Monday, February 04, 2013

తౌర్యత్రిక కళ


మానవుడు మనోహీనుడై జీవించలేడు. కనుక మానవునిగా మహోన్నత స్థితిని పొందాలన్నా, మానసిక ఆనందాన్ని పొందాలన్నా కళల సాన్నిహిత్యం తప్పనిసరి. తనంతట తాను ప్రకాశిస్తూ ఇతరులను సైతం ప్రకాశింపచేసేది కళ. "మనిషిలో మంచిని పెంచి, అమానుష లక్షణాలను త్రుంచి, పురుషోత్తమునిగా మలచుటకు, సర్వమానవ కళ్యాణానికీ, సాంస్కృతిక ఉన్నతికీ, దోహదపరచుటే కళకు ప్రయోజనం" అని ధర్మపురి కృష్ణమూర్తి గారు చెప్పారు. కళకు ఒక నిర్వచనం చెప్పటం అంత సులభం కాదు, ప్రకృతిలోని ప్రతీ దృశ్యమూ కళాత్మకమయినదే. "కళా సమన్వితమయిన జగత్తు సుందరమయినది, సుందరమయిన జగత్తు విశాలమైనది, విశాలమైన జగత్తు అనంత చైతన్యముతో విలసిల్లునది. ఈ బహుముఖ ప్రజ్ఞా తేజస్సు కళ వల్లనే ఆవిర్భవించుచున్నది" అని కళాశబ్దం ప్రస్తుతింపబడినది. మనకున్న 64 కళలలో, కొన్ని (చిత్రలేఖనం, సంగీతము, నృత్యము, నాటకము, మొ.) మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలను చూపిస్తాయి, వాటినే లలిత కళలు అంటారు. ఈ లలిత కళలనే జయదేవుడు గీత గోవిందంలో (మూడవ శ్లోకం) విలాస కళలుగా పేర్కొన్నాడు. వీటిల్లో ప్రథమ గణ్యమైనదీ, పరమోదాత్తమైనదీ, సర్వకాల సర్వావస్థలయందు మానవుని మనుగడతో పెనవేసుకొన్న అపూర్వ కళాసృష్టి, సర్వకళల సమాహార స్వరూపంగా చెప్పబడేదే తౌర్యత్రిక కళ.

సంగీత, సాహిత్య, నాట్య కళల సమాహార స్వరూపమయిన కళను తౌర్యత్రిక కళ అంటారు. ఇటువంటి తౌర్యత్రిక కళలలో ముఖ్యమయినది "హరికథ". సాధారణంగా గాయకుడు గానంలోనూ, సాహిత్యకారుడు సాహిత్యంలోనూ, నాట్యకారుడు నాట్యంలోనూ మాత్రమే తన ప్రతిభను చూపిస్తాడు. కానీ  తౌర్యత్రిక కళగా చెప్పబడుతున్న హరికథను చెప్పేవాడు మాత్రం అభినయ కళను కూడా జతచేసి ఈ మూడిటిలోనూ (సంగీత, సాహిత్య, నాట్యాలలో) ప్రతిభను చూపించాలి. హరికథలు వేదకాలం నుండీ ఉండేవి, అగ్నివేశాది మహర్షులు సృజించగా, బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ నిత్యం హరికథా గానం చేస్తాడు. లవకుశలు ఇరువురూ హరికథా గానం చేసినట్టు రామాయణంలో కూడా ఉంది కదా! హరికథ దివ్యమయిన (దివిభవం దివ్యం - అనగా స్వర్గమున పుట్టినది అనే వ్యుత్పత్తి ఆధారంగా ఇది దివ్యం) కళ. "ఈ హరికథా ప్రక్రియ మహారాష్ట్రలో రెబ్బటిల్లి, తమిళ దేశంలో చిగిర్చి, ఆంధ్ర దేశంలో పూసి, కాసి, ఫలించింది" అని శ్రీ కడలి వీరదాసు గారు (హరికథా మహోత్సవ ప్రత్యేక సంచికలో) తెలియచేశారు.

యావదాంధ్ర వాఙ్మయములో బహుముఖ వైవిధ్యమును, వైశిష్ట్యమును కలిగిన విశాల సాహిత్య శాఖగానూ, సాహితీ ప్రక్రియలన్నింటిలోనూ పరమోత్కృష్టమైన శాఖగానూ పేరు ప్రఖ్యాతలు పొందిన యక్ష గానమే హరికథగా రూపాంతరము చెందినదని విజ్ఞుల అభిప్రాయము. హరికథా పితామహులుగా ప్రసిద్ధుడైన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన ప్రహ్లాద చరిత్ర అను హరికథావతారికలో యక్షగానాలకు హరికథలకు అభేదం చెప్పారు. అయితే, ఈ రెంటికీ ప్రదర్శన విషయంలో కొంత భేదం కనిపించినా, అంగాలు, కీర్తనలూ, తత్వనలూ అన్నీ ఒకే విధంగా వుంటాయి. మరి రెంటికీ భేదం ఎక్కడుందంటే, యక్షగానంలో బహుపాత్రలను అనేకమంది నిర్వహిస్తే, హరికథలో ఒకే వ్యక్తి బహుపాత్రలను నిర్వహిస్తాడు. అందువలననే యక్షగానము కన్నా కూడా హరికథ ఉత్కృష్టమయినది. ముల్లోకాలనూ పునీతం చేసి, జాతిని తీర్చిదిద్ది, భారతీయ సంస్కృతికి నిజమైన దర్పణంగా నిలిచి, ఆబాల గోపాలాన్నీ ఆహ్లాదపరుస్తూ, అవ్యక్త మధురానుభూతిని ప్రసాదించే మహోన్నతమయిన కళ హరికథ. హరిని కీర్తించుటే హరికథ. "అనగా బ్రహ్మము అనగా వుండునది. బ్రహ్మమును కలిగి వుండి, వినుట ద్వారా బ్రహ్మమును పరిచయం చేసేదే  కథ" అని శ్రీ తంగిరాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నిర్వచించారు. హరికథ చెప్పేవారిని కథకుడు అంటారు. భక్తి రస ప్రధాన పురాణ గాథలలో ఏదైనా ఒక అంశం తీసుకుని, గద్యములు, పద్యములు, గానము, హాస్యము, చతురత, సమయస్ఫూర్తి, మొదలైన వాటిని చొప్పించి శ్రోతలను ఆకట్టుకుంటూ ప్రవచించటమే హరికథ. 

