పండితులకే పండితునిగా, గురువులకే గురువుగా, ప్రభువుల అభిమాన
కవిగా, అలంకారికులలో అగ్రగణ్యుడై, ఇతర దేశ రాజులను సైతం తన కవిత్వమనే వ్యసనానికి
బానిసలను చేసిన ప్రఖ్యాత సంస్కృత కవి జగన్నాథ పండితరాయలు. ఈయన పేరు విన్నా,
వినకపోయినా ఈయన వ్రాసిన "రసగంగాధర"మనే అలంకార శాస్త్రాన్ని వినని
వారు ఉండరేమో! అలంకార శాస్త్రంలో ఈయనని మించిన వారు లేరు అన్న ఖ్యాతిని గడించిన
మహానుభావుడు. చక్కని, ఇంపయిన పద్య రచన ఈయన సొంతం. ఈయన దక్షిణ భారత దేశ కవి
అయ్యుండీ, ఉత్తర భారత దేశంలో ఎక్కువ కీర్తిని గడించారు. జీవితంలో (ఆ కాలంలోనే) మతాంతర
ప్రేమ వివాహం చేసుకుని, తరువాత తప్పు చేసానే అన్న పశ్చాత్తాపంతో గంగలో ఐక్యమయిన
మహనీయుని జీవితంలోని కొన్ని ఘట్టాలను మీ ముందుకి తెచ్చే ప్రయత్నమే ఈ టపా.
వివరాల్లోకి వెళితే, ఈయన తూర్పు గోదావరి జిల్లా ముంగండలో బ్రాహ్మణ కుటుంబంలో
పుట్టిన వాడని అంటారు. ఈయన తన కవిత్వమనే కత్తికి, పాండిత్యమనే సాన పెట్టి, ఏక
సంతాగ్రాహమనే ఒరలో బంధించి, భారత దేశంలోని పండితులందరినీ తన పాండిత్యంతో ఓడించి
రాజులందరి వద్దా ప్రశంసలు పొందాలనే యోచనతో బయలుదేరారుట. అలా అందరినీ జయించి, ఎన్నో
సత్కారాలను పొందుతూ ఢిల్లీలోని ఒక సత్రములో బస చేసారుట. ఉదయమే సంధ్యావందనాదులు
చేసుకోవడానికి ఒక చెఱువు వద్దకు వెళ్ళే సమయానికి ఇద్దరు ఘార్జర (గుజరాతీయులు)
స్త్రీలు గొడవ పడుతున్నారుట. భాష అర్థం కాని ఈయన తన పని ముగించుకుని సత్రానికి
చేరుకున్నారుట. గొడవ పడిన ఇద్దరిలో ఒకామె తనకి న్యాయం చెయ్యవలసినది అంటూ అప్పటి
ఢిల్లీ రాజయిన షాజహాన్ కి విన్నవించుకుందిట. ఆయన ఇరువురి స్త్రీల వాదన విని, ఒక
నిర్ణయానికి రాలేక సాక్షులెవరయినా ఉంటే చెప్పండి అని అడుగగా వీరిద్దరూ ఒక బ్రాహ్మణ
పండితుడు వచ్చాడని చెప్పగా ఆయనని సభకు రాప్పించారుట. మొత్తానికి విషయం ఈయనకి
అర్థమయ్యేలా మంత్రిగారు వివరించగా, ఈయన నాకు భాష రాదు కానీ మొదటామె ఇలా అంది,
రెండవ ఆమె ఇలా అంది అంటూ విన్నది విన్నట్టు చెప్పారుట. అది మరి ఆయన గ్రాహక శక్తి.
దీనితో అత్యంత ఆశ్చర్యచకితుడైన రాజు ఆయనని బ్రతిమాలి మరీ ఆయన ఆస్థానములో కవిగా
నియమించుకున్నారుట. ఇలా ఆయన మొఘలు ఆస్థానములో కవిగా స్థిరపడ్డారు. అందుకే కాళిదాసు
"న రత్న మన్విష్యతి మృగ్యతే హి తత్"
(అనగా రత్నం ఎవ్వరినీ వెతుక్కోదు, రత్నాన్ని మనం వెతుక్కుంటాం) అని అంటారు.
క్రమేణా జగన్నాథునికి కూడా రాజుగారంటే మక్కువ పెరిగింది. ఎన్నో సందర్భాలలో వీరి
ప్రతిష్ఠను నిలపెట్టి రాజుగారికి మరింత ఆత్మీయుడయ్యారు. ఇలా వీరిరువురి బంధం మరింత
ధృఢమై ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారుట. అటువంటి సందర్భంలో
ఒక రోజు రాజు గారు నా గుర్తుగా ఎప్పటికీ మీ వద్ద ఉండేందుకు ఏం కావాలో
కోరుకోమన్నారుట. వెంటనే జగన్నాథుడు "ఇయం సుస్తనీ
మస్తక న్యస్త హస్తా లవంగీ సదంగీ మదంగీకరోతు" (అనగా ఇక్కడే చక్కగా
తిరుగుతూ, తల మీద ఉండే బురఖాని అస్తమానూ సరిచేసుకునే అలవాటున్న అతి రమణీయమణీ, నీ
పుత్రికా అయినటువంటి "లవంగి"ని నాకు భార్యగా ఇవ్వండి) అని అన్నారుట. ఆ
పదాల పోహళింపు చూడండి ఎంత బాగుందో! విన్న వెంటనే రాజు నిశ్చేష్టుడయ్యి, ఏమి
మాట్లాడాలో తెలియక, లేచి వెళిపోయారుట. మనసులో రాజుకి జగన్నాథుడంటే ఇష్టం ఉన్నా, "వివాదశ్చ, వివాహశ్చ సమయో రేవ శోభతే"
(అనగా వివాదమయినా, వివాహమయినా సమ ఉజ్జీల మధ్యనే చెల్లుతుంది; దీనినే వియ్యానికయినా, కయ్యానికయినా సమ ఉజ్జీలు ఉండాలి అని మార్చారు) అని అంటారు. నా వద్ద
విలువయిన సంపద ఉంది, అతని వద్ద వెలకట్టలేని పాండిత్యం ఉంది అనుకుంటూ ఏమీ పాలుపోక
తన భార్యని అడుగగా వద్దని చెప్పిందట. తన కూతురినే అడుగగా మౌనం వహించిందట.
మంత్రులు, ఇతరులు అందరూ మౌనంగా ఉండటంతో జగన్నాథుడు అల్లుడయితే తన ముస్లిం సోదరులు
తనని చులకనగా చూస్తారు, అలానే జగన్నాథుని వైపు వారు కుల భ్రష్టుడిని చేస్తారు కనుక
వారిద్దరికీ వివాహం చేయడం మంచిది కాదు అనుకుని అతనికి దేశ బహిష్కార శిక్ష వేసి
పంపేశాడు రాజు.
"విద్వత్త్వం చ నృపత్త్వం చ నై న తుల్యం కదాచన
స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే"
స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే"
పాండిత్యమూ, రాజరికమూ ఎన్నటికీ సమానం కావు. కానీ రాజయిన వానికి
తన దేశంలోనే గౌరవం ఉంటే, విద్వత్తు ఉన్న పండితునికి ఎక్కడయినా గౌరవం లభిస్తుంది,
ఎక్కడయినా పూజింప బడతాడు అని అనుకుంటూ బాధతో ఆ దేశము నుండి వెళిపోతాడు. మరొక రాజు
వద్ద కవిగా స్థిరపడినా, షాజహాన్ మీద మమకారం మాత్రం ఎన్నటికీ పోలేదు. ఆయన నుండి
దూరమయిన బాధతో ఉన్న రోజుల్లోనే ఈయన "రసగంగాధర" అనే అలంకార శాస్త్రాన్ని
రచించారు. ఎటువంటి బాధనయినా నయం చేసే ఏకైక మందు గ్రంధ రచనం అని ఈయన అంటారు.
షాజహాన్ కూడా ఈయనని మరువలేక, క్షేమ సమాచారాలని తెలుసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రాజు సన్మానం చేయగా దానిని చూసిన జగన్నాథుడు
"ఢిల్లీశ్వరో వా
జగదీశ్వరో వా మనోరథాన్ పూరయితుం సమర్థః
అన్యై ర్నృపాలైః
పరిదీయమానం శాకాయ వా స్యా ల్లవణాయ వా స్యాత్"
ఈ లోకంలోని కవుల మనసుని గ్రహించి, వారి ప్రతిభకు తగ్గ పారితోషకం
ఇవ్వగలిగినది ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు. వారే పరమేశ్వరుడు మరియు మా ఢిల్లీ పాదుషా
గారు. మిగతా రాజులు సన్మానానికి ఇచ్చినది కేవలం కవుల ఇంటిలో కూరల ఖర్చుకి కానీ
ఉప్పు ఖర్చుకి కానీ సరిపోతుంది అని అన్నారుట. ఈ విధముగా తన వేగుల ద్వారా ఈయన
సమాచారాలను తెలుసుకుంటున్న షాజహాన్ ఈయన పరిస్థితి అంతగా బాలేదనీ, తను దేశ
బహిష్కారం చేసినా కూడా ఎటువంటి కోపమూ లేక తన పరోక్షంలో కూడా తనని మెచ్చుకోవటం చూసి
మళ్ళీ తన వద్దకే పిలిచి తన కూతురయిన లవంగిని ఇచ్చి వివాహం చేశారు. అలా ఆయన తన
ప్రేమలో గెలిచి ప్రేయసి చేతిని అందుకున్నారు. వివాహమయిన తరువాత చాలా కాలం
వారిరువురూ సంతోషంగానే ఉన్నారు. కానీ మెల్లిగా ఒకరి కోసం ఒకరు కొన్నిటికి దూరమవటం
నచ్చక, అన్య వర్ణ-జాతి-మతస్కురాలిని వివాహ మాడటం వలన తను కొన్ని యజ్ఞ యాగాదులకీ,
మరికొన్ని ముఖ్యమయిన పూజలకీ దూరం కావటం తట్టుకోలేక మనసులోనే రోదించసాగాడు. కానీ తన
భార్యకి మాత్రం ప్రేమానురాగాలలో ఏ లోటూ రానీయలేదు.
ఈయన ఇతర ముఖ్య రచనల గురించి ఒకమారు చెప్పుకోవాలి. అవే
చిత్రమీమాంసఖండన (అయ్యప్ప దీక్షితులు గారు అర్థాలంకారాల గురించి రచించిన
చిత్రమీమాంస అనే రచనను ఖండిస్తూ వ్రాసినది), అసఫవిలాస, జగదాభరణ (జగత్సింగ్ మేవార్
గౌరవార్థం వ్రాసినది), ప్రాణాభరణ (ప్రాణ నారాయణ అనే రాజుగారి గౌరవార్థం
వ్రాసినది), అమృతలహరి (యమునానదిని స్తుతిస్తూ వ్రాసినది), కరుణాలహరి (శ్రీహరిని
స్తుతిస్తూ వ్రాసినది), లక్ష్మీలహరి (లక్ష్మీ దేవిని స్తుతిస్తూ వ్రాసినది),
భామినీవిలాసం (ప్రతీ ఒక్కరూ చదివి తీరవలసిన పుస్తకం, ముక్తకాలతో అద్భుతముగా
రచించారు).
" పుణ్యస్య ఫల మిచ్ఛంతి పుణ్యం నే
చ్ఛంతి మానవాః
న పాపఫల మిచ్ఛంతి పాపం
కుర్వంతి యత్నతః"
పుణ్యం చేస్తే వచ్చే ఫలితం కావాలని ప్రతీ వ్యక్తీ కోరుకుంటాడు
కానీ పుణ్యం మాత్రం చేయడు. పాపం చేస్తే వచ్చే ప్రతిఫలం రాకూడదని ప్రతీ వ్యక్తీ
కోరుకుంటాడు కానీ ఏదో ఒక సమయంలో పాపం చేస్తూనే ఉంటాడు. అలా నేనే కాక నీతో కూడా
పాపం చేయించిన నా దోషానికి గంగా స్నానమే సరయినదని తన భార్యతో చెప్పగా ఆవిడ కూడా
భర్తకి ధైర్యం చెప్పి ఆయనతో బయలుదేరింది. ఇద్దరూ కాశీ క్షేత్రం చేరుకున్నాక
గంగామాతని చూడగానే కన్న తల్లిని చూసిన వెంటనే బిడ్డ ఏ విధముగా తన బాధనంతా
చెప్పుకుంటాడో అదే పారవశ్యంతో ఈయన తను చేసిన అపరాధాన్ని చెప్పి మన్నించమంటూ గంగ
స్నానం చేసి మెట్లన్నీ ఎక్కి పైన తన భార్యతో నిలబడ్డాడుట. అప్పుడు కళ్ళు మూసుకుని
నమస్కరించి బాధతో, మనసులోని బరువునంతా దించుకుంటూ ఆశువుగా పాడినదే గంగాస్తవము లేదా గంగలహరి. అక్కడ జనమంతా చూస్తుండగానే ఒక్కో శ్లోకానికి ఒక్కో మెట్టు చొప్పున
గంగానది పైకి వచ్చి సరిగ్గా నూట ఎనిమిది శ్లోకాలు పూర్తయ్యేసరికి
భార్యాభర్తలిద్దరినీ తనలో ఐక్యం చేసుకుంది.
ఆ గంగానదీ తరంగాల మౌన ధ్వనిలో లవంగీ జగన్నాథుల హృదయ స్పందనలను ఒక్కసారి మననం చేసుకున్నా చాలు ఒక మహా కవి మన గుండెల్లో నిలిచినట్లే. ఏమంటారు?
ఆ గంగానదీ తరంగాల మౌన ధ్వనిలో లవంగీ జగన్నాథుల హృదయ స్పందనలను ఒక్కసారి మననం చేసుకున్నా చాలు ఒక మహా కవి మన గుండెల్లో నిలిచినట్లే. ఏమంటారు?
