Saturday, October 29, 2011

నాగుల చవితి


యోగీశ్వరో మహాశయనా కార్తికేయోగ్ని నందనః |
స్కందః కుమారః సేనాని స్వామీ శంకర సంభవః ||

గాంగేయ స్థామ్ర చూడశ్చ బ్రహ్మచారి షికిధ్వజః |
తారకారి ఉమాపుత్ర క్రౌంచారీశ్చ షడాననః ||

శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిద్ధః సారస్వతౌ గుహః |

సనత్ కుమారౌ భగవాన్ భోగ మోక్ష ఫలప్రదః ||

సర జన్మ గణాధీశా పూర్వజో ముక్తి మార్గకృత్ |
సర్వాగమ ప్రణీతాచ వాంచితార్ధ ప్రదర్శినః ||

అష్ట వింశతి నామాని మదీయానీతి యః పఠేత్ |
ప్రత్యుషే శ్రద్ధయా యుక్తో మూకో వాచ పతిర్భవేత్ ||

మహామంత్ర మయానీతి మామనామాను కీర్తనం |
మహా ప్రజ్ఞా మవాప్నోతి నాత్ర కార్య విచారణా  ||

అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు! మళ్ళీ వచ్చిందేంటిరా బాబూ అనుకుంటున్నారా? మొన్న దీపావళికి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అనుకున్నాం కదా! నాగుల చవితి వచ్చింది అందుకే నేను కూడా వచ్చా!

వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి. భూమి అంతర్భాగాలలో ఉంటూ భూమిని నాశనం చేసే క్రిముల్ని, పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి. అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి మనకి తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి, ఏ రకమయినటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాము. 

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ |
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా ||

అంటూ పుట్టలో పాలు పోసి పడగ త్రొక్కితే పారిపో, నడుము త్రొక్కితే నావాడనుకో, తోక త్రొక్కితే తొలగిపో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ చీకటా వాకిటా తిరుగుతూ ఉంటాము నీ బిడ్డలనుకుని మమ్మల్ని కాపాడు తండ్రీ అని దణ్ణం పెట్టుకుని, నూకని ఆ పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకుని మూకలు మాకివ్వు తండ్రీ అని చల్లి పుట్టమన్ను చెవులకి పెట్టుకుంటాము. మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండటానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజన్నా మనసారా తలుచుకుని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వాస్తవానికి పాములు పాలు త్రాగుతాయా అన్నది చాలా మందికి సందేహమే! పాములు సరీసృపాలు. వీటికి బాగా దాహం వేస్తే దప్పిక తీర్చుకోడానికి పాలే కాదు మనం కోక్, పెప్సి లాంటివి పట్టించినా త్రాగుతాయి. పాలు ఎక్కువగా త్రాగితే వాటి ప్రాణానికే ముప్పు. ఇది పుట్టలో పాల కథ.

మానవ శరీరం పంచభూతాలతో తయారయినదే! అలానే మన శరీరాన్ని ఒక పుట్ట లేదా వల్మీకముతో పోల్చుకుంటే అందులో ఉండే పామే మన వెన్నుముక (వెన్ను పాము) క్రింద ఉండే కుండలినీ శక్తి (అథో కుండలిని). యోగశాస్త్రం ప్రకారం మనకి మూలాధార చక్రంలో ఉండే కుండలినీ శక్తి నిదురించే పాములా ఉంటుందని చెప్తారు. ఆ విధంగా ఈ పాము నిదురిస్తున్నా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విషాన్ని క్రక్కుతూ మనల్ని విషపూరితులని చేస్తుంది. ఆ ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఆ పాము తృప్తి చెందేలా పాలు పోసి మనలో ఉన్న ఆ పాము విషాన్ని క్రక్కకుండా మంచిగా ఉండేలా చేస్తాము. అంటే విషనాగుని దైవ నాగు కింద మారుస్తాము. అప్పుడు మనిషిలోని విషం నశించి శేషతల్పమై మనలోని విష్ణువు సేద తీరుతాడు. ఇది పొట్టలో పాల గురించి.

అదండీ చక్కగా పుట్టలోను, పోట్టలోను పాలు పోసి ఎంచక్కగా ఈ పండగ చేసుకోండి! మీరు పాలు త్రాగుతూ ఉండండి నేను మళ్ళీ వస్తా!

Thursday, October 27, 2011

భగిని హస్త భోజనంవచ్చేశా నేనొచ్చేశా నేనొచ్చేశానుగా! అయితే ఏంటి అంటారా? మీరు మరీ అలా అడిగేస్తే ఏం చెప్పమంటారు? మొన్న దీపావళి గురించి వ్రాసినప్పుడు అయిదవ రోజు అయిన భగిని హస్త భోజనం గురించి కొంచెం వివరంగా ఆ రోజు టపాలో చెప్తా అని చెప్పా కదా అందుకే ఈ టపా!

భగిని హస్త భోజనం అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం. ఎందుకు చేయాలిట అని అంటారా? వస్తున్నా అక్కడికే వస్తున్నా! సూర్యభగవానునికి ఉన్న సంతానాలలో యమునా నది యముడికి (యమధర్మరాజుకి) చెల్లెలు. వీళ్ళిద్దరూ కవల పిల్లలు అని కూడా అంటూ ఉంటారు! చెల్లయిన యమునా నదికి అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఆవిడ ఎప్పుడూ అన్నగారిని ఆమె ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని కోరేది. చెల్లెలి మాటని కాదనలేక చిత్రగుప్తునితో, తన పరివారంతో సహా యమలోకాన్ని, తన పనులను వదిలేసి భూలోకం వస్తాడు యముడు. అలా వచ్చిన రోజే ఈ కార్తీక శుద్ధ విదియ. అందువలననే దీనిని యమ ద్వితీయ అని కూడా సంబోధిస్తారు. సరే అలా వచ్చిన అన్న గారిని చూసి యమున ఎంతో సంతోషించి వాళ్ళందరికీ అతిధి సత్కారాలు చేసి, ఎంతో ప్రేమాభిమానాలతో వంట చేసి అందరికీ వడ్డించి విందుభోజనం పెట్టిందిట. ఆమె ఆప్యాయత, అనురాగాలకి మురిసిపోయిన యముడు ఒక వరం కోరుకోమన్నాడుట. అప్పుడు యమున ప్రతీ ఏడాది ఈ రోజు (అనగా కార్తీక శుద్ధ విదియ) తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట ఆరగించే అన్నదమ్ములకు అపమృత్యు భయం, నరకలోకప్రాప్తి లేకుండా ఉండే గొప్ప వరాన్ని అనుగ్రహించమని కోరిందిట. సొంత అక్కాచెల్లెళ్లు లేకపోతే వరస వాళ్ళ ఇంట్లోనయినా భోజనం చేయాలి. ఆ రోజు నుండి ప్రతి ఏటా ఆనాడు యముడు తన చెల్లెలి ఇంటికి వచ్చి తన చేతివంట తిని వెళతానని ఆమెకు మాట ఇచ్చాడు. లోకంలో ఇదే రకమైన ఆచారాన్ని పాటించే మగవారిని ఎన్నడూ అకాల మృత్యువు దరిచేరదని, నరకలోకభయం ఉండదని హామీ ఇచ్చాడు. అంతేకాదు, ఆరోజు ఏ స్త్రీ అయితే తన సోదరులను పిలిచి అన్నంపెట్టి ఆదరిస్తుందో  ఆమె జీవితాంతం సుమంగళిగా జీవిస్తుందని, భోగభాగ్యాలతో తులతూగుతుందని యముడు వరం ప్రసాదించాడు. కనుక అప్పటినుండి మనం ప్రతీ సంవత్సరం దీనిని జరుపుకుంటున్నామనమాట!