భావంబొప్పవలెన్ ముఖాన నిసలౌ పాండిత్య మేతత్కళా
జీవంబై రససిద్ధి బొందవలె నౌచిత్యంబుపన్యాసవా
ణీవిన్యాసమునన్ ఘటిల్లవలెన్ దానేసర్వపాత్రంబులై
ప్రావీణ్యంబులన్ నటింపవలె విద్వాంసుడు సమ్యద్గతిన్   

అంటూ శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసు గారు కథకుడు బహుపాత్రలను పోషిస్తూ కథకు రక్తినీ, తుష్టినీ చేకూర్చాలని చెప్పారు. కథకుడు సందర్భాన్ని బట్టే కాకుండా సభికులను బట్టి కూడా కథాగమనం కొనసాగించాలి. కనుక ముందుగా బాగా సాధన చేసి వెళ్లి హరికథ చెప్పేసి వచ్చేస్తే అది రక్తి కట్టదు. కథకుడు ఎప్పుడూ కూడా సభికులను ఆకట్టుకొనే విధంగా వ్యాకరణ పండితులున్న సభలో వ్యాకరణ పరిజ్ఞానాన్ని, సాహిత్యజ్ఞులున్న సభలో కవితా ప్రాభవాన్ని, సంగీతజ్ఞులున్న సభలో సంగీత ప్రజ్ఞను ప్రదర్శిస్తూ, పామరులు వున్న సభలో వారిని రంజింప చేసే విధంగా పిట్ట కథలు, ఉప కథలు, హాస్యం జోడిస్తూ మూల కథకు అడ్డు రాకుండా, ప్రచార విషయానికి భంగం కలిగించకుండా సభనంతటినీ ఆకట్టుకుంటూ చెప్పగలిగినవాడే తన లక్ష్యాన్ని సాధించి, ప్రజలలో తాననుకున్న మార్పును తీసుకువచ్చి, వారికి మార్గ దర్శకుడవుతాడు. ఇంకా సూటిగా చెప్పాలంటే హరికథకుడు నవరసాలూ పోషిస్తూ, అన్ని రసాలకూ ఏకాగ్రచిత్తుడై వుండాలి. ఇన్ని చేయాలి కనుకనే హరికథ కష్టమయినా కానీ అన్ని వర్గాల వారినీ అలరిస్తుంది.

మొదట భక్తి తత్వమే ప్రాణంగా హరికథలు ఆవిర్భవించాయి. అద్వైత సిద్ధి మొదలు ఆటవిక విశ్వాసం వరకు ఏ రకంగా ప్రదర్శింపబడినా అది భక్తిగానే పరిగణించారు. వీటి వలన ఆధ్యాత్మిక ప్రభోదం కూడా జరిగేది. ఇటువంటి హరికథల వలన కథకులు మోక్షసాధన కోసం సంగీత, సాహిత్య, నాట్యాలను ఆలంబనగా చేసుకుని, వైష్ణవాన్నీ, శైవాన్నీ సమానంగా భావించి, సామాజికుల చేత కూడా భావింపచేసి సర్వమత సామరస్యాన్ని చాటేవారు. కొంతకాలం ఇటువంటి హరికథలు కేవలం హిందువులకే పరిమితమయ్యి, హైందవ సంప్రదాయాన్ని ఎక్కువగా ప్రదర్శించడం వలన హైందవ మత ప్రచారానికే ఎక్కువగా దోహదం చేస్తూ వచ్చాయి. కాలం గడిచే కొద్దీ, ఇతర మతస్థులైన క్రైస్తవులను, మహమ్మదీయులను కూడా విశేషంగా ఆకర్షించింది. ప్రజల్లో ఏ విషయాన్ని ప్రచారం చేయాలన్నా (అప్పట్లో మరి ప్రచార సాధనాలు తక్కువ కదా!) హరికథా ప్రక్రియే సరైన, శక్తివంతమైన మార్గమని గుర్తించారు. వారి మత ప్రచారానికి ఆలంబనగా "హరి" శబ్దాన్ని అడ్డుగా భావించకుండా ఒక కథా కాలక్షేపంగా వారు ఏసు ప్రభువు జీవిత చరిత్రను, మహమ్మదీయుల చరిత్రలను కూడా కథా రూపాలుగా చేసుకుని వానిని హరికథలుగా మలచుకుని ప్రచార యోగ్యంగా కూర్చుకున్నారు. రాన్రాను కాలానుగుణంగా భగవత్సంబంధిత గాథలే కాక, దేశనాయకులు, క్విట్ ఇండియా, కుటుంబ నియంత్రణ, సమాజాన్ని పీడిస్తున్న అంశాలు, మొదలయినవెన్నో ఇతివృత్తాలుగా చేసుకుని హరికథలు చెప్పటం ప్రారంభించారు. ప్రజల నుండీ ఇటువంటి కథలకు మునుపటి వాటికంటే ఆదరణ, ప్రోత్సాహం ఎక్కువగా లభించాయి.

హరికథలు చెప్పటమే కాదు, వ్రాయటమూ ఒక కళే. శ్రీ రాంపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు "కుమార సంభవము" ను, శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు గారు "అభిజ్ఞాన శాకుంతలం" ను, చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు "మాళవికాగ్ని మిత్రమ్" ను హరికథలుగా రచించారు. వీటి ప్రదర్శనల ద్వారా మన దేశానికే పరిమితమయిన హరికథలను విదేశీయులు సైతం అబ్బురపడేలా చేశారు మన హరికథకులు. శ్రీ అమ్ముల విశ్వనాధం గారు మలేషియాలో, శ్రీ వీరగంధం వెంకట సుబ్బారావు భాగవతార్ గారు అమెరికాలో, శ్రీ బోడావుల సీతారామయ్య భాగవతార్ గారు జర్మనీ, పారిస్, లండన్ వంటి దేశాలలో పలు ప్రదర్శనలిచ్చి, వాటి ద్వారా వారిలో భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పరచడమే కాక, భారతీయ కళల పట్ల వారికి ఉన్నతమైన అభిప్రాయాన్ని కూడా కలిగించారు. ఇంతటి మహోన్నతమయిన హరికథకు పితామహులైన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి గురించి ఒక్క మాటలో (తాతారావు గారి పలుకుల్లో) చెప్పాలంటే: 

హరికథా ప్రక్రియకు ఆద్యుండు కవితలో
కాళిదాస పోతనలకు సాటి
ఆదిభట్ట బుధుడు అన్నిటన్ మొనగాడు
ఆట పాట మాట లందు మేటి
ఇంతటి అపూర్వమయిన కళ అంతరించిపోకుండా ఎంతో మంది నేర్చుకోవాలనే సదుద్దేశ్యంతో హరికథా శిక్షణకు ప్రత్యేకంగా ప్రప్రధమంగా 10-6-1973న కపిలేశ్వరపురం (రాజమహేంద్రవరానికి 36కిలోమీటర్ల దూరం), తూర్పు గోదావరి జిల్లాలో "హరికథా పాఠశాల"ను శ్రీ యస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు (కపిలేశ్వరపురం జమీందారు)గారు స్థాపించి, ప్రధానాచార్యులుగా శ్రీ కడలి వీరదాసు (శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి శిష్యుడు) గారిని నియమించారు. మన జాతి కళలు కాపాడుకోవలెనన్న ఆశయంతో ప్రభుత్వం వారు ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్ధులలో కొంతమందిని ఎంపిక చేసి స్కాలర్షిప్ కూడా ఇస్తారు. ఈ పాఠశాలలో అయిదు సంవత్సరాల శిక్షణాకాలం పూర్తయిన తరువాత పరీక్షలను నిర్వహించి, "హరికథా ప్రవీణ"  అను ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, వారిని ప్రదర్శనకు యోగ్యులుగా నిర్ణయిస్తుంది. ఈ సంస్థ నుండి తయారైన బాలబాలికలు తెలుగులో మాత్రమే గాక సంస్కృతంలో కూడా హరికథలు చెబుతూ ఎన్నో సత్కారాలు పొందారు. వారిలో ప్రముఖులు దాలిపర్తి ఉమామహేశ్వరి గారు. ఉజ్జయినిలో  కాళిదాస అకాడమీ వారు నిర్వహించే అంతర్జాతీయ సెమినార్ లో ఈవిడిచ్చిన ప్రదర్శనల ద్వారా హరికథా ప్రక్రియకు ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు లభించాయి.

మన రాష్ట్రంలో జానపద కళారూపాలుగా చెప్పబడుతున్న హరికథలు, బుఱ్ఱకథలు, మొదలైన వాటిని ప్రోత్సహించాలని తెలుగు విశ్వవిద్యాలయం వారు హరికథా రచనా పోటీలు, హరికథా ప్రవచనా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి కులపతి గారైన ఆచార్య శ్రీ దోణప్ప గారు రచించిన "తెలుగు హరికథా సర్వస్వం" అనే పుస్తకాన్ని (హరికథకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ పొందుపరుస్తూ) అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. డా. డి. శారద గారు రచించిన "హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనాలు" (ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండీ పి.హెచ్.డి. పొందిన గ్రంధం) అనే పరిశోధనా గ్రంధంలో హరికథల వలన దేశానికి జరిగే మేలు ఎలాంటిదో కూడా బాగా వివరించారు. ఈ రెండు పుస్తకాలనూ క్షుణ్ణంగా చదవటం వలన హరికథా ప్రక్రియల ప్రాచీన స్వరూపం నుండీ ఆధునిక స్వరూపం దాకా ప్రతీ విషయమూ వివరంగా తెలుస్తుంది.

