యక్షులు అనగానే వాళ్ళు దెయ్యాలేమో అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. నాకు కూడా ఇదే భావన ఉండేది కానీ మన శివ పంచాక్షరీ స్తోత్రంలో శివుడిని స్తుతిస్తూ యక్షస్వరూపాయ అని అంటాం కదా! శివుడు దేవుడు కాబట్టి వాళ్ళెవరో కూడా గొప్పవాళ్ళే అయ్యుంటారు అనుకున్నా. ఈ యక్షుల ప్రస్తావన మన పురాణాలలో కూడా చాలా సార్లు వస్తుంది కనుక వారి గురించి మరిన్ని ఆసక్తికరమయిన విషయాలు తెలుసుకున్నా. వాటిని మీతో పంచుకుందామని ఇక్కడ పెడుతున్నా.
విషయానికి వస్తే, వీరు దేవతా గణాలలో ఒకరు. వీరి నివాసం అథోలోకాలలో ఒకటయిన తలాతలం (అతలంలో పిశాచ గణాలు, వితలంలో గుహ్యకులు, సుతలంలో రాక్షసులు, రసాతలంలో భూతాలూ, తలాతలంలో యక్షులు, మహాతలంలో పితృదేవతలు, పాతాళంలో పన్నగులు ఉంటారు). అలానే, గోమాతలో సకల దేవతలు, దేవతా గణాలన్నీ ఉన్నాయి అంటారు కదా! అలా చూసుకుంటే వీరి నివాసం గోమాత యొక్క వామ భాగం. వరాహ పురాణంలో ఒక్కో దేవతా గణాలకీ ఒక్కో పర్వతం నిలయంగా ఉంటుందని చెప్పబడింది. దాని ప్రకారం వీరి నివాస పర్వతం శతశృంగం.
వీరు ఎక్కడుంటారో తెలిసింది కనుక ఎలా ఉంటారు అన్నది తెలియాలి. వీరిలో మగ వారిని యక్షుడు అని, ఆడవారిని యక్షిని అని అంటారు. వీరు సౌందర్యమయిన శరీరాకృతిని కలిగి ఇక్కడ చిత్రములో చూపిన విధముగా ఉంటారు. యక్షులకి కుబేరుడు రాజు. వీరి పని గుప్త నిధులకి కాపలా. వీరిని ప్రసన్నం చేసుకోగలిగితే మనం కోరుకున్నవి దక్కించుకోవచ్చు అని ఉత్థమారేశ్వర తంత్రంలో చెప్పబడింది. వీళ్ళల్లో యక్షినులు అత్యంత శక్తి కలవారు. వారిని మనం ఆవాహనం కూడా చేసుకోవచ్చుట. అటువంటి సమయాల్లో వాళ్ళు మనిషి శరీరంలోకి చెవి ద్వారా ప్రవేశిస్తారుట. వీళ్ళు సాధారణంగా మంచి చేస్తూ శాంతంగా ఉంటారు కానీ కొద్ది మంది రౌద్రంగా ఉండి చెడు చేస్తారుట.
యక్షులు మంచి కళాపోషకులు అని నా అభిప్రాయం. కాళిదాసు రచించిన మేఘదూతం (తెలుగులో మేఘసందేశం)లో యక్షుడు తన ప్రియురాలయిన యక్షినిని వదిలి ఉండలేక ఆ విరహానికి చక్కని అక్షర రూపం ఇచ్చాడు. అలానే యక్ష ప్రశ్నల (యమ ధర్మరాజు ఒక యక్షుని రూపంలో వెళ్తాడు) గురించి వినే ఉంటారు. అవి చదివితే అబ్బో వాళ్ళెంత తెలివయిన వాళ్ళో అనిపిస్తుంది. హరివంశ కావ్యాన్ని తెలుగులో రచించిన వారిలో ఒకరయిన నాచన సోమన గారిని ఘను నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున యక్షిని దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు స్తుతి యొనరింతున్ అని కొనియాడారు పరవస్తు చిన్నయసూరి గారు.
మనకి బాగా తెలిసిన యక్షిని తాటకి. సుకేతుడు అనే యక్షుడు పిల్లలకోసం తపస్సు చేసినపుడు నీకు వెయ్యి ఏనుగుల బలం ఉన్న కూతురు పుడుతుంది అని బ్రహ్మ వరం ఇవ్వగా తాటకి పుట్టింది. ఈమెను ఝఝరుడను యక్షుని కుమారుడయిన సుందుడు కి ఇచ్చి పెళ్లి చేయగా వారికి మారీచుడు పుడతాడు. ఒకసారి సుందుడు అగస్త్యున్ని కొట్టడానికి వెళ్తాడు అప్పుడు ఆయన ఆగ్రహంతో సుందుడిని భస్మం చేస్తాడు . అది భరించలేక తాటకి, మారీచుడు కలిసి అగస్త్యుని చంపడానికి వెళ్తే ఆయన వీరివురినీ రాక్షసులు అవ్వమని శపిస్తారు. అలా యక్షులు కాస్తా రాక్షసులుగా మారారు అని వాల్మీకి రామాయణంలో బాలకాండలో చెప్పబడింది.
