Monday, July 09, 2012

గుర్తుకొస్తున్నాయి...


అలా ముఖపుస్తకం (ఫేస్ బుక్) తెరిచానా, చూస్తే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్, ఒక మెస్సేజ్ ఉన్నాయి. సరే మెస్సేజ్ ముందు చూద్దామని చూశానా ఆశ్చర్యం! నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. నిజమా? భ్రమా? తెలియలేదు. మళ్ళీ ఒకసారి కళ్ళు నులుముకుని చూశాను. నిజమే! ఎంత ఆనందమో! మా సంస్కృతం మాష్టారు "ఏరా అమ్మడూ బాగున్నావా తల్లీ? గుర్తున్నానా?" అని పంపారు. డిగ్రీ తరువాత వాళ్ళ ఊరు వెళ్ళి ఆయనని కలిసి రావటమే తప్ప ఎన్నడూ ఫోనులో కాని, మెయిల్ లో కాని మాట్లాడింది లేదు. ఎప్పుడూ దద్దమ్మ, రాక్షసి, దెయ్యం అని పిలిచే ఆయన ఇలా నన్ను సంబోధించటం చూసి ఒక్కక్షణం మనసులోని ఆనందమంతా కళ్ళను దాటి చెక్కిలి మీదకి వచ్చేసింది. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా ఆయన పంపినదే. వెంటనే కన్ఫర్మ్ నొక్కేసి, ఆలోచనల్లోకి వెళ్ళిపోయా.

మాష్టారితో పరిచయం డిగ్రీలో జరిగింది. క్లాసుకి వచ్చిన మొదటి రోజే, ఈ క్రింది శ్లోకం (నాకింకా గుర్తు) బోర్డు మీద వ్రాసి ఎవరయినా వివరించగలరా అన్నారు.

పార్థః కర్ణవధాయ త చ్ఛరగణం కృద్ధో రణే సందధౌ
త స్యార్ధేన నివార్య త చ్ఛరగణం మూలై శ్చతుర్భిర్హయాన్
శల్యం షడ్భి ర థేషుభి స్త్రిభి రపి చ్ఛత్రం ధ్వజం కార్ముకం
చిచ్ఛే దాస్య శిర శ్శరేణ కతి తే యా వర్జున స్సందధౌ?
వెంటనే నేను వంద సార్ అన్నాను.
మా: ఎవరా బడుద్ధాయ్?

నేను: నేనే సార్ (లేచి నిలబడుతూ)
మా: నేను శ్లోకాన్ని వివరించమంటే ఏకంగా లెక్క చెప్పేశావే? మంచిది. ఆ మాత్రం చురుకుదనం ఉండాలి. ముక్కున పెడుతున్నారో, మనసు పెడుతున్నారో చూద్దామని సిలబస్లో లేనిది అడిగా. సంతోషం. ఒక్కరన్నా భాషకి విలువిస్తున్నారు. ఇంతకీ ఈ శ్లోకాన్ని బట్టీ నీకేం అర్థమయ్యింది?
నేను: ఇప్పటిలా ఆ కాలంలో భాషలు (ఇంగ్లీష్, సంస్కృతం, తెలుగు) పరీక్షల ముందు చదివితే, మెయిన్ సబ్జెక్ట్స్ కూడా పాస్ అవ్వము అని.
మా: (నవ్వుతూ) రాక్షసి. అది సరే. ముందు శ్లోకానికి అర్థం చెప్పు?
నేను: శ్లోకాన్ని బట్టీ ఇది కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని వధకు సంబంధించి అర్జునికీ, కర్ణునికీ మధ్యన నడిచిన ఘట్టం అని తెలుస్తోంది. అర్జునుడు వేసిన మొత్తం బాణాలలో సగం బాణాలు కర్ణుడు వేసే బాణాలని ఎదుర్కోవటానికి  పట్టాయి (అంటే ఇక్కడ మొత్తం బాణాలు x అనుకుంటే కర్ణుడి బాణాలను ఎదుర్కోవటానికి x/2 పట్టాయి). అలానే అర్జునుడు మొత్తం వేసిన బాణాల వర్గమూలానికి నాలుగురెట్ల బాణాలు కర్ణుని గుఱ్ఱాలను ఎదుర్కోవటానికి పట్టాయి (అంటే
4x). కర్ణుని రథసారధి అయినటువంటి శల్యుడిని కొట్టడానికి ఆరు, రథం మీది జెండా, కర్ణుని గొడుగు, విల్లుని కొట్టడానికి ఒక్కోదానికీ ఒక్కోటి (6+1+1+1) చొప్పున బాణాలు పట్టాయి. చివరిగా కర్ణుని తల నరకడానికి ఒక బాణం పడితే మొత్తం అర్జునుడు వాడిన బాణాలు ఎన్ని?
మా: భేష్! దీనిని బట్టీ నీకర్థమయిన నీతి ఏమిటి?
నేను: కర్ణుడు ఎంత గొప్పవాడయినా కానీ అధర్మంతో (కౌరవులతో) చేరటం వలన నాశనమయ్యాడు.
మా: నవ్వి, సంతోషం! కానీ పిల్లలూ (అందరినీ ఉద్దేశ్యించి) మన పురాణాలన్నీ కూడా చాలా గొప్పవి. అవి చూసే దృష్టిని బట్టీ ఒకే శ్లోకం ఒక్కో విధంగా అర్థమవుతుంది. తాత్విక దృష్టితో చూస్తే అలా, మీ మీ సబ్జెక్టు పరంగా చూస్తే అలా అర్థమవుతాయి. ఆలోచించి చూడండి ఎప్పుడయినా ఖాళీగా ఉన్నప్పుడు

