Monday, February 04, 2013

తౌర్యత్రిక కళ


మానవుడు మనోహీనుడై జీవించలేడు. కనుక మానవునిగా మహోన్నత స్థితిని పొందాలన్నా, మానసిక ఆనందాన్ని పొందాలన్నా కళల సాన్నిహిత్యం తప్పనిసరి. తనంతట తాను ప్రకాశిస్తూ ఇతరులను సైతం ప్రకాశింపచేసేది కళ. "మనిషిలో మంచిని పెంచి, అమానుష లక్షణాలను త్రుంచి, పురుషోత్తమునిగా మలచుటకు, సర్వమానవ కళ్యాణానికీ, సాంస్కృతిక ఉన్నతికీ, దోహదపరచుటే కళకు ప్రయోజనం" అని ధర్మపురి కృష్ణమూర్తి గారు చెప్పారు. కళకు ఒక నిర్వచనం చెప్పటం అంత సులభం కాదు, ప్రకృతిలోని ప్రతీ దృశ్యమూ కళాత్మకమయినదే. "కళా సమన్వితమయిన జగత్తు సుందరమయినది, సుందరమయిన జగత్తు విశాలమైనది, విశాలమైన జగత్తు అనంత చైతన్యముతో విలసిల్లునది. ఈ బహుముఖ ప్రజ్ఞా తేజస్సు కళ వల్లనే ఆవిర్భవించుచున్నది" అని కళాశబ్దం ప్రస్తుతింపబడినది. మనకున్న 64 కళలలో, కొన్ని (చిత్రలేఖనం, సంగీతము, నృత్యము, నాటకము, మొ.) మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలను చూపిస్తాయి, వాటినే లలిత కళలు అంటారు. ఈ లలిత కళలనే జయదేవుడు గీత గోవిందంలో (మూడవ శ్లోకం) విలాస కళలుగా పేర్కొన్నాడు. వీటిల్లో ప్రథమ గణ్యమైనదీ, పరమోదాత్తమైనదీ, సర్వకాల సర్వావస్థలయందు మానవుని మనుగడతో పెనవేసుకొన్న అపూర్వ కళాసృష్టి, సర్వకళల సమాహార స్వరూపంగా చెప్పబడేదే తౌర్యత్రిక కళ.

సంగీత, సాహిత్య, నాట్య కళల సమాహార స్వరూపమయిన కళను తౌర్యత్రిక కళ అంటారు. ఇటువంటి తౌర్యత్రిక కళలలో ముఖ్యమయినది "హరికథ". సాధారణంగా గాయకుడు గానంలోనూ, సాహిత్యకారుడు సాహిత్యంలోనూ, నాట్యకారుడు నాట్యంలోనూ మాత్రమే తన ప్రతిభను చూపిస్తాడు. కానీ  తౌర్యత్రిక కళగా చెప్పబడుతున్న హరికథను చెప్పేవాడు మాత్రం అభినయ కళను కూడా జతచేసి ఈ మూడిటిలోనూ (సంగీత, సాహిత్య, నాట్యాలలో) ప్రతిభను చూపించాలి. హరికథలు వేదకాలం నుండీ ఉండేవి, అగ్నివేశాది మహర్షులు సృజించగా, బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ నిత్యం హరికథా గానం చేస్తాడు. లవకుశలు ఇరువురూ హరికథా గానం చేసినట్టు రామాయణంలో కూడా ఉంది కదా! హరికథ దివ్యమయిన (దివిభవం దివ్యం - అనగా స్వర్గమున పుట్టినది అనే వ్యుత్పత్తి ఆధారంగా ఇది దివ్యం) కళ. "ఈ హరికథా ప్రక్రియ మహారాష్ట్రలో రెబ్బటిల్లి, తమిళ దేశంలో చిగిర్చి, ఆంధ్ర దేశంలో పూసి, కాసి, ఫలించింది" అని శ్రీ కడలి వీరదాసు గారు (హరికథా మహోత్సవ ప్రత్యేక సంచికలో) తెలియచేశారు.

యావదాంధ్ర వాఙ్మయములో బహుముఖ వైవిధ్యమును, వైశిష్ట్యమును కలిగిన విశాల సాహిత్య శాఖగానూ, సాహితీ ప్రక్రియలన్నింటిలోనూ పరమోత్కృష్టమైన శాఖగానూ పేరు ప్రఖ్యాతలు పొందిన యక్ష గానమే హరికథగా రూపాంతరము చెందినదని విజ్ఞుల అభిప్రాయము. హరికథా పితామహులుగా ప్రసిద్ధుడైన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన ప్రహ్లాద చరిత్ర అను హరికథావతారికలో యక్షగానాలకు హరికథలకు అభేదం చెప్పారు. అయితే, ఈ రెంటికీ ప్రదర్శన విషయంలో కొంత భేదం కనిపించినా, అంగాలు, కీర్తనలూ, తత్వనలూ అన్నీ ఒకే విధంగా వుంటాయి. మరి రెంటికీ భేదం ఎక్కడుందంటే, యక్షగానంలో బహుపాత్రలను అనేకమంది నిర్వహిస్తే, హరికథలో ఒకే వ్యక్తి బహుపాత్రలను నిర్వహిస్తాడు. అందువలననే యక్షగానము కన్నా కూడా హరికథ ఉత్కృష్టమయినది. ముల్లోకాలనూ పునీతం చేసి, జాతిని తీర్చిదిద్ది, భారతీయ సంస్కృతికి నిజమైన దర్పణంగా నిలిచి, ఆబాల గోపాలాన్నీ ఆహ్లాదపరుస్తూ, అవ్యక్త మధురానుభూతిని ప్రసాదించే మహోన్నతమయిన కళ హరికథ. హరిని కీర్తించుటే హరికథ. "అనగా బ్రహ్మము అనగా వుండునది. బ్రహ్మమును కలిగి వుండి, వినుట ద్వారా బ్రహ్మమును పరిచయం చేసేదే  కథ" అని శ్రీ తంగిరాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నిర్వచించారు. హరికథ చెప్పేవారిని కథకుడు అంటారు. భక్తి రస ప్రధాన పురాణ గాథలలో ఏదైనా ఒక అంశం తీసుకుని, గద్యములు, పద్యములు, గానము, హాస్యము, చతురత, సమయస్ఫూర్తి, మొదలైన వాటిని చొప్పించి శ్రోతలను ఆకట్టుకుంటూ ప్రవచించటమే హరికథ. 

భావంబొప్పవలెన్ ముఖాన నిసలౌ పాండిత్య మేతత్కళా
జీవంబై రససిద్ధి బొందవలె నౌచిత్యంబుపన్యాసవా
ణీవిన్యాసమునన్ ఘటిల్లవలెన్ దానేసర్వపాత్రంబులై
ప్రావీణ్యంబులన్ నటింపవలె విద్వాంసుడు సమ్యద్గతిన్   

అంటూ శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసు గారు కథకుడు బహుపాత్రలను పోషిస్తూ కథకు రక్తినీ, తుష్టినీ చేకూర్చాలని చెప్పారు. కథకుడు సందర్భాన్ని బట్టే కాకుండా సభికులను బట్టి కూడా కథాగమనం కొనసాగించాలి. కనుక ముందుగా బాగా సాధన చేసి వెళ్లి హరికథ చెప్పేసి వచ్చేస్తే అది రక్తి కట్టదు. కథకుడు ఎప్పుడూ కూడా సభికులను ఆకట్టుకొనే విధంగా వ్యాకరణ పండితులున్న సభలో వ్యాకరణ పరిజ్ఞానాన్ని, సాహిత్యజ్ఞులున్న సభలో కవితా ప్రాభవాన్ని, సంగీతజ్ఞులున్న సభలో సంగీత ప్రజ్ఞను ప్రదర్శిస్తూ, పామరులు వున్న సభలో వారిని రంజింప చేసే విధంగా పిట్ట కథలు, ఉప కథలు, హాస్యం జోడిస్తూ మూల కథకు అడ్డు రాకుండా, ప్రచార విషయానికి భంగం కలిగించకుండా సభనంతటినీ ఆకట్టుకుంటూ చెప్పగలిగినవాడే తన లక్ష్యాన్ని సాధించి, ప్రజలలో తాననుకున్న మార్పును తీసుకువచ్చి, వారికి మార్గ దర్శకుడవుతాడు. ఇంకా సూటిగా చెప్పాలంటే హరికథకుడు నవరసాలూ పోషిస్తూ, అన్ని రసాలకూ ఏకాగ్రచిత్తుడై వుండాలి. ఇన్ని చేయాలి కనుకనే హరికథ కష్టమయినా కానీ అన్ని వర్గాల వారినీ అలరిస్తుంది.

మొదట భక్తి తత్వమే ప్రాణంగా హరికథలు ఆవిర్భవించాయి. అద్వైత సిద్ధి మొదలు ఆటవిక విశ్వాసం వరకు ఏ రకంగా ప్రదర్శింపబడినా అది భక్తిగానే పరిగణించారు. వీటి వలన ఆధ్యాత్మిక ప్రభోదం కూడా జరిగేది. ఇటువంటి హరికథల వలన కథకులు మోక్షసాధన కోసం సంగీత, సాహిత్య, నాట్యాలను ఆలంబనగా చేసుకుని, వైష్ణవాన్నీ, శైవాన్నీ సమానంగా భావించి, సామాజికుల చేత కూడా భావింపచేసి సర్వమత సామరస్యాన్ని చాటేవారు. కొంతకాలం ఇటువంటి హరికథలు కేవలం హిందువులకే పరిమితమయ్యి, హైందవ సంప్రదాయాన్ని ఎక్కువగా ప్రదర్శించడం వలన హైందవ మత ప్రచారానికే ఎక్కువగా దోహదం చేస్తూ వచ్చాయి. కాలం గడిచే కొద్దీ, ఇతర మతస్థులైన క్రైస్తవులను, మహమ్మదీయులను కూడా విశేషంగా ఆకర్షించింది. ప్రజల్లో ఏ విషయాన్ని ప్రచారం చేయాలన్నా (అప్పట్లో మరి ప్రచార సాధనాలు తక్కువ కదా!) హరికథా ప్రక్రియే సరైన, శక్తివంతమైన మార్గమని గుర్తించారు. వారి మత ప్రచారానికి ఆలంబనగా "హరి" శబ్దాన్ని అడ్డుగా భావించకుండా ఒక కథా కాలక్షేపంగా వారు ఏసు ప్రభువు జీవిత చరిత్రను, మహమ్మదీయుల చరిత్రలను కూడా కథా రూపాలుగా చేసుకుని వానిని హరికథలుగా మలచుకుని ప్రచార యోగ్యంగా కూర్చుకున్నారు. రాన్రాను కాలానుగుణంగా భగవత్సంబంధిత గాథలే కాక, దేశనాయకులు, క్విట్ ఇండియా, కుటుంబ నియంత్రణ, సమాజాన్ని పీడిస్తున్న అంశాలు, మొదలయినవెన్నో ఇతివృత్తాలుగా చేసుకుని హరికథలు చెప్పటం ప్రారంభించారు. ప్రజల నుండీ ఇటువంటి కథలకు మునుపటి వాటికంటే ఆదరణ, ప్రోత్సాహం ఎక్కువగా లభించాయి.

