Tuesday, September 27, 2011

కర్పూర కథ


దేవీ నవరాత్రులు మొదలయ్యాయి కదా! ఇకనించి రోజూ పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు. అసలు పూజలనగానే నాకు బాగా గుర్తొచ్చేది హారతి. ఎందుకంటే అదిచ్చేస్తే పూజలు అయిపోయినట్టే మనకి ఎంచక్కగా ప్రసాదం పెడతారు. అందుకనమాట. భగవంతునికి చేసే ఉపచారాలలో ఈ హారతి ఒకటి. కావున ఈ హారతి గురించి నాకు తెలిసిన కొన్ని ముక్కలు వ్రాయతలచాను.

కర్పూరం చంద్ర సంకాశం జ్యోతి స్సూర్య మివోదితం
భక్త్యా దాస్యామి కర్పూర నీరాజన మిదం శివం
 

అంటూ కర్పూరంతో ఇచ్చే హారతిని నీరాజనం అంటారు. ఇంతే కాక  హారతిని నేతిలో నానబెట్టిన దూది వత్తులతో కూడా కొన్ని సందర్భాలలో ఇస్తారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, పదకొండు, పదహారు, ఇరవై ఒకటి ఇలా వివిధ సంఖ్యల వత్తులతో హారతులిస్తారు. కర్పూరము శ్రేష్ఠమయినది  కనుక దాని గురించి కొంచెం క్లుప్తంగా వ్రాస్తాను.

కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. పురాతన కాలంలో స్వల్పంగా దీపాల కాంతి ఉన్నపుడు భగవంతుని రూపం అంత స్పష్టంగా కనిపించేది కాదు. అప్పుడు హారతి ఇస్తే ఆ వెలుగులో చక్కగా స్పష్టంగా భగవంతుని మూర్తిని దర్శించే భాగ్యం భక్తులకు కలిగేది. హారతి సంప్రదాయానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి ఇది ఒక కారణం కావచ్చును. అయితే హారతి ఇవ్వడానికి ప్రధాన కారణం దిష్టి తీయడం. ఇదే కాక కర్పూరం వెలిగించినప్పుడు కమ్మని వాసన వస్తుంది. కర్పూర వాయువు గాలిని శుభ్రపరుస్తుంది. హారతిని కళ్లకు అద్దుకునే సమయంలో భక్తులా గాలి పీలుస్తారు. అప్పుడందులోని ఔషధగుణాలు శరీరం లోపలి భాగాల్ని శుద్ధి చేస్తాయి. ఇదే హారతి వెనుకనున్న నిగూఢమయిన రహస్యం.

పుట్టుక: కర్పూరం బహువచనం లేని ఏకవచనం. ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.

కర్పూర పూలు
 ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. నిజమే అండి కర్పూరం  కాంఫర్ లారెల్  లేదా Cinnamomum camphora (కుటుంబం: లారేసీ )  అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.

రకములు : కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది. 

పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు.  దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు. 

హారతి కర్పూరం
హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు. 

రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో  ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.

భీమసేని కర్పూరం
భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.

సితాభ్ర కర్పూరం
సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.




హిమవాలుక కర్పూరం
హిమవాలుక కర్పూరం:  ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.

ఘనసార  కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది. 

హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.

ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరముభూతికము, లోక తుషారముశుభ్ర కరముసోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి. 

ఉపయోగాలు: కర్పూరం వలన చాలా రకముల ఉపయోగాలున్నాయి. అవేమిటంటే
స్వభావం-కర్పూరం: మనుషుల స్వభావాలని కర్పూరంతో పోలుస్తారు. రకం మనుష్యులకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఏది చెప్పినా ఇట్టే గుర్తుండి పోతుంది. అంటే ఏకసంతాగ్రాహులన్నమాట. మంచి విషయాలను వెంటనే ఆచరణలో పెడతారుకర్పూరం లాంటి స్వభావం కలవారు కనుక ఒక సారి వెలిగిస్తే చాలు, చుట్టూ ఉన్న అందరినీ వెలిగిస్తూ జ్ఞానాన్ని పంచుతారు.

సాహిత్యం-కర్పూరం: మనకి కర్పూరాన్ని ఉదాహరణగా చూపిస్తూ బోలెడు మంచి విషయాలను మన సాహిత్యంలో చెప్పారు. వాటిల్లో మనందరికీ బాగా తెలిసిన రెండు పద్యాలు:

ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ.
పద్యం తెలియని వాళ్ళు ఉండరు కదా! ఉప్పు, కర్పూరం ఒకే విధముగా కనిపించినా కానీ పరిశీలించి చూస్తే వాటి రుచులు, గుణములు వేరు వేరుగా ఉంటాయి. విధముగానే మనుషులంతా చూడటానికి ఒకే ఆకారంతో, ఒకే అవయవ లక్షణాలను కలిగి ఉన్నా, గొప్పవారి లక్షణములు పరిశీలించి తెలుసుకుంటే, మామూలు మనుషులకంటే వారు విలక్షణముగా ఉంటారు అని దీని భావము.

కప్పురంపు మనసు కాంక్షించు యోగికి
జ్ఞానదీప శిఖయు తానటించు
కానవచ్చు నాత్మ క్రమమాణమై నిచ్ఛ
విశ్వదాభిరామ వినురవేమ.
కర్పూరం లాంటి స్వచ్ఛమైన మనసును అలవరచుకునే పవిత్రులలో జ్ఞానజ్యోతి (తత్వజ్ఞానమన్నమాట) వెలిగి, ఒకానొక ఆత్మస్ఫురణ కలుగుతుంది. అది క్రమంగా అతని అనుభవంలోకి వస్తుంది. అతడు కోరుకున్న ముక్తిని అప్పుడు పొందుతాడు అని అంటారు వేమన. ఇక్కడ దీప శిఖ అంటే దీపం యొక్క కొన, అగ్ని జ్వాల. నటించు అంటే ప్రవర్తించడం. ఇచ్ఛ అంటే కోరిక. అలభ్య వస్తువును సంపాదించడం కోసం కలిగే సంకల్పాన్ని ఇచ్ఛ అంటారు. ఇక్కడ ఇచ్ఛకు పర్యవసానం ముక్తి అని అంతరార్థం.

కళ్యాణం-కర్పూరం: చదవడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కళ్యాణాలలో కర్పూరానికి ఒక ప్రత్యేకత ఉంది. వధూవరులు దండలు మార్చుకునేటప్పుడు ఈ కర్పూర దండలు తప్పక మార్చుకుంటారు. అవి వాళ్ళు తీసి పక్కన పెట్టడం ఆలస్యం మేమంతా వెళ్ళి తెగ ఆడుకునే వాళ్ళం. 

ద్రిష్టి-కర్పూరం: నీరాజనం అంటే దేవునికి ద్రిష్టి తీసే ప్రక్రియే. సినిమాల పుణ్యమా అని ఒక పెద్ద బూడిద గుమ్మడికాయ తెచ్చేసి దాని మీద బండ రాయ పరిమాణంలో ఉండే పెద్ద కర్పూరం వెలిగించేసి మరీ ద్రిష్టి తీసేస్తారు. అదే కాక ఒక పెద్ద కర్పూరం వెలిగించి దానిని రెప్ప వేయకుండా చూస్తుంటే మన కంట్లో నీరు ఎంత కారుతుందో లేదా మన కళ్ళు ఎంత మండుతున్నాయో అంత ద్రిష్టి వుందని ఈ కర్పూర ద్రిష్టి కొలత. అయినా నాకు తెలియక అడుగుతాను! కన్నార్పకుండా అలా ఏదయినా వస్తువుని ఏకాగ్రతతో చూస్తుంటే మండడం లేదా నీరు రావడం అనేది సహజంగా జరిగే విషయమేగా!  మరి దానికి ద్రిష్టి అని పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం??

మంత్రం-కర్పూరం: కర్పూరంతో కొన్ని ట్రిక్కులు కూడా చేయవచ్చు. పూర్వం మంత్రగాళ్లు ఎవరితోనైనా నిజం చెప్పించాలన్నా, ఎదుట వాళ్లను మభ్యపెట్టాలన్నా కర్పూరాన్ని వాడేవారుట. ఆకుకు సన్నరంధ్రాలు చేసి దానిపై కర్పూరాన్ని ఉంచినప్పుడు ఆకు నీటిపై ఒక చోట నుంచి వేరే చోటికి వెళితే అబద్ధం చెప్పాడని, స్థిరంగా ఉంటే నిజం చెప్పాడని నమ్మించే వారు. అయితే దీని వెనుక ఉన్న కిటుకు ఏమిటంటే కర్పూరానికి నీటిలో తేలికగా కరిగే గుణం ఉండటం వలన నీటి తలతన్యత (Surface tension) తగ్గి నీరు అధిక తలతన్యత గల ప్రాంతం నుంచి అల్ప తలతన్యత గల ప్రాంతానికి ప్రయాణించటం వల్ల కర్పూరం ఉంచిన ఆకు లేదా కాగితం పడవ న్యూటన్ 3వ సూత్రం ప్రకారం కర్పూరం ఉన్న కాగితం నిశ్చల స్థితిలో ఉండదు గనుక, నీరు వెనక్కు కదిలినప్పుడు ముందుకు వెళ్తుంది.

తమిళ సామెత-కర్పూరం: అల్పచిత్తునికి ఉదాత్త విషయాలు తెలియవు అని చెప్పే ప్రక్రియలో మనం వాడే సామెతలు  'గాడిదకేం తెలుసు గంథంపొడి వాసన', పందికేం తెలుసు పాండ్స్ పౌడరు వాసన, పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ మొదలయినవి. ఇదే అంశాన్ని ప్రతిబింబిస్తూ తమిళంలో 'కళుదైక్కు తెరియుమూ కర్పూర వాసనై' ( గాడిదకు తెలియునా కర్పూర వాసన) అనే రూపంలో కనిపిస్తుంది.

ఆరోగ్యం-కర్పూరం: దీని వలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:
    1. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
    2. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది
    3. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.
    4. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.
    5. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది
    6. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.
    7. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది
    8. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.   
    9. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.  
    10. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
    11. రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది. 
    12. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.
    13. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.
    14. పురుగుల మందులు, చెడువాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి, కర్పూరాన్ని విరివిగా వాడుతారు.
    15. తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
    16. పెయింటింగ్, బాణాసంచా, సహజమైన పరిమళాలు, సబ్బులు తయారీలో కర్పూరం వాడుతారు.
    17. కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో కూడా సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు.
    18. అలానే అరబకెట్నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఇంటిని తుడిస్తే ఫ్లోర్మీద ఈగలు వాలవు. 
    19. కర్పూరం ఉన్న పేస్ట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి.
    20. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకుని మరీ త్రాగుతారట. తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయట

    కర్పూరం అనేది సహజసిద్ధమైన ఉత్పత్తి అయినప్పటికీ మితిమీరి వాడుట వలన అది విడుదల చేసే ఆవిర్లు విషపూరితమైనవి. కనుక కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఏదేమయినా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కర్పూర వాసన, ఆహ్లాదం ఆస్వాదించిన వారికే తెలుస్తుంది. ఏమంటారు?

    20 comments:

    కృష్ణప్రియ said...

    Nice. ఈ కర్పూర పూలని ఎప్పుడూ చూడలేదు.

    నందు said...

    నాదో మాట
    మనుషుల స్వభావాలని కర్పూరంతో పోలుస్తారు. ఈ రకం మనుష్యులకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఏది చెప్పినా ఇట్టే గుర్తుండి పోతుంది. అంటే ఏకసంతాగ్రాహులన్నమాట. మంచి విషయాలను వెంటనే ఆచరణలో పెడతారు, కర్పూరం లాంటి స్వభావం కలవారు కనుక ఒక సారి వెలిగిస్తే చాలు, చుట్టూ ఉన్న అందరినీ వెలిగిస్తూ జ్ఞానాన్ని పంచుతారు // ఈ వాక్యాలు మీకు సరిగ్గా నప్పుతాయంటే అతిశయోక్తి కాదు. మీ ఙ్ఞాపకశక్తి అమోఘం ..కర్పూరాన్ని గురించి ఎన్నో మంచి సంగతులు చెప్పారు ధన్యవాదాలు.

    జ్యోతిర్మయి said...

    పండగొస్తే దేముడి దగ్గర వెలిగించడమే కాని, కర్పూరం కథ ఎప్పుడూ తెలుసుకోలేదే...ఇన్ని రకాల కర్పూరాలున్నాయా అని ఆశ్చర్యం వేసింది.

    Very nice రసజ్ఞ గారు..

    Rams said...

    At present what are doing rasajna garu(Studying which?)
    Nice Narration ...Collection of information

    రసజ్ఞ said...

    @కృష్ణ ప్రియగారూ
    ధన్యవాదాలు! అవునా? ఎంతో ముద్దుగా ఉన్నాయి కదూ అందుకే పెట్టాను!

    @నందు గారు
    ఇది చాలా పెద్ద పొగడ్త. మీకు కూడా నెనర్లు!

    రసజ్ఞ said...

    @జ్యోతిర్మయి గారూ
    కృతజ్ఞతలండీ! మరింకేం ఇప్పుడు తెలిసిందిగా ఎంచక్కగా ఈ సారి నించి అన్నీ రకాల కర్పూరాలకి పని చెప్పండి!

    @Rams gaaru
    thanks for the comment! regarding your first question, i already mentioned it in the post named sree gurubhyom namaha

    Prasad (ప్రసాద్ భళ్ళమూడి) said...

    karporam venuka inta katha unda! chaala manchi vishayalu teliyachesaaru. nenu mee sri gurubhyonamah choosi mee follower gaa join ayanu

    రసజ్ఞ said...

    @Prasad gaaru
    thanks andi!

    Anonymous said...

    karpooram peeche itnaa baDaa kahaani hai kya? enakku ippu daa purinjichchi..inni vishayaalu teliyaparichinanduku dhanyavaadaalu.

    'karpoora bommai ondru
    kai veesum tendral ondrum'

    సుభ/subha said...

    కర్పూరం రసాయనం కాదని తెలుసు కాని, చెట్టుని,పూలని ఎప్పుడూ చూడలేదు. పూలైతే చాలా బాగున్నాయి. చిత్రాలతో సహా ఎంతో విలువైన విషయాలు చెప్పారండి. థ్యాంక్స్ అండీ.

    రసజ్ఞ said...

    @Anonymous gaaru
    thanks for your comment. ungalukki inda tamil paatai eppadi teriyum?

    నెనర్లు శుభ గారు

    Unknown said...

    దేముడి దగ్గర వెలిగించే కర్పూరం వెనక ఇంత కధ ఉందా ?
    ఇన్ని రకాల కర్పూరాలున్నాయా అని ఆశ్చర్యం వేసింది. బావుందండి.మంచి సమాచారం అందించారు.

    రసజ్ఞ said...

    @శైల గారు
    చాలా ధన్యవాదములండీ!

    రాజ్ కుమార్ said...

    మంచి పోస్టండీ. విలువయిన విషయాలు చెప్పారు. లైక్.

    రసజ్ఞ said...

    చాలా థాంక్స్ రాజ్ కుమార్ గారు!

    Anonymous said...

    naan oru puDungi rasagna gaaru...appidi daa teriyum..

    రసజ్ఞ said...

    @Anonymous gaaru
    haa enakku terindidu

    Anonymous said...

    Rasagna Gaaru
    enta manchi vishayalu cheputaaru miiru.
    ee vyasaani neneu vaadukovacha ?
    mii credntials thoni maa clutural magazine lo veyadaniki.

    Thanks,
    Meena

    రసజ్ఞ said...

    @ మీనా గారూ
    ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యురాలిని, తప్పకుండా వాడుకోండి!

    Anonymous said...

    Have you ever considered about adding a little bit more than just
    your articles? I mean, what you say is important and all.
    However think of if you added some great visuals or video clips
    to give your posts more, "pop"! Your content is excellent but with pics and videos, this website could definitely be one of
    the most beneficial in its field. Superb blog!

    Feel free to visit my blog post dating sites (bestdatingsitesnow.com)