అని ముగించేసి వెళిపోయారు. అలా ఆయనతో నా మొదటి పరిచయం. ఎంత అల్లరి చేసినా పల్లెత్తు మాట అనకపోగా ఎంతో అభిమానంగా మాట్లాడేవారు. ఎందుకో ఆ రోజులన్నీ కళ్ళ ముందు మెదిలాయి. ఆ రోజు నుండీ ఈ రోజు దాకా ఆయన చెప్పిన ఆలోచన మాత్రం చేయనే లేదు. ఇవాళ వెంటనే ఆలోచిస్తే తప్పేముంది? అనిపించి అదే శ్లోకంతో మొదలు పెట్టాను.

మొదటగా, అర్థాన్నే మరింత లోతుగా ఆలోచించాను. అసలు కర్ణుడు వేసే బాణాలను ఆపడానికి అర్జునుడంతటి ప్రతిభావంతుడికే యాభై బాణాలు పట్టాయి అంటే అబ్బో! కర్ణుడు ఎంత గొప్ప విలుకాడో కదా! అనిపించింది. అలానే గుఱ్ఱాలకి నలభై బాణాలు వాడవలసి వచ్చింది అంటే వాటికి బాణాలను తప్పించుకునే చాకచక్యమూ, నేర్పరితనమూ తెలుస్తోంది. తరువాత రథ సారధి అయినటువంటి శల్యుడు కేవలం ఆరే ఆరు బాణాలకి లొంగిపోయాడు అంటే అతని పాండవ పక్షపాత బుద్ధి తెలుస్తుంది. కేవలం మూడే బాణాల్లో గొడుగు, జెండా, విల్లు పడిపోవటం కర్ణుని నిస్సహాయతను, అసమర్ధతను తెలియచేస్తోంది. ఒకే ఒక్క బాణంతో కర్ణుని తల తెగి పడటం భారతంలోని కథకు బలం చేకూరుస్తోంది. ఎందుకంటే భారతం ప్రకారం కర్ణుడు తల తెగి పడినవాడే, అలానే ఆఖరి నిమిషంలో నిస్సహాయత కూడా శాపమే కదా!

దీనినే బాగా పరికించి చూస్తే, రాజనీతి కనిపించింది. యుద్ధంలో ముందుగా అవతలి వ్యక్తి వేసే బాణాలను ఎదుర్కోవాలనీ, తరువాత గుఱ్ఱాలని ఎదుర్కోవటం వలన అతను ఎక్కడికీ వెళ్ళలేడనీ, అప్పుడింక పారిపోకుండా రథ సారధిని ఎదుర్కొని ఇతని (మీ రాజు) పని అయిపోయింది అని చెప్పడానికి సూచికగా గొడుగునీ, జండానీ, విల్లునీ కొట్టి, ఇహ శాశ్వతంగా రాజు చిక్కినట్టే కనుక అప్పుడు ఒకే దెబ్బతో కన్నుమూసేలా వధించాలని తెలుస్తుంది. మరి ఇది రాజనీతి రహస్యమే కదా!