హరికథలు చెప్పటమే కాదు, వ్రాయటమూ ఒక కళే. శ్రీ రాంపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు "కుమార సంభవము" ను, శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు గారు "అభిజ్ఞాన శాకుంతలం" ను, చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు "మాళవికాగ్ని మిత్రమ్" ను హరికథలుగా రచించారు. వీటి ప్రదర్శనల ద్వారా మన దేశానికే పరిమితమయిన హరికథలను విదేశీయులు సైతం అబ్బురపడేలా చేశారు మన హరికథకులు. శ్రీ అమ్ముల విశ్వనాధం గారు మలేషియాలో, శ్రీ వీరగంధం వెంకట సుబ్బారావు భాగవతార్ గారు అమెరికాలో, శ్రీ బోడావుల సీతారామయ్య భాగవతార్ గారు జర్మనీ, పారిస్, లండన్ వంటి దేశాలలో పలు ప్రదర్శనలిచ్చి, వాటి ద్వారా వారిలో భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పరచడమే కాక, భారతీయ కళల పట్ల వారికి ఉన్నతమైన అభిప్రాయాన్ని కూడా కలిగించారు. ఇంతటి మహోన్నతమయిన హరికథకు పితామహులైన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి గురించి ఒక్క మాటలో (తాతారావు గారి పలుకుల్లో) చెప్పాలంటే: 

హరికథా ప్రక్రియకు ఆద్యుండు కవితలో
కాళిదాస పోతనలకు సాటి
ఆదిభట్ట బుధుడు అన్నిటన్ మొనగాడు
ఆట పాట మాట లందు మేటి
ఇంతటి అపూర్వమయిన కళ అంతరించిపోకుండా ఎంతో మంది నేర్చుకోవాలనే సదుద్దేశ్యంతో హరికథా శిక్షణకు ప్రత్యేకంగా ప్రప్రధమంగా 10-6-1973న కపిలేశ్వరపురం (రాజమహేంద్రవరానికి 36కిలోమీటర్ల దూరం), తూర్పు గోదావరి జిల్లాలో "హరికథా పాఠశాల"ను శ్రీ యస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు (కపిలేశ్వరపురం జమీందారు)గారు స్థాపించి, ప్రధానాచార్యులుగా శ్రీ కడలి వీరదాసు (శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి శిష్యుడు) గారిని నియమించారు. మన జాతి కళలు కాపాడుకోవలెనన్న ఆశయంతో ప్రభుత్వం వారు ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్ధులలో కొంతమందిని ఎంపిక చేసి స్కాలర్షిప్ కూడా ఇస్తారు. ఈ పాఠశాలలో అయిదు సంవత్సరాల శిక్షణాకాలం పూర్తయిన తరువాత పరీక్షలను నిర్వహించి, "హరికథా ప్రవీణ"  అను ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, వారిని ప్రదర్శనకు యోగ్యులుగా నిర్ణయిస్తుంది. ఈ సంస్థ నుండి తయారైన బాలబాలికలు తెలుగులో మాత్రమే గాక సంస్కృతంలో కూడా హరికథలు చెబుతూ ఎన్నో సత్కారాలు పొందారు. వారిలో ప్రముఖులు దాలిపర్తి ఉమామహేశ్వరి గారు. ఉజ్జయినిలో  కాళిదాస అకాడమీ వారు నిర్వహించే అంతర్జాతీయ సెమినార్ లో ఈవిడిచ్చిన ప్రదర్శనల ద్వారా హరికథా ప్రక్రియకు ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు లభించాయి.

మన రాష్ట్రంలో జానపద కళారూపాలుగా చెప్పబడుతున్న హరికథలు, బుఱ్ఱకథలు, మొదలైన వాటిని ప్రోత్సహించాలని తెలుగు విశ్వవిద్యాలయం వారు హరికథా రచనా పోటీలు, హరికథా ప్రవచనా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి కులపతి గారైన ఆచార్య శ్రీ దోణప్ప గారు రచించిన "తెలుగు హరికథా సర్వస్వం" అనే పుస్తకాన్ని (హరికథకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ పొందుపరుస్తూ) అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. డా. డి. శారద గారు రచించిన "హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనాలు" (ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండీ పి.హెచ్.డి. పొందిన గ్రంధం) అనే పరిశోధనా గ్రంధంలో హరికథల వలన దేశానికి జరిగే మేలు ఎలాంటిదో కూడా బాగా వివరించారు. ఈ రెండు పుస్తకాలనూ క్షుణ్ణంగా చదవటం వలన హరికథా ప్రక్రియల ప్రాచీన స్వరూపం నుండీ ఆధునిక స్వరూపం దాకా ప్రతీ విషయమూ వివరంగా తెలుస్తుంది.

కొన్ని చక్కని హరికథలను ఇక్కడ వినవచ్చును. పాత చలన చిత్రాలలో హరికథలు ఎక్కువగానే కని, వినిపించేవి కానీ ఈ మధ్యన వచ్చిన చిత్రాలలో దేవస్థానం అనే చలనచిత్రంలో చాలా కాలం తరువాత దండిభట్ల నారాయణమూర్తి గారు, స్వర వీణాపాణి గారు రచించిన హరికథలను (సామాజిక) వినిపించి మరచిపోతున్న హరికథా ప్రక్రియను గుర్తుచేశారు.

One must die as an artist to be reborn as a Yogi అన్న అరవిందుని సూక్తి కళాకారులకున్న ఔన్నత్యాన్ని చాటుతోంది. దీనిని ఎప్పుడూ జ్ఞప్తిలో వుంచుకుని, ఇటువంటి కళలను కాపాడుకుంటూ, తరువాతి తరాలకు పంచవలసిన (కనీసం పరిచయం చేయవలసిన) బాధ్యత మనందరి మీదా వుందని భావిస్తున్నాను. హరికథకు పూర్వ వైభవం దక్కాలని మనసారా కోరుకుంటూ...............

Monday, January 07, 2013

కుబేరుడు



నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో…..

సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, భూతేశుడు, గుహ్యకాధిపతి, కిన్నెరరాజు, మయురాజు, నరరాజు. అథర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు కూడా! కుబేరుడు అనగా అవలక్షణమయిన (లేదా అవలక్షణాలున్న) శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరగుజ్జులా), పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్ళు, ఒకే కన్ను, ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన ముఖము ఎడమవైపుకి వాలినట్టు ఉంటుందనీ, మీసం, గడ్డం కలిగి ఉంటాడనీ, దంతాలు బయటకి వచ్చి (వినాయకుని దంతాల వలె) ఉంటాయనీ ఉంది. అదే విధముగా, శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం, కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది. కైలాసం వద్దన ఉండే అలకానగరం కుబేరుని నివాస స్థలం.

ఈయన జనన సంబంధిత విషయాలు శ్రీ శివ పురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకి చెప్తున్నట్టు వస్తుంది. ఆ ప్రకారంగా, పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు - సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేద, వేదాంగాలు, శాస్త్ర, పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి, ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లయిన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా గారాబంతో మందలించకపోగా, భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్య కలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడయినా కొడుకు గురించి భార్యను వాకబు చేస్తే, ఆవిడ పుత్ర ప్రేమతో చదువుకోడానికి గురువు గారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్య పెట్టేది. దానితో గుణనిధికి అడ్డు, అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంట పడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నదీ తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ, భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్లి, కొడుకు చెడు సావాసాలకు లోనయిన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తల దాచుకోవటానికి సహకరించలేదు. చెంతనే ఉన్న గౌతమీ నది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, తమ శక్తి కొలదీ జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక, ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భ గుడిలోనికి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక, తన పైవస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి, నందీశ్వరుని మీద పడి, తల పగిలి చనిపోతాడు. ఊరి నుండీ పారిపోతూ పవిత్రమయిన గౌతమీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకనే "జన్మానికో శివరాత్రి" అంటారు.

ఇదిలా ఉండగా, పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ధర్మాన్ని గ్రహించాలన్న ఆసక్తితో, మేరు పర్వతానికి అతి చేరువలో ఉండే తృణబిందుని ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ తనకనువయిన ఒక చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. ఆ ఆశ్రమ పరిసరాలు ఎంతో రమణీయమయిన ప్రకృతి శోభతో విలసిల్లుతూ ఉండేవి. అందుకే దేవతాంగనలు, అప్సరసలు, నాగకన్యలు అక్కడకి వెళ్ళి తమ ఆటపాటలతో కాలం గడిపి వెళ్ళిపోయేవారు. వీటి వలన పులస్త్యునికి తపోభంగం కలిగేది. దానితో ఆగ్రహించిన ఆయన, తన కంట పడిన కన్య గర్భవతి అవుతుందని శపించి తపస్సులో మునిగిపోతాడు. ఈ శాపం గురించి తెలిసినవారెవరూ అక్కడికి వెళ్ళేవారు కాదు. ఒకనాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె అయినటువంటి మానిని అక్కడికి వెళ్ళటం, గర్భం దాల్చటం జరగటంతో తన కుమార్తెను స్వీకరించమని తృణబిందుడు పులస్త్యుని అడుగగా దయతో ఆమెను స్వీకరించి, ఆమె సేవలకి మెచ్చి, తనతో సమానమయిన జ్ఞానం, శక్తి ఉన్న పుత్రుడు పుడతాడని ఆశీర్వదిస్తాడు. అలా పుట్టినవాడే విశ్రవుడు (వేదాధ్యాయమును విన్నవాడు అని అర్థం). విశ్రవుడు (ఇతనిని విశ్రవ బ్రహ్మ అని కూడా పిలుస్తారు) తన తండ్రితో అన్ని విషయాల్లోనూ సమానుడై, నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. యుక్త వయస్కుడైన విశ్రవునికి, భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణినిచ్చి వివాహం జరిపించారు. వీరిరువురికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే (విశ్రవుని కుమారుడు) కుబేరుడు.

కుబేరుడు చిన్నతనం నుండీ శివ భక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా (కుబేరునిగా) పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు, తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్ధాలను సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి, తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధామనవుతాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి మరియు పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారనీ, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమనీ చెప్పి మాయమవుతాడు. 
 
శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, లంకానగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుని కోసం సుమనోహరంగా నిర్మిస్తాడు. అయితే, రాక్షసులంటే భయపడే ఇంద్రుడు ఎప్పుడూ లంకలో ఉండటానికి ఇష్టపడలేదు. దానితో ఆ నగరాన్ని దేవాసుర భయంకరుడయిన సుకేశుని కుమారులకి (మాలి, సుమాలి, మాల్యవంతుడు) ఇస్తాడు. వీరిలో మాల్యవంతుడు ధర్మ వర్తనుడు. నర్మద అనే అప్సరసకి సుందరి, కేతుమతి, వసుతి అని ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. లంకా నగర పాలకులయిన ముగ్గురూ ముగ్గురినీ అనగా మాల్యవంతుడు - సుందరినీ (వీరి కుమారులు - వజ్రముష్టి, విరూపాక్ష, దుర్ముఖ, సుప్తఖ్న, యజ్ఞకోశ, మత్త, ఉన్మత్త మరియు కుమార్తె - నల), సుమాలి - కేతుమతిని (వీరి కుమారులు - ప్రహస్త, అకంబన, వికట, కలకముఖ, దుమ్రక్ష, దండ, సుపార్శ్వ, సంహ్రద, ప్రక్వత, భాసకర్ణ మరియు కుమార్తెలు - వేక, పుష్పోల్కత, కైకసి, కంభినది) మరియు మాలి - వసుతినీ (వీరి కుమారులు - అనల, అనిల, అహ, సంపతి) వివాహం చేసుకుని లంకా నగరాన్ని పరిపాలించసాగారు. వీరి రాక్షస కృత్యాలు మితి మీరటంతో శ్రీ హరి రోజూ తన సుదర్శన చక్రాన్ని లంకా నగరం మీదకి వదిలేవాడు. దానితో మాలితో పాటు కొంతమంది చనిపోగా, మిగిలిన రాక్షసులంతా పాతాళం వెళ్లి దాక్కుంటారు. 
 
అటువంటి రాక్షస నగరమయిన లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కనుక రాక్షసాధిపతి అయ్యాడు. ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు, ధనాధ్యక్షుడు, రాక్షసాధిపతే కాక పుష్పక విమానాన్ని కూడా పొందాడు. దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన సుమాలి (పాతాళ రాజు) అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి, విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి. కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడయిన కుమారుడు కావలెనన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో, వేళ కాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు (ఏనుగు యొక్క "కుంభ"స్థల ప్రమాణము కల కర్ణములు అనగా చెవులు కలవాడు అని అర్థం) అను రాక్షసులు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావలెనని అడగటంతో, విశ్రవుని అనుగ్రహం వలన విష్ణు భక్తి కల విభీషణుడు (దుష్టులకు విశేషమయిన భీతిని కలిగించువాడు అని అర్థం) పుడతాడు. అలా కుబేరుడు రావణాసురుడి సోదరుడనమాట!

రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారయిన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగ భాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక, లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు, పైగా రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుని తరిమేశాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి, ఒంటి కాలి మీద నిలిచి, శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలూ వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి, "లంకా నగరాన్ని మించిన దివ్యభవనాలతో, అపురూపమయిన చైత్ర రథం అనే ఉద్యానవనముతో, నవ నిధులతో, మణి మాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండీ నీవు అక్కడే ఉంటూ, యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు. ధనదుడవు, ధన దాతవు అయిన నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ, నా ప్రియ మిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు" అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనము కల వారిని "అపర కుబేరులు" అంటారు.
 
మణిమాణిక్యాలు, నిధులు, సంపదలతో నిండి వుండే ఈ అలకాపురం 100 యోజనాల పొడవు, 70 యోజనాల వెడల్పు కలిగి, కల్పవృక్షం నుండీ వీచే చల్లని గాలితో పరిమళ భరితంగా ఉంటుంది. అక్కడ తుంబురులు, గంధర్వ కన్యలు గానం చేస్తుంటే, రంభ, చిత్రసేన, మిశ్రకేశి, మేనక, సహజన్య, ఊర్వశి, శౌరభేయి, బుల్బుద, లత, మొదలగు ఎంతోమంది అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. మణిభద్రుడు, గంధకుడు, గజకర్ణుడు, హేమనేత్రుడు, హాలకక్షుడు, మొదలయినవారు కుబేరుని కొలువులో ముఖ్యమయిన వారు. కుబేరుని ప్రధాన సహాయకుడు విరూపాక్షుడు. శివుడు నిత్యం దర్శించే ప్రదేశము ఈ అలకానగరం అంటూ ఆ నగర శోభని మహాభారతంలో నారదుడు ధర్మరాజుకి చెప్తున్నట్టు వస్తుంది. 
 
కుబేరునికి ఉన్న మరొక పేరు ఏకాక్షి పింగళుడు. ఈ పేరు తనకి ఎందుకు, ఎలా వచ్చిందో రామాయణంలో వస్తుంది. సీతా దేవిని బంధించిన రావణునితో పర స్త్రీని గౌరవంగా చూడాలనీ, చెడు ఉద్దేశ్యంతో చూడరాదనీ, సీతమ్మని విడిచి పెట్టమనీ హితవు బోధిస్తూ ఒక లేఖను పంపుతాడు కుబేరుడు. ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలకానగరం వెళ్ళినప్పుడు ఆవిడని కుబేరుడు ఐమూలగా చూడగా, ఆవిడ తేజస్సు వలన తన ఎడమ కన్ను మాత్రమే మూసుకునిపోవటం, అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయటం, తద్వారా తన కన్ను పింగళ వర్ణం లోనికి మారిపోవటం వలన తనకి ఆ పేరు వచ్చిందనీ, అనుకోకుండా పరాయి స్త్రీని చూస్తేనే అలా జరిగిందనీ, తెలిసి మరీ పరాయి స్త్రీని ఆశించవద్దనీ వ్రాసి పంపిస్తాడు. అందుకనే పరాయి స్త్రీని చూస్తే "కళ్ళు పోతాయి" అంటారు. తన ప్రియమిత్రుడయిన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశ్యము లేదని జరిగిన సంఘటనను వివరించి, అమ్మవారిని అనుగ్రహించమని అనునయించటంతో ఆ రెండవ కన్ను మళ్ళీ మామూలుగా మారి చూపు సంతరించుకుంటుంది. అందుకనే కుబేరుని ఎడమ కన్ను కుడి కన్ను కన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు. 
 
కుబేరుని భార్య చిత్ర రేఖి (కానీ మహాభారతంలోని ఆదిపర్వం ప్రకారం, కుబేరుని భార్య పేరు భద్ర), పుత్రులు - పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకూబరుడు మరియు పుత్రిక - మీనాక్షి. వీరిలో మణిగ్రీవుడు, నలకూబరుడు భాగవతం ద్వారా మనందరికీ సుపరిచితులే (నారద మహాముని శాపం వలన వారిరువురూ మద్ది చెట్లై ఉంటే శ్రీకృష్ణుడు వారికి శాప విమోచనం కలిగిస్తాడు). ముఖ్యంగా చెప్పుకోవలసిన వ్యక్తి పాంచాలికుడు. తండ్రయిన కుబేరుని లాగానే ఇతను కూడా శివ భక్తి కలవాడు, శివునికి ప్రీతి పాత్రుడు. దక్ష యజ్ఞంలో తనకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీ దేవి అగ్నికి ఆహుతయ్యింది. ఈ విషయం తెలిసిన పరమ శివుడు ఆగ్రహంతో దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేసినా, భార్య మీద ఉన్న ప్రేమతో ఆమె దూరమవటాన్ని తట్టుకోలేక దుఃఖంతో అంతా సంచరిస్తున్నాడు. అటువంటి సమయంలో మన్మధుడు ఈశ్వరుని మీదకు "ఉన్మాదనాస్త్రాన్ని" ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వలన విపరీతమయిన విరహ తాపానికి గురవుతూ, ఆ బాధ తట్టుకోలేక యమునా నదిలోనికి దిగుతాడు. ఈ వేడి జ్వాలలు ఆ నదిని దహించివేస్తాయి. దానితో ఆ నదీ జలం నల్లగా మారిపోవటంతో యమునా నదికి "కాళింది" అనే పేరు వచ్చింది. కానీ శివుని విరహ తాపం మాత్రం తీరటం లేదు. ఇంతలో మన్మధుడు "సంతాపనాస్త్రాన్ని" వేస్తాడు. ఈ అస్త్ర ప్రభావంతో మరింతగా బాధపడుతూ అగ్ని జ్వాలల్లాంటి నిట్టూర్పులను విడుస్తూ ప్రపంచాన్నంతా తాపంతో ముంచెత్తాడు. ఈ సారి మన్మధుడు "విజృంభణాస్త్రాన్ని" ప్రయోగించేసరికి శివుడు మరింత ఉన్మత్తుడై తిరగసాగాడు.    
 
ఆ సమయంలో శివునికి కుబేరుని కుమారుడయిన పాంచాలికుడు కనిపిస్తాడు. వెంటనే అతని వద్దకు వెళ్ళి సహాయం కోరతాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, తనకి వచ్చిన అదృష్టావకాశానికి పొంగిపోతూ ఆజ్ఞాపించమంటాడు. దానితో తన బాధను పాంచాలికునికి వివరించి, తన మీద ప్రయోగింపబడిన మూడు (ఉన్మాదన, సంతాపన, విజృంభణ) అస్త్రాల వేడినీ తీసుకోమని కోరతాడు. మహా శివుడే తట్టుకోలేని వేడిని తాను మాత్రం ఎలా తట్టుకోగలడు? వాటిని తీసుకుంటే ఆ అస్త్రాల ప్రభావానికి తన జీవితమే నాశనమయిపోతుంది అని తెలిసినా కూడా అడిగినది పరమేశ్వరుడు కనుక నిస్సంకోచంగా, దైవాజ్ఞను ఆచరించి తీరాలి అనే ఆశయంతో ఆ మూడు అస్త్రాల వేడినీ తాను తీసుకుని శివునికి ఉపశమనం కలిగిస్తాడు. అతని భక్తికి, చిత్తశుద్ధికి మెచ్చిన శివుడు ఎంతో ఆనందించి ఆ వేడి పాంచాలికుడిని బాధించకుండా వరం ప్రసాదించి, మహోన్నతమైన దైవత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఆ రోజు నుండీ పాంచాలికుడు కాలింజరానికి ఉత్తర భాగంలో, హిమవత్పర్వతానికి దక్షిణాన ఉన్న ప్రదేశంలో పాంచాలికేశ్వరుడిగా కొలువవుతాడనీ, చైత్ర మాసంలో ఈయనని చూసినా, విగ్రహాన్ని ముట్టుకున్నా, భక్తిగా స్మరించుకున్నవారు ఎవరయినా (చిన్న/పెద్ద, ఆడ/మగ భేదం లేకుండా) ఉన్మత్తులు అవుతారని చెప్తాడు. అయితే ఈ ఉన్మత్తత వ్యాధిలాగానో, అగ్నిలాగానో బాధించకుండా నాట్యగానాలలో, వాద్య సంగీతాలలో నేర్పుతో పాటు చతురోక్తులు విసరటం వంటి కళలలో అత్యున్నత స్థానానికి చేరి తిరుగులేని వారిగా ఉంటారని, అదే వారు అనుభవించే ఉన్మత్తమనీ వివరిస్తాడు. ఆ విధంగా పాంచాలికుడు కళాకారులకి ఆరాధ్య దైవంగా మారి, తనను కొలిచిన వారందరికీ వరాలనిచ్చే శక్తిని పొందాడనీ వామన పురాణం వివరిస్తోంది.
 

