ఇప్పటిదాకా ధనుర్మాసమంతా కనిపించే పండుగ కబుర్లు చెప్పుకున్నాం కదా! ఈ టపాలో పండుగ మూడు రోజుల ముచ్చట్లూ చెప్పుకుందాం.
పండుగ వాతావరణమంతా ప్రస్ఫుటముగా కనిపించే ఈ ధనుర్మాసమంతా ముద్దబంతుల
అందాలతో, ముద్దుగుమ్మల సోయగాలతో, క్రొత్త అల్లుళ్ళతో, ఇంటిముందర
గొబ్బిళ్ళతో, పాడి పంటలతో, కన్నెపిల్లల ఆటపాటలతో, పోతుపేరంటాళ్ళ (మగవారు
ఆడవారి పేరంటానికి వెళితే ఇలానే అంటారు) కుతూహలంతో, హరిదాసు కీర్తనలతో,
పశుపక్ష్యాదులకు వితరణతో, ఇలా ఎన్నో విషయ తివాచీలతో సంక్రాంతి పురుషునికి
స్వాగతం పలుకుతాము. ఈ పండుగ మూడు రోజులయిన భోగి, సంక్రాంతి, కనుమ గురించి
కొంచెం లోతుగా తెలుసుకుందాం.
భోగి:
భగ (అనగా మంటలు లేదా వేడిని పుట్టించడం) అనే పదం నుండి భోగి అనే పదం
ఉద్భవించినది. ఈరోజున తెల్లవారుఝామునే నిద్ర లేచి భోగిమంటలు వేస్తారు.
మనిషిలో దాగి ఉన్న పాత చెడు అలవాట్లను, ఈర్ష్య, ద్వేషం, అసూయ మొదలయిన
వాటిని జ్ఞానం అనే అగ్నిలో దహించివేసి నూతన జీవితాన్ని ఆరంభించడమే ఈ భోగి
మంటలోని అంతరార్థం.

ఇంట్లోని పాత వస్తువులయిన చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లలు, కర్ర
పుల్లలు, మొదలయినవాటిని ఏడాది పాటుగా దాచి ఉంచడాన్ని భౌతిక లోభ గుణం
అంటారు. వీటిని అగ్నికి ఆహుతి చేయుట వలన వైరాగ్యం కలుగుతుంది అనేది
లౌకికార్థం. ఈ మంటలలోని ఉన్న వెచ్చదనం ఇంకెక్కడా ఉండదేమో! దీనిని ముఖ్యముగా
రోడ్ల కూడలి (నాలుగు దారులు కలిసే చోటు)లో వేస్తారు. దీని వలన చెడు అనేది ఏ
ద్వారమునుండి కూడా మన ఇంట్లోకి ప్రవేశించదు అని నమ్మకం. ఇందులో ముఖ్యముగా
ఆవు పేడతో చేసిన పిడకలను తప్పక వేస్తారు. గోమయం అనేది ఎన్నో రోగములకు మంచి
మందు కనుక దీని నుండి వచ్చే పొగ ఎన్నో రోగాలను నివారిస్తుంది. అలానే
దక్షిణాయనంలో పడిన కష్టాలను అగ్నిలో వేసి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు
అనే భోగాలని ఇమ్మని వేసే మంటలే భోగి మంటలు అని కూడా అంటారు. మనది వ్యవసాయ
ప్రధాన దేశం కనుక ఏడాది పొడువునా కష్టపడిన భోగికి (భోగములను అనుభవించేవాడు
భోగి ఇక్కడ సందర్భములో రైతు అని అర్థం) పంట చేతికొచ్చే రోజున కుప్పలు
నూర్పిడి అవ్వగానే మిగిలిన పదార్ధాలతో వేసిన ఈ భోగి మంట వలన పుష్యమాస
లక్షణమయిన చలి తగ్గి వాతావరణం కొంచెం వేడెక్కుతుందని ఒక నమ్మకం. అలాగే
రాబోయే కాలంలో వేడిని తట్టుకునే వస్తువులేవో తెలుసుకోడానికి కూడా ఇది
ఉపయోగపడుతుంది. ఈ మంటలో వేసిన వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయిన తరువాత
దానిమీదే నీళ్ళు కాచుకుని స్నానాలు చేస్తారు.

సాయంత్రం చిన్నపిల్లలకు తలపైన భోగిపండ్లు పోస్తారు. ఈ భోగిపళ్ళలాగా
రేగుపండ్లని వాడతారు. వీటితోపాటు పూలరేకులు, చిల్లర డబ్బులు అన్నీ కలిపి
దృష్టి దోషం పోవడానికి తలపైన పోస్తారు. రేగుపండ్లనే సంస్కృతంలో బదరీఫలాలు
అంటారు. బదరీ నారాయణుడయిన ఆ శ్రీహరి కరుణా కటాక్షాలు పిల్లలపై పడి
ఆశీర్వచనంగా ఉంటుంది. అలానే రేగుపండ్లని అర్కఫలాలు అంటారు. సూర్యునికి
ప్రతినిధిగా శక్తిని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చే శక్తి రేగుపండ్లకు
ఉంది కనుకనే వాటిని పిల్లలపై పోయడం వలన ఆ స్పర్శకి వారికి ఆయురారోగ్యాలు
వృద్ధి చెందుతాయి అని నమ్మకం. పిల్లలకు భోగిపళ్లు పోయటం అంటే సూర్యునికి
ఆరాధన చేయటం అనే భావన కూడా ఉంది. ఈ రోజున సందడి అంతా పిల్లలదే. తెగ హడావిడి
చేస్తూ అటూ ఇటూ తిరిగేస్తూ భలే ముద్దొచ్చేస్తూ ఉంటారు.
మకర సంక్రాంతి:
మకరం అంటే మొసలి. మానవుని ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డు తగులుతూ
మోక్ష మార్గానికి అనర్హునిని చేయడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అందువలన
దీని బారి నుండి తప్పించుకునేందుకు ఏకైక మార్గం దాన ధర్మాలు చేయటం. అందుచేత
ఈ పండుగ దినాన వీలయినన్ని దాన ధర్మాలు చేస్తూ, పశుపక్ష్యాదులకు సైతం
గింజలు పెడుతూ దాని బారి నుండి తప్పించుకుని మోక్ష మార్గాన్ని చేరుకునే
అర్హత సంపాదించుకుంటాము.
ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగా ఉంటుందిట. అందువలననే దక్షిణాయనంలో
అంపశయ్య మీద పడిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం దాకా వేచి స్వచ్ఛంద మరణాన్ని
కోరుకున్నాడని కూడా ఉంది కదా! ఈ రోజున మరణించిన వారికి స్వర్గ లోక
ప్రాప్తి ఉంటుందని కూడా పురాణాలు చెపుతున్నాయి. కనుక ఈ రోజున కోళ్ళ పందాలు,
పొట్టేళ్ల పందాలు పెడతారు.
ఇంటికి చేరిన క్రొత్త బియ్యంతో మొదటగా పాలు పొంగించి సూర్యనారాయణునికి
పొంగలి నైవేద్యం పెడతాము. అలానే గాదికి చేరిన క్రొత్త పంటతో ఎన్నో
రుచికరమయిన పిండివంటలతో జిహ్వకి రసోస్వాదన. ఉత్తరాయణ పుణ్యకాలం పితృ
దేవతలకి ఆరాధనా కాలం. ప్రతీ సంక్రమణానికీ పితృ తర్పణలు ఇవ్వాలి కాని మిగతా
పదకొండు సంక్రమణాలకీ ఇచ్చినా, ఇవ్వకపోయినా మకర సంక్రమణం నాడు మాత్రం
తప్పకుండా ఇవ్వాలి. ఈ రోజున ముఖ్యముగా అరిసెలు చేస్తారు. కేవలం అరిసెలు
మాత్రమే పితృ దేవతల గ్రాసం, ఏడాదికి సరిపడా భక్ష్యంట.
ఎగిరింది ఎగిరింది నా గాలిపటం
గాలిలో ఎగిరింది నా గాలిపటం
పైపైకి ఎగిరింది నా గాలిపటం
పల్టీలు కొట్టింది నా గాలిపటం
రంగురంగులదండి నా గాలిపటం
రాజ్యాలు దాటింది నా గాలిపటం
మబ్బును దాటింది నా గాలిపటం
పందెమే గెలిచింది నా గాలిపటం
అంటూ గాలిపటాన్ని ఎగురవేయటం భలే సరదాగా ఉంటుంది కదూ! దీనిని పతంగుల పండుగ
అని కూడా అంటారు. ఇదివరకు ఐతే ఎన్నో రకాల గాలిపటాలను ఇంట్లోనే
తయారుచేసుకునేవాళ్ళం. కాని ఇప్పుడు పిల్లలను ఆకర్షించేలా రక రకాల బొమ్మల
ఆకారాలలో దొరుకుతున్నాయి. రాత్రి గోదా కళ్యాణంతో ఈ రోజు ఘట్టం ముగుస్తుంది.
కనుమ:
దీనినే పశువుల పండుగ అని కూడా అంటారు. పంట చేతికి రావడానికి రైతుకి చేదోడు
వాదోడుగా నిలిచినవి గోవులు. కనుక ఈ రోజు వాటికి ప్రత్యేక పూజలు
నిర్వహిస్తారు. తమ కడుపు నింపిన గోమాతకి క్రొత్త బట్టలు తొడిగి, పసుపు,
కుంకుమలతో పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ రోజున ఎడ్ల పందాలు కూడా
నిర్వహిస్తారు.
చేతికందిన పంటను తమతో పాటూ, పశువులూ, పక్షులూ కూడా పాలు పంచుకోవాలని పిట్టల
కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకి కడతారు. అలానే ఈ రోజున గారెలు, ఆవడలు
(పెరుగు గారెలు), పొంగు బూరెలు వేసి గ్రామాన్ని చల్లగా చూసి సుభిక్షంగా
ఉంచినందుకు కృతజ్ఞతగా గ్రామదేవతలకి నయివేద్యాలు పెడతారు. ఈ రోజున గరగ
నృత్యం చూడటానికి రెండు కళ్ళూ చాలవు.

మా కోనసీమ కనుమ ప్రత్యేకమయిన ప్రభల తీర్థం చూడటానికి ఇంద్రునిలా ఒళ్ళంతా
కళ్ళు చేసుకున్నా చాలవు. సుమారు 400 సంవత్సరాల క్రితం మొదలయిన ఈ పండుగ ఈ
నాటికీ నిర్విరామంగా, కోలాహలంగా, కన్నుల పండుగగా జరుగుతూ ఎంతో మందిని
ఆకర్షిస్తుంది. ఈ తీర్థం జగ్గన్న తోటలో జరుగుతుంది. ఈ జగ్గన్నతోటలో ఏ
విధమయిన గుడి కానీ, గోపురం కానీ ఏమీ ఉండవు అంతా కొబ్బరి తోట. ఈ తీర్థంలో
గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వర స్వామి, గంగలకుర్రు - చెన్నమల్లేశ్వర
స్వామి, వ్యాఘ్రేశ్వరం - వ్యాఘ్రేశ్వర స్వామి, పెదపూడి - మేనకేశ్వర స్వామి,
ఇరుసుమండ - ఆనంద రామేశ్వర స్వామి, వక్కలంక - కాశీ విశ్వేశ్వర స్వామి,
నేదునూరు - చెల్లమల్లేశ్వర స్వామి, ముక్కామల - రాఘవేశ్వర స్వామి, మొసలపల్లి
- మధుమానంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి - న్నెమల్లేశ్వర స్వామి,
పుల్లేటికుర్రు - అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి మొత్తం ఏకాదశ రుద్రులను
ప్రభలపై మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో, ఆనంద పారవశ్యంతో
జగ్గన్న తోటకి ఊరేగింపుగా తీసుకుని రావటం అనాదిగా వస్తున్న ఆచారం. అలా ఈ
తోటకు ఏకాదశి రుద్రులు తరలి వచ్చి లోక కళ్యాణం గురించిన చర్చలు జరుపుతారని
భక్తుల ప్రగాఢ విశ్వాసం.

వెదురు కర్రలను చీల్చి వాటిని వర్తులాకారంలో వంచి కట్టి, వాటిని రంగు రంగుల
వస్త్రాలతో, పూలతో అలంకరించి వేద మంత్రాల మధ్య గంటలను మ్రోగిస్తూ
అహోం-ఒహోం అంటూ కులమతాలకి అతీతంగా ఈ ప్రభలను మోసి భక్తులు పులకిస్తారు.
శివుని వాహనంగా పిలువబడే వీరభద్రుని ప్రతిరూపాలే ఈ ప్రభలు అని త్రికరణ
శుద్ధిగా నమ్ముతారు. పచ్చని పంట పొలాల మీదనుంచి, కొబ్బరితోటలో ప్రభలను
ఊరేగిస్తున్న దృశ్యం చూడటానికి నలు మూలల నుండీ జనాలు తరలి వస్తారు.
ఇక్కడ ప్రవహించే గోదావరి పాయని కౌశిక అంటారు. ప్రభలు కౌశికలో
ప్రవేశించడానికి ముందు పంట పొలాలను తొక్కుకుంటూ జనాలు వచ్చినా రైతులు
బాధపడక పోగా సంతోషిస్తారు. వారి వారి పొలాల మధ్యనుంచి సాక్షాత్తు ఆ
పరమేశ్వరుడు వెళ్ళటం వలన పంట బాగా పండుతుందని, పూర్వ జన్మ సుకృతం అని కూడా
నమ్ముతారు. అందమయిన ఏకాదశి రుద్రుల ప్రభలతో ఉన్న ఈ తోటని, తీర్థాన్ని
వర్ణించడం మానవతరం కాదు. ఆ అనుభూతిని ప్రతీ ఒక్కరూ ఒక్కసారయినా తప్పక
పొందవలసినదే!
అవండీ నాకు తెలిసిన పండుగ విశేషాలు అన్నీ మీతో పంచుకున్నాను. ఇంతటితో
సమాప్తం. మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.