ఈ రోజున యమధర్మరాజు భూమి మీద ఉండి యమునా నది వద్దకి భోజనానికి వెళ్తాడు కనుక ప్రతీ మగవారు కూడా ఈ ఒక్క రోజు మాత్రం తమ భార్య లేదా తల్లి చేతి వంట కన్నా కూడా సోదరి చేతి వంట తినడానికి మక్కువ చూపిస్తారు. సరే ఇంత చెప్తున్నావుగా ఇంతకీ నువ్వు పెట్టావా? అని పుసుక్కున అడిగేస్తారేమో! అది కూడా చెప్తా. నాకు తోడ పుట్టిన వాళ్ళెవరూ లేకపోయినా ఎప్పుడూ నేను ఒంటరి దానిని అనే ఆలోచన లేకుండా చూసుకున్న అందరికీ నా కృతజ్ఞతలు. ఎంత మంది ఉన్నా కానీ నాకు మాత్రం కార్తీక్ అంటే చాలా ఇష్టం. తోడ పుట్టినవాడు అంటే మనకి తోడుగా ఉండటానికి మనతో పుట్టినవాడు అనేదే సరయిన అర్ధమే అయితే వాడు నా తోడ పుట్టినవాడే. పేరుకి మా పిన్ని కొడుకయినా కానీ మేమిద్దరం ఒకే రోజు పుట్టాం, ఒకే రోజు భారసాల, ఒకే రోజు అన్నప్రాసన, ఒకే రోజు అక్షరాభ్యాసం అలా ఏదయినా అన్నీ ఒకే రోజు చేసుకున్నాం. మా ఇద్దరికీ కేవలం ఎనిమిది గంటలే తేడా. చిన్నప్పుడు ఎవరయినా నీకు తోబుట్టువులు ఎవరూ లేరా అని అడిగితే మా కార్తీక్ ఉన్నాడుగా అనే దానినే తప్ప పిన్ని కొడుకుని అలా చెప్పకూడదు (ట) అని నాకు అప్పటికి తెలియదు. ఇప్పుడు తెలిసినా నేను ఒప్పుకోను.

మేము కలిసేది ఏడాదికి ఒక్కసారే అయినా కలిసినప్పటి జ్ఞాపకాలు మళ్ళీ కలిసే దాకా అలానే కదలాడుతూ ఉండేవి. ఈ మధ్యలో ఉత్తరాలు కూడా వ్రాసుకునేవాళ్ళం. కానీ దానికి తపాలా వాళ్ళు అవసరం లేదు మాకు. మా బంధువులలో ఎవరు మా ఊరినించి ఆ ఊరు వెళ్ళినా లేదా అక్కడనించి ఇక్కడకి వచ్చినా తప్పకుండా లేఖలు ఉండేవి మా మధ్య. లేఖలతో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్న బహుమతులు కూడా. కొన్న వాటిని పంపడం కన్నా నేను నా చేత్తో తయారు చేసినది పంపడానికే మొగ్గు చూపేదానిని. మేము రాసిన లేఖలని కేవలం ఒక కాగితం మీద రాసి మడిచి ఇచ్చేసేవాళ్ళం తప్ప దాని మూతిని బంధించాలని, లక్క, తుమ్మ జిగురు లాంటి వాటిల్తో వాటి పీక నొక్కాలని ఇద్దరికీ తెలియదు. ఒకసారి ఉత్తరాలలో మేమేమి రాసుకుంటున్నామో తెలుసుకుందామని మా ఉత్తరం చదివిన చాలా మంది అవాక్కయ్యారు!!! ఈ మధ్యనే వాడికి నేను రాసిన ఉత్తరాన్ని జత చేస్తున్నా మీరు కూడా చదివి తరించండి (నా దస్తూరీ అర్ధమయితే). గమనిక: ఉత్తరం చదవాలనుకుంటే దాని మీద నొక్కాక view image అని కొట్టాక జూమ్ చేయండి. అక్షరాలు చదవడానికి వీలుగా ఉంటుంది.

మా తమ్ముడిని చూసి ఏడాది దాటినా మేము కలిసి చేసిన తుంటరి పనులు, అల్లరి చేష్టలు, ఎవరు నెమ్మదిగా తింటారా అని పోటీలు పెట్టుకుని తినడం, నేను వానలో తడిసే ప్రతీసారీ మైమరచి మరీ నన్ను చూస్తూ ఆనందించే వాడి ముఖారవిందం, ఇప్పటికీ నాకు నీటి బుడగల కోసం వాడు కొనే సబ్బు నీళ్ళు, ఆడుకోవడానికి కొనే బుడగలు, గోదావరిలో ఇసుక తిన్నెల మీద మేము ఆడుకున్న ఆటలు, చెప్పుకున్న కబుర్లు, పదిలంగా దాచుకున్న ఎన్నో జ్ఞాపకాలు అన్నీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. మా బంధాన్ని చూసి ఆనందించిన వాళ్ళు కొంతమందయితే అసూయ చెందిన వాళ్ళు మరికొందరు. ఎవరేమనుకున్నా నన్ను నన్నుగా ప్రేమించే వాడంటే నాకు మాటలలో చెప్పలేనంత, రాతలలో వ్రాయలేనంత, అసలు ఏ రకంగానూ వ్యక్త పరచలేనంత ఇష్టం. మా బంధం ఇలానే మేము ఉన్నన్నాళ్ళూ కొనసాగాలని ఆశిస్తున్నా.  ఇన్ని ఏళ్ళుగా ప్రతీ ఏడాది కలిసే మాకు ఈ సారి కలిసే భాగ్యం లేదు. అందుకే ఇక్కడకి వచ్చినా ఈ ఆచారాన్ని వదలకుండా నేను రాఖీ కట్టిన ఇక్కడ అన్నయ్యలని పిలిచి ఆ ముచ్చట తీర్చుకుంటున్నాను! నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే ఇంతమంది జనాల ప్రేమాభిమానాలు దొరకడం నిజంగా నా అదృష్టం.

నా వ్యక్తిగత విషయాలన్నీ చెప్పేసి మీకు విసుగు తెప్పించేశానా? సరే నేను ఇంత మొత్తుకున్న దాన్ని బట్టి మీ తక్షణ కర్తవ్యం ఏమిటి? ఇంకా చదువుతారేమిటండీ? ఆడవాళ్ళూ ముందు వెళ్లి మీ మీ వరస వారినన్నా భోజనానికి పిలవండి, మగవారు మీ మీ సోదరీమణుల ఇంటికి వెళ్లి ఎంచక్కగా భోజనం చేసి, తాంబూలం వేసుకుని అప్పుడు ఇక్కడకి మళ్ళీ వచ్చి నాకు థాంక్స్ మాత్రం చెప్పకండే!


Monday, October 24, 2011

వెలుగు జిలుగులుకళ్ళలా మిల మిలా మెరిసే కాకరపువ్వొత్తులు
ఆలోచనలలా చక చకా తిరిగే విష్ణు, భూ చక్రాలు
ఆవేశంలా ఉవ్వెత్తున ఎగసే చిచ్చుబుడ్డులు
మనసులా కరిగిపోయే వెన్నముద్దలు
కోపంలా బుస బుసలాడే పాము బిళ్ళలు
కొసరి కొసరి వడ్డించినట్టు కాలే మతాబులు
జడలా అందంగా ఉండే పొడవయిన తాళ్ళు
చిన్న పిల్లల్లా అల్లరి చేసే సిసింద్రీలు
ఛలోక్తుల్లా పేలే టపాసులు
ఆశల్లా అంబరాన్నంటే తారాజువ్వలతో 
ఈ దీపావళి అందరి జీవితాలలోను క్రొత్త
క్రాంతులని నింపాలని ఆశిస్తూ...........
అందరికీ దీపావళి శుభాకాంక్షలు!!!

కుల, మత, ప్రాంతీయ, వయసు భేదాలు లేకుండా అందరూ జరుపుకుని ఆనందించే పండగ దీపావళి. ఈ దీపావళిని మొత్తం అయిదు రోజులు జరుపుకుంటూ ఉంటారు.

మొదటి రోజు - ధన త్రయోదశి - దీనినే ధన తెరస్ అని కూడా అంటూ ఉంటారు. క్షీర సాగర మధనం జరిగినప్పుడు అందులోనుంచి ధన్వంతరి చేతిలో అమృత కలశంతో ఈ రోజునే ఉద్భవించారు. ఈ రోజున ఆవు నేతితో దీపం వెలిగించి శ్రీ సూక్తం చదువుకుంటే కుబేరుడు మన ఇంట్లో కొలువుంటాడుట. అందువలననే ఈ రోజున ఎక్కువగా బంగారం కొంటూ ఉంటారు.

రెండవ రోజు - నరక చతుర్దశి - కృతయుగంలో హిరణ్యాక్షుని సంహరించిన వరాహస్వామికీ, భూదేవికీ అసుర సంధ్యా సమయములో నరకుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. ఈ నరకుడు ప్రాద్యోషపురానికి రాజు. అతను బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు మితిమీరడంతో సత్యభామ అతనిని వధిస్తుంది. అలా ఈ రోజున ఆయన మరణించిన రోజు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలపైన నువ్వుల నూనె పెట్టుకుని, చక్కగా బాణసంచా కాల్చి (అసలు ప్రొద్దున్నే లేవడం బద్ధకమయినా పోటా పోటీగా కాల్చే బాణసంచా కోసం అన్నా లేచేదానిని) అప్పుడు తల మీద ఉత్తరేణి ఆకులు పెట్టుకుని తలంటు పోసుకుంటారు.  క్రొత్త అల్లుళ్ళ చేత మినుము కొరికించడం ఆనవాయితీ. ఈ రోజున చాలా మంది మినప ఆకులతో కూర వండుకుంటారు. అనేష సేముషీ మూష మాష మానస్య మానతే అన్నారు కదా!

మూడవ రోజు - దీపావళి అమావాస్య - ఇది ముఖ్యమయిన పండుగ. ఈ రోజు ఈ పండుగ చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేమిటంటే:
  • రావణాసురునితో యుద్ధం జరిపి విజయరాముడు సతీ సమేతంగా అయోధ్యకు విచ్చేసిన రోజు అమావాస్య కావడం వలన చీకటి నిండి ఉండగా అయోధ్య ప్రజలు సీతారాములకి స్వాగతం పలుకుతూ దీపాలని వెలిగించారని ఆ రోజు నించి ప్రతీ సంవత్సరం ఆ రోజున దీపావళి జరుపుకుంటున్నారని చెప్తారు. 
  • నరకాసురుడు మరణించాడు కదా! ఆనందములో ఈ రోజున దీపావళి జరుపుకుంటారు. 
  • ఇది ముఖ్యమయినది. క్షీర సాగర మధనములో లక్ష్మీ దేవి ఈ రోజునే ఉద్భవించింది. అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి అందుకనే ఈ రోజు సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. దీని వెనుక ఒక కథ ఉంది. అదేమిటంటే: పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి మిక్కిలి సంతోషించి, ఒక మహిమాన్వితమైన పూల హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో త్రొక్కడం జరుగుతుంది. అది చూసిన దుర్వాసుడు కోపంతో దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. అలా ఇంద్రుని భక్తికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహం వలన తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
  • మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని ఈ రోజునే తిరిగి వస్తారు. దానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు. 
  • గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని మన రైతన్నలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు కృతజ్ఞతగా దీపాలు వెలిగించి ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేస్తారు.
  • విక్రమార్కునికి పట్టాభిషేకం కూడా ఈ రోజే జరిగింది. 

తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!!
ముఖ్యముగా ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీ దేవి; నదులు, బావులు, చెఱువులు మొదలయిన నీటి వనరులలో గంగా దేవి ఉంటారుట. కనుక ఈ రోజున సూర్యుడు ఉదయించే సమయములో (ప్రత్యూష లేదా అరుణోదయ కాలం)  మఱ్ఱి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల పట్టలను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి. పిదప నువ్వుల నూనెతో దీపములు పెట్టాలి. ప్రధాన ఇంటి ద్వారం, ధాన్యపు కొట్టు, బావి, వంట ఇల్లు, రావి చెట్టు ఈ అయిదు ప్రదేశాలలో తప్పకుండా దీపాలను వెలిగించాలి. ఇలా చేయుడం వలన దారిద్ర్యం తొలగి, గంగానదీ స్నాన ఫలం వలన నరక భయం ఉండదని పురాణాలు చెపుతున్నాయి. స్త్రీలు అభ్యంగన స్నానానంతరం క్రొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి,  గుమ్మాలను పసుపు, కుంకుమ మామిడాకుల తోరణాలతో అలంకరించి సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన రుచికరమైన భక్ష్యభోజ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్ధం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఈ రోజు బట్టతో చేసిన వత్తులను వేస్తారు కనుక వాటిని సిద్ధం చేసే పనులలో మునిగి తేలుతారు. అలానే అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టిచెంది ఆశీర్వదిస్తారని మన శాస్త్రం చెపుతోంది.  

దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...

