Sunday, July 31, 2011

మనసంటే?????ఈ చిత్రంలో లాగానే మన మనసు కూడా కొన్ని వేల జ్ఞాపకాలకి, అనుభూతులకి, ఊహలకి, ఆలోచనలకి నిధి. బాధకి, నిరాశకి, నిస్పృహకి ఊబి. కొన్ని యోజనాల అంతర్మధనాలకి నిలయం.

ప్రతీ మనిషీ తన జీవితాకాలంలో తరచూ ఉపయోగించకుండా ఉండలేని పదం మనసు. మనసు లేదా మది అనేది ఒక అద్భుతమయిన పదం. అందువలనేనేమో ఈ పదం మీద కొన్ని వేల పాటలు రాసిన ఆత్రేయ గారు మనసు కవయ్యారు. విప్లవ కవిగా పేరుపొందిన శ్రీ శ్రీ గారితో కూడా మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో! అంటూ అద్భుతమయిన సాహిత్యాన్ని పండించగల పదం మనసు. ఎందుకో నాకు ఈ పదం వినగానే గుప్పెడు మనసు అని బాలచందర్ గారి చిత్రం గుర్తుకొస్తుంది. వెంటనే ఒక సందేహం కూడా తరుముతుంది నన్ను. ఇక్కడ గుప్పెడు మనసు అన్నారు కదా? అంటే మన మనసు గుప్పెడే ఉంటుందా (మన గుండె గుప్పెడంత అని నాకు తెలుసు) అని. అలానే కొంతమంది కవులు విశాలమయిన మనసు అన్నారు. ఈ రెంటినీ పోల్చి చూస్తే ఒకదానికి మరోదానితో పొంతన లేదు. అప్పుడు బాగా లోతుగా పరికించి చూస్తే గుప్పెడు మనసు అంటే narrow mind అని విశాలమయిన మనసు అంటే broad mind అని అనుకోవాలేమో అనిపించించింది నాకు. మనసు అంటే మన గుండె అనే భావన కొంతమందికి ఉంటే మన మెదడు అని మరి కొంతమందికి ఉంది. గుండె అనేది మనని శారీరకంగా బ్రతికించే యంత్రమయితే మెదడు అనేది విశ్లేషించే, విమర్శించే యంత్రము.

ఇంతకీ మనసు అంటే ఏమిటి? అదెలా ఉంటుంది? ఎవరయినా ఎప్పుడయినా చూసారా? అర్ధం చేసుకోవచ్చేమో కానీ చూడలేనిది మనసు. నా ఉద్దేశ్యం ప్రకారం మనసు అనే దానికి ఒక రూపం లేదు. ఎన్ని జీవాలని కోసినా బాహ్యంగా కనిపించనిది మనసు. కేవలం అదొకటి ఉంది అన్న అనుభూతి మాత్రమే ఉంది. మనలో భావోద్వేగాలను, అనుభూతులను, కోరికలను కలిగించేది మనసు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం. నిజమయిన మనసుని ఎవరు చూసారు? చుసినా ఎలా కనిపించింది? ఎక్కడ కనిపించింది? అంటే కేవలం మన చేతలలో మాత్రమే కనిపిస్తుంది. అంటే మన భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు, విచక్షణ మరియు ఆలోచనల సమ్మేళనమే మన మనసు. వీటిని మార్చుకుంటే మన మనసు కూడా మారుతుంది. మనిషి ప్రవర్తన, నడవడిక వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది. గుండెకి మెదడుకి మధ్యన ఎక్కడో సూక్ష్మంగా ఉండి మనం లేదా నేను అనే పదానికి తార్కాణమే మనసు. మనసుకి తెలిసినదే కంటికి కనిపిస్తుంది, చేయి చిత్రిస్తుంది, కలం రచిస్తుంది, కంఠం పాడుతుంది, మువ్వ ఆడుతుంది. యథో మనః తథో దృష్టిహి అన్నారు కదా!!!

ఈ మనసు అనేదానిని చాలా వాటిలితో పోల్చవచ్చనిపిస్తోంది. ఈ మనసుని దేవునితో పోల్చవచ్చు ఎందుకంటే ఎవరికీ కనిపించని, రూపం లేని ఆయన ఈ జగత్తునంతా సక్రమమయిన మార్గంలో నడిపించే అద్భుత శక్తి. అలానే అసలు రూపం లేని మనసు కూడా మనుషుల మీద తీవ్రమయిన ప్రభావాన్ని చూపిస్తుంది. నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై అని ఒక పాటలో కూడా రాసారు కదా!!

