సంక్రాంతిలో "సం" అంటే మంచి లేదా మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే పండుగ కనుక దీనిని "సంక్రాంతి" అని అంటారని పురాణాలలో ఉంది. ఈ ఒక్క పండుగ మాత్రమే నెలంతా చేసుకుంటాము. ఈ నెల రోజులూ కూడా కోనసీమ పల్లెటూర్లల్లో ఎంతో కోలాహలంగా ఉంటుంది.
నింగిలోని తారలన్నీ వాకిట్లో చుక్కల పరుపు వేయగా
మెరుపులన్నీ ఆ చుక్కలని కలిపి ముగ్గుల దుప్పటీ కప్పెను
పౌష్యలక్ష్మి ఆ ముగ్గులోని గొబ్బెమ్మగా మారి
గుమ్మడి పూలతో అలంకరించుకుని
ఆ శ్రీహరి కోసం ఎదురుచూడసాగెను
తుంబుర నారదులు కరములలో తాళం వేయగా
నటరాజు కాలి అందియలలో ఘల్లు ఘల్లు మనగా
త్యాగయ్య, గోపన్నాదులు గళములో శ్రుతి కలుపగా
ముక్కోటి దేవతలు విరులుగా మెడలో నాట్యములాడగా
సూర్య భగవానుడు పారాణిగా రంగును అద్దగా
భూదేవి అక్షయపాత్రగా మారి సిగను చేరగా
ఊర్ధ్వ పుండ్రాలతో పీతాంబరాలతో భక్తి పారవశ్యంతో
శ్రీమద్రమారమణ గోవిందో హరి అంటూ వచ్చెను శ్రీ హరి
ఈ పండుగలో ముఖ్యమయిన వాటిల్లో ముందుగా ఈ టపాలో ముగ్గులు, హరిదాసు గురించి ముచ్చటించుకుందాం.
సంక్రాంతి ముగ్గులు:
పూర్వం లక్ష్మీదేవి... పేదలకు వరాలిస్తూ అస్పృశ్యుల ఇండ్లలోకి ప్రవేశించిందట. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుని ప్రేరణతో ఆమెను వెలివేశాడట. దీంతో లక్ష్మీదేవి ఏ విధమైన చింతా లేకుండా ఈ మార్గశిర, పుష్య, ధనుర్మాసాల్లో.. మరింత మంది పేదల ఇళ్ళకు వెళ్లి వరాలు ఇవ్వడం ప్రారంభించిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే ధనుర్మాసంలో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముంగిట ప్రతీ ఒక్కరూ పోటీ పడి, వారి నైపుణ్యమంతా జోడించి మరీ ముత్యాల ముగ్గులు, చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు, గీతల ముగ్గులు ఇలా ఎన్నెన్నో కలబోసి రంగు రంగుల ముగ్గులు పెడతారు. ఈ ముగ్గులు కూడా ఏది పడితే అది పెట్టకూడదు.
భోగి రోజున భోగి కుండలతో లేదా చెఱకు గడలతో లేదా గాలిపటాలతో లేదా గంగిరెడ్లతో లేదా హరిదాసులతో నిండిన ముగ్గుని వేయాలి.
పెద్ద పండుగయిన సంక్రాంతి నాడు దార్ల ముగ్గు వేయాలి. ఈ రోజున అన్ని వైకుంఠ ద్వారాలూ తెరుచుకుంటాయని, ఈ రోజున మరణించిన వారు సరాసరీ వైకుంఠానికే వెళతారని చెప్తారు. కనుక దానికి ప్రతీకగా ముగ్గు మధ్యనించి అన్ని వైపులా ద్వారాలను తీస్తున్నట్టు ఈ దార్ల (ద్వారాల) ముగ్గు పెడతారు.
ఇహ కనుమ నాడు రథం ముగ్గు వేయాలి. ఈ రోజున సంక్రాంతి పురుషుడిని (అనగా ఈ పండుగని) చక్కగా ముత్యాల పల్లకీలో పంపడానికి ఏర్పాట్లు చేస్తాము. అందుచేత ఈ రోజున రథం మన ఇంటి వైపు వస్తున్నట్టు వేయాలి.
ముక్కనుమ నాడు కూడా రథం ముగ్గే వేయాలి. ఈ సంక్రాంతి పురుషుడు మనమిచ్చిన ఆతిధ్యాన్ని అంతా స్వీకరించి చక్కగా ఈ పల్లకిలో తిరిగి వెళిపోతాడు కనుక రథం మన ఇంటినుంచి బయలుదేరినట్టు వేయాలి. తరువాత రోజున ఆ రథాన్ని సాగనంపాలి. దీనినే రథం ఈడ్చటం అంటారు.
ఈ మాసంలో ముగ్గుల మధ్యలో గొబ్బిళ్ళని పెట్టి పూజించడం మన ఆచారం.
హరిదాసు:
సంక్రాంతి శోభ ఈయనతోనే వస్తుంది. హరి దాసు అంటే హరికి దాసుడు అని కనుక ఈ పేరు వినగానే నాకు నారద మునీంద్రులే కళ్ళ ముందు మెదులుతారు. హరిదాసులు మూడు రకాలుట. మొదటి రకం వారు హరికధ అనే ప్రక్రియ ద్వారా శ్రీహరి గాధలని వ్యాప్తి చేస్తూ ఉంటారు. రెండవ రకం వారు హరిదీక్షను తీసుకుని భజన, గానం, నృత్యాలు చేస్తూ హరి నామాన్ని వ్యాప్తి చేస్తారు. మూడవ రకం వారు హరినామ సంకీర్తన చేయుచూ కార్తీకమాసము మరియు సంక్రాంతి సమయాల్లో గ్రామములలో భిక్షాటన చేసేవారు. మనకి పండుగ సమయములో కనిపించేది ఈ మూడవ రకం వారు. హరిదాసు వాయించే సంగీత వాయిద్యాన్ని బట్టి వీరు తుంబుర హరిదాసు, గంట హరిదాసు, చిడతల హరిదాసు, కొమ్మ హరిదాసు అని పిలుస్తారు. మనకి ఎక్కువగా కనిపించే హరిదాసుల చేతుల్లో తుంబుర, చిడతలు తప్పనిసరిగా కనిపిస్తాయి. ఏక భుక్తం (ఒంటి పూట భోజనం చేయటం), అథః శయనం (క్రింద లేదా నేల మీద పడుకోవటం), శీతల స్నానం (చన్నీటితో స్నానం చేయటం), బ్రహ్మచర్యం (మనసా, వాచా కర్మణా) పాటిస్తూ సర్వావస్థలలోనూ ఆ భగవంతునికే దాఖలు పడుతూ భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో అకుంఠిత దీక్షతో ఉండే హరిదాసుని తలుచుకోగానే నాకు అన్నమాచార్య కీర్తన గుర్తుకువస్తుంది.
ప|| అన్నిటాను హరిదాసు లధికులు |
కన్నులవంటివారు కమలజాదులకు ||
చ|| అందరును సమమైతే నరుహానరుహము లేదా |
అందరిలో హరియైతే నౌగాక |
బొందితో విప్రునిదెచ్చి పూజించినట్టు వేరే |
పొందుగాని శునకము బూజింపదగునా ||
చ|| అన్నిమతములు సరియైతేను వాసిలేదా |
చెన్నగుబురాణాలు చెప్పుగాక |
యెన్నగ సొర్ణాటంక మింతటాను జెల్లినట్లు |
సన్నపుదోలుబిళ్ళలు సరిగా జెల్లునా ||
చ|| గక్కున బైరు విత్తగా గాదము మొరచినట్లు |
చిక్కినకర్మములెల్లా జెలగెగాక |
తక్కక శ్రీవేంకటేశు దాస్యమెక్కుడైనట్టు |
యెక్కడా మోక్షోపాయమిక జెప్పనున్నదా ||
అందమయిన రంగవల్లుల మధ్యలో గొబ్బిళ్ళను పెట్టి భక్తితో హరిని కీర్తిస్తే సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడనీ, ఆయన తల మీద గుమ్మడికాయ ఆకారములో ఉండే అక్షయపాత్ర మన భూమికి సంకేతమని జనుల విశ్వాసం.
అక్షయపాత్ర విశిష్టత:
అక్షయము అనగా ఎప్పుడూ నిండుగా ఉండేదని అర్ధం. ఈ పాత్రను శ్రీమహావిష్ణువు సూర్యభగవానుడికి ఇచ్చాడనీ దానినే పాండవుల వనవాస సమయంలో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇచ్చాడనీ తదుపరి ధర్మరాజు పట్టాభిషేక సమయంలో ఈ పాత్రను ఎవరికి అందించాలన్న ప్రశ్నకు కృష్ణుడు బదులుగా వేయిగంటల మండపాన్ని కట్టించి బ్రాహ్మణులకు భోజనం పెట్టమని ఆ సమయంలో గంటలు మ్రోగినప్పుడు వారికే ఇవ్వమని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ ప్రకారం ధర్మరాజు బ్రాహ్మణులకు భోజనం పెట్టినా గంటలు మ్రోగకపోవడంతో ధర్మరాజు శ్రీకృష్ణున్ని ప్రార్ధించగా చాత్తాది శ్రీవైష్ణవునకు భోజనం పెట్టమని సూచిస్తాడు. చాత్తాది శ్రీవైష్ణవుడు తాను భోజనం చేయనని స్వయంపాకం ఇమ్మని కోరగా ఆ ప్రకారం అతడు స్వయంపాకాన్ని తీసుకువెళ్ళి వండి గోదాదేవీ సహిత శ్రీకృష్ణమూర్తిని అర్చించి నివేదన చేసి అప్పుడు అతను భుజించగా గంటలు మ్రోగుతాయి. అప్పుడు ధర్మరాజు అక్షయపాత్రను చాత్తాది శ్రీవైష్ణవునకు ఇచ్చినట్లు నాటి నుండి వారే హరిదాసులుగా వంశపారంపర్యంగా కులవృత్తిగా ఈ అక్షయపాత్రను ధరించి గ్రామసంచారం చేస్తున్నట్లు పురాణ కథనం. ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయానికి మునుపే శ్రీకృష్ణ గోదాదేవీలను అర్చించి తిరుప్పావై పఠించి అక్షయపాత్రను ధరించి గ్రామ సంచారం ప్రారంభిస్తారు. గ్రామ సంచార ప్రారంభం నుంచి తిరిగి వచ్చేవరకు హరినామ సంకీర్తన తప్ప ఇతరులతో సంభాషణ చేయడంకానీ, అక్షయపాత్ర దింపుట కానీ చేయరు. ఇంటికి చేరిన పిదప ఇల్లాలు పాదాలు కడిగి అక్షయపాత్ర ఆమె దింపి అందులోని పదార్ధములతోనే వండి నైవేద్యం పెడుతుంది.
ఈ టపా వ్రాసినది రసజ్ఞ. చదువుతూనే ఉండండి మరికొన్ని సంక్రాంతి విశేషాల కోసం.