అంటూ సంధ్యాసమయమున చిన్న పిల్లలంతా గోగుకాడకి మూడు చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడం మన సాంప్రదాయాలలో ఒకటి. ఈ రోజున యముడు దక్షిణ దిశగా ఉంటాడు కనుక పిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఇలా దివిటీలు కొట్టడం అనేది మన పితృదేవతలకు దారి చూపుతుందని ఒక భావన. ఈ తతంగమంతా అయిన తరువాత కాళ్ళు, చేతులు, కళ్ళు  కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తినడం మన ఆచారం. ఇదంతా అయిన తరువాత పాతవి, నూలువి బట్టలు వేసుకుని మనమెంతో ఆశగా ఎదురుచూసే బాణసంచాని కాల్చుకోవచ్చు. ఈ బాణ సంచా కాల్చగా వచ్చే పొగలో ఎన్నో పురుగుల్ని, సుక్ష్మ జీవులని చంపే గుణం ఉంది. పైగా మన పాపాలన్నీ ఈ మంటలలో దహించుకుని పోతాయి అని ఒక నమ్మకం. రాత్రికి స్త్రీలు చేటలు, తప్పెటలు వాయిస్తూ సంబరంగా జేష్ఠాదేవిని (అలక్ష్మి, పెద్దమ్మారు, దారిద్ర్యాదేవిని) ఇండ్లనుండి తరిమి కొడతారు.

నాలుగవ రోజు - బలి పాడ్యమి - అదితి గర్భాన వామన రూపములో జన్మించిన శ్రీమహావిష్ణువు మహాదాత, విశేషమయిన బలపరాక్రమాలు కల బలిచక్రవర్తిని మూడడుగుల స్థలాన్ని అడుగుతాడు. బలిచక్రవర్తి దానికి ఒప్పుకోగా మొదటి అడుగుతో భూమిని, రెండవ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించగా మూడవ అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి అణచి వేస్తాడు. దేవతలను బందీలుగా ఉంచడం వలన ఈ విధంగా చేశాడే తప్ప బలి చక్రవర్తి దాన గుణానికి సంతోషించిన ఆ శ్రీహరి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదిస్తాడు. అందువలననే మనం ఈ రోజున ఈ పండగని జరుపుకుంటాము. మలయాళీలు ఇదే పండగని ఓణం అనే పేరుతో జరుపుకుంటారు. ఈ రోజునే గోపూజ చేయడం కూడా ఒక ఆచారం.

అయిదవ రోజు - భగిని హస్త భోజనం - దీని గురించి కొంచెం వివరంగా ఆ రోజు టపాలో వ్రాస్తాను.

సరే ఇన్ని తెలుసుకున్నాం కదా మరి దీపం యొక్క విశిష్టత కూడా తెలిస్తే సంపూర్ణమవుతుంది. ఏమంటారు?
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపం యొక్క జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికీ, ఆనందానికీ, సజ్జనత్వానికీ, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మనకి ఒక రోజులో సంధికాలాలు రెండు. ఒకటి సూర్యోదయానికి ముందు రెండవది సూర్యాస్తమయం తరువాత. వీటినే మనం ఘటికాలు అంటాము. ఇది మొత్తం నలభై ఎనిమిది నిమిషాల కాలం. ఈ కాలములో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉండటం వలన రజ - తమో గుణాలు అధికంగా ఉంటాయి. ఈ శక్తుల నుండి రక్షణ పొందడానికి మనం దేవుని ముందు కూడా ఈ సమయాలలో దీపం పెట్టి పూజ చేస్తూ ఉంటాము. ఈ శక్తులు ఈ సమయంలో అధికంగా ఉండటం వలనే ఏమో అసలుసంధ్యవేళల్లో తధాస్తు దేవతలు ఉంటారు కనుక చెడు మాటలు అనకూడదు అని అంటూ ఉంటారు. మనోనిశ్చలానికీ, సుఖశాంతులకీ అనువయిన కాలం కనుక దీపావళీ, కార్తీక మాసం మొదలయిన వాటిల్లో దీపానికి అంత విలువ, ప్రాశస్త్యం కూడాను. 

అవండీ నాకు తెలిసిన దీపావళి ముచ్చట్లు కొన్ని మీతో పంచుకున్నా! మరి నాకు తీపే తినిపిస్తారో లేక టపాసులే కాలుస్తారో! టపాసులు కాల్చేటప్పుడు మాత్రం జాగ్రత్త సుమీ!

Monday, October 17, 2011

గాజుల సవ్వడి


ఏంటండీ ఈ చిత్రం చూడగానే మీ పాత రోజుల్లోకి వెళ్ళారా? పిల్లలిలా వేసుకుని మురిసిపోవడం ప్రతీ ఇంట్లోనూ కనిపించేదే కదా! చిన్నతనంలో ఆడ, మగ తేడా లేకుండా అందరూ గాజులు (ద్రిష్టికి నల్లని గాజులు) వేసుకున్నా అవి మాత్రం ఆడవారినే వలచాయి. ఉయ్యాల తొట్టిలో పడుకోపెట్టే ముందు వేసే తెల్లరాళ్ళ నల్లని గాజులు, కొంచెం ఎదిగాక వేసే నల్లని మట్టి గాజులు, ఆ తరువాత రకరకాల గాజులెన్ని వచ్చినా పెళ్ళికీ, సీమంతానికీ మళ్ళీ మట్టి గాజులదే పైచేయి. అసలు గాజులు అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఉంటారా? ఈ గాజులు వేసుకోవడం అనేది ఎలా మొదలయింది అన్న విషయం తెలియాలంటే ఈ కథ చదవాలి.

అనగనగనగనగా (ఇలా అన్న వెంటనే మీరు ఫ్యాను వేసుకోవాలి! వేసుకున్నారా? హా ఇప్పుడు చదవండి వాటి రెక్కలని చూస్తూ) కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆడవాళ్ళకి మాట్లాడే హక్కు, అభిప్రాయాలని వెలిబుచ్చే అర్హత లేని రోజుల్లో జరిగిన ఒక యదార్ధ గాధ. మగువలకి ఊహలు, ఆలోచనలు మగవారికన్నా ఎక్కువ కానీ వాళ్ళు బయటకి చెప్పకూడదు కనుక వాటిని మనసులో దాచుకోలేక ఒక్కో కోరికకి ఒక్కో గాజు వేసుకునేవారు. అలా వాళ్ళ చేతుల నిండుగా గాజులు ఉండేవి అంటే అన్ని కోరికలని చంపుకుని, అభిప్రాయాలని వేలిబుచ్చలేక బ్రతికేవారనమాట! వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే గాజుల చప్పుడుని బట్టి తెలుసుకునేవారు! ఆ గాజుల గల గల విన్నప్పుడల్లా వాళ్ళ భర్తలకి అర్ధమయ్యి ఇన్ని కోరికలుండి పాపం ఏమీ చెప్పకుండా చేసేసామే అని జాలి కలిగి వారి మీద ప్రేమ మరింత పెరిగేది! అప్పుడప్పుడు వాళ్ళ కోరికలని వీళ్ళే తెలుసుకుని మరీ తీర్చేవారు. ఇప్పుడు ఆడవాళ్ళకి భావ వ్యక్తీకరణ, మాట్లాడే హక్కు ఉన్నాయి కనుక ఇప్పటి వాళ్ళ చేతులకి ఇదివరకు ఉండే అన్ని గాజులు లేవనమాట! భర్త చనిపోయాక భార్యకి కోరికలు ఉండకూడదు అనే ధోరణిలో ఉండటం వలన భర్త మరణానంతరం వాళ్ళ గాజులని తీయించేసేవారు. కానీ దానికీ దీనికీ సంబంధం లేదు కనుకనే ఇప్పటి తరం వాళ్ళు భర్త చనిపోయాక కూడా గాజులు వేసుకుంటున్నారు.
(గమనిక: ఇదంతా నిజమనుకునేరు! లేదండీ అంతా నా కల్పన సరదాకి చేసిన ఒక ప్రయత్నం) క్రీ. పూ. 2300 - 1000 సంవత్సరాల నాటి సింధూ నాగరికత కాలం నాటి మొహంజొదారో స్త్రీ బొమ్మకి చేతి నిండా గాజులు కప్పేసి ఉంటాయి. అది చూసి ఇలా నేను చేసిన ప్రయత్నం మాత్రమే.  