ఎంతోమంది అదృష్ట చిహ్నంగా, సిరిసంపదలనొసగుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే "లాఫింగ్ బుద్ధ" మన కుబేరుడే అని చాలా మంది నమ్మకం. కుబేరుని పూజించిన వారికి ఆర్ధిక ఇబ్బందులు తొలగి, వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే, కుబేరుని ప్రతిమ కానీ, కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవటం కన్నా కూడా ఎవరయినా కానుకగా ఇచ్చినది మనం తీసుకుని పూజిస్తే విశేషమయిన ఫలితం ఉంటుందని నమ్మిక. ధన త్రయోదశి నాడు కుబేర పూజలు, కుబేర వ్రతాలు, మొ., ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నా, నిత్యం మనకి తెలిసో, తెలియకుండానో కుబేరుడిని మంత్రపుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం.


"రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే

నమోవయంవై శ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామ కామాయ మహ్యం
కామేశ్వరోవై శ్రవణో దదాతు
 కుబేరాయ వైశ్రవణాయ మహా రాజాయ నమః "

హిందువులే కాక, బౌద్ధ, జైన మతాల వారు కూడా అధికంగా పూజించే, నమ్మే దైవం కుబేరుడు. బౌద్ధులు ఈయనని వైశ్రవణుడు లేదా జంభాలుడు అని పిలుస్తారు. శ్రీ శివ పురాణం ప్రకారం, కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడే! జైనులు ఈయనని సర్వానుభూతి అంటారు. టిబెటియన్లు మరియు జపనీయుల ప్రకారం ప్రపంచాన్ని నలుదిక్కులా పాలించే రాజులలో కుబేరుడు ఒకడు. బౌద్ధుల ప్రకారం ఈయన చేతిలో ఎల్లప్పుడూ బంగారు నాణెములు కల ఒక సంచీ కానీ వజ్రములను, మణులను వెదజల్లు ముంగీస కానీ ఉంటాయి. అదే విధంగా, మరొక చేతిలో ఎల్లప్పుడూ నిమ్మకాయ (జంబీరము) ఉండటం వలననే ఈయనకి జంభాలుడు అనే పేరు వచ్చిందని చెప్తారు. అగ్ని పురాణం ప్రకారం, ఈయన ఆయుధం గద, వాహనం నరుడు (మనిషి). దీని ద్వారా మనిషి డబ్బుకి, ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. కనుక మనిషి మనీ కి బానిస కాకుండా స్వీయ నియంత్రణతో బంధువుగా వుంటూ, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ఆశిద్దాం.

"ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీశాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్"
  

Monday, November 26, 2012

కాళిదాసు - మేఘ సందేశం


చిన్నప్పుడు మేఘ సందేశం సినిమా చూసి అదే కాళిదాసు వ్రాసినది అన్న అపోహలో ఉండేదానిని. తరువాత రెండూ వేరు వేరని, ఇదొక విరహ కావ్యం అని తెలిసింది. విరహం నాకెందుకో అంతగా నచ్చదు. కానీ కాళిదాసు విరహ కావ్యం చదివాక విరహంలో కూడా ఇంత అందం, ఆనందం ఉంటాయని తెలుసుకున్నాను. నవరసాలలో మొట్ట మొదటి స్థానం శృంగారానికే దక్కింది కనుక ముందుగా కాళిదాసు శృంగార రచనలని నాకు అర్థమయినంతలో పరిచయం చేస్తున్నాను. ఆ ప్రకారంగా అభిజ్ఞాన శాకుంతలం తరువాత స్థానం మేఘ సందేశానికి ఇచ్చాను. ఈ మేఘ సందేశం ఒక "ఖండ కావ్యం". ఖండ కావ్యం భవేద్కావ్యం ఏక దేశాను సారిచ అన్నారు. ఒక కథతో సంబంధం లేకుండా ఏదో ఒక భాగాన్ని లేదా ఘట్టాన్ని తీసుకుని వివరించడమే ఖండ కావ్య లక్షణం. ఈ మేఘ సందేశంలో పూర్వ మేఘం (63 శ్లోకాలు), ఉత్తర మేఘం (52 శ్లోకాలు) అని రెండే సర్గలు ఉన్నాయి.  
 
కాళిదాసు రచించిన కావ్యాలకి ఒక ప్రత్యేకత ఉంది. కాళిదాసు పుట్టుకతోనే పండితుడు కాదనీ, పెళ్ళయ్యాకే అమ్మవారి (కాళికా దేవి) అనుగ్రహం వలన పండితుడయ్యాడనీ అందరికీ తెలిసినదే. అయితే పెళ్ళయిన వెంటనే కాళిదాసు భార్య "వాగస్తి కశ్చిత్?" (వాక్కు ఏదన్నా నీకుందా?) అని అడుగుతుంది. ఈయన పండితుడయిన తరువాత, ఈ వాగస్తి కశ్చిత్ లో ఉన్న మూడు పదాలనీ (వాక్, అస్తి, కశ్చిత్) తీసుకునీ ఒక్కో పదంతో మొదలయ్యేట్టుగా ఒక్కో కావ్యాన్ని (వాక్కుతో మొదలుపెట్టిన మహా కావ్యం రఘువంశం, అస్తి తో మొదలుపెట్టిన మహా కావ్యం కుమార సంభవం మరియు కశ్చిత్ తో మొదలుపెట్టిన ఖండ కావ్యం మేఘ సందేశం) వ్రాశాడు. ఆ ప్రకారంగా ఇందులోని మొట్టమొదటి శ్లోకం:
కశ్చిత్కాంతావిరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపేనాస్తంగమిత మహిమా వర్షభోగ్యేణ భర్తుః ।
యక్షశ్చక్రే  జనక తనయా స్నాన పుణ్యోదకేషు
స్నిగ్ధచ్ఛాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు ॥

అంటే తన విధులలో అశ్రద్ధ వహించటం వలన యజమాని ఆగ్రహానికి గురయ్యి, తన విధుల నుండి తొలగించబడి, తన శక్తులన్నీ కోల్పోయి, యేడాది కాలం కాంతా (భార్య) వియోగంతో గడపవలననే శాపాన్ని పొందిన యక్షుడు, జనకుని కూతురు అయినటువంటి సీతా దేవి స్నానం చేయటం వలన పవిత్రంగా మారిన నీరు కలిగినటువంటి, దట్టమయిన నీడనిచ్చే చెట్లు కలిగినటువంటి రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు.

ఈ శ్లోకంతో నాయకుడయిన యక్షుని పరిచయం జరిగింది. దానికి రెండు విశేషణాలు వాడాడు. అవే స్వాధికారాత్ ప్రమత్తః, అస్తంగమిత మహిమ. దీని ఆధారంగా కాళిదాసు విధి నిర్వహణే ప్రధాన కర్తవ్యం అని చెప్తున్నాడు అనిపిస్తుంది. చేయవలసిన పని సరిగ్గా చేయకపోవటం వలన యక్షునికి కలిగిన అనర్థాలు ఉద్యోగం మరియు మహిమలు కోల్పోవటం, తద్వారా కాంతా వియోగం పొందటం. మనకి ధర్మార్థకామాలలో కూడా మొదటిది ధర్మ నిర్వహణే కదా! అది సరిగ్గా చేయకపోతే అన్నిటికీ దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలాగే రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు అని చెప్పాడు కానీ అదెక్కడుందో రెండు విశేషణాలతో చెప్పకనే చెప్పాడు. అవే జనక తనయా స్నాన పుణ్యోదకేషు అనగా సీతాదేవి స్నానం చేయటం వలన పవిత్రమయిన నీరు, స్నిగ్ధచ్ఛాయాతరుషు అనగా ఎక్కువగా నీడనిచ్చే చెట్లు. వీటి ఆధారంగా తెలిసేది ఏమిటంటే సీతాదేవి వనవాసం చేసిన చోటు అని. అదే చిత్రకూట పర్వతం. ఇటువంటి ఎన్నో రసవత్తరమయిన శ్లోకాలతో ఆద్యంతం ఆకట్టుకున్న అద్భుత కావ్యం మేఘ సందేశం.

అరణ్యంలో విరహంతో ఉన్న యక్షునికి (యక్షులు సాధారణంగా కాముకులు కనుక వారికి కాంతా వియోగం భరించలేనటువంటిది) మేఘుడు కనిపిస్తాడు. కనిపించిన వెంటనే ఏమీ ఆలోచించకుండా మేఘునితో అలకాపురి(యక్షుల నివాసం)లో ఉన్న తన భార్యకి సందేశాన్ని పంపాలి అనుకుంటాడు. శ్రీరాముడు సీతకి ఆంజనేయస్వామి ద్వారా, పాండవులు కౌరవులకి శ్రీ కృష్ణుని ద్వారా, నలోపాఖ్యానంలో దమయంతికి హంస ద్వారా, సందేశాలు పంపటం జరిగాయి. కానీ ఇక్కడ యక్షుడు - పొగ, వెలుతురు, నీరు, గాలి కలిసినటువంటి మేఘంతో (ప్రాణం లేని దానితో) సందేశం పంపబోతున్నాడు. ఆ మాత్రం కూడా కాళిదాసుకి తెలియదు అని జనం భావించకుండానే, కామార్తులకు (కామముతో ఉన్న వాడికి) అంత ఆలోచన ఎక్కడిది? అని తన కావ్యౌచిత్యాన్ని సమర్ధించుకున్నాడు (పూర్వ మేఘం, నాల్గవ శ్లోకంలో).

