Sunday, July 31, 2011

మనసంటే?????



ఈ చిత్రంలో లాగానే మన మనసు కూడా కొన్ని వేల జ్ఞాపకాలకి, అనుభూతులకి, ఊహలకి, ఆలోచనలకి నిధి. బాధకి, నిరాశకి, నిస్పృహకి ఊబి. కొన్ని యోజనాల అంతర్మధనాలకి నిలయం.

ప్రతీ మనిషీ తన జీవితాకాలంలో తరచూ ఉపయోగించకుండా ఉండలేని పదం మనసు. మనసు లేదా మది అనేది ఒక అద్భుతమయిన పదం. అందువలనేనేమో ఈ పదం మీద కొన్ని వేల పాటలు రాసిన ఆత్రేయ గారు మనసు కవయ్యారు. విప్లవ కవిగా పేరుపొందిన శ్రీ శ్రీ గారితో కూడా మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో! అంటూ అద్భుతమయిన సాహిత్యాన్ని పండించగల పదం మనసు. ఎందుకో నాకు ఈ పదం వినగానే గుప్పెడు మనసు అని బాలచందర్ గారి చిత్రం గుర్తుకొస్తుంది. వెంటనే ఒక సందేహం కూడా తరుముతుంది నన్ను. ఇక్కడ గుప్పెడు మనసు అన్నారు కదా? అంటే మన మనసు గుప్పెడే ఉంటుందా (మన గుండె గుప్పెడంత అని నాకు తెలుసు) అని. అలానే కొంతమంది కవులు విశాలమయిన మనసు అన్నారు. ఈ రెంటినీ పోల్చి చూస్తే ఒకదానికి మరోదానితో పొంతన లేదు. అప్పుడు బాగా లోతుగా పరికించి చూస్తే గుప్పెడు మనసు అంటే narrow mind అని విశాలమయిన మనసు అంటే broad mind అని అనుకోవాలేమో అనిపించించింది నాకు. మనసు అంటే మన గుండె అనే భావన కొంతమందికి ఉంటే మన మెదడు అని మరి కొంతమందికి ఉంది. గుండె అనేది మనని శారీరకంగా బ్రతికించే యంత్రమయితే మెదడు అనేది విశ్లేషించే, విమర్శించే యంత్రము.

ఇంతకీ మనసు అంటే ఏమిటి? అదెలా ఉంటుంది? ఎవరయినా ఎప్పుడయినా చూసారా? అర్ధం చేసుకోవచ్చేమో కానీ చూడలేనిది మనసు. నా ఉద్దేశ్యం ప్రకారం మనసు అనే దానికి ఒక రూపం లేదు. ఎన్ని జీవాలని కోసినా బాహ్యంగా కనిపించనిది మనసు. కేవలం అదొకటి ఉంది అన్న అనుభూతి మాత్రమే ఉంది. మనలో భావోద్వేగాలను, అనుభూతులను, కోరికలను కలిగించేది మనసు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం. నిజమయిన మనసుని ఎవరు చూసారు? చుసినా ఎలా కనిపించింది? ఎక్కడ కనిపించింది? అంటే కేవలం మన చేతలలో మాత్రమే కనిపిస్తుంది. అంటే మన భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు, విచక్షణ మరియు ఆలోచనల సమ్మేళనమే మన మనసు. వీటిని మార్చుకుంటే మన మనసు కూడా మారుతుంది. మనిషి ప్రవర్తన, నడవడిక వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది. గుండెకి మెదడుకి మధ్యన ఎక్కడో సూక్ష్మంగా ఉండి మనం లేదా నేను అనే పదానికి తార్కాణమే మనసు. మనసుకి తెలిసినదే కంటికి కనిపిస్తుంది, చేయి చిత్రిస్తుంది, కలం రచిస్తుంది, కంఠం పాడుతుంది, మువ్వ ఆడుతుంది. యథో మనః తథో దృష్టిహి అన్నారు కదా!!!

