Monday, May 28, 2012

తప్పా? ఒప్పా?అమ్మల్లారా! అయ్యల్లారా! మంగిడీలు. నా పేరేటో నాకెరుకలేదుగానీ అంతా నన్ను పిట్టలదొర అంటారయ్యా. మా గూడెం పెజలకి నేనంటే మా సెడ్డ పిచ్చి మా రాజా. నేనేటి సెప్పినా ఎమ్మటే సేసేత్తారు. నేను కయిత్తం రాత్తానని, కూసింత సదుకున్నానని (నేను రెండు దాకా సదివా, ఇంగిలీసు కూడా తెలుసు. నేను మనుసుల్ని సదివా) తెగ మదింపయ్యా. నా కయిత్తం మీరూ ఓ పాలి సూత్తారేటి? (ఇట్టాంటియ్యి నా కాడ సాలా ఉంటి) :):)

యేసవి ఎండలకు డెర్మి కూల్ లాలి..
టైం పాస్ సేయటాకి లాలిపాప్ లాలి..
ఫైటింగు
సేయటాకి రాఖి ఇస్టైల్ లాలి...
మాటలు తెల్వటాకి డిక్సనరీ లాలి..
వాకింగు
సేయటాకి వాల్ సపోర్టంత లాలి...
తెలుగమ్మను బుజ్జగించటాకి అచ్చుల అల్లుల లాలి...

గూడెం దాటిపోని నేను ఇపుడిట్టా ఈడకి ఎందుకొస్సినా అంటే నాకో పేద్ద సిక్కొచ్చి పడిపోయినాది మా రాజా! పెద్దోల్లు, పెద్ద సదువులు సదివినోల్లు మీరే నాయం సెప్పాల. మొన్న ఎన్నికలపుడు పెచారానికని రాజకీయనాయకులంట మా గూడేనికి వొచ్చారు. వొచ్చినోల్లు సక్కగా నాకాడకొచ్చి "సూడు దొరా నువ్ మాకో సాయం సెయ్యాల. మీ గూడెంలో అందరికీ మేము కొన్ని బవుమతులు ఇయ్యాల జనమంతా పోగెయ్యి" అన్నారు. ఓస్ అదెంత పని, మన పెజలకి సల్ల అగుతాదని మన్నెం పెజలందరినీ పిలిసినా. ఆల్లు మా అందరికీ గుడ్డలు, మా ఇంటాల్లకి బిందెలు, ఇట్టా సాలా ఇచ్చారు. ఇచ్చినాక మీరు ఈ పాలి ఎన్నికల్లో మాకే ఓటెయ్యాల అని సెప్పి ఎలిపోయినారు. ఆల్లు ఎల్లినాక మా మన్నెం పెజలంతా ఈ రాజకీయనాయకులంటే ఎవురు అని కొచ్చిను! నాకేటి తెలుసనీ? ఆల్లు గొప్పోల్లు మనని పాలించే పెబువులు అని ఆల్ల పుటక గూర్చి సెప్పినా. మీరూ ఓ పాలి సూసి రండి.
ఈల్లు ఎల్లినాక ఇంకోల్లు అట్టా శానా మంది ఏవేవో ఇచ్చేసి పొయ్యారు. పెతీ యాల్లూ ఓట్లు మాకు ఎయ్యాల అంటే మాకు ఎయ్యాల అని సేప్పినోల్లే. ఇట్టా బవుమతుల పేరుతో ఆసె సూపి మమ్మల్ని కోనేసినారు. సరీగా రేపు ఎలేక్సన్లనగా ఇయ్యాల్టి రేత్తిరిన ఎరుకలసానికి పెద్ద అనుమానమొస్సినాది. అది అందరినీ కూడేసి నా కాడికి ఒచ్చి పెంచాయితీ పెట్టేసినాది. "ఇపుడు అందరి కాడా బవుమతులు తీసేసుకున్నాం గందా! అందరూ ఓటు ఎయ్యమనే కోర్తిరి. మరి పొద్దుటేల ఓటు ఓరికి ఎయ్యాలా???" అని. 
నేను ఓరికీ అన్నాయం కాకుండా అంతా నాయం సెయ్యాలని, అందరి కాడా అన్నీ తీసుకుంటిమి. మాటిస్సినట్టు అందరికీ గుద్దెయ్యండి ఓట్లు అని సెప్పినా. ఇందులో నా తప్పిదమేమన్నా ఉందా?మా పెజలు నా మాట ఎమ్మడి అట్టానే సేసారు. వెనకమాల తెల్సిన ఇసయం అట్టా అందరికీ గుద్దిన ఓట్లు సెల్లవంట. మాకెట్టా తెలుస్తాది? ఇప్పుడా రాజకీయనాయుకులు మేమిచ్చినయన్నీ మాకు తిప్పిచ్చేయమంటిరి. అస్తువులు అంటే ఇచ్చేత్తం గానీ సారాయి నీల్లు, బిరియానీ పొట్లాలు ఎట్టా ఇచ్చేది? నాయం సెయ్యాలని నేను ఇంతా సేత్తే ఇప్పుడంతా నన్ను తన్ననీకి లగెత్తుతున్రు. నేనేటి సేసేది? పెపంచకం సూడనోడిని. నేను సేసింది తప్పా? ఒప్పా? మీరే సెప్పాలి మా రాజా!!!