కొన్ని చక్కని హరికథలను ఇక్కడ వినవచ్చును. పాత చలన చిత్రాలలో హరికథలు ఎక్కువగానే కని, వినిపించేవి కానీ ఈ మధ్యన వచ్చిన చిత్రాలలో దేవస్థానం అనే చలనచిత్రంలో చాలా కాలం తరువాత దండిభట్ల నారాయణమూర్తి గారు, స్వర వీణాపాణి గారు రచించిన హరికథలను (సామాజిక) వినిపించి మరచిపోతున్న హరికథా ప్రక్రియను గుర్తుచేశారు.

One must die as an artist to be reborn as a Yogi అన్న అరవిందుని సూక్తి కళాకారులకున్న ఔన్నత్యాన్ని చాటుతోంది. దీనిని ఎప్పుడూ జ్ఞప్తిలో వుంచుకుని, ఇటువంటి కళలను కాపాడుకుంటూ, తరువాతి తరాలకు పంచవలసిన (కనీసం పరిచయం చేయవలసిన) బాధ్యత మనందరి మీదా వుందని భావిస్తున్నాను. హరికథకు పూర్వ వైభవం దక్కాలని మనసారా కోరుకుంటూ...............

Monday, January 07, 2013

కుబేరుడు



నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో…..

  

Monday, November 26, 2012

కాళిదాసు - మేఘ సందేశం


చిన్నప్పుడు మేఘ సందేశం సినిమా చూసి అదే కాళిదాసు వ్రాసినది అన్న అపోహలో ఉండేదానిని. తరువాత రెండూ వేరు వేరని, ఇదొక విరహ కావ్యం అని తెలిసింది. విరహం నాకెందుకో అంతగా నచ్చదు. కానీ కాళిదాసు విరహ కావ్యం చదివాక విరహంలో కూడా ఇంత అందం, ఆనందం ఉంటాయని తెలుసుకున్నాను. నవరసాలలో మొట్ట మొదటి స్థానం శృంగారానికే దక్కింది కనుక ముందుగా కాళిదాసు శృంగార రచనలని నాకు అర్థమయినంతలో పరిచయం చేస్తున్నాను. ఆ ప్రకారంగా అభిజ్ఞాన శాకుంతలం తరువాత స్థానం మేఘ సందేశానికి ఇచ్చాను. ఈ మేఘ సందేశం ఒక "ఖండ కావ్యం". ఖండ కావ్యం భవేద్కావ్యం ఏక దేశాను సారిచ అన్నారు. ఒక కథతో సంబంధం లేకుండా ఏదో ఒక భాగాన్ని లేదా ఘట్టాన్ని తీసుకుని వివరించడమే ఖండ కావ్య లక్షణం. ఈ మేఘ సందేశంలో పూర్వ మేఘం (63 శ్లోకాలు), ఉత్తర మేఘం (52 శ్లోకాలు) అని రెండే సర్గలు ఉన్నాయి.  
 
కాళిదాసు రచించిన కావ్యాలకి ఒక ప్రత్యేకత ఉంది. కాళిదాసు పుట్టుకతోనే పండితుడు కాదనీ, పెళ్ళయ్యాకే అమ్మవారి (కాళికా దేవి) అనుగ్రహం వలన పండితుడయ్యాడనీ అందరికీ తెలిసినదే. అయితే పెళ్ళయిన వెంటనే కాళిదాసు భార్య "వాగస్తి కశ్చిత్?" (వాక్కు ఏదన్నా నీకుందా?) అని అడుగుతుంది. ఈయన పండితుడయిన తరువాత, ఈ వాగస్తి కశ్చిత్ లో ఉన్న మూడు పదాలనీ (వాక్, అస్తి, కశ్చిత్) తీసుకునీ ఒక్కో పదంతో మొదలయ్యేట్టుగా ఒక్కో కావ్యాన్ని (వాక్కుతో మొదలుపెట్టిన మహా కావ్యం రఘువంశం, అస్తి తో మొదలుపెట్టిన మహా కావ్యం కుమార సంభవం మరియు కశ్చిత్ తో మొదలుపెట్టిన ఖండ కావ్యం మేఘ సందేశం) వ్రాశాడు. ఆ ప్రకారంగా ఇందులోని మొట్టమొదటి శ్లోకం:
కశ్చిత్కాంతావిరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపేనాస్తంగమిత మహిమా వర్షభోగ్యేణ భర్తుః ।
యక్షశ్చక్రే  జనక తనయా స్నాన పుణ్యోదకేషు
స్నిగ్ధచ్ఛాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు ॥

అంటే తన విధులలో అశ్రద్ధ వహించటం వలన యజమాని ఆగ్రహానికి గురయ్యి, తన విధుల నుండి తొలగించబడి, తన శక్తులన్నీ కోల్పోయి, యేడాది కాలం కాంతా (భార్య) వియోగంతో గడపవలననే శాపాన్ని పొందిన యక్షుడు, జనకుని కూతురు అయినటువంటి సీతా దేవి స్నానం చేయటం వలన పవిత్రంగా మారిన నీరు కలిగినటువంటి, దట్టమయిన నీడనిచ్చే చెట్లు కలిగినటువంటి రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు.

