
అందరికీ ఎంతో సుపరిచితమయిన దీని
పేరు ఇండుపకాయ లేదా ఇందుగు గింజ లేదా చిల్లగింజ (Strychnos potatorum Linn.). దీనినే
సంస్కృతంలో నిర్మలి అనీ, ఆంగ్లంలో clearing
nut tree అనీ అంటారు. దీనికున్న లక్షణాల వలన ఆ పేరు పెట్టారో లేక ఆ పేరు
ఉన్నందువలన దీనికి ఆ లక్షణాలు వచ్చాయో నాకు అర్థం కాలేదు. పూర్వము మడ్డి నీటిని
తేట బఱచడానికి చిల్లగింజ (లేక చిల్లవిత్తు)ని బాగా అరగదీసి వాడేవారు. దాని నుండి
వచ్చే గంధం నీటిని పరిశుభ్రపరచడమే కాక ఆరోగ్యకరంగా కూడా ఎంతో మంచిది. దీనికి
సంబంధించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ టపా.
పూర్వకాలంలో జనాలు మందులకోసం వృక్ష సంపద మీదే ఆధారపడేవారు. ఇలా పసరు,
మూలికలు మొదలయిన వాటి మీద ఆధారపడటం ఋగ్వేద కాలం నుండి ఉందని అంటారు.
ఇప్పుడున్నన్ని మందులు, జబ్బులు కూడా ఆ కాలంలో ఉండేవికావుట. WHO (World Health Organization) వారి అంచనా ప్రకారం ఇప్పటికీ ఎనభై శాతం జనాలు ప్రకృతి
చికిత్సా వైద్య విధానం మీద ఆధారపడుతున్నారుట. గిరిజనులు దాదాపుగా ప్రతీ
చికిత్సకీ వీటినే కదా వాడేది. ఆ కాలంలో అంతగా చదువుకొని రోజుల్లోనే వీళ్ళు ఈ
చిల్లగింజకి ఉన్న గుణాలను ఎలా గుర్తించారు అన్నదే ఇప్పటికీ నాకు
అంతుపట్టని విషయం. వరదలోచ్చినప్పుడో, వానలు బాగా పడినప్పుడో, నీటిలో బురద
చేరటం మామూలే. క్రొత్త
గోదావరి నీరు చూస్తే బాగా అర్థమవుతుంది బురద నీటిలో కలవటం అంటే ఏమిటో
(మిగతా నదుల్లో నీళ్ళు చూసినా తెలుస్తుందేమో కాని నాకు గోదావరి అలవాటు కనుక
అలా చెప్పేసాను). ఇప్పుడంటే
వాటర్ ఫిల్టర్స్, ఆక్వాగార్డ్స్ వంటివి ఉన్నాయి కాని ఆ కాలంలో నీటిని
వడకట్టుకునో, కాచుకునో త్రాగేవారు. అటువంటి సమయంలో ఈ చిల్లగింజలను బాగా
నూరి లేదా నలిపి ఆ గింజల పొడిని కుండ అడుగుభాగంలో వేసేసి బురద చేరిన నీటిని పోసి అలా ఉంచేస్తే కాస్సేపటికి బురదంతా (బురదతో పాటు నీటిలో ఉండే సూక్ష్మజీవులు, క్రిములు అన్నీ) క్రిందకీ, మంచి నీరంతా పైకి వచ్చి త్రాగడానికి వీలుగా ఉండేది. మనం గత కొన్నేళ్ళ క్రిందట వాడిన వాటర్ ఫిల్టర్స్లో ఉండే కాట్రిడ్జ్ కూడా చిల్లగింజ గంధంతో తయారయినదని పరిశోధకుల విశ్వాసం.
ఈ చిల్లగింజ మొక్కలు భారతదేశంలో పుట్టాయి.
శ్రీలంక, జింబాంబ్వే, బోట్స్వానా, మ్యాన్మార్, మొదలగు దేశాల్లో కూడా
అక్కడక్కడా కనిపిస్తాయి. ఈ పండ్లు గుండ్రంగా ఎరుపు రంగులో (ఈ చిత్రంలో
చూపిన విధంగా) ఉండి బాగా పండినవి నల్లగా అవుతాయి. గింజలు గుండ్రంగా, ముదురు
గోధుమ రంగులో, చిన్న పట్టులాంటి నూగుతో ఉంటాయి. ఈ గింజల పొడి పసుపు రంగులో
ఉంటుంది. ఈ జాతి మొక్కలలో ఉండే హానికరమయిన పదార్థం (Strychnine) ఇందులో
లేకపోవటం విశేషం. కనుక ఈ గింజల పొడి (దీనినే గంధం అంటారు) నీటిలో కలిసినా
మనకి ఎటువంటి హానీ ఉండదు. పైగా ఈ పొడి వలన ఆరోగ్యంగా ఉంటామని
శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలలో తేల్చి చెప్పారు. వీటి ప్రయోజనాలేమిటంటే:
౧. గింజలు - తల, ఉదర సంబంధిత బాధలకి, లోజ్వరాలకీ, మధుమేహానికి, డయేరియాకి, అన్ని రకాల కంటి జబ్బులకి, మూత్రపిండాల జబ్బులకీ, లివరు బాగా పని చేయటానికీ మంచి మందుగా పని చేస్తాయి.
