వచ్చేశా నేనొచ్చేశా నేనొచ్చేశానుగా! అయితే ఏంటి అంటారా? మీరు మరీ అలా అడిగేస్తే ఏం చెప్పమంటారు? మొన్న దీపావళి గురించి వ్రాసినప్పుడు అయిదవ రోజు అయిన భగిని హస్త భోజనం గురించి కొంచెం వివరంగా ఆ రోజు టపాలో చెప్తా అని చెప్పా కదా అందుకే ఈ టపా!
భగిని హస్త భోజనం అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం. ఎందుకు చేయాలిట అని అంటారా? వస్తున్నా అక్కడికే వస్తున్నా! సూర్యభగవానునికి ఉన్న సంతానాలలో యమునా నది యముడికి (యమధర్మరాజుకి) చెల్లెలు. వీళ్ళిద్దరూ కవల పిల్లలు అని కూడా అంటూ ఉంటారు! చెల్లయిన యమునా నదికి అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఆవిడ ఎప్పుడూ అన్నగారిని ఆమె ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని కోరేది. చెల్లెలి మాటని కాదనలేక చిత్రగుప్తునితో, తన పరివారంతో సహా యమలోకాన్ని, తన పనులను వదిలేసి భూలోకం వస్తాడు యముడు. అలా వచ్చిన రోజే ఈ కార్తీక శుద్ధ విదియ. అందువలననే దీనిని యమ ద్వితీయ అని కూడా సంబోధిస్తారు. సరే అలా వచ్చిన అన్న గారిని చూసి యమున ఎంతో సంతోషించి వాళ్ళందరికీ అతిధి సత్కారాలు చేసి, ఎంతో ప్రేమాభిమానాలతో వంట చేసి అందరికీ వడ్డించి విందుభోజనం పెట్టిందిట. ఆమె ఆప్యాయత, అనురాగాలకి మురిసిపోయిన యముడు ఒక వరం కోరుకోమన్నాడుట. అప్పుడు యమున ప్రతీ ఏడాది ఈ రోజు (అనగా కార్తీక శుద్ధ విదియ) తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట ఆరగించే అన్నదమ్ములకు అపమృత్యు భయం, నరకలోకప్రాప్తి లేకుండా ఉండే గొప్ప వరాన్ని అనుగ్రహించమని కోరిందిట. సొంత అక్కాచెల్లెళ్లు లేకపోతే వరస వాళ్ళ ఇంట్లోనయినా భోజనం చేయాలి. ఆ రోజు నుండి ప్రతి ఏటా ఆనాడు యముడు తన చెల్లెలి ఇంటికి వచ్చి తన చేతివంట తిని వెళతానని ఆమెకు మాట ఇచ్చాడు. లోకంలో ఇదే రకమైన ఆచారాన్ని పాటించే మగవారిని ఎన్నడూ అకాల మృత్యువు దరిచేరదని, నరకలోకభయం ఉండదని హామీ ఇచ్చాడు. అంతేకాదు, ఆరోజు ఏ స్త్రీ అయితే తన సోదరులను పిలిచి అన్నంపెట్టి ఆదరిస్తుందో ఆమె జీవితాంతం సుమంగళిగా జీవిస్తుందని, భోగభాగ్యాలతో తులతూగుతుందని యముడు వరం ప్రసాదించాడు. కనుక అప్పటినుండి మనం ప్రతీ సంవత్సరం దీనిని జరుపుకుంటున్నామనమాట!