ఈ మనసు అనేదానిని చాలా వాటిలితో పోల్చవచ్చనిపిస్తోంది. ఈ మనసుని దేవునితో పోల్చవచ్చు ఎందుకంటే ఎవరికీ కనిపించని, రూపం లేని ఆయన ఈ జగత్తునంతా సక్రమమయిన మార్గంలో నడిపించే అద్భుత శక్తి. అలానే అసలు రూపం లేని మనసు కూడా మనుషుల మీద తీవ్రమయిన ప్రభావాన్ని చూపిస్తుంది. నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై అని ఒక పాటలో కూడా రాసారు కదా!!

నాకెందుకో మన మనసుకి, మేఘాలకి దగ్గర పోలిక ఉందనిపిస్తుంది. మేఘాలు అందరాని దూరంలో ఉన్నట్టే మనసు కూడా మన ఆలోచనలకు అందని దూరంలో అర్ధం కాని వైనంతో నిండి ఉంటుంది. మేఘాలు గాలులు వీచిన వైపు పరుగులు తీసినట్టే మనసు కూడా ఊహలు లాగిన వైపు ఊగిసలాడుతుంది. మేఘం నింగిలోని నీటి బిందువులని సేకరించి వాటి భారం మోయలేనప్పుడు వర్షిస్తుంది. అలానే మన మనసు కూడా జీవితంలోని మమతానురాగాలని, సుఖ దుఖాలని నింపుకుని బాధని తాళ లేనప్పుడు విలపిస్తుంది.

మన మనస్సుని ఎడారిలోని ఎండమావులతో  కూడా పోల్చవచ్చు. దూరంగా నీళ్లు కనబడతాయి. కాని అవి నీళ్లు కావు, దాహం తీర్చలేవు.  నీళ్లు లేని చోట నీళ్లకోసం ఆరాటపడితే మనం నిరాశపాలవుతాం. అదే విధముగా ప్రతీ మనిషిలోను మనసు ఉన్నట్టే అనిపిస్తుంది కానీ అది నిజమయిన మనసు కాదు, దానికి స్పందన ఉండదు. అటువంటి వాళ్ళ మీద మనసు పడితే మనం కూడా అదే నిరాశకు లోనవుతాము.  

మన మనసుని సముద్రముతో పోల్చవచ్చు. సముద్రము లాగానే మన మనసు కూడా గంభీరముగా కనిపిస్తుంది. మన భావాలు కెరటాల్లగా ఎగసిపడుతూ ఉంటాయి. చిన్న తేడా లేదా పొరపాటు జరిగితే అల్లకల్లోలమయ్యి సునామీ లాగా మనని నిట్టనిలువునా ముంచేస్తుంది. మిగిలేది మనో ప్రళయం. ఆ దెబ్బకి నష్టపోయేది మన జీవితమే కాదు మన కుటుంబంలో కూడా ఆనందం దూరమవుతుంది. వరద బాధితులలాగా మిగలవలసినదే.

నా మనసు ముక్కలయింది అనడం మనం వింటాం కదా! అంటే మనసు గాజుబొమ్మేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఉన్నన్నాళ్ళూ దానిని ఎంత అపురూపంగా, చాలా జాగ్రత్తగా చూసుకుంటామో అదే విధముగా ఒక సారి ముక్కలయితే తిరిగి అతకలేము. నా మనసులోతుల్లో దాగున్నావ్ అంటాం కదా! అంటే ఇక్కడ మనసు లోయలంత లోతయినదనమాట. పూర్తిగా మనసు ఇస్తే మిగిలేది అగాధమే కూరుకుపోవడం తప్ప బయటకి సులభంగా రాలేము. మనసు విరిసింది అంటాం కదా! అంటే మనసు పూవులంత సున్నితమయినదని అర్ధం. విచ్చుకుని ఉన్నంత సేపూ ఎంత ఆస్వాదిస్తామో వాడిపోతే వాటికి విలువ లేదు. తేనె మనసు అనే పద ప్రయోగం వినే ఉంటాం కదా! అంటే ఇక్కడ మనసు తేనె లాగా తియ్యగా ఉంటుంది అని కాదు. ఏ విధముగా అయితే తేనె చాలాకాలం వరకు పాడవకుండా ఉంటుందో అదే విధంగా మనసు కూడా పాడవకుండా నిష్కల్మషంగా ఉంది అని చెప్పే ప్రయత్నంలో ఇలా వర్ణిస్తారు.  ఇహ మనోవేగం అంటారు ఇక్కడ మనసుకి ఉన్న వేగానికి కొలమానికలు లేవు. ఒక త్రెస రేణువు (సూర్య  కిరణాలు  ప్రసరించేటప్పుడు  కంటికి  కనిపించేవి) కన్నా తక్కువ కాలంలో తలచుకున్న చోట ఉండగలదు. మనోఫలకం అంటారు అంటే మనసు మీద దేన్నయినా చిత్రించచ్చు కాని ఒకసారి చిత్రించిన దానిని చెరపలేము, సరిదిద్దలేము. మనోరధం అంటారు అంటే మన మనస్సు రధం లాగా ప్రయాణిస్తుంది. ఊహలు అనే రెక్కల గుఱ్ఱాల చేత నిరంతరం లాగబడుతుంది. మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోహ్ అన్నారు అంటే మనకి బంధాలను కలిగించినా బంధ విముక్తుల్ని చేసి మోక్షాన్ని ప్రసాదించినా అది కేవలం మనసు మాత్రమే చేయగలదు.

మనసు గురించి ఆత్రేయ గారు రాసిన ఈ కవితలో చదవండి.

ఒక రాత్రంతా నిద్రను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి కనురెప్పలన్నీ
ఆ రాత్రి ఎక్కడ తల దాచుకోవడమని గిలగిలలాడింది నిద్ర
విచ్చుకుంటున్న ఒక పువ్వును వేడుకుంది  తనకు ఆశ్రయము ఇవ్వవలసిందిగా
"ఇప్పుడే నీకు ఆశ్రయము ఇస్తే నా రేకులన్నీ ముడుచుకుపోయి తెల్లవారేలోగానే నేను నేలమీద రాలిపడి నా ఉనికినే కోల్పోతాను వీల్లేదు పో"
అని తిప్పి కొట్టింది ఆ పువ్వు.

దిక్కుతోచని నిద్ర తన వేదనను గాలికి నివేదించుకుంది.
"చలనం నా జీవం. నిన్ను చేరదీస్తే ఇంకేముంది ఉన్నచోటనే నిలువునా స్తంభించిపోతాను. మనిద్దరికీ కుదరదు పో"
అంటూ దులిపేసుకుంది గాలి.

మంచుగడ్డను వేడుకుంది నిద్ర ఆ ఒక్కరాత్రి తనను ఒళ్లోకి తీసుకొమ్మని
ఉలిక్కిపడి  మంచుగడ్డ అంది: "నిన్ను నాలోన చేర్చుకుంటే ఇంకేమైనా ఉందా మిగిలేది స్తబ్ధతే.ఆ గుణమే నా ఒంటబడితే
ఉదయకిరణాల నులువెచ్చని కౌగిలింతలో కరిగిపోయే యోగం నాకు ఉండదు.వెంటనే వెళ్ళిపో" అని.

ఏ గత్యంతరం లేక చేతులెత్తి మనసుతో మొరపెట్టుకుంది నిద్ర
తనకు ఆ పూట విడిది  కల్పించవలసిందిగా
చిటికెలో సమస్త జీవరాసులను ఆక్రమించే అదృశ్య శక్తిగా ఉన్న నిద్రపైన జాలి కలిగింది మనసుకు.
అయ్యో పాపమనుకుంది.
పంచేంద్రియ సంచార క్రియలను ఆపేసింది.
నిర్వికార స్థితిని తనలో ఆవహింపచేసుకుంది.
అంతే మరి,
మసక కమ్మింది మగత పెరిగింది
అది గమనించిన నిద్ర కళ్ళలోకి నెమ్మదిగా చొరబడి విప్పారిన కనురెప్పలను కప్పుకుని  సుఖంగా ఒదిగి పడుకుంది
జాలి మనసుకు కృతజ్ఞతలు అర్పించుకుంటూ ..........

మనసు గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం అనేది నా దృష్టిలో మాత్రం భూమి, ఆకాశం కలయికలా కల్లే. నా అభిప్ర్రాయం ప్రకారం, మనసు ఒక వైద్యుడిలా బాధని అర్ధం చేసుకుంటుంది, సైనికుడిలా పోరాడుతుంది, గురువులా బోధిస్తుంది, వకీలు లాగా వాదిస్తుంది, చిత్రకారుడిలాగా ఎన్నో ఊహాచిత్రాలను గీస్తుంది, నిపుణులలాగా హెచ్చరిస్తుంది, మిత్రుడిలా ఓదారుస్తుంది. అలానే తల్లిలా తల్లడిల్లుతుంది, తండ్రిలా మందలిస్తుంది, అమ్మమ్మలా అనుభవాన్ని పెంచుతుంది, తాతయ్యలా తపిస్తుంది, అక్కలా అక్కున చేర్చుకుంటుంది, అన్నలా అనుభూతులని పంచుతుంది, అత్తలా ఆదరిస్తుంది, మామలా మమతని పంచుతుంది, మరదలిలా కవ్విస్తుంది, బావలా బాధించి (తీపి బాధ) బుజ్జగిస్తుంది, చెల్లిలా చిలిపిగా, తమ్ముడిలా తుంటరిగా, ప్రియుడిలా ప్రేమగా ఉండి భర్తలా లేదా భార్యలా మనలో అర్ధభాగమై ఆప్యాయతని అందిస్తూ ఎన్నటికీ నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది.



Sunday, July 24, 2011

భావావేశ గుఱ్ఱం


సాలీడులోని అపూర్వమయిన సౌందర్యానికి చంద్రమండలంలోని అవ్వ వడికిన వెన్నెల చీరను చుట్టి, వాలుజడలో గడ్డి పూలను తురిమి, గిజిగాడితో గిలిగింతలు పెట్టించగలిగే భావ కవి గుఱ్ఱం జాషువా. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భముగా ఆయనని ఒక్కసారి స్మరించుకుందాం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు అనడానికి నిలువెత్తు నిదర్శనం గుఱ్ఱం జాషువా. ఈయన 1895 సెప్టెంబర్ 28 వీరయ్య, లింగమాంబ దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. అస్పృశ్యత, దారిద్ర్యం వెంట తరుముతున్నా, కులం పేరుతో జనాలు మాటలతో కుళ్ళపొడుస్తున్నా లెక్కచేయక సాహితీ క్షేత్రంలో ఒక తారగా ఎదగాలన్న పట్టుదలని విస్మరించక కృషితో, పట్టుదలతో ముందుకి సాగి ఆధునిక తెలుగు కవులలో ప్రముఖ స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. నాకు గురువులు ఇద్దరు - పేదరికం, కుల మత భేదం. ఒకటి సహనాన్ని నేర్పితే రెండవది నాలో ఎదిరించే శక్తిని ఇచ్చింది అని ఆయన చెప్పారు.

1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాక, మిషనరీ పాఠశాలలో ప్రాధమికోపాధ్యాయునిగా నెలకు మూడు రూపాయల జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసారు. టాకీ సినిమాలు లేని రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈయన పని. విధముగా మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా ఊరూరా తిరిగే సమయములో  వీరేశలింగం, చిలకమర్తుల ఆశీర్వాదములతో కావ్య జగత్తులో స్థిరపడ్డారు. తిరుపతి వేంకట కవుల ప్రోత్సాహం కూడా తోడయి ఆయనను ముందుకు నడిపింది. తరువాత గుంటూరులోని లూథరన్చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పని చేసారు. అటు పిమ్మట 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసారు. 1946-60 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసారు.జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి లో సభ్యత్వం లభించింది.

చిన్నతనం నుండీ జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవారు. బాల్య స్నేహితుడూ, తరువాతి కాలంలో రచయితా అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నారు. తెలుగులోనూ, సంస్కృతంలోనూ ఉభయ భాషా ప్రవీణ చేశారు. ఈయన 36 గ్రంధాలు, లెక్క లేనన్ని కవితా ఖండికలు రచించారు. గబ్బిలం, బాపూజీ, గిజిగాడు, క్రొత్త లోకం, ఫిరదౌసి, ఆంధ్ర మాత, నేతాజీ, ముంతాజు మహలు, క్రీస్తు చరిత్ర, సాలీడు, చంద్రోదయం, శిశువు, కాందిశీకుడు ముఖ్యమయినవి.