౨. వేళ్ళ రసం బొల్లి, శోభి తదితర మచ్చలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
౩. ఫలాలు - మూర్ఛ, విషాలను హరించడానికి, అధిక దాహాన్ని తగ్గించడానికి మందుగా వాడతారు.
ఒక్క
మొక్క వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసేసరికి చాలా మంది దృష్టి వీటి
మీదకి మళ్ళింది. ఇప్పటిదాకా అందరూ మర్చిపోయి, వాటి పేరు కూడా తెలియకుండా
పోయి, ఏదో పిచ్చి మొక్క క్రింద పడి ఉన్న మొక్కకి ఇప్పుడు ఇన్ని ప్రయోజనాలు
ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పటం వలన ఒక్కసారిగా వ్యాపారస్తులు సైతం వీటి
కోసం ఎగబడుతున్నారు. శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోజనాల కోసం
శోధిస్తున్నారు. ఇన్ని సద్గుణాలను, ఉపయోగాలను కలిగి ఉన్న చిల్లగింజ మన పద్యాలలో కూడా స్థానం సంపాదించుకుంది.
సరసగుణ ప్రపూర్ణునకు సన్నపుదుర్గుణ మొక్కవేళయం
దొరసిన నిట్లు నీకుఁ దగునో యని చెప్పిన మాననేర్చుఁగా
బురద యొకీంచుకంత తముఁ బొందినవేళలం జిలవిత్తుపై
నొరసిన నిర్మలత్వమున నుండవె నీరములెల్ల భాస్కరా!
ఏ విధముగా అయితే నిజ స్వభావము చేత
నిర్మలమైన నీళ్ళు పొరపాటున బురద కలిస్తే చిల్లగింజ గంధం కలపగానే తేఱి మళ్ళీ మంచిగా
మారిపోతాయో అదే విధముగా ఎల్లప్పుడూ మంచిగుణములు ఉండే యోగ్యునకి ఎప్పుడైనా ఒక
దుర్గుణము కలిగితే ఇది నువ్వు చేసే పనేనా అని ఒక్కసారి చెపితే వెంటనే మారి తన
తప్పు తెలుసుకుని మళ్ళీ ఆ తప్పును చేయడు అని అర్థం.
కలకండ పేరుచెప్ప నోరు తియ్యబడదురా
చిల్లగింజ పేరుజెప్ప జలము శుద్ధిగాదురా
గంజాయి పేరువిన్న నిషా నీకు రాదురా
చిత్రపట జ్యోతులతో చీకటి తొలగిపోదురా
ఇది నాగులవంచ వసంతరావు
గారు వ్రాసిన పద్యం. దీని
అర్థం మనకి తెలుస్తూనే ఉంది కనుక వివరించే ప్రయత్నం విరమిస్తున్నాను.
అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం
కృత్వాజ్ఞానం స్వయం నస్యేత్ జలం కతక రేణువత్
అని ఆది శంకరాచార్యుల వారు ఆత్మబోధలో అంటారు. ఇక్కడ కతక రేణువు అంటే చిల్లగింజ
పొడి. ఇది మురికి నీటిని పరిశుభ్రం చేసి నీటిలోనే కలిసిపోతూ ఉన్నట్లుగా అజ్ఞానం
చేత కలుషితమయిన జీవుని జ్ఞానాభ్యాసం అనేటువంటిది బాగా పరిశుద్ధునిగా చేసి గురువు
ఇచ్చిన జ్ఞానం తనంతట తానుగానే లీనమయిపోతూ ఉంటుంది అని అర్థం. అదే విధంగా వేమన
శతకంలో ఈ పద్యం చూడండి:
గురువు చిల్లగింజ కుంభ మీదేహంబు
ఆత్మ కలుషవంక మడుగుఁబట్టఁ
దెలిసి నిలిచెనేని దివ్యామృతంబురా
విశ్వదాభిరామ వినర వేమ!
అలానే ఈ
కీర్తనలో కూడా గురువుని చిల్లగింజ తోనే పోల్చారు చూడండి:
నీ చిత్తము నిశ్చలము - నిర్మలమని నిన్నె నమ్మినాను
నా చిత్తము వంచన చంచలమని - నను విడనాడకుమి;
శ్రీరామ !
గురువు చిల్లగింజ - గురువే భ్రమరము
గురుడే భాస్కరుడు - గురుడే భద్రుడు
గురుడే యుత్తమగతి - గురువునీ వనుకొంటి
ధరను దాసుని బ్రోవ - త్యాగరాజనుత !
ఇలా పద్యాలతో నీతులు వల్లిస్తూ, కీర్తనలతో ఆధ్యాత్మికంగా,
పిత్త, కఫ దోషాలను హరిస్తూ ఆరోగ్యపరంగానే కాక, పరిశ్రమల్లో (నేత, కాగితం) కూడా ఈ చిల్లగింజలు
సుస్థిరమయిన స్థానాన్ని పొందాయి. ఇప్పుడు పరిశోధకులు, ఫార్మసీ వారి దృష్టి కూడా పడింది
కనుక మున్ముందు ఏమవుతుందో వేచి చూడాలి! ఏదేమయినా ఈ సంపదనన్నా మరీ అంతరించిపోయేదాకా
కాకుండా మితంగా వాడితే మంచిది.