Friday, July 08, 2011

నాకు తెలిసిన ద్వానా 

ఎందఱో మహానుభావులు అందరికీ వందనములు. ప్రతీ మనిషీ కన్నతల్లిని ఎంతగా ప్రేమిస్తాడో మాతృభాషని కూడా అంతే ప్రేమిస్తాడని నా నమ్మకం. ప్రేమతోనే నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంలో ఒక సుప్రసిద్ధమయిన, మహోన్నతమయిన, మనందరికీ సుపరిచితులయిన శ్రీ ద్వాదశి నాగేశ్వరశాస్త్రి గారి గురించి కొన్ని విషయాలని ఇక్కడ మీతో ముచ్చటించదలచాను. ఈయన తెలియని తెలుగు వాళ్ళు ఉండరు అనడం అతిశయోక్తి కాదు ఆయన ద్వా.నా. శాస్త్రి గా మనందరి మనసులలో చెరిగిపోని ముద్ర వేశారు.

 ఈయన కృష్ణా జిల్లా మందవల్లి మండలానికి చెందిన లింగాల అనే గ్రామంలో 1948 జూన్ పదిహేనవ తేదీన లక్ష్మీప్రసన్న, కృష్ణ శాస్త్రి దంపతులకు జన్మించారు. ఈయన ఏలూరు సర్. సి.ఆర్. రెడ్డి (కట్టమంచి రామలింగారెడ్డికళాశాలలో బి.ఎస్.సి చదివాక  ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం. (తెలుగు) చదివారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో మారేపల్లి రామచంద్ర శాస్త్రి (శ్రీ శ్రీ గారికి, ఆరుద్ర గారికి ఛందస్సు నేర్పిన గురువు) గారి కవిత్వం మీద ఎం. ఫిల్. సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి, సాహిత్యసంస్థలుపై చేసిన పరిశోధనకి గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం ఆయనని స్వర్ణ పతకముతో పాటు పి.హెచ్.డి.తో సత్కరించింది. అటు పిమ్మట ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు. 1972  నుండి  2004  వరకు అమలాపురంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్సు (ఎస్.కె. బి. ఆర్.) కళాశాలలో తెలుగు శాఖలో రీడరుగా పనిచేసిన ఈయన ప్రస్తుతం .. ఎస్., గ్రూప్ 1 , గ్రూప్ 2 , జూనియర్ లెక్చరర్లు, తెలుగు పండిట్ మొదలయిన ఉద్యోగాలను తీసుకునే విద్యార్ధులకి శిక్షణని ఇస్తున్నారు. సాహిత్యాన్ని అత్యంత సులభముగా బోధించడంలో ఆయనకి ఆయనే సాటి.

ఈయన ఎదిగే కొద్ది ఒదిగే మనిషి. ఈయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న కవి, పరిశోధకుడు, రచయిత, విమర్శకుడు కూడాను, ప్రతి దానిలో కొత్తదనాన్ని  చూపించే, చూసే జిజ్ఞాసి. ఈయన రచనలని, విమర్శలని  చూసినప్పుడల్లా  SUCCESSFUL PEOPLE DON'T DO DIFFERENT THINGS, THEY DO THINGS IN A DIFFERENT WAY అని ఆంగ్లములో ఉన్న ఒక లోకోక్తిని అక్షరాలా ఈయనలాంటి వాళ్ళకే అభియోగించవచ్చని  నా నమ్మకం. ఆచార్య సి.నారాయణ రెడ్డి గారితో తలబరువు లేకుండా తలకెక్కే విధముగా చెప్పేవారని కితాబులు పొందినా, అదే వ్యక్తితో ఎక్కడ మరకలుంటే అక్కడ చురకలు వేసేవారని చమత్కరింపబడినా  అది ద్వానా గారికే చెందింది. యుజిసి నేషనల్ విసిటింగ్ ఫెలోషిప్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, ముంబాయి ఆంధ్ర మహాసభ, ఢిల్లి ఆంధ్ర అసోసియేషన్ సత్కారం, మొదలయినవి పాతికకి పైగా పొందారు. గతానికి వర్తమానానికి వారధిగా నిలిచిన శాస్త్రి గారికి సాహిత్యం పట్ల ఉన్న ఓపికకి, తీరికకి, కోరికకి నా హృదయపూర్వక అభినందనలు.

