Monday, February 04, 2013

తౌర్యత్రిక కళ


మానవుడు మనోహీనుడై జీవించలేడు. కనుక మానవునిగా మహోన్నత స్థితిని పొందాలన్నా, మానసిక ఆనందాన్ని పొందాలన్నా కళల సాన్నిహిత్యం తప్పనిసరి. తనంతట తాను ప్రకాశిస్తూ ఇతరులను సైతం ప్రకాశింపచేసేది కళ. "మనిషిలో మంచిని పెంచి, అమానుష లక్షణాలను త్రుంచి, పురుషోత్తమునిగా మలచుటకు, సర్వమానవ కళ్యాణానికీ, సాంస్కృతిక ఉన్నతికీ, దోహదపరచుటే కళకు ప్రయోజనం" అని ధర్మపురి కృష్ణమూర్తి గారు చెప్పారు. కళకు ఒక నిర్వచనం చెప్పటం అంత సులభం కాదు, ప్రకృతిలోని ప్రతీ దృశ్యమూ కళాత్మకమయినదే. "కళా సమన్వితమయిన జగత్తు సుందరమయినది, సుందరమయిన జగత్తు విశాలమైనది, విశాలమైన జగత్తు అనంత చైతన్యముతో విలసిల్లునది. ఈ బహుముఖ ప్రజ్ఞా తేజస్సు కళ వల్లనే ఆవిర్భవించుచున్నది" అని కళాశబ్దం ప్రస్తుతింపబడినది. మనకున్న 64 కళలలో, కొన్ని (చిత్రలేఖనం, సంగీతము, నృత్యము, నాటకము, మొ.) మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలను చూపిస్తాయి, వాటినే లలిత కళలు అంటారు. ఈ లలిత కళలనే జయదేవుడు గీత గోవిందంలో (మూడవ శ్లోకం) విలాస కళలుగా పేర్కొన్నాడు. వీటిల్లో ప్రథమ గణ్యమైనదీ, పరమోదాత్తమైనదీ, సర్వకాల సర్వావస్థలయందు మానవుని మనుగడతో పెనవేసుకొన్న అపూర్వ కళాసృష్టి, సర్వకళల సమాహార స్వరూపంగా చెప్పబడేదే తౌర్యత్రిక కళ.

సంగీత, సాహిత్య, నాట్య కళల సమాహార స్వరూపమయిన కళను తౌర్యత్రిక కళ అంటారు. ఇటువంటి తౌర్యత్రిక కళలలో ముఖ్యమయినది "హరికథ". సాధారణంగా గాయకుడు గానంలోనూ, సాహిత్యకారుడు సాహిత్యంలోనూ, నాట్యకారుడు నాట్యంలోనూ మాత్రమే తన ప్రతిభను చూపిస్తాడు. కానీ  తౌర్యత్రిక కళగా చెప్పబడుతున్న హరికథను చెప్పేవాడు మాత్రం అభినయ కళను కూడా జతచేసి ఈ మూడిటిలోనూ (సంగీత, సాహిత్య, నాట్యాలలో) ప్రతిభను చూపించాలి. హరికథలు వేదకాలం నుండీ ఉండేవి, అగ్నివేశాది మహర్షులు సృజించగా, బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ నిత్యం హరికథా గానం చేస్తాడు. లవకుశలు ఇరువురూ హరికథా గానం చేసినట్టు రామాయణంలో కూడా ఉంది కదా! హరికథ దివ్యమయిన (దివిభవం దివ్యం - అనగా స్వర్గమున పుట్టినది అనే వ్యుత్పత్తి ఆధారంగా ఇది దివ్యం) కళ. "ఈ హరికథా ప్రక్రియ మహారాష్ట్రలో రెబ్బటిల్లి, తమిళ దేశంలో చిగిర్చి, ఆంధ్ర దేశంలో పూసి, కాసి, ఫలించింది" అని శ్రీ కడలి వీరదాసు గారు (హరికథా మహోత్సవ ప్రత్యేక సంచికలో) తెలియచేశారు.

