Tuesday, August 21, 2012

"మా" రుచులుశీర్షిక చూసి నేను కూడా ఏదో తయారీ విధానం చెప్పబోతున్నాను అని అనుకుంటున్నారా? అలా తొందరపడి నన్ను అపార్థం చేసేసుకుంటే ఎలా? చిన్నప్పుడు ఎవరన్నా నీకు వంట చేయటం వచ్చా అమ్మా? అని అడిగితే ఓహ్! నాకు ఉప్పు, మంచినీళ్ళు, పెరుగు వండటం వచ్చు అని చెప్పేదానిని. చూశారా? చిన్నతనంలోనే ఎన్ని వండటం నేర్చేసుకున్నానో!!! నాకు తెలిసిన వంటలన్నీ చెప్పేస్తే మీరంతా కూడా నేర్చేసుకుని మీకు వచ్చినవి మర్చిపోతారు కనుక ప్రస్తుతానికి నేను చెప్పబోయే వంటకాలు ఎలా ఉంటాయి? ఎక్కడ దొరుకుతాయో మాత్రం పరిచయం చేస్తాను.

కోనసీమ అనగానే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చే వంటలు కొన్ని ఉంటాయి. అవే ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజా, కాకినాడ కోటయ్య కాజా, మామిడి తాండ్ర, గంగరాజు పాలకోవా, పనసపొట్టు కూర, పులసలు (పుస్తెలు అమ్ముకుని అయినా పులస తినమంటారు), ఇలా ఎన్నో ఎన్నెన్నో. అయితే ఇవి కొనసీమకే పరిమితం కాకుండా ప్రస్తుతం ఇంచుమించు అన్నీ చోట్లా దొరుకుతున్నాయని నా అభిప్రాయం. వాటిని రుచి చూడాలనుకున్న వాళ్ళు ఎక్కడయినా కొనుక్కోవచ్చును. ఈ టపాలో అంతగా గుర్తింపు లేకపోయినా కోనసీమలో మాత్రం ప్రాముఖ్యతని సంపాదించుకున్న వాటిల్లో నాకు తెలిసిన కొన్ని
వంటలని మీ ముందుకి తెస్తాను.

పూర్వ కాలం నుండీ కోనసీమ అనగానే గుర్తు వచ్చేవి తరవాణీ కుండలు. నిజమే! వేసవి వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట్లోనూ ఈ కుండలు ఉండి తీరాల్సిందే. వార్చిన గంజి నీళ్ళు కుండలో పోసి, మొదటి సారి మాత్రం మజ్జిగ వేసి, నీళ్ళు, ఉప్పు వేసి దబ్బాకు వేసి అన్నం అందులో ఉంచి తరువాతి రోజు దానిని తినేవారు. ఎండ గాడ్పు కొట్టకుండా ఈ తరవాణీ నీళ్ళు తాగితే చాలా చల్లగా ఉంటుంది. 

కాయావకాయ
వేసవి అనగానే అందరూ ఎదురు చూసేది కొత్త ఊరగాయల కోసం. అయితే మా కోనసీమలో మాత్రం ఎక్కువగా ఉండేది కాయావకాయ. కాయలతో కాక పళ్ళతో పెడతారా ఏమిటి? అనుకోకండి. కాయావకాయ అంటే కాయని పూర్తిగా ముక్కలు చేయకుండా ఉన్న పళాన్న పెట్టడం. మాంచి మామిడికాయలు తీసుకుని గుత్తి వంకాయ కూరకి కోసినట్టు మామిడికాయని నాలుగు పక్కల కోసి, జీడి తీసేసి, ఆవపిండి బాగా కుక్కి పెడతారు.  దానిని బాగా ఊరపెట్టి మూడవ రోజున నూనేసి నిలువ ఉంచుతారు. ఆ రోజుల్లో మామిడికాయ మొత్తం ఒక్కరే తినేవారు. తరువాత ఒక కాయ తీస్తే పెద్ద కుటుంబాల్లో అదే అందరికీ సరిపోతోంది. ఎన్నాళ్ళయినా ఆవ ఘాటు తగ్గకుండా భలే రుచిగా ఉంటుందిలెండి.

తరవాణి కుండ అన్నము - ఈ కాయావకాయ మంచి జోడీ.


కొట్టెక్క బుట్టలు
ఇడ్డెన్లు లేదా ఇడ్లీలు అందరూ చేసుకున్నా కోనసీమలో వాటిని ప్రత్యేకంగా చేస్తారు. మామూలు ఇడ్లీలలాగా కాకుండా కొట్టెక్క బుట్టలు లేదా వాసినపోలె రూపాలలో చేస్తారు. ఈ కొట్టెక్క బుట్టలనే పొట్టెక్కలు అని కూడా అంటూ ఉంటారు. పనస ఆకులని బుట్టలుగా చేసి అందులో ఇడ్లీ పిండి వేసి ఆకుతో సహా ఆవిరిలో ఉడికిస్తారు. వీటిని అంబాజీపేట ప్రాంతంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. పోలాల అమావాస్యకి ఇవి ప్రత్యేకంగా చేసి ముత్తయిదువులకి వాయినాలు ఇస్తారు. వేడి వేడిగా తింటే రుచి భలే ఉంటుంది. 
వాసినపోలె
తరువాత వాసినపోలె. వాటిని కొంతమంది ఆవిరి కుడుములు అని కూడా అంటారు. ఇడ్లీ పిండిని గిన్నెకి కట్టిన గుడ్డ లేదా బట్ట మీద వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికిస్తారు. బట్ట వాసన పిండికంటి ఒకరకమయిన వాసనతో ఉంటుంది కనుక దాని పేరు వాసినపోలె అనమాట! ఇది ఎక్కువగా విశ్వేశ్వరాయపురం ప్రాంతంలో చేస్తారు.    