గబ్బిలం (1941): 1939లో విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన వేయిపడగలుకి ప్రతిక్రియగా జాషువా గారు వర్ణ ధర్మాన్ని నిరసిస్తూ 1941లో గబ్బిలం అనే ఖండ కావ్యాన్ని వ్రాసారు. ఇది సంస్కృతంలో కాళిదాసు రచించిన మేఘ సందేశానికి దగ్గరగా ఉంటుంది కానీ ఇందులో ఒక నిరుపేద ఇంటిలో దీపమును ఆర్పటానికి వచ్చిన ఒక గబ్బిలంతో తన కన్నీటి కథని ఈశ్వరునితో (కాశీ విశ్వనాధునితో)  చెప్పమని పంపే అశ్రు సందేశమే గబ్బిలం. ఈ కావ్యం ద్వారా ఖండ కావ్య ప్రక్రియకు జీవం పోసి, ఆంధ్ర సాహిత్యంలో దానికొక విశిష్టతను చేకూర్చారు.
ఫిరదౌసి (1932): పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించారు.

జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నారు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించారు. కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, మధుర శ్రీనాధ, నవయుగ కవి చక్రవర్తి, విశ్వ కవి సామ్రాట్ అనే బిరుదులను పొందారు. పద్మభూషణ, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (క్రీస్తు చరిత్ర కి), కళా ప్రపూర్ణ (ఆంధ్ర విశ్వ విద్యాలయం), మొదలయిన పురస్కారాలనెన్నో అందుకున్నారు. గుంటూరు పట్టణం స్వేచ్ఛా పౌరసత్వాన్నిచ్చి గౌరవించింది. 

భావ కవిత్వానికి ప్రాణమయిన ఆత్మాశ్రయ లక్షణమూ, సౌందర్యారాధనమూ, సంస్కరణాభిమానమూ, ప్రణయ తత్వ విలాసమూ, మానవ మహిమాభివర్ణనమూ, స్పష్టత ఆయన రచనలలో ఉట్టిపడే లక్షణాలు. రసైక దృష్టి ఉంటే ప్రతీ అణువులో కవిత్వం సాక్షాత్కరిస్తుందని నిరూపించిన ఆయన మన గుండెలలో చెరిగిపోని ముద్రని వేసి 1971 జూలై 24 గుంటూరులో అమరుడయ్యారు. ఈయన  వ్రాసిన వాటిలో నేను సేకరించిన కొన్ని రచనలు ఇక్కడ చూడచ్చు.

గబ్బిలం 
పిరదౌసి 
ఆంధ్రమాత 
పాపాయి పద్యములు



Wednesday, July 20, 2011

నా పేరు ..........


రసజ్ఞులయిన పాఠకులకి నమస్కారం. ప్రతీ మనిషికి తన పేరంటే ఇష్టం (ఇష్టం లేకపోయినా ఇష్టపడక తప్పదు).
అలానే నాకు కూడా నా పేరంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు నా పేరుని ఎవరూ సరిగ్గా పలకడం లేదు, నోరు తిరగని పేరుని ఎందుకని పెట్టావని అమ్మతో పోట్లాడేదానిని అటువంటిది తరువాత నా పేరుకి ఉన్న అర్ధాన్ని అర్ధం చేసుకున్నాక ఇంత మంచి పేరు పెట్టినందుకు మా అమ్మకి నా మనసులోనే కృతజ్ఞతలను తెలియచేసుకున్నాను. పేరు నా మనసులో ఒక విశిష్టమయిన స్థానాన్ని పొందింది. ఎంతమందిలో ఉన్నా మన పేరు వినిపించేసరికి మన అనుమతి లేకుండానే మన తల గిర్రున తిరుగుతుంది. నాకు ఎందుకనో నా పేరుకి సంబంధించిన కొన్ని విషయాలతో కూడిన పద్యాలని  ఇక్కడ టపా ద్వారా అందరితో పంచుకోవాలనిపించింది

రసం జ్ఞానాతీతి రసజ్ఞ అన్నారు. రసం అంటే సారభూతమయినది , నవరసాలు, కళలు అని కూడా అనుకోవచ్చును. జ్ఞానాతీతి అంటే తెలిసినది అని అర్ధం. ఇక పదానికి అర్ధాన్ని వాడుక భాషలో తీసుకుంటే, మనకి రసాన్ని తెలియచేసేది ఏమిటి? మనం తినే దాని రసం వలెనే మనకి రుచి తెలుస్తుందిట. అలా తీసుకుంటే మనకి రుచిని తెలియచేసేది ఏమిటి? నాలుక కనుక మామూలు పరిభాషలో నాలుక అనే అర్ధాన్ని ప్రతిబింబిస్తున్నా ఒక రసాన్ని లేదా కళలని ఆస్వాదించేది, అనుభూతిని మనకి ఇచ్చేది అని రసజ్ఞ అనే పేరు తెలియచేస్తోంది.

