Showing posts with label bangles. Show all posts
Showing posts with label bangles. Show all posts

Monday, October 17, 2011

గాజుల సవ్వడి


ఏంటండీ ఈ చిత్రం చూడగానే మీ పాత రోజుల్లోకి వెళ్ళారా? పిల్లలిలా వేసుకుని మురిసిపోవడం ప్రతీ ఇంట్లోనూ కనిపించేదే కదా! చిన్నతనంలో ఆడ, మగ తేడా లేకుండా అందరూ గాజులు (ద్రిష్టికి నల్లని గాజులు) వేసుకున్నా అవి మాత్రం ఆడవారినే వలచాయి. ఉయ్యాల తొట్టిలో పడుకోపెట్టే ముందు వేసే తెల్లరాళ్ళ నల్లని గాజులు, కొంచెం ఎదిగాక వేసే నల్లని మట్టి గాజులు, ఆ తరువాత రకరకాల గాజులెన్ని వచ్చినా పెళ్ళికీ, సీమంతానికీ మళ్ళీ మట్టి గాజులదే పైచేయి. అసలు గాజులు అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఉంటారా? ఈ గాజులు వేసుకోవడం అనేది ఎలా మొదలయింది అన్న విషయం తెలియాలంటే ఈ కథ చదవాలి.

అనగనగనగనగా (ఇలా అన్న వెంటనే మీరు ఫ్యాను వేసుకోవాలి! వేసుకున్నారా? హా ఇప్పుడు చదవండి వాటి రెక్కలని చూస్తూ) కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆడవాళ్ళకి మాట్లాడే హక్కు, అభిప్రాయాలని వెలిబుచ్చే అర్హత లేని రోజుల్లో జరిగిన ఒక యదార్ధ గాధ. మగువలకి ఊహలు, ఆలోచనలు మగవారికన్నా ఎక్కువ కానీ వాళ్ళు బయటకి చెప్పకూడదు కనుక వాటిని మనసులో దాచుకోలేక ఒక్కో కోరికకి ఒక్కో గాజు వేసుకునేవారు. అలా వాళ్ళ చేతుల నిండుగా గాజులు ఉండేవి అంటే అన్ని కోరికలని చంపుకుని, అభిప్రాయాలని వేలిబుచ్చలేక బ్రతికేవారనమాట! వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే గాజుల చప్పుడుని బట్టి తెలుసుకునేవారు! ఆ గాజుల గల గల విన్నప్పుడల్లా వాళ్ళ భర్తలకి అర్ధమయ్యి ఇన్ని కోరికలుండి పాపం ఏమీ చెప్పకుండా చేసేసామే అని జాలి కలిగి వారి మీద ప్రేమ మరింత పెరిగేది! అప్పుడప్పుడు వాళ్ళ కోరికలని వీళ్ళే తెలుసుకుని మరీ తీర్చేవారు. ఇప్పుడు ఆడవాళ్ళకి భావ వ్యక్తీకరణ, మాట్లాడే హక్కు ఉన్నాయి కనుక ఇప్పటి వాళ్ళ చేతులకి ఇదివరకు ఉండే అన్ని గాజులు లేవనమాట! భర్త చనిపోయాక భార్యకి కోరికలు ఉండకూడదు అనే ధోరణిలో ఉండటం వలన భర్త మరణానంతరం వాళ్ళ గాజులని తీయించేసేవారు. కానీ దానికీ దీనికీ సంబంధం లేదు కనుకనే ఇప్పటి తరం వాళ్ళు భర్త చనిపోయాక కూడా గాజులు వేసుకుంటున్నారు.
(గమనిక: ఇదంతా నిజమనుకునేరు! లేదండీ అంతా నా కల్పన సరదాకి చేసిన ఒక ప్రయత్నం) క్రీ. పూ. 2300 - 1000 సంవత్సరాల నాటి సింధూ నాగరికత కాలం నాటి మొహంజొదారో స్త్రీ బొమ్మకి చేతి నిండా గాజులు కప్పేసి ఉంటాయి. అది చూసి ఇలా నేను చేసిన ప్రయత్నం మాత్రమే.  


అసలు ఈ గాజులు వేసుకోవడం అనేది కేవలం మన భారత దేశానికే పరిమితమనుకున్నాను కానీ ప్రపంచంలో ఉన్న ప్రతీ మగువకీ ఇవి ప్రీతికరమయినవని తరవాత తెలిసింది. ఒక పరిపూర్ణ మహిళ తన జీవితంలో వివిధ దశలలో వేసుకునే గాజులను ప్రకృతిలోని అందమైన రంగులతో పోల్చుతూ సరోజినీ నాయుడు గారు Bangle sellers అనే రచనలో చెప్పి హైందవ సంస్కృతిని చక్కగా వర్ణించారు. ఆడపిల్ల అందాన్ని వర్ణించేటప్పుడు తామర తూడల్లాంటి చేతులకు ముత్యాల గాజులు, బంగారు కడియాలు అంటూ చెబుతారు. అవును మరి వయ్యారాలొలికే నెలతకు సొగసైన చేతులు, వాటికి సౌందర్యాన్ని ఇనుమడింపజేసే గాజులు అవసరమే కదా!

ఆచారం: పూజ చేసినా, తాంబూలం ఇచ్చినా, నిశ్చయతాంబూలాలకూ ముతైదువులకు గాజులు ఇవ్వడం మన ఆచారం. గాజులు శుభానికి సంకేతాలు. బొట్టు, పూవులు, గాజులు ఐదోతనానికి గుర్తని మహిళలు భావిస్తారు. వాటిని దానం చేస్తే తమ మాంగల్యం పచ్చగా నిలిచి ఉంటుందని నమ్ముతారు. వివాహాది శుభ కార్యాలలో పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించగానే ఇంట్లోని ఆడవాళ్ళందరికీ గాజులు వేయిస్తారు. గాజుల చెన్నయ్య ఇంటి వాకిట్లోకి అమ్మాయిలకు గాజులు తొడగడానికి వచ్చిన రోజయితే పండుగ వాతావరణమే! ఈ నిండైన గాజుల చేతులతో పెళ్లి పనుల్లో దిగితే పెళ్లిపందిరంతా కళకళలాడేది. సన్నని మట్టి గాజులను వేస్తే స్త్రీ సంతోషంగా వుంటుంది అనే నమ్మకం నేటికీ చెదరలేదు. ఈ కారణంగా పెళ్ళికూతురుకి సన్నని గాజులను వేస్తారు.

ఆ తరువాత సందర్భం శ్రీమంతం. నెలలు నిండిన స్ర్ర్తీకి సుఖ ప్రసవం కావాలని కోరుతూ చేతుల నిండుగా రంగు రంగుల గాజులు వేస్తారు పేరంటాళ్లు. ఓ చేతికి 21 జతల గాజులు, ఇంకో చేతికి 22 జతల గాజులు తొడుగుతారు. అంతే కాక ఆమెకు కొక్కేలతో ఉండే సన్నని వెండిగాజునిస్తారు. ప్రసవ సమయంలో ఈ కొక్కేల్ని విడదీస్తారు. హైందవ సంప్రదాయసిద్ధంగా పెళ్లికూతురికి పచ్చని, ఎర్రని గాజులు, బాలింతలకు ఆకుపచ్చని గాజులు వేయిస్తారు. ఈ వేడుక కన్నుల పండుగగా ఉంటుంది. ఆ పేరంటానికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా గాజులు వేయిస్తారు! లేకపోతే మనం ఊరుకుంటామా? వేడి వేడి జిలేబీ చుట్టల్లాగా నిగ నిగలాడుతూ మెరిసిపోయే మట్టి (చెక్కుడు) గాజులని చూస్తే ఎవరికి వేయించుకోవాలనిపించదు చెప్పండి?

శాస్త్రీయం: ఈ గాజులు స్త్రీల అలంకరణలో ప్రథమ స్థానాన్ని పొందినా, వీటి వాడకం వలన ఉపయోగాలు కూడా ఉన్నాయి. చేతులకు గాజులు వేసుకోవడం వలన చేతి నరాలపై ఒత్తిడి కలిగి రక్త ప్రసరణ మెరుగౌతుందని ఒక శాస్ర్తీయ అంచనా. అదే కాక గాజుల శబ్దం మనిషి మెదడును ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుందనేది మరో అభిప్రాయం. తద్వారా మెదడు ప్రశాంతంగా ఉంటూ మానసికానందం పొందుతారుట అందుకేనేమో గర్భిణీ స్త్రీలకు ఎటువంటి మానసిక ఒత్తిడులూ కలుగకుండా అన్ని గాజులను వేస్తారు!

రాయబారం: మీరు చదివినది నిజమే గాజులు రాయబారం కూడా నడుపుతాయి. జానపద గేయాల్లో గాజులు బాంధవ్యాలను చేరదీసే మాధ్యమికంగా ఉండేవి. పెళ్ళి జరిగి అత్తవారింటిలో ఉన్న స్త్రీ గాజులమ్మేవాడితో తన పుట్టింటి వార్తలు మోసుకొని రమ్మని చెప్పేది. అప్పట్లో మరి ఉత్తరాలు, దూరవాణులు కూడా లేవు కదా! 

లాభాలు: (ఆడవారికి మాత్రమే! మగవారు పొరపాటున కూడా చదువరాదు!) మట్టి గాజులంటే మగువలకి ఎంత ఇష్టమయినప్పటికీ ఆధునికతకి తగ్గట్టుగా వంకర టింకర గాజుల వలన చాలా ఉపయోగాలున్నాయి. అవేమిటంటారా? చెప్తాను మరి మీరు ఇహ రోజూ అవే వేసుకుంటానంటే నాది పూచీ కాదు! ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా! పొరపాటున ఏదయినా తగిలి మన మట్టి గాజులు చిట్లాయనుకోండి మనకే దెబ్బ తగులుతుంది. అదే వంకర టింకర ప్లాస్టిక్ గాజులనుకోండి మనకి దెబ్బ ఉండదు. పైపెచ్చు ఇవి ఒక పక్క కోసుగా ఉండటం వలన ఎవరయినా మనతో వేషాలు వేశారనుకోండి వాళ్ళకి గాజుతో ఒక్క గీటు పెట్టేసి మనం ఎంచక్కగా తప్పించేసుకోవచ్చు. అలానే ఈ మధ్య వచ్చే బండ గాజులతో ఒక్క గుద్దు గట్టిగా గుద్ది కూడా మనం తప్పించుకోవచ్చు. మువ్వల గాజులు, రాళ్ళ గాజులతో ఒక్కసారి గీరామంటే అంతే అవతలి వాళ్ళ పని. ఏమంటారు? 

గృహాలంకరణ: దీనిలోనూ గాజులు ప్రధాన పాత్రను పోషిస్తాయి. మట్టి గాజులను కొవ్వొత్తిపై నెమ్మదిగా వేడి చేస్తే అవి మెల్లగా కరిగి కావాల్సిన ఆకారానికి వంగుతాయి. వాటితో పూవులు, మొగ్గలు, లతలు, ఏనుగులు, కొంగలు, కుందేళ్లు ఒకటేమిటి నచ్చిన ఆకారాన్ని తయారు చేసుకోవచ్చు. మా ఇంట్లో మైనం కరిగించి కణం (సెల్) ఆకారంలో పోసి దాని మీద ఈ రంగు రంగుల మట్టి గాజులను వంచి chloroplast, mitochondria, golgi complex మొదలయినవి తయారు చేసి వృక్ష కణాలు, జంతు కణాలు తయారు చేసేదానిని. అలానే గాజులో గాజును వేసి రక రకాల సైజుల్లో, పెద్ద రంగు రంగుల దండలా తయారుచేసి గుమ్మాలకు తోరణంలాగా కట్టేవాళ్ళం. గాజులను అతికించి రకరకాల బొమ్మలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మీ సృజనాత్మకతకి పదునుపెట్టి ఎన్నో కళా కాంతులను తయారు చేయవచ్చు.

