Tuesday, July 14, 2026

నిఘంటువులు

 


అన్నమయ్య కీర్తనలలోనూ, పంచ మహా కావ్యాలలోనూ, పురాణాది గ్రంధాలలోనూ అర్థ నిర్ణయం కాని దేశ్యపదాలు అసంఖ్యాకంగా వున్నాయి. ఆయా పదాలకు అర్థ నిర్ణయం చేయగల పండితుల సంఖ్య క్రమంగా మృగ్యమయిపోతోంది. ఒకప్పుడున్నన్ని పదాలు ఇప్పుడు వాడుకలో లేవు, కొన్ని పదాలు కాలగమనంలో రూపాంతరం చెందాయి. ఈ తరం పిల్లలకి కొన్ని అక్షరాలు కూడా తెలియవు (ఉదా: ఋ, ౠ, ఌ, ౡ, ఱ, మొ.,) అనటం అతిశయోక్తి కాదు. ఇదే విధంగా కొనసాగుతూ పోతే కొన్నేళ్ళకి మన పద సంపదంతా కరిగిపోయే ప్రమాదముంది. పద సంపద పూర్తిగా తరిగిన నాడు భాష ఉనికే ప్రశ్నార్ధకం. కనుక భాషను, భాష సంబంధిత పదజాలాలను పదిలపరచుకోవడానికి నిఘంటువులు అత్యావశ్యకమయినవి. నిఘంటువులనే కోశములు, అభిధానములు అని కూడా అంటారు.

 

కోశములు పండితులకీ, నిఘంటువులు సామాన్యులకీ పరిమితమయ్యాయి. నిఘంటువులు పూర్వకాలం నుండీ వున్నా, ముద్రణా యంత్రాంగ పరిజ్ఞానం బాగా విస్తరించాకే పుస్తకాల ప్రచురణ విస్తృతమయినది. దానితో భాషాభిమానులకు, జిజ్ఞాసకులకు నిఘంటువులు రోజువారీ జీవితంలో భాగమయిపోయాయి. కొంతకాలం ఈ నిఘంటు రచన పోటాపోటీగా జరిగేది. ఇంటర్నెట్ వచ్చిన తరువాత ఆన్లైన్ నిఘంటువుల వైపే జనాలు మొగ్గు చూపడం వలన ముద్రితా పుస్తకాలు తగ్గాయి. నిఘంటు రచన అంత తేలిక కాదు, కొన్ని విశ్వ విద్యాలయాలలో నిఘంటు రచన ఎలా చెయ్యాలో తెలుపుతూ నిఘంటుకారులకు ప్రత్యేకమయిన శిక్షణను కూడా ఇస్తున్నారు. పదాలను వాడుక భాషలో అర్థమయ్యేలా వ్రాయటమే కాకుండా ప్రతీ భాషలోనూ నిఘంటువులు లేనందున ప్రపంచంలోని ఇతర భాషలలోకి కూడా అనువదించి, తద్వారా అన్ని భాషలూ నేర్చుకోగలిగే విధంగా నిఘంటువులని తయారుచేశారు. ఆ విధంగా రూపొందించిన భాషా నిఘంటువులను ఆరు రకాలుగా విభజించారు:

 

1. సాధారణము: ఈ రకమయిన నిఘంటువులు ఒక పదానికి అర్థము, వాడుక, వ్యాకరణము, శబ్దము, శైలి, విశేషణాలు,మొ., తెలుపుతాయి.

2. ప్రత్యేకము: ఈ రకమయిన నిఘంటువులు కొన్ని ప్రత్యేకమైన అంశాలను తెలుపుతాయి. పదాలకి వాడే సంక్షిప్త రూపాలు, అనుగణ్యాలు, సామెతలు, మాండలికాలు, ఒక వృత్తికి సంబంధించిన వారికి మాత్రమే అర్థమయ్యే పదాలు, మొ., వాటిని తెలుపుతాయి.

3. ఏక భాషా: అధిక సంఖ్యలో మనకి లభ్యమవుతున్నవి ఇవే. 

4. అనువాద - ద్విభాషా లేదా బహుళభాషా: వీటిని మళ్ళీ రెండు రకాలుగా విభజించారు - Active నిఘంటువులు (మన మాతృ భాష నుండీ వేరొక భాషలలోకి తర్జుమా చెసినవి. ఉదా: తెలుగు - స్పానిష్, తెలుగు - ఇంగ్లీష్, తెలుగు - ఫ్రెంచ్, ఇలా) మరియు Passive నిఘంటువులు (వేరే ఏ భాషలోని నిఘంటువునయినా మన మాతృ భాషలోకి తర్జుమా చెసినవి. ఉదా: ఫ్రెంచ్ - తెలుగు, స్పానిష్ - తెలుగు, ఇంగ్లీష్ - తెలుగు, ఇలా) 

5. నిర్వచక లేదా వివరణాత్మక: వీటిని విజ్ఞాన సర్వస్వాలుగా చెప్పుకోవచ్చు. 

6. ప్రాపంచిక 

 

సమాచారాన్నీ, విజ్ఞానాన్నీ కూడా అందించే విజ్ఞానఖనులైన నిఘంటువుల పరిణామ క్రమాన్ని ముందుగా తెలుసుకుందాం.

 

శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా
కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః

అన్నారు. వేదాంగాలలో (శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము) ఒకటయిన నిరుక్తమును రచించినది యాస్కుడు (600 - 500 BC). పదాలన్నీ కూడా ధాతువుల నుండీ ఉద్భవించాయని తెలియచేస్తూ, వేద మంత్రాలలో వాడిన ప్రతీ పదానికీ వ్యుత్పత్యార్థం వివరిస్తూ రచించిన శాస్త్రమే నిరుక్తము. ఈ నిరుక్తముకే "వేద శబ్ద వివరణ నిఘంటువు" అని మరొక పేరు. ఆ విధంగా వ్యుత్పత్తుల ద్వారా మాత్రమే పదాలకు అర్థం తెలిసేది. తరువాత, ఒక్కో పదానికీ రెండు అర్థాలు వుంటాయని వివరిస్తూ బాణుడు వ్రాసిన "శబ్ద రత్నాకరము", శ్రీహర్షుడు, మయూరుడు, మురారి మొదలయిన వారు రచించినవన్నీ "శ్లేషార్థ పదసంగ్రహ" కోవలోకి వస్తాయి. 

 

శబ్దార్ణవ ఉత్పాలినీ సంసారావర్త ఇతి అపి

కోశా వాచస్పతి వ్యాడి విక్రమాదిత్య నిర్మితః


అన్నట్టుగా వాచస్పతి వ్రాసిన "శబ్దార్ణవము లేదా శబ్ద కోశము", వ్యాడుడు వ్రాసిన "ఉత్పాలిని", విక్రమాదిత్యుడు వ్రాసిన "సంసారావర్తము" మొట్టమొదటి నిఘంటువులుగా చెప్పుకోతగినవి. కాత్యాయనుడు (3 BC) వ్రాసిన "నామమాల" కూడా వీటికి సమకాలీన నిఘంటువు. ఇప్పటిదాకా చెప్పుకున్న నిఘంటువులన్నీ ఎక్కువగా పదము యొక్క నామవాచక రూపం ఆధారంగా చేసుకుని వివరించినవే!

 


అమరసింహుడు (నాల్గవ శతాబ్దము) వ్రాసిన "నామలింగానుశాసనం" అనే నిఘంటువులో మొదటిసారిగా పదాల లింగాలను (స్త్రీలింగం/పుల్లింగం/నపుంసక లింగం) వివరిస్తూ నామాల వివరణ కూడా తెలిపాడు. అదేవిధంగా, దీనిలో మొట్టమొదటి సారిగా పదాల వర్గీకరణను కూడా మనం గమనించవచ్చును. ఇందులో, పదాలను మూడు కాండలు (మొదటి కాండ స్వర్గాది, రెండవ కాండ భూవర్గాది, మూడవది సామాన్యాది)గా వర్గీకరించడం వలన చదువుకునేవారికీ, ఒక పదానికి సంబంధించిన అర్థం వెతుక్కునేవారికీ కూడా సులభమయ్యింది. ఇందులో మూడు కాండలు ఉండటం వలననే దీనిని త్రికాండము అంటారు. ఒక రంగము లేదా విభాగానికి సంబంధించిన మొత్తం పరిజ్ఞానాన్ని కలిగి వుండే నిఘంటువుని కోశము అంటారు. ఒకరకముగా కోశములన్నీ కూడా నిఘంటువులకి ప్రాధమిక రూపాలుగా చెప్పుకోవచ్చును. ఈ కోశములు రెండు రకాలు: నామమాత్రతంత్ర (నామాలను లేదా పదాలను కలిగి వుండేవి), లింగమాత్రతంత్ర (నామాల లేదా పదాల లింగమును తెలియచేసేవి). ఈ రెండు రకముల కోశ లక్షణాలూ వున్నందువలననే అమరసింహుడు వ్రాసిన నామలింగానుశాసనాన్ని అమరకోశము అంటారు. "అమరము రానివారికి నేనమరను" అని వాగ్దేవి చెప్పిందని పెద్దల విశ్వాసం. అందువలననే ప్రతీ ఒక్కరూ దీనిని చదవాలన్న సదుద్దేశ్యంతో ఈ అమరకోశమును ఒకనాడు మన జాతీయ పాఠ్యపుస్తకం చేశారు. బాగా ప్రసిద్ధి చెంది, మనకి లభ్యమవుతున్న పురాతన నిఘంటువులలో ఇది చాలా ముఖ్యమయినది. ఇంచుమించుగా ఇదే సమయంలో శాశ్వతుడు "అనేకార్థ సముచ్చయ" (ఇది అంతగా చదువరులను ఆకట్టుకోలేకపోవడానికి ముఖ్య కారణం పదాల వర్గీకరణ లేదా విభజన లేకపోవడమే) అనే నిఘంటువును, మహాక్షపణకుడు (10AD అని చరిత్రకారుల అభిప్రాయం) "అనేకార్థ ధ్వనిమంజరి" (ఇందులో నాలుగు అధ్యాయాలు - శ్లోకాధికారము, అర్థ శ్లోకాధికారము, పాదాధికారము మరియు వివిధాధికారము వుంటాయి) అనే నిఘంటువును రచించారు. పురుషోత్తమదేవుడు కూడా "త్రికాండ శేషము"ను వ్రాసి, దానినే కుదించి "హారావళి" (దీనినే హారావళి కోశము అంటారు)ని రచించాడు. ఈ హారావళిలో అప్పటిదాకా వెలువడిన వేరే ఏ నిఘంటువులలోనూ చోటు చేసుకోని (బౌద్ధ) పదాలను ఎక్కువగా చేర్చి, అర్థ వివరణ ఇవ్వటం వలన జనాదరణ పొందినది. 

 

సంస్కృత నిఘంటువులు రెండు రకాలు: సమానార్థ నిఘంటువులు (ఏకార్థ నిఘంటువులు - వీటిలో పదాలు అంశముల క్రమములో అమరి వుంటాయి), నానార్ధ నిఘంటువులు (అనేకార్థ నిఘంటువులు - వీటిలో పదాలు అంత్యాక్షర లేదా ఆద్యక్షర క్రమములో అమరి వుంటాయి). కేవలం నామవాచక రూపంలోనే కాకుండా, ఒక పదానికి క్రియా రూపం, క్రియా విశేషణ రూపం కూడా వుంటాయి, ఆ రూపాలలో పదాల అర్థాలు మారతాయి కనుక వాటిని కూడా నిఘంటువులలో చేర్చాలన్న ఉద్దేశ్యంతో వచ్చినవే అనేకార్థ నిఘంటువులు. వీటిలో హలాయుధుడు (10AD) వ్రాసిన "అభిధాన రత్నమాల" [ఇందులో పదాలను అయిదు (స్వర్గ, భూమి, పాతాళ, సామాన్య పర్యాయపదాలు, సామాన్య నానార్థాలు) కాండలుగా విభజించాడు], యాదవ ప్రకాశుడు (11AD) వ్రాసిన "వైజయంతి" (ఇందులో పదాలను రెండు భాగాలుగా ఏర్పాటు చేసి, మొదటి భాగంలో పర్యాయపదాలను, రెండవ భాగంలో నానార్థాలను వివరించాడు, మొదటిసారిగా ఒక పదాన్ని ఎలా పలకాలో ఇందులో వివరించాడు), ధనుంజయ మహాకవి (1123-1140) వ్రాసిన "పర్యాయ శబ్దరత్న" మరియు "నామమాల" (ఇది 200 శ్లోకాలతో, జనపదాలతో రూపొందించబడింది), అమరకీర్తుడు వ్రాసిన "అనేకార్థ నామమాల" (కేవలం 46శ్లోకాలతో ధనుంజయుని నామమాలను ఆధారంగా చేసుకుని రచించాడు), హేమచంద్ర సూరి (12AD) వ్రాసిన "అనేకార్థ సంగ్రహము" (ఇందులో పదాలను ఆద్యక్షరాలను, అంత్యహల్లులను ఆధారంగా చేసుకుని ఏర్పాటుచేశాడు) మరియు "అభిధాన చింతామయి" (ఇందులో దేవాధిదేవ, దేవ, మర్త్య, భూమి, మొదలైన విభాగాలలో ఒక పదాన్ని ఎన్ని రకాలుగా, ఎలా వాడవచ్చో వివరించాడు), కేశవస్వామి (12AD) వ్రాసిన "నామార్థార్ణవ సంక్షేపము", మహేశ్వర కవి (12AD) వ్రాసిన "విశ్వ ప్రకాశము", అభ్యపాలుడు (12AD) వ్రాసిన "నామార్థ రత్నమాల", మంఖుడు (12AD) వ్రాసిన "అనేకార్థ కోశము", మల్లభట్టు (12AD) వ్రాసిన "అఖ్యాత చంద్రిక" (ఇందులో క్రియా రూపంలో వున్న పదాలకు అర్థ వివరణ వుంటుంది), ధరణిదాసుడు (12AD) వ్రాసిన "అనేకార్థ సారము", మేదినీకారుడు (14AD) వ్రాసిన "మేదినీ కోశము" (దీనినే అనేకార్థ శబ్దకోశము అని కూడా అంటారు. ఇందులో పదాలను క-కారాంత, ఖ-కారాంత, గ-కారాంత, ఘ-కారాంత,మొ., క్రమంలో ఏర్పాటు చేశాడు), శ్రీధరసేనుడు వ్రాసిన "విశ్వలోచన లేదా ముక్తావళి" దండాదినాథుడు (14AD) వ్రాసిన "నానార్థ రత్నమాల", వామనభట్ట బాణుడు (15AD) వ్రాసిన "శబ్ద చంద్రిక" మరియు "శబ్ద రత్నాకరము", పద్మసుందరుడు (16AD) వ్రాసిన "సుందర ప్రకాశ శబ్దార్ణవము", అప్పయ్య దీక్షితులు (17AD) వ్రాసిన "నామ సంగ్రహమాల", తారానాథ తర్క వాచస్పతి (18AD) వ్రాసిన "వాచస్పత్యము" (వేదాంతము యొక్క సనాతన, అత్యాధునిక వ్యవస్థలలో వుండే నిబంధనలు, సిద్ధాంతాలను కూడా వివరించింది) ముఖ్యమయినవి. 

 

కావ్యాలలో ఉపయోగింపబడుతూ, జనవ్యవహారంలో కాలానుగుణమైన మార్పులకు లోనయ్యి, పరభాషా పదములతో చెలిమి చేసి, అరమరికలు లేకుండా ఒదిగిపోయిన మన తెలుగు భాషలో కూడా నిఘంటు రచన మొదలుపెట్టారు. తెలుగు నిఘంటువులు రెండు రకములు: పద్యరూప నిఘంటువులు మరియు పదరూప నిఘంటువులు. పద్యరూప నిఘంటువులలో పదములకు సంబంధించిన వివరణంతా ఒక పద్య రూపంలో వుండటం వలన గుర్తు పెట్టుకోవడానికి, మననం చేసుకోవడానికీ వీలుగా వుంటుంది. ఇటువంటి పద్యరూప నిఘంటువులలో - కవి రాక్షసుడు వ్రాసిన "శబ్దార్థ నిర్ణయము", గణపవరపు వేంకటకవి వ్రాసిన "వెంకటేశ ఆంధ్రము" మరియు "దేశీయ ఆంధ్ర నిఘంటువు", ధూర్జటి వెంకటరాయ కవి వ్రాసిన "పద్యరూప అమర కోశము", పైడిపాటి లక్ష్మణ కవి వ్రాసిన "ఆంధ్ర రత్నాకరము" మరియు "ఆంధ్ర నామసంగ్రహము", అడిదం సూరకవి వ్రాసిన "ఆంధ్ర నామవిశేషము", విరపరాజు వ్రాసిన "ఆంధ్ర పదకారం", ప్రగడకవి వ్రాసిన "నానార్థ నిఘంటువు", నందపాక పార్వతీశ్వర శాస్త్రి వ్రాసిన "అక్షర మాలికా నిఘంటువు", జయరామరాయులు వ్రాసిన "జయరామ నానార్థ నిఘంటువు" (ఇది మూడు భాగాలుగా వెలువడింది : నానార్థ నిఘంటువు, అర్థానుస్వార నిఘంటువు మరియు శకటరేఫ నిఘంటువు), కస్తూరి రంగ కవి వ్రాసిన "సాంబ నిఘంటువు", నుదురుపాటి వెంకటకవి వ్రాసిన "ఆంధ్ర భాషా అర్ణవము" ముఖ్యమయినవి. చౌడప్ప కవి కూడా "36 సీస పద్యాల" రూపంలో ఒక నిఘంటువును రచించారు. ఇన్ని రకాల నిఘంటువులు మనకు అందుబాటులోకి వచ్చినా, అప్పటిదాకా ఉన్నవన్నీ కూడా పద్య నిఘంటువులు కావడంతో, పద నిఘంటు రచనకు పూనుకున్నారు కవులు.

 

తెలుగులో పదరూప నిఘంటువులు 19వ శతాబ్దంలోనే వచ్చాయి. వీటిల్లో మనకి పాశ్చాత్య దేశ భాషల నిఘంటువుల ప్రభావము ఎక్కువగా కనిపిస్తుంది. అందువలననే, పదరూప నిఘంటువులలో పదాలు వర్ణమాల క్రమములో అమరి ఉండటమే కాకుండా, పాశ్చాత్య భాషల నిఘంటువుల మాదిరిగానే ఆ పదాన్ని ఎలా పలకాలి, కఠినమయిన పదాలకి సామాన్యమయిన అర్థం ఏమిటి, వాటి నానార్థాలు, పర్యాయపదాలు, ఏ భాషాభాగం, సంబంధిత పదాలు ఏమిటి, మొదలయినవన్నీ చేర్చి ఒక సంపూర్ణతను తీసుకునివచ్చారు. తెలుగులో మొట్టమొదటగా చెప్పుకోదగిన నిఘంటువు మామిడి వెంకటరాయ కవి వ్రాసిన "ఆంధ్ర దీపిక" (1816) కాగా మొట్టమొదటి పద నిఘంటువుగా పేరొంది, సులభంగా రూపొంది, అందరికీ అందుబాటులోకి వచ్చిన నిఘంటువు జయంతి రామయ్య పంతులు వ్రాసిన "సూర్యరాయాంధ్ర నిఘంటువు" (1936).

 

పరవస్తు చిన్నయసూరి వ్రాసిన "చిన్నయసూరి నిఘంటువు" పదాలను ఎలా వాడాలో ప్రామాణిక రచనలను ఆధారంగా చేసుకుని విశదీకరించింది. ఇది ఏడు సంపుటాలుగా వెలువడింది. తరువాత వచ్చిన ఎన్నో నిఘంటువులకి ఇదొక తలమానికగా నిలిచింది. పరవస్తు వెంకట రంగాచార్యులు వ్రాసిన "శబ్దార్థ సర్వస్వం" కూడా చిన్నయసూరి నిఘంటువు ఆధారంగా వెలువడినదే. బహుజనపల్లి సీతారామాచార్యులు వ్రాసిన "శబ్ద రత్నాకరము", "వైకృత పద దీపిక", "బాల చంద్రోదయము" (పిల్లల కోసం వ్రాసిన లఘు నిఘంటువు) మరియు "పదార్థ నామకోశము" ఎంతో అపురూపమయినవి. శబ్ద రత్నాకరము లేని ఇల్లు వుండదేమో! ఇందులోని శబ్దముల రూప నిర్ణయం, అర్థ నిర్ణయం శాస్త్ర సమ్మతమయినవి. అక్షర క్రమంలో రచింపబడిన నిఘంటువులలో ఇది అత్యంత శ్రేష్టమయినది. ఓగిరాల జగన్నాథకవి మరియు గురజాడ శ్రీరామమూర్తి వ్రాసిన "ఆంధ్ర పదపారిజాతం", మహంకాళి సుబ్బారాయుడు వ్రాసిన "శబ్దార్థ చంద్రిక", పి. శ్రీరాముల రెడ్డి వ్రాసిన "రామచంద్ర విద్యార్థి కోశము" (ముఖ్యముగా పాఠశాలలోని విద్యార్ధినీ, విద్యార్ధుల కోసం వ్రాసినది), తాటికొండ తిమ్మారెడ్డి వ్రాసిన "శబ్దార్థ చింతామణి" (1906, ఇందులో తెలుగు పదాలకు వివరణతో పాటూ ఉర్దూ పదాలను కూడా చేర్చారు), కోట్ర లక్ష్మీనారాయణ శాస్త్రి వ్రాసిన "లక్ష్మీ నారాయణీయం" (1907, ఇందులో జాను తెలుగు పదాల వివరణ వుంటుంది), కోట్ర శ్యామల కామశాస్త్రి వ్రాసిన "ఆంధ్ర వాచస్పత్యము"ల తరువాత జయంతి రామయ్య పంతులు వ్రాసిన "సూర్యరాయాంధ్ర నిఘంటువు" 1936లో వెలువడింది. అటు పిమ్మట శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి, బులుసు వెంకటేశ్వర్లు మరియు వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి వ్రాసిన "వావిళ్ల నిఘంటువు" (1949), చెలమచెర్ల రంగాచార్యులు వ్రాసిన "ఆంధ్ర శబ్ద రత్నాకరము", భమిడిపాటి అప్పయ్యశాస్త్రి వ్రాసిన "శబ్ద కౌముది" (ఆంధ్ర నిఘంటువు), విక్రాల శేషాచార్యులు వ్రాసిన "సంస్కృతాంధ్ర పదార్ణవము", చిలుకూరి నారాయణరావు వ్రాసిన "సంస్కృతాంధ్ర పదనిఘంటువు", "అచ్చ తెలుగు నిఘంటువు" మరియు "నన్నయ భారత పదకోశము" వెలువడ్డాయి. ఇవేగాక శబ్దార్థ దీపిక, తెలుగు జాతీయములు - పదబంధ పారిజాతము, మాండలిక పద కోశము, మొదలయినవెన్నో నిఘంటువులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.

 

ఇప్పటిదాకా మనం చర్చించుకున్నవన్నీ కూడా ఏకభాషా నిఘంటువులు. కానీ, అదే సమయంలో మనకి ద్విభాషా నిఘంటువులు కూడా చాలానే వెలువడ్డాయి. ఒక క్రొత్త భాష నేర్చుకోవాలన్నా, ఇతర భాషీయులు మన భాషను చదివి ఆస్వాదించాలన్నా నిఘంటువులు సహకరిస్తాయి. బ్రిటిషు వారు మన దేశాన్ని పరిపాలించిన సమయములో ఆంగ్లేయులు సైతం తెలుగు నిఘంటు రచనకు పూనుకుని ఎన్నో ద్విభాషా నిఘంటువులను మన ముందుకి తీసుకువచ్చారు. వారిలో William Brown (తెలుగు - ఇంగ్లీష్ నిఘంటువు, 1818), A.C.Campbell (తెలుగు - ఇంగ్లీష్ నిఘంటువు, 1821), Morres (తెలుగు - ఇంగ్లీష్ నిఘంటువు (1835) ప్రముఖులు. తెలుగు లిపి సంస్కర్త, ఆంధ్ర భాషోద్ధార బిరుదాంకితుడయిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ రచించిన "బ్రౌణ్య నిఘంటువు" (1852-1854) తో తెలుగు నిఘంటు రచనలో ఆధునిక యుగం ఆరంభమయినదని చెప్పవచ్చు. వీటన్నిటి తరువాత వచ్చిన శంకర నారాయణ తెలుగు - ఇంగ్లీష్ నిఘంటువు (1891) బాగా జనాదరణ పొందినది. ఆ తరువాత కాలగమనంలో ఎన్నో ద్విభాషా నిఘంటువులు వచ్చాయి. 

 

ప్రపంచీకరణ, ఆధునికతల వలన ప్రతీ భాషా మిగతా భాషలతో కలగలిసి మిశ్రమ భాషగా మారుతోంది. మనం నిత్యం వాడే పదాలలో ఆంగ్లము, హిందీ, ఉర్దూ ఎక్కువగా వుంటాయి కానీ వాటి సరయిన తెలుగు పదాలు తెలియవు. అంతేకాక, ఒకే భాషలోని పదానికి ప్రాంతాలను బట్టీ అర్థాలు మారిపోతుంటాయి. భాషను సజీవంగా వుంచడానికి, భాషలో క్రొత్తగా చేరిన పరభాషా పదాలకీ, ప్రాంతీయ పదాలకీ అనుగుణంగా పదాల నిర్మాణం జరిగి ఒక ప్రామాణిక నిఘంటువు రూపొందాలి. ఈ నిఘంటువులు మన భాషకే పరిమితం కాకుండా ప్రపంచ భాషల అనుసంధానికి ఉపయోగపడే వారధులని గుర్తుంచుకుని, వాటి అభివృద్ధికి సాయపడదాం.         

 

ఆధారాలు:

1. A History of Indian Literature : Indian Lexicography, Claus Vogel, 1979

2. Encyclopedia of Indian literature, Amaresh datta, 1988

3. A Companion to Sanskrit Literature, Sures Chandra Banerji, 1989

4. A History of Sanskrit Literature, A.berriedale Keith, 1993

Friday, March 28, 2014

"మన్వ" చరిత్ర


శీర్షిక చూసి అచ్చు తప్పు అని మాత్రం అనుకోకండి, నేను ఇక్కడ వ్రాయదలుచుకున్నది మన్వంతరాల గురించి కనుక ఏదో అలా కలిసొస్తుందని పెట్టాను అంతే. వేరే దేశంలో వున్నవాళ్ళని తప్పకుండా అడిగే ప్రశ్నలు - మీకు టైం ఎంత?, అక్కడ ఉష్ణోగ్రత ఎంత? అని. ఆలోచిస్తే చాలా విచిత్రంగా, కొంచెం అర్థమయినట్టు, అస్సలేమీ అర్థం కానట్టు అనిపిస్తుంది నాకయితే. కాల చక్రానికి, జీవుల ఉనికికి, ఉష్ణోగ్రతకి వున్న సంబంధాన్ని వెతుకుతూ నా పరిధి మేరకు ఆలోచించి వ్రాస్తున్న టపా. తప్పులుంటే సరిదిద్ది, కాస్త ఓపిక చేసుకుని చదవండి. 


ముందుగా మన కాల ప్రమాణాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
2 పరమాణువులు = 1 అణువు
3 అణువులు = 1 త్రెస రేణువు
3 త్రెస రేణువులు దాటడానికి సూర్యునికి పట్టే కాలాన్ని 1 తృటి అంటారు
100 తృటులు = 1 వేధ
3 వేధలు = 1 లవం
3 లవాలు = 1 నిమేషం (మన సెకనులో 16/75వ భాగం)
3 నిమేషాలు = 1 క్షణం
5 క్షణాలు = 1 కాష్ట
15 కాష్టలు = 1 లఘువు
15 లఘువులు = 1 నాడి లేదా 1 ఘడియ
2 నాడులు = 1 ముహూర్తం
7 నాడులు = 1 యామం; 7 1/2 ఘడియలు = 1 ఝాము
8 ఝాములు లేదా 8 యామాలు = 1 రోజు
15 రోజులు = 1 పక్షం
2 పక్షాలు = 1 మాసం లేదా నెల; 40 రోజులు = 1 మండలం 
2 నెలలు = 1 ఋతువు
3 ఋతువులు = 1 ఆయనం
2 ఆయనాలు = 1 మానవ సంవత్సరం
30 మానవ సంవత్సరాలు = 1 నెల (దేవతలకు) - అనగా మన కాల ప్రమాణము కన్నా దేవతల కాల ప్రమాణము 360 రెట్లు ఎక్కువ.
43,20,000 మానవ సంవత్సరాలు = 1 మహా యుగం (1 కృత లేదా సత్య యుగము + 1 త్రేతా యుగము + 1 ద్వాపర యుగము + 1 కలి యుగము = 17,28,000 + 12,96,000 + 8,64,000 + 4,32,000 మానవ సంవత్సరాలు)
71 మహా యుగాలు = 1 మన్వంతర కాలం = ప్రజాపతి ఆయుర్దాయం
14 మన్వంతరాలు = 1 కల్పం 
30 కల్పాలు = 1 మహాకల్పం 

శ్రీ స్కాంద పురాణం ప్రకారంగా ఆ 30 కల్పాలూ - శ్వేత వరాహ, నీలలోహిత, వామదేవ, రత్నాంతర, రౌరవ, ప్రాణ, బృహత్, కందర్ప, సద్యత, ఈశాన, ధ్యాన, సారస్వత, ఉదాన, గరుడ, కౌర్మ, నారసింహ, సమాధి, ఆగ్నేయ, విష్ణుజ, సౌర, సోమ, భావన, సుపుమ, వైకుంఠ, అర్సిస, వలి, వైరజ, గౌరీ, మహేశ్వర మరియు పితృ. 



వీటినే మరికాస్త వివరంగా ఈ చిత్రంలో పొందుపరిచాను. అయితే, ఇందులో క్రొత్తగా చేర్చినది సంధి కాలము. ప్రతీ యుగ కాలానికీ ముందు, వెనుక వుండే కాలాన్నే సంధి కాలం అంటారు. యుగ కాల మొత్తం = యుగ కాలం + యుగానికి ముందు వచ్చే సంధికాలం + యుగానికి తరువాత వచ్చే సంధి కాలం. ఉదా: మానవ కలియుగం తీసుకుందాం 
కలియుగ కాల మొత్తం = కలియుగ కాలం + 2 (కలి యుగ సంధి కాలం)
                          = 3,60,000 + 2 (36,000) = 4,32,000

ఒక యుగం నుండీ మరొక యుగానికి కాల మొత్తాన్నీ, ఆయుర్దాయాన్నీ గమనిస్తే వాటి నిష్పత్తులు ఈ విధంగా వున్నాయి కృత:త్రేతా:ద్వాపర:కలి = 4:3:2:1 కనుక దీనినే నేను 1 మహా యుగం = 10 కలియుగాలు అని అంటాను. ఎందువలననగా, 1 మహాయుగం = కృత యుగం (4 x కలియుగం) + త్రేతా యుగం (3 x కలియుగం) + ద్వాపర యుగం (2 x కలియుగం) + కలియుగం = కలియుగం x (4+3+2+1). అలాగే ప్రతీ మన్వంతరానికీ అటు, ఇటు కూడా సంధి కాలాలు వుంటాయి. 1 మన్వంతర సంధి కాలం 1 కృత యుగ కాలంతో సమానం కనుక 1మన్వంతర సంధి కాలం = 4 కలియుగాలు. 

బ్రహ్మగారి ఆయుర్దాయము వంద సంవత్సరాలు కాగా, ప్రతీ నెలకీ ఒక మహాకల్ప కాలం గడుస్తుంది. మొదటి కల్ప కాలం బ్రహ్మకి పగలు, దానినే సర్గము అంటారు. రెండవ కల్ప కాలం బ్రహ్మకి రాత్రి, దానినే ప్రళయం అంటారు. మళ్ళీ మూడవ కల్ప కాలం సర్గ, నాల్గవ కల్ప కాలం ప్రళయం అవుతాయనమాట! ఈ విధంగా చూసుకుంటే ఇదొక నిరంతర చక్రం. సర్గ కాలంలో సృష్టి జరిగితే ప్రళయ కాలంలో సృష్టంతా నశిస్తుంది.  ప్రళయ కాలంలో సృష్టి ఎలా నశిస్తుంది అంటే: 

చతుర్విధాని భూతాని సమయాంతి పరిక్షయం
తదా తప్త శిఖాకారై రూపేతో ఘర్మ దీధితిః
మయూఖై రగ్ని సదృశైః వమద్భిః పావకచ్ఛటాః
తతో విధాతుర్గాత్రేభ్యః సముత్పన్నా మహాఘనాః 

అనగా పంచ భూతాలలో నాలుగు (ఆకాశం, గాలి, నీరు, భూమి) నశించిపోగా, అయిదవదయిన అగ్ని మాత్రం విజృంభిస్తుంది. ఈ అగ్ని జ్వాలలకే గ్రామాలు, అడవులు, కొండలు, అన్నీ మాడి మసి అయిపోతాయి. కాల్చిన ఇనుప గుండు లాగా భూగోళం మారిపోతుంది. ఆ విధంగా సృష్టంతా నశించిపోతుంది. ఆ తరువాత మళ్ళీ కల్ప కాలం సర్గతో మొదలవుతుంది, మళ్ళీ సృష్టి మన్వంతరాలతో మొదలవుతుంది. మన్వంతర కాలాన్ని పరిపాలించే ప్రభువే మనువు. మనకు 14 మన్వంతరాలు కనుక 14 మనువులున్నారు. వారు  

1) స్వాయంభువుడు - స్వాయంభువ మన్వంతరం      2) స్వారోచిషుడు - స్వారోచిష మన్వంతరం 
3) ఉత్తముడు - ఉత్తమ మన్వంతరం                     4) తామసుడు - తామస మన్వంతరం
5) రైవతుడు - రైవత మన్వంతరం                        6) చాక్షుషుడు - చాక్షుష మన్వంతరం 
7) వైవస్వతుడు - వైవస్వత మన్వంతరం                8) సూర్య సావర్ణి - సూర్య సావర్ణ మన్వంతరం
9) దక్ష సావర్ణి - దక్ష సావర్ణ మన్వంతరం                10) బ్రహ్మ సావర్ణి - బ్రహ్మ సావర్ణ మన్వంతరం
11) ధర్మ సావర్ణి - ధర్మ సావర్ణ మన్వంతరం             12) రుద్ర సావర్ణి - రుద్ర సావర్ణ మన్వంతరం             
13) దేవ సావర్ణి - దేవ సావర్ణ మన్వంతరం              14) చంద్ర సావర్ణి - చంద్ర లేదా భౌమ్య సావర్ణ మన్వంతరం
    
మన్వంతరాల గురించి మనకు తెలిసిన విషయాలనన్నిటినీ క్రూడీకరించి చూస్తే సృష్టి పరిణామ క్రమం తెలుస్తుంది. సరిగ్గా ఈ విషయాన్నే వివరిస్తూ IAS అధికారి అయినటువంటి డా.సుఖ్ లాల్ ధని గారు ఒక వ్యాసాన్ని వ్రాశారు. ఆ వ్యాసంలోని ముఖ్యమయిన అంశాలను మనకు తెలిసిన అంశాలతో పోలుస్తూ, నా ఆలోచనలను యిక్కడ వ్రాస్తున్నాను.  

1) స్వాయంభువ మన్వంతరం (ప్రస్తుత కాలానికి 1973-1665 మిలియన్ సంవత్సరాల క్రితం) - Matter evolved into solar system: 
గ్రహాలూ, నక్షత్రాలూ, ఏమీ లేకుండా కేవలం శూన్యం మాత్రమే నిండి వున్న సమయంలో అనుకోకుండా ఎక్కడనుండో ఘర్.. ఘర్.. అనే శబ్దం వచ్చి, దాని నుండీ సృష్టి చక్రం మొదలయ్యింది. చీకటి నుండీ ఒక చిన్న మెరుపు (nebula), ఆ మెరుపు నుండీ క్రమంగా పరిణామ చక్రం మొదలయ్యాయి. ఇవన్నీ వాటంతట అవే, వేరేవాటి ప్రమేయం లేకుండా జరిగిపోయాయి కనుకనే ఈ సమయానికి స్వాయంభువు అనే పేరు కలిసింది. స్వయంభువు అనగా తనంతట తానుగా అని అర్థం కదా! అయితే దీనినే ఆధ్యాత్మికంగా చూస్తే, ప్రణవమయిన "ఓం" అనే శబ్దం నుండీ సృష్టి చక్రం మొదలయ్యింది. అలాగే నిరాకారమయిన జ్యోతి నుండే పరిణామ చక్రం కూడా మొదలయ్యింది. మన పురాణాల (శ్రీ బ్రహ్మ వైవర్త పురాణం) ప్రకారం బ్రహ్మ ముఖము నుండీ స్వాయంభువ మనువు ఉద్భవించాడు. బ్రహ్మ- జ్యోతి స్వరూపుడు కనుక, ఆయన నుండీ వచ్చిన స్వాయంభువ మనువుని పరిణామ చక్రానికి మూలాధార పురుషునిగా పరిగణించి ఉండవచ్చును అని నా అనుకోలు.  

2) స్వారోచిష మన్వంతరం (ప్రస్తుత కాలానికి 1665-1356 మిలియన్ సంవత్సరాల క్రితం) - Sun assumes self-shining quality: 
మొదట చిన్నగా ఆవిర్భవించిన మెరుపు కొంతకాలానికి బాగా వేడెక్కి, మండే గోళంలా మారింది. అనగా చిన్నగా వున్న మెరుపు ఒక స్వయం ప్రకాశిత గోళంలా మారింది కనుకనే ఈ సమయానికి స్వారోచిషము అన్న పేరు సరిపోయింది. స్వారోచిషము అనగా స్వయం ప్రకాశితం అని అర్థం కదా! ఇదే సమయములో, మెరుపు వేర్వేరు స్వయం ప్రకాశిత గోళాలుగా కూడా విభజన చెందింది. శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం ప్రకారం స్వారోచిష మనువు అగ్నిదేవుని పుత్రుడు. కానీ శ్రీ దేవీ భాగవతం పరంగా చూస్తే, స్వారోచిష మనువు స్వాయంభువ మనువు యొక్క మనవడు  (స్వాయంభువుని పుత్రుడైన ప్రియవ్రతుని కుమారుడు). ఇతను 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి అమితమయిన కాంతితో కూడిన దేవీ కృపను మరియు మన్వంతర రాజ్యాన్ని పొందాడు. ఇక్కడ మెరుపు గోళంలా మారి, అనేక గోళాలుగా విభజన చెందడం అనే విషయాన్నే వేరొక తరముగా (next generation) చూపించి వుండవచ్చును. 

3) ఉత్తమ మన్వంతరం (ప్రస్తుత కాలానికి 1356-1047 మిలియన్ సంవత్సరాల క్రితం) - Sun becomes golden yellow star: 
స్వయం ప్రకాశిత గోళంలా వున్న వెలుగు, ఒక నిర్దిష్టమయిన ఆకారాన్ని, పరిమాణాన్ని, ఉష్ణోగ్రతను చేరుకొని, సకల జీవకోటిని, సృష్టిని నిర్వహించగల సామర్ధ్యాన్ని సంపాదించుకుని సూర్యునిగా స్థిరపడింది. అనగా సూర్యుడు ఒక సంపూర్ణ నక్షత్రంగా మారి, అన్నిటికీ అధిపతి అయ్యాడు కనుకనే ఈ సమయానికి ఉత్తమ అనే పేరు బాగా నప్పింది. శ్రీ దేవీ భాగవతంలో  ప్రియవ్రతుని పుత్రుడే ఉత్తముడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు అని వుంది. ఇందాకా అన్వయించుకున్నట్టు తరువాతి తరం మార్పుని సూచిస్తే, ఒకే తరం వున్నదానిలోనే చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుని ఒక స్థానాన్ని పొందింది అనుకోవచ్చుననుకుంట. 

4) తామస మన్వంతరం (ప్రస్తుత కాలానికి 1047-738 మిలియన్ సంవత్సరాల క్రితం) - Era of darkness: 
స్వారోచిష సమయమప్పుడు ఏర్పడిన మిగతా స్వయం ప్రకాశిత గోళాలలో భూమి ఒకటి. అది కొంతకాలానికి ఘనీభవించి తన ప్రకాశాన్ని కోల్పోయింది. దానితో, సూర్యునికి భూమి ఎటువైపు వుంది అన్నదాన్ని బట్టీ పగలు, రాత్రీ ఏర్పడ్డాయి. ఈ సమయంలో జరిగిన ముఖ్యమయిన పరిణామాలు - భూమి ప్రకాశాన్ని కోల్పోవడం (వెలుగు లేకపోవడం),  రాత్రి ఏర్పడటం కనుక దీనికి తామసము అనే పేరు సరయినది. తామసి అనగా చీకటి అని అర్థం కదా! శ్రీ దేవీ భాగవతం ప్రకారంగా తామసుడు కూడా ప్రియవ్రతుని కుమారుడే. ఇందాకా చెప్పుకున్నట్టు ఇది కూడా అదే తరం కనుక ఒక సర్దుబాటుగా తన గుణాన్ని కోల్పోయి వుండవచ్చును.

5) రైవత మన్వంతరం (ప్రస్తుత కాలానికి 738-429 మిలియన్ సంవత్సరాల క్రితం) - Formations of mountains and oceans, etc.: 
కొన్ని మిలియన్ సంవత్సరాల పాటూ భూమి మీద వాన కుండపోతగా కురవటం వలన నదులు, సముద్రాలు, పర్వతాలు, ఏర్పడగా ఇంకా మిగిలిన నీరు మేఘాలుగా ఏర్పడింది. ఆ తరువాతనే భూమి మీద మొదటిసారిగా చలనం మొదలయ్యి, సుడిగాలులు, సుడిగుండాలు, కెరటాలు ఏర్పడ్డాయి. రైవతం అనగా కదలిక, చలనం అనే అర్థాలున్నాయి. శ్రీ దేవీ భాగవతంలో రైవతుడు తామసుని సోదరుడు, ఇతను సర్వ సిద్ధులు లభించే శక్తిని పొందాడు అని వున్నది. బహుశః ఆ శక్తికీ, ఈ చలనానికీ ఏమయినా పొంతన వుందేమో?

6) చాక్షుష మన్వంతరం (ప్రస్తుత కాలానికి 429-120 మిలియన్ సంవత్సరాల క్రితం) - Emergence of conspicuous life in abundance: 
ఈ సమయంలోనే మొదటిసారిగా గుర్తించదగిన సృష్టి జరిగినది. సముద్రంలోని నీరు ఆవిరయ్యి (దీనికి కావలసిన వేడి సూర్యుని ద్వారా లభిస్తుంది) మరలా భూమిని వాన రూపంలో చేరుకోవడం అనే నిరంతర ప్రక్రియ జరగడం వలన జీవం ఆవిర్భవించింది. ఈ జీవ ఆవిర్భవాన్ని కనుల రూపంలో సూచించారు, అనగా కనులున్న జీవులు (పశు పక్ష్యాదులు) ఆవిర్భవించాయి కనుక చాక్షుష అనే పేరు తగినది. చాక్షుష అనగా చక్షువులు (కనులు) కలిగినవి అని అర్థం కదా! ఈ మన్వంతర ప్రభువయిన చాక్షుషుని ఆవిర్భావం గురించి నాకు పెద్దగా తెలియదు కానీ ఈ మనువు ప్రస్తావన మత్స్య, కూర్మ, వరాహ పురాణాల్లో వస్తుంది. కనుక ఇక్కడ చెప్పుకున్నట్టు జీవుల ఆవిర్భవానికీ, చాక్షుషునికీ సంబంధం వుండవచ్చును. 

7) వైవస్వత మన్వంతరం (120 మిలియన్ సంవత్సరాల క్రితం నుండీ ప్రస్తుత కాలం ...) - Emergence of Man: 
కాల చక్రంలో మనం ప్రస్తుతం శ్వేత వరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో వున్నాము. ఆ ప్రకారంగా, ప్రస్తుత కల్పంలో ఎంత కాలం గడిచిందో చూద్దాం: 
గడచిన మన్వంతరాలు 6 కనుక 6 మన్వంతరాల కాలం = 6 x 71 మహాయుగాలు 
                                                                = 6 x 71 x 10 కలియుగాలు
                                                                = 4260 కలియుగాలు
గడచిన 6 మన్వంతరాలకీ 7 మన్వంతర సంధి కాలాలు = 7 x 4 కలియుగాలు
                                                               = 28 కలియుగాలు
గడచినవి 27 మహాయుగాలు కనుక 27 మహాయుగాలు = 27 x 10 కలియుగాలు
                                                                  = 270 కలియుగాలు
ప్రస్తుతం మనం కలియుగంలో వున్నాము అంటే, కృత, త్రేతా, ద్వాపర యుగాలు గడిచాయి అంటే (4+3+2)=9 కలియుగాల కాలం గడిచింది. అలానే ప్రస్తుతానికి (2014) కలియుగం మొదలయ్యి 5115 సంవత్సరాలు గడిచాయి. వీటి ఆధారంగా,
ప్రస్తుత (28వ) మహాయుగంలో గడచిన కాలం = 9 కలియుగాలు + 5115 సంవత్సరాలు 
                                        = 9 (4,32,000) + 5115 సంవత్సరాలు
                                        = 38,93,115 సంవత్సరాలు 
                                        = 3.9 మిలియన్ సంవత్సరాలు 
ఇహ, ప్రస్తుత కల్పంలో గడచిన కాలం = 6 మన్వంతరాల కాలం + 7 మన్వంతర సంధి కాలాలు + 27 మహాయుగాలు + ప్రస్తుత మహాయుగ కాలం
                                           = (4260 + 28 +  270) కలియుగాలు + 38,93,115 సంవత్సరాలు
                                           = 1972949115 సంవత్సరాలు = 1973 మిలియన్ సంవత్సరాలు లేదా 1.97 బిలియన్ సంవత్సరాలు. 
అనగా, ఈ శ్వేత వరాహ కల్పం మొదలయ్యి 1.97 బిలియన్ సంవత్సరాలు గడిచిందనమాట!

ఈ సమయంలోనే మొదటిసారిగా మానవుని ఆవిర్భావం జరిగినది. మన పురాణాల ప్రకారంగా మానవుని ఆవిర్భావం జరిగి నేటికి 120 మిలియన్ సంవత్సరాలు పూర్తయ్యింది కానీ మన శాస్త్రవేత్తలు 3.75-4 మిలియన్ సంవత్సరాల క్రితం మానవుని ఉనికి ఉన్నదని తెలుపుతున్నారు. కొంచెం శ్రద్ధగా గమనిస్తే, శాస్త్రవేత్తలు మానవుని ఉనికి తెలిపిన కాలానికి మనం లెక్కించిన ప్రస్తుత (28వ) మహాయుగ కాలం (3.9 మిలియన్ సంవత్సరాలు) దగ్గరగా వుంది. శ్రీ బ్రహ్మ పురాణం ప్రకారం, వైవస్వంతుడు అనగా సూర్యుడు అలాగే వైవస్వత మనువు సూర్యుని కుమారుడు. సూర్యుని ఆవిర్భావం తరువాతనే సకల ప్రాణుల ఆవిర్భావం కూడా జరిగి, ఆ తరువాతనే మానవుడి ఆవిర్భావం జరిగింది అన్నది అన్ని విధాలుగానూ ఆమోదించబడిన విషయం. భారత దేశంలో అటు చరిత్ర పరంగా చూసినా, ఇటు పురాణ పరంగా చూసినా కూడా సూర్య వంశ రాజులే ప్రప్రధమంగా మనల్ని పరిపాలించారు. 

ప్రస్తుత (28వ) మహాయుగం పూర్తి కావడానికి మిగిలి వున్న కాలం = 10 కలియుగాలు (మహాయుగ పూర్తి కాలం) - ప్రస్తుత మహాయుగంలో గడచిన కాలం = (10 x 4,32,000) - 38,93,115 సంవత్సరాలు = 4,26,885 సంవత్సరాలు.

అలాగే ప్రస్తుత మన్వంతరం పూర్తి కావడానికి మిగిలి వున్న కాలం = మొత్తం మన్వంతర కాలం - గడచిన మహాయుగాల కాలం = 71 మహాయుగాలు - 27.8 మహాయుగాలు = (71 x 10 కలియుగాలు) - (270 కలియుగాలు + 38,93,115 సంవత్సరాలు) = 306720000 - 120533115 సంవత్సరాలు
                                   = 186186885 సంవత్సరాలు = 186 మిలియన్ సంవత్సరాలు 

8-14) సావర్ణ మన్వంతరాలు: 
రాబోతున్న మన్వంతరాలన్నీ సావర్ణి అనే పేరుతోనే ముగుస్తాయి. సావర్ణి అనగా ఒకే రంగు కలిగినవి లేదా సమానమయిన (ఒకే విధమయిన) పదార్ధం కలిగినది అనుకోవచ్చును. 

సావర్ణ మన్వంతరాలు అన్నీ కలిపి 7 కనుక వాటి కాలాన్ని చూస్తే, 
7 సావర్ణ మన్వంతరాల కాలం = 7 x 71 మహాయుగాలు = 7 x 71 x 10 కలియుగాలు = 4970 కలియుగాలు
7 మన్వంతరాలకీ 8 మన్వంతర సంధి కాలాలు = 8 x 4 కలియుగాలు
                                                      = 32 కలియుగాలు
కనుక సావర్ణ మన్వంతరాల కాల మొత్తం = (4970 + 32) కలియుగాలు = 5002 x 4,32,000 సంవత్సరాలు = 2160864000 సంవత్సరాలు = 2161 మిలియన్ సంవత్సరాలు లేదా 2.16 బిలియన్ సంవత్సరాలు.
ఇక ఈ శ్వేత వరాహ కల్పంలో మిగిలి వున్న కాలం = సావర్ణ మన్వంతరాల కాలం + ప్రస్తుత మన్వంతరం పూర్తి కావడానికి మిగిలి వున్న కాలం = 2160864000 సంవత్సరాలు + 186186885 సంవత్సరాలు = 2347050885 సంవత్సరాలు = 2347 మిలియన్ సంవత్సరాలు లేదా 2.35 బిలియన్ సంవత్సరాలు. 

మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఈ కల్పాంతంలో సృష్టి నశిస్తుంది కనుక 2347 మిలియన్ సంవత్సరాల తరువాత సృష్టి నశించాలి. మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతీ మన్వంతరానికీ 309 మిలియన్ సంవత్సరాలు పట్టి, మార్పు కనిపిస్తోంది. ఆ మార్పే రాబోతున్న మన్వంతర కాలాలలో జీవుల జన్యువులలో మార్పు కలిగి చివరికి అంతరించిపోవచ్చును. పురాణాల ప్రకారం, ఆఖరున వచ్చే భౌమ్య సావర్ణి కూడా అదే సూచిస్తోంది. 


ఇంచుమించు 250 మిలియన్ సంవత్సరాల తరువాత అన్ని ఖండాలూ కలిసి ఏక ఖండంగా ఏర్పడతాయని ఒక అంచనా. అలాగే, సూర్యుని ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ వుండటం వలన 300 - 800 మిలియన్ సంవత్సరాల (దాదాపుగా 3 మన్వంతరాల సమయం) తరువాత భూగ్రహం మీద జీవుల ఉనికి ప్రశ్నార్థకం. సూర్యుని శీతోష్ణ స్థితి పెరిగితే ఆ ప్రభావం వలన కలిగే విచ్ఛేదము కూడా పెరిగి, బొగ్గుపులుసు వాయు (నాకు తెలిసినంత వరకూ COని తెలుగులో అలాగే అంటారు) స్థాయిలు తగ్గి మొక్కలు కిరణ జన్య సంయోగ క్రియను (photosynthesis) చేసుకోలేవు. ఇలాగే సూర్యుని ఉష్ణోగ్రత పెరుగుతూ కొన్ని బిలియన్ సంవత్సాలకి అదొక గరిష్ట స్థాయికి చేరుకొని, అన్ని గ్రహాలనూ (లేదా మనం మొదట్లో చెప్పుకున్నట్టు స్వయం ప్రకాశిత గోళాలనన్నిటినీ) తనలో ఐక్యం చేసుకుని, కుదించుకునిపోయి, చిన్న మెరుపులా మారి, ప్రకాశ శక్తిని కోల్పోయి చీకటి స్థితికి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే జీవులు అంతరించిపోయి, సముద్రాలు ఇంకిపోయి సృష్టి నశిస్తుంది. పురాణాల ప్రకారంగా ఈ సమయాన్నే ప్రళయ కాలం అని వుండవచ్చు.  



జైన మత గ్రంథాల ప్రకారం కొన్ని యుగాల సమూహం ఒక కల్పం. ప్రతీ యుగంలోనూ 12 అరములలో (వీటినే విభాగాలుగా పరిగణించవచ్చు) కాలచక్రం పైకి (6), క్రిందకి (6) కదులుతూ వుంటుంది. ఆ ప్రకారంగానే కాలచక్రం పైకి కదిలినప్పుడు ఆ యుగ భాగాన్ని ఉత్సర్పిణి అనీ, క్రిందకి కదిలినప్పుడు అపసర్పిణి అనీ అంటారు. యుగ ఆరంభంలోనూ మరియూ అంతంలోనూ వుండే భాగాన్ని దుషమ (దుఃఖానికి చిహ్నం) అనీ యుగ మధ్యలో వుండే భాగాన్ని సుషమ (ఆనందానికి చిహ్నం) అనీ అంటారు. అనగా ఒక యుగంలో చెడ్డవన్నీ మంచిగా మారి, ఆ మంచివన్నీ క్రమంగా అంతరిస్తూ చెడ్డగా మారిపోతాయి అనుకోవచ్చును. దీనినే మనం చెప్పుకున్న మన్వంతరాల కోణం నుండీ గమనిస్తే క్రమంగా సృష్టి ఏర్పడి, నశించడం అనుకోవచ్చు. వీటన్నిటి బట్టీ చూస్తే ఆయనెవరో అన్నట్టు మనం చెప్పుకునే బ్రహ్మ కాలం, విష్ణు కాలం, మొదలయినవి వేరే గ్రహాలకి చెందిన కాలాలు కావచ్చును. గ్రహాలన్నీ ఏర్పడి, కరిగిపోవడం అనేది ఆమోదించబడిన విషయమేగా! 

ఏమిటో, ఈ మధ్యన మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాను కదూ! కాల చక్రంలో గడుస్తున్న కాలానికి వీడ్కోలు చెప్పి, క్రొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే సమయం రానే వచ్చింది. పేరుకి తగ్గట్టుగా అందరికీ అన్నిటా జయం కలగాలని ఆశిస్తూ కాస్త ముందస్తుగా జయనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 


Monday, September 16, 2013

సాంబే పరబ్రహ్మణి


పరమేశ్వరుని నామ వైభవాలను స్మరిస్తూ, మనకు బాగా తెలిసిన ఎన్నో కథల ఆధారంగా శ్రీ శంకరాచార్యుల వారు రచించిన "దశ శ్లోక స్తుతి"కి ఒక వ్యాఖ్యాన ప్రయత్నం చేశాను. దానిని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి ధన్యవాదాలు.   

 

శ్రీ శంకరాచార్యుల గురించి తెలియని వారుండరు. భగవంతుని చేరుకునేందుకు ఎన్నో మార్గాలను చెప్పారు కనుకనే ఈయనని శంకర భగవత్పాదులు అని కూడా పిలుస్తారు. "మహేశ్వరః శంకర నారాయణః" అనగా మహేశ్వరుడే శంకరుడు, శంకరుడే నారాయణుడు అంటూ అద్వైతాన్ని ప్రబోధించిన మహనీయుడు శంకరాచార్యులు. ఈయనని ఈశ్వరుని అవతారంగా జనులు భావిస్తారు. వైష్ణవ, శాక్తేయ, గానాపత్య, సౌర, శైవ, కాపాలిక మతాలను సమన్వయించి షణ్మత స్థాపకులయ్యారు. బ్రహ్మ సూత్రాలకు భాష్యం వ్రాసిన మహానుభావులు. భగవంతుడు అవసరాన్ని బట్టీ ఒక్కో రూపంలో ఒక్కో పనిని చేస్తాడు కానీ ఈ సృష్టంతా ఒకే రూపంతో నిండి వుంది అని చెప్పిన ఈయన ఎన్నో ప్రబోధాలను చేశారు, ఎన్నో స్తుతులను, అష్టకాలను రచించారు. వాటిల్లో సాంబే పరబ్రహ్మణి అనే మకుటంతో వ్రాసిన "దశ శ్లోక స్తుతి"ని పరిచయం చేస్తున్నాను. అంబతో కూడిన పరమేశ్వరుడే సాంబుడు. సృష్టి స్థితి లయ కారకుడు, పరబ్రహ్మ అన్నీ ఈ సాంబమూర్తే. అటువంటి సాంబ మూర్తి రూపాన్ని హృదయంలో నిలుపుకుని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ సుఖంగా వుందామని, ఆనంద పారవశ్యంలో మనం కూడా రమిద్దామని తెలియజేసే స్తుతే ఈ దశ శ్లోక స్తుతి. 

 

సాంబో నః కులదైవతం పశుపతే సాంబ త్వదీయా వయం
సంబం స్తౌమి సురాసురోరగ గణాః సాంబేన సంతారితాః ।

సాంబాయాస్తు నమో మయా విరచితం సాంబాత్పరం నో భజే

సాంబస్యానుచరోఽస్మ్యహం మమ రతిః సాంబే పరబ్రహ్మణి ॥1॥

 

ప్రతీ కవీ ఒక శ్లోకాన్నో, శతకాన్నో, పుస్తకాన్నో వ్రాసే ముందు తన ఇష్టదైవాన్నో, విఘ్నాలు కలగకుండా పూర్తవ్వాలని వినాయకుడినో తలుచుకుని ప్రారంభించడం పరిపాటి. అదే బాటలో శంకరాచార్యుల వారు ఈ దశశ్లోకస్తుతి ని తన కులదైవాన్ని తలుచుకుంటూ మొదలుపెట్టారు. సాధారణంగా ఏ పూజ చేయాలన్నా ముందుగా కులదైవ పూజ చేసి కానీ మిగతావి మొదలుపెట్టరు, కులదైవానికి అంత ప్రాముఖ్యత కల మన భారత దేశంలో సాంబ శివుని గురించి వ్రాసే ఈ స్తుతికి ఆ పరమ శివుడే తన కులదైవం అని చెప్పి మొదలుపెట్టారు. శివుడే మన కులదైవం కాగా మనమంతా ఆయనకు సంబంధించిన వాళ్ళం, ఆయన పరిరక్షణలో వుండేవాళ్ళం. సురులు (దేవతలు), అసురులు (రాక్షసులు), ఉరగులు (నాగులు), మొదలగు అన్ని గణాల వాళ్ళూ ఆ సాంబుడిని పూజిస్తారు. ఇక్కడ గణాల ప్రసక్తి అంత ప్రత్యేకంగా చెప్పడానికి కారణం, కేవలం ఈశ్వరునికి మాత్రమే అన్ని గణాల వారూ పూజలు చేస్తారు కానీ మిగతా దైవ రూపానికీ (విష్ణువుతో సహా) అన్ని గణాల వాళ్ళూ పూజలు చేయరు. సాంబుడే నాకు సర్వస్వం, ఆయనకు మించినది ఏదీ లేదు కనుక నా ప్రేమ, పూజ, నమస్కారం అన్నీ ఆయనకే అని ఈ శ్లోకం ద్వారా చెప్పారు.

