Wednesday, June 29, 2011

గొబ్బి గోపెమ్మ


ఎక్కడనుంచో దూరంగా తిరుప్పావై వినిపిస్తోంది. అది వినగానే నాకు ఇవాల్టినుంచి ధనుర్మాసం మొదలయ్యిందన్న విషయం అర్ధమయ్యింది. అసలు పరిపూర్ణమయిన పండగ వాతావరం చూడాలన్నా, ఆ అనుభూతిని పొందాలన్నా మా ఊరు రావలసినదే. గోదావరి జిల్లాలలో ఏ పల్లెటూరికి వెళ్ళినా ఆ పండగ వాతావరణమే వేరు. ధనుర్మాసం వచ్చిందంటే అసలే ఆడపిల్లలకి ఎన్ని పనులు చెప్పండి? పొద్దున్నే లేవాలి మంచి మంచి ముగ్గులు వేయాలి. వెచ్చని, స్వచ్ఛమయిన ఆవు పేడ తీసుకుని రావాలి. దానితో గొబ్బెమ్మలను చేయాలి, చేసిన గొబ్బెమ్మలను పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. వీటిల్ని ముగ్గు మధ్యలో పెట్టిన తరువాత మన వీధిలో అందరికంటే మన ముగ్గే అందంగా ఉండాలి. అప్పుడు కాసేపు మన నైపుణ్యాన్ని మనం మెచ్చుకుంటుండగానే ఏ పాలవాడో, వార్తా పత్రికలు వేసే వాడో వచ్చి మన ముగ్గు తోక్కబోతాడు. వాడికి కాసేపు హిత బోధ చేయాలి లేదా వాడు తొందరపడి చెరిపేస్తే వాడితోనే మన ముగ్గుని దిద్దించాలి. ఇన్ని పనులయ్యి మనం వెళ్లేసరికి అప్పుడే అందమయిన  రంగు రంగుల పూలన్నీ విచ్చుకుంటాయి. కృష్ణ బంతులు, ఊక బంతులు, ముద్ద బంతులు, ఎన్నో రంగులలో డిసెంబరాలు, గొబ్బి పూలు, మొదలయినవాటన్నిటినీ కోసి మాల కట్టి గుడికి సరిగ్గా బలిహారం (సూర్యోదయ సమయం అప్పుడు స్వామికి పెట్టే నైవేద్యం) సమయానికి తీసుకెళ్ళి ఇస్తే మనకు పూజారి గారు వరమిచ్చి వేడి వేడి ప్రసాదం ఇస్తారు. 

ఇప్పుడే అసలు పని మొదలవుతుంది. పొద్దున్న తెచ్చిన ఆవు పేడలో కొంచెం సాయంకాలానికి దాచామా, గొబ్బిళ్ళు పెట్టుకోవడం కోసం మరి ముత్తయిదువులని పిలవాలి కదా? కాబట్టి అలా ఇంట్లో మన పని ముగించుకుని మిగతా పనిని అమ్మకి వదిలేసి మనం అలా ఊరిలోకి వెళ్లి మిగతా వాళ్ళందరినీ పిలవాలి. పిలవడమంటే మాటలనుకున్నారా? ఇదే అసలయిన చిక్కు మా ఇంట్లో ఇవాళ అంటే మా ఇంట్లో ఇవాళ అని వాదులాడుకోవడం సాధారణంగా జరిగే పనే కనుక అందరం కలిసి ఒక్కొక్కళ్ళకి ఒక్కో రోజు ఇచ్చేసి నెలంతా పంచేసుకుంటాం. ఇవన్ని మొదటి రోజే జరగాలి అప్పుడే నెలంతా చీకు, చింత లేకుండా హాయిగా గొబ్బిళ్ళు పెట్టుకోవచ్చు. ఇదంతా కుదుర్చుకుని ఇంటికెళ్ళి అమ్మతో ప్రసాదం చేయించాలి కదా మరి? ఇది కూడా ముందే ఒక మాట అనేసుకోవాలి తిన్న ప్రసాదమే మళ్లీ మళ్లీ ఏమి తింటాం? కాబట్టి ఆ ప్రసాదం కూడా రకరకాలు ఏమేమి ఉండాలో అనేసుకుంటే బాగుంటుంది. ముఖ్యముగా అప్పుడే వచ్చే రాసుసిరి కాయలతో చేసే పిండి పులిహార అంటే నాకు చాలా ఇష్టం! ఇదంతా అయ్యి మనం పట్టు పరికిణీ తీసుకుని సిద్ధంగా పెట్టుకునే సరికి సాయంకాలమవుతుంది. 