నాకెందుకో మన మనసుకి, మేఘాలకి దగ్గర పోలిక ఉందనిపిస్తుంది. మేఘాలు అందరాని దూరంలో ఉన్నట్టే మనసు కూడా మన ఆలోచనలకు అందని దూరంలో అర్ధం కాని వైనంతో నిండి ఉంటుంది. మేఘాలు గాలులు వీచిన వైపు పరుగులు తీసినట్టే మనసు కూడా ఊహలు లాగిన వైపు ఊగిసలాడుతుంది. మేఘం నింగిలోని నీటి బిందువులని సేకరించి వాటి భారం మోయలేనప్పుడు వర్షిస్తుంది. అలానే మన మనసు కూడా జీవితంలోని మమతానురాగాలని, సుఖ దుఖాలని నింపుకుని బాధని తాళ లేనప్పుడు విలపిస్తుంది.

మన మనస్సుని ఎడారిలోని ఎండమావులతో  కూడా పోల్చవచ్చు. దూరంగా నీళ్లు కనబడతాయి. కాని అవి నీళ్లు కావు, దాహం తీర్చలేవు.  నీళ్లు లేని చోట నీళ్లకోసం ఆరాటపడితే మనం నిరాశపాలవుతాం. అదే విధముగా ప్రతీ మనిషిలోను మనసు ఉన్నట్టే అనిపిస్తుంది కానీ అది నిజమయిన మనసు కాదు, దానికి స్పందన ఉండదు. అటువంటి వాళ్ళ మీద మనసు పడితే మనం కూడా అదే నిరాశకు లోనవుతాము.  

మన మనసుని సముద్రముతో పోల్చవచ్చు. సముద్రము లాగానే మన మనసు కూడా గంభీరముగా కనిపిస్తుంది. మన భావాలు కెరటాల్లగా ఎగసిపడుతూ ఉంటాయి. చిన్న తేడా లేదా పొరపాటు జరిగితే అల్లకల్లోలమయ్యి సునామీ లాగా మనని నిట్టనిలువునా ముంచేస్తుంది. మిగిలేది మనో ప్రళయం. ఆ దెబ్బకి నష్టపోయేది మన జీవితమే కాదు మన కుటుంబంలో కూడా ఆనందం దూరమవుతుంది. వరద బాధితులలాగా మిగలవలసినదే.

నా మనసు ముక్కలయింది అనడం మనం వింటాం కదా! అంటే మనసు గాజుబొమ్మేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఉన్నన్నాళ్ళూ దానిని ఎంత అపురూపంగా, చాలా జాగ్రత్తగా చూసుకుంటామో అదే విధముగా ఒక సారి ముక్కలయితే తిరిగి అతకలేము. నా మనసులోతుల్లో దాగున్నావ్ అంటాం కదా! అంటే ఇక్కడ మనసు లోయలంత లోతయినదనమాట. పూర్తిగా మనసు ఇస్తే మిగిలేది అగాధమే కూరుకుపోవడం తప్ప బయటకి సులభంగా రాలేము. మనసు విరిసింది అంటాం కదా! అంటే మనసు పూవులంత సున్నితమయినదని అర్ధం. విచ్చుకుని ఉన్నంత సేపూ ఎంత ఆస్వాదిస్తామో వాడిపోతే వాటికి విలువ లేదు. తేనె మనసు అనే పద ప్రయోగం వినే ఉంటాం కదా! అంటే ఇక్కడ మనసు తేనె లాగా తియ్యగా ఉంటుంది అని కాదు. ఏ విధముగా అయితే తేనె చాలాకాలం వరకు పాడవకుండా ఉంటుందో అదే విధంగా మనసు కూడా పాడవకుండా నిష్కల్మషంగా ఉంది అని చెప్పే ప్రయత్నంలో ఇలా వర్ణిస్తారు.  ఇహ మనోవేగం అంటారు ఇక్కడ మనసుకి ఉన్న వేగానికి కొలమానికలు లేవు. ఒక త్రెస రేణువు (సూర్య  కిరణాలు  ప్రసరించేటప్పుడు  కంటికి  కనిపించేవి) కన్నా తక్కువ కాలంలో తలచుకున్న చోట ఉండగలదు. మనోఫలకం అంటారు అంటే మనసు మీద దేన్నయినా చిత్రించచ్చు కాని ఒకసారి చిత్రించిన దానిని చెరపలేము, సరిదిద్దలేము. మనోరధం అంటారు అంటే మన మనస్సు రధం లాగా ప్రయాణిస్తుంది. ఊహలు అనే రెక్కల గుఱ్ఱాల చేత నిరంతరం లాగబడుతుంది. మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోహ్ అన్నారు అంటే మనకి బంధాలను కలిగించినా బంధ విముక్తుల్ని చేసి మోక్షాన్ని ప్రసాదించినా అది కేవలం మనసు మాత్రమే చేయగలదు.