తెలుగు వ్యాకరణ పరముగా చూస్తే, రసజ్ఞ (l U l) అనే పదం గణాన్ని సూచిస్తుంది. కావున దీనిని చంపకమాల ( ), శార్దూలము ( ), మత్తకోకిల ( ), తరలము ( ), పంచ చామరము ( ), వసంత తిలకము ( ), లయగ్రాహి ( ), కవిరాజ విరాజితము ( ), సుగంధి ( ), వనమయూరము ( ), ఇంద్రవంశము ( ), వనమంజరి ( ), మంజుభాషిణి ( ), మొదలయిన పద్య పాదములలో ఉపయోగించవచ్చును.


కళానిధిః కావ్యకళా రసజ్ఞా రససేవధిః 
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా

అసలు పేరు ముఖ్యంగా లలితా సహస్ర నామ స్తోత్రం నించి వచ్చినది. అమ్మవారి గొప్పతనాన్ని స్తుతిస్తూ చెప్పిన పద్యంలో అర్ధాల్ని గమనిస్తే కళలకి నిధివయినటువంటి నీవు కావ్యమును రచించే కళలోరసములని సేవించుటలో రసజ్ఞురాలివి అని చెప్పబడింది

. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక  చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరుమెచ్చ రెచ్చటం
బదునుగ మంచికూర నలపాకము చేసినదైన నందు నిం
పొడవెడు నుప్పులేక రుచి పుట్ట( నేర్చునటయ్య భాస్కరా!
పద్యం మారన వెంకన్న గారు పదిహేడవ శతాబ్దంలో రచించిన భాస్కర శతకంలోనిది. విధముగానయితే నలభీములే వంట చేసినా ఉప్పు లేకపోతే రుచి రాదో అదే విధముగా ఎంతటి విద్యావంతుడయినా తను నేర్చుకున్న విద్యలోని సారం (రసజ్ఞ) లేకపోతే గుణవంతులెవ్వరూ మెచ్చుకోరు అని దీని భావం

సీ. జయ దురుత్తరణ సంసరణాబ్జదళ నీర,
             జయ జయ గాయక సార్వభౌమ,
    జయ శౌరె గాథా రసజ్ఞ పుణ్య రసజ్ఞ,
             జయ జయ తత్త్వసంచయ పవిత్ర,
    జయ జనార్వాచీన జని సంగ వంచక,
              జయ జయ దేశిక చరణ శరణ,
    జయ యుక్తవాక్ప్రతిష్టా తృణీకృతదేహ,
              జయ జయ భగవదాజ్ఞాకృతిస్థ  
తే. జయ సకలజంతు సమచిత్త జయ దయార్ద్ర,
                 
జయ ముకుందాన్య దేవతా శాస్త్ర బధిర,
       
జయ చతుర్ద్వయ భక్తి లక్షణ చితాంగ,
                 
జయ మురారి ప్రపన్నాంఘ్రి జల జమ ద్రుప.
ఇది శ్రీ కృష్ణదేవరాయులు గారు రచించిన పంచమహాకావ్యాలలో ఒకటయిన ఆముక్త మాల్యద లోని సప్తమాశ్వాసము లోనిది. శ్రీ కృష్ణుని వర్ణిస్తూ ఆయన  సూరత్వములో, పరాక్రమములో, యుద్ధ పటిమలలో, పుణ్యములలో, మోక్షం పొందుటలో అన్నీ తెలిసినవాడు, ఆస్వాదించేవాడు అని చెప్పడం జరిగింది.