ఇంక పూజకి కావలసినవన్నీ సిద్ధం చేయాలి. ఇక్కడ మనం కొన్ని ముఖ్య విషయాల గురించి మాట్లాడుకోవాలి. అవేమిటంటే? గొబ్బిళ్ళు అంటే ఏమిటి? వాటిల్ని  ఆవు పేడతోనే ఎందుకని చేస్తారు? మొదలయినవన్నమాట.
గోమాత వేద స్వరూపిణి. ముఖ్యముగా గోమయాన్ని (అంటే ఆవు పేడ) మనం గౌరీ దేవి ప్రతీకగా పూజిస్తే మనం కోరుకున్న వరునితో త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం. ఇది ఒక భావన అయితే ఇంకొక భావన ఏమిటంటే మనం గొబ్బిళ్ళు పెట్టేటప్పుడు మనం మధ్యలో పెద్ద గొబ్బెమ్మని పెడతాము. అది గోదా దేవికి ప్రతీక. పక్కన పెట్టే సందె గొబ్బెమ్మలు మిగిలిన గోపికలకి ప్రతీక. వీటిని అందుకనే అలా ముద్దలా వదిలేయకుండా పసుపు, కుంకుమ, పూలు పెట్టి అలంకరిస్తాము. ఇలా పెట్టిన గొబ్బెమ్మల చుట్టూ కన్నె పిల్లలందరూ ఆడుతూ, కృష్ణుని ఊహించుకుంటూ పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ గుండ్రముగా తిరుగుతారు. ఇలా పాడే పాటలనే గొబ్బి పాటలు అంటారు. వీటికి జానపద  వాజ్ఞ్మయములో ప్రత్యేకమయిన స్థానం ఉంది. 


"సుబ్బీ గొబ్బెమ్మా.. సుబ్బణ్ణీయవే..
 చామంతి పువ్వంటీ చెల్లెల్నీయవే
తామర పూవంటీ తమ్ముణ్ణీయవే
బంతి పువ్వంటి బావ నివ్వవే
తాటి పండంటి తాత నివ్వవే
మల్లె పూవంటి మామా నివ్వవే 

అరటి పండంటి అత్త నివ్వవే
మొగలి పూవంటీ.. మొగలి పూవంటీ.. మొగుణ్ణీయవే.."  అంటూ పూజని ముగించే సమయములో సిగ్గు పడే అమ్మాయిలని చూడటానికి పోతు పేరంటాళ్ళు (అబ్బాయిలు కనుక అమ్మాయిల పేరంటానికి వస్తే మా ఊరిలో ఇలానే అంటారు) కూడా వస్తారు. కొంతమంది దాక్కుని చూస్తే కొంతమంది ఏకంగా పెరంటానికే వచ్చేసి మరి చూస్తారు. సరే ఈ పూజ అయ్యాక ఇష్టం వచ్చినంత సేపు గొబ్బి పాటలు పాడుతూ ఆడచ్చు. ఇక్కడ మచ్చుకకి నాకు గుర్తున్న కొన్ని పాటలని ఇస్తున్నాను.
పాట - : అన్నమాచార్య కీర్తన

కొలని  దోపరికి  గొబ్బిళ్ళో  
యదుకుల  స్వామికి  గొబ్బిళ్ళో  ll 2 ll

కొండ  గొడుగుగా   గోవుల  గాచిన  
కొండుక  శిశువుకు  గొబ్బిళ్ళో
దుండగంపు  దైత్యుల  కెల్లను  తల 
గుండు  గండనికి  గొబ్బిళ్ళో                ll కొలని  దోపరికి ll

పాప  విధుల  శిశుపాలుని తిత్తుల 
కోపగానికిని  గొబ్బిళ్ళో 
యేపున  కంసుని  యిడుమల  బెట్టిన 
గోప  బాలునికి  గొబ్బిళ్ళో                     ll కొలని  దోపరికి ll

దండివైరులను  తరిమిన  దనుజుల 
గుండె  దిగులునకు  గొబ్బిళ్ళో 
వెండి  పైడి  యగు  వేంకట గిరిపై 
కొండలయ్యకును  గొబ్బిళ్ళో                     ll కొలని  దోపరికి ll
పాట -౨ :

గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ 
సంక్రాంతి  పండగొచ్చె గొబ్బియళ్ళొ
అహ  సంక్రాంతి   పండగొచ్చె  గొబ్బియళ్ళొ

సీతా దేవి  వాకిట  వేసిన గొబ్బియళ్ళొ
మన  సీతా  దేవి  వాకిట  వేసిన  గొబ్బియళ్ళొ    llగొబ్బియళ్ళొll


మాణిక్యాల  ముగ్గులు  వేసి గొబ్బియళ్ళొ 
  ముగ్గుల  మీద  మల్లె  పూలు  గొబ్బియళ్ళొ 
నవరత్నాల  ముగ్గులు  వేసి  గొబ్బియళ్ళొ 
  ముగ్గుల  మీద  మొగలి  పూలు  గొబ్బియళ్ళొ  llగొబ్బియళ్ళొll


రంగు  రంగుల  ముగ్గులు  వేసి  గొబ్బియళ్ళొ
  ముగ్గుల  మీద  మందారాలు  గొబ్బియళ్ళొ
ధాన్యపు  రాసుల  ముగ్గులు  వేసి గొబ్బియళ్ళొ
  ముగ్గుల  మీద  సంపెంగలు  గొబ్బియళ్ళొ         llగొబ్బియళ్ళొll


భూదేవంత  ముగ్గులు  వేసి  గొబ్బియళ్ళొ 
  ముగ్గుల  మీద  నక్షత్రాలు  గొబ్బియళ్ళొ 
లక్ష్మి  రధముల  ముగ్గులు  వేసి  గొబ్బియళ్ళొ 
  ముగ్గుల  మీద  గుమ్మడి  పూలు  గొబ్బియళ్ళొ   llగొబ్బియళ్ళొll

ముంగిట  ముగ్గులు  వేసి  గొబ్బియళ్ళొ
  ముగ్గులోన  పొంగళ్ళు  గొబ్బియళ్ళొ 
భోగి  పళ్ళ  సందళ్ళు  గొబ్బియళ్ళొ
మరదళ్ల  సరదాలు  గొబ్బియళ్ళొ            llగొబ్బియళ్ళొll 

పాట - ౩ :

గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
దుక్కు దుక్కు దున్నారంట - ఏమి దుక్కు దున్నారంట
రాజా వారి తోటలో జామ దుక్కు దున్నారంట
అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

విత్తు విత్తు వేశారంట - ఏమి విత్తు వేశారంట
రాజా వారి తోటలోన జామ విత్తు వేశారంట

అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

మొక్క మొక్క మొలిచిందంట - ఏమి మొక్క మొలిచిందంట
రాజా వారి తోటలోన జామ మొక్క మొలిచిందంట
అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

పువ్వు పువ్వు పూసిందంట - ఏమి పువ్వు పూసిందంట
రాజా వారి తోటలోన జామ పువ్వు పూసిందంట  
అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ 

పిందె పిందె వేసిందంట - ఏమి పిందె వేసిందంట
రాజా వారి తోటలోన జామ పిందె వేసిందంట
అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

కాయ కాయ కాసిందంట - ఏమి కాయ కాసిందంట
రాజా వారి తోటలోన జామ కాయ కాసిందంట  
అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

పండు పండు పండిందంట - ఏమి పండు పండిందంట
రాజా వారి తోటలోన జామ పండు పండిందంట 
అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

పాట - ౪ :

ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను
ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను 
ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను

ఉట్టి మీద పాలు పెరుగు ఎట్టా దించెను?  
ఉట్టి మీద పాలు పెరుగు ఎట్టా దించెను?
వాణ్ని కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు   ll ఏల ll

చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు  
చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు
పొన్న మాను పైన పెట్టి పంతమాడెనే           
ll ఏల ll   


పాట - ౫ :

అటవీ స్థలములు కడుగుదమా
చెలి వట పత్రమ్ములు కోయుదమా  ll 2 ll

చింత గింజ లాడుదమా 
చిరు చిరు నవ్వులు నవ్వుదమా  ll
అటవీ ll

వీసెడు గంధం పూయుదమా
వీధిలో ముగ్గులు వేయుదమా   
ll అటవీ ll

పూలను మాలగా కట్టుదమా
స్వామికి మేడలో వేయుదమా   
ll అటవీ ll

పాట - ౬ :

ఒక్కేసి పూవు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

రెండేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

మూడేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

నాలుగేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

ఐదేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

ఆరేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

ఏడేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

ఎనిమిదేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

తొమ్మిదేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

పదేసి పూలు నా సిగలో
చిటికెడు గంధం నా మెడలో

చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార
చాల్చాలక్కల్లార సంపెంగ మొగ్గల్లార భామలసిరి గొబ్బిళ్ళో
గొబ్బి
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

ఇలా పూలు, గంధం, ఓపిక, ఆకలి అయ్యే దాక పూలను పెంచుకుంటూ వెళ్ళచ్చు.
ఈ తతంగమంతా ఈ రోజుల్లో ఎందుకనో కనుమరుగవుతోందనిపిస్తోంది. ఈ కాలంలో గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళు తక్కువే,పాటలు తెలిసిన వాళ్ళు కూడా తక్కువే. పైగా పేడని పట్టుకోవడానికి అసహ్యించుకునే జనాలు ఎక్కువయ్యారు. ఆవుపేడ క్రిమిసంహారిణి పైగా ప్రకృతికి ఎంతో మేలు చేస్తుంది కనుకనే ఇంటి ముందు దానితో కళ్లాపి చల్లుతారు. ఈ గొబ్బిళ్ళ  సాంప్రదాయం కేవలం హిందువులకే పరిమితం కాదండోయ్ మేము గొబ్బిళ్ళు పెట్టుకునే రోజుల్లో మత భేదాలు లేకుండా అందరూ వచ్చేవారు అందరం కలిసి చేసుకునే వాళ్ళం. కనుక మనకున్న సంస్కృతిని కాపాడుకుందాం. 
గొబ్బిళ్ళు పెట్టుకోవడం తరువాత వాటిల్ని ఏమి చేయాలి అనా అడుగుతున్నారు? ఏముంటుంది? వాటితో పిడకలని కొట్టి, బాగా ఎండిన పిడకలని తీసుకెళ్ళి భోగి మంటల్లో వేయవచ్చు లేదా అలా దాచి రథ సప్తమికి సుర్యభగవానునికి పొంగలిని చేయడానికి ఈ గొబ్బి పిడకలని వాడచ్చు. అదండీ సంగతి! ఇక మీరు కుడా ఈ సారి సంక్రాతికి గొబ్బిళ్ళు పెడతారు కదూ! నన్ను పిలవడం మర్చిపోకండే!    

పాటలు కావాలంటే తీసుకోవడానికి వీలుగా ఇక్కడ జతచేశాను. 


గొబ్బి పాటలు 

Sunday, June 26, 2011

నిరీక్షణవిరిసే విరజాజినడిగా నీ జాడ తెలుపమని
మెరిసే మెరుపునడిగా నీ రూపం చూపించమని
సాగర తీరాన్ని అడిగా నీ దరికి నన్ను చేర్చమని
నీ కోసం ఎక్కడెక్కడో వెతికాను ఎవరెవరినో అడిగాను
కానీ నీవు నాతోనే, నాలోనే ఉన్నావని ఇప్పుడే తెలుసుకున్నాను.
నాకు మరు జన్మ ఉందో లేదో తెలియదు కనుక నీ కోసం ఎన్ని జన్మలయినా నిరీక్షిస్తానని చెప్పలేను
ఉన్న ఈ జీవితంలో ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు కనుక నీ కోసం నూరేళ్ళు ఎదురుచూస్తానని  చెప్పను
బ్రతికి ఉన్న ఈ క్షణం శాశ్వతం కనుక ఉన్న ఈ క్షణాన్ని నీతో ఆనందంగా పంచుకోవాలని నీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను.


Friday, June 24, 2011

గోరింటాకు


గోరింట  పూచింది  కొమ్మ  లేకుండా
మురిపాల  అరచేత  మొగ్గ  తొడిగింది
ఎంచక్కా  పండేనా  ఎర్రన్ని  చుక్క 
చిట్టి  పేరంటాలికి  శ్రీ  రామ  రక్ష
కన్నె  పేరంటాలికి  కలకాలం  రక్ష ll గోరింట ll

మామిడి  చిగురెరుపు
మంకెన  పువ్వెరుపు
మణులన్నింటిలోన మాణిక్యం  ఎరుపు
సందె  వన్నెల్లోన సాగే  మబ్బెరుపు
తానెరుపు  అమ్మాయి  తనవారిలోన  ll గోరింట ll

మందారంలా  పూస్తే  మంచి  మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే  కలవాడొస్తాడు
సింధూరంలా  పూస్తే  చిట్టి  చేయంతా
అందాల  చందమామ  అతనే  దిగి  వస్తాడు ll గోరింట ll

పడకూడదమ్మా  పాపాయి  మీద 
పాపిష్టి  కళ్ళు  కోపిష్టి  కళ్ళు
పాపిష్టి  కళ్ళల్లో  పచ్చ  కామెర్లు
కోపిష్టి  కళ్ళల్లో  కొరివి  మంటల్లు ll గోరింట ll

గోరింటాకు సినిమాలో ఈ పాట వింటూ ఉంటే నా మనసెందుకో అలా మా ఇంటికి పరుగులు తీస్తోంది. ఈ క్షణాన్న ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా వెళ్లి మా అమ్మతో గోరింటాకు పెట్టించుకోవాలనిపిస్తోంది. ఈ పాటతో గోరింటాకుకి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేశారు దేవులపల్లి గారు. అసలు గోరింటాకు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు అనడం అతిశయోక్తి కాదేమో! ఎందుకంటే ఆడవాళ్ళకి అదంటే ఎంత మక్కువో అది పెట్టుకునే ఆడవాళ్లంటే మగవాళ్ళకి కూడా అంతే మక్కువ మరి! ఎర్రగా పండిన గోరింటాకు వలన వచ్చే మంచి సువాసనలతో అమ్మాయి చేయి మీద పడితే ఏ అబ్బాయి ఆస్వాదించకుండా ఉంటాడు చెప్పండి?

వెంటనే అసలు గోరింటాకు అనేది ఎప్పటినుండి పెట్టుకుంటున్నారు అనే సందేహం వచ్చింది నాకు. దానిని నివృత్తి చేసుకోవడం కోసం గూగుల్ లో వెతికితే కాంస్య కాలం (bronze age ) నుండి వాడుతున్నారని ఉంది. మన పురాణాలను పరిశీలిస్తే వాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకున్నారు కనుక వాళ్లకి కూడా ప్రీతి పాత్రమయినదే అని తెలుస్తుంది.

ఏదేమయితేనేమి? నాకు మాత్రం గోరింటాకు అనేది మనకున్న అపురూపమయిన సంపదలలో ఒకటి. ఆడపిల్లకి పుట్టింటి వారు సారె పెట్టి పంపించేటప్పుడు ఇది కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రతీ ఆడపిల్లకి ఎన్నో మధురమయిన  జ్ఞాపకాలు గోరింటాకు చుట్టూ అల్లుకుని ఉంటాయి. చంటి పిల్లలకి గోరింటాకు ముద్ద పెట్టేసి చిన్న చిన్న సంచులు తెచ్చి వాటిల్లో వీళ్ళ బుల్లి చేతులని దూర్చి అలా కట్టేసి ఉంచుతారు. పండిన ఎర్రని చేతులని పిల్లలు చూసుకుని బోసి నవ్వులు నవ్వుకుంటూ ఎన్ని కేరింతలు కొడతారో! అబ్భా!  ఆ దృశ్యం చూసి తీరవలసిందే! ఇంక కన్నె పిల్లల మాటకి వస్తే అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది, ఆషాఢ మాసం ఇలా ఏదో ఒక వంక వెతుక్కుని మరీ పెట్టుకుంటారు గోరింటాకు. పైగా ఎవరి చేయి బాగా పండింది అని పోటీలు పెట్టుకుని, ఎలాంటి మొగుడు వస్తాడా అని విశ్లేషించుకుని, అతనిని  ఊహించుకుని మురిసిపోతూ తెగ ముసి ముసి నవ్వులు నవ్వేస్తారు. ఆడవాళ్ళకి ఆభరణాలు అంటే మక్కువ ఎక్కువే కాని ఎదురుగా గోరింటాకు ఉంటే అసలు చేతికున్న వజ్రాల ఉంగరాలు కూడా తీసేసి పక్కన పెట్టేస్తారు కాబట్టి ఆడవాళ్ళకి గోరింటాకు అంటే అంత మక్కువ. గోరింటాకు పండిన వెంటనే ఎర్ర రంగుని ఎంతగా ఇష్టపడతారో అలానే కాలం గడిచిన కొద్దీ పసుపు  రంగులోకి మారడం కూడా ఒక అందమే అంటాను నేను. నాకు మాత్రం గోరింటాకు లేత పసుపు రంగులోకి వచ్చేస్తే ఎంత ఇష్టమో ఎందుకంటే మళ్లీ కొత్తగా పెట్టేసుకోవచ్చు కదా!

ఇహపోతే గోరింటాకు పెట్టుకోవడం వలన ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి. అవేమిటంటే, ఈ ఒక్క రోజు మాత్రం మనం మకుటం లేని మహారాణులం (మకుటం లేని మహారాజు అంటారు కదా అలానే ఇది కూడా) అయిపోవచ్చు. పెళ్ళి కాక ముందు అమ్మ చేతితో, పెళ్ళయ్యాక శ్రీ వారి చేతితో గోరు ముద్దలు తినే అదృష్టం వరిస్తుంది.ఇదే కాక మన శరీరంలో ఉన్న ఉష్ణాన్ని నియంత్రిస్తుంది, పిప్పి గోళ్ళు రాకుండా చేస్తుంది, సుక్ష్మ జీవ వినాసిని ఇలా ఎన్నో ఉపయోగాలున్నాయి. అందుకనే ఆధునికతకి తగ్గట్టుగా రసాయనాలతో తయారుచేసిన గోరింటాకు (cone mehendi ) వచ్చినా నాకు మాత్రం ఆకు రుబ్బి పెట్టుకున్నదే చాలా ఇష్టం. ఇంత చదివాక మీకు కూడా వెళ్లి వెంటనే గోరింటాకు పెట్టుకోవాలని ఉందా? అయితే అదే చేత్తో నాకు కుడా గుప్పెడు ఆకు పంపించరూ!
 

Monday, June 20, 2011

love


I am happy to know someone as you
Likes to spend whole time with you
Ought to be so close to you
Very painful to be away from you
Eagerly waits for the arrival of you
U are the most important person
4 me everyone is nothing and you mean
Everything of course you know it
Very well and let`s make our love
Everlasting and I wish to spend
Rest of my life with none other than you
Wednesday, June 15, 2011

అతి సర్వత్రా వర్జయేత్


నమస్కారమండీ అంటూ దారిన పోయే ఒకాయన నన్ను పలకరించారు. బహుశా తెలిసున్న వాళ్లేనేమో నేను మర్చిపోయాను కాబోసు అనుకుంటూ నేను కూడా ప్రతి నమస్కారం చేసాను. కుశల ప్రశ్నలు అయ్యిన  తరువాత వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూనే బలవంతం చేయడంతో ఆయన వెంట వెళ్ళక తప్పలేదు. దారి పొడుగునా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు నేను మాత్రం ఈయనని ఎక్కడ చూసానా అన్న ఆలోచనతోనే అయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాను. ఇంత సంభాషణ జరిగి వాళ్ళింటికి వచ్చినా కూడా నాకు ఆయనెవరో గుర్తు రానే లేదు సుమీ! ఇహ వాళ్ళ కుటుంబ సభ్యులని చూస్తే అన్నా గుర్తుకు వస్తుందనుకుంటే అది కూడా కుదరలేదు ఎందుకంటే ఒంటరిగా ఉంటున్నాడు. అతిధి మర్యాదలన్నీ చేసి బట్టలు మార్చుకుని వచ్చి కూర్చున్నాడు. నేనేమీ అడగకుండానే మొదలుపెట్టాడు ఆయన పుట్టుపూర్వోత్తరాల దగ్గర నుంచీ ఆయన గడ్డం గీసుకునేందుకు వాడే అలుగు వరకు అన్నిటిని చెప్పుకొచ్చేసాడు. అసలు ఎదుటివాడికి వినే ఆసక్తి, తగిన సమయం ఉన్నాయో లేదో కూడా తెలుసుకోకుండా ఇలాంటి అధికప్రసంగాలు, అనవసర ప్రసంగాలు చేసేవాళ్ళంటే నాకస్సలు నచ్చదు కానీ ఏమి చేస్తాం పోనిలే పెద్ద వాడు కదా అని ఓపిక పట్టి మొత్తం వింటున్నాను. 

ఇంతకీ  ఆయన బాధని వెలిబుచ్చుకోవడానికి  ఎవరూ దొరకక దొరికిన నన్ను వదలలేక ఎంతో దప్పిక ఉన్న వాడికి ఒక మాంచి నిమ్మ సోడా ఇస్తే ఎలా ఉంటుందో అలానే అయనకి నేను దొరికాను. ఇంక మొదలుపెట్టాడు అసలు విషయమేమిటంటే అయనకి ఒక రకమయిన వింత జబ్బు ఉంది అదేమిటంటే ఏదయినా విషయం తెలిస్తే బట్టబయలు చేసే దాక ప్రశాంతత లేకపోవడం. ఇటువంటి వాళ్ళని మనం చాలా మందినే చూస్తూ ఉంటాం కాని ఇలాంటి వాళ్లకి కొన్ని విషయాలను చెప్పడం వలన మనం అనవసరంగా తీవ్రమయిన పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుంది.

మొన్నామధ్యన ఈయనకి రమణ గారని ఒకాయన పరిచయం అయ్యాడుట.  అసలు మీకొక విషయం తెలుసా? ఎప్పుడూ ముసలి వాళ్ళు, ఏమీ తోచని వాళ్ళు, పదవిని చాలించేసిన వాళ్ళు, ఏ రకమయిన వ్యాపకాలూ లేనివాళ్ళు  ఎక్కువగా జనసంచారం ఉన్న చోటికి వెళతారు ఎందుకో తెలుసా? అటువంటి చోట్ల మాత్రమే వాళ్ళు చెప్పే సోదిని ఒకడు వినకపోయినా ఇంకొకళ్ళు అన్నా  వింటారు అన్న ఆశతో. రమణ గారిది కూడా అదే పరిస్థితి. వయసు మీద పడటం వలన, పదవిని చాలించి ఇంట్లో ఉండటం వలన, ఆయన మాట పెడ చెవిన పెట్టేవాళ్ళు ఇంట్లో ఎక్కువ ఉండటం వలన ఇదిగో ఇలా ఈ సదరు పెద్దమనిషికి బానిసయిపోయారు. ఇద్దరికీ పొత్తు బాగానే కుదిరింది. కొత్త పిచ్చోడు పొద్దు ఎరగడని ఊరికనే అన్నారా? ఇంక ఆ ఇద్దరూ పిచ్చా పాటి చాలా మాట్లాడేసుకున్నారుట. రమణ గారికి చెప్పడానికి ఇంక మాటలు ఏమీ లేని సమయంలో ఆయన తన ఇంటికి ఉన్న రహస్య మార్గాల గురించి, బీరువాలో దాచుకున్న డబ్బుల గురించీ, నగల గురించి, వాటి తాళాలు ఎక్కడెక్కడ ఉంటాయి, వాళ్ళ బ్యాంకు ఎకౌంటు, దాని వివరాలు, ATM  passwords  అన్ని చెప్పేశారు. పైగా వాళ్ళు ఏ రోజు ఊరు వెళ్తున్నది, ఏ రైలు లో ప్రయాణం చేస్తున్నది, మళ్ళీ తిరుగు ప్రయాణం ఎప్పుడు, మొదలయినవన్నీ చెప్పేశారు. ఇంక ఈ సదరు పెద్దమనిషికి నోరు తిన్నంగా ఉండక కనిపించిన ప్రతీ మనిషికి టంకు వేసేసాడు. అలా ఆ ఊరి గజ దొంగల చెవిన పడింది విషయం. అసలే చోర విద్యలో ప్రావీణ్యత ఉన్న వాళ్ళేమో ప్రతీ విషయం ఇంత బాగా తెలిసిపోయిన తరువాత వాళ్ళు మాత్రం ఎందుకని ఊరుకుంటారు చెప్పండి? అంతే రెచ్చిపోయి వాళ్ళ ప్రతాపాన్ని మొత్తం చూపించి ఆ ఇంటిని అప్పుడే  గుమ్మడికాయ కొట్టి ప్రవేశం చేసిన ఇంటిలా ఖాళీగా ఉంచి వదిలిపెట్టారు. కనుక దొరికారు కదా అని పిచ్చాపాటి ఎవరితో పడితే వాళ్ళతో హద్దు మీరి మాట్లాడితే ఇలానే ఉంటుంది అని రమణ గారి అనుభవం మనకి తెలియచేస్తుంది. ఇంత జరిగినా ఈ పెద్దమనిషి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు హాయిగా ఉన్నాడు.నిజమే మరి! ఇందులో ఆయన తప్పేముంది? అలాంటి వాళ్ళకి చెప్పడం మన తప్పు కానీ.

ఇంతకీ మీకు ఆ సదరు పెద్దమనిషి ఎవరో చెప్పలేదు కదూ! అదేనండి ఈ మధ్యకాలంలో దూరంగా ఉన్న మనుషులని ఎంతో దగ్గర చేసి దగ్గరగా ఉన్న మనుషులకి మధ్యన ఒక సూక్ష్మమయిన అడ్డుగోడని కట్టే FACEBOOK. అంతే కదా మరి చిన్నపిల్లవాడి దగ్గరనించి ముదుసలి వాళ్ళ దాకా అందరూ దీనికి దాసోహం అంటున్నారు. పిల్లలకి ఏది మంచో ఏది చెడో తెలియని వయసులో, వాళ్ళకి సామాజిక జీవితం అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? ఎటువంటి వ్యక్తులున్నారు ఈ కాలంలో అన్న అవగాహన కూడా లేని వాళ్ళందరూ ఈ facebook  బానిసలే. ఇంక యువతరం మాటకొస్తే, మత్తు పదార్ధాలకి బానిసయినవాడికి ఆ మందు ఇవ్వకపోతే ఎలా నరాలు పీకుతాయో అంత కన్నా ఘోరంగా, దారుణంగా తయారవుతోంది వీళ్ళ పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాలలో అయితే ఈ విష పదార్ధపు దాహం విద్యార్ధుల నర నరాలలో ప్రసరిస్తోంది. తరగతి గదులలో మాష్టారు పాఠాలు చెప్తుంటే శ్రద్ధగా వినవలసిన విద్యార్ధులు వినకుండా ఆయన ముందే కూర్చుని  facebook లో ఉప్పర సోది. గురువు మీద గౌరవం, చదువు మీద శ్రద్ధ ఏమయ్యాయి?  ఎప్పటికప్పుడు నేను తుమ్మాను, నేను దగ్గాను అనుకుంటూ స్టేటస్ updates ఇస్తున్నారు. ఆఖరికి సినిమా చూస్తూ కూడా దానిని సరిగ్గా చూసి ఆనందించి ఛావక మధ్యలో నేను సినిమా చూస్తున్నాను అని facebook  updates పెట్టడం లాంటి వికృతమయిన చేష్టలను ఎంతవరకు సమర్ధించుకుంటారో సదరు వ్యక్తులు. దాని కోరలు మన మీద పడి మనం కూడా అదే పరిస్థితికి దిగజారుతున్నామేమో అనిపిస్తోంది. ఇంక ముదుసలి వాళ్లకి ఊసుపోక ఇదేదో బాగుంది కొత్త వాళ్ళతో బోలెడన్ని కబుర్లు చెప్పచ్చు ఎలాగో మన ఇంట్లో మన మాట వినేవాడు లేడు అని అన్నీ తెలిసి వాళ్ళు కూడా తెలివయిన మూర్ఖులుగా, విచక్షణా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. అతి సర్వత్రా వర్జయేత్ అని అన్నట్టు ఏదయినా మితంగా బాగుంటుంది కాని అతికి వెళ్ళి అనవసరపు విషయాలను చర్చించడం లేదా updates  పెట్టడం వలన రమణ గారిలానే దారుణమయిన పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇకనయినా మేల్కొందాం. ఈ బానిసత్వాన్ని తరిమి కొట్టి  మితంగా వాడుకుని ఆనందిద్దాం.


Tuesday, June 14, 2011

కాలం


గడచిపోయిన కాలమంతా మంచిదేనని ఎంచకు 
ముందు రోజులు చెడ్డవనుకుని హృదయ కుసుమం తెంచకు.

Monday, June 06, 2011

వన్నె చిన్నెల కాశ్మీరం

ఎంత రమణీయత! దృశ్య కావ్యమంటే ఇదేనేమో!! హత్తెరి! ఏమిటే  చిలకమ్మా ఆ కిలకిలలు? హొయ్ హొయ్ ఎందుకే ఆ కేరింతలు? కాశ్మీరు చిలకమ్మవనా? చాలింక ఆపు నీ లడాయి. నీకన్నా అందమయినదేలే ఈ కాశ్మీరం. నీవు కూడా అందులో ఒకదానివేలే అది మరువకు. ఈ కాశ్మీరు అందాలని వర్ణించడం అంటే ఆ ప్రవరుడి పాండిత్యాన్ని శంకించడమేగా!
సౌర శక్తి విద్యుత్ దీపాలు కలిగిన మొట్టమొదటి గ్రామం లడక్ మన కాశ్మీరం లోనిదే! ఇది తెలుసా? తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా? నిక్కమయిన మంచి నీలమొక్కటి చాలు అన్నారు మన వేమన గారు. అటువంటి నీలాలు దొరుకు నేల మన ఈ కాశ్మీరం. అంతకుమించి తరగని నల్ల బంగారం అవేనే బొగ్గు గనులు, కరగని వెండి సింగారం అబ్బ అవేనే మంచు కొండలు ఇవి కూడా అందమయిన మన కాశ్మీరం లోనివే. అమర్నాథ్, కిస్టఫర్, వైష్ణవి మాత మొదలయిన పుణ్యక్షేత్రాలు; అనంతనాగ్, కార్గిల్, పహల్గాం, శ్రీనగర్ వంటి విహార స్థలాల మేలు కలయికలే మన ఈ కాశ్మీరం. స్విట్జెర్లాండ్ అఫ్ ఇండియా అని పేరున్న మన కాశ్మీరానికి ఇవన్నీ కీర్తిపతాకాలేలే!
ఓ చిలకమ్మా? నిన్నేనే వింటున్నావా? నా మనసంత లోతయిన కాశ్మీర్ లోయలు, నా సొగసంత ఎత్తయిన గాడ్విన్- ఆస్టిన్ శిఖరాలు, నా ఒంపు సొంపులకి ధీటుగా పొడవయిన పూలార్ సరస్సు ఉన్నాయిగా! అయినా ఎన్ని అందాలు ఉంటే ఎమిలే? ఎన్ని అందాలు ఉన్నవో అన్ని అరాచకాలూ జరుగుతున్నాయి. ఉన్మత్త  ఛాందస వాదుల ఆగడాలకు వేదికై అల్లాడుతున్నది నా కాశ్మీరం.
అసలు కుంకుమ పువ్వుకి ఆ ఎఱ్ఱదనం ఎలా వచ్చిందంటే ఎందఱో అమరవీరుల నెత్తుటితో తడిసిన నేల పంటే కుంకుమ పువ్వు. చెంతనే ఉన్న భూలోక కైలాసమయిన హిమశైల వాసుని త్రినేత్ర జ్వాలలే ముష్కర మూకలను మసి చేస్తున్నాయా? ఢమ  ఢమ ఢమరు ధ్వనులే ఫెళ ఫెళ వినిస్ఫోట ప్రకంపనాలుగా నిత్యం రణరంగంగా ఆరని రావణ కాష్టమై రగులుతోంది నా కాశ్మీరం. పరమశివుడు శాంతించి భోళా శంకరుడై కాశ్మీరుకి పూర్వ వైభవాన్ని ప్రసాదించాలని ప్రార్ధించుదామా? ఎల్లలెరుగని వసుధైక  కుటుంబంగా ఏనాడు మారునో కదా? ఆనాడే ఆమని రాకుండానే ఈ అవని పులకించును కదా? అంత వరకు ముష్కరుల కబంధ హస్తాలలో చిక్కుకున్న ఈ కాశ్మీరం బంగారు పంజరంలో చిలుకే. నీకులా కాదులే!!!!!!!