మనసు గురించి ఆత్రేయ గారు రాసిన ఈ కవితలో చదవండి.

ఒక రాత్రంతా నిద్రను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి కనురెప్పలన్నీ
ఆ రాత్రి ఎక్కడ తల దాచుకోవడమని గిలగిలలాడింది నిద్ర
విచ్చుకుంటున్న ఒక పువ్వును వేడుకుంది  తనకు ఆశ్రయము ఇవ్వవలసిందిగా
"ఇప్పుడే నీకు ఆశ్రయము ఇస్తే నా రేకులన్నీ ముడుచుకుపోయి తెల్లవారేలోగానే నేను నేలమీద రాలిపడి నా ఉనికినే కోల్పోతాను వీల్లేదు పో"
అని తిప్పి కొట్టింది ఆ పువ్వు.

దిక్కుతోచని నిద్ర తన వేదనను గాలికి నివేదించుకుంది.
"చలనం నా జీవం. నిన్ను చేరదీస్తే ఇంకేముంది ఉన్నచోటనే నిలువునా స్తంభించిపోతాను. మనిద్దరికీ కుదరదు పో"
అంటూ దులిపేసుకుంది గాలి.

మంచుగడ్డను వేడుకుంది నిద్ర ఆ ఒక్కరాత్రి తనను ఒళ్లోకి తీసుకొమ్మని
ఉలిక్కిపడి  మంచుగడ్డ అంది: "నిన్ను నాలోన చేర్చుకుంటే ఇంకేమైనా ఉందా మిగిలేది స్తబ్ధతే.ఆ గుణమే నా ఒంటబడితే
ఉదయకిరణాల నులువెచ్చని కౌగిలింతలో కరిగిపోయే యోగం నాకు ఉండదు.వెంటనే వెళ్ళిపో" అని.

ఏ గత్యంతరం లేక చేతులెత్తి మనసుతో మొరపెట్టుకుంది నిద్ర
తనకు ఆ పూట విడిది  కల్పించవలసిందిగా
చిటికెలో సమస్త జీవరాసులను ఆక్రమించే అదృశ్య శక్తిగా ఉన్న నిద్రపైన జాలి కలిగింది మనసుకు.
అయ్యో పాపమనుకుంది.
పంచేంద్రియ సంచార క్రియలను ఆపేసింది.
నిర్వికార స్థితిని తనలో ఆవహింపచేసుకుంది.
అంతే మరి,
మసక కమ్మింది మగత పెరిగింది
అది గమనించిన నిద్ర కళ్ళలోకి నెమ్మదిగా చొరబడి విప్పారిన కనురెప్పలను కప్పుకుని  సుఖంగా ఒదిగి పడుకుంది
జాలి మనసుకు కృతజ్ఞతలు అర్పించుకుంటూ ..........

మనసు గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం అనేది నా దృష్టిలో మాత్రం భూమి, ఆకాశం కలయికలా కల్లే. నా అభిప్ర్రాయం ప్రకారం, మనసు ఒక వైద్యుడిలా బాధని అర్ధం చేసుకుంటుంది, సైనికుడిలా పోరాడుతుంది, గురువులా బోధిస్తుంది, వకీలు లాగా వాదిస్తుంది, చిత్రకారుడిలాగా ఎన్నో ఊహాచిత్రాలను గీస్తుంది, నిపుణులలాగా హెచ్చరిస్తుంది, మిత్రుడిలా ఓదారుస్తుంది. అలానే తల్లిలా తల్లడిల్లుతుంది, తండ్రిలా మందలిస్తుంది, అమ్మమ్మలా అనుభవాన్ని పెంచుతుంది, తాతయ్యలా తపిస్తుంది, అక్కలా అక్కున చేర్చుకుంటుంది, అన్నలా అనుభూతులని పంచుతుంది, అత్తలా ఆదరిస్తుంది, మామలా మమతని పంచుతుంది, మరదలిలా కవ్విస్తుంది, బావలా బాధించి (తీపి బాధ) బుజ్జగిస్తుంది, చెల్లిలా చిలిపిగా, తమ్ముడిలా తుంటరిగా, ప్రియుడిలా ప్రేమగా ఉండి భర్తలా లేదా భార్యలా మనలో అర్ధభాగమై ఆప్యాయతని అందిస్తూ ఎన్నటికీ నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది.22 comments:

మహేశ్వర రెడ్డి said...

మనసు విరిసింది,మనోఫలకం,
మొదలలైన వాటికి చక్కగా అర్థాలు చెప్పారు..
ఇంతకు ముందు కూడా చిలుకా గోరింకల గురించి చెప్పారు..
చాలా బాగుందండి..

రసజ్ఞ said...

నెనర్లు మహేశ్వర రెడ్డి గారు

nanda said...

philosophy vaipu adugulu vestunnarannamaata..............good one

రసజ్ఞ said...

@nanda
thanks andi

BHARATHeeyudu said...

రసజ్ఞ గారికి ముందుగా కృతజ్ఞతలు మరియు అభినందనలు.
తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవకు కృతజ్ఞతలు, మంచిమంచి అంశాల పై మీరు వాఖ్యానం చేస్తున్నందుకు అభినందనలు.

ఈ అభిప్రాయ సేకరణ అనేది ఏదైతే వుందో అది మనకు రెండు విధాలా 'మనసు'ను తాకుతుంది.
మన పనిని ఎవరైనా మెచ్చుకుంటే ఆనందంతో, మన పనిలో తప్పులు (సవరణలు) చెపితే బాధతోనూ తాకుతుంది.
మనకు ఆనందం చేసే మేలు కంటే భాద చేసే మేలే ఎక్కువ అని సర్వజ్ఞులు ఐన మీకు తెలుసు అని నాకు తెలుసు అందుకే... మీ మనసు భాద పెట్టాలని కాక పోయిన మీ ఉన్నతిని కాంక్షించే వాడిగా... కొన్ని !!!!!!!!!!!!!
''(మన మనసు కూడా కొన్ని వేల జ్ఞాపకాలకి, అనుభూతులకి, ఊహలకి, ఆలోచనలకి నిధి. బాధకి, నిరాశకి, నిస్పృహకి ఊబి. కొన్ని యోజనాల అంతర్మధనాలకి నిలయం.)''
ఊబి అనేది అక్కడ సరైన పదం కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఊభిలో కూరుకుపోవడమే గాని.. మళ్లీ బయటకు రాలేము...కాని మనసే మళ్లీ భాద,నిరాశ,నిస్పృహల స్వాంతన చేదుతుందని నా ఉద్దేశం.
యోజనం అనేది పరిమాణానికి కొలమానం అనుకుంటా...అది అంతర్మధనాలకి అన్వయించడం తగునా?

Narrowmind, Broadmind గురించి బాగా చెప్పినట్టు అనిపించలేదు.
గుప్పెడు మనసునికి Narrowmind సరైనది కాదు అనిపించింది నాకు. విశాల మనసు = Broadmind కొంత వరకు పర్లేదు అనిపించింది. మనకు..అదే తెలుగులో బుద్ది అనే మరోపదం కూడా వాడుకలో వుంది గా ??? అది ఉపయోగించి వుంటే మీరు ఇంకా బాగా చెప్పివుండేవారు.

మనసుని అధ్ధంతో పోల్చడం సరికాదేమో అని అనిపించింది. అద్దం పగిలేతే ముక్కలు అవుతుంది..ఒక material thing అది. కాని మనసు అనేది అలా kaadugaa?
అదం పగిలితే ముక్కలు మాత్రమే అవుతుంది..కాని తన సహజత్వాన్ని కోల్పోదు...ప్రతీ ముక్క ఇంకో అద్దంలా ప్రతిబింబాన్ని ప్రతి ఫలిస్తుంది...కాని మనసు విరిగితే తన సహజత్వాన్ని కోల్పోతుంది...
ఐన మీరు మొత్తం మీద చాలా చాలా బాగా 'మనసు' గెలుచుకున్నారు. GoodWork అండి.సమయాభావం వాళ్ళ ఇంకా లోతుగా చర్చించలేదు...
((చర్చ-రచ్చ అవుతుందేమో అని కూడా వెనకడుగు వేస్తున్నాను.))
మనస్తత్త్వాలు, మనస్కులు అనే పాదాలు గురించి కూడా మీనుంచి తెలుసుకోవాలి అనిపించింది...

మీ అంశంలో చివరి వాక్యాలు మనసుని హత్తుకున్నాయ్... రక్త సంబందీకులతో మనసుని పోల్చడం... చాలా బాగుంది..అంటే వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు కూడా తెలియజేసారు.
ఇంకా మిమల్ని పొగడ్తలతో ముంచడం షేరా మామూలేగనుక....పొగడడం లేదు...
ఐన కళాకారులకి పొగడ్తలు boost లాంటిది అని విన్నాను.కాని మిమ్మల్ని కళాకారిణి అనలేం.కళామతల్లి అనొచ్చు.

రసజ్ఞ said...

@BHARATeeyudu gaaru,
ముందుగా మీకు ధన్యవాదములండి నా ఈ టపాని మొత్తం చదివి దాని మీద research చేసి విశ్లేషించి మరీ ఇక్కడ చర్చించినందుకు. సరే ఇహ మీరడిగిన విషయాలకి వస్తే...
బాధకి, నిరాశకి, నిస్పృహకి ఊబి అనడం వెనుక ఉన్న నా ఉద్దేశ్యం ఏమిటంటే అందులోకి వెళితే మన మనసు దానంతట అది బయటకి రాలేదు. రావాలంటే మన మెదడు దానిని ప్రభావితం చేయాలి లేదా వేరే మనిషి ప్రభావితం చేయాలి. ఇక్కడ దానికున్న సహజ గుణాన్ని వివరించే విధములో అలా వాడాను. ఏమయితే ఆలోచిస్తున్నామో అదే ఆలోచనలతో చాలా మంది అలానే ఉండిపోతూ ఉంటారు.
యోజనం అనేది లోతును చెప్పడానికి కూడా ఉపయోగించే కొలమానం. అంతర్మధనం ఎంత లోతుగా ఉంటుంది అని చెప్పడం కోసం ఇక్కడ ఆ పదం వాడాను.
బుద్ది అనే దాని మీద మన మెదడు ప్రభావం ఉంటుంది ఇక్కడ కేవలం మనసుని ఉద్దేశించి మాత్రమే రాస్తున్నా కనుక బుద్ధిని వాడలేదు. ఇక్కడ మనసు అంటే చాలా మందికి ఉన్న భావన గుండె అని కనుక దానిని పోల్చే ప్రక్రియలో ఇక్కడ గుప్పెడు మనసు అనే పదాన్ని వాడడం జరిగింది. ఇక్కడ narrow mind అంటే సంకుచిత భావము అని చెప్పడానికి మరియు broad మైండ్ అనే దానికి contrary గా వాడటం కోసం వాడాను.
అదం పగిలితే ముక్కలు మాత్రమే అవుతుంది..కాని తన సహజత్వాన్ని కోల్పోదు...ప్రతీ ముక్క ఇంకో అద్దంలా ప్రతిబింబాన్ని ప్రతి ఫలిస్తుంది...కాని మనసు విరిగితే తన సహజత్వాన్ని కోల్పోతుంది... ఈ విషయంలో నేను మీతో ఏకీభవించను. ఎందుకంటే ఒకళ్ళ మీద మనసు విరిగితే అది మనం అందరి మీదా చూపించలేము. ఒక అమ్మాయి మిమ్మల్ని కాదని చాలా నరకం చూపించిందనుకోండి మీకు తన మీద మనసు విరుగుతుంది. ఎన్ని చేసినా మళ్ళీ ఆ రోజు అలా చేసింది అన్నఆలోచన మాత్రం అలానే ఉండిపోతుంది. అలా అని మీ అమ్మగారి మీద మీరు మనసు పడటం మానరు లేదా వేరే అమ్మాయి మీద మనసు పడటం కూడా మానరు కదా! అంటే ఇక్కడ ఇది కూడా సహజత్వాన్ని కోల్పోవడం లేదు. పైగా ఒక సినిమాలో నా మనసుని ముక్కలు చేసావ్ విరిగిన ప్రతి ముక్కతో నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు కథానాయకుడు.
మొత్తానికి నాకు మాత్రం ఇదేదో నా thesis final defense చేస్తున్న feeling వస్తోంది. మీకింకా అనుమానాలు ఉంటే అడగచ్చు. అయినా నాకు అంత scene లేదులెండి ఏదో అలా రాస్తున్నా పిచ్చాపాటీ అంతే.

nanda said...