ఈ శ్లోకంతో నాయకుడయిన యక్షుని పరిచయం జరిగింది. దానికి రెండు విశేషణాలు వాడాడు. అవే స్వాధికారాత్ ప్రమత్తః, అస్తంగమిత మహిమ. దీని ఆధారంగా కాళిదాసు విధి నిర్వహణే ప్రధాన కర్తవ్యం అని చెప్తున్నాడు అనిపిస్తుంది. చేయవలసిన పని సరిగ్గా చేయకపోవటం వలన యక్షునికి కలిగిన అనర్థాలు ఉద్యోగం మరియు మహిమలు కోల్పోవటం, తద్వారా కాంతా వియోగం పొందటం. మనకి ధర్మార్థకామాలలో కూడా మొదటిది ధర్మ నిర్వహణే కదా! అది సరిగ్గా చేయకపోతే అన్నిటికీ దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలాగే రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు అని చెప్పాడు కానీ అదెక్కడుందో రెండు విశేషణాలతో చెప్పకనే చెప్పాడు. అవే జనక తనయా స్నాన పుణ్యోదకేషు అనగా సీతాదేవి స్నానం చేయటం వలన పవిత్రమయిన నీరు, స్నిగ్ధచ్ఛాయాతరుషు అనగా ఎక్కువగా నీడనిచ్చే చెట్లు. వీటి ఆధారంగా తెలిసేది ఏమిటంటే సీతాదేవి వనవాసం చేసిన చోటు అని. అదే చిత్రకూట పర్వతం. ఇటువంటి ఎన్నో రసవత్తరమయిన శ్లోకాలతో ఆద్యంతం ఆకట్టుకున్న అద్భుత కావ్యం మేఘ సందేశం.

అరణ్యంలో విరహంతో ఉన్న యక్షునికి (యక్షులు సాధారణంగా కాముకులు కనుక వారికి కాంతా వియోగం భరించలేనటువంటిది) మేఘుడు కనిపిస్తాడు. కనిపించిన వెంటనే ఏమీ ఆలోచించకుండా మేఘునితో అలకాపురి(యక్షుల నివాసం)లో ఉన్న తన భార్యకి సందేశాన్ని పంపాలి అనుకుంటాడు. శ్రీరాముడు సీతకి ఆంజనేయస్వామి ద్వారా, పాండవులు కౌరవులకి శ్రీ కృష్ణుని ద్వారా, నలోపాఖ్యానంలో దమయంతికి హంస ద్వారా, సందేశాలు పంపటం జరిగాయి. కానీ ఇక్కడ యక్షుడు - పొగ, వెలుతురు, నీరు, గాలి కలిసినటువంటి మేఘంతో (ప్రాణం లేని దానితో) సందేశం పంపబోతున్నాడు. ఆ మాత్రం కూడా కాళిదాసుకి తెలియదు అని జనం భావించకుండానే, కామార్తులకు (కామముతో ఉన్న వాడికి) అంత ఆలోచన ఎక్కడిది? అని తన కావ్యౌచిత్యాన్ని సమర్ధించుకున్నాడు (పూర్వ మేఘం, నాల్గవ శ్లోకంలో).

పూర్వ మేఘంలో మేఘానికి మార్గ నిర్దేశం చేస్తాడు. ఆ ప్రకారంగా, చిత్రకూట పర్వతం (ప్రస్తుతం దీనిని మధ్యప్రదేశ్ లోని రామ్ గఢ్ అంటారు) మీద బయలుదేరిన మేఘం, మాల పర్వతం (ప్రస్తుతం దీనిని ఛత్తీస్ గఢ్ అంటారు) మీదుగా ఆమ్రకూట పర్వతం (నర్మదా లేదా రేవా నదీ జన్మస్థానం) వెళ్ళి, అక్కడనుండీ దశార్ణ దేశ (మాళవ దేశ పూర్వ భాగాన్ని దశార్ణ దేశం అంటారు) రాజధాని అయినటువంటి విదిశా (ప్రస్తుతం దీనిని భిలాసా అంటారు) నగరానికి వెళ్ళి వేత్రవతీ (వింధ్య పర్వతాలకి ఉత్తర భాగంలో ఉద్భవించిన ఈ నదిని ప్రస్తుతం "బేత్ వా" అని పిలుస్తారు) నది అందాలని ఆస్వాదిస్తూ, కొంచెం చుట్టు తిరుగు అయినా ఉజ్జయిని (మాళవ దేశ రాజధాని. దీనినే అవంతి అని కూడా అంటారు) వెళ్ళి తప్పనిసరిగా (కాళిదాసుకి ఆ ఊరి మీదా, శివుని మీదా ఉన్న మమకారంతో ఇది చేర్చాడు అనిపిస్తుంది) ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటయిన మహాకాలుని దర్శనం (సాయంకాల సమయంలో) చేసుకుని, శిప్రా (ఉజ్జయినిలో ప్రవహించే నది) నదికి ఉపనదులయిన గంధవతి, గంభీర నదుల వద్ద సేద తీరి, దేవగిరి (ప్రస్తుతం దీనిని దౌలతాబాద్ అంటారు) పర్వతం వద్ద నివాసముండే శరవణభవుడయిన కుమారస్వామిని దర్శించుకుని, అక్కడ ప్రవహించే చర్మణ్వతి (వింధ్య పర్వతాలకి వాయువ్య దిశలో ఉద్భవించిన ఈ నదిని ప్రస్తుతం "చంబల్" అని పిలుస్తారు) నదిని దాటుకుంటూ, దశపురం (రంతిదేవుని రాజధాని నగరం), బ్రహ్మావర్తం (సరస్వతీ, దృషద్వతీ నదుల మధ్యన ఉన్న ప్రదేశం), కురుక్షేత్రం (మహా భారత యుద్ధం జరిగిన చోటు), కనఖలం (హరిద్వార్ వద్ద ఉన్న క్షేత్రం, ఇక్కడ గంగానది ప్రవహిస్తుంది), హిమవత్పర్వతం మీదుగా కైలాసం చేరాక, ఆ ప్రక్కనే ఉన్న అలకానగరం (మా అనగా యక్షుల నివాసం) వెళ్ళాలి.

ఉత్తర మేఘంలో అలకానగారాన్ని వివరించి, తన ఇంటికి దారి చెప్పి, తన భార్య గుర్తులు చెప్పి, వారిరువురికి (యక్షునికీ, తన భార్యకీ) మాత్రమే తెలిసిన కొన్ని సంగతులను చెప్పి (యక్షుని భార్యకి ఈ మేఘుడు నిజంగా యక్షుడు పంపిన వాడే అని నమ్మకం కలిగించటం కోసం), తన గురించి బాధ పడవద్దనీ, తాను త్వరగా వచ్చేస్తానని చెప్పమని మేఘుడిని రకరకాలుగా పొగిడి (తన పని జరగడం కోసం) మరీ పంపిస్తాడు. తీరా చూస్తే, మేఘం ఆ అలకానగరం వెళ్ళేసరికి యక్షుడే తన సంవత్సర కాలం పూర్తి చేసుకుని తన భార్యను చేరుకుంటాడు.

నాయకులు నాలుగు రకాలు. వారినే చతుర్విధ నాయకులు అంటారు. ధీరోదాత్తుడు (వీరత్వం అధికంగా ఉండి ఆవేశం లేకుండా ఆలోచన కలవాడు ఉదా: శ్రీ రాముడు), ధీరోద్ధతుడు (వీరత్వం ఎక్కువగా ఉండి ఆలోచన ఏ మాత్రం లేనివాడు ఉదా: భీముడు), ధీర లలితుడు (వీరత్వం, లాలిత్యం సమపాళ్ళలో కలిసిన ప్రేమ స్వరూపుడు ఉదా: శ్రీ కృష్ణుడు), ధీర శాంతుడు (శాంతాన్ని అధికంగా కలిగిన వీరుడు ఉదా: గౌతమ బుద్ధుడు). కాళిదాసు తన రచనలలో నాయకుడిని ఎప్పుడూ ధీరోదాత్తునిగానే మలుచుకుంటాడు. శాకుంతలంలో అదే జరిగి అభిజ్ఞాన శాకుంతలం అయ్యింది కదా! ఈ మేఘ సందేశంలో కూడా నాయకుడైన యక్షుని ధీరోదాత్తునిగానే చూపాడు (పూర్వ మేఘం, మూడవ శ్లోకంలో).

శృంగార నాయికలు ఎనిమిది రకాలు. వారినే అష్టవిధ శృంగార నాయికలు అంటారు. వారిలో నలుగురిని ఎన్నుకుని, ఒక్కొక్కరిగా ఈ కావ్యంలో పూర్వమేఘంలో పరిచయం చేశాడు కాళిదాసు. 

త్వా మారూఢం పవనపదవీ ముద్గృహీతాలకాన్తాః
ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయాదాశ్వ సన్త్యః ।
కః సన్నద్ధే విరహవిధురా త్వయ్యుపేక్షేత జాయాం
న స్యాదన్యోఽప్యహమివ జనోయః పరాధీనవృత్తిః ॥
అంటూ ముందుగా పథికవనితాః అనగా ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక గురించి చెప్పాడు. భర్త దూరంగా (పని మీద ఎక్కడికైనా వెళ్ళినా, దేశాంతరం వెళ్ళినా) ఉన్నప్పుడు తన గురించి ఆలోచిస్తూ విరహంతో ఉండే స్త్రీని ప్రోషిత భర్తృక అంటారు. మేఘుడు కామ ప్రకోపన చేసేవాడు. అసలే విరహంతో ఉండే స్త్రీలు నీ (మేఘుని) రాకతో, తమ భర్తతో కలవాలన్న కోరిక పెరిగి, భర్త కూడా అదే కాంక్షతో వస్తాడు అన్న ఆశతో తమ ఫాల భాగం మీద పడుతున్న ముంగురులను పైకి ఎత్తి నిన్ను చూస్తారు. అటువంటి స్త్రీని విడిచి అశక్తుడు, అస్వతంత్రుడు, పరాధీనుడు అయిన మగవాడు తప్ప మరెవ్వరూ ఉండలేరు అంటాడు. ప్రస్తుతం యక్షుని పరిస్థితి అదే కనుక ఆమెకు దూరంగా ఉన్నందుకు చింతిస్తూ మేఘుని వెళ్ళి తన క్షేమ సమాచారం తెలియ చేయమంటాడు. దీనికి సమర్ధింపుగా ఉత్తర మేఘంలో 21, 22, 23, 24, 25 శ్లోకాలలో యక్షుని భార్యలో ఉన్న ప్రోషిత భర్తృక లక్షణాలన్నీ విశదీకరిస్తాడు. నాకెందుకో కాళిదాసుకి ఈ ప్రోషిత భర్తృక అంటే ప్రత్యేక అభిమానం అనిపిస్తుంది. అభిజ్ఞాన శాకుంతలంలో కూడా శకుంతలని ప్రోషిత భర్తృక (దూర్వాస మహాముని శాపానికి కారణమయినప్పుడు) గానే చూపిస్తాడు.  