పూర్వ మేఘంలో మేఘానికి మార్గ నిర్దేశం చేస్తాడు. ఆ ప్రకారంగా, చిత్రకూట పర్వతం (ప్రస్తుతం దీనిని మధ్యప్రదేశ్ లోని రామ్ గఢ్ అంటారు) మీద బయలుదేరిన మేఘం, మాల పర్వతం (ప్రస్తుతం దీనిని ఛత్తీస్ గఢ్ అంటారు) మీదుగా ఆమ్రకూట పర్వతం (నర్మదా లేదా రేవా నదీ జన్మస్థానం) వెళ్ళి, అక్కడనుండీ దశార్ణ దేశ (మాళవ దేశ పూర్వ భాగాన్ని దశార్ణ దేశం అంటారు) రాజధాని అయినటువంటి విదిశా (ప్రస్తుతం దీనిని భిలాసా అంటారు) నగరానికి వెళ్ళి వేత్రవతీ (వింధ్య పర్వతాలకి ఉత్తర భాగంలో ఉద్భవించిన ఈ నదిని ప్రస్తుతం "బేత్ వా" అని పిలుస్తారు) నది అందాలని ఆస్వాదిస్తూ, కొంచెం చుట్టు తిరుగు అయినా ఉజ్జయిని (మాళవ దేశ రాజధాని. దీనినే అవంతి అని కూడా అంటారు) వెళ్ళి తప్పనిసరిగా (కాళిదాసుకి ఆ ఊరి మీదా, శివుని మీదా ఉన్న మమకారంతో ఇది చేర్చాడు అనిపిస్తుంది) ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటయిన మహాకాలుని దర్శనం (సాయంకాల సమయంలో) చేసుకుని, శిప్రా (ఉజ్జయినిలో ప్రవహించే నది) నదికి ఉపనదులయిన గంధవతి, గంభీర నదుల వద్ద సేద తీరి, దేవగిరి (ప్రస్తుతం దీనిని దౌలతాబాద్ అంటారు) పర్వతం వద్ద నివాసముండే శరవణభవుడయిన కుమారస్వామిని దర్శించుకుని, అక్కడ ప్రవహించే చర్మణ్వతి (వింధ్య పర్వతాలకి వాయువ్య దిశలో ఉద్భవించిన ఈ నదిని ప్రస్తుతం "చంబల్" అని పిలుస్తారు) నదిని దాటుకుంటూ, దశపురం (రంతిదేవుని రాజధాని నగరం), బ్రహ్మావర్తం (సరస్వతీ, దృషద్వతీ నదుల మధ్యన ఉన్న ప్రదేశం), కురుక్షేత్రం (మహా భారత యుద్ధం జరిగిన చోటు), కనఖలం (హరిద్వార్ వద్ద ఉన్న క్షేత్రం, ఇక్కడ గంగానది ప్రవహిస్తుంది), హిమవత్పర్వతం మీదుగా కైలాసం చేరాక, ఆ ప్రక్కనే ఉన్న అలకానగరం (మా అనగా యక్షుల నివాసం) వెళ్ళాలి.

ఉత్తర మేఘంలో అలకానగారాన్ని వివరించి, తన ఇంటికి దారి చెప్పి, తన భార్య గుర్తులు చెప్పి, వారిరువురికి (యక్షునికీ, తన భార్యకీ) మాత్రమే తెలిసిన కొన్ని సంగతులను చెప్పి (యక్షుని భార్యకి ఈ మేఘుడు నిజంగా యక్షుడు పంపిన వాడే అని నమ్మకం కలిగించటం కోసం), తన గురించి బాధ పడవద్దనీ, తాను త్వరగా వచ్చేస్తానని చెప్పమని మేఘుడిని రకరకాలుగా పొగిడి (తన పని జరగడం కోసం) మరీ పంపిస్తాడు. తీరా చూస్తే, మేఘం ఆ అలకానగరం వెళ్ళేసరికి యక్షుడే తన సంవత్సర కాలం పూర్తి చేసుకుని తన భార్యను చేరుకుంటాడు.

నాయకులు నాలుగు రకాలు. వారినే చతుర్విధ నాయకులు అంటారు. ధీరోదాత్తుడు (వీరత్వం అధికంగా ఉండి ఆవేశం లేకుండా ఆలోచన కలవాడు ఉదా: శ్రీ రాముడు), ధీరోద్ధతుడు (వీరత్వం ఎక్కువగా ఉండి ఆలోచన ఏ మాత్రం లేనివాడు ఉదా: భీముడు), ధీర లలితుడు (వీరత్వం, లాలిత్యం సమపాళ్ళలో కలిసిన ప్రేమ స్వరూపుడు ఉదా: శ్రీ కృష్ణుడు), ధీర శాంతుడు (శాంతాన్ని అధికంగా కలిగిన వీరుడు ఉదా: గౌతమ బుద్ధుడు). కాళిదాసు తన రచనలలో నాయకుడిని ఎప్పుడూ ధీరోదాత్తునిగానే మలుచుకుంటాడు. శాకుంతలంలో అదే జరిగి అభిజ్ఞాన శాకుంతలం అయ్యింది కదా! ఈ మేఘ సందేశంలో కూడా నాయకుడైన యక్షుని ధీరోదాత్తునిగానే చూపాడు (పూర్వ మేఘం, మూడవ శ్లోకంలో).

శృంగార నాయికలు ఎనిమిది రకాలు. వారినే అష్టవిధ శృంగార నాయికలు అంటారు. వారిలో నలుగురిని ఎన్నుకుని, ఒక్కొక్కరిగా ఈ కావ్యంలో పూర్వమేఘంలో పరిచయం చేశాడు కాళిదాసు. 

త్వా మారూఢం పవనపదవీ ముద్గృహీతాలకాన్తాః
ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయాదాశ్వ సన్త్యః ।
కః సన్నద్ధే విరహవిధురా త్వయ్యుపేక్షేత జాయాం
న స్యాదన్యోఽప్యహమివ జనోయః పరాధీనవృత్తిః ॥
అంటూ ముందుగా పథికవనితాః అనగా ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక గురించి చెప్పాడు. భర్త దూరంగా (పని మీద ఎక్కడికైనా వెళ్ళినా, దేశాంతరం వెళ్ళినా) ఉన్నప్పుడు తన గురించి ఆలోచిస్తూ విరహంతో ఉండే స్త్రీని ప్రోషిత భర్తృక అంటారు. మేఘుడు కామ ప్రకోపన చేసేవాడు. అసలే విరహంతో ఉండే స్త్రీలు నీ (మేఘుని) రాకతో, తమ భర్తతో కలవాలన్న కోరిక పెరిగి, భర్త కూడా అదే కాంక్షతో వస్తాడు అన్న ఆశతో తమ ఫాల భాగం మీద పడుతున్న ముంగురులను పైకి ఎత్తి నిన్ను చూస్తారు. అటువంటి స్త్రీని విడిచి అశక్తుడు, అస్వతంత్రుడు, పరాధీనుడు అయిన మగవాడు తప్ప మరెవ్వరూ ఉండలేరు అంటాడు. ప్రస్తుతం యక్షుని పరిస్థితి అదే కనుక ఆమెకు దూరంగా ఉన్నందుకు చింతిస్తూ మేఘుని వెళ్ళి తన క్షేమ సమాచారం తెలియ చేయమంటాడు. దీనికి సమర్ధింపుగా ఉత్తర మేఘంలో 21, 22, 23, 24, 25 శ్లోకాలలో యక్షుని భార్యలో ఉన్న ప్రోషిత భర్తృక లక్షణాలన్నీ విశదీకరిస్తాడు. నాకెందుకో కాళిదాసుకి ఈ ప్రోషిత భర్తృక అంటే ప్రత్యేక అభిమానం అనిపిస్తుంది. అభిజ్ఞాన శాకుంతలంలో కూడా శకుంతలని ప్రోషిత భర్తృక (దూర్వాస మహాముని శాపానికి కారణమయినప్పుడు) గానే చూపిస్తాడు.  

గచ్ఛన్తీనాం రమణవసతిం యోషితాం తత్రనక్తం
రుద్ధాలోకే నరపతి పథే సూచి భేద్యై, స్తమోభిః ।
సౌదామన్యా, కనక నికషస్నిగ్ధయా దర్శయోర్వీం
తోయోత్సర్గస్తనితముఖరో మాస్మభూర్విక్లవాస్తాః ॥

అంటూ రమణవసతిం గచ్ఛన్తీనాం అనగా అభిసారిక గురించి చెప్పాడు. అందంగా అలంకరించుకుని, ప్రియుని వద్దకు తాను వెళ్ళే స్త్రీని అభిసారిక అంటారు. ఉజ్జయనిలోని స్త్రీలను వర్ణిస్తూ చెప్పిన ఈ శ్లోకంలో అక్కడి అభిసారికలు (స్త్రీలు) రాత్రిపూట ప్రియుని ఆవాసానికి బయలుదేరతారు కనుక ఆ సమయంలో నువ్వు (మేఘుడు) మెఱుపులతో దారి చూపు కానీ ఉరుముతూ వాన పడి వారిని భయపెట్టకు. వారసలే మిక్కిలి భయస్తులు అని మేఘుడిని హెచ్చరిస్తూ స్త్రీలతో సున్నితత్వం వహించాలని చెప్తాడు. పూర్వ మేఘంలో ఉజ్జయినిలోని (కాళిదాసు నివాస స్థలం) అభిసారికలు ప్రియుని వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారో చెప్పిన కాళిదాసు ఉత్తర మేఘంలో (తొమ్మిదవ శ్లోకంలో) అలకాపురిలోని (యక్షుని నివాస స్థలం) అభిసారికలు తమ ప్రియుని వద్ద నుండీ వచ్చేటప్పుడు ఎలా ఉంటారో వివరిస్తాడు. దీని ద్వారా కాళిదాసు పురుషుల ఏక పత్నీత్వం, స్త్రీల పాతివ్రత్యం ఇష్టాధీనమే కానీ కృత్రిమం కాదు అని చెప్తున్నాడనిపిస్తుంది. మన నాయకుడయిన యక్షుడు ఏకపత్నీ వ్రతుడు, ముందుగా చెప్పుకున్నట్టు ధీరోదాత్తుడు కాకపోతే తన భార్యకి మేఘుడిని బ్రతిమాలుకుని మరీ సందేశం పంపవలసిన అవసరం లేదు కదా! అలా మన నాయకుని ధీరోదాత్త లక్షణం మళ్ళీ చూపాడు.

తస్మిన్కాలే నయన సలిలం యోషితాం ఖణ్డితానాం
శాన్తిం నేయం ప్రణయిభిరతో వర్త్మభానోస్త్య జాశు ।
ప్రాలేయాస్రం కమలవదనాత్సోఽపి హర్తుం నలిన్యాః
ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్ఫాభ్యసూయః ॥

అంటూ ఖణ్డితానాం అనగా ఖండిత నాయిక గురించి చెప్పాడు. రాత్రంతా పర స్త్రీతో గడిపి, తెల్లవారిన తరువాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన భర్తని చూచి దుఃఖించే స్త్రీని ఖండిత అంటారు. ఆ సమయంలో అనగా సూర్యోదయ సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన భర్తలు తమ భార్యల కన్నీరు తుడుస్తారు. ఈ శ్లోకంలో పద్మం అనే ఖండిత స్త్రీ ముఖము నుండీ కారే మంచు అనే కన్నీటిని తొలగించే భర్త (లేదా ప్రియుడు) సూర్యుడు అని వర్ణించాడు. అటువంటి సూర్యునికి నువ్వు (మేఘుడు) అడ్డు రాకుండా, తన కిరణాలు అనే చేతులతో మంచు అనే కన్నీటిని తుడవనివ్వు, ప్రేయసీ ప్రియుల మధ్యలో నువ్వెందుకు? అడ్డు తొలగు అంటూ హితోపదేశం చేస్తున్నాడు.