మొత్తానికి నాకు మాత్రం ఇదేదో నా thesis final defense చేస్తున్న feeling వస్తోంది. మీకింకా అనుమానాలు ఉంటే అడగచ్చు. అయినా నాకు అంత scene లేదులెండి ఏదో అలా రాస్తున్నా పిచ్చాపాటీ అంతే. ///////////////////////////////////////////


hahahhahahahahhahahahahhahahahahhahahahhahahhahaha

రసజ్ఞ said...

@nanda
:)

Anonymous said...

konte allari chese ma RASNA ne na ivannee raasedi???
chala bagundi ra baga rasthunnaav neelo ee angle chudaledu eppudoo!!!!
good keep it up

రసజ్ఞ said...

@Anonymous gaaru
హా ఖచ్చితంగా నూటికి వెయ్యి శాతం నేనే. థాంక్స్

నందు said...

మనసుని అద్దం తో పోల్చడం సబబే. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు పద్యం ఉంది కదా ! చాలా బాగా రాసారు. ధన్యవాదాలు పైన అఙ్ఞాత వ్యక్తి చెప్పెనట్టూ enno angles unnaayi. multifaceted talent మీది :)

రసజ్ఞ said...

@నందు గారు
చాలా చాలా ధన్యవాదాలండి మీ వ్యాఖ్యకీ మరియు నాతో ఏకీభవించినందుకు. నిజమేనండోయ్ ఈ పద్యం నాకు గుర్తు రానే లేదు సుమీ ఆ సమయంలో!!

Anonymous said...

Rasagna garu,

For every comparison ,chala bagundi. idi nijama annattu undi, okkasariga alochimpa chesaru kada!!!

last paragraph lo, literally i feel it, the way you described really fantastic.

Manasuni oka thalli la, thandri la, snehithudi la. ila enno vidhaluga aaaya sandharbhalalo spandisthundi anna vaakyam chaduvuthunnappudu, nenu alochincha, idi nijame kada, eppudu naku ee alochana raledu, manalone okati inni vidhala thoduga undi ellappudu ani.

You know, now am very pretty much confident about me, one is always with me.. am not alone ani..

thnks a ton

రసజ్ఞ said...

@Anonymous gaaru
nenu rasinadi mimmlani intha aalochimpa chesindante chala santhoshamgaa undandi. adi kooda meekoka bharosa naa raathala valla vachchindante chala santhosham. dhanyavaadaalu.

నందు said...

Probably The reflection of manasu might be what i felt when i am alone. So what I wrote on loneliness in my blog might partially be ascribed to my manasu. Naaku koodaa bharosa gaa untundi eppudoo daanivalla.

Anonymous said...

Thanks Rasagna
from anonymous

Anonymous said...

yemani pogadedanoo ee vela na snehituralni "maanasa" veena mounamuga murisina vela...

రసజ్ఞ said...

@MOHAN
thanq

Anonymous said...

మనసు మీద మంచి వ్యాక్యానం, విశ్లేషణ. లాస్ట్ పేరా బాగుంది!

రసజ్ఞ said...

మీకు నచ్చినందుకు ధన్యవాదాలు అజ్ఞాత గారూ!

oddula ravisekhar said...

మీరు ఏది వ్రాసినా లోతుగా పరిశీలించి వ్రాస్తారు.మీ అన్వేషనా శీలతకు ,రచనా శక్తికి అభినందనలు.ఇక మనసు గురించి కొంత కవితా ధోరణిలో వెళ్ళారు,మరికొంత పదాల వివరణ బాగుంది. మనసు గురించి మరిన్ని విషయాలు నాబ్లాగు ద్వారా వివరిస్తాను.అప్పుడు మీకు మరింత వివరంగా వ్రాస్తాను.ఏదేమయిన మీరు పరిశోధనా బ్లాగరు.

రసజ్ఞ said...

@ రవి శేఖర్ గారూ
మీ అభినందనలకి నా అభివాదములు! తప్పకుండా మీ వివరణాత్మక మనసు టపా గురించి చూస్తాను! హహహ! ధన్యవాదాలండీ!