శాస్త్రి గారు కేవలం మనిషిలోపల కరడుకట్టి ఉన్న చీకటిని పారద్రోలే పనిలోనే ముప్ఫైకి పైగా కావ్యాలు రాశారు. సమాధిలో స్వగతాలు అనే వచన కవిత, వాజ్ఞ్మయ లహరి, సాహిత్య సాహిత్యం, వ్యాస ద్వాదశి అనే  వ్యాస సంపుటిలు, అక్షర చిత్రాలు ( అరుదైన ఛాయాచిత్రాలు), ద్వానా కవితలు, సాహిత్య నానీలు, బుష్ కాకి వంటి కవితా సంపుటాలు, ద్రావిడ సాహిత్య సేతువు, ఆంధ్ర సాహిత్యం,తెలుగు సాహిత్య చరిత్ర, మన తెలుగు తెలుసుకుందాం మొదలయినవి ముఖ్యమయినవి.  తెలుగు సాహిత్యంలో మహామహులనదగిన ఇరవయ్యో శతాబ్దపు సాహితీవేత్తలకి సంబంధించిన అరుదయిన ఛాయాచిత్రాలను అక్షర చిత్రాలుగా మన ముందుకి తీసుకుని వచ్చినా, కీర్తిశేషులయిన సర్వశ్రీ జనమంచి శేషాద్రి శర్మ, ఒడ్డిరాజు సోదరులు, వేటూరి ప్రభాకర శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, పింగళి కాటూరు కవులుదీపాల పిచ్చయ్య శాస్త్రిగుఱ్ఱం జాషువా, అడివి బాపిరాజు, మొక్కపాటి నరసింహశాస్త్రి, అబ్బూరి రామకృష్ణారావు,సురవరం ప్రతాపరెడ్డి, గడియారం వేంకటశేషశాస్త్రి, భమిడిపాటి కామేశ్వర రావు, పింగళి లక్ష్మీకాంతం,   దేవులపల్లి కృష్ణశాస్త్రి,గురుజాడ రాఘవశర్మ, గరికపాటి మల్లావధాని, నాయని, నోరి, వేదుల, తుమ్మల, ఆండ్ర శేషగిరిరావు, కందుకూరి రామభద్రరావు, పువ్వాడ శేషగిరిరావు, బులుసు వేంకటరమణయ్య, కొత్త సత్యనారాయణ చౌదరి, సుద్దాల హనుమంతు, ఖండవల్లి లక్ష్మీరంజనం, నార్ల, కొనకళ్ళ వెంకటరత్నం, సుంకర సత్యనారాయణ, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, రావూరు వెంకటసత్యనారాయణ రావు, దివాకర్ల వెంకటావధాని, జంధ్యాల పాపయ్య శాస్త్రి, వనమామలై, కొవ్వలి, తిరుమల రామచంద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు, చాసో, పాలగుమ్మి పద్మరాజు, దేవులపల్లి రామానుజరావు, మా గోఖలే, బోయి భీమన్న, మధునాపంతుల, తిలక్, రావి శాస్త్రి, అనిసెట్టి, కుందుర్తి, దాశరథి కృష్ణమాచార్య, తూమాటి దోణప్ప, బలివాడ కాంతారావు, ఉషశ్రీ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, శశాంక, మధురాంతకం రాజారాం, నాగభైరవ కోటేశ్వరరావు, కేతవరపు రామకోటిశాస్త్రి, మొత్తం అరవై రెండు మంది సాహితీ ప్రముఖుల జీవితానుభవాలు,వారి వారి కుటుంబ విశేషాలు, వారు జీవించి ఉన్నప్పటి సామాజిక, సారస్వత పరిస్థితులను నాలుగువందల పుటలలో అత్యద్భుతముగా మా నాన్నగారు  లో పొందుపరచినా ఆయనకే సాధ్యం.

గంగిగోవు పాలు గరిటడయినను చాలు కడివిడయిననేమి ఖరము పాలు అన్నట్టుగా ఈయన రాసిన ముప్ఫైకి పైగా ఉన్న రచనలలో  తెలుగు సాహిత్య చరిత్ర ఒక్కటి చాలు ఆయన కీర్తి నిలిచిపోవడానికి. కేవలం మాట అనే పదానికే 275 పర్యాయపదాలున్నాయని, మాటలంటే మాటలు కాదని ఆయన మాటలంటే మాటలా అనే పుస్తకంలో చక్కగా వివరించారు. నన్నయ్య కాలం నుండి నేటి దాకా తెలుగు ఎలా రూపాంతరం చెందిందో, ప్రౌఢ వ్యాకరణానికి, బాల వ్యాకరణానికి ఉన్న తేడాలేమిటో, మన వ్యవహారిక భాషలోని శబ్దాలని, అలంకారాలని, చక్కగా వివరిస్తూ రాసిన, నా మనసుని దోచిన పుస్తకం మన తెలుగు తెలుసుకుందాం. ప్రతీ తెలుగు వాళ్ళు ఒక్కసారయినా చదవవలసిన పుస్తకం ఇది. తేట తేట తెలుగు తేనెలూరే తెలుగులో పదముల, వాక్యముల ఆవిర్భావం గురించి బహు చక్కగా విశదీకరించిన పుస్తకం ఇది. అంతటి గొప్ప సాహితీ సంపదని మనకందించిన ఆయనకి కృతజ్ఞతాభివందనములు.

మన తెలుగు తెలుసుకుందాం 

6 comments:

nanda said...

ha ha ha "namasthe".....for u r patience

రసజ్ఞ said...

@నంద గారు
ధన్యవాదములండి. మీకు తీరిక దొరికితే ఇక్కడ ఇచ్చిన పుస్తకం చదవండి.

Anonymous said...

రసజ్ఞ గారూ,
చాలా మంచి పుస్తకాన్ని అందుబాటులోకి (నాకు) తెచ్చారు. మంగిడీలు. పరాయిగడ్డ మీద మాతృభాషను మర్చిపోకుండా ఉండగలుగుతున్నామంటే మీలాంటి వారెందరో తెలుగు ప్రేమికులు ఓపికగా ఇలా పుస్తకాలనూ, తెలుగుతల్లి ముద్దుబిడ్డలనూ పరిచయం చేస్తూండబట్టే.

రసజ్ఞ said...

@అచంగ గారు,
చాలా ధన్యవాదములండి. పరాయి గడ్డ మీద ఉన్నప్పుడు మాతృభాష మీద ప్రేమ ద్విగుణీకృతం అవుతుందని నాకు కూడా ఇక్కడకి వచ్చాకే తెలిసిందండి. చాలా సంతోషం. నా ప్రయత్నం నేను చేస్తా మీరు కూడా చదువుతూ ఉండండి.

Sandilya said...

మీ ఈ టపాకి నిజంగానే మీకు హాట్సాఫ్. ఎందుకంటే ద్వానా గారి గురించి చాలా సార్లే విని ఉన్నాను. ఈయన గొప్పతనం కూడా బాగానే తెలిసినవాణ్ణి. కానీ ఇంతవరకూ ఆయన రాతలు చదివే అద్రుష్టం దక్కనివాణ్ణి. ఇప్పుడు మీ కారణంగా నాకా అవకాశం దొరికింది. ధన్యవాదాలు.

ఇంతమంచి సాహితీ వేత్త గురించి ప్రస్తావించిన మీకు అభినందనలు. ఇలాంటి వారెందరో మహానుభావులున్నారండి మన తెలుగు సాహిత్య చరిత్రలో.

"మాటల" గురించి ఆయన రాసిన పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా. ఇలా మీ టపాలో పొందుపరచినా సంతోషమే. అలాగే ఆయన రాసిన "సాహిత్య నానీలు", "బుష్ కాకి", "అక్షర చిత్రాలు" (అరుదైన ఛాయాచిత్రాలు); "వాజ్ఞ్మయ లహరి" పుస్తకాల విషయం కూడా చెప్తే సంతోషం.

రసజ్ఞ said...

@శాండిల్య గారు
నాకు తెలిసినది నేను చెప్పాను అంతే పైగా ఈ మన తెలుగు తెలుసుకుందాం నా దగ్గర ఉండటం వలన ఇందులో జతచేయగలిగాను. మిగతా పుస్తకాల కోసం గాలించాను కానీ నాకు దొరకలేదు విశాలాంధ్ర పుస్తక విక్రయశాలల్లో దొరుకుతాయి కొనుక్కోవాలనుకునే వాళ్లకి. నాకు దొరికిన వెంటనే తప్పక జతచేరుస్తా.