కళ్ళలా మిల మిలా మెరిసే కాకరపువ్వొత్తులు
ఆలోచనలలా చక చకా తిరిగే విష్ణు, భూ చక్రాలు
ఆవేశంలా ఉవ్వెత్తున ఎగసే చిచ్చుబుడ్డులు
మనసులా కరిగిపోయే వెన్నముద్దలు
కోపంలా బుస బుసలాడే పాము బిళ్ళలు
కొసరి కొసరి వడ్డించినట్టు కాలే మతాబులు
జడలా అందంగా ఉండే పొడవయిన తాళ్ళు
చిన్న పిల్లల్లా అల్లరి చేసే సిసింద్రీలు
ఛలోక్తుల్లా పేలే టపాసులు
ఆశల్లా అంబరాన్నంటే తారాజువ్వలతో
ఈ దీపావళి అందరి జీవితాలలోను క్రొత్త
క్రాంతులని నింపాలని ఆశిస్తూ...........
అందరికీ దీపావళి శుభాకాంక్షలు!!!
ఆలోచనలలా చక చకా తిరిగే విష్ణు, భూ చక్రాలు
ఆవేశంలా ఉవ్వెత్తున ఎగసే చిచ్చుబుడ్డులు
మనసులా కరిగిపోయే వెన్నముద్దలు
కోపంలా బుస బుసలాడే పాము బిళ్ళలు
కొసరి కొసరి వడ్డించినట్టు కాలే మతాబులు
జడలా అందంగా ఉండే పొడవయిన తాళ్ళు
చిన్న పిల్లల్లా అల్లరి చేసే సిసింద్రీలు
ఛలోక్తుల్లా పేలే టపాసులు
ఆశల్లా అంబరాన్నంటే తారాజువ్వలతో
ఈ దీపావళి అందరి జీవితాలలోను క్రొత్త
క్రాంతులని నింపాలని ఆశిస్తూ...........
అందరికీ దీపావళి శుభాకాంక్షలు!!!
కుల, మత, ప్రాంతీయ, వయసు భేదాలు లేకుండా అందరూ జరుపుకుని ఆనందించే పండగ దీపావళి. ఈ దీపావళిని మొత్తం అయిదు రోజులు జరుపుకుంటూ ఉంటారు.
మొదటి రోజు - ధన త్రయోదశి - దీనినే ధన తెరస్ అని కూడా అంటూ ఉంటారు. క్షీర సాగర మధనం జరిగినప్పుడు అందులోనుంచి ధన్వంతరి చేతిలో అమృత కలశంతో ఈ రోజునే ఉద్భవించారు. ఈ రోజున ఆవు నేతితో దీపం వెలిగించి శ్రీ సూక్తం చదువుకుంటే కుబేరుడు మన ఇంట్లో కొలువుంటాడుట. అందువలననే ఈ రోజున ఎక్కువగా బంగారం కొంటూ ఉంటారు.
రెండవ రోజు - నరక చతుర్దశి - కృతయుగంలో హిరణ్యాక్షుని సంహరించిన వరాహస్వామికీ, భూదేవికీ అసుర సంధ్యా సమయములో నరకుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. ఈ నరకుడు ప్రాద్యోషపురానికి రాజు. అతను బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు మితిమీరడంతో సత్యభామ అతనిని వధిస్తుంది. అలా ఈ రోజున ఆయన మరణించిన రోజు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలపైన నువ్వుల నూనె పెట్టుకుని, చక్కగా బాణసంచా కాల్చి (అసలు ప్రొద్దున్నే లేవడం బద్ధకమయినా పోటా పోటీగా కాల్చే బాణసంచా కోసం అన్నా లేచేదానిని) అప్పుడు తల మీద ఉత్తరేణి ఆకులు పెట్టుకుని తలంటు పోసుకుంటారు. క్రొత్త అల్లుళ్ళ చేత మినుము కొరికించడం ఆనవాయితీ. ఈ రోజున చాలా మంది మినప ఆకులతో కూర వండుకుంటారు. అనేష సేముషీ మూష మాష మానస్య మానతే అన్నారు కదా!
మొదటి రోజు - ధన త్రయోదశి - దీనినే ధన తెరస్ అని కూడా అంటూ ఉంటారు. క్షీర సాగర మధనం జరిగినప్పుడు అందులోనుంచి ధన్వంతరి చేతిలో అమృత కలశంతో ఈ రోజునే ఉద్భవించారు. ఈ రోజున ఆవు నేతితో దీపం వెలిగించి శ్రీ సూక్తం చదువుకుంటే కుబేరుడు మన ఇంట్లో కొలువుంటాడుట. అందువలననే ఈ రోజున ఎక్కువగా బంగారం కొంటూ ఉంటారు.
రెండవ రోజు - నరక చతుర్దశి - కృతయుగంలో హిరణ్యాక్షుని సంహరించిన వరాహస్వామికీ, భూదేవికీ అసుర సంధ్యా సమయములో నరకుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. ఈ నరకుడు ప్రాద్యోషపురానికి రాజు. అతను బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు మితిమీరడంతో సత్యభామ అతనిని వధిస్తుంది. అలా ఈ రోజున ఆయన మరణించిన రోజు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలపైన నువ్వుల నూనె పెట్టుకుని, చక్కగా బాణసంచా కాల్చి (అసలు ప్రొద్దున్నే లేవడం బద్ధకమయినా పోటా పోటీగా కాల్చే బాణసంచా కోసం అన్నా లేచేదానిని) అప్పుడు తల మీద ఉత్తరేణి ఆకులు పెట్టుకుని తలంటు పోసుకుంటారు. క్రొత్త అల్లుళ్ళ చేత మినుము కొరికించడం ఆనవాయితీ. ఈ రోజున చాలా మంది మినప ఆకులతో కూర వండుకుంటారు. అనేష సేముషీ మూష మాష మానస్య మానతే అన్నారు కదా!
మూడవ రోజు - దీపావళి అమావాస్య - ఇది ముఖ్యమయిన పండుగ. ఈ రోజు ఈ పండుగ చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేమిటంటే:
- రావణాసురునితో యుద్ధం జరిపి విజయరాముడు సతీ సమేతంగా అయోధ్యకు విచ్చేసిన రోజు అమావాస్య కావడం వలన చీకటి నిండి ఉండగా అయోధ్య ప్రజలు సీతారాములకి స్వాగతం పలుకుతూ దీపాలని వెలిగించారని ఆ రోజు నించి ప్రతీ సంవత్సరం ఆ రోజున దీపావళి జరుపుకుంటున్నారని చెప్తారు.
- నరకాసురుడు మరణించాడు కదా! ఆనందములో ఈ రోజున దీపావళి జరుపుకుంటారు.
- ఇది ముఖ్యమయినది. క్షీర సాగర మధనములో లక్ష్మీ దేవి ఈ రోజునే ఉద్భవించింది. అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి అందుకనే ఈ రోజు సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. దీని వెనుక ఒక కథ ఉంది. అదేమిటంటే: పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి మిక్కిలి సంతోషించి, ఒక మహిమాన్వితమైన పూల హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో త్రొక్కడం జరుగుతుంది. అది చూసిన దుర్వాసుడు కోపంతో దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. అలా ఇంద్రుని భక్తికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహం వలన తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
- మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని ఈ రోజునే తిరిగి వస్తారు. దానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు.
- గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని మన రైతన్నలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు కృతజ్ఞతగా దీపాలు వెలిగించి ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేస్తారు.
- విక్రమార్కునికి పట్టాభిషేకం కూడా ఈ రోజే జరిగింది.
తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!!
ముఖ్యముగా ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీ దేవి; నదులు, బావులు, చెఱువులు మొదలయిన నీటి వనరులలో గంగా దేవి ఉంటారుట. కనుక ఈ రోజున సూర్యుడు ఉదయించే సమయములో (ప్రత్యూష లేదా అరుణోదయ కాలం) మఱ్ఱి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల పట్టలను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి. పిదప నువ్వుల నూనెతో దీపములు పెట్టాలి. ప్రధాన ఇంటి ద్వారం, ధాన్యపు కొట్టు, బావి, వంట ఇల్లు, రావి చెట్టు ఈ అయిదు ప్రదేశాలలో తప్పకుండా దీపాలను వెలిగించాలి. ఇలా చేయుడం వలన దారిద్ర్యం తొలగి, గంగానదీ స్నాన ఫలం వలన నరక భయం ఉండదని పురాణాలు చెపుతున్నాయి. స్త్రీలు అభ్యంగన స్నానానంతరం క్రొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి, గుమ్మాలను పసుపు, కుంకుమ మామిడాకుల తోరణాలతో అలంకరించి సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన రుచికరమైన భక్ష్యభోజ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్ధం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఈ రోజు బట్టతో చేసిన వత్తులను వేస్తారు కనుక వాటిని సిద్ధం చేసే పనులలో మునిగి తేలుతారు. అలానే అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టిచెంది ఆశీర్వదిస్తారని మన శాస్త్రం చెపుతోంది.
దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...
మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ సంధ్యాసమయమున చిన్న పిల్లలంతా గోగుకాడకి మూడు చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడం మన సాంప్రదాయాలలో ఒకటి. ఈ రోజున యముడు దక్షిణ దిశగా ఉంటాడు కనుక పిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఇలా దివిటీలు కొట్టడం అనేది మన పితృదేవతలకు దారి చూపుతుందని ఒక భావన. ఈ తతంగమంతా అయిన తరువాత కాళ్ళు, చేతులు, కళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తినడం మన ఆచారం. ఇదంతా అయిన తరువాత పాతవి, నూలువి బట్టలు వేసుకుని మనమెంతో ఆశగా ఎదురుచూసే బాణసంచాని కాల్చుకోవచ్చు. ఈ బాణ సంచా కాల్చగా వచ్చే పొగలో ఎన్నో పురుగుల్ని, సుక్ష్మ జీవులని చంపే గుణం ఉంది. పైగా మన పాపాలన్నీ ఈ మంటలలో దహించుకుని పోతాయి అని ఒక నమ్మకం. రాత్రికి స్త్రీలు చేటలు, తప్పెటలు వాయిస్తూ సంబరంగా జేష్ఠాదేవిని (అలక్ష్మి, పెద్దమ్మారు, దారిద్ర్యాదేవిని) ఇండ్లనుండి తరిమి కొడతారు.
నాలుగవ రోజు - బలి పాడ్యమి - అదితి గర్భాన వామన రూపములో జన్మించిన శ్రీమహావిష్ణువు మహాదాత, విశేషమయిన బలపరాక్రమాలు కల బలిచక్రవర్తిని మూడడుగుల స్థలాన్ని అడుగుతాడు. బలిచక్రవర్తి దానికి ఒప్పుకోగా మొదటి అడుగుతో భూమిని, రెండవ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించగా మూడవ అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి అణచి వేస్తాడు. దేవతలను బందీలుగా ఉంచడం వలన ఈ విధంగా చేశాడే తప్ప బలి చక్రవర్తి దాన గుణానికి సంతోషించిన ఆ శ్రీహరి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదిస్తాడు. అందువలననే మనం ఈ రోజున ఈ పండగని జరుపుకుంటాము. మలయాళీలు ఇదే పండగని ఓణం అనే పేరుతో జరుపుకుంటారు. ఈ రోజునే గోపూజ చేయడం కూడా ఒక ఆచారం.
అయిదవ రోజు - భగిని హస్త భోజనం - దీని గురించి కొంచెం వివరంగా ఆ రోజు టపాలో వ్రాస్తాను.
సరే ఇన్ని తెలుసుకున్నాం కదా మరి దీపం యొక్క విశిష్టత కూడా తెలిస్తే సంపూర్ణమవుతుంది. ఏమంటారు?
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపం యొక్క జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికీ, ఆనందానికీ, సజ్జనత్వానికీ, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మనకి ఒక రోజులో సంధికాలాలు రెండు. ఒకటి సూర్యోదయానికి ముందు రెండవది సూర్యాస్తమయం తరువాత. వీటినే మనం ఘటికాలు అంటాము. ఇది మొత్తం నలభై ఎనిమిది నిమిషాల కాలం. ఈ కాలములో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉండటం వలన రజ - తమో గుణాలు అధికంగా ఉంటాయి. ఈ శక్తుల నుండి రక్షణ పొందడానికి మనం దేవుని ముందు కూడా ఈ సమయాలలో దీపం పెట్టి పూజ చేస్తూ ఉంటాము. ఈ శక్తులు ఈ సమయంలో అధికంగా ఉండటం వలనే ఏమో అసలుసంధ్యవేళల్లో తధాస్తు దేవతలు ఉంటారు కనుక చెడు మాటలు అనకూడదు అని అంటూ ఉంటారు. మనోనిశ్చలానికీ, సుఖశాంతులకీ అనువయిన కాలం కనుక దీపావళీ, కార్తీక మాసం మొదలయిన వాటిల్లో దీపానికి అంత విలువ, ప్రాశస్త్యం కూడాను.
అవండీ నాకు తెలిసిన దీపావళి ముచ్చట్లు కొన్ని మీతో పంచుకున్నా! మరి నాకు తీపే తినిపిస్తారో లేక టపాసులే కాలుస్తారో! టపాసులు కాల్చేటప్పుడు మాత్రం జాగ్రత్త సుమీ!