తస్యోత్సఙ్గే ప్రణయిన ఇవస్రస్త గఙ్గాదుకూలాం
న త్వం దృష్ట్వా న పునరలకాం జ్ఞాస్యసే కామచారిన్ ।
యావః కాలే వహతి సలిలోద్గారముచ్చైర్విమానా
ముక్తాజాలగ్రథిత మలకం కామినీ వాభ్ర బృన్దమ్ ॥

ఈ శ్లోకంలో స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక అనే నాయికను ప్రతిబింబిస్తున్నాడు. ఇందులో కైలాస పర్వతాన్ని నాయకుని(ధీర లలితుడు)గా, అలకా నగరాన్ని నాయిక(స్వాధీన పతిక)గా భావించి వర్ణిస్తున్నాడు కవి. స్వాధీన పతికలోని ప్రేమకి, సుగుణాలకి పూర్తిగా వశమయిన ప్రియుడు ఆమెను అనునిత్యం లాలిస్తూ ఉంటాడుట. అలిగిన ప్రేయసిని లాలించే ప్రియుడు ఆమెను తన తొడపై పడుకో పెట్టుకుంటే ఆ స్త్రీ రూపం ఎలా ఉంటుందో, కైలాస పర్వతంపై ఉన్న అలకా నగరం అలా ఉందని కవి భావన! అక్కడ ఆకాశంలో జాలువారే గంగానది ఈ ప్రియురాలు (అలకానగరం) కట్టుకున్న తెల్ల పట్టు చీరలా ఉందిట!

"ఉపమా కాళిదాసస్య, అర్ధాంతరన్యాసోపి విధీయతే" అంటారు. ఈ కావ్యంలో నాకు నచ్చినవి చాలా ఉన్నా, మిక్కిలి ఆకర్షించిన కొన్ని ఉపమానాలు:
ఆమ్రకూట పర్వతాన్నీ, అక్కడ ప్రవహించే రేవా నదినీ వర్ణిస్తూ ఏనుగు ఆకారంలో ఉన్న పర్వతానికి, పాయలు పాయలుగా ప్రవహిస్తున్న నది ఆ ఏనుగు పెట్టుకున్న విభూది రేఖల వలె ఉన్నది అంటాడు.
మార్గ మధ్యలో కనిపించిన "నిర్వింధ్య" నదిని ఒక స్త్రీగా, మేఘాన్ని తన ప్రియునిగా భావిస్తూ, నదిలో వచ్చే సుడులను ఆ స్త్రీ యొక్క నాభిగా అభివర్ణించడం.
చర్మణ్వతీ నదిని ఆకాశం నుండీ చూస్తే భూదేవి మెడలో ధరించిన ఒంటి పేట ముత్యాల హారంలా కనిపిస్తోంది, ఆ నీటి కోసం నువ్వు (మేఘుడు) వంగితే ఆ ముత్యాల హారం మధ్యలో ఉన్న ఇంద్ర నీలమణిలా ఉంటావు అంటాడు.

ఇటువంటి ఎన్నో అద్భుతమయిన ఉపమానాలతో మనోజ్ఞ సీమకి తీసుకెళ్ళాడు కాళిదాసు. చదువుతున్నంత సేపూ ఆ ప్రదేశాలన్నీ అక్కడే ఉండి చూసినట్టు అనిపిస్తుంది. ఇందులో వ్రాసిన ప్రతీ శ్లోకాన్నీ ఒక చిత్రంగా గీయచ్చు. భావకులు ఆ పారవశ్యం నుండీ తేరుకుని బయటకి రావటం చాలా కష్టం. ఏమి ఉపమానాలు! ఏమి విశేషణాలు! ఎన్ని అలంకారాలు! ఆహా! ఒక మహాద్భుతం చూసిన అనుభూతి దక్కింది. విరహం, తన్మయత్వం, భక్తి, ప్రేమ, అనురాగం, శృంగారం, ప్రకృతి వర్ణనలూ, సందేశాలూ అన్నిటినీ సమపాళ్ళల్లో పండించినటువంటి మేఘ సందేశం ఒక చక్కని కావ్యం అనడంలో అతిశయోక్తి లేదు.  

Friday, October 05, 2012

వాయువు




నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో...

పంచభూతాలలో రెండవది, మానవ మనుగడకి అత్యంత ఆవశ్యకమయినది వాయువు. దీనినే వ్యవహారికంగా గాలి అంటాము. దీనికి శబ్ద, స్పర్శ అనెడి ద్విగుణాలున్నాయి. భాగవతం ప్రకారం ఆకాశం నుండీ వాయువు ఉద్భవించినది. వాయువుకి అధిదేవత వాయుదేవుడు. ఈయన వాయువ్యానికి దిక్పాలకుడు. ఈయన భార్య అంజన, వాహనం దుప్పి, ఆయుధం ధ్వజం, నివాసము గంధవతి. తైత్తరీయోపనిషత్తులో వాయువుని "త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి" (నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవి) అని సంబోధించారు. సర్వదా చరిస్తూ ప్రతీచోటా నిండి ఉన్నా, వాయు ప్రవర్తన అన్ని వేళలా ఒకే విధముగా ఉండదు. ప్రాణవాయువై ప్రాణులకి జీవాన్ని పోస్తుంది, ఎన్నో వ్యాధుల నుండీ రక్షణనిస్తూ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, పిల్ల తెమ్మెరలతో మానసికోల్లాసాన్నీ, ఆహ్లాదాన్నీ కలిగిస్తుంది, బరువెక్కిన మేఘాలను ఆత్మీయంగా తాకి వర్షాలను కురిపిస్తుంది, ఎన్నో కబుర్లను, రుచులను చేరవేస్తుంది, వెదురులో చేరి సంగీతాన్ని పలికిస్తుంది, అప్పుడప్పుడు భయంకరంగా మారి భీభత్సాలను, ఉత్పాతాలను సృష్టిస్తుంది. అందువలననే పర్వతాలను, భూమిని సైతం పెకిలిస్తూ (టెక్టోనిక్ ప్లేట్ లో కదలికలు రావటం వలన భూకంపాలు వస్తాయి) ప్రపంచాన్ని మొత్తం నాశనం చేయగల వాయు శక్తిని ఒక దేవతగా అభివర్ణించారని ఋగ్వేదంలో చెప్పబడింది. ఈ వాయువు యొక్క గుణాలను ఆధారంగా చేసుకుంటే ఇవి దేవయానాలు (రాజస గుణ వాయువులు), పితృయానాలు (తామస గుణ వాయువులు) అని రెండు రకాలుగా ఉంటాయి.

వాయువులని మరుత్తులు అని కూడా అంటారు. వీరి జనన, నామకరణ వృత్తాంతం అంతా రామాయణంలో బాలకాండలో విశాలనగరంలో దితి తపస్సు చేసిన చోటుని చూసిన రామలక్ష్మణులకి విశ్వామిత్రుడు చెప్తునట్టు వస్తుంది. ఆ ప్రకారముగా, దేవ దానవ యుద్ధములో దానవులంతా ఇంద్రుడి చేత సంహరింపబడితే, ఆ బాధతో, పగతో, దితి తన భర్తయిన కశ్యప ప్రజాపతిని శక్ర హంతారం (ఇంద్రుడిని చంపే కొడుకు) కావాలంటుంది. దానికాయన వెయ్యి సంవత్సరాలు నియమ నిష్టలతో, శుచిగా తపోనిష్టలో ఉంటే అటువంటి పుత్రుడు పుడతాడు అని వరమిస్తూ దితిని స్పృశించి తపస్సుకి వెళిపోతాడు. ఇంద్రుని మీద పగ తీర్చుకోవాలని శుక్లప్లవనమునకు వెళ్ళి తపస్సు మొదలుపెడుతుంది దితి. ఆమెకు ఎన్నో సపరియలు చేస్తూ ఆమె తపస్సు చేస్తున్న ఆశ్రమంలోనే ఇంద్రుడు ఆమెను కనిపెట్టుకుని ఉంటాడు. ఇహ తపస్సు పూర్తవ్వడానికి సరిగ్గా పది సంవత్సరాలు ఉందనగా (అనగా ౯౯౦ సంవత్సరాలు గడిచాక) దితి కాళ్ళు పెట్టుకునే వైపు తల పెట్టుకుని నిద్రపోతుంది. అది చేయకూడని పని కనుక ఆమె అశుచి అవుతుంది. సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు ఆమె గర్భంలోనికి ప్రవేశించి గర్భంలోని పిండాన్ని ఏడు ముక్కలు క్రింద కోసేస్తాడు. ఆ నొప్పికి తట్టుకోలేని పిండాలు ఏడుస్తుంటే ఇంద్రుడు "మా రుద" (ఏడవద్దు) అని అంటాడు. ఇదంతా తన గర్భంలో జరిగేసరికి దితికి మెలకువ వచ్చి ఇంద్రుడిని బయటకి రమ్మంటుంది. బయటకి వచ్చిన ఇంద్రుడు తన తప్పేమీ లేదనీ, ఆమె అశుచి అవ్వటం వలనే ఇలా చెయ్యవలసి వచ్చిందనీ చెప్తాడు. అది విన్న దితి తన తప్పుని ఒప్పుకుని, తన గర్భస్థ పిండాన్ని చంపినందుకు గాను ఇంద్రుడిని వరం కోరుకుంటుంది.

" బ్రహ్మలోకం చరత్వేకః ఇంద్రలోకే తధాపరః
దివి వాయురితి ఖ్యాతః త్రితయోపి మహాశయాః
చత్వారస్తు సురశ్రేష్ఠ దిశోవై తవశాసనాత్
సంచరిష్యతి భద్రంతే దేవభూతాః మమాత్మజాః
స్వత్కృతేనైవ నామ్నా మారుతాయితి విశృతాః "

ఆ ఏడుగురిలో ఒకరు బ్రహ్మలోకంలో, ఇంకొకరు ఇంద్రలోకములో, మరొకరు భూమి మీద వాయువు అనే పేరుతో ఉంటూ ఈ ముగ్గురూ మహాయశస్సు పొందాలి. మిగిలిన నలుగురూ నాలుగు దిక్కులలో ఉంటూ నువ్వు చెప్పినట్టు వింటూ ఉండేలా చేసి వీరందరినీ దేవతా గణాలలో చేర్చుకో. వీరిని "మా రుద" అని నువ్వు అన్నట్టే మరుత్తులుగా నిశ్చయించాను. ఇకనించీ వీరంతా మారుదులు (మారుతులు) లేదా మరుత్తులుగా ఖ్యాతి పొందేలా చేయి అని కోరుకుంటుంది. దానికి అంగీకరించిన ఇంద్రుడు అలానే దీవిస్తాడు. ఆ విధముగా ఒక రాక్షసుడు కావలసిన వాడు ఏడు దేవతా గణాలు అయ్యి మరుత్తులు జన్మించారు. 
 