అసలు ఈ గాజులు వేసుకోవడం అనేది కేవలం మన భారత దేశానికే పరిమితమనుకున్నాను కానీ ప్రపంచంలో ఉన్న ప్రతీ మగువకీ ఇవి ప్రీతికరమయినవని తరవాత తెలిసింది. ఒక పరిపూర్ణ మహిళ తన జీవితంలో వివిధ దశలలో వేసుకునే గాజులను ప్రకృతిలోని అందమైన రంగులతో పోల్చుతూ సరోజినీ నాయుడు గారు Bangle sellers అనే రచనలో చెప్పి హైందవ సంస్కృతిని చక్కగా వర్ణించారు. ఆడపిల్ల అందాన్ని వర్ణించేటప్పుడు తామర తూడల్లాంటి చేతులకు ముత్యాల గాజులు, బంగారు కడియాలు అంటూ చెబుతారు. అవును మరి వయ్యారాలొలికే నెలతకు సొగసైన చేతులు, వాటికి సౌందర్యాన్ని ఇనుమడింపజేసే గాజులు అవసరమే కదా!

ఆచారం: పూజ చేసినా, తాంబూలం ఇచ్చినా, నిశ్చయతాంబూలాలకూ ముతైదువులకు గాజులు ఇవ్వడం మన ఆచారం. గాజులు శుభానికి సంకేతాలు. బొట్టు, పూవులు, గాజులు ఐదోతనానికి గుర్తని మహిళలు భావిస్తారు. వాటిని దానం చేస్తే తమ మాంగల్యం పచ్చగా నిలిచి ఉంటుందని నమ్ముతారు. వివాహాది శుభ కార్యాలలో పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించగానే ఇంట్లోని ఆడవాళ్ళందరికీ గాజులు వేయిస్తారు. గాజుల చెన్నయ్య ఇంటి వాకిట్లోకి అమ్మాయిలకు గాజులు తొడగడానికి వచ్చిన రోజయితే పండుగ వాతావరణమే! ఈ నిండైన గాజుల చేతులతో పెళ్లి పనుల్లో దిగితే పెళ్లిపందిరంతా కళకళలాడేది. సన్నని మట్టి గాజులను వేస్తే స్త్రీ సంతోషంగా వుంటుంది అనే నమ్మకం నేటికీ చెదరలేదు. ఈ కారణంగా పెళ్ళికూతురుకి సన్నని గాజులను వేస్తారు.

ఆ తరువాత సందర్భం శ్రీమంతం. నెలలు నిండిన స్ర్ర్తీకి సుఖ ప్రసవం కావాలని కోరుతూ చేతుల నిండుగా రంగు రంగుల గాజులు వేస్తారు పేరంటాళ్లు. ఓ చేతికి 21 జతల గాజులు, ఇంకో చేతికి 22 జతల గాజులు తొడుగుతారు. అంతే కాక ఆమెకు కొక్కేలతో ఉండే సన్నని వెండిగాజునిస్తారు. ప్రసవ సమయంలో ఈ కొక్కేల్ని విడదీస్తారు. హైందవ సంప్రదాయసిద్ధంగా పెళ్లికూతురికి పచ్చని, ఎర్రని గాజులు, బాలింతలకు ఆకుపచ్చని గాజులు వేయిస్తారు. ఈ వేడుక కన్నుల పండుగగా ఉంటుంది. ఆ పేరంటానికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా గాజులు వేయిస్తారు! లేకపోతే మనం ఊరుకుంటామా? వేడి వేడి జిలేబీ చుట్టల్లాగా నిగ నిగలాడుతూ మెరిసిపోయే మట్టి (చెక్కుడు) గాజులని చూస్తే ఎవరికి వేయించుకోవాలనిపించదు చెప్పండి?

శాస్త్రీయం: ఈ గాజులు స్త్రీల అలంకరణలో ప్రథమ స్థానాన్ని పొందినా, వీటి వాడకం వలన ఉపయోగాలు కూడా ఉన్నాయి. చేతులకు గాజులు వేసుకోవడం వలన చేతి నరాలపై ఒత్తిడి కలిగి రక్త ప్రసరణ మెరుగౌతుందని ఒక శాస్ర్తీయ అంచనా. అదే కాక గాజుల శబ్దం మనిషి మెదడును ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుందనేది మరో అభిప్రాయం. తద్వారా మెదడు ప్రశాంతంగా ఉంటూ మానసికానందం పొందుతారుట అందుకేనేమో గర్భిణీ స్త్రీలకు ఎటువంటి మానసిక ఒత్తిడులూ కలుగకుండా అన్ని గాజులను వేస్తారు!

రాయబారం: మీరు చదివినది నిజమే గాజులు రాయబారం కూడా నడుపుతాయి. జానపద గేయాల్లో గాజులు బాంధవ్యాలను చేరదీసే మాధ్యమికంగా ఉండేవి. పెళ్ళి జరిగి అత్తవారింటిలో ఉన్న స్త్రీ గాజులమ్మేవాడితో తన పుట్టింటి వార్తలు మోసుకొని రమ్మని చెప్పేది. అప్పట్లో మరి ఉత్తరాలు, దూరవాణులు కూడా లేవు కదా! 

లాభాలు: (ఆడవారికి మాత్రమే! మగవారు పొరపాటున కూడా చదువరాదు!) మట్టి గాజులంటే మగువలకి ఎంత ఇష్టమయినప్పటికీ ఆధునికతకి తగ్గట్టుగా వంకర టింకర గాజుల వలన చాలా ఉపయోగాలున్నాయి. అవేమిటంటారా? చెప్తాను మరి మీరు ఇహ రోజూ అవే వేసుకుంటానంటే నాది పూచీ కాదు! ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా! పొరపాటున ఏదయినా తగిలి మన మట్టి గాజులు చిట్లాయనుకోండి మనకే దెబ్బ తగులుతుంది. అదే వంకర టింకర ప్లాస్టిక్ గాజులనుకోండి మనకి దెబ్బ ఉండదు. పైపెచ్చు ఇవి ఒక పక్క కోసుగా ఉండటం వలన ఎవరయినా మనతో వేషాలు వేశారనుకోండి వాళ్ళకి గాజుతో ఒక్క గీటు పెట్టేసి మనం ఎంచక్కగా తప్పించేసుకోవచ్చు. అలానే ఈ మధ్య వచ్చే బండ గాజులతో ఒక్క గుద్దు గట్టిగా గుద్ది కూడా మనం తప్పించుకోవచ్చు. మువ్వల గాజులు, రాళ్ళ గాజులతో ఒక్కసారి గీరామంటే అంతే అవతలి వాళ్ళ పని. ఏమంటారు? 

గృహాలంకరణ: దీనిలోనూ గాజులు ప్రధాన పాత్రను పోషిస్తాయి. మట్టి గాజులను కొవ్వొత్తిపై నెమ్మదిగా వేడి చేస్తే అవి మెల్లగా కరిగి కావాల్సిన ఆకారానికి వంగుతాయి. వాటితో పూవులు, మొగ్గలు, లతలు, ఏనుగులు, కొంగలు, కుందేళ్లు ఒకటేమిటి నచ్చిన ఆకారాన్ని తయారు చేసుకోవచ్చు. మా ఇంట్లో మైనం కరిగించి కణం (సెల్) ఆకారంలో పోసి దాని మీద ఈ రంగు రంగుల మట్టి గాజులను వంచి chloroplast, mitochondria, golgi complex మొదలయినవి తయారు చేసి వృక్ష కణాలు, జంతు కణాలు తయారు చేసేదానిని. అలానే గాజులో గాజును వేసి రక రకాల సైజుల్లో, పెద్ద రంగు రంగుల దండలా తయారుచేసి గుమ్మాలకు తోరణంలాగా కట్టేవాళ్ళం. గాజులను అతికించి రకరకాల బొమ్మలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మీ సృజనాత్మకతకి పదునుపెట్టి ఎన్నో కళా కాంతులను తయారు చేయవచ్చు.

వ్యాపారం: లాడ్ బజార్ లేదా చూడీ బజార్ అనేది హైదరాబాద్‌లో పేరుమోసిన గాజుల మార్కెట్. చారిత్రాత్మక చార్మినార్ నుంచి చీలివచ్చే నాలుగు ప్రధాన రహదారుల్లో ఓ రహదారి ప్రాంతంలో ఇది నెలకొనిఉంది. కిలోమీటరు పొడవునా వ్యాపించి ఉండే ఈ మార్కెట్‌ను మహిళలు నిత్యం సందర్శిస్తూ రకరకాల గాజులను కొనుగోలు చేస్తూ ఉంటారు. విదేశీయులు కూడా ఈ గాజుల పట్ల మక్కువ చూపుతున్నారంటేనే తెలుసుకోవచ్చు ఈ గాజులు ఎంత ప్రసిద్ధి చెందాయో!

DNA గాజులు
ఏ మాటకామాటే చెప్పాలి! మా రాజమహేంద్రవరంలో నల్లమందు సందు దగ్గర గొడుగు వేసుకుని ఒక తాత కుర్చుని మంచి మంచి గాజులు అమ్ముతాడు. రండమ్మా రండి డింగిరి డిక్లీ గాజులు అన్న పిలుపుకి వెళ్ళిన నేను ఇహ మట్టి గాజులంటూ కొనడమంటే అది తాత దగ్గరే అని నిశ్చయించేసుకున్నాను. నాకెంతో ఇష్టమయిన మట్టితో చేసిన DNA గాజులు (వీటికి ఆ నామకరణం చేసింది నేనే! చూడండి కావాలంటే ఈ గాజులో లోపల DNA double helix లాగా లేదూ!) అక్కడే కొనే దానిని. ఇవే కాక ఎన్ని రకాల మట్టి గాజులో అసలు తాత దగ్గర దొరికినన్ని రకాలు ఇంకెక్కడా దొరికేవి కాదు అదీ తక్కువ ధరకి. అలా అయిదేళ్ళ క్రితం కొన్న గాజులు కూడా ఇంకా నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నా గాజులు చూసి మా కాలేజీ అమ్మాయిలందరూ ఆ తాత దగ్గరే కొనడం. 

చివరి మాట: ముందు మాట తెలుసు కానీ ఈ చివరి మాట ఏంటి అంటారా? అదే మరి! రావు గోపాలరావు గారేమి చెప్పారు? మనిసన్నాక కూసింత కలాపోసనుండాల! ఊరికనే తిని తొంగుంటే మనిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటాది? అందుకే ఈ చివరి మాట!

గాజులు లేని మగువ
చంద్రుడు లేని కలువ
సూర్యుడు లేని వేకువ
విలువ పొందునుటయ్య ఈశ్వరా!

అంటే అర్ధం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనే అనుకుంటున్నాను. పుస్తకాలు తిరగేయకండి ఇది ఈశ్వర శతకం అనుకునేరు నేనే ఏదో పైత్యం ప్రకోపించి ఈ పద్యాన్ని వ్రాసి మీ ముందుకి తెచ్చాను. ఏదేమయినా ప్రపంచం ఎంత అభివృద్ది చెందుతున్నా మన గాజులకి ఆదరణ లభిస్తూనే ఉంది!

Tuesday, October 11, 2011

అందరి మామచందమామ రావే జాబిల్లి రావే అంటూ చిన్న పిల్లలకి గోరుముద్దలు తినిపించినా
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను అంటూ ప్రేయసి తన ప్రియుని కోసం ఎదురుచూసినా
వస్తాడు నా రాజు ఈ రోజు అంటూ ఆనంద పారవశ్యంలో మనసు ఆనంద తాండవం చేసినా
హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి అంటూ క్రొత్త జీవితానికి పునాదిని వేసుకున్నా
రావోయి చందమామ అంటూ తమ గోడుని చందమామతో  పంచుకున్నా
మామా చందమామా వినరావా మా కథ అంటూ కథలను వినిపించినా
పగలే వెన్నెల ని పంచే ఆయన చల్లని దొరవోలె ఎప్పటికీ మనందరికీ మామే.


మీకందరికీ ముందుగా ఆశ్వీయజ శుద్ధ (శరత్) పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పాటికే మీకు ఆ టపా దేని మీద వ్రాస్తున్నా అన్న విషయం అవగతమయ్యి ఉంటుంది. అక్షరాలా అదే మన మామయ్య మీదే! చందమామయ్య అనగానే నాకు చిన్నప్పుడు నేర్చుకున్న పాట ఒకటి గుర్తుకొస్తోంది.

ఉన్నారమ్మా ఉన్నారు నాకు ఇద్దరు మామయ్యలు
ఒక మామయ్యేమో ఇంటిలోనుంటాడు
ఇంకొక మామయ్యేమో ఇంటిమీదుంటాడు
ఇంటిలోన ఉన్న మామ మేనమామ
ఇంటి మీద ఉన్న మామ చందమామ

అవును అసలు చంద్రుడు మనకి మామయ్య ఎలా అయ్యాడు అనే సందేహం ఎప్పుడయినా ఎవరికయినా కలిగిందా? నాకు మాత్రం కలిగింది బాబు! అసలే సందేహాల పుట్టనేమో నివృత్తి అయ్యేదాకా కుమ్మరి పురుగులాగా దొలిచేస్తూ ఉంటాను. నా బాధ భరించలేక మా అమ్మమ్మ నాకు చంద్రుని పుట్టుక గురించి చెప్పింది.

