ఈ రోజున అర్థరాత్రి అంతర్వేది (గోదావరీ నది సముద్రంలో కలిసే చోటు) శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు శోభాయమానంగా జరుగుతాయి. కనుక ఆయనని స్మరించుకుంటూ భక్తితో ఆయనకి అర్పించుకుంటున్న అక్షర మాల.
అంతర్మధనమే చేశా స్వామీ
ఆది అంతమూ నువ్వే స్వామీ
అంతర్వేదిలో వెలసిన స్వామీ
శ్రీలక్ష్మీ సమేత నరసింహ స్వామి
ప్రహ్లాదునే బ్రోచిన నరహరివి
సిరిసంపదలిచ్చే శ్రీ హరివి
మాంపాహి పాహి దయకనవా నీ రక్ష మాకు ఉందనవా
వేదాలు కాచగా వేదాద్రిపైన
వెలసిన జ్వాలా నరసింహ
దైత్యుల శిక్షించి ఆ బిలములోన
వెలసిన ఉగ్ర నరసింహ
యోగి పుంగవూ నువ్వే
యోగానందువీ నువ్వే
పతిత పావనా పరమ హంసవు నువ్వు
కాలగమనమే కలిగించే నువ్వు
లోక కళ్యాణ మొనరించె నువ్వు
మాంపాహి పాహి దయకనవా నీ రక్ష మాకు ఉందనవా
పీడలు తీర్చగ యాదగిరి పైన
వెలసిన సుందర నరసింహ
భక్తుల రక్షించ ధర్మపురిలోన
వెలసిన ఆనంద నరసింహ
భోగి మణివీ నువ్వే
భోగానందువీ నువ్వే
ఏడేడు లోకాల ఏలిక నువ్వు
తరతరాల మా ఇలవేలుపు నువ్వు
యుగయుగాలు కల్పించే నువ్వు
మాంపాహి పాహి దయకనవా నీ రక్ష మాకు ఉందనవా
ఉగ్ర నారసింహ, కృద్ధ నారసింహ, వీర నారసింహ, విలంబ నారసింహ, కోప నారసింహ, యోగ నారసింహ, అఘోర నారసింహ, సుదర్శన నారసింహ, లక్ష్మీ నారసింహ, ఈ తొమ్మిది అవతార రూపాల్నీ కలిపి నవనారసింహ రూపాలు అంటారు. అలానే అహోబిలంలో కనిపించే నవనారసింహ మూర్తులు... ఛత్రవత నారసింహ, యోగానంద నారసింహ, కరంజ నారసింహ, ఊహా నారసింహ, ఉగ్ర నారసింహ, క్రోధ నారసింహ, మాలోల నారసింహ, జ్వాలా నారసింహ, పావన నారసింహ.