బలుసాకు
బలుసు లేని తద్దినం, బులుసు లేని యజ్ఞం ఉండదని నానుడి. మిగతా ప్రాంతాల వాళ్ళు అక్కడక్కడా చేసుకున్నా కోనసీమలో ప్రతీ ఇంట్లో తద్దినానికి ఉండి తీరేది బలుసాకు. పితృ దేవతలకి అదంటే చాలా ఇష్టమట. అందుకనే తద్దినాలకి బలుసాకు పచ్చడి తప్పనిసరిగా ఉండి తీరాలి, ఒకవేళ పచ్చడి చేయలేకపోతే కనీసం చారులో అన్నా శాస్త్రానికి ఒకాకు వేస్తారు.
బొంగు(లో) చికెన్
బొంగు(లో) చికెన్ అనేది రంపచోడవరం ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడ వెదురు బొంగులలో దీనిని చేస్తారు కనుక ఆ పేరు వచ్చింది.  ఉప్పు, పసుపు, కారం, మసాలాలు బాగా దట్టించిన పచ్చి కోడి మాంసాన్ని పచ్చటి వెదురు బొంగులలో పెట్టి ఆకులతో అంచులు కట్టేసి నిప్పుల మీద కాలుస్తారు. బొంగులలో ఉడికిన కోడి మాంసం రుచిని ఎంత వర్ణించినా తక్కువే అని జనాల అభిప్రాయం. 

గరాజు
ఇహ, నాకెంతో ఇష్టమయిన దాని గురించి చెప్పబోతున్నాను. అదే గరాజు. రాజులకే రాజు రారాజయితే రారాజులకే రాజు మా గరాజు. సాధారణంగా తీపి తింటే నాలిక మీద ఆ తీపి అలానే ఉంటుంది అంటారు కానీ గరాజులకి మాత్రం వెఱ్ఱి తీపి ఉండదు. వాటిని తయారు చేసే ఏకైక చోటు నగరం. ఆ చుట్టుప్రక్కల ఊళ్ళల్లో కూడా దొరకవు. కేవలం నగరంలో మాత్రమే దొరికే అసలు సిసలయిన కోనసీమ స్వీటు గరాజు. వీటిని చూస్తే నాకు వెంటనే గుర్తుకొచ్చేది పిచ్చుక గూడు.  గూడు కట్టడానికి పిచ్చుకలు గడ్డిని తెచ్చి ఒక గోడలాగా ఎలా తయారు చేస్తాయో వీటిని కూడా అలానే బియ్యపు పిండితో చేసే ఖారప్పూస లాంటి దానితో చేస్తారు. అందుకే నాలాంటి వాళ్ళు చాలా మంది వీటిని పిచ్చుక గూళ్ళు అని ముద్దుగా పిలుచుకుంటారు. కావాలంటే మీరే చూసి చెప్పండి అలా ఉన్నాయో లేదో!! (నాకు గరాజు చిత్రం కావాలి అనగానే నగరం వెళ్ళి వీటిని కొని మరీ ఈ చిత్రాన్ని పంపిన నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు)
 
మొక్క గుడ్లు
మా కోనసీమంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేవి మొక్క గుడ్లు. మొక్కలకి గుడ్లు ఉండటం ఏమిటి అనుకుంటున్నారా??? అదే అండీ కొబ్బరి పువ్వునే (కొబ్బరి కాయ లోపల వచ్చే పువ్వు) అలా పిలుచుకుంటారు. మా రాజమండ్రీలో కూడా దేవీ చౌక్ శివాలయం దగ్గర అమ్ముతూ ఉంటారు. పల్లెటూర్లల్లో అయితే చెప్పనే అక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్ని. మా చుట్టాల ఇళ్ళకి వెళితే తోటల్లోంచి బస్తాలతో తెచ్చి ఉంచుతారు మా అందరికోసం. వాటిని తింటే మాత్రం ఒక పువ్వుతో ఎవ్వరూ ఆపలేరు. 
 
నేనెంతో అభిమానించే ఒక బ్లాగరు ఈ మధ్యన నాకు "గోదావరి కథలు" అనే పుస్తకం పంపారు. అవి చదువుతున్న కొద్దీ ఇంటి మీద, ఊరి మీద బెంగ ఎక్కువయిపోతోంది. అదే సమయములో దొంతరలోంచి ఎన్నో జ్ఞాపకాలు బయటకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉండే ఎవరికయినా గుర్తొచ్చేది అమ్మ చేతి వంట. అంతే ఇహ వెంటనే కోనసీమ రుచులన్నిటికీ నా
అక్షరాల తాలింపు వేసేసి ఇలా మీ ముందుకి కొన్ని తెచ్చాను. ప్రస్తుతానికి వీటిల్లో ఏవి ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తినాలనుంది చెప్పండి? మీరు రుచి చూసే పూచీ నాది. 

Thursday, August 02, 2012

జ్యోతినేను వ్రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో...