చందమామ రావే జాబిల్లి రావే అంటూ చిన్న పిల్లలకి గోరుముద్దలు తినిపించినా
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను అంటూ ప్రేయసి తన ప్రియుని కోసం ఎదురుచూసినా
వస్తాడు నా రాజు ఈ రోజు అంటూ ఆనంద పారవశ్యంలో మనసు ఆనంద తాండవం చేసినా
హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి అంటూ క్రొత్త జీవితానికి పునాదిని వేసుకున్నా
రావోయి చందమామ అంటూ తమ గోడుని చందమామతో పంచుకున్నా
మామా చందమామా వినరావా మా కథ అంటూ కథలను వినిపించినా
పగలే వెన్నెల ని పంచే ఆయన చల్లని దొరవోలె ఎప్పటికీ మనందరికీ మామే.
మీకందరికీ ముందుగా ఆశ్వీయజ శుద్ధ (శరత్) పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పాటికే మీకు ఆ టపా దేని మీద వ్రాస్తున్నా అన్న విషయం అవగతమయ్యి ఉంటుంది. అక్షరాలా అదే మన మామయ్య మీదే! చందమామయ్య అనగానే నాకు చిన్నప్పుడు నేర్చుకున్న పాట ఒకటి గుర్తుకొస్తోంది.
ఉన్నారమ్మా ఉన్నారు నాకు ఇద్దరు మామయ్యలు
ఒక మామయ్యేమో ఇంటిలోనుంటాడు
ఇంకొక మామయ్యేమో ఇంటిమీదుంటాడు
ఇంటిలోన ఉన్న మామ మేనమామ
ఇంటి మీద ఉన్న మామ చందమామ
ఒక మామయ్యేమో ఇంటిలోనుంటాడు
ఇంకొక మామయ్యేమో ఇంటిమీదుంటాడు
ఇంటిలోన ఉన్న మామ మేనమామ
ఇంటి మీద ఉన్న మామ చందమామ
అవును అసలు చంద్రుడు మనకి మామయ్య ఎలా అయ్యాడు అనే సందేహం ఎప్పుడయినా ఎవరికయినా కలిగిందా? నాకు మాత్రం కలిగింది బాబు! అసలే సందేహాల పుట్టనేమో నివృత్తి అయ్యేదాకా కుమ్మరి పురుగులాగా దొలిచేస్తూ ఉంటాను. నా బాధ భరించలేక మా అమ్మమ్మ నాకు చంద్రుని పుట్టుక గురించి చెప్పింది.
మన పురాణాలను గమనిస్తే అందులో చంద్రుడు పాల సముద్రము నుండి పుట్టిన వాడు అని ఉంది. అలానే మన లక్ష్మీ దేవి కూడా పాల సముద్రము నుండి ఉద్భవించినదే కదా! ఆ వరుసన చూస్తే చంద్రుడు లక్ష్మీ దేవికి సోదరుడు. మనందరికీ లక్ష్మీ నారాయణులు తల్లిదండ్రులతో సమానులు కనుక చంద్రుడు మనకి మామయ్య అయ్యాడనమాట.
అలాగే మనకి సప్త ఋషులలో మొదటి వారయిన అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. నారాయణుని నాభి నుంచి పుట్టిన బ్రహ్మ, సృష్టిలో తనకి ఒక సహాయకుడు కావాలని అనుకున్నప్పుడు, ఆయన మనో శక్తితో జన్మించిన వారే అత్రి. ఆయన భార్య అనసూయ. ఒక సారి అత్రి మహర్షి చేసిన ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకేసారి ప్రత్యక్షమయ్యారు. త్రిమూర్తులే తమకి సంతానంగా జన్మించాలని అత్రి మహర్షి కోరుకున్నారు. అప్పుడు ఆయనకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు, శివుని అంశతో దూర్వాసుడు మొత్తం ముగ్గురు కుమారులు జన్మించారు.
చంద్రుడు తనకున్న ఆధిపత్యం చేత, చాకచక్యం చేత దేవగురువు బృహస్పతి భార్య అయిన తారను చెరబట్టాడు. వీరికి పుట్టినవాడే బుధుడు. బాహ్యార్ధం తీసుకుంటే చంద్రుడు గురువుగారి భార్యను చెరబట్టడం తప్పు. కానీ అంతరార్ధాలలోకి వెళితే, చంద్రుడు మనసుకి (చంద్రమా మనసో జాతః) ప్రతీక. బృహస్పతి బుద్ధికి, ఆయన భార్య తార వివేకానికీ ప్రతీకలు. మనసు వివేకముతో ఉన్నప్పుడే జ్ఞానము వస్తుంది. ఆ జ్ఞానమే బుధుడు. ఆ విషయాన్ని మనకి చెప్పే సందర్భంలోనే ఈ కథ వస్తుంది.
సరే కాసేపు ఈ విషయాలని ప్రక్కన పెడితే, చంద్రుని మీద నాకిష్టమయిన కొన్ని మంచి పద్యాల గురించి ముచ్చటించుకుందాం.
అలాగే మనకి సప్త ఋషులలో మొదటి వారయిన అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. నారాయణుని నాభి నుంచి పుట్టిన బ్రహ్మ, సృష్టిలో తనకి ఒక సహాయకుడు కావాలని అనుకున్నప్పుడు, ఆయన మనో శక్తితో జన్మించిన వారే అత్రి. ఆయన భార్య అనసూయ. ఒక సారి అత్రి మహర్షి చేసిన ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకేసారి ప్రత్యక్షమయ్యారు. త్రిమూర్తులే తమకి సంతానంగా జన్మించాలని అత్రి మహర్షి కోరుకున్నారు. అప్పుడు ఆయనకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు, శివుని అంశతో దూర్వాసుడు మొత్తం ముగ్గురు కుమారులు జన్మించారు.
చంద్రుడు తనకున్న ఆధిపత్యం చేత, చాకచక్యం చేత దేవగురువు బృహస్పతి భార్య అయిన తారను చెరబట్టాడు. వీరికి పుట్టినవాడే బుధుడు. బాహ్యార్ధం తీసుకుంటే చంద్రుడు గురువుగారి భార్యను చెరబట్టడం తప్పు. కానీ అంతరార్ధాలలోకి వెళితే, చంద్రుడు మనసుకి (చంద్రమా మనసో జాతః) ప్రతీక. బృహస్పతి బుద్ధికి, ఆయన భార్య తార వివేకానికీ ప్రతీకలు. మనసు వివేకముతో ఉన్నప్పుడే జ్ఞానము వస్తుంది. ఆ జ్ఞానమే బుధుడు. ఆ విషయాన్ని మనకి చెప్పే సందర్భంలోనే ఈ కథ వస్తుంది.
సరే కాసేపు ఈ విషయాలని ప్రక్కన పెడితే, చంద్రుని మీద నాకిష్టమయిన కొన్ని మంచి పద్యాల గురించి ముచ్చటించుకుందాం.
కలశపాథోరాశిగర్భ వీచిమతల్లి
కడుపార నెవ్వాని కన్నతల్లి
అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు
వన్నె వెట్టు ననార్తవంపు పువ్వు
సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు
నతడు వొగడొందు మధుకైటభారి మఱది
కళల నెలవగువాడు చుక్కలకు ఱేడు
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగుల దొర జోడు రేవెలుంగు
చంద్రుని మీద ఇంతకంటే అందమయిన, గొప్ప వర్ణనతో కూడిన పద్యం ఇంకొకటి లేదేమో అనిపిస్తుంది. ఇది అల్లసాని పెద్దన గారు రచించిన మనుచరిత్ర ప్రారంభంలో కృతిభర్త వంశ వర్ణనలో వచ్చే మొట్టమొదటి పద్యం. అసలు అల్లసాని వారి అల్లిక అర్ధం చేసుకున్న వారికి జిగిబిగి అని, అర్ధం కాని వారికి గజిబిజి అని ఊరికనే అన్నారటండీ? ఇక్కడ మనుచరిత్ర కృతిభర్త శ్రీ కృష్ణ దేవరాయులు. ఆయన వంశ (తుళు) ఆదిపురుషుడు చంద్రుడు కనుక ఇలా అభివర్ణించడం జరిగింది. పద్యం అర్ధంలోనికి వెళితే పాల సముద్రం తండ్రి అయితే ఆ సముద్రాన్ని చిలికినప్పుడు ఏర్పడిన తరంగాల నుండి పుట్టినవాడు చంద్రుడు (ఇక్కడ అలని తల్లిగాను, సముద్రుడిని తండ్రి గాను చెప్పారు). శివుని జడ అనే తోటలో పూసే అనావర్తవంపు పువ్వు (అంటే అన్ని ఋతువులలోనూ పూసే పువ్వు అని) చంద్రుడు. సకల దేవతల ఆకలినీ తీర్చే మెట్టపంట చంద్రుడు. దేవతల ఆహారమయిన సుధని లేదా అమృతాన్ని కురిపించేది చంద్రుడేగా మరి అటువంటి ఆయన ఒక మెట్టపంట (అంటే ఎవ్వరూ నాటకుండానే దానంతట అది వచ్చి నిరంతరం పండే పంట అని) అన్నారు. కటిక చీకటిని తినే చేతులతో కన్నె కలువని నవ్వించి, కవ్విస్తాడుట. ఇక్కడ పెద్దనగారి చతురతతో కూడిన చంద్రుని సరసత్వం కనిపిస్తుంది. మిల మిలా మెరిసిపోయే కాంతికి అత్యధిక కొలమానం చంద్రుడు. పదహారు కళలకి చిరునామా చంద్రుడు. అలానే ఈయన విష్ణువుకి బావమఱది , మన్మధునికి మేనమామ కూడాను. అందువలననే మన మామయ్యకి ఇంత ఆకర్షణ ఏమో?కడుపార నెవ్వాని కన్నతల్లి
అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు
వన్నె వెట్టు ననార్తవంపు పువ్వు
సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు
నతడు వొగడొందు మధుకైటభారి మఱది
కళల నెలవగువాడు చుక్కలకు ఱేడు
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగుల దొర జోడు రేవెలుంగు
అమరుల బోనపుట్టిక
సహస్ర మయూఖుని జోడు కూడె
సంతమసము వేరు విత్తు
పుంశ్చలీ సమితికి చుక్క వాలు
నవసారస లక్ష్మి తొలంగు బావ
సహస్ర మయూఖుని జోడు కూడె
సంతమసము వేరు విత్తు
పుంశ్చలీ సమితికి చుక్క వాలు
నవసారస లక్ష్మి తొలంగు బావ
కోకములకు గుండె తల్లడము
కైరవ మిత్రుడు తోచె తూర్పునన్
ఈ పద్యం మన మామని వర్ణిస్తూ నంది (ముక్కు) తిమ్మన గారు రచించిన పారిజాతాపహరణం లోనిది. పదముల పోహళింపు చూడండి ఎంత చక్కగా ఉందో! దేవతలకి ఆహారపు పెట్టె, సూర్యునితో జత కూడినవాడు, చీకట్లని పోగొట్టేవాడు, ఏ విధముగానయితే మరదళ్ళు బావగారు ఎదురుపడగానే ప్రక్కకి తప్పుకుంటారో అలానే పద్మాలు చంద్రుని రాకతో ముడుచుకుంటాయి, చక్రవాక పక్షులకి గుండె తల్లడిల్లుతుంది ఎందుకంటే చంద్రుడు రాగానే అవి విరహవేదనలో (విడిపోతాయి) మునుగుతాయి, కలువ పూలకి స్నేహితుడు అయిన చంద్రుడు పౌర్ణమి నాడు ఉదయించాడు అని దీని భావం.
మన మామయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. పదహారు కళలతో, ఇరవయి ఎనిమిది (ఇరవయి ఏడు నక్షత్రాలు మరియు అభిజిత్ అనే శ్రవణ నక్షత్రపు ఛాయ) కళత్రాలతో మనల్ని మురిపిస్తాడు. మన మామని వర్ణించని కవులు, ఆస్వాదించని మనుషులు లేరేమో! దేవతలకి అమృతాన్ని పంచే వెన్నెలలో మనం తింటే మనకి కూడా ఆ అమృతం వస్తుంది. చిన్నపిల్లలకి చందమామని చూపిస్తూ వెన్నెలలో గోరుముద్దలు పెట్టడం చాలా ఆరోగ్యం కూడాను. అటువంటి అమృతధార ఈ శరత్ పౌర్ణమి చంద్రుడిలో ఉంటుందిట. కనుక ఈ ఒక్కరోజయినా అందరూ ఆరుబయట వెన్నెలలో భోజనం చేయడం అనాదిగా వస్తున్నది. అయితే ఇక్కడ మీకొక సందేహం కలుగవచ్చు. చంద్రుడు నిరంతరం అమృతాన్ని ఇస్తాడు కదా అయితే ఈ రోజుకే ఎందుకంత ప్రాముఖ్యత అని? మీకు రాకపోయినా నాకు వచ్చిందిలెండి అందుకే సమాధానం ఇస్తున్నా చదివేయండి అదే కంటితో. ఆశ్వీయుజ, కార్తీక మాసాలు శరత్ ఋతువు. ఈ శరత్కాల చంద్రునికి మలినాలు ఉండవు. మబ్బులు కూడా తొలగి ఆకాశం ప్రశాంతంగా ఉండి చంద్రుని వెన్నెల, ప్రకాశం ఎక్కువగా ఉండే కాలం ఇది. ఈ కాలంలో ఏ రోజునయినా వెన్నెలలో అమృతం ఉంటుంది కానీ పౌర్ణమి నాడు నిండుగా ఉంటాడు కదా పైగా ఈ మాసంలో మొదటి పౌర్ణమి కనుక ఈ ఆశ్వీయజ శుద్ధ (శరత్) పౌర్ణమికి ప్రత్యేకత.
మన మామయ్యకి సంబంధించిన కొన్ని లలిత సంగీత పాటలను సేకరించి ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు అసలు విషయం మీకు తెలిసిపోయిందిగా ఇంకెందుకాలస్యం హాయిగా అలా వెన్నెల్లో భోజనం చేసేయండి నా మాట విని. ఈ candle light dinner కన్నా ఎంతో బాగుంటుంది మా మామయ్యతో కూర్చుని సహపంక్తి భోజనం చేయడం. మామయ్యకి వడ్డించడం మరువకండే!