వ్యాపారం: లాడ్ బజార్ లేదా చూడీ బజార్ అనేది హైదరాబాద్‌లో పేరుమోసిన గాజుల మార్కెట్. చారిత్రాత్మక చార్మినార్ నుంచి చీలివచ్చే నాలుగు ప్రధాన రహదారుల్లో ఓ రహదారి ప్రాంతంలో ఇది నెలకొనిఉంది. కిలోమీటరు పొడవునా వ్యాపించి ఉండే ఈ మార్కెట్‌ను మహిళలు నిత్యం సందర్శిస్తూ రకరకాల గాజులను కొనుగోలు చేస్తూ ఉంటారు. విదేశీయులు కూడా ఈ గాజుల పట్ల మక్కువ చూపుతున్నారంటేనే తెలుసుకోవచ్చు ఈ గాజులు ఎంత ప్రసిద్ధి చెందాయో!

DNA గాజులు
ఏ మాటకామాటే చెప్పాలి! మా రాజమహేంద్రవరంలో నల్లమందు సందు దగ్గర గొడుగు వేసుకుని ఒక తాత కుర్చుని మంచి మంచి గాజులు అమ్ముతాడు. రండమ్మా రండి డింగిరి డిక్లీ గాజులు అన్న పిలుపుకి వెళ్ళిన నేను ఇహ మట్టి గాజులంటూ కొనడమంటే అది తాత దగ్గరే అని నిశ్చయించేసుకున్నాను. నాకెంతో ఇష్టమయిన మట్టితో చేసిన DNA గాజులు (వీటికి ఆ నామకరణం చేసింది నేనే! చూడండి కావాలంటే ఈ గాజులో లోపల DNA double helix లాగా లేదూ!) అక్కడే కొనే దానిని. ఇవే కాక ఎన్ని రకాల మట్టి గాజులో అసలు తాత దగ్గర దొరికినన్ని రకాలు ఇంకెక్కడా దొరికేవి కాదు అదీ తక్కువ ధరకి. అలా అయిదేళ్ళ క్రితం కొన్న గాజులు కూడా ఇంకా నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నా గాజులు చూసి మా కాలేజీ అమ్మాయిలందరూ ఆ తాత దగ్గరే కొనడం. 

చివరి మాట: ముందు మాట తెలుసు కానీ ఈ చివరి మాట ఏంటి అంటారా? అదే మరి! రావు గోపాలరావు గారేమి చెప్పారు? మనిసన్నాక కూసింత కలాపోసనుండాల! ఊరికనే తిని తొంగుంటే మనిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటాది? అందుకే ఈ చివరి మాట!

గాజులు లేని మగువ
చంద్రుడు లేని కలువ
సూర్యుడు లేని వేకువ
విలువ పొందునుటయ్య ఈశ్వరా!

అంటే అర్ధం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనే అనుకుంటున్నాను. పుస్తకాలు తిరగేయకండి ఇది ఈశ్వర శతకం అనుకునేరు నేనే ఏదో పైత్యం ప్రకోపించి ఈ పద్యాన్ని వ్రాసి మీ ముందుకి తెచ్చాను. ఏదేమయినా ప్రపంచం ఎంత అభివృద్ది చెందుతున్నా మన గాజులకి ఆదరణ లభిస్తూనే ఉంది!