Thursday, May 17, 2012

ఈ గింజలు తెలుసా?

అందరికీ ఎంతో సుపరిచితమయిన దీని పేరు ఇండుపకాయ లేదా ఇందుగు గింజ లేదా చిల్లగింజ (Strychnos potatorum Linn.). దీనినే సంస్కృతంలో నిర్మలి అనీ, ఆంగ్లంలో clearing nut tree అనీ అంటారు. దీనికున్న లక్షణాల వలన ఆ పేరు పెట్టారో లేక ఆ పేరు ఉన్నందువలన దీనికి ఆ లక్షణాలు వచ్చాయో నాకు అర్థం కాలేదు. పూర్వము మడ్డి నీటిని తేట బఱచడానికి చిల్లగింజ (లేక చిల్లవిత్తు)ని బాగా అరగదీసి వాడేవారు. దాని నుండి వచ్చే గంధం నీటిని పరిశుభ్రపరచడమే కాక ఆరోగ్యకరంగా కూడా ఎంతో మంచిది. దీనికి సంబంధించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ టపా.

పూర్వకాలంలో జనాలు మందులకోసం వృక్ష సంపద మీదే ఆధారపడేవారు. ఇలా పసరు, మూలికలు మొదలయిన వాటి మీద ఆధారపడటం ఋగ్వేద కాలం నుండి ఉందని అంటారు. ఇప్పుడున్నన్ని మందులు, జబ్బులు కూడా ఆ కాలంలో ఉండేవికావుట. WHO (World Health Organization) వారి అంచనా ప్రకారం ఇప్పటికీ ఎనభై శాతం జనాలు ప్రకృతి చికిత్సా వైద్య విధానం మీద ఆధారపడుతున్నారుట. గిరిజనులు దాదాపుగా ప్రతీ చికిత్సకీ వీటినే కదా వాడేది. ఆ కాలంలో అంతగా చదువుకొని రోజుల్లోనే వీళ్ళు ఈ చిల్లగింజకి ఉన్న గుణాలను ఎలా గుర్తించారు అన్నదే ఇప్పటికీ నాకు అంతుపట్టని విషయం. వరదలోచ్చినప్పుడో, వానలు బాగా పడినప్పుడో, నీటిలో బురద చేరటం మామూలే.
క్రొత్త గోదావరి నీరు చూస్తే బాగా అర్థమవుతుంది బురద నీటిలో కలవటం అంటే ఏమిటో (మిగతా నదుల్లో నీళ్ళు చూసినా తెలుస్తుందేమో కాని నాకు గోదావరి అలవాటు కనుక అలా చెప్పేసాను). ఇప్పుడంటే వాటర్ ఫిల్టర్స్, ఆక్వాగార్డ్స్ వంటివి ఉన్నాయి కాని ఆ కాలంలో నీటిని వడకట్టుకునో, కాచుకునో త్రాగేవారు. అటువంటి సమయంలో ఈ చిల్లగింజలను బాగా నూరి లేదా నలిపి ఆ గింజల పొడిని కుండ అడుగుభాగంలో వేసేసి బురద చేరిన నీటిని పోసి అలా ఉంచేస్తే కాస్సేపటికి బురదంతా (బురదతో పాటు నీటిలో ఉండే సూక్ష్మజీవులు, క్రిములు అన్నీ) క్రిందకీ, మంచి నీరంతా పైకి వచ్చి త్రాగడానికి వీలుగా ఉండేది. మనం గత కొన్నేళ్ళ క్రిందట వాడిన వాటర్ ఫిల్టర్స్లో ఉండే కాట్రిడ్జ్ కూడా చిల్లగింజ గంధంతో తయారయినదని పరిశోధకుల విశ్వాసం.
 