ఇంకా లోతుగా ఆలోచించి, ఆధ్యాత్మిక అన్వయం ప్రయత్నించాను. కర్ణుడు వేసిన బాణాలు విషయ వాంఛలు అనుకుందాం. వాటిని ఎదుర్కోవటం చాలా కష్టమయిన పని (అందుకే యాభై బాణాలు పట్టి ఉంటాయి). ఎప్పుడయితే వీటికి దూరంగా ఉంటామో అప్పుడే లక్ష్య సాధన చేకూరుతుంది. బాహ్య భోగాలకి దూరంగా ఉన్నాక ముఖ్యమయినది ఇంద్రియ నిగ్రహణ. గుఱ్ఱాలు ఇంద్రియాలకి ప్రతీకలు కదా. ఈ ప్రకారంగానే అర్జునుడు ముందుగా భోగాలని ఎదుర్కొని ఇంద్రియాలని నియంత్రించాడు (ఇది కూడా కష్టమయిన పనే). ఎప్పుడయితే ఇంద్రియ నిగ్రహణ జరిగిందో, బుద్ధి వశమవుతుంది. ఇక్కడ బుద్ధి అంటే రథ సారధి. ఇవన్నీ నియంత్రించగా మిగిలినవి మనస్సు, చిత్తము, అహంకారము. ఈ మూడూ వరుసగా గొడుగు, జెండా, విల్లు అనమాట. మొత్తం అంతా వశం అయిన తరువాత మిగిలినది జీవుడు (కర్ణుడు). అర్జునుడు ఆత్మ అనుకుంటే, జీవుడు ఆత్మలో చేరాడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవే మోక్షానికి అర్హుడు కదా! 

తరువాత అందులో అడిగిన ప్రశ్న. అది గణితానికి సంబంధించినది. ఈ శ్లోకం భాస్కరాచార్యుడు రచించిన లీలావతీ గణితం లోనిది. గణితంలో కాస్తో కూస్తో ప్రవేశం ఉన్న వారెవరికీ కూడా ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన వ్రాసిన ఈ ఒక్క గ్రంధం మీదే ఎన్నో పరిశోధనలు జరిగాయి. శ్లోకంలో వచ్చిన అర్థాన్ని ఒక ఈక్వేషన్ రూపంలో మార్చుకుని, తద్వారా లెక్కలను ఎలా చెయ్యాలో తెలిపారు. ప్రస్తుత శ్లోకాన్ని తీసుకుంటే అర్థాన్ని బట్టీ మనకు వచ్చేది x = x/2 + 4x +10. దీనిని ఆధారంగా చేసుకుని x విలువ సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం గణిత విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుంది.

ఇలా రక రకాలుగా ఆలోచించిన తరువాత ఈ శ్లోకాన్ని సైన్సు పరంగా కూడా ఆలోచిద్దాం అనిపించి ఆ దిశగా శోధించా. రోగ నిరోధక శక్తికి కాస్త అన్వయం కుదిరింది. మన శరీరంలోని కణాలు మొదటగా బయటనుంచి వచ్చే ప్రత్యర్ధులని (బాక్టీరియా, వైరస్, మొ.) ఎదుర్కొని, తరువాత వాని రాకకు ఆధారమయిన వాటిని నిర్జీవం చేసి అప్పుడు చంపేస్తాయి కదా! 

ఇవే కాక, ఇచ్చినది ఒక శ్లోకం కనుక అందులో ఎన్నో వైవిధ్యమయిన సంధులు, సమాసాలు, వ్యాకరణ విశేషాలు కూడా ఉండి ఉండవచ్చు. నాకు అంత బాగా తెలియదు. నా పీత బుఱ్ఱకి ఇతర అన్వయాలేమీ తోచటం లేదు. మీరు మీ సంబంధిత విభాగాలలో ఆలోచించి, మీకు తోచిన అన్వయాలను కూడా అందిస్తే ఇది సంపూర్ణమవుతుంది.