పింకీ
అంటే ఏంటి? చెప్పుకోండిచూద్దాం!!!! ఏంటి తెలియదా? సరే ఇది విన్నారా
చిటికిన వేలు సింగారం
ఉంగరపు వేలు బంగారం
నడిమి వేలు నాన్న
చూపుడు వేలు నీకేసి
బొటన వేలు బొట్టేట్టి
ఐదు వేళ్ళ అరచెయ్యి
అరచెయ్యి అరచెయ్యి అంటించి
దేముడికి దణ్ణం పెట్టు
ఉంగరపు వేలు బంగారం
నడిమి వేలు నాన్న
చూపుడు వేలు నీకేసి
బొటన వేలు బొట్టేట్టి
ఐదు వేళ్ళ అరచెయ్యి
అరచెయ్యి అరచెయ్యి అంటించి
దేముడికి దణ్ణం పెట్టు
ప్చ్ వినలేదా? పోనీ ఇది విన్నారా?
చుట్టాల సురభి -
బొటనవేలు
కొండేల కొరవి - చూపుడువేలు
పుట్టు సన్యాసి - మధ్యవేలు
ఉంగరాల భోగి - ఉంగరపు వేలు
పెళ్ళికి పెద్ద - చిటికిన వేలు
కొండేల కొరవి - చూపుడువేలు
పుట్టు సన్యాసి - మధ్యవేలు
ఉంగరాల భోగి - ఉంగరపు వేలు
పెళ్ళికి పెద్ద - చిటికిన వేలు
పింకీ అంటూ వేళ్ళ గురించి చెప్తుందేమిటి ఈ పెంకి పిల్ల అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా! పింకీ అంటే చిటికిన వేలు. దీనినే కనిష్ఠిక అంటారు. అంటే ఆఖరిది లేదా చివరిది అని. ఉన్నట్టుండి ఈ చిటికిన వేలు మీదకి ధ్యాస ఎందుకు మళ్ళింది అంటే మొన్న నాకు చిటికిన వేలు గోరులోకి ముల్లు దిగి బాగా నొప్పి పెట్టింది. అప్పుడు తెలిసింది నాకు దీని విలువ. దీనిని పెద్దగా పట్టించుకోము కానీ ఇది మనకి చాలా ముఖ్యమయినది. ఎలా అంటారా? పూర్తిగా చదివెయ్యండి మరి!!!
తరువాత, చిటికిన వేలు ప్రాధాన్యంగా కనిపించే అంశం సప్తపది. ధియో యోనః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః అని కరన్యాస మంత్రం. నూతన వధూవరులు ఒకరి చిటికిన వేలు మరొకరు పట్టుకుని అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయటంలోని ఆంతర్యం ఇద్దరూ పరస్పర సహకారముతో అన్ని విషయాల్లోనూ సమస్త జ్ఞాన అన్వేషణలో ఒకరికి ఒకరు తోడుగా ఉండి జీవితంలో తరిస్తారు అని. అదే కాక చిటికిన వేలు పట్టుకుంటే మనకి ఎదుటి వారి మీదున్న ప్రేమ, నమ్మకం, భరోసా అన్నీ తెలుస్తాయిట. అందుకనే చిన్న పిల్లలని చూడండి జాగ్రత్తగా చిటికెన వేలు పట్టుకుని అడుగులేస్తారు.
మన చేతిలోని బొటన వేలు పరమాత్మను సూచిస్తే, చూపుడు వేలు జీవుడిని, ప్రక్కన ఉన్న మూడు వేళ్ళూ వరుసగా శరీర స్వభావాలయిన తమస్సు, రజస్సు మరియు సాత్వికాన్ని సూచిస్తాయి. దీనిని బట్టీ మనకు చిటికిన వేలు సాత్వికాన్ని తెలిపేది అని తెలుస్తోంది. మనకు లభించిన ఈ శరీరం కర్మ వలననే ఏర్పడింది కనుక దీనికి సాత్విక ప్రవృత్తి చాలా తక్కువ. మనిషి బాగుపడటం అనేది కేవలం సాత్వికం వలనే అవుతుంది. చూపుడు వేలు అనే జీవుడిని మామూలుగా వదిలేస్తే సత్వ గుణములో కానీ, రజో గుణములో కానీ, భయంకరమయిన తమో గుణములో కానీ పడి కొట్టుకుంటాడు. దీని ప్రకారముగా ఆలోచించి చూస్తే పరమాత్మలో జీవుడిని ఏకం చేసి వారిరువురూ వేరు కాదు ఒకరే అని తెలుసుకోవటమే జ్ఞానం. కనుక చూపుడు వేలును బొటన వేలు వైపు వంచడమే జ్ఞాన ముద్ర లేదా చిన్ముద్ర అని అంటారు.
మన శరీరములో నిరంతరం శక్తి ప్రవహిస్తూ ఉంటుంది అని మనకి తెలిసినదే కదా! అలానే ఆ
శక్తి మన చేతుల్లో కూడా ప్రవహిస్తుందనీ, మన చేతిలోని అయిదు వేళ్ళూ పంచ భూతాలూ అనే
అయిదు తత్వాలకి సంకేతాలనీ అంటారు. ఆ ప్రకారముగా బొటని వేలు అగ్నికీ, చూపుడు వేలు
వాయువుకీ, మధ్య వేలు ఆకాశానికీ, ఉంగరం వేలయిన అనామిక భూమికీ, చిటికిన వేలు జలానికీ
సంకేతాలు. ఈ అయిదిటికీ సమతుల్యత లేకపోవడం వలననే రోగాలు వస్తాయనీ వాటిని
నివారించడానికి ఈ వేళ్ళతో రక రకాల ముద్రలను నిత్యం సాధన చెయ్యాలనీ గాయత్రీ మంత్రం
చెప్తుంది.
బాబోయ్! ఆధ్యాత్మిక విషయాలు చాలా ఎక్కువ చెప్పేశానా? సరేలే మళ్ళీ మీకు బాగా తెలిసిన విషయానికి వచ్చేస్తా. అదేమిటంటే పాండు రాజు చనిపోయినప్పుడు తన శవాన్ని దహనం చేయవద్దనీ తన శరీరాన్ని మొత్తం తన అయిదుగురు కుమారులూ తినెయ్యాలనీ కోరతాడు. కానీ శ్రీ కృష్ణుడు మాత్రం వద్దని వారిస్తాడు. ఒకవేళ వారు అలా తినుంటే సకల జ్ఞానులయ్యేవారుట! ఎన్నో శక్తులు వారి సొంతమవుతాయని శ్రీ కృష్ణుడు వద్దని చెప్తాడు. మిగతావారంతా కృష్ణుని మాట విని ఊరుకుంటారు కానీ సహదేవుడు మాత్రం నాన్నగారు ఎందుకని అలా చెప్పారో అని ఆయన చిటికిన వేలు తినేస్తాడుట. దాని వలన సహదేవునికి భవిష్యత్తులో ఏమి జరుగబోతోంది అన్నవి ముందుగానే తెలుస్తాయిట, ఇంకా చినుకుకీ చినుకుకీ మధ్య నుండీ తడవకుండా వెళ్ళగల శక్తి కూడా వచ్చిందిట. కానీ ఆ శక్తులేమీ ప్రదర్శించనని కృష్ణుడికి మాటిస్తాడు. ఈ కథ జరిగినప్పటినుండీ ఆ చిటికిన వేలుని సహదేవుడు అనీ, అనామికని నకులుడనీ, మధ్య వేలుని అర్జునుడనీ, చూపుడు వేలిని భీముడనీ, బొటన వేలిని ధర్మరాజనీ చెప్తూ ఉంటారు.
మీకో బుల్లి కథ తెలుసా? ఒకసారి మన చేతి అయిదు వేళ్లకీ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన వచ్చిందిట. బొటన వేలు నేను లేకుండా మిగిలిన నాలుగు వేళ్ళూ పని చేయలేవు కనుక నేనే గొప్ప అందిట. చూపుడు వేలు కాదు కాదు మంచీ, చెడులని సూచించేది నేను కనుక నేనే గొప్ప అందిట. అన్నిటికన్నా నేనే ఎత్తుగా ఉంటాను కనుక నేనే గొప్ప అందిట మధ్య వేలు. మీరంతా ఉన్నా ఖరీదయిన ఉంగరాలని నాకే తొడుగుతారు కనుక నేనే గొప్ప అందిట అనామిక. తన గొప్ప చెప్పుకోవడానికి ఏమీ లేక, చిటికిన వేలు దేవుడి దగ్గరకెళ్ళి తన బాధను చెప్పిందిట. అప్పుడు దేవుడు పొట్టిగా ఉన్నందుకు బాధపడకు, నన్ను ప్రార్ధించే సమయములో చేతి వేళ్ళ వరుసలో ముందు నువ్వే ఉంటావు కనుక, నాకు వారందరికన్నా నువ్వే దగ్గరగా ఉంటావు కనుక నువ్వే గొప్ప అన్నాడుట. చూశారా చిటికిన వేలు ఎంత గొప్పదో!!
చిటికిన వేలు ప్రాముఖ్యత సంగీత కారులకి బాగా తెలుస్తుంది. సంగీత
వాయిజ్యాలను బాగా మీటాలంటే చిటికిన వేలు బాగా పని చెయ్యాల్సిందే! వీణకు చిటికిన వేలితోనే
తాళం వేస్తారు. అలానే గిటారు వాయించాలన్నా చిటికిన వేలే కావాలి.
ఇవే కాక క్లాసులోంచి తుర్రుమనాలంటే చిటికిన వేలే ఆయుధం. చిన్న
చిన్న సందుల్లో (చెవిలో, తూముల్లో, సీసా మూతల్లో) దూరాలన్నా చిటికిన వేలే ముందు ఉంటుంది. చూశారా ఎన్ని ప్రయిజనాలున్నాయో !
ఇన్ని ఉన్నా చిటికిన వేలికి మాత్రం చిన్న చూపే మిగిలింది.
49 comments:
@రసజ్ఞ గారు పింకి పెంకి చేయలేదు కాని మంచిగా పాఠాలు చెప్పిందే :) చాలా బాగుంది ఆధ్యాత్మిక కారణాలు విశ్లేషణలు ... ఆ పాండురాజు కథ అయితే ఇంతవరకు వినలేదు ... ఇంకోటి దేవుడికి నమస్కరించేటప్పుడు అది ముందు రావటం బుజ్జిది ఎంత బాగుందో ఆ కథ :) ... పైగా నిజమే ఇందులో దూరాలన్న అది ఎంతో మేలు చేస్తుంది.. ఇంకోటి తెలుసా పాపం టైప్ రైటింగ్ చేసేపుడు ఎంత కష్టపడుతుందో a ని టైపు చేయడానికి ... మొత్తానికి భలే గమత్తైన విషయాలు చెప్పారు ... "క్లాసులోంచి తుర్రుమనాలంటే చిటికిన వేలే ఆయుధం" హహహ ఇది అద్బుతం :D
రసజ్ఞ గారు,
ఏది చెప్పినా లెక్చరర్ చెప్పినట్టు చెప్తారండీ. ఐనా అసలు బోర్ కొట్టకుండా చెప్తారు. అందుకే మా ఫేవరెట్ లెక్చరర్ అన్నమాట మీరు.
చిటికెన వేలంత లేవు నన్నే ఎదిరిస్తావే అని కోపంలో అంటుంటారు కదా!
నాకు ఎంత ఆశ్చర్యమో.. ఈ అమ్మాయికి ఇన్ని విషయాలు ఎలా తెలుసు ? అని. కొద్దిగా జెలసీ కూడా అన్నమాట..
బాగుంది. రసజ్ఞ .. :))))
పింకి గారు చాల బాగ రాసారండి...........
పింకి ఎ బాష పదం చెప్పండి.....??
/ఒకవేళ వారు అలా తినుంటే సకల జ్ఞానులయ్యేవారుట!/
సుక్షత్రియ పుత్రులకు నర పితృమాంస భక్షణమా!!! శివ శివా!
ఏమా కథ? చెప్పండి.
పాండు రాజు అన్న దృతరాష్ట్రున్ని తింటే ఎంకెన్ని విద్యలొచ్చేవో! నూర్గురికి ముందుగా తెలిసివుంటే కురుక్షేత్రమే జరిగేది కాదేమో! :)
బాగుంది మీ పింకి కథ...చెణుకులు కూడా బాగున్నాయి..... :)
మీ బ్లాగ్ నాలో జ్ఞానం రోజురోజుకి పెంచుతుంది.....
ఇంత శ్రమ పడుతున్నారు..అభినందనలు
లెక్క పెట్టే టప్పుడు చిటికెన వేలుతోనే ప్రారంభిస్తాం కూడా. కవులలో ఎవరు గొప్ప అని లెక్కిస్తే 'కనిష్ఠికాదిష్టితి కాళిదాస: అనామికా సార్థవతీబభూవ' అంటూ కాళిదాస కవికంటే గొప్ప కవిలేరని ఒక లెక్క. ఏమైనా బాగా సేకరించి వివరణలు ఇచ్చారు. చిటికెన వేలంత లేవు అని పొట్టివారిని/ చిన్న వారిని ఉద్దేశించి చెప్పడం కూడా ఉంది. దాన్ని కూడా చేరిస్తే మరింత సమగ్రమౌతుంది కదా.పాండురాజు, మరణానంతరం చిటికేనవ్రేలు తినమనే కథ ఉంది. అయితే మానవ మాంసం మహారుచిగా ఉంటుందట. దాన్ని రుచిమరిగితే జాతి అంతరిస్తుందని శ్రీకృష్ణుడు తినవద్దని పలికాడట. మంచి ప్రయత్నం, బాగుంది.
రసజ్ఞ!
మీ బ్లాగ్ని చూస్తుంటే ఓ విజ్ఞాన ప్రపంచమును దర్శించినట్లు ఉంటుంది. మీ ప్రతీ పోస్ట్ లో విజ్ఞాన జ్ఞానజ్యోతులు వెలుగులీనుతాయి. తెలియని విషయాలను తెలుసుకోవడమే కాదు, తెలిసిన విషయాలలో నిగూఢముగా, గుప్తంగా, ధార్మికంగా ఉన్న మర్మాలను తెలియజేస్తుంటాయి. ఒక్కొక టపా ఒక్కొక కాంతికిరణం.
అజ్ఞానులకు వెలుగును ప్రసరించు, విద్యాధికులకు మరింత వెలుగు ప్రసరించు అన్న వివేకానందుని స్పూర్తి మీలో చూస్తున్నాను.
మీరు చిన్ని కృష్ణుడి నోటిలో బ్రహ్మాండం చూపించినట్లుగా ఏది వ్రాసినా ఎంతో సమాచారం !ఇది అంతా ఎక్కడ సేకరిస్తారు.దేవుడి ముందు వయిపు ఉండటం .మంచి పరిశీలన .
తానెంత తపము జేసెనొ
ధ్యానమునకు యీ " కనిష్ఠ " తావయి నిలిచెన్
తానెన్నిట శోధించెనొ
ఙ్ఞానమునకు మా " రసఙ్ఞ " ఘనమై నిలిచెన్
Informative! Thanks.
చాలా బాగా చెప్పారండి.
ఈ కథ భారతంలో వుందాండి? ఎప్పుడూ వినలేదు.
పాండురాజు కోరిక విచిత్రంగా ఉంది. ఇది భారతంలో ఉందా రసజ్ఞ గారూ?
RASAGNA GAARU MEE VELUKU MULLU GUCHCHUKUNDHAA??? IPPUDELA VUNDHANDI??? ANTISEPTIC INJECTION CHEPIMCHUKUNNARA? JAGRATHTHA SUMAA....
రసజ్ఞ గారు, చూశారా?
మీరు చెప్తున్న కథల్లో మైమరచి, మీ వేలు నొప్పి గురించి అడగనేలేదు సుమీ, భారతీయుడు గారి వ్యాఖ్యను చూసి వ్రాస్తున్నా. పరీక్షలన్నీ అయిపోయాక ముల్లు దిగిందా?
chitikina velu gurinchi cheta bhaaratham rasina chadivinchagaligaru.mee jnananiki mee feelings chakkani oohashkthini jodisthey adbhuthamina srujaanathmakatha janisthundhi.srjunaathmakatha mee self-expression roopam lo paatakula hryudayala meeda marintha balamina mudra vesthundi.all the best
చిటికెన వేలంత ముద్దుగా ఉందండి. మీరు ఏం వ్రాసినా బ్రహ్మాండం. మీరు ఎందులో రీసెర్చ్ చేస్తున్నారో, టాపిక్ ఏంటో చెప్పరూ! ప్లీజ్.
మీ బ్లాగ్ కొచ్చిన ప్రతీ సారీ.. ఇదే సందేహం నాకు. ఈవిడ కి ఇన్ని విషయాలు ఎలా తెలుసాఆఆఆఆఆఆఆఅ? అని. పైగా పద్యాలు, మంత్రాల సపోర్ట్.. హహహ...అన్నీ చెప్పి అసలు ఉపయోగం చెప్పటం మానేసారేమండీ..?? ;)))))))))
ఎప్పటీ లాగే అందరితో పాటూ నేనూ రసజ్ఞ గారి బ్లాగ్ కొచ్చాను ఇంత జ్ఞానాన్ని పట్టుకెళ్ళాను.
సరదా సరదాగానే మంచి మంచి విశేషాలు చెప్పేశారండీ రసజ్ఞ గారూ....
ఐనా మీ నవరసాల టైటిల్ చూస్తుంటే, చిన్నప్పుడు నేను నవరసాలని తొమ్మిది రకాల ఫ్రూట్ జ్యూసులుంటే ప్లేసు అనుకునేవాడిని... మీ రాతలు అంత కంటే టేస్టీగానే ఉన్నాయండీ...
చాలా బాగుందండీ పోస్ట్... ఇంకో సారి ఇంకొకటి అలా అలా అన్నీ చదువుతా, నా కామెంట్లకి ప్రతి కామెంట్లివ్వటానికి రెడీగా ఉండండి మరి :)
రసజ్ఞ గారూ! ఏ విషయాన్నైనా సమగ్రంగా శోధించటమే కాదు దాని సమర్ధవంతంగా ప్రెజెంట్ చెయ్యటంలోనూ మీకు మీరే సాటి.
"పింకీ" గొప్పతనాన్ని పురాణాల నుంచీ, క్లాస్ రూము లో తుర్రుమనే పెంకి తనం దాకా చాలా బాగా రాశారు.
ఇంతకీ మీ పింకీ ఎలా ఉందండీ పాపం?
@ కళ్యాణ్ గారూ
హహహ మీకది నచ్చిందా? ఎలా చెప్పాలో తెలియక అలా చెప్పేశా :):) హహహ అవునండోయ్ టైపింగ్ కి చాలా కష్టపడుతుంది! చాలా థాంక్స్ అండీ!
@ లక్ష్మీ దేవి (మందాకిని) గారూ
మా అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండీ! అయితే నా చదువు అయిపోయాక లెక్చరర్ గా సెటిల్ అయిపోవచ్చనమాట:)అవునండీ అలా అంటూ ఉంటారు దానిని అలా చిన్నతనంగా చూడటం నాకెందుకో నచ్చలేదు. ఆ కథ భారతంలో లేదు కానీ చాలా మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు నా వేలు బానే ఉందండీ! మొన్న రెండు రోజులు బాగా ఇబ్బంది పెట్టింది చెయ్యి కదపనీయకుండా కాని ఇప్పుడు బాగుంది. అసలే పెళ్లి కూడా కాలేదు చిటికిన వెలికి ఏమయినా అయితే ఎలాగా అని బాధపడ్డాను ;);)
@ కృష్ణప్రియ గారూ
మీరిలా మెచ్చేసుకుంటుంటే నాకు సిగ్గేసేస్తోంది బాబోయ్ ;) నా మీద జెలసీ దేనికండీ? ఇప్పుడు నాకు తెలిసినవి మీకు కూడా తెలిసిపోయాయిగా ఇంక జెలసీ వద్దండీ :) ధన్యవాదాలు!
@ వనజ గారూ
చాలా థాంక్స్ అండీ!
@ రఘు గారూ
హయ్యో నా పేరు పింకీ చేసేసారా??? థాంక్స్ అండీ! పింకీ అన్నది డచ్చి పదం.
@ SNKR గారూ
ఈ కథ భారతంలో లేదు కాని ప్రాచుర్యంలో ఉంది. ఆయనని తినమని ఆయన చెప్పలేదనుకుంటా అండీ :):) మీ స్పందనకి ధన్యవాదాలు.
@ శేఖర్ గారూ
ఈ పింకీ మనందరిదీ అందరం విలువ తెలుసుకుని గౌరవిద్దాం ;) మీ అభినందనలకి అభివాదాలండీ!
@ డా. సీతాపతి రావు గారూ
అవునండీ! ఎప్పటికయినా కాళిదాసు గురించి మంచి వ్యాసం వ్రాయాలని కోరిక. దాని కోసం దాచుకున్నా ఈ వాక్యాన్ని మీరు చెప్పనే చెప్పేశారు :( ఓహ్! ఈ వెర్షన్ నేను వినలేదు మనవ మాంసం గురించి. ఇది నాకు కొత్త విషయమే! మీ స్పందనకి ధన్యవాదాలండీ!
రసజ్ఞ గారు,
ఏదో ఒక పేరు తో పిలుద్దురూ!
మొత్తం మీద ముల్లు దిగితే పెళ్ళిదాకా వెళ్ళిపోయాయా ఆలోచనలు. అవున్లెండి, పెళ్ళి అయ్యేదాకా ఏ మాటొచ్చినా పెళ్ళిని తలచుకోందే ఆలోచనలు ఆగవు లెండి.
ఇకపోతే లెక్చరర్ అనేమాట చిన్నతనంగా చూసి అనలేదండీ బాబూ, ఇప్పుడు ప్రతీ మాటకీ అర్థాలు మారిపోయాయి. ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేలానూ , ఆసక్తి కలిగించేలానూ చెప్పటం అందరికీ చేతకాదు. అలా చెప్పగలిగే ప్రతిభ ఉన్నదని మిమ్మల్ని అలా అన్నాను. నిజమైన గురువు అంటే నాకెంతో అభిమానం. నేనిప్పటికీ తలుచుకునే టీచర్స్ ఉన్నారు. నిజానికి ఈ మధ్య పద్యాలు వ్రాయటం నేర్చుకోగానే మా మొదటి గురువుఇష్టమైనగురువు నరసరామయ్య గార్ని స్మరిస్తూ ఒక పద్యం వ్రాశాను. మీరు చూసే ఉంటారు.
@ భారతి గారూ
మీ ఈ స్పందనకి నాకు మాటలు కూడా రావటం లేదు! నన్ను అంత గొప్ప వ్యక్తితో పోల్చేసరికి ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు! మీ స్పందనకి నెనర్లు!
@ రవి శేఖర్ గారూ
హహహ బాగుందండీ మీ ఉపమానం. అన్నీ అక్కడా, ఇక్కడా విన్నవీ, చదివినవీ, పెద్దలతో చర్చించినప్పుడు తెలిసినవీను. అన్నిటినీ కలిపి ఒక చోట పెట్టే ప్రయత్నం ఇది. మీ స్పందనకి ధన్యవాదాలండీ!
@ వెంకట రాజారావు. లక్కాకుల గారూ
మీరు వ్రాసిన పద్యాల్లో నాకు ఇది బాగా నచ్చేసింది. "మా" అని టచ్ చేసేసారండీ! ధన్యవాదాలు!
@ జలతారు వెన్నెల గారూ
చదివి స్పందించినందుకు మీకు కూడా!!!
@ రామ్ గారూ
చాలా థాంక్స్ అండీ!
@ భారతీయుడు గారూ
అవునండీ అనుకోకుండా గుచ్చుకుంది బాగా లోతుగా దిగింది. ఈ సంఘటన గుడ్డు ఫ్రైడే నాడు జరగటం వలన సమయానికి డాక్టర్లు ఎవ్వరూ కూడా అందుబాటులో లేనందున రెండు రోజులు ఇబ్బంది పడాల్సొచ్చింది. ఇప్పుడు బాగానే ఉంది. మీ అభిమానానికి ధన్యవాదాలు!
@ తనూజ్ గారూ
హహ! మొత్తానికి చేట భారతం వ్రాసేసానంటారా ;) మీరు చెప్పిన వైపు తప్పక ప్రయత్నిస్తాను ఈ మధ్యన నా పని కొంచెం పుంజుకుంది అందువలన ఇటు వైపు పెద్దగా రాలేకపోతున్నాను. ధన్యవాదాలండీ!
@ జయ గారూ
హహ థాంక్స్ అండీ! నేను రిసెర్చి చేసేది నానోబయోటెక్నాలజీ. నానో పార్టికల్స్ ని పార్కిన్సోన్సుకి ఒక మందు కింద వాడే ప్రయత్నంలో ఉన్నాను.
@ రాజ్ కుమార్ గారూ
హహ థాంక్స్ అండీ! అసలు ఉపయోగం అన్నారు అంటే నేను ఊహించినదే అయితే కనుక చెప్పానండీ "క్లాసులోంచి తుర్రుమనాలంటే చిటికిన వేలే ఆయుధం" ఈ వాక్యాన్ని లోతుగా పరిశీలించండి. అది కాకపోతే ఏదో మీరే చెప్దురూ కాస్త! ఇదేదో మార్గదర్శి యాడ్ లాగ ఉందండీ బాగుంది నా బ్లాగ్కి కింద కాప్షన్ కింద వాడుకుంటా ;) ధన్యవాదాలండీ!
@ చంద్ర మౌళి గారూ
హహ మొత్తానికి టేస్టు చేశారు ;) థాంక్స్ అండీ! తప్పకుండాను మీరు అడగండి ముందు నా వైవా కి ప్రిపేర్ అయినట్టు అవుతాను :) మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తూ......
@ చిన్ని ఆశ గారూ
చాలా థాంక్స్ అండీ! మా పింకీ పెంకితనాన్ని కూడా భరించారు. నా పింకీ ఇప్పుడు దారిలోకి వచ్చిందండీ! ముందు పెంకి వేషాలేసింది కానీ ఇప్పుడు కుదురుగా ఉంది ;) ధన్యవాదాలండీ!
@ మందాకిని గారూ
నాకిదే అలవాటయిపోయింది కనుక ఇదే పిలిచేస్తానే! హహ ఏమో అండీ ఉన్నట్టుండి భయం వేసిందిలెండి! నా అదృష్టం సెలవుల్లో జరిగింది ఈ ప్రహసనం. లెక్చరర్ అంటే నాకు ఎప్పటికీ చిన్న చూపు లేదు. వాస్తవానికి నాకు అందులో చేరాలనే కోరిక. చూసానండీ మీ పద్యాలు చూసి, నా ఈ చదువయ్యాక మీ దగ్గర శిష్యురాలిగా చేరి పద్యాలు రాయాలని కోరిక ఉంది! నా ప్రతిభని మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు!
అబ్బో చిటికిన వేలు గురించి చాలా చెప్పేరే .
@ మాలా కుమార్ గారూ
థాంక్స్ అండీ! మరి చిటికిన వేలంటే మాటలు కాదు చూసారా ఎంత గొప్పదో :):)
అవునూ, మీ వయసు ఎంతండి? లేక జ్ఞాన వృద్ధులా ?
ఆటవిడుపులనుండీ, ఆధ్యాత్మిక విషయాలు దాకా అలవోకగా చెప్పేసారు. దీన్నే అరచేతిలో వైకుంఠం చూపటం అంటారేమో ;)
గురువుగారి ప్రశ్నే నాదీనూ, జ్ఞాన వృద్ధులా ?
బులుసు వారు,
జ్ఞాన వృద్ధులు కారండి, జ్ఞాన జాణ!
చీర్స్
జిలేబి.
హలో రసజ్ఞ గారు....
మీరు నా బ్లాగ్ లో కామెంట్ చెయ్యటం వల్లనా...మీ బ్లాగ్ ని విసిట్ చెయ్యటం జరిగింది....
మీ పింకీ పోస్ట్ చదివాను....చాల బావుంది..
శుభాభినందనలు.
శ్రీ రసజ్ఞ గారికి,
మీరు ఎన్నుకొంటున్న విషయజాతం, దాన్ని వివరిస్తున్న తీరు మీ బోధకత్వనైపుణికి, రచనాకౌశలికి నిదర్శకంగా, అందంగా ఉన్నాయి.
అంతగా ఈ కంప్యూటర్ వ్యాసంగం లేని నేను దీనిని మాత్రం బుక్ మార్క్ చేసి గుర్తుపెట్టుకొన్నాను - అచిరకాలంలో సుప్రకాశితం కాగల మీ మఱుసటి రచనకోసం.
కాళిదాసును అధికరించి ఒక విశిష్టమైన వ్యాసాన్ని రచించే ఆలోచనతో ఉన్నందువల్లనే మీరు "అనామిక" - "కనిష్ఠిక" శబ్దాల వివరణకు పూనుకోలేదని అనిపించింది.
సంస్కారము, సహృదయత ఉట్టిపడే సద్రచనలను చేస్తున్న మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు.
సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు
@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
హహహ! అలా ఆడవాళ్ళ వయసు అడగచ్చా?????? ము. ము. న (ముసి ముసి నవ్వు)
అప్పుడే వృద్ధురాలిని చేసేసారా? చి. కో. కూ. చి. న. (చిరు కోపంతో కూడిన చిరు నవ్వు) ధన్యవాదాలండీ!
@ మురళి గారూ
అయితే మీకు వైకుంఠ దర్శనం అయ్యిందనమాట ;) గురువు గారికి చెప్పిన సమాధానమే మీకూను :P ధన్యవాదాలండీ!
@ జిలేబీ గారూ
చాలా కాలానికి కనిపించారు. బాగున్నారా? ఇంతకీ మెచ్చుకున్నారో తిట్టారో అర్థం కాలేదు కానీ వినడానికి బానే ఉంది ;) ధన్యవాదాలండీ!
@ chicha.ఇన్ గారూ
థాంక్స్ అండీ!
@ రాంకీ గారూ
మీ అభినందనలకి నా అభివాదాలు. ఎలాగయితేనేమి చదివి స్పందించారు ధన్యవాదాలండీ!
@ ఏల్చూరి మురళీధరరావు గారూ
మీకు నా హృదయపూర్వక నమోవాకములు! మీ వ్యాఖ్య ఎన్ని సార్లు చదువుకుని మురిసిపోయానో లెక్క లేదు! చాలా ఆనందం కలిగించింది. అవునండీ కాళిదాసు గురించి ఒక ప్రత్యేకమయిన వ్యాసం వ్రాయాలని కోరిక ఉంది. ముందుగా ఆయన రచనలన్నీ వరుసపెట్టి చదువుతున్నాను. ప్రస్తుతం శాకుంతలంలో ఉన్నాను. పూర్తయ్యాక వ్రాస్తాను. మీ అభినందనలకు, మీ ఆశీర్వాదాలకు నా కృతజ్ఞతలు!
నిజమే నండోయ్.. నేనూ చిటికెన వేలునే ఆయుధంగా వాడి ఎన్నో మార్లు క్లాసు రూం బయటపడ్డాను. .. అంతే కాదు మన కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వారం రోజులు పట్టుకొన్నదీ చిటికెన వేలు మీదే ..ఆధ్యాత్మికంగా లెక్కించేప్పుడూ చేతి కణుపులని లెక్కించడంలో చిటికెన వేలు కింద కణుపుతోనే మొదలు పెడతారు కూడా.. గాడ్ ఈజ్ ఇన్ స్మాల్ థింగ్స్ కదండీ పొట్టిదైనా గట్టిది ఈ చిటికెన వేలు
చిటికిన వేలు గురించెబుతూ చిలకలు(తాంబూల సేవనం) గురించి మీరు చెప్పలేదా, నా దృష్టిదోషమా?
@ kittamoorthikaburlu గారూ
స్పందించినందుకు ధన్యవాదాలు!
@ ఊకదంపుడు గారూ
హహహ! భలే వారే! నేనే చెప్పలేదండీ! నేను చూసినంతవరకూ అన్ని వ్రేళ్ళతోనూ చిలకలు చుట్టారు. అందులో చిటికిన వేలు ప్రత్యేకత నాకు కనిపించలేదు. స్వానుభవం కూడా ఇంకా కాలేదు కనుక వ్రాయలేదు. దాని పాత్రను మీరు చెప్పరూ! ధన్యవాదాలు! మీరు ఆ విషయం తెలియచేస్తారని ఆశిస్తూ.................
Assalu chitikena velu gurinchi keka chepparandi.Ee post chadivake nenu mee blog ki follow avdham ani nirnayinchukunna.Ilaney maaku gnanodayam chestharani bavistu...
Shubhodayam,,,
బాగుందండీ ! చిటికెన వేలు గురించి అన్ని రకాల అంశాలు టచ్ చేసారు గా ఎప్పటి లానే ...కాళిదాసు గురించిన పోస్టు కోసం వెయిటింగ్
@ vajra గారూ
వావ్! మీరీ ఒక్క టపాతోనే అంత ఇంప్రెస్స్ అయిపోయారా? చాలా చాలా థాంక్స్ అండీ నచ్చినందుకు! తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ధన్యవాదాలు! మీకు కూడా శుభోదయమండీ!
@ పరుచూరి వంశీ కృష్ణ గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ! అమ్మో ఇప్పుడు నా టపా ఒకటి శీర్షిక లీక్ అయిపోయిందనమాట :) వ్రాస్తానండీ తప్పకుండా అది నా కోరిక కానీ ఆయన గురించి వ్రాయగలనా లేదా అని చిన్న సంశయం అంతే! ధన్యవాదాలు!
రసజ్ఞ గారు .చిన్న చిటికన వేలుకు గొప్ప గౌరవం కలిగించారు. చిటికనవేలు చూచిననప్పుడల్లా మిరే గుర్తుకు వస్తారు.
@ p.padmavati sarma గారూ
చాలా చాలా ధన్యవాదాలండీ! తప్పకుండా రోజూ చిటికిన వ్రేలు చూసుకుంటారు కదూ నన్నుమర్చిపోకుండా :):)
చాల బాగుంది..ఒక వాక్యం అని కాదు..దేనికదే అద్భుతంగ రాసారు...మీ బ్లాగ్ ఇదే ఫస్ట్ టైం చూడడం...చాలా బాగుంది
I wanted to thank you for this great read!! I certainly loved every bit of it.
I have got you book-marked to check out new things you post…
My web-site :: dating online (http://bestdatingsitesnow.com)
You're so interesting! I do not believe I've read
a single thing like this before. So great to discover somebody with a few original thoughts on this topic.
Really.. thank you for starting this up. This web site
is one thing that's needed on the internet, someone with some originality!
My webpage; TaneshaCBotdorf
Saved as a favorite, I love your web site!
Visit my webpage ... RosalvaYLove
Post a Comment