ఈ చిల్లగింజ మొక్కలు భారతదేశంలో పుట్టాయి. శ్రీలంక, జింబాంబ్వే, బోట్స్వానా, మ్యాన్మార్, మొదలగు దేశాల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తాయి. ఈ పండ్లు గుండ్రంగా ఎరుపు రంగులో (ఈ చిత్రంలో చూపిన విధంగా) ఉండి బాగా పండినవి నల్లగా అవుతాయి. గింజలు గుండ్రంగా, ముదురు గోధుమ రంగులో, చిన్న పట్టులాంటి నూగుతో ఉంటాయి. ఈ గింజల పొడి పసుపు రంగులో ఉంటుంది. ఈ జాతి మొక్కలలో ఉండే హానికరమయిన పదార్థం (Strychnine) ఇందులో లేకపోవటం విశేషం. కనుక ఈ గింజల పొడి (దీనినే గంధం అంటారు) నీటిలో కలిసినా మనకి ఎటువంటి హానీ ఉండదు. పైగా ఈ పొడి వలన ఆరోగ్యంగా ఉంటామని శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలలో తేల్చి చెప్పారు. వీటి ప్రయోజనాలేమిటంటే:
౧. గింజలు - తల, ఉదర సంబంధిత బాధలకి, లోజ్వరాలకీ, మధుమేహానికి, డయేరియాకి, అన్ని రకాల కంటి జబ్బులకి, మూత్రపిండాల జబ్బులకీ, లివరు బాగా పని చేయటానికీ మంచి మందుగా పని చేస్తాయి.
౨. వేళ్ళ రసం బొల్లి, శోభి తదితర మచ్చలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
౩. ఫలాలు - మూర్ఛ, విషాలను హరించడానికి, అధిక దాహాన్ని తగ్గించడానికి మందుగా వాడతారు.

ఒక్క మొక్క వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసేసరికి చాలా మంది దృష్టి వీటి మీదకి మళ్ళింది. ఇప్పటిదాకా అందరూ మర్చిపోయి, వాటి పేరు కూడా తెలియకుండా పోయి, ఏదో పిచ్చి మొక్క క్రింద పడి ఉన్న మొక్కకి ఇప్పుడు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పటం వలన ఒక్కసారిగా వ్యాపారస్తులు సైతం వీటి కోసం ఎగబడుతున్నారు. శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోజనాల కోసం శోధిస్తున్నారు. ఇన్ని సద్గుణాలను, ఉపయోగాలను కలిగి ఉన్న చిల్లగింజ మన పద్యాలలో కూడా స్థానం సంపాదించుకుంది.
సరసగుణ ప్రపూర్ణునకు సన్నపుదుర్గుణ మొక్కవేళయం
దొరసిన నిట్లు నీకుఁ దగునో యని చెప్పిన మాననేర్చుఁగా
బురద యొకీంచుకంత తముఁ బొందినవేళలం జిలవిత్తుపై
నొరసిన నిర్మలత్వమున నుండవె నీరములెల్ల భాస్కరా!
ఏ విధముగా అయితే నిజ స్వభావము చేత నిర్మలమైన నీళ్ళు పొరపాటున బురద కలిస్తే చిల్లగింజ గంధం కలపగానే తేఱి మళ్ళీ మంచిగా మారిపోతాయో అదే విధముగా ఎల్లప్పుడూ మంచిగుణములు ఉండే యోగ్యునకి ఎప్పుడైనా ఒక దుర్గుణము కలిగితే ఇది నువ్వు చేసే పనేనా అని ఒక్కసారి చెపితే వెంటనే మారి తన తప్పు తెలుసుకుని మళ్ళీ ఆ తప్పును చేయడు అని అర్థం.
కలకండ పేరుచెప్ప నోరు తియ్యబడదురా
చిల్లగింజ పేరుజెప్ప జలము శుద్ధిగాదురా
గంజాయి పేరువిన్న నిషా నీకు రాదురా
చిత్రపట జ్యోతులతో చీకటి తొలగిపోదురా
ఇది నాగులవంచ వసంతరావు గారు వ్రాసిన పద్యం. దీని అర్థం మనకి తెలుస్తూనే ఉంది కనుక వివరించే ప్రయత్నం విరమిస్తున్నాను.
అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం
కృత్వాజ్ఞానం స్వయం నస్యేత్ జలం కతక రేణువత్

అని ఆది శంకరాచార్యుల వారు ఆత్మబోధలో అంటారు. ఇక్కడ కతక రేణువు అంటే చిల్లగింజ పొడి. ఇది మురికి నీటిని పరిశుభ్రం చేసి నీటిలోనే కలిసిపోతూ ఉన్నట్లుగా అజ్ఞానం చేత కలుషితమయిన జీవుని జ్ఞానాభ్యాసం అనేటువంటిది బాగా పరిశుద్ధునిగా చేసి గురువు ఇచ్చిన జ్ఞానం తనంతట తానుగానే లీనమయిపోతూ ఉంటుంది అని అర్థం. అదే విధంగా వేమన శతకంలో ఈ పద్యం చూడండి:
గురువు చిల్లగింజ కుంభ మీదేహంబు
ఆత్మ కలుషవంక మడుగుఁబట్టఁ
దెలిసి నిలిచెనేని దివ్యామృతంబురా
విశ్వదాభిరామ వినర వేమ!

అలానే ఈ కీర్తనలో కూడా గురువుని చిల్లగింజ తోనే పోల్చారు చూడండి:

నీ చిత్తము నిశ్చలము - నిర్మలమని నిన్నె నమ్మినాను
నా చిత్తము వంచన చంచలమని - నను విడనాడకుమి; శ్రీరామ !

గురువు చిల్లగింజ - గురువే భ్రమరము
గురుడే భాస్కరుడు - గురుడే భద్రుడు
గురుడే యుత్తమగతి - గురువునీ వనుకొంటి
ధరను దాసుని బ్రోవ - త్యాగరాజనుత !

ఇలా పద్యాలతో నీతులు వల్లిస్తూ, కీర్తనలతో ఆధ్యాత్మికంగా, పిత్త, కఫ దోషాలను హరిస్తూ ఆరోగ్యపరంగానే కాక, పరిశ్రమల్లో (నేత, కాగితం) కూడా ఈ చిల్లగింజలు సుస్థిరమయిన స్థానాన్ని పొందాయి. ఇప్పుడు పరిశోధకులు, ఫార్మసీ వారి దృష్టి కూడా పడింది కనుక మున్ముందు ఏమవుతుందో వేచి చూడాలి! ఏదేమయినా ఈ సంపదనన్నా మరీ అంతరించిపోయేదాకా కాకుండా మితంగా వాడితే మంచిది.