ఈ రోజున యమధర్మరాజు భూమి మీద ఉండి యమునా నది వద్దకి భోజనానికి వెళ్తాడు కనుక ప్రతీ మగవారు కూడా ఈ ఒక్క రోజు మాత్రం తమ భార్య లేదా తల్లి చేతి వంట కన్నా కూడా సోదరి చేతి వంట తినడానికి మక్కువ చూపిస్తారు. సరే ఇంత చెప్తున్నావుగా ఇంతకీ నువ్వు పెట్టావా? అని పుసుక్కున అడిగేస్తారేమో! అది కూడా చెప్తా. నాకు తోడ పుట్టిన వాళ్ళెవరూ లేకపోయినా ఎప్పుడూ నేను ఒంటరి దానిని అనే ఆలోచన లేకుండా చూసుకున్న అందరికీ నా కృతజ్ఞతలు. ఎంత మంది ఉన్నా కానీ నాకు మాత్రం కార్తీక్ అంటే చాలా ఇష్టం. తోడ పుట్టినవాడు అంటే మనకి తోడుగా ఉండటానికి మనతో పుట్టినవాడు అనేదే సరయిన అర్ధమే అయితే వాడు నా తోడ పుట్టినవాడే. పేరుకి మా పిన్ని కొడుకయినా కానీ మేమిద్దరం ఒకే రోజు పుట్టాం, ఒకే రోజు భారసాల, ఒకే రోజు అన్నప్రాసన, ఒకే రోజు అక్షరాభ్యాసం అలా ఏదయినా అన్నీ ఒకే రోజు చేసుకున్నాం. మా ఇద్దరికీ కేవలం ఎనిమిది గంటలే తేడా. చిన్నప్పుడు ఎవరయినా నీకు తోబుట్టువులు ఎవరూ లేరా అని అడిగితే మా కార్తీక్ ఉన్నాడుగా అనే దానినే తప్ప పిన్ని కొడుకుని అలా చెప్పకూడదు (ట) అని నాకు అప్పటికి తెలియదు. ఇప్పుడు తెలిసినా నేను ఒప్పుకోను.
మేము కలిసేది ఏడాదికి ఒక్కసారే అయినా కలిసినప్పటి జ్ఞాపకాలు మళ్ళీ కలిసే దాకా అలానే కదలాడుతూ ఉండేవి. ఈ మధ్యలో ఉత్తరాలు కూడా వ్రాసుకునేవాళ్ళం. కానీ దానికి తపాలా వాళ్ళు అవసరం లేదు మాకు. మా బంధువులలో ఎవరు మా ఊరినించి ఆ ఊరు వెళ్ళినా లేదా అక్కడనించి ఇక్కడకి వచ్చినా తప్పకుండా లేఖలు ఉండేవి మా మధ్య. లేఖలతో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్న బహుమతులు కూడా. కొన్న వాటిని పంపడం కన్నా నేను నా చేత్తో తయారు చేసినది పంపడానికే మొగ్గు చూపేదానిని. మేము రాసిన లేఖలని కేవలం ఒక కాగితం మీద రాసి మడిచి ఇచ్చేసేవాళ్ళం తప్ప దాని మూతిని బంధించాలని, లక్క, తుమ్మ జిగురు లాంటి వాటిల్తో వాటి పీక నొక్కాలని ఇద్దరికీ తెలియదు. ఒకసారి ఉత్తరాలలో మేమేమి రాసుకుంటున్నామో తెలుసుకుందామని మా ఉత్తరం చదివిన చాలా మంది అవాక్కయ్యారు!!! ఈ మధ్యనే వాడికి నేను రాసిన ఉత్తరాన్ని జత చేస్తున్నా మీరు కూడా చదివి తరించండి (నా దస్తూరీ అర్ధమయితే). గమనిక: ఉత్తరం చదవాలనుకుంటే దాని మీద నొక్కాక view image అని కొట్టాక జూమ్ చేయండి. అక్షరాలు చదవడానికి వీలుగా ఉంటుంది.
మా తమ్ముడిని చూసి ఏడాది దాటినా మేము కలిసి చేసిన తుంటరి పనులు, అల్లరి చేష్టలు, ఎవరు నెమ్మదిగా తింటారా అని పోటీలు పెట్టుకుని తినడం, నేను వానలో తడిసే ప్రతీసారీ మైమరచి మరీ నన్ను చూస్తూ ఆనందించే వాడి ముఖారవిందం, ఇప్పటికీ నాకు నీటి బుడగల కోసం వాడు కొనే సబ్బు నీళ్ళు, ఆడుకోవడానికి కొనే బుడగలు, గోదావరిలో ఇసుక తిన్నెల మీద మేము ఆడుకున్న ఆటలు, చెప్పుకున్న కబుర్లు, పదిలంగా దాచుకున్న ఎన్నో జ్ఞాపకాలు అన్నీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. మా బంధాన్ని చూసి ఆనందించిన వాళ్ళు కొంతమందయితే అసూయ చెందిన వాళ్ళు మరికొందరు. ఎవరేమనుకున్నా నన్ను నన్నుగా ప్రేమించే వాడంటే నాకు మాటలలో చెప్పలేనంత, రాతలలో వ్రాయలేనంత, అసలు ఏ రకంగానూ వ్యక్త పరచలేనంత ఇష్టం. మా బంధం ఇలానే మేము ఉన్నన్నాళ్ళూ కొనసాగాలని ఆశిస్తున్నా. ఇన్ని ఏళ్ళుగా ప్రతీ ఏడాది కలిసే మాకు ఈ సారి కలిసే భాగ్యం లేదు. అందుకే ఇక్కడకి వచ్చినా ఈ ఆచారాన్ని వదలకుండా నేను రాఖీ కట్టిన ఇక్కడ అన్నయ్యలని పిలిచి ఆ ముచ్చట తీర్చుకుంటున్నాను! నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే ఇంతమంది జనాల ప్రేమాభిమానాలు దొరకడం నిజంగా నా అదృష్టం.
నా వ్యక్తిగత విషయాలన్నీ చెప్పేసి మీకు విసుగు తెప్పించేశానా? సరే నేను ఇంత మొత్తుకున్న దాన్ని బట్టి మీ తక్షణ కర్తవ్యం ఏమిటి? ఇంకా చదువుతారేమిటండీ? ఆడవాళ్ళూ ముందు వెళ్లి మీ మీ వరస వారినన్నా భోజనానికి పిలవండి, మగవారు మీ మీ సోదరీమణుల ఇంటికి వెళ్లి ఎంచక్కగా భోజనం చేసి, తాంబూలం వేసుకుని అప్పుడు ఇక్కడకి మళ్ళీ వచ్చి నాకు థాంక్స్ మాత్రం చెప్పకండే!
28 comments:
వార్నాయనో..తిట్లు కావాలంటే ఈ సారి మీకొక మైల్ కొట్టాలండి.
మంచి సమాచారమిచ్చారు.
హాప్పీ భాయి దూజ్ అండీ.
రసజ్ఞా మీ చేతి వ్రాత ముత్యాల్లా చాలా అందంగా ఉంది. మీ ఉత్తరం భలే సరదాగా ఉంది. నిజంగా అలానే వ్రాసుకున్నారా? అన్నా చెల్లెలి గురించి చాలా విషయాలు చెప్పారు. మీకిన్ని విషయాలు ఎలా తెలుస్తాయసలు? మీకు మంచి సోదరుడున్నాడన్నమాట. బావుంది బావుంది.
చాలా బాగుంది. కాని యమవిదియ మన ప్రాంతంలో ఆచరణలో లేదు.ఉత్తరాదిని దీన్ని చాలా వేడుకగా జరుపుతారు. కారణం ఊహించగలను కాని చెప్పను.సత్యం బ్రూయత్ ప్రియం బ్రూయత్ న బ్రూయత్ సత్య మప్రియం.
LOL! మీ ఇనప సామాన్ల భాష అమోఘం! బాగుంది.
శర్మ గారు చెప్పలేదు. ఉత్తరాదిన ఎందుకు పెద్ద వేడుక గా జరుపుకుంటారో ..(Compared to south) మీకు తెలిస్తే చెప్పండి.
మీ తమ్ముడు చాలా ఆనందిస్తాడు ఇది చదివితే.. మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకొంటూ ..
భగినీ హస్తభోజన శుభాకాంక్షలు తెలియజేసుకొంటూ ..
-Urs Anonymously :)
దస్తూరి బాగుంది రసగుల్లా..చివర్లో అది సంతకమా అండీ..నాకేదో బాపూ గీతలా కనిపించిందేమిటో నండీ.. మీక్కూడా ఎవరూ లేరా, ఐతే ఒకసారి గట్టిగ్గా గిల్లుకోండి. నాకు ఆ కేక వినిపించాలి సుమా..లేకుంటే నేను పూనుకోవాల్సి వస్తుంది. బాగుంది మీ అక్క తమ్ముళ్ళ అనుబంధం.. ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ...
రసఙ్ఞగారూ,
ఒక హైందవ స్త్రీ బాధ్యతలను తను మరణించేవరకూ ఎవరెవరు నిర్వర్తించాలో చక్కగా ఏర్పాటు చేయబడింది. దాన్ని జనానికి పరోక్షంగా వివరించి చెప్పటమే ఈ 'భగినీ హస్త భోజనం' విశిష్టత. ఒక ఆడపిల్లకి పెళ్ళి అయిన తరువాత అత్తవారిల్లే తన ఇల్లనీ, భర్తే సర్వస్వమనీ చెబుతారు. అంతమాత్రముచేత పుట్టింటివారు తమ బాధ్యతలను తప్పించుకోకుండా చేసిన ఏర్పాటు ఇది. ఇక్కడ అన్నదమ్ములకు ప్రాధాన్యత ఇవ్వటంలో కూడా మన పెద్దల ముందుచూపు కనబడుతుంది. తల్లిదండ్రులకన్నా ఎక్కువకాలం కలసి జీవించే అన్నదమ్ములకు ప్రాధాన్యతనివ్వటం ద్వారా స్త్రీకి మరింత రక్షణ చేకూర్చటం మనం గమనించాలి. అలాగే తన చిన్ననాటి స్నేహితుడు, తన మనసెరిగినవాడూ అయితే కష్టం సుఖం చెప్పుకోవటం తేలిక. అలాంటి అవకాశమిస్తుందీ సందర్భం. అలాగే హిందూ సాంప్రదాయములో స్తీకి అత్తింటి విషయాలు పుట్టింటికి చేరవేయటం అనేది నిషిద్ధం. కనుక పుట్టింటివారు తమ ఆడబిడ్డ పరిస్థితి, తన భర్త వైఖరి ఇత్యాది విషయాలు స్వయంగా చూసి తెలుసుకునే అంశమూ ఇందులో ఇమిడి ఉంది.
@ భాస్కర రామి రెడ్డి గారూ
బహు కాల దర్శనం! అయ్యో తప్పకుండా ఒక్కటండి మెయిల్ ఒక నాలుగయిదు బస్తాలు పంపిస్తాను అలా ఒక పక్కన పడుంటాయి. కావలసినప్పుడు వాడుకోవచ్చు!
@ ఎన్నెల గారూ
ధన్యవాదాలు! మీకు కూడా!
@ జ్యోతిర్మయి గారూ
వావ్ చాలా చాలా థాంక్స్ అండి నా చేతి వ్రాత నచ్చినందుకు! మా ఉత్తరం ఇలానే ఉంటుంది అండి! చిన్నప్పటినుండి ఎవరయినా చదివేస్తారేమో అని ఇలా కోడ్ పెట్టుకుని మాట్లాడటం అలవాటు మాకు. అవునండి చాలా మంచి సోదరుడు.వాడు నా మనసుకి ఒక కాపీ అనమాట!
@ శర్మ గారూ
నిజమే ఇటు వైపు అంతగా పాటించరు కాని కొంతమంది పాటిస్తూ ఉంటారు. ఈ వంకనన్నా కలవచ్చు కదా అని! ఇక్కడ మీరు అప్రియమయిన సత్యం చెప్పకూడదు అన్నారు అదీ వాస్తవమే కాని ఇందులో బాధపడటానికేమి లేదు కనుక మీరు చెప్తే బాగుంటుంది!
@ కృష్ణ ప్రియ గారూ
హహహ థాంక్స్ అండి! హా మరి లేకపోతే అందరికీ అర్ధమయిపోదూ!
నాకు అలా అక్కడ ఎక్కువగా జరుపుకుంటారని తెలుసు కాని ఎందుకు అన్నది తెలియదండీ! అయినా శర్మ గారిలాగా ఊహించడం నా వల్ల కాదులెండి! ఆయనే చెప్తారేమో వేచి చూద్దాం!
@ అజ్ఞాత గారూ
చాలా చాలా ధన్యవాదాలు! మీకు కూడా శుభాకాంక్షలు!
@ సుభాషిణి గారూ
హమ్మయ్య వచ్చేసారా! ఇందాకే తీపి తిందామని అనిపించింది. ఇదిగో ఈ లోపే మీరు తెచ్చారు. థాంక్స్ థాంక్స్ నా దస్తూరీ నచ్చినందుకు. మీకు చివర్లో బాపూ గీతాల కనిపించింది నా పేరండీ. మనకి short hand ఉంటుంది కదా! అలానే ఇది స్పానిష్ భాషలో నా పేరుకి short hand అనమాట. దీనిని taquigrafia అంటారు. మీరు చెప్పినట్టే గిల్లుకున్నాను (మా రూంమేట్ ని) వినిపించిందా (తన) కేక! మీరు పూనుకుంటే మరీ మంచిది. కలిసినట్టు అవుతుంది ఏమంటారు? ధన్యవాదాలండీ!
@ అరుణ్ గారూ
నిజమే! చాలా చక్కగా చెప్పారు!
మీ లెటరు చదివాక నవ్వు ఆపుకోలేకపోతున్న! తూట్లు పడిన మోకాలికి మాట్లు వేస్తారా? హహహహహః సూపెరో సూపేరు మీ చేతి రాత బాగుంది!
చాలా బాగుంది రసజ్ఞ గారు. నాకైతే ఇది కొత్త విషయమే. మీ అక్కా తమ్ముళ్ళ అభిమానం ముచటగా ఉంది.
మా వాళ్ళు ఇది క్రమం తప్పకు౦డ ఆచరి౦చే వారు.కాని ఇప్పుడు ము౦దులా లేరు :)
నెనర్లు అజ్ఞాత గారూ
@ జయ గారూ
చాలా ధన్యవాదాలు!
@ మౌళి గారూ
మీ స్పందనకి కృతజ్ఞతలు! మామూలుగా (in general చెప్తున్నా) ఈ కాలంలో మన సంస్కృతికి ఆచారాలకి తర్పణాలిచ్చే వారు ఎక్కువవుతున్నారండీ! ఏమయినా అంటే మాకు తీరికేది అంటారు!
Rasagna garu,
Mee akkathammullla anubhandham gurinchi chaduvuthunte.. cant express lendi...
aa letter ni ila choopinchinanduku thanks... personal vi evaru ala choopincharu kada..
aa titlu entandi babu.... evado vadu vinte.. uresukuntadu...
Inthaki Karthik.. aa titlu thana daggaraki cheravesada ledaa??
Mee akkathammull anubhandham ila jeevithantham ilage undalani korukuntu..
mee .....
@రసజ్ఞ గారు అసలు ప్రేమను పంచుకోడానికి కూడా తీరిక లేకుంటే ఇంక నా మటుకు నేను వ్యర్ధమే ... పైవిధంగా మీరు చెప్పినట్టు అవునండి అంటుంటారు.. నేను కూడా చాలా సందర్భాలలో అన్నాను కూడా ... అలా అని అని ఎంతో కోల్పోతాము.. తోబుట్టువు కి ఎంతో ప్రాముక్యత ఉంటుంది.. కొంత మంది రక్తం పంచుకుని పుడతారు.. మరికొందరు మనకు తోబుట్టువు కాకపోయినా తెలియకుండానే ప్రాణమైనా పంచుకుంటారు ... ఏ సందర్భమైనా సాటి ప్రేమ చూపే మనిషికి ప్రాముక్యత ప్రాణంతో సమానం.. ఈ విధంగా నాకు కొందరు చెలెల్లు దొరికారు... దొరికారెంటి అని చూస్తున్నారా నాకు చెల్లి లేదండి ... నాకు భలే ఇష్టం ఉంటే బాగున్నే అనుకునే వాడిని... అల కొంతమంది నాకు ప్రానమైపోయారు వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధం లేకుండానే ... నాకు ఏది చెప్పదలచుకున్నా వారితో చేపుకుంటుంటాను .. ఇలా మీది చదివిన వెంటనే నావి పంచుకోవాలని తోచి ఇలా పంచుకున్న... చాలా సంతోషం .. మీ అనుబంధం హల్వా ( నాకు అది ఇష్టం అండి అందుకు ) లాగ ఎంతో బాగుంది :) ... మీది ఈవిదంగానే ఉప్మా పెసరట్టు లాగ ఎల్లపుడు కలిసి ఉండాలని... పాలు నీళ్ళగా కలిసిపోవాలి.. ఇహ పోతే మీ లేఖనం లో తెలుగు ఎక్కువ ఉందో లేక ప్రేమ ఎక్కువ ఉందో పోల్చలేకున్నాను ... అక్షరం బాగుందో లేక అంతకు మించి అనుబంధం బాగుందో అని చెప్పలేకున్నా... కావున అన్ని బాగున్నాయి అని నిర్దేశిస్తూ సెలవు మరి ధన్యవాదాలు ....
@ అజ్ఞాత గారూ
ధన్యవాదాలు! అదీ నా పర్సనల్ అయినా మీకు అర్ధమయినప్పుడు కదా! అందుకే చూపించా! నాకు కోపం వస్తే అంతే అండి అలానే తిడతాను! ఏం చేయమంటారు మరి? లేదండీ ఇంకా చేరవేయలేదు! మీ కోరిక నెరవేరాలని ఆశిస్తూ..........
@ కళ్యాణ్ గారూ
వచ్చారా? ఏంటండీ ఈ సారి కవితని తీసుకుని రాలేదు! నేనింకా మీరొక మంచి కవితతో వస్తారనుకుంటేను నిరాశ పరిచారు! మీ స్పందన బాగుంది మీ వ్యక్తిగత విషయాలని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు! ఉప్మా పెసరట్టులాగా కలిసుండాలి అన్నారు కాని నాకు ఉప్మా ఇష్టం లేదు కనుక పెసరట్టు, నూనెలాగా (పెసర పిండి లాగా అన్నా పర్లేదు) కలిసుండాలి అనరా ప్లీజ్! ఇహ మీరు వ్రాసిన ఆఖరి రెండు వరుసల పదాల జల్లులలో తడిసిన నా మనసు ఆనందతాండవం చేస్తోంది! కృతజ్ఞతలు!
@రసజ్ఞ గారు హహ దాందేముంది పెసరట్టు, నూనెలాగా ఎల్లప్పుడూ కలిసుండాలి :)
క్షమించాలి అయితే ఏముంది ఇపుడు రాసేస్తాను . ఏదో రాసేస్తున్నా చదివేస్కోండి
ఒకరోజు ఎగురునులే అ తోక లేని పిట్ట
తమ్ముడికి చెప్పునులే మీ మనసులో మాట
మీ ఇరువురి అనుబంధానికి అంతులేదంట
మీ కథను విన్నవారికి ఆత్మీయత అంటే తెలిసొచ్చునంట :)
@ కళ్యాణ్ గారూ
హహహ థాంక్స్ అండి! బాగుంది మీ రచన! అది కళ్యాణ్ గారు ఇప్పటికి మీ అసలు ప్రతాపం బయటకి వచ్చింది! చాలా చాలా థాంక్స్ నా కోసం ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ పెట్టినందుకు!
@రసజ్ఞ దాందేముంది పర్లేదండి :)
రసజ్ఞ గారూ!పురాణ ఇతిహాసాల పై మీ పట్టు చాలా బావుంది. అవగాహనను ఆధునికీకరించి చెబితే ఇప్పటి వాళ్లకు ఇంకా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆధునికీకరణ అంటే పాము కోక్ అయినా తాగుతుందనడం లాగ కాదు. అసలు పాలు తాగదన్న విషయం ఆ మధ్య geographic channel లో చూసి, విన్నాను. అటువంటి విషయాన్ని మీరు మరింత శాస్త్రీయంగా చెప్పగలిగితే బావుంటుంది. అటువంటిది మీ లాంటి వాళ్ళ వల్లే అవుతుంది. నమ్మిందే, నమ్మించడానికే చెప్పేకంటే--గతంలోని గొప్పను, గుడ్డి నమ్మకాలను హంస లాగ మీరు వేరు చేసి సశాస్త్రీయంగా చూపగలరు. సోదరి ప్రేమ పై మీ సొంత అనుభవం అద్భుతం. కోడ్ భాష గురించి వేరే చెప్పక్కర్లేదు. చివరగా--- ఆ గడ్డపార/గునపం గార్ని గురించి తెలుసుకోవాలని అనిపిస్తోందేవిటో ఖర్మ.
రాజా.
@ రాజా గారూ
ముందుగా మీకు కృతజ్ఞతలు! ఇకనించి తప్పకుండా మీ సూచనలన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటాను! హహహ ఎందుకండీ పాపం తెలుసుకుని?
చాలా బావుంది. ఐతే మీరు యముడి పేరెత్తినప్పుడల్లా నాకు ఆ గెటప్‌లో మోహన్‌బాబు కళ్ళముందు కదుల్తూ యమున పాత్రకి ఏ నటీమణి అయితే కరక్ట్‌గా ఉంటుందా అనే ఆలోచనలో పడేశాడు!
@ కొత్తపాళీ గారూ
నెనర్లు! హహహ అయితే మీరు ఓ సారి ఊహాలోకానికి వెళ్ళి వచ్చారనమాట! ఇంకెవరు యమున పాత్రకి యముననే పెట్టేద్దాం! ఏమంటారు?
@ యుగంధర్ గారూ
అయ్యో, భలేవారే! నేనేమీ అనుకోను :) అలా అనకపోవడానికి కారణం ఒకటే. అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వస్తారు కదా అని సాధారణంగా చెప్పరు. ధన్యవాదాలు!
Post a Comment