 

సాక్షాత్తు శ్రీహరే "ఏక ఏక హి విశ్వేశో ద్వితీయో నాస్తి కశ్చన" ఈ జగత్తు మొత్తానికి విశ్వేశ్వరుడు మాత్రమే దేవుడు తప్ప వేరొకడు లేడు అని అన్నట్టు శ్రీ స్కంద పురాణంలో వున్నది. మనం పరబ్రహ్మ అని ఎవరినయితే అంటామో ఆ పరబ్రహ్మ స్వరూపమే సాంబశివుడు. అటువంటి స్వామిని కొలుస్తూ ఆయన ధ్యానంలో నా మనసు లగ్నం చేసి ఆనందాన్ని, రసాస్వాదనను పొందుతాను అని చెప్పారు. ఈ మొదటి శ్లోకం తప్ప మిగతా తొమ్మిది శ్లోకాలకీ "తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి" అనే మకుటం వాడినా పది శ్లోకాలనీ పరిశీలించి "సాంబే పరబ్రహ్మణి" ని మాత్రమే మకుటముగా పరిగణించడం జరిగింది.  

 

 విష్ణ్వాద్యాశ్చ పురత్రయం సురగణా జేతుం న శక్తాః స్వయం

యం శంభుం భగవన్వయం తు పశవోఽస్మాకం త్వమేవేశ్వరః ।

స్వస్వస్థాన నియోజితాః సుమనసః స్వస్థా బభూవుస్తత

స్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥2॥

 

మొదటి శ్లోకంలో సాంబుడే తన కులదైవమని చెప్పిన భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆయనే పశుపతి అంటున్నారు. పశువులమయిన మాకందరికీ అధిపతివి కనుకనే పశుపతివయ్యావు. మేమంతా కూడా నీ చేత నియమింపబడ్డవాళ్ళం కనుక నువ్వు చెప్పినట్టు చేయడమే మా వంతు తప్ప నీ అనుమతి లేకుండా మేమేమీ చెయ్యలేము. అందువలననే విష్ణాది దేవతలంతా కూడా త్రిపురాసుర సంహార విషయంలో అశక్తులయిపోయారు అంటున్నారు. మరి త్రిపురాసుర సంహార విషయంలో శివుడు దేవతలందరికీ ఏ విధమయిన పనులను అప్పచెప్పి సంహారం చేశాడో తరువాతి శ్లోకంలో వివరించారు. ఇంచుమించుగా ఇదే భావాన్ని శివానందలహరిలో కూడా మనమందరం శివుని ఆట కోసం సృష్టించబడిన పావులం కనుక మనల్ని కాపాడవలసిన, జరపవలసిన బాధ్యత అంతా కూడా ఆ శివునిదే అని చెప్పటం జరిగింది.

 

ఈ శ్లోకం చదువుతుంటే మరొక అంతరార్థం తోస్తోంది. ఈశావాస్యోపనిషత్తులో "దంతిని దారు వికారే దారు తిరోభవతి సోఽపి తత్రైవ జగతి తథా పరమాత్మా పరమాత్మన్యపి జగతి తిరోధత్తే" అన్నట్టుగా దంతి అంటే ఏనుగు. ఒక కఱ్ఱతో చేసిన ఏనుగు బొమ్మని చూస్తే కొంతమందికి అది కేవలం (కొయ్య లేదా చెక్క లేదా) కఱ్ఱ గానూ, మరికొంతమందికి అది ఏనుగు గానూ కనిపిస్తాయి. కఱ్ఱ అనే ఆలోచనతో చూసేవారికి ఏనుగు, ఏనుగు అనే ఎరుకతో చూసేవారికి కఱ్ఱ కనిపించవు. అదే విధంగా, ఈ జగత్తు అంతటికీ మూలమయిన పంచభూతాలు అనే ఏనుగు పరమాత్మ అనే కొయ్యతో చేయబడినది కనుక మనం పంచభూతాలను చూస్తే పరమాత్మ, పరమాత్మను చూస్తే పంచభూతాలు కనిపించవు. అలా విడి విడిగా కాకుండా పంచభూతాలు పరమాత్మ స్వరూపాలు (ఇదే భావాన్ని అష్టమూర్తి నామం ద్వారా తొమ్మిదవ శ్లోకంలో వివరించారు), పరమాత్మ చేత చేయబడినవి అని చూడాలని చెప్తోంది. దేవతలంతా కూడా ఆ ఈశ్వరుడు నియమించిన వారే కనుక శంకరాచార్యుల వారు మేమంతా నీ చేత చేయబడిన వాళ్ళం, నీ చేత నియమింపబడిన వాళ్ళం అని వాడారనుకుంట. సమస్తము ఆ పరమేశ్వరుని నివాసమే అన్న అంతరార్థాన్ని ఈ శ్లోకం ప్రతిబింబిస్తోంది.  

 

క్షోణీ యస్య రథో రథాంగ యుగళం చంద్రార్క బింబద్వయం

కోదండః కనకాచలో హరిరభూద్బాణో విధిః సారధిః ।

తూణీరో జలధిర్హయాః శ్రుతిచయో మౌర్వీ భుజంగాధిపః

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥3॥

 

"క్షోణీ క్షీణా లయే చయా" అని శ్రీ బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పినట్టుగా లయకాలమున క్షీణించేది కనుక భూమికి క్షోణి అనే పేరు వచ్చింది. అటువంటి భూమిని రథంగా మలిచాడు. ఇక్కడ భూమి అని చెప్పడానికి పృథ్వి, వసుధ, ఉర్వి, మహీ, విశ్వంభర, అచల, ఇజ్య, మొదలగు ఎన్నో నామాలుండగా క్షోణీ అనే నామాన్ని ఎంచుకోవడంలో మనం కవి భావాన్ని గమనించాలి. ఇక్కడ జరిగేది త్రిపురాసుర సంహారం కదా, త్రిపురాసురుడు లయకాలానికి దగ్గరగా వున్నాడు కనుక రెంటికీ సరిపడా భగవత్పాదుల వారు ఈ క్షోణీ అనే నామాన్ని ఎన్నుకోవటం జరిగిందని నా అనుకోలు. సరే మళ్ళీ యుద్ధ సన్నివేశం లోనికి వెళదాం. భూమిని రథంగా మలచి రథ చక్రాలుగా సూర్య చంద్రులను పెట్టాడుట. ఇహ యుద్ధం చేయడానికి కావలసిన ముఖ్యమయినది కోదండము అనగా ధనుస్సు. ఆ ధనస్సుగా కనకాచలాన్ని (కనక + అచలము అంటే బంగారు కొండ) అనగా మేరు పర్వతాన్ని పెట్టాడుట. హరిః అనగా విష్ణుమూర్తి బాణం అభూత్ అనగా బాణంగా మారాడు. రథానికి ఒక సారధి కావాలి కాబట్టి ఆ పదవిని విధి అనగా బ్రహ్మ గారు చేపట్టారు.

తూణీరం అనగా అంబుల పొది. ఆ అంబుల పొదిగా మారినది సముద్రుడు. పాల సముద్రంలోనే కదా శ్రీహరి వుండేది? అందుకనే ఏకంగా సాగరాన్ని అంబుల పొదిగా మార్చేసి శ్రీహరిని బాణంగా మలచాడు. శ్రుతులు అనగా వేదములు కనుక అవి గుఱ్ఱములుగా మారాయి. మనకు చతుర్వేదములు కనుక ఈ శ్లోకంలో ప్రత్యేకంగా తెలుపకపోయినా ఇక్కడున్న రథానికి నాలుగు గుఱ్ఱములు అని అనుకోవాలి. యుద్ధానికి కావలసినవి అన్నీ అమరాయి ఒక్క వింటినారి తప్ప, ఆ పనిని పాములకి రాజు అయినటువంటి వాసుకికి (లేదా ఆది శేషువు అని కూడా అనుకోవచ్చు) అప్పగించాడు. ఆ విధంగా వీరందరినీ తనకు కావలసినట్టు మలచుకుని తాను చేయవలసిన కార్యాన్ని పూర్తి చేశాడు సాంబుడు.

  

యేనాపాదితమంగజాంగభసితం దివ్యాంగరాగైః సమం

యేన స్వీకృతమబ్జసంభవశిరః సౌవర్ణపాత్రైః సమమ్ ।

యేనాంగీకృతమచ్యుతస్య నయనం పూజారవిందైః సమం

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥4॥

 

అంగజుడు అనగా మన్మధుడు. అటువంటి మన్మధుడిని భస్మం చేసిన శివుడే ఆ భస్మాన్ని అంగరాగం అనగా లేపనము లేదా పైపూత లాగా తన శరీరమంతా పూసుకున్నాడు. అబ్జము అనగా పద్మము కనుక అబ్జ సంభవుడు అనగా పద్మములో పుట్టినవాడు అంటే బ్రహ్మ. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి నాభి నుండీ వచ్చిన పద్మము నుండీ ఉద్భవించినవాడే కదా బ్రహ్మ! మొదట్లో బ్రహ్మ గారికి అయిదు తలలుండేవనీ శివుడు ఒక తలను గిల్లేశాడనీ కథనం. ఆ విధంగా తీసేసిన తలకాయకు సంబంధించిన కపాలాన్నే తన భిక్షా పాత్రగా స్వీకరించాడు. అలా ఆది భిక్షువు అనే నామాన్ని సార్ధకం చేసుకున్నాడు. విష్ణుమూర్తి కన్నుని పూజా పుష్పంగా స్వీకరించినవాడు కూడా సాంబుడే కదా మరి! ఆయన కన్నుని ఈయన ఎందుకు తీసుకున్నాడో, ఏ సందర్భంలో తీసుకున్నాడో ఏడవ శ్లోకంలో వివరించారు.

 

మనమంతా శివుడిని ముక్కోపి అనీ, ప్రళయ కారుడు అనీ భయపడతాం కానీ శివ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోము. పార్వతీ పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు కనుక శివుని పనులన్నిటినీ మనం ఒక తండ్రి చేసే పనులతో పోల్చుకోవాలి. పగలంతా ఎన్నో పనులు చేసి అలసి, సొలసి, విసిగిన శరీరం స్వాంతన పొందేది కేవలం నిద్రలోనే! దీనినే నిత్య ప్రళయం అంటారు. నిద్రనిచ్చేది శివుడే కదా? రోజంతా అలసిపోయిన పిల్లలని ఇక ఆటలాపి విశ్రాంతి తీసుకొమ్మని నిద్రపుచ్చే తండ్రిని చూసి ఏ విధముగా భయపడమో అదే విధంగా శివుని లాలిత్యాన్ని కూడా అనుభవపూర్వకంగా పొందిన నాడు మనం భయపడము. బిడ్డ మీద కోప్పడి అరచిన తండ్రి కొంతసమయం తరువాత బాధపడి తనే మళ్ళీ అక్కున చేర్చుకుని ఓదారుస్తాడు కదా, శివుడు కూడా అదే విధంగా మన్మధుడిని దహించి వేసినా ఎందుకూ పనికి రాని బూడిద అని వదిలెయ్యకుండా, ప్రేమగా తీసుకుని తన శరీరమంతా పులుముకుని ఆ బూడిదకి కూడా దివ్యమయిన స్థానాన్ని కలిగించాడు. అలాగే బ్రహ్మ కపాలాన్ని కూడా భిక్షా పాత్రగా తన వద్దే పదిల పరుచుకున్నాడు. ఈ విధంగా ఆయన చేసే ప్రతీ పనిలోనూ ఒక తండ్రి లాలన కనిపిస్తూనే వుంటుంది. 