మనకి బాగా తెలిసిన మరికొంతమంది యక్షులు మణిగ్రీవుడు, నలకూబరుడు. వీరిద్దరినీ మద్ది చెట్టులై పడమని ఒక ముని శపిస్తాడు. ఆ మద్ది చెట్ల మధ్యలో నుంచి కృష్ణుడు రోలుని (యశోదా దేవి కృష్ణుడిని రాతికి కట్టినపుడు) పెట్టి లాగడం వలన వాళ్ళకి శాపవిమోచనం జరుగుతుంది.
యక్ష గానం అనేది చందోబద్ధమయిన నాటకము, కూచిపూడి నాట్యంలో ఒక ప్రక్రియ. ఇందులో గద్యం, పద్యం, పాటలు అన్నీ కలగలిపి ఉంటాయి. యక్ష గానాలలో రామాయణాన్ని రచించి ఎంతో మందికి చేరవేసినది ఆంధ్ర కాళిదాసు బిరుదాంకితుడయిన ఆలూరి కుప్పన కవి. శ్రీనాధుని కాలంలో ఇవి బాగా ప్రచారంలో ఉండేవని, తెలుగులో మొత్తం నాలుగువందలు పైచిలుకు యక్ష గానాలున్నాయని అంచనా.
యక్షులు దేవతా గణాలే అయినా కొంతమంది స్వార్థ పరులకి ఉపయోగపడటం వలన, వీరు రాత్రి పూట ఎక్కువగా విహరించటం వలన వీరిని దెయ్యాలలా భావిస్తున్నారు. పూర్వం విఠాలాచార్య సినిమాలలో మనం చూసిన ఎన్నో శక్తులని (పాదుకా సిద్ధి, అంజన సిద్ధి, మేఘ సిద్ధి, మొదలయినవి) చూసి నిజం కాదేమో అనుకున్నా కానీ ఇవన్నీ యక్షుల శక్తులు.
34 comments:
రసజ్ఞ గారు urgnet గా యక్షుల ని చూడాలని ఉంది ...నాకు తెలియని విషయాన్ని పంచుకున్నారు....బాగుంది
ధన్యులు మీరు
అగ్రిగేటర్లో కనపడి బ్లాగులో ఏమీ లేకపోతే ఇదేదో ఆశ్చర్య, అద్భుత రసాల మేళవింపనుకున్నా. బాగుంది.
Intresting!
మరో చక్కటి వ్యాసం. చాలా బాగుంది.
మణిగ్రీవుడు, నలకూబరులు కుబేరుని పుత్రులు. విరికి కలిగిన శాపానుగ్రహం - దేవర్షి నారదుని వల్ల.
రసజ్ఞ గారు చాల బాగుందండి.......నాపిచ్చి గాని మా రసజ్ఞ గారు రాయటం బాగ లేక పోవడమ......
మన సాంప్రదాయన్ని,దర్మాన్ని....కాపాడడానికి మి వంతు క్రుషి చెయండి...
చెస్తారని అశిస్తాను.........
ఇక్కడ చదువుతూ వేరే యక్షినిని చూడాలా ఈమెనే జ్ఞాన యక్షిని...
యక్ష కిన్నర గంధర్వ రాక్ష సాది
కథలునూ జాతులు పురాణ కల్పితములు
మనిషి మంచిగా బ్రతుకు నా మార్గములను
అందరికి జెప్పుటే పరమార్థ మిచట
బ్లాగు : సుజన-సృజన
@ శేఖర్ గారూ
హహహ! అందుకే కదండీ అక్కడ ఫోటో పెట్టాను చూసెయ్యండి ;) ధన్యవాదాలండీ!
@ తెలుగు పాటలు గారూ
:):) మీరు మరీను! ఏవండోయ్ నేను భూలోకంలో ఉండే మనిషినే కాని తలాతలం ఉండే యక్షిని కాదు! ధన్యవాదాలు!
@ తాతగారూ
నవరసాల్లో అవి కూడా ఉన్నాయిగా :) హా నిజానికి ఈ టపా చాలా అల్లరి చేసిందండీ! యక్షుల మహిమేమో! ధన్యవాదాలు!
@ జలతారు వెన్నెల గారూ
నిజమే అండీ! ఒక్కో యక్షువూ ఒక్కో వింతే! మనకి ఆశ్చర్యమే! ధన్యవాదాలు!
@ తెలుగు భావాలు గారూ
మీకు వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు! నారద మునేనా కాదా అని చిన్న సంశయం అందుకే తప్పు చెప్పకూడదు కదా అని ముని అని పెట్టేశాను. కృతజ్