గచ్ఛన్తీనాం రమణవసతిం యోషితాం తత్రనక్తం
రుద్ధాలోకే నరపతి పథే సూచి భేద్యై, స్తమోభిః ।
సౌదామన్యా, కనక నికషస్నిగ్ధయా దర్శయోర్వీం
తోయోత్సర్గస్తనితముఖరో మాస్మభూర్విక్లవాస్తాః ॥

అంటూ రమణవసతిం గచ్ఛన్తీనాం అనగా అభిసారిక గురించి చెప్పాడు. అందంగా అలంకరించుకుని, ప్రియుని వద్దకు తాను వెళ్ళే స్త్రీని అభిసారిక అంటారు. ఉజ్జయనిలోని స్త్రీలను వర్ణిస్తూ చెప్పిన ఈ శ్లోకంలో అక్కడి అభిసారికలు (స్త్రీలు) రాత్రిపూట ప్రియుని ఆవాసానికి బయలుదేరతారు కనుక ఆ సమయంలో నువ్వు (మేఘుడు) మెఱుపులతో దారి చూపు కానీ ఉరుముతూ వాన పడి వారిని భయపెట్టకు. వారసలే మిక్కిలి భయస్తులు అని మేఘుడిని హెచ్చరిస్తూ స్త్రీలతో సున్నితత్వం వహించాలని చెప్తాడు. పూర్వ మేఘంలో ఉజ్జయినిలోని (కాళిదాసు నివాస స్థలం) అభిసారికలు ప్రియుని వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారో చెప్పిన కాళిదాసు ఉత్తర మేఘంలో (తొమ్మిదవ శ్లోకంలో) అలకాపురిలోని (యక్షుని నివాస స్థలం) అభిసారికలు తమ ప్రియుని వద్ద నుండీ వచ్చేటప్పుడు ఎలా ఉంటారో వివరిస్తాడు. దీని ద్వారా కాళిదాసు పురుషుల ఏక పత్నీత్వం, స్త్రీల పాతివ్రత్యం ఇష్టాధీనమే కానీ కృత్రిమం కాదు అని చెప్తున్నాడనిపిస్తుంది. మన నాయకుడయిన యక్షుడు ఏకపత్నీ వ్రతుడు, ముందుగా చెప్పుకున్నట్టు ధీరోదాత్తుడు కాకపోతే తన భార్యకి మేఘుడిని బ్రతిమాలుకుని మరీ సందేశం పంపవలసిన అవసరం లేదు కదా! అలా మన నాయకుని ధీరోదాత్త లక్షణం మళ్ళీ చూపాడు.

తస్మిన్కాలే నయన సలిలం యోషితాం ఖణ్డితానాం
శాన్తిం నేయం ప్రణయిభిరతో వర్త్మభానోస్త్య జాశు ।
ప్రాలేయాస్రం కమలవదనాత్సోఽపి హర్తుం నలిన్యాః
ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్ఫాభ్యసూయః ॥

అంటూ ఖణ్డితానాం అనగా ఖండిత నాయిక గురించి చెప్పాడు. రాత్రంతా పర స్త్రీతో గడిపి, తెల్లవారిన తరువాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన భర్తని చూచి దుఃఖించే స్త్రీని ఖండిత అంటారు. ఆ సమయంలో అనగా సూర్యోదయ సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన భర్తలు తమ భార్యల కన్నీరు తుడుస్తారు. ఈ శ్లోకంలో పద్మం అనే ఖండిత స్త్రీ ముఖము నుండీ కారే మంచు అనే కన్నీటిని తొలగించే భర్త (లేదా ప్రియుడు) సూర్యుడు అని వర్ణించాడు. అటువంటి సూర్యునికి నువ్వు (మేఘుడు) అడ్డు రాకుండా, తన కిరణాలు అనే చేతులతో మంచు అనే కన్నీటిని తుడవనివ్వు, ప్రేయసీ ప్రియుల మధ్యలో నువ్వెందుకు? అడ్డు తొలగు అంటూ హితోపదేశం చేస్తున్నాడు.