Sunday, May 06, 2012

జగన్నాథ పండితరాయలు


పండితులకే పండితునిగా, గురువులకే గురువుగా, ప్రభువుల అభిమాన కవిగా, అలంకారికులలో అగ్రగణ్యుడై, ఇతర దేశ రాజులను సైతం తన కవిత్వమనే వ్యసనానికి బానిసలను చేసిన ప్రఖ్యాత సంస్కృత కవి జగన్నాథ పండితరాయలు. ఈయన పేరు విన్నా, వినకపోయినా ఈయన వ్రాసిన "రసగంగాధర"మనే అలంకార శాస్త్రాన్ని వినని వారు ఉండరేమో! అలంకార శాస్త్రంలో ఈయనని మించిన వారు లేరు అన్న ఖ్యాతిని గడించిన మహానుభావుడు. చక్కని, ఇంపయిన పద్య రచన ఈయన సొంతం. ఈయన దక్షిణ భారత దేశ కవి అయ్యుండీ, ఉత్తర భారత దేశంలో ఎక్కువ కీర్తిని గడించారు. జీవితంలో (ఆ కాలంలోనే) మతాంతర ప్రేమ వివాహం చేసుకుని, తరువాత తప్పు చేసానే అన్న పశ్చాత్తాపంతో గంగలో ఐక్యమయిన మహనీయుని జీవితంలోని కొన్ని ఘట్టాలను మీ ముందుకి తెచ్చే ప్రయత్నమే ఈ టపా. 
వివరాల్లోకి వెళితే, ఈయన తూర్పు గోదావరి జిల్లా ముంగండలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడని అంటారు. ఈయన తన కవిత్వమనే కత్తికి, పాండిత్యమనే సాన పెట్టి, ఏక సంతాగ్రాహమనే ఒరలో బంధించి, భారత దేశంలోని పండితులందరినీ తన పాండిత్యంతో ఓడించి రాజులందరి వద్దా ప్రశంసలు పొందాలనే యోచనతో బయలుదేరారుట. అలా అందరినీ జయించి, ఎన్నో సత్కారాలను పొందుతూ ఢిల్లీలోని ఒక సత్రములో బస చేసారుట. ఉదయమే సంధ్యావందనాదులు చేసుకోవడానికి ఒక చెఱువు వద్దకు వెళ్ళే సమయానికి ఇద్దరు ఘార్జర (గుజరాతీయులు) స్త్రీలు గొడవ పడుతున్నారుట. భాష అర్థం కాని ఈయన తన పని ముగించుకుని సత్రానికి చేరుకున్నారుట. గొడవ పడిన ఇద్దరిలో ఒకామె తనకి న్యాయం చెయ్యవలసినది అంటూ అప్పటి ఢిల్లీ రాజయిన షాజహాన్ కి విన్నవించుకుందిట. ఆయన ఇరువురి స్త్రీల వాదన విని, ఒక నిర్ణయానికి రాలేక సాక్షులెవరయినా ఉంటే చెప్పండి అని అడుగగా వీరిద్దరూ ఒక బ్రాహ్మణ పండితుడు వచ్చాడని చెప్పగా ఆయనని సభకు రాప్పించారుట. మొత్తానికి విషయం ఈయనకి అర్థమయ్యేలా మంత్రిగారు వివరించగా, ఈయన నాకు భాష రాదు కానీ మొదటామె ఇలా అంది, రెండవ ఆమె ఇలా అంది అంటూ విన్నది విన్నట్టు చెప్పారుట. అది మరి ఆయన గ్రాహక శక్తి. దీనితో అత్యంత ఆశ్చర్యచకితుడైన రాజు ఆయనని బ్రతిమాలి మరీ ఆయన ఆస్థానములో కవిగా నియమించుకున్నారుట. ఇలా ఆయన మొఘలు ఆస్థానములో కవిగా స్థిరపడ్డారు. అందుకే కాళిదాసు "న రత్న మన్విష్యతి మృగ్యతే హి తత్" (అనగా రత్నం ఎవ్వరినీ వెతుక్కోదు, రత్నాన్ని మనం వెతుక్కుంటాం) అని అంటారు.
క్రమేణా జగన్నాథునికి కూడా రాజుగారంటే మక్కువ పెరిగింది. ఎన్నో సందర్భాలలో వీరి ప్రతిష్ఠను నిలపెట్టి రాజుగారికి మరింత ఆత్మీయుడయ్యారు. ఇలా వీరిరువురి బంధం మరింత ధృఢమై ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారుట. అటువంటి సందర్భంలో ఒక రోజు రాజు గారు నా గుర్తుగా ఎప్పటికీ మీ వద్ద ఉండేందుకు ఏం కావాలో కోరుకోమన్నారుట. వెంటనే జగన్నాథుడు "ఇయం సుస్తనీ మస్తక న్యస్త హస్తా లవంగీ సదంగీ మదంగీకరోతు" (అనగా ఇక్కడే చక్కగా తిరుగుతూ, తల మీద ఉండే బురఖాని అస్తమానూ సరిచేసుకునే అలవాటున్న అతి రమణీయమణీ, నీ పుత్రికా అయినటువంటి "లవంగి"ని నాకు భార్యగా ఇవ్వండి) అని అన్నారుట. ఆ పదాల పోహళింపు చూడండి ఎంత బాగుందో! విన్న వెంటనే రాజు నిశ్చేష్టుడయ్యి, ఏమి మాట్లాడాలో తెలియక, లేచి వెళిపోయారుట. మనసులో రాజుకి జగన్నాథుడంటే ఇష్టం ఉన్నా, "వివాదశ్చ, వివాహశ్చ సమయో రేవ శోభతే" (అనగా వివాదమయినా, వివాహమయినా సమ ఉజ్జీల మధ్యనే చెల్లుతుంది; దీనినే వియ్యానికయినా, కయ్యానికయినా సమ ఉజ్జీలు ఉండాలి అని మార్చారు) అని అంటారు. నా వద్ద విలువయిన సంపద ఉంది, అతని వద్ద వెలకట్టలేని పాండిత్యం ఉంది అనుకుంటూ ఏమీ పాలుపోక తన భార్యని అడుగగా వద్దని చెప్పిందట. తన కూతురినే అడుగగా మౌనం వహించిందట. మంత్రులు, ఇతరులు అందరూ మౌనంగా ఉండటంతో జగన్నాథుడు అల్లుడయితే తన ముస్లిం సోదరులు తనని చులకనగా చూస్తారు, అలానే జగన్నాథుని వైపు వారు కుల భ్రష్టుడిని చేస్తారు కనుక వారిద్దరికీ వివాహం చేయడం మంచిది కాదు అనుకుని అతనికి దేశ బహిష్కార శిక్ష వేసి పంపేశాడు రాజు.

"విద్వత్త్వం చ నృపత్త్వం చ నై న తుల్యం కదాచన
స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే"

పాండిత్యమూ, రాజరికమూ ఎన్నటికీ సమానం కావు. కానీ రాజయిన వానికి తన దేశంలోనే గౌరవం ఉంటే, విద్వత్తు ఉన్న పండితునికి ఎక్కడయినా గౌరవం లభిస్తుంది, ఎక్కడయినా పూజింప బడతాడు అని అనుకుంటూ బాధతో ఆ దేశము నుండి వెళిపోతాడు. మరొక రాజు వద్ద కవిగా స్థిరపడినా, షాజహాన్ మీద మమకారం మాత్రం ఎన్నటికీ పోలేదు. ఆయన నుండి దూరమయిన బాధతో ఉన్న రోజుల్లోనే ఈయన "రసగంగాధర" అనే అలంకార శాస్త్రాన్ని రచించారు. ఎటువంటి బాధనయినా నయం చేసే ఏకైక మందు గ్రంధ రచనం అని ఈయన అంటారు. షాజహాన్ కూడా ఈయనని మరువలేక, క్షేమ సమాచారాలని తెలుసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రాజు సన్మానం చేయగా దానిని చూసిన జగన్నాథుడు

"ఢిల్లీశ్వరో వా జగదీశ్వరో వా మనోరథాన్ పూరయితుం సమర్థః
అన్యై ర్నృపాలైః పరిదీయమానం శాకాయ వా స్యా ల్లవణాయ వా స్యాత్"

ఈ లోకంలోని కవుల మనసుని గ్రహించి, వారి ప్రతిభకు తగ్గ పారితోషకం ఇవ్వగలిగినది ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు. వారే పరమేశ్వరుడు మరియు మా ఢిల్లీ పాదుషా గారు. మిగతా రాజులు సన్మానానికి ఇచ్చినది కేవలం కవుల ఇంటిలో కూరల ఖర్చుకి కానీ ఉప్పు ఖర్చుకి కానీ సరిపోతుంది అని అన్నారుట. ఈ విధముగా తన వేగుల ద్వారా ఈయన సమాచారాలను తెలుసుకుంటున్న షాజహాన్ ఈయన పరిస్థితి అంతగా బాలేదనీ, తను దేశ బహిష్కారం చేసినా కూడా ఎటువంటి కోపమూ లేక తన పరోక్షంలో కూడా తనని మెచ్చుకోవటం చూసి మళ్ళీ తన వద్దకే పిలిచి తన కూతురయిన లవంగిని ఇచ్చి వివాహం చేశారు. అలా ఆయన తన ప్రేమలో గెలిచి ప్రేయసి చేతిని అందుకున్నారు. వివాహమయిన తరువాత చాలా కాలం వారిరువురూ సంతోషంగానే ఉన్నారు. కానీ మెల్లిగా ఒకరి కోసం ఒకరు కొన్నిటికి దూరమవటం నచ్చక, అన్య వర్ణ-జాతి-మతస్కురాలిని వివాహ మాడటం వలన తను కొన్ని యజ్ఞ యాగాదులకీ, మరికొన్ని ముఖ్యమయిన పూజలకీ దూరం కావటం తట్టుకోలేక మనసులోనే రోదించసాగాడు. కానీ తన భార్యకి మాత్రం ప్రేమానురాగాలలో ఏ లోటూ రానీయలేదు.

ఈయన ఇతర ముఖ్య రచనల గురించి ఒకమారు చెప్పుకోవాలి. అవే చిత్రమీమాంసఖండన (అయ్యప్ప దీక్షితులు గారు అర్థాలంకారాల గురించి రచించిన చిత్రమీమాంస అనే రచనను ఖండిస్తూ వ్రాసినది), అసఫవిలాస, జగదాభరణ (జగత్సింగ్ మేవార్ గౌరవార్థం వ్రాసినది), ప్రాణాభరణ (ప్రాణ నారాయణ అనే రాజుగారి గౌరవార్థం వ్రాసినది), అమృతలహరి (యమునానదిని స్తుతిస్తూ వ్రాసినది), కరుణాలహరి (శ్రీహరిని స్తుతిస్తూ వ్రాసినది), లక్ష్మీలహరి (లక్ష్మీ దేవిని స్తుతిస్తూ వ్రాసినది), భామినీవిలాసం (ప్రతీ ఒక్కరూ చదివి తీరవలసిన పుస్తకం, ముక్తకాలతో అద్భుతముగా రచించారు). 

" పుణ్యస్య ఫల మిచ్ఛంతి పుణ్యం నే చ్ఛంతి మానవాః
న పాపఫల మిచ్ఛంతి పాపం కుర్వంతి యత్నతః"

పుణ్యం చేస్తే వచ్చే ఫలితం కావాలని ప్రతీ వ్యక్తీ కోరుకుంటాడు కానీ పుణ్యం మాత్రం చేయడు. పాపం చేస్తే వచ్చే ప్రతిఫలం రాకూడదని ప్రతీ వ్యక్తీ కోరుకుంటాడు కానీ ఏదో ఒక సమయంలో పాపం చేస్తూనే ఉంటాడు. అలా నేనే కాక నీతో కూడా పాపం చేయించిన నా దోషానికి గంగా స్నానమే సరయినదని తన భార్యతో చెప్పగా ఆవిడ కూడా భర్తకి ధైర్యం చెప్పి ఆయనతో బయలుదేరింది. ఇద్దరూ కాశీ క్షేత్రం చేరుకున్నాక గంగామాతని చూడగానే కన్న తల్లిని చూసిన వెంటనే బిడ్డ ఏ విధముగా తన బాధనంతా చెప్పుకుంటాడో అదే పారవశ్యంతో ఈయన తను చేసిన అపరాధాన్ని చెప్పి మన్నించమంటూ గంగ స్నానం చేసి మెట్లన్నీ ఎక్కి పైన తన భార్యతో నిలబడ్డాడుట. అప్పుడు కళ్ళు మూసుకుని నమస్కరించి బాధతో, మనసులోని బరువునంతా దించుకుంటూ ఆశువుగా పాడినదే గంగాస్తవము లేదా గంగలహరి. అక్కడ జనమంతా చూస్తుండగానే ఒక్కో శ్లోకానికి ఒక్కో మెట్టు చొప్పున గంగానది పైకి వచ్చి సరిగ్గా నూట ఎనిమిది శ్లోకాలు పూర్తయ్యేసరికి భార్యాభర్తలిద్దరినీ తనలో ఐక్యం చేసుకుంది.

ఆ గంగానదీ తరంగాల మౌన ధ్వనిలో లవంగీ జగన్నాథుల హృదయ స్పందనలను ఒక్కసారి మననం చేసుకున్నా చాలు ఒక మహా కవి మన గుండెల్లో నిలిచినట్లే. ఏమంటారు?