తజ్ఞ! జితప్రతిజ్ఞ! యుచిత ప్రమధానుగతజ్ఞ! నమ్రదై
వజ్ఞ! కళా విధిజ్ఞ! బలవచ్చివభక్తి మనోజ్ఞ! ధూతశా
స్త్రజ్ఞ! సువాద పూరిత రసజ్ఞ! తృణీకృత పంచయజ్ఞ!
ర్వజ్ఞ! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా  
పద్యం పాల్కురికి సోమన గారు రచించిన వృషాధిప శతకం లోనిది.
 
నిరుపహతి స్థలంబు రమణీప్రి ధూతిక తెచ్చి యిచ్చు
ప్పురవిడె మాత్మ కింపయిన భోజన మాయల మంచ మెప్పు
తప్పరయు రసజ్ఞ లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికిన గాక యూరక గృతుల్ రచియింపుమటన్న శక్యమే!’’
ఇది పెద్దనార్యుల పద్యం.  

స్థైర్యము లేని చిత్తమవధానమెరుంగని సత్కవిత్వ మౌ
దార్యము లేని హస్తము యదార్థతలేని రసజ్ఞ మంచి మా
ధుర్యము లేని గానము మృదుత్వము లేని వచః ప్రసంగ మై
శ్వర్యము లేని భోగము నసారములియ్యివి దంతిభూవరా!
ఇది తిరుపతి వేంకట కవుల పద్యం.

ఆలాపించిన సత్కవీశ్వరుల దివ్యాశీర్వచశ్శక్తిచే
నాలాభించిరి భారతీయులు స్వరాజ్య స్వర్ణ దండంబులే
డాలాలంబు కవి ప్రపంచమున కమ్మా వాజ్ఞ్మయోద్యానమున్
బాలింపగల  దాతలం గని రసజ్ఞత్వంబు చాటింపుమీ
ఇది గుఱ్ఱం జాషువా గారి ఆంధ్ర మాత లోనిది.

వెలవాక్రుచ్చగారాని భావముల నన్వేషించుచున్ సత్కవీం
ద్రులయూహల్ విహగంబులై తిరుగుచుండెన్  బ్రోన్నతాకాశమం
డలమస్తంబున  నాకళించితె  ప్రయాణ శ్రాంతి నమ్మంచుకొం
డలకున్ డిగ్గెడి నీ విశేషము రసజ్ఞజ్ఞేయ మూహింపగన్         
ఇది గుఱ్ఱం జాషువా గారి గబ్బిలం లోనిది.  

గాత్రము లెండు  టాయె ,మరి గానగ రాదొక నీటి చుక్కయున్,
నేత్రము మండుటాయె మరి , నేరుగ జూడగ ఎండలాయె, వై
చిత్రమదేమిటో, వరుస చిత్రము లన్నియు తేలిపోయె ,నీ
చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్!!!
ఇది మంద పీతాంబర్ గారి కలము నుండి  జాలువారిన పద్యము.

."ప్రజ్ఞునకు వచ్చును, రసజ్ఞమగు పద్యమది - ఆజ్ఞ పలుకంగనె! మఱజ్ఞునకు రాదే 
యజ్ఞములచే"ననుట, అజ్ఞతగుఁ! బ్రహ్మభవ - రాజ్ఞియగు భారతికి విజ్ఞపము చేయన్ 
ప్రజ్ఞుడవు నీవయి, మనోజ్ఞమగు పద్యమన-నుజ్ఞముగ వచ్చును! కృతజ్ఞతతొ విద్యా 
రాజ్ఞికి సుపద్యఁపు ప్రతిజ్ఞఁగొని సాధనను యజ్ఞమును బూని కవితజ్ఞుడవు గావోయ్ 
ఇది లయగ్రాహి అనే పద్య లక్షణములో శ్రీ రాకేశ్వరరావు గారు రచించిన పద్యం. 

లోక రసజ్ఞ శేఖరుల లోచన యుగ్మము పాలి విందుగా 
శ్రీ కవితా సుధా రస విశేషము లెన్నియొ చిల్కుచుండెనో - 
శ్రీకరుడాసి.నా.రె.’కు నశీతి సుజన్మదినాభినందనల్ ! 
జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్  డా. సి. నారాయణ రెడ్డి గారి అశీతి జన్మదినోత్సవ సందర్భముగా శుభాకాంక్షలతో డా. ఆచార్య ఫణీంద్ర గారు రచించిన పద్యం.