మన పురాణాలను గమనిస్తే అందులో చంద్రుడు పాల సముద్రము నుండి పుట్టిన వాడు అని ఉంది. అలానే మన లక్ష్మీ దేవి కూడా పాల సముద్రము నుండి ఉద్భవించినదే కదా! ఆ వరుసన చూస్తే చంద్రుడు లక్ష్మీ దేవికి సోదరుడు. మనందరికీ లక్ష్మీ నారాయణులు  తల్లిదండ్రులతో సమానులు కనుక చంద్రుడు మనకి మామయ్య అయ్యాడనమాట.

అలాగే మనకి సప్త ఋషులలో మొదటి వారయిన అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. నారాయణుని నాభి నుంచి పుట్టిన బ్రహ్మ, సృష్టిలో తనకి ఒక సహాయకుడు కావాలని అనుకున్నప్పుడు, ఆయన మనో శక్తితో జన్మించిన వారే అత్రి. ఆయన భార్య అనసూయ. ఒక సారి అత్రి మహర్షి చేసిన ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకేసారి ప్రత్యక్షమయ్యారు. త్రిమూర్తులే తమకి సంతానంగా జన్మించాలని అత్రి మహర్షి కోరుకున్నారు. అప్పుడు ఆయనకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు, శివుని అంశతో దూర్వాసుడు మొత్తం ముగ్గురు కుమారులు జన్మించారు.

చంద్రుడు తనకున్న ఆధిపత్యం చేత, చాకచక్యం చేత దేవగురువు బృహస్పతి భార్య అయిన తారను చెరబట్టాడు. వీరికి పుట్టినవాడే బుధుడు. బాహ్యార్ధం తీసుకుంటే చంద్రుడు గురువుగారి భార్యను చెరబట్టడం తప్పు. కానీ అంతరార్ధాలలోకి వెళితే, చంద్రుడు మనసుకి (చంద్రమా మనసో జాతః) ప్రతీక. బృహస్పతి బుద్ధికి, ఆయన భార్య తార వివేకానికీ ప్రతీకలు. మనసు వివేకముతో ఉన్నప్పుడే జ్ఞానము వస్తుంది. ఆ జ్ఞానమే బుధుడు. ఆ విషయాన్ని మనకి చెప్పే సందర్భంలోనే ఈ కథ వస్తుంది.

సరే కాసేపు ఈ విషయాలని ప్రక్కన పెడితే, చంద్రుని మీద నాకిష్టమయిన కొన్ని మంచి పద్యాల గురించి ముచ్చటించుకుందాం.

కలశపాథోరాశిగర్భ వీచిమతల్లి
కడుపార నెవ్వాని కన్నతల్లి  
అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు
వన్నె వెట్టు ననార్తవంపు పువ్వు
సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు

నతడు వొగడొందు మధుకైటభారి మఱది
కళల నెలవగువాడు చుక్కలకు ఱేడు
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగుల దొర జోడు రేవెలుంగు

చంద్రుని మీద ఇంతకంటే అందమయిన, గొప్ప వర్ణనతో కూడిన పద్యం ఇంకొకటి లేదేమో అనిపిస్తుంది. ఇది అల్లసాని పెద్దన గారు రచించిన మనుచరిత్ర ప్రారంభంలో కృతిభర్త వంశ వర్ణనలో వచ్చే మొట్టమొదటి పద్యం. అసలు అల్లసాని వారి అల్లిక అర్ధం చేసుకున్న వారికి జిగిబిగి అని, అర్ధం కాని వారికి గజిబిజి అని ఊరికనే అన్నారటండీ? ఇక్కడ మనుచరిత్ర కృతిభర్త శ్రీ కృష్ణ దేవరాయులు. ఆయన వంశ (తుళు) ఆదిపురుషుడు చంద్రుడు కనుక ఇలా అభివర్ణించడం జరిగింది. పద్యం అర్ధంలోనికి వెళితే పాల సముద్రం తండ్రి అయితే ఆ సముద్రాన్ని చిలికినప్పుడు ఏర్పడిన తరంగాల నుండి పుట్టినవాడు చంద్రుడు (ఇక్కడ అలని తల్లిగాను, సముద్రుడిని తండ్రి గాను చెప్పారు). శివుని జడ అనే తోటలో పూసే అనావర్తవంపు పువ్వు (అంటే అన్ని ఋతువులలోనూ పూసే పువ్వు అని) చంద్రుడు. సకల దేవతల ఆకలినీ తీర్చే మెట్టపంట చంద్రుడు. దేవతల ఆహారమయిన సుధని లేదా అమృతాన్ని కురిపించేది చంద్రుడేగా మరి అటువంటి ఆయన ఒక మెట్టపంట (అంటే ఎవ్వరూ నాటకుండానే దానంతట అది వచ్చి నిరంతరం పండే పంట అని) అన్నారు. కటిక చీకటిని తినే చేతులతో కన్నె కలువని నవ్వించి, కవ్విస్తాడుట. ఇక్కడ పెద్దనగారి చతురతతో కూడిన చంద్రుని సరసత్వం కనిపిస్తుంది. మిల మిలా మెరిసిపోయే కాంతికి అత్యధిక కొలమానం చంద్రుడు. పదహారు కళలకి చిరునామా చంద్రుడు. అలానే ఈయన విష్ణువుకి బావమఱది , మన్మధునికి మేనమామ కూడాను. అందువలననే మన మామయ్యకి ఇంత ఆకర్షణ ఏమో?

అమరుల బోనపుట్టిక
సహస్ర మయూఖుని జోడు కూడె
సంతమసము వేరు విత్తు
పుంశ్చలీ సమితికి చుక్క వాలు
నవసారస లక్ష్మి తొలంగు బావ 
కోకములకు గుండె తల్లడము
కైరవ మిత్రుడు తోచె తూర్పునన్

ఈ పద్యం మన మామని వర్ణిస్తూ నంది (ముక్కు) తిమ్మన గారు రచించిన పారిజాతాపహరణం లోనిది. పదముల పోహళింపు చూడండి ఎంత చక్కగా ఉందో! దేవతలకి ఆహారపు పెట్టె, సూర్యునితో జత కూడినవాడు, చీకట్లని పోగొట్టేవాడు, ఏ విధముగానయితే మరదళ్ళు బావగారు ఎదురుపడగానే ప్రక్కకి తప్పుకుంటారో అలానే పద్మాలు చంద్రుని రాకతో ముడుచుకుంటాయి, చక్రవాక పక్షులకి గుండె తల్లడిల్లుతుంది ఎందుకంటే చంద్రుడు రాగానే అవి విరహవేదనలో (విడిపోతాయి) మునుగుతాయి, కలువ పూలకి స్నేహితుడు అయిన చంద్రుడు పౌర్ణమి నాడు ఉదయించాడు అని దీని భావం.

మన మామయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. పదహారు కళలతో, ఇరవయి ఎనిమిది (ఇరవయి ఏడు నక్షత్రాలు మరియు అభిజిత్ అనే శ్రవణ నక్షత్రపు ఛాయ) కళత్రాలతో మనల్ని మురిపిస్తాడు. మన మామని వర్ణించని కవులు, ఆస్వాదించని మనుషులు లేరేమో! దేవతలకి అమృతాన్ని పంచే వెన్నెలలో మనం తింటే మనకి కూడా ఆ అమృతం వస్తుంది. చిన్నపిల్లలకి చందమామని చూపిస్తూ వెన్నెలలో గోరుముద్దలు పెట్టడం చాలా ఆరోగ్యం కూడాను. అటువంటి అమృతధార ఈ శరత్ పౌర్ణమి చంద్రుడిలో ఉంటుందిట. కనుక ఈ ఒక్కరోజయినా అందరూ ఆరుబయట వెన్నెలలో భోజనం చేయడం అనాదిగా వస్తున్నది. అయితే ఇక్కడ మీకొక సందేహం కలుగవచ్చు. చంద్రుడు నిరంతరం అమృతాన్ని ఇస్తాడు కదా అయితే ఈ రోజుకే ఎందుకంత ప్రాముఖ్యత అని? మీకు రాకపోయినా నాకు వచ్చిందిలెండి అందుకే సమాధానం ఇస్తున్నా చదివేయండి అదే కంటితో. ఆశ్వీయుజ, కార్తీక మాసాలు శరత్ ఋతువు. ఈ శరత్కాల చంద్రునికి మలినాలు ఉండవు. మబ్బులు కూడా తొలగి ఆకాశం ప్రశాంతంగా ఉండి చంద్రుని వెన్నెల, ప్రకాశం ఎక్కువగా ఉండే కాలం ఇది. ఈ కాలంలో ఏ రోజునయినా వెన్నెలలో అమృతం ఉంటుంది కానీ పౌర్ణమి నాడు నిండుగా ఉంటాడు కదా పైగా ఈ మాసంలో మొదటి పౌర్ణమి కనుక ఈ ఆశ్వీయజ శుద్ధ (శరత్) పౌర్ణమికి ప్రత్యేకత.

మన మామయ్యకి సంబంధించిన కొన్ని లలిత సంగీత పాటలను సేకరించి ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు అసలు విషయం మీకు తెలిసిపోయిందిగా ఇంకెందుకాలస్యం హాయిగా అలా వెన్నెల్లో భోజనం చేసేయండి నా మాట విని. ఈ candle light dinner కన్నా ఎంతో బాగుంటుంది మా మామయ్యతో కూర్చుని సహపంక్తి భోజనం చేయడం. మామయ్యకి వడ్డించడం మరువకండే!


Wednesday, October 05, 2011

అప్పుడేమయిందంటే......


నగరం ఆదమరచి నిదురిస్తున్న వేళ
వీధి కుక్కలకి వాక్ స్వాతంత్ర్యం వచ్చిన వేళ
గత జ్ఞాపకాలేవో చల్లని గాలిలా తాకుతున్న వేళ
మనోభావాలు కొమ్మలలా ఊగుతున్న వేళ
బాధలన్నిటినీ నింపుకున్న చీకటి కాటుకగా మారిన వేళ
ఆనందానుభూతులు జాజుల సువాసనలా వ్యాపిస్తున్న వేళ
గాలికి ఊగే కొబ్బరాకులు వింఝామరలు విసురుతున్న వేళ
వెన్నెల గతం తాలూకు ఆలోచనలకి జో కొడుతున్న వేళ
నక్షత్రాల కాంతులు క్రొత్త ఆశలని రేపుతున్న వేళ
కునుకు వచ్చి కనుపాపలను వాల్చి కనురెప్పల దుప్పటీ కప్పింది.

Sunday, October 02, 2011

అమ్మ పాట

     నవదుర్గలు                               అమ్మవారి అవతారాలు


అమ్మా అమ్మా రావమ్మా      
మహలక్ష్మీ దయచెయవమ్మా
తొమ్మిది రోజుల పండుగిదీ
తోయజనేత్రీ రావమ్మా              ||అమ్మా||

రాక్షస బాధలు పడలేక
దేవతలంతా మొఱలిడగా
మహిషాసురునీ చంపితివి
మానవ కోటిని కాచితివి            ||అమ్మా||

సప్తమి నాడు కాళివిగా
అష్టమి నాడు దుర్గవిగా
నవమి నాడు నళినాక్షివిగా
దశమి నాడు జయమందితివి     ||అమ్మా||

కుంకుమ పూజలు చేసెదము
కువలయనేత్రీ రావమ్మా
హారతి గైకొన రావమ్మా
అభయమ్మీయగ రావమ్మా        ||అమ్మా||

పాఠకులందరికీ దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు! అమ్మవారి పాటలలో నాకు బాగా నచ్చిన పాట, దేవీ నవరాత్రుల పాట ఇది.

ఈ దేవీ నవరాత్రులలో ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఆసక్తికరమయిన విషయం ఉంటుంది. కొంతమందికి బొమ్మల కొలువులు అయితే, ఇంకొంతమందికి బతుకమ్మ, మరికొంతమందికి పూజలు, మిగతావాళ్ళకి రక రకాల నైవేద్యాలు. ఇలా అనమాట. నా విషయానికొస్తే చాలా ఆసక్తికరమయిన విషయం మాత్రం పూజలు వాటిల్లో కూడా చిన్నపుడు చేసే బాల పూజలంటే చాలా ఇష్టం. ఈ నవరాత్రులలో బాలా త్రిపుర సుందరి దేవి స్వరూపాలుగా చిన్న పిల్లలకి (ఆడ పిల్లలకి) బాల పూజలు చేస్తారు. అలా నాకు మా అమ్మమ్మ పూజ చేసి చక్కగా నా కాళ్ళకి దణ్ణం పెడుతుంటే నేను అమ్మవారిలాగా అక్షింతలేసి ఆశీర్వదించడం భలే నచ్చేసేది నాకు. లేకపోతే ఎప్పుడూ మనమే అందరి కాళ్ళకీ దణ్ణం పెట్టాలి ఛీ నాకు ఎవరూ పెట్టడం లేదు అని బాధపడే సమయంలో ఇలాంటివి చేస్తే ఎంత బాగుంటుంది మీరే చెప్పండి! అలా ఈ దేవీ నవరాత్రులలో చిన్నపిల్లలకి ముద్దు ముద్దుగా చేసే బాల పూజలంటే నాకిష్టం.

రోజుకొక రూపంలో దర్శనమిచ్చే తల్లిని చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఆ దివ్యమంగళ మూర్తిని ఈ అలంకరణలతో చూస్తుంటే ఆనంద పారవశ్యంలో మునిగి తేలడం తప్ప వర్ణించలేని అనుభూతికి లోనవుతాము. అమ్మా అని పిలిచిన వెంటనే తన బిడ్డకేమయిందో అని పరిగెత్తుకుని వచ్చే చల్లని తల్లి. అలానే బిడ్డకి ఆపద కలిగించిన ఎవరినయినా సరే ఊరుకోకుండా ఉగ్రరూపంలో శిక్షించే తల్లి. అమ్మ గురించి అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఇక్కడితో ముగిస్తున్నాను. అమ్మవారి శుభాశీస్సులు అందరికీ ఎల్ల వేళలా ఉండాలని, ఆమె కరుణా వీక్షణాలతో అందరూ హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

శ్రీ లలితా చాలీసా