు మాత్రం వద్దని వారిస్తాడు. ఒకవేళ వారు అలా తినుంటే సకల జ్ఞానులయ్యేవారుట! ఎన్నో శక్తులు వారి సొంతమవుతాయని శ్రీ కృష్ణుడు వద్దని చెప్తాడు. మిగతావారంతా కృష్ణుని మాట విని ఊరుకుంటారు కానీ సహదేవుడు మాత్రం నాన్నగారు ఎందుకని అలా చెప్పారో అని ఆయన చిటికిన వేలు తినేస్తాడుట. దాని వలన సహదేవునికి భవిష్యత్తులో ఏమి జరుగబోతోంది అన్నవి ముందుగానే తెలుస్తాయిట, ఇంకా చినుకుకీ చినుకుకీ మధ్య నుండీ తడవకుండా వెళ్ళగల శక్తి కూడా వచ్చిందిట. కానీ ఆ శక్తులేమీ ప్రదర్శించనని కృష్ణుడికి మాటిస్తాడు. ఈ కథ జరిగినప్పటినుండీ ఆ చిటికిన వేలుని సహదేవుడు అనీ, అనామికని నకులుడనీ, మధ్య వేలుని అర్జునుడనీ, చూపుడు వేలిని భీముడనీ, బొటన వేలిని ధర్మరాజనీ చెప్తూ ఉంటారు. 


మీకో బుల్లి కథ తెలుసా? ఒకసారి మన చేతి అయిదు వేళ్లకీ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన వచ్చిందిట. బొటన వేలు నేను లేకుండా మిగిలిన నాలుగు వేళ్ళూ పని చేయలేవు కనుక నేనే గొప్ప అందిట. చూపుడు వేలు కాదు కాదు మంచీ, చెడులని సూచించేది నేను కనుక నేనే గొప్ప అందిట. అన్నిటికన్నా నేనే ఎత్తుగా ఉంటాను కనుక నేనే గొప్ప అందిట మధ్య వేలు. మీరంతా ఉన్నా ఖరీదయిన ఉంగరాలని నాకే తొడుగుతారు కనుక నేనే గొప్ప అందిట అనామిక. తన గొప్ప చెప్పుకోవడానికి ఏమీ లేక, చిటికిన వేలు దేవుడి దగ్గరకెళ్ళి తన బాధను చెప్పిందిట. అప్పుడు దేవుడు పొట్టిగా ఉన్నందుకు బాధపడకు, నన్ను ప్రార్ధించే సమయములో చేతి వేళ్ళ వరుసలో ముందు నువ్వే ఉంటావు కనుక, నాకు వారందరికన్నా నువ్వే దగ్గరగా ఉంటావు కనుక నువ్వే గొప్ప అన్నాడుట. చూశారా చిటికిన వేలు ఎంత గొప్పదో!! 

చిటికిన వేలు ప్రాముఖ్యత సంగీత కారులకి బాగా తెలుస్తుంది. సంగీత వాయిజ్యాలను బాగా మీటాలంటే చిటికిన వేలు బాగా పని చెయ్యాల్సిందే! వీణకు చిటికిన వేలితోనే తాళం వేస్తారు. అలానే గిటారు వాయించాలన్నా చిటికిన వేలే కావాలి.

ఇవే కాక క్లాసులోంచి తుర్రుమనాలంటే చిటికిన వేలే ఆయుధం. చిన్న చిన్న సందుల్లో (చెవిలో, తూముల్లో, సీసా మూతల్లో) దూరాలన్నా చిటికిన వేలే ముందు ఉంటుంది. చూశారా ఎన్ని ప్రయిజనాలున్నాయో ! ఇన్ని ఉన్నా చిటికిన వేలికి మాత్రం చిన్న చూపే మిగిలింది.