భావావేశము పొంగిపొర్లి నదియై పారంగ, పద్యంబులే
వేవేలై ఎగసెన్ మదీయ హృది నువ్వెత్తున్ తరంగాలుగాన్ -
నా వాక్కందున తోయమయ్యె రుచిగా నానా రసాల్ పంచగాన్ -
రావే ఆంధ్ర రసజ్ఞ! తేల, రస ధారా స్నాన పానంబులన్!
డా. ఆచార్య ఫణీంద్ర గారి మరొక పద్యం.

తపవ్రత తీరథ నీరస లాగే ఏనీ ఆగళ సాచే,
యజ్ఞయాగ స్వాధ్యాయ నియమమాం రసజ్ఞ కోణ రాచే ?
ఆసన ప్రాణాయామ ధారణా గౌణ బనీ సౌ జాయే.
జే సుఖ థాయ మాతృగుణ గాయే.
శ్రీ యోగేశ్వరజీ రచించిన మహాకావ్య 'గాంధీగౌరవ' సుఖలోని పద్యము.

గూట గల రామ చిల్కొక కోటి తడవ
పేరు బిలిచె గోవింద హరీ రసజ్ఞ
మీటగను హృద్విపంచిని మూట ముదము
లీయ మధుర మోహానన రా యజింతు

ఆశిష్ కుమార్ గారు కర్ణాటక సంగీతంలోని కొన్ని మేళకర్త రాగాల మీద రాసిన చిన్న కవిత
జ్వలించే మనో ధారాలో జనించె కవన జలఝారి
తపించే కనుల లోయలో సుమించే రసజ్ఞ మాధురి
ధ్వనించే యుద్ధభేరిలో
స్వరించే కదనకుతూహలం
బ్రహ్మించే ఇంద్రియాలలో
స్ఫురించే భావనప్రియం
జ్వలించే మనో ధారాలో జనించె కవన జలఝారి
తపించే కనుల లోయలో సుమించే రసజ్ఞ మాధురి
గ్రీష్మించే సూర్య జ్వాలలో
చిందించే జలర్నవమ్
హిమించే కైలశాగిరులలో
నర్తించే నాటభైరవి
జ్వలించే మనో ధారాలో జనించె కవన జలఝారి
తపించే కనుల లోయలో సుమించే రసజ్ఞ మాధురి
పఠించే వేదాంగాలలో
కనిపించు సారమే పావని
వినిపించే వీణ మీటలో
జనించు నాదమే కీరవాణి
జ్వలించే మనో ధారాలో జనించె కవన జలఝారి
తపించే కనుల లోయలో సుమించే రసజ్ఞ మాధురి

అందరికీ కన్నులొకటే.. వాటిలో ప్రతిఫలించే భావాలు మాత్రం అనేకం. కన్నుల భాష ని పింగళి శశిధర్ గారు రాసిన వచన కవితలో చదవండి.
కన్నులు వుండు
నందరకు
కాని -
కమనీయ మనోజ్ఞ మాలికల్
కలువలు పూయు
కన్ను లవి యెన్ని ?
ఎన్నిటి నందు - సు
స్నేహ రసార్ద్రతలున్నవి ?
వెన్నెల లెన్ని కాయు ?
వలపు విచిత్ర
భాషణ లెన్ని యెఱుంగు ?
ఇన్నిట నొక్కటైన - నెఱి
నేర్వని కన్నులు
కన్నులౌనె ?
రమ్య రసజ్ఞ గుణ
శేఖరు లార
నిక్కము మీరె తెల్పరే!  

Esthetics అనే అతి అందమైన రసజ్ఞాన శాస్త్రానికి  Latin origin "తను'' అని తన ప్రేయసిని వర్ణిస్తూ ఆధునికతకి తగ్గట్టు వాడుకున్న  మహేశ్వర రెడ్డి గారి కవితా మలయాలలో నా పేరుని చూసి ఆనందంతో నాకు బహు ముచ్చటేసింది. ఆ కాలం నించి ఈ కాలం దాకా ఎప్పటికీ ever green అయిన పేరు, కవుల పద్యాలలో, వచన కవితలలో, సభా కార్యక్రమాలలో మారు మ్రోగే ఈ పేరు నిజముగా ఒక రసజ్ఞానుభూతే.