యావదాంధ్ర వాఙ్మయములో బహుముఖ వైవిధ్యమును, వైశిష్ట్యమును కలిగిన విశాల సాహిత్య శాఖగానూ, సాహితీ ప్రక్రియలన్నింటిలోనూ పరమోత్కృష్టమైన శాఖగానూ పేరు ప్రఖ్యాతలు పొందిన యక్ష గానమే హరికథగా రూపాంతరము చెందినదని విజ్ఞుల అభిప్రాయము. హరికథా పితామహులుగా ప్రసిద్ధుడైన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన ప్రహ్లాద చరిత్ర అను హరికథావతారికలో యక్షగానాలకు హరికథలకు అభేదం చెప్పారు. అయితే, ఈ రెంటికీ ప్రదర్శన విషయంలో కొంత భేదం కనిపించినా, అంగాలు, కీర్తనలూ, తత్వనలూ అన్నీ ఒకే విధంగా వుంటాయి. మరి రెంటికీ భేదం ఎక్కడుందంటే, యక్షగానంలో బహుపాత్రలను అనేకమంది నిర్వహిస్తే, హరికథలో ఒకే వ్యక్తి బహుపాత్రలను నిర్వహిస్తాడు. అందువలననే యక్షగానము కన్నా కూడా హరికథ ఉత్కృష్టమయినది. ముల్లోకాలనూ పునీతం చేసి, జాతిని తీర్చిదిద్ది, భారతీయ సంస్కృతికి నిజమైన దర్పణంగా నిలిచి, ఆబాల గోపాలాన్నీ ఆహ్లాదపరుస్తూ, అవ్యక్త మధురానుభూతిని ప్రసాదించే మహోన్నతమయిన కళ హరికథ. హరిని కీర్తించుటే హరికథ. "అనగా బ్రహ్మము అనగా వుండునది. బ్రహ్మమును కలిగి వుండి, వినుట ద్వారా బ్రహ్మమును పరిచయం చేసేదే  కథ" అని శ్రీ తంగిరాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నిర్వచించారు. హరికథ చెప్పేవారిని కథకుడు అంటారు. భక్తి రస ప్రధాన పురాణ గాథలలో ఏదైనా ఒక అంశం తీసుకుని, గద్యములు, పద్యములు, గానము, హాస్యము, చతురత, సమయస్ఫూర్తి, మొదలైన వాటిని చొప్పించి శ్రోతలను ఆకట్టుకుంటూ ప్రవచించటమే హరికథ. 

భావంబొప్పవలెన్ ముఖాన నిసలౌ పాండిత్య మేతత్కళా
జీవంబై రససిద్ధి బొందవలె నౌచిత్యంబుపన్యాసవా
ణీవిన్యాసమునన్ ఘటిల్లవలెన్ దానేసర్వపాత్రంబులై
ప్రావీణ్యంబులన్ నటింపవలె విద్వాంసుడు సమ్యద్గతిన్   

అంటూ శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసు గారు కథకుడు బహుపాత్రలను పోషిస్తూ కథకు రక్తినీ, తుష్టినీ చేకూర్చాలని చెప్పారు. కథకుడు సందర్భాన్ని బట్టే కాకుండా సభికులను బట్టి కూడా కథాగమనం కొనసాగించాలి. కనుక ముందుగా బాగా సాధన చేసి వెళ్లి హరికథ చెప్పేసి వచ్చేస్తే అది రక్తి కట్టదు. కథకుడు ఎప్పుడూ కూడా సభికులను ఆకట్టుకొనే విధంగా వ్యాకరణ పండితులున్న సభలో వ్యాకరణ పరిజ్ఞానాన్ని, సాహిత్యజ్ఞులున్న సభలో కవితా ప్రాభవాన్ని, సంగీతజ్ఞులున్న సభలో సంగీత ప్రజ్ఞను ప్రదర్శిస్తూ, పామరులు వున్న సభలో వారిని రంజింప చేసే విధంగా పిట్ట కథలు, ఉప కథలు, హాస్యం జోడిస్తూ మూల కథకు అడ్డు రాకుండా, ప్రచార విషయానికి భంగం కలిగించకుండా సభనంతటినీ ఆకట్టుకుంటూ చెప్పగలిగినవాడే తన లక్ష్యాన్ని సాధించి, ప్రజలలో తాననుకున్న మార్పును తీసుకువచ్చి, వారికి మార్గ దర్శకుడవుతాడు. ఇంకా సూటిగా చెప్పాలంటే హరికథకుడు నవరసాలూ పోషిస్తూ, అన్ని రసాలకూ ఏకాగ్రచిత్తుడై వుండాలి. ఇన్ని చేయాలి కనుకనే హరికథ కష్టమయినా కానీ అన్ని వర్గాల వారినీ అలరిస్తుంది.