 

గోవిందాదధికం న దైవతమితి ప్రోన్చార్య హస్తావుభా

వుద్ధృత్యాథ శివస్య సంనిధిగతో వ్యాసో మునీనాం వరః ।

యస్య స్తంభితపాణిరానతి కృతా నందీశ్వరేణాభవ

త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥5॥

 

మొత్తం దశ శ్లోకాలలోనూ ఒక సేవకుని స్వామి భక్తికి తార్కాణమయిన ఈ శ్లోకం నాకు బాగా నచ్చింది. శివుని పరమ భక్తుడు, నిత్యం సేవలు చేసుకునే మహద్భాగ్యం కలవాడు, సాక్షాత్తు పరమశివుని వాహనం అయినటువంటి నందీశ్వరుని మహిమ, భక్తి తెలియచేసే శ్లోకం యిది. మునులలో గొప్పవాడయినటువంటి వ్యాసుడు - విష్ణుమూర్తే గొప్పవాడు అని ఈశ్వర సాన్నిధ్యంలో చేతులు పైకెత్తి మరీ మ్రొక్కినవాడు కాస్తా తరువాత ఈశ్వరునికి భక్తుడయ్యాడు. ఇది చదవగానే సర్వం తెలిసిన వ్యాస మహర్షి, "వ్యాసాయ విష్ణు రూపాయ" అని స్తుతించబడిన వేద వ్యాసుడు హరిహరులకి భేదం చెప్పడమేమిటి? శివుని వద్ద విష్ణువుని పొగడటం ఏమిటి? వంటి ఆలోచనలు ఎన్నో కలుగుతాయి. ఈ సందేహాలు తీరాలంటే మనకి శ్రీ స్కాంద పురాణంలోని మూల కథ తెలియాలి.

ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మునులందరి మధ్యా ముక్తిని ప్రసాదించేది శివుడా? విష్ణుమూర్తా? అనే అంశం మీద చర్చలు జరుగుతున్నాయిట. చివరికి ఆ మునులంతా ఈశ్వరుడే ముక్తిని ప్రసాదించేది అని ఒక నిర్ణయానికి వచ్చారుట. అదే సమయంలో అక్కడకి వచ్చిన వ్యాసుల వారిని చూసి, అతిధి మర్యాదలు చేసి, వేదాలు విభజించినవాడు, ఎన్నో పురాణాలు రచించినవాడు కనుక ఈయనని అడుగుదామని అడుగగా, వ్యాసుడు "వేదాలలోనూ, పురాణాలాలోనూ, ఇతిహాసాలలోనూ కూడా వర్ణింపబడినవాడు విష్ణుమూర్తి మాత్రమే కనుక ఆయనే సృష్టి స్థితి లయ కారకుడు, ఆది దేవుడు, మోక్ష దాత" అనేసరికి అక్కడి మునులంతా నిర్ఘాంతపోయి, మీకంటే తెలిసిన వారు వుండరు కానీ మా తృప్తి కోసం యిదే మాటని కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో చెప్పమని కోరారు. దానికి అంగీకరించిన వ్యాసుడు తన శిష్యులతో, మునులందరితో కలిసి కాశీకి వెళ్లి, పవిత్ర స్నానమాచరించి, మాధవుని ప్రార్ధించి, చేతులు రెండూ పైకి ఎత్తి మాధవుడే మోక్ష దాత అన్న వెంటనే ఆగ్రహించిన నందీశ్వరుడు వ్యాసుడు ఎత్తిన చేతులు ఎత్తినట్టే స్తంభించిపోయేలా, నోట మాట రాకుండా చేశాడు. గోవిందుడే గొప్పవాడు అని అంటుంటే శివుడు చిన్మందహాసంతో వింటూ గోవిందుడూ నేను వేరు కాదు కనుక వ్యాసుల వారు చెప్పినది నిజమే కదా అని వూరుకున్నారుట. స్వామి వూరుకున్నా సేవకుడు వూరుకోలేదు. వ్యాసులవారి భేద బుధ్ధి చూసి మిక్కిలి ఆగ్రహించాడు నందీశ్వరుడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి "ఈ విశ్వమంతటికీ కూడా ఈశ్వరుడే దేవుడు, ఆయన వలననే నేను సుదర్శన చక్రం, లక్ష్మీదేవిని పొందాను. ముల్లోకాలనీ రక్షించగల సామర్ధ్యం కూడా నాకు ఆయనే ఇచ్చాడు కనుక నీవు ఆయననే ప్రార్ధించు" అని చెప్పెను. అప్పుడు శివుని ప్రార్ధించగా సంతసించిన నందీశ్వరుని అనుగ్రహం వలన వ్యాసునికి మాట, చేతులు తిరిగి స్వాధీనంలోకి వచ్చాయి. ఆనాటి నుండీ వేద వ్యాసుడు "లింగే ష్వేకో హి విశ్వేష స్తీర్థేషు మణికర్ణికా" అని చాటుతూ అద్వైతామృతాన్ని పంచాడు. శంకరాచార్యుల వారు కూడా అద్వైతులే కనుక ఈ శ్లోకం ద్వారా మరొక్కసారి ఆ సన్నివేశాన్ని మనకు గుర్తు చేశారు.

 

శ్లోకం అంతటిలో కేవలం మూడవ పాదానికి నాకు మరొక అన్వయం తోస్తోంది. అదే కుమార సంభవంలోని ఘట్టం. తారకాసుర సంహారం కోసం జరగవలసిన ముఖ్యమయినవి శివపార్వతుల వివాహం, కుమారస్వామి జననం కనుక దేవతలందరూ మన్మధుడికి మలయమారుతాన్నిచ్చి తపస్సులో వున్న శివుని వద్దకు పంపారు. మన్మధుని ప్రభావం చేత ఆ ప్రదేశమంతా ఆహ్లాదకరంగా మారి వసంత ఋతువు వచ్చింది. అసందర్భంగా వచ్చిన వసంతాన్ని చూసి, ఆశ్చర్యపోయిన నంది శివుని ధ్యానానికి భంగం కలుగకుండా తన చేతి సైగతో శాసించడం వలన ప్రకృతంతా ఒక చిత్రం గీసినట్టు నిలిచిపోయింది. ఈ రెండు సందర్భాలలోనూ కూడా సాంబుని నిత్యం పూజించడం వలన నందీశ్వరునికి వచ్చిన మహిమలను, శివుని మీద నందికి వున్న ప్రేమను మన ముందుకు తెచ్చారు.

 

 ఆకాశశ్చికురాయతే దశదిశాభోగో దుకూలాయతే

శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే ।

వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥6॥

 

సాంబ మూర్తి రూపం మనకి యీ శ్లోకం ద్వారా తెలుస్తున్నది. ఆకాశమే ఆయనకు చికురములు అనగా కేశములు. శ్రీ శివాష్టోత్తర నామాలలో "ఓం వ్యోమ కేశాయ నమః" అనే నామము కూడా ఇదే విషయాన్ని తెలుపుతున్నది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, వాయువ్యం, నైఋతి, ఈశాన్యం, ఆగ్నేయం, ఊర్ధ్వం, అథో అనే పది దిక్కులని తెల్లని పట్టు వస్త్రంగా ధరించాడు. ఆయన కేశపాశం చూస్తే ఆకాశం, ఆయన ధరించిన వస్త్రమేమో పది దిక్కులు. దానికి తోడు చల్లని కిరణములను ప్రసరింపచేయు చంద్రుడు ఆయన ఆభరణం. అల్లసాని పెద్దన గారు రచించిన మనుచరిత్రలో కూడా ఇదే భావాన్ని కొంచెం మార్చి శివుని జడ అనే తోటలో పూసిన అనావర్తం పువ్వు చంద్రుడు అని అభివర్ణించారు. ఇహ సాంబుని రూపమేమిటయ్యా అంటే స్థిరమయిన ఆనందం. "ఆనందో బ్రహ్మ" అన్నట్టుగా ఆనంద స్వరూపం సాంబశివుడు అని వర్ణన వున్నప్పటికీ యిక్కడ భగవత్పాదుల వారు స్థిరతరానందః అనగా స్థిరమయిన ఆనందమే ఆయన స్వరూపం అన్నారు. ఆశకు లొంగని, సమయముతో మారని (యివాళ వుండి రేపు పోయే ఆనందము కాదు), ఇంద్రియ వ్యాపారం వలన కలుగని ఆనందము కనుకనే స్థిరమయిన ఆనందమే సాంబశివుని రూపమని చెప్పారు. ముగ్ధ ముఖారవిందంతో, శాంతంగా, ఆనందంగా కనిపించే సాంబుని రూపమే దక్షిణామూర్తి.

 

ఎలా వుంటాడో చెప్పాక, యెక్కడ వుంటాడో కూడా చెప్పడం ముఖ్యం కనుక వేదాంతో నిలయాయతే అంటూ వేదాంతాలు అయినటువంటి ఉపనిషత్తులే ఆయన నివాసం అన్నారు. ఆకాశాన్ని కేశాలుగా, పది దిక్కులని దువ్వలువగా, చంద్రుడిని ఆభరణంగా లేదా అలంకారంగా చేసుకుని అక్కడెక్కడో వేదాంతాలలో ఆనందంగా వుండే ఆయన మనకి అంత సులభంగా దర్శనమిస్తాడా? అనే ఆలోచన రాకుండానే సువినయోయస్య స్వభావాయతే అంటూ సాంబునిది వినయంగా వుండే స్వభావమని వర్ణించారు. ఒక్క స్తోత్రం చేస్తే చాలు, ఒక్క నమస్కారం చేస్తే చాలు, జిల్లేడు, తుమ్మి మొదలైన పిచ్చి పూలతో పూజ చేసినా చాలు పరవశుడై అనుగ్రహాన్ని కుమ్మరించేస్తాడు. వినయ స్వభావుడు కనుకే ప్రేమగా, భక్తితో తిన్నడు మాంసం పెట్టినా స్వీకరించాడు, కాలితో తన్నినా నా బిడ్డే కదా అని ఆనందించాడు. ఈశ్వరానుగ్రహం పొందిన వారిలో చెప్పులు కుట్టేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, మొదలైన వారే ఎక్కువ. అటువంటి సర్వజన సులభుడు కనుకనే ఆయనకు ఆశుతోషుడు, భోలా శంకరుడు అనే నామాలు వచ్చాయి.  

 

విష్ణుర్యస్య సహస్రనామ నియమాదంభోరుహాణ్యర్చయ

న్నేకోనోపచితేషు నేత్రకమలం నైజం పదాబ్జద్వయే ।

సంపూజ్యాసుర సంహతిం విదలయంస్త్రైలోక్యపాలోఽభవ  

త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥7॥

 

విష్ణుమూర్తి శివుని భక్తుడని అందరికీ తెలిసినదే కదా! ఈ శ్లోకం ఆ భక్తిని వివరిస్తున్నది. విష్ణుమూర్తి నిత్యం శివ సహస్రనామ పారాయణం మానస సరోవరంలో వుండే సహస్ర కమలాలతో చేసేవాడుట. అలా చేస్తుండగా, ఒకానొక రోజున విష్ణువుని పరీక్షించదలచిన శివుడు ఒక కమలాన్ని తగ్గించి వేశాడుట. ఆఖరి నామానికి శివునిని పూజించడానికి కమలం లేనందున విష్ణువుకి వున్న రెండు కనులలో ఒక కన్నును తీసి అదే కమలముగా శివునికి అర్పించాడు. అప్పటినుండే విష్ణువుకి కమలాక్షుడు అనే పేరు వచ్చింది. అంతటి గొప్ప భక్తితో శివుడిని పూజించి ధ్యానించడం వలననే విష్ణుమూర్తి మిగతా దేవతలందరిలో కూడా గొప్పవాడయ్యి అందరితో పూజింపబడుతున్నాడు అని ఈ శ్లోకార్థం.

 

ఈ విషయాన్ని తెలియచేసే కథలు మనకెన్నో వున్నా ఇప్పటికీ చాలా మందికి ఇది కల్పితమో లేదా పుక్కిటి పురాణమో అనుకునే అవకాశం లేకపోలేదు. విష్ణుపురానికి సమీపంలో వుండే "తిరువీళిమిళలై" అనే క్షేత్రంలో కొలువున్న స్వామి పేరు నేత్రార్పణేశ్వరుడు అనీ, విష్ణుమూర్తి శివునికి తన కన్నును కమలముగా అర్పించిన ప్రదేశం ఇదే అనీ అక్కడి స్థల పురాణం. ఇప్పటికీ విష్ణుమూర్తి ఇక్కడ కొలువున్న స్వామిని నిత్యం పూజిస్తాడని నమ్మిక. లింగ పురాణంలోని శివ సహస్రనామ స్తోత్రంలోని ఫలశ్రుతిలో కూడా యిదే విషయం వుంది. 

 

 శౌరిం సత్యగిరం వరాహవపుషం పాదాంబుజా దర్శనే

చక్రే యో దయయా సమస్త జగతాం నాథం శిరోదర్శనే ।

మిథ్యావాచమపూజ్యమేవ సతతం హంస స్వరూపం విధిం

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥8॥

 

ఈ శ్లోకం శివుని లింగోద్భవ కాలంలో ఆది, అంతము తెలుసుకోవాలని బయలుదేరిన బ్రహ్మ, విష్ణువుల గురించి తెలుపుతున్నది. లింగానికి ఆది ఎక్కడుందో తెలుసుకుని, లింగ పాద దర్శనం చేసుకుందామని శ్రీ హరి వరాహావతారం ఎత్తి భూమిలోనికి వెళ్ళాడుట. అదే సమయంలో బ్రహ్మ గారు లింగ శిరోదర్శనం చేసుకుందామని హంసలా మారి పైకి ఎగిరాడుట. విష్ణుమూర్తి మొదలు కనుక్కోలేకపోయిన విషయం నిజాయితీగా ఒప్పుకున్నా, బ్రహ్మ గారు మాత్రం శిరస్సు చూడలేదన్న నిజాన్ని ఒప్పుకోలేక మిథ్యా వాచం అనగా అబద్ధం చెప్పారుట. దానితో బ్రహ్మ మీద ఆగ్రహించిన శివుడు ఆయనకు అపూజ్యం అనగా పూజలు జరగకుండా శపించడం వలననే ఆయనకు ప్రత్యేక దేవాలయాలు లేవని అంటారు. నిజం ఒప్పుకున్న విష్ణువును మెచ్చిన శివుడు శ్రీహరికి పూజార్హతను, ఆలయాలను ఇచ్చాడుట. దీనిని మరింత లోతుగా ఆలోచిస్తే, పరమాత్మ వద్ద ఎన్నడూ అసత్యం ఆడకూడదు, నిజాయితీగా వుండాలి అని తెలుస్తుంది.

సాధారణంగా ఈశ్వరుని పరిపూర్ణ రూపానికి పరిమాణం లేదు కానీ లింగ రూపానికి మాత్రం ఒక పరిమాణం వుంది. "ఆపాతాళ సభ స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్। జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాతామృతైః" అనే శ్లోకం శివుని లింగ రూపాన్ని, పరిమాణాన్ని తెలియచేస్తున్నది. పాతాళం నుండీ ఆకాశం వరకూ సమస్తం ఒక లింగం. రూపం బ్రహ్మాండం (బ్రహ్మ + అండం) అనగా ఒక కోడి గుడ్డు లాగా వుంటుందిట. శుధ్ధమయిన స్ఫటికతో చేసిన జ్యోతిర్మయమయిన లింగం. మౌళి అంటే శిరస్సు కనుక ఆ శిరస్సు స్థానంలో చంద్రమండలం వుందిట. ఆ చంద్రమండలంలో అమృతం ఘనీభవమై వుంది, చంద్రుడే కదా మరి అమృతాన్నిచ్చేది! ఆ అమృతం శివలింగం శిరస్సు నుండీ క్రిందకి అభిషేకంలాగా జాలువారుతున్నది. ఆ విధంగా బ్రహ్మాండంలో వుండే భువనాలన్నిటికీ కూడా ఈ అమృత ధార వలన శీతలత్వం కలిగి చల్లబడుతోందిట! అందువలననే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుతూ ఈ సృష్టంతా వ్యాపించి వున్న ఆ మహాలింగానికి అభిషేకం చేస్తున్నామని భావించి చెయ్యాలి. 

 

యస్యాసన్ధరణీ జలాగ్నిపవన వ్యోమార్క చంద్రాదయో

విఖ్యాతాస్తనవోఽష్టధా పరిణతా నాన్యత్తతో వర్తతే ।

ఓంకారార్థ వివేచనీ శ్రుతిరియం చాచష్ట తుర్యం శివం

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥9॥

 

ఈ సృష్టిలో ప్రతీదీ శివుడే అని తెలియచేస్తున్నదీ శ్లోకం. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచ భూతాలూ, చంద్రుడు, సూర్యుడు, బ్రహ్మ (జీవునిలో కొలువుండే బ్రహ్మ) మొత్తం కలిపి ఎనిమిది కూడా సాంబశివుని రూపాలే. అందువలననే ఆయనకి అష్టమూర్తి అనే నామము వచ్చింది. ఈ ఎనిమిది లేని సృష్టే లేనందున ఈశ్వరుడు లేని చోటు లేదని తెలుపకనే తెలుపుతున్నాడు. సృష్టికి మూలమయిన ఓం కారం నుండే వేదాలన్నీ పుట్టాయని నమ్మే మనకి ఓం కార రూపమే ఆ పరమేశ్వరుడు.

 

ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారే శ్రీ దక్షిణామూర్తి శ్లోకంలో కూడా "భూరంభాంస్యనలోనిలోఽoబర మహర్నాధో హిమాంశుః పుమానిత్యాభాతి చరాచరాత్మిక మిదం యస్యైవమూర్త్యష్టకం" అని రచించారు. భూమి, నీరు (అంభాంసి), అగ్ని (అనల), గాలి (అనిల), ఆకాశం (అంబరం), సూర్యుడు (అహర్నాధ), చంద్రుడు (హిమాంశు) మరియు జ్ఞాన/కర్మ కాండలకు అధికారి అయినటువంటి జీవుడు (ఈయననే బ్రహ్మ అంటారు, అహం బ్రహ్మాస్మి అంటాం కదా) కూడినటువంటి సముదాయమే సచ్చిదానంద రూపుడయిన పరమశివుని అష్టమూర్తి రూపం అన్నారు. తాళ్ళపాక అన్నమాచార్యులు కూడా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నారు. శ్రీమద్భగవద్గీతలో కూడా "భూమిరాపోఽనలో వాయుఃఖం మనో బుద్ధి రేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా" అనే శ్లోకం ఇదే విషయానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. 

 

 విష్ణుబ్రహ్మసురాధిప ప్రభృతయః సర్వేఽపి దేవా యదా

సంభూతాజ్జలధేర్విషాత్పరిభవం ప్రాప్తాస్తదా సత్వరం ।

తానార్తాంశరణాగతానితి సురాన్యోఽరక్ష దర్ధక్షణా

త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥10॥

 

క్షీర సాగర మథన ఘట్టాన్ని వివరిస్తున్నదీ శ్లోకం. బ్రహ్మ, విష్ణు, మొదలయిన దేవతాధిపులందరూ కూడా నిన్నే ఆది దేవునిగా పూజించి విషాన్ని నీకు అర్పించారు. దానిని కూడా లోక రక్షణ కోసం స్వీకరించి అందరినీ కాపాడావు అని అర్థం. క్షీర సాగర మథనం జరిగినప్పుడు మొట్టమొదటగా వచ్చినది హాలాహల విషం. మనకున్న నవ విషాలయినటువంటి హాలాహల, కాలకూట, బచనాగ, శృంగక, ప్రదీపన, బ్రహ్మపుత్ర, హరిద్ర, సౌరాష్ట్రిక, సక్తక లలో అత్యంత భయంకరమయినది హాలాహల విషం. ఒప్పందం ప్రకారం ముందుగా వచ్చినది దేవతలకే చెందాలి కనుక ఈ విషాన్ని కూడా దేవతలే స్వీకరించాలి. ఆ విధంగా, దీనిని దేవతలంతా తీసుకెళ్ళి బ్రహ్మకు యిస్తారు. విష్ణువు నాభి నుండీ పుట్టినవాడు కనుక ఆ విషాన్ని బ్రహ్మ గారు విష్ణువుకి యిస్తారు. విష్ణువు ఈశ్వర రూపమే కనుక ఆది దేవుడయిన శివునికి అగ్ర తాంబూలాన్ని స్వీకరించమని హాలాహలాన్ని యిస్తాడు. అది కఠినమయిన విషమని తెలిసినా లోకరక్షణ కోసం పార్వతీదేవి సమ్మతితో ఆ విషాన్ని సేవించి తన గరళంలో బంధించాడు పరమేశ్వరుడు. ఆ విష ప్రభావానికి శివుని కంఠం నీలంగా మారిపోయింది. అందువలననే ఆయనకి గరళ కంఠుడు, నీల కంఠుడు అనే నామాలు వచ్చాయి.

 

విష ప్రభావం వలన శివునిలోని వేడిని చల్లార్చేందుకే చల్లని కిరణాలను ప్రసరింప చేసే చంద్రుడిని, చల్లని గంగమ్మ తల్లిని తన తల మీద పెట్టుకున్నాడు. ఇన్ని వున్నా కూడా శివునికి వేడి భరించలేనంతగా వుందిట, అందుకనే శివలింగానికి నిత్యం ఉదకాభిషేకం చేస్తారు. అలా శివుడు అభిషేక ప్రియుడనమాట! ఈ క్షీరసాగర మథన సమయంలో శివుడు చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్న విషయాన్నే శ్రీనాథుడు తను రచించిన శృంగార నైషధంలో చెప్తూ చంద్రుడిని ధవళగరళం అని చమత్కరించారు. మరి విషానికి విరుగుడు విషమే కదా? ఆ విధంగా, హాలాహల ప్రభావం వలన కలిగిన తాపము ధవళ గరళము అయినటువంటి చంద్రుని వలన ఉపశమనం పొందుతోందనమాట!


వివిధ రూపాలలో ఆ మహాశివుని కొలుస్తూ రచించిన ఈ స్తవం అద్వైతానికి ఎలా సరిపోతుంది అనే ఆలోచన రావచ్చును. వైష్ణవులు విష్ణువుని, శైవులు శివుని గొప్పవానిగా చెప్పుకుంటారు. అద్వైతులు మాత్రం ఇద్దరూ ఒకటే అని నమ్ముతారు. మనకున్న రెండు నేత్రాలలో ఏది ముఖ్యం, ఏది గొప్పది అంటే ఏం చెప్తాం? అదే విధంగా శివకేశవులిరువురూ సమానులే. మనకున్న త్రిమూర్తులకి త్రిగుణాలను ఆపాదించినప్పుడు బ్రహ్మకు రజో గుణం, విష్ణువునకు సత్వ గుణం, శివునికి తామస గుణం చెప్తారు. బ్రహ్మ గారిని కాసేపు ప్రక్కకు పెడితే, శివుడు భస్మాన్ని పూసుకుంటాడు కనుక ఆయన రంగు తెలుపు, నివాసం కైలాసం కనుక అదీ తెలుపే, వాహనము నంది కనుక అదీ తెలుపే, ఆయన లింగం కూడా స్ఫటికం అని చెప్పుకున్నాం కనుక అదీ తెలుపే. ఇవన్నీ కూడా సత్వగుణ సూచకాలు. మరి శివుడు చేసేది ప్రళయం, సంహారం ఇవేమో తమోగుణ సూచకాలు. విష్ణువు రంగు నలుపు, స్థితి నిద్ర కనుక ఇవన్నీ తమోగుణ సూచకాలు. మరి ఆయన చేసే పని మాత్రం లోక రక్షణ, లోకపాలన ఇవేమో సత్వగుణ సూచకాలు. శివకేశవులిరువురూ సత్వ-తమో గుణములు రెండూ కలిగివున్నందున వీరిరువురూ సమానులే. శం కరోతీతి శంకరః అన్నారు అంటే సుఖమును కలిగించువాడు శంకరుడు. మన అద్వైత సిద్ధాంతం తెలియచేసేది మొక్షానందం గురించే కనుక భగవత్పాదుల వారు శంకర నామ వైభవం ద్వారా అపరోక్షానుభూతిని వ్యాపింపచేశారు.


 

నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