తస్యోత్సఙ్గే ప్రణయిన ఇవస్రస్త గఙ్గాదుకూలాం
న త్వం దృష్ట్వా న పునరలకాం జ్ఞాస్యసే కామచారిన్ ।
యావః కాలే వహతి సలిలోద్గారముచ్చైర్విమానా
ముక్తాజాలగ్రథిత మలకం కామినీ వాభ్ర బృన్దమ్ ॥

ఈ శ్లోకంలో స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక అనే నాయికను ప్రతిబింబిస్తున్నాడు. ఇందులో కైలాస పర్వతాన్ని నాయకుని(ధీర లలితుడు)గా, అలకా నగరాన్ని నాయిక(స్వాధీన పతిక)గా భావించి వర్ణిస్తున్నాడు కవి. స్వాధీన పతికలోని ప్రేమకి, సుగుణాలకి పూర్తిగా వశమయిన ప్రియుడు ఆమెను అనునిత్యం లాలిస్తూ ఉంటాడుట. అలిగిన ప్రేయసిని లాలించే ప్రియుడు ఆమెను తన తొడపై పడుకో పెట్టుకుంటే ఆ స్త్రీ రూపం ఎలా ఉంటుందో, కైలాస పర్వతంపై ఉన్న అలకా నగరం అలా ఉందని కవి భావన! అక్కడ ఆకాశంలో జాలువారే గంగానది ఈ ప్రియురాలు (అలకానగరం) కట్టుకున్న తెల్ల పట్టు చీరలా ఉందిట!

"ఉపమా కాళిదాసస్య, అర్ధాంతరన్యాసోపి విధీయతే" అంటారు. ఈ కావ్యంలో నాకు నచ్చినవి చాలా ఉన్నా, మిక్కిలి ఆకర్షించిన కొన్ని ఉపమానాలు:
ఆమ్రకూట పర్వతాన్నీ, అక్కడ ప్రవహించే రేవా నదినీ వర్ణిస్తూ ఏనుగు ఆకారంలో ఉన్న పర్వతానికి, పాయలు పాయలుగా ప్రవహిస్తున్న నది ఆ ఏనుగు పెట్టుకున్న విభూది రేఖల వలె ఉన్నది అంటాడు.
మార్గ మధ్యలో కనిపించిన "నిర్వింధ్య" నదిని ఒక స్త్రీగా, మేఘాన్ని తన ప్రియునిగా భావిస్తూ, నదిలో వచ్చే సుడులను ఆ స్త్రీ యొక్క నాభిగా అభివర్ణించడం.
చర్మణ్వతీ నదిని ఆకాశం నుండీ చూస్తే భూదేవి మెడలో ధరించిన ఒంటి పేట ముత్యాల హారంలా కనిపిస్తోంది, ఆ నీటి కోసం నువ్వు (మేఘుడు) వంగితే ఆ ముత్యాల హారం మధ్యలో ఉన్న ఇంద్ర నీలమణిలా ఉంటావు అంటాడు.

ఇటువంటి ఎన్నో అద్భుతమయిన ఉపమానాలతో మనోజ్ఞ సీమకి తీసుకెళ్ళాడు కాళిదాసు. చదువుతున్నంత సేపూ ఆ ప్రదేశాలన్నీ అక్కడే ఉండి చూసినట్టు అనిపిస్తుంది. ఇందులో వ్రాసిన ప్రతీ శ్లోకాన్నీ ఒక చిత్రంగా గీయచ్చు. భావకులు ఆ పారవశ్యం నుండీ తేరుకుని బయటకి రావటం చాలా కష్టం. ఏమి ఉపమానాలు! ఏమి విశేషణాలు! ఎన్ని అలంకారాలు! ఆహా! ఒక మహాద్భుతం చూసిన అనుభూతి దక్కింది. విరహం, తన్మయత్వం, భక్తి, ప్రేమ, అనురాగం, శృంగారం, ప్రకృతి వర్ణనలూ, సందేశాలూ అన్నిటినీ సమపాళ్ళల్లో పండించినటువంటి మేఘ సందేశం ఒక చక్కని కావ్యం అనడంలో అతిశయోక్తి లేదు.  

Friday, October 05, 2012

వాయువు




నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో...

Friday, September 07, 2012

గురుభక్తి


ముందుగా అందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు (దొంగలు పడిన ఆరు నెలలకి సామెత కాస్సేపు మర్చిపోండి). మొన్న ఎంతోమంది గురువులకి నమస్కారాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, వారి వారి అభిప్రాయాలను పరి పరి విధముగా తెలియచేసుకున్నారు. చూసి చాలా ఆనందం వేసింది, గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం
"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" 
అయితే ఈ శ్లోకం ఎందులోది? ఏ సందర్భంలోది? ఎవరు వ్రాశారు? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా? నాకొచ్చాయిగా! అందుకే ఈ టపా. ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది. ఈ కథంటే ఎందుకో నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు తెలిసినవారు మళ్ళీ చదివేయండి, తెలియని వాళ్ళు శ్రద్ధగా చదవండి (ప్రశ్నలేమీ అడగనులెండి).

కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు (ఆయన పేరు నాకు గుర్తులేదు). ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.

ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.

కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.

ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.

అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.
ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ ఈ టపా అంకితం....

గమనిక: గొర్తి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కథ "గురు చరిత్ర"లోని రెండవ అధ్యాయంలోనిదనీ, గురు శిష్యుల పేర్లు వేదధర్ముడు, దీపకుడు అని స్పష్టమవుతున్నది. నేను నేర్చుకున్నది ఇలానే కనుక ఈ టపాలో వివరాలు, పేర్లు మార్చటం లేదు.