మొదట భక్తి తత్వమే ప్రాణంగా హరికథలు ఆవిర్భవించాయి. అద్వైత సిద్ధి మొదలు ఆటవిక విశ్వాసం వరకు ఏ రకంగా ప్రదర్శింపబడినా అది భక్తిగానే పరిగణించారు. వీటి వలన ఆధ్యాత్మిక ప్రభోదం కూడా జరిగేది. ఇటువంటి హరికథల వలన కథకులు మోక్షసాధన కోసం సంగీత, సాహిత్య, నాట్యాలను ఆలంబనగా చేసుకుని, వైష్ణవాన్నీ, శైవాన్నీ సమానంగా భావించి, సామాజికుల చేత కూడా భావింపచేసి సర్వమత సామరస్యాన్ని చాటేవారు. కొంతకాలం ఇటువంటి హరికథలు కేవలం హిందువులకే పరిమితమయ్యి, హైందవ సంప్రదాయాన్ని ఎక్కువగా ప్రదర్శించడం వలన హైందవ మత ప్రచారానికే ఎక్కువగా దోహదం చేస్తూ వచ్చాయి. కాలం గడిచే కొద్దీ, ఇతర మతస్థులైన క్రైస్తవులను, మహమ్మదీయులను కూడా విశేషంగా ఆకర్షించింది. ప్రజల్లో ఏ విషయాన్ని ప్రచారం చేయాలన్నా (అప్పట్లో మరి ప్రచార సాధనాలు తక్కువ కదా!) హరికథా ప్రక్రియే సరైన, శక్తివంతమైన మార్గమని గుర్తించారు. వారి మత ప్రచారానికి ఆలంబనగా "హరి" శబ్దాన్ని అడ్డుగా భావించకుండా ఒక కథా కాలక్షేపంగా వారు ఏసు ప్రభువు జీవిత చరిత్రను, మహమ్మదీయుల చరిత్రలను కూడా కథా రూపాలుగా చేసుకుని వానిని హరికథలుగా మలచుకుని ప్రచార యోగ్యంగా కూర్చుకున్నారు. రాన్రాను కాలానుగుణంగా భగవత్సంబంధిత గాథలే కాక, దేశనాయకులు, క్విట్ ఇండియా, కుటుంబ నియంత్రణ, సమాజాన్ని పీడిస్తున్న అంశాలు, మొదలయినవెన్నో ఇతివృత్తాలుగా చేసుకుని హరికథలు చెప్పటం ప్రారంభించారు. ప్రజల నుండీ ఇటువంటి కథలకు మునుపటి వాటికంటే ఆదరణ, ప్రోత్సాహం ఎక్కువగా లభించాయి.

హరికథలు చెప్పటమే కాదు, వ్రాయటమూ ఒక కళే. శ్రీ రాంపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు "కుమార సంభవము" ను, శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు గారు "అభిజ్ఞాన శాకుంతలం" ను, చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు "మాళవికాగ్ని మిత్రమ్" ను హరికథలుగా రచించారు. వీటి ప్రదర్శనల ద్వారా మన దేశానికే పరిమితమయిన హరికథలను విదేశీయులు సైతం అబ్బురపడేలా చేశారు మన హరికథకులు. శ్రీ అమ్ముల విశ్వనాధం గారు మలేషియాలో, శ్రీ వీరగంధం వెంకట సుబ్బారావు భాగవతార్ గారు అమెరికాలో, శ్రీ బోడావుల సీతారామయ్య భాగవతార్ గారు జర్మనీ, పారిస్, లండన్ వంటి దేశాలలో పలు ప్రదర్శనలిచ్చి, వాటి ద్వారా వారిలో భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పరచడమే కాక, భారతీయ కళల పట్ల వారికి ఉన్నతమైన అభిప్రాయాన్ని కూడా కలిగించారు. ఇంతటి మహోన్నతమయిన హరికథకు పితామహులైన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి గురించి ఒక్క మాటలో (తాతారావు గారి పలుకుల్లో) చెప్పాలంటే: 

హరికథా ప్రక్రియకు ఆద్యుండు కవితలో
కాళిదాస పోతనలకు సాటి
ఆదిభట్ట బుధుడు అన్నిటన్ మొనగాడు
ఆట పాట మాట లందు మేటి
ఇంతటి అపూర్వమయిన కళ అంతరించిపోకుండా ఎంతో మంది నేర్చుకోవాలనే సదుద్దేశ్యంతో హరికథా శిక్షణకు ప్రత్యేకంగా ప్రప్రధమంగా 10-6-1973న కపిలేశ్వరపురం (రాజమహేంద్రవరానికి 36కిలోమీటర్ల దూరం), తూర్పు గోదావరి జిల్లాలో "హరికథా పాఠశాల"ను శ్రీ యస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు (కపిలేశ్వరపురం జమీందారు)గారు స్థాపించి, ప్రధానాచార్యులుగా శ్రీ కడలి వీరదాసు (శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి శిష్యుడు) గారిని నియమించారు. మన జాతి కళలు కాపాడుకోవలెనన్న ఆశయంతో ప్రభుత్వం వారు ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్ధులలో కొంతమందిని ఎంపిక చేసి స్కాలర్షిప్ కూడా ఇస్తారు. ఈ పాఠశాలలో అయిదు సంవత్సరాల శిక్షణాకాలం పూర్తయిన తరువాత పరీక్షలను నిర్వహించి, "హరికథా ప్రవీణ"  అను ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, వారిని ప్రదర్శనకు యోగ్యులుగా నిర్ణయిస్తుంది. ఈ సంస్థ నుండి తయారైన బాలబాలికలు తెలుగులో మాత్రమే గాక సంస్కృతంలో కూడా హరికథలు చెబుతూ ఎన్నో సత్కారాలు పొందారు. వారిలో ప్రముఖులు దాలిపర్తి ఉమామహేశ్వరి గారు. ఉజ్జయినిలో  కాళిదాస అకాడమీ వారు నిర్వహించే అంతర్జాతీయ సెమినార్ లో ఈవిడిచ్చిన ప్రదర్శనల ద్వారా హరికథా ప్రక్రియకు ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు లభించాయి.

మన రాష్ట్రంలో జానపద కళారూపాలుగా చెప్పబడుతున్న హరికథలు, బుఱ్ఱకథలు, మొదలైన వాటిని ప్రోత్సహించాలని తెలుగు విశ్వవిద్యాలయం వారు హరికథా రచనా పోటీలు, హరికథా ప్రవచనా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి కులపతి గారైన ఆచార్య శ్రీ దోణప్ప గారు రచించిన "తెలుగు హరికథా సర్వస్వం" అనే పుస్తకాన్ని (హరికథకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ పొందుపరుస్తూ) అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. డా. డి. శారద గారు రచించిన "హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనాలు" (ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండీ పి.హెచ్.డి. పొందిన గ్రంధం) అనే పరిశోధనా గ్రంధంలో హరికథల వలన దేశానికి జరిగే మేలు ఎలాంటిదో కూడా బాగా వివరించారు. ఈ రెండు పుస్తకాలనూ క్షుణ్ణంగా చదవటం వలన హరికథా ప్రక్రియల ప్రాచీన స్వరూపం నుండీ ఆధునిక స్వరూపం దాకా ప్రతీ విషయమూ వివరంగా తెలుస్తుంది.

కొన్ని చక్కని హరికథలను ఇక్కడ వినవచ్చును. పాత చలన చిత్రాలలో హరికథలు ఎక్కువగానే కని, వినిపించేవి కానీ ఈ మధ్యన వచ్చిన చిత్రాలలో దేవస్థానం అనే చలనచిత్రంలో చాలా కాలం తరువాత దండిభట్ల నారాయణమూర్తి గారు, స్వర వీణాపాణి గారు రచించిన హరికథలను (సామాజిక) వినిపించి మరచిపోతున్న హరికథా ప్రక్రియను గుర్తుచేశారు.

One must die as an artist to be reborn as a Yogi అన్న అరవిందుని సూక్తి కళాకారులకున్న ఔన్నత్యాన్ని చాటుతోంది. దీనిని ఎప్పుడూ జ్ఞప్తిలో వుంచుకుని, ఇటువంటి కళలను కాపాడుకుంటూ, తరువాతి తరాలకు పంచవలసిన (కనీసం పరిచయం చేయవలసిన) బాధ్యత మనందరి మీదా వుందని భావిస్తున్నాను. హరికథకు పూర్వ వైభవం దక్కాలని మనసారా కోరుకుంటూ...............