విష్ణు పురాణం ప్రకారం ఈ ఏడుగురి పేర్లూ అవహము, ప్రవహము, సంవహము, ఉద్వహము, వివహము, పరివహము, పరావహము.

అవహము: మేఘ మండలానికీ, భూమండలానికీ మధ్యన ధ్వనిస్తూ, అంతటా సంచరిస్తూ ఉంటుంది. ఈ వాయువు వలననే సూర్యచంద్రులు, నక్షత్రాల గమనాలు (ఉదయించటం, అస్తమించటం) జరుగుతాయి.

ప్రవహము: సూర్య మండలానికీ, మేఘ మండలానికీ మధ్యన ఉంటుంది. మెరుపు మెరిసినప్పుడు ఆ మెరుపుకి వచ్చే కాంతి ఏదయితే ఉందో అది ఈ వాయువు వలననే కలుగుతుంది.

సంవహము: నక్షత్ర మండలానికీ, చంద్ర మండలానికీ మధ్యన ఉంటుంది. అసామాన్యమయిన వేగాన్ని కలిగి పర్వతాలను సైతం నుజ్జు నుజ్జు చేసే శక్తి కలిగి ఉంటుంది. వృక్షాలలో, చెట్లలో జీవరసం ఏర్పడటానికి ప్రధానమయినది కూడా ఇదే అవటం విశేషం.

ఉద్వహము:  చంద్ర మండలానికీ, సూర్య మండలానికీ మధ్యన ఉంటుంది. ఈ వాయువు చాలా బలమయినది. మేఘాలు వర్షించేలా చేయటమే కాక దేవ విమానాలను (పుష్పక విమానం, మొ) నడిపేది కూడా ఈ వాయువే.

వివహము: గ్రహ మండలానికీ, నక్షత్ర మండలానికీ మధ్యన ఉంటుంది. ఈ వాయువు దివ్యజలాలకు (ఆకాశగంగ, మొ) నిలయం. అమృత నిధి అయిన చంద్రుడు చల్లగా ఉండటానికీ, సూర్య రశ్మి భూమిని చేరటానికి కూడా ఈయనే కారణం.

పరివహము: ధృవ మండలానికీ, సప్తర్షి మండలానికీ మధ్యన ఉంటుంది. ప్రాణాధారుల (ప్రాణము కలిగి ఉన్న ప్రతీదీ) ప్రాణాలను చివరి దశలో తొలగించేది ఇదే. ఈ (పరివహ) వాయు ధర్మం ప్రకారమే మృత్యువు, యముడు నడుచుకుంటారు.

పరావహము: సప్తర్షి మండలానికీ, గ్రహ మండలానికీ మధ్యన ఉంటుంది. ఈ వాయువును ఎవరూ అతిక్రమించలేరు అంటూ వీరు నిత్యం నెరవేరుస్తున్న కార్యాలను నారద పురాణము వివరిస్తోంది.

దితి పుత్రులు మరుత్తులు అయ్యారు అని తెలిసింది కదా! మరి దితికి (వైవస్వత మన్వంతరానికి) ముందు ఉన్న మన్వంతరాలలో మరుత్తులు ఎవరు? అన్న సందేహం ఒకసారి నారద మహామునికి కలిగి, పులస్త్యుని వద్ద వ్యక్తం చేస్తాడు. దానికి సమాధానంగా పులస్త్యుడు ప్రతీ మన్వంతరంలో వారి జన్మ వృత్తాంతాలను వివరిస్తాడు.

స్వాయంభువ మన్వంతరం: స్వాయంభువ మనువు కుమారుడు ప్రియవ్రతుడు, అతని కుమారుడు సవనుడు. ఈ సవనుడు పిల్లలు లేకుండానే మరణిస్తాడు. దానితో అతని భార్య సుదేవ (సునాభ కుమార్తె) పిల్లలు లేకుండానే చనిపోయాడే అని బాధపడుతుంది. అప్పుడు అశరీరవాణి చెప్పినట్టుగా భర్త చితి మీద ఈమె కూడా కూర్చుని దగ్ధమవుతుంది (సతీ సహగమనం అనమాట). అప్పుడు ఈ దంపతులిరువురూ ఆకాశానికి ఎగిరి వెళ్ళి, అక్కడ సంభోగం చెందగా వచ్చిన శుక్రం ఆకాశం నుండి జారి భూమి మీద పడిపోతుంది. అలా జరగగానే వీరిరువురూ బ్రహ్మ లోకానికి వెళిపోతారు. అయితే ఆకాశం నుండి జారి పద్మంలో పడిన ఆ శుక్రాన్ని సమాన, నళిని, వపుష్మతి, చిత్ర, విశాల, హరిత, అళిని అనే సప్తర్షుల భార్యలు అమృతమని భ్రమపడి, దానిని త్రాగవలెను అన్న కోరికను వారి భర్తలతో చెప్పి, భర్తలను పూజించి త్రాగేస్తారు. త్రాగిన వెంటనే వారంతా బ్రహ్మ తేజాన్ని కోల్పోతారు. అలా దూషిత శీలలు అయిన ఈ ఏడుగురినీ తమ భర్తలు వదిలేస్తారు. ఆ ఏడుగురికీ పుట్టిన పిల్లలు భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. వారిని "మా రుద" (ఏడవద్దు) అనటం వలన వారు మరుత్తులుగా స్థిరపడ్డారు. ఆ విధముగా స్వయంభువ మన్వంతరంలో వెలసిన వారు ఆది మరుత్తులు.

స్వారోచిష మన్వంతరం: స్వారోచిష మనువు కుమారుడు క్రతుధ్వజుడు. అతని ఏడుగురు కుమారులూ (అగ్ని సమానులు) ఇంద్రపదవి కోసం బ్రహ్మను గూర్చి తపస్సు చేయటానికి మహా మేరు గిరికి వెళతారు. ఈ విషయం తెలిసి భయపడిన ఇంద్రుడు తపోభంగం కలిగించడానికి అప్సరసలలో శ్రేష్ఠురాలయిన పూతనను పంపిస్తాడు. క్రతుధ్వజుని ఏడుగురు కుమారులూ నదిలో స్నానమాచరిస్తున్న సమయములో పూతన కూడా అదే నదిలో స్నానమాచరించడంతో వీరి మనసు అదుపు తప్పి వారి వీర్యం ఆ నదిలో పడిపోతుంది. ఈ విధముగా తపోభ్రష్టులయిన ఆ ఏడుగురూ తమ రాజ్యానికి వెళిపోతారు. నదిలో పడిన వీరి వీర్యం మహాశంఖుడు అనే మొసలి భార్య శంఖిని మ్రింగేస్తుంది. కొన్ని రోజులకి జాలరి వాళ్లకి ఈ మొసలి (శంఖిని) దొరకడంతో క్రతుధ్వజునికి ఆజ్ఞ ప్రకారంగా ఆ మొసలిని తీసుకెళ్ళి వారి ఇంటి వద్దన ఉన్న బావిలో వేస్తారు. కొంత కాలానికి ఆ శంఖినికి ఏడుగురు పిల్లలు పుడతారు. వారు గట్టిగా, భయంకరంగా ఏడుస్తూ ఉండగా "మా రుద" (ఏడవద్దు) అనటం వలన వారు మరుత్తులుగా స్థిరపడ్డారు.

ఉత్తమ మన్వంతరం: నిషధ దేశాధిపతి వపుష్మానుని పుత్రుడైన జ్యోతిష్మంతుడు పిల్లల కోసం మందాకినీ నదీ తీరంలో తపస్సు చేస్తుండగా అతని భార్య సుందరి (దేవ గురువు పుత్రిక) కూడా భర్తకు పరిచర్యలు చేస్తూ, సమిధలు, పుష్ప ఫలాలు సమకూరుస్తూ ఆమె కూడా అరణ్యవాసం చేస్తుంది. దీని వలన ఆమె బాగా కృశించి, శల్యమై పోతుంది. తపస్తేజముతో వనములో తిరుగుతున్న ఈమెను చూసిన సప్తర్షులు "మీ సద్గుణాలకు మా అనుగ్రహం తోడై మీ కోరిక నెరవేరి, పుత్ర సంతానం కలుగుతుంది, మీరు ఇంటికి వెళ్ళండి" అని వరమిస్తారు. వారివురూ వారి ఇంటికి వెళ్ళిన కొద్ది రోజులకి ఆవిడ గర్భం ధరించడం, భర్త మరణించడం, అది సహించలేని ఆవిడ కూడా సహగమనానికి సిద్ధపడి, తన భర్త చితాగ్నిలో దూకేయటం జరుగుతాయి. అలా దూకటం వలన ఆమె గర్భములో నుండీ ఒక మాంస ఖండం ఎగిరి బయట నీళ్ళల్లో పడి, శైతల్యానికి ఏడు భాగాలుగా విడిపోతుంది. దాని నుండీ ఉద్భవించిన వారే మరుత్తులు.

తామన మన్వంతరం: ఋతుధ్వజుడు అనే రాజు కుమారుల కోసం యజ్ఞం మొదలు పెట్టి, అగ్నిలో తన రక్త, మాంస, అస్థి, రోమ, కేశ, స్నాయువు, మజ్జ, శుక్రం, అన్నిటినీ హోమం చేస్తాడు. సరిగ్గా శుక్రం అగ్నిలో వేసే సమయములో "వద్దు వద్దు వేయద్దు" అనే మాటలు వినపడతాయి. వెంటనే ఆ రాజు చనిపోతాడు. దానితో ఆ అగ్ని (హవ్య వాహనుడు) నుండీ ఎంతో తేజస్సుతో ఏడుగురు శిశువులు ఏడుస్తూ బయట పడతారు. వారే మరుత్తులు.

రైవత మన్వంతరం: రైవతుని వంశంలో రిపుజిత్తనే రాజు, పుత్రులు లేనందున భాస్కరుని ఉపాసించి సురతి అనే పుత్రికను పొందుతాడు. వారివురూ ఒకరి పట్ల మరొకరు ఎంతో వాత్సల్యంతో ఉండేవారు. కొన్నాళ్ళకి రిపుజిత్తు మరణించగా, పితృ వియోగాన్ని భరించలేని ఆమె, సప్తర్షులు వద్దని వారిస్తున్నా వినకుండా చితిని పేర్చుకుని అందులో దగ్ధమవుతుంది. తగలబడుతున్న ఆమె శరీరం నుండీ ఏడుగురు బాలకులు ఉద్భవించగా, వారికి మరుత్తులు అని నామకరణం చేసి దేవతా గణాలలో చేరుస్తాడు బ్రహ్మ. అలా రైవత మన్వంతరంలో మరుద్గణాలు వెలిశారు.

చాక్షుష మన్వంతరం: సప్త సారస్వత తీర్థంలో శుచి వ్రతుడు, సత్యవాది అయిన మంకి అనే తపోధనుడు ఘోరతపస్సులో ఉండగా విఘ్నం కలిగించడానికి తుషితదేవతలు వపు అనే సుందరిని పంపిస్తారు. వపు ఆయన మనస్సును లోబరచుకోగా, ఆయన వశం తప్పడం వలన శుక్రం జారి ఆ సప్త సారస్వత జలాలలో పడుతుంది. వెంటనే తెలివి తెచ్చుకున్న ఆయన ఆగ్రహించి వపును శపించి, తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆ జలములో నుండీ ఏడుగురు పుత్రులు ఏడుస్తూ జన్మిస్తారు. వారే ఆ మన్వంతరంలో మరుత్తులు.

ఈ విధముగా ఒక్కో మన్వంతరంలో ఒక్కో విధముగా మరుత్తులు ఉద్భవించారు. అయితే ప్రతీ సారీ కూడా మా రుద (ఏడవకు) అనటం వలనే మరుత్తులు అయ్యారని తెలుస్తోంది. మరుత్తుల జన్మ వృత్తాంతాన్ని విన్నా, చదివినా పాప పరిహారం కలుగుతుందని వామన పురాణములో వివరించబడింది.

అగ్ని పురాణం ప్రకారం మన శరీరంలో ఉండే మూలాధార చక్రం నుండీ నాడులు బయలుదేరతాయి. వీటిలో ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తిజిహ్వా, పృథా, యశా, ఆలంబుషా, కుహూ, శంఖిని అనేవి ప్రాణ వాయువులని ప్రసారం చేస్తాయి కావున ప్రముఖమయినవి. ఆ పది రకాల ప్రాణ వాయువులూ ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయాలు. వీటి స్థాన చలనాలు: 

" హృది ప్రాణం గుదేపానం ఉదానో నాభి దేశకః
సమానో కంఠ దేశస్థః వ్యాన సర్వ శరీరగః
వాగ్ద్వారే నాగ ఆఖ్యాతః కూర్మాదున్మీలనం స్మృతం
కృకరాత్ క్షుధాజ్ఞేయః దేవదత్తాత్ విజృంభణం
మృతస్యాపి న జహాతి సర్వవ్యాపి ధనంజయః "

ప్రాణ వాయువు: హృదయంలో ఉంటూ జీవాత్మను వృద్ధి చేస్తుంది. ఇది శరీరంలో ఉండే శూన్యత్వాన్ని పూర్తి చేస్తూ మిగతా ప్రాణ వాయువులన్నిటినీ ప్రేరేపిస్తూ ఉంటుంది కావున ఇది మిగతా వాయువులన్నిటికీ అధిపతి. మన శ్వాస రూపములో ఉండేది ఈ వాయువే. ప్రాణి ఆయుర్దాయం తను తీసుకునే ఉచ్ఛ్వాశ, నిశ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. వీటిని ప్రాణాయామం ద్వారా అదుపు చేయగలిగితే మనిషి ఆయుర్దాయం పొడిగించవచ్చును.

అపాన వాయువు: ఇది శరీరములో పశ్చిమ భాగములో (గుదము వద్ద) ఉంటుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి, మల, మూత్ర, శుక్ర రూపములో క్రిందకి తోసేది అపాన వాయువు. అపానయానం (తొలగించటం) చేస్తుంది కనుక అపాన వాయువు అయ్యింది.

ఉదాన వాయువు: ఇది నాభి (బొడ్డు) వద్ద ఉంటూ దేహములో సగ భాగాన్ని పెంచుతుంది. స్పందన (ముఖ, పెదాల, కళ్ళ కదలికలు, మొ.,) కలిగించే వాయువు ఉదానము.

సమాన వాయువు: ఇది కంఠము వద్ద ఉంటూ సర్వ నాడుల పని తీరుని చూసుకుంటుంది. తిన్న ఆహారాన్నీ, త్రాగిన ద్రవాలనీ, వాసన చూసిన వాటినీ రక్త, పిత్త, వాత, కఫములుగా మార్చి సర్వాంగాలకూ సమానముగా పంచుతుంది కనుక సమాన వాయువు అయ్యింది. 

వ్యాన వాయువు: ఇది శరీరమంతా ఉంటుంది. శరీర భాగాలను పీడించటం, గొంతు బొంగురు పోయేలా చేయటం, వ్యాధిని ప్రకోపించటం దీని విధులు. వ్యాపన శీలంతో ఉండటం వలన వ్యానము అయ్యింది.
 
ఈ అయిదూ ప్రధాన వాయువులు కాగా మిగతా అయిదూ ఉప వాయువులు. అవే నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలు. వాగ్ద్వారము వద్దన ఉండి మాట వచ్చేలా చేసేది, త్రేన్పు, వాంతి వంటివి తెప్పించేది నాగ వాయువు. కూర్మ వాయువు మనం తిన్నవాటినీ, త్రాగినవాటినీ మ్రింగటానికే కాక, కను రెప్పలు మూసి, తెరవటానికి ఉపయోగపడుతుంది. ఆకలి, దాహం మొదలయిన వాటిని కలిగించేది, తుమ్ము తెప్పించేది కృకర వాయువు. ఆవలింతలు తెప్పించేది దేవదత్త వాయువు. ఇహ మనిషి చనిపోయాక కూడా మానవ శరీరంలోనే కొంతసేపు ఉండగలిగే వాయువు ధనంజయ వాయువు. ఈ ధనంజయ వాయువు వలననే చనిపోయిన శవం కొంతసేపటి తరువాత ఉబ్బుతుంది. ఇవే కాక, ప్రజాపత్య వాయువు అని ఒకటుంటుంది. ఆ వాయు పీడనం వలననే శిశువు తల్లి గర్భము నుండీ బయటకు వస్తుందనీ మార్కండేయ పురాణం చెప్తోంది. ఇలా బయటకు వచ్చే ప్రక్రియలో అలసిపోయిన శిశువుకు ఉత్తేజాన్ని ఇచ్చేది కూడా వాయువే కదా! అలసిన ఒంటికి చక్కని లాలన వాయువు. 
 
అథర్వణ వేదంలో మరికొన్ని వాయువుల ప్రస్తావన ఉంది. అవి: సుదనవ వాయువు (మనలో భక్తి భావాన్ని పెంచుతుంది), చిత్రభనవ వాయువు (అగ్నితో మమేకం అవుతుంది), హస్తిన వాయువు (అతి వేగముతో ప్రయాణిస్తూ ఈదురుగాలులను, సుడిగాలులను కలిగిస్తుంది), అహిమన్యవ వాయువు (ఇక వర్షాన్ని కురిపించు అని చెప్పడానికి సంకేతంగా మేఘాన్ని తాకి తొలి చినుకులను విడుదల చేస్తుంది), యువన వాయువు (ఈ వాయువు కారణంగానే మెరుపులు చలిస్తాయి), అధిగ్రవ వాయువు (అపారమయిన ధైర్యాన్ని, శత్రువులని ఎదిరించి నిలబడే సామర్ధ్యాన్నీ ఇస్తుంది), అజ్జోభి వాయువు (అగ్ని త్యాగాలు అనగా సహగమనాలు, అగ్ని ప్రవేశాలు, మొ., వాటిలో ఉంటుంది), వక్షసు వాయువు  (వక్షస్థలం వద్ద ఉంటుంది), చిత్రేయ వాయువు (ఇది కాళ్ళూ, చేతులూ కదల్చడానికి ఉపయోగపడుతుంది), నిమిముక్షు వాయువు (వేటినయినా దగ్గరకి చేర్చడానికి ఉపయోగపడుతుంది, మండేటప్పుడు ఒక్కో అగ్ని కణాన్నీ, వాన కురిసేటప్పుడు మేఘాలనీ దగ్గరకు చేర్చే ముఖ్య వాయువు ఇదే), హిరణ్యేయ వాయువు (దీనినే హిరణ్యేయం అని కూడా అంటారు. ఏ రూపంతోనూ చేరకుండా, పరిభ్రమిస్తూ ఉంటుంది), నర వాయువు (ఇది ఏదో ఒక రూపముతో కలుస్తుంది. అగ్నితో కలిసినప్పుడు "అస్య" అనీ, సూర్యునితో కలిసినప్పుడు "కుక్షి" అనీ రక రకాలుగా పిలుస్తారు), అజ్ర వాయువు (ఎక్కువగా రాత్రిపూట చలిస్తుంది), ఇలా ఎన్నో రకాల వాయువులు మన చుట్టూ ఉంటూ మనకు పరి పరి విధాలుగా ఉపయోగపడుతున్నాయి.
 

పంచభూతాలు ఒకదాని నుంచి మరొకటి ఏర్పడతాయి, ఒక దానితో మరొకటి హరింపబడతాయి, అలానే అదే క్రమములో పునరావృతం అవుతాయి. ఈ మార్పులన్నీ జరగడానికి ముఖ్య కారణం ప్రాణశక్తి. మానవ శరీరం కూడా పంచ భూతాలతో చేసినదే కనుక మనలో ఉండే పంచభూతాలను నడిపేది కూడా ప్రాణశక్తే. మన దేహం అస్వస్థతకు లోనవడానికి ఈ ప్రాణశక్తిలో వచ్చే మార్పులే కారణం. శరీరంలో ఏ భాగానికయినా తగినంత ప్రాణశక్తి అందనప్పుడు (క్రమేణా ఆ భాగం నిర్వీర్యమవుతుంది) లేదా అవసరానికి మించి ప్రాణశక్తి లభించినప్పుడు (అధిక శ్రమకు లోనై) అనారోగ్యం వస్తుంది. ఈ అసమతుల్యాన్ని నివారించాలంటే మనలోని వాయువులన్నీ సక్రమంగా పని చేస్తూ సమతుల్యతతో ఉండాలి. అప్పుడే మన శరీర భాగాల పనితీరు సవ్యంగా ఉండి, సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము. అదే విధముగా మన పర్యావరణం కూడా సక్రమంగా పని చేస్తూ, ఆరోగ్యవంతంగా ఉండాలన్నా కూడా వాయువులన్నీ సమతుల్యతతోనే ఉండాలి. అప్పుడే సుభిక్షతతో వర్ధిల్లుతాము.

 

"ధ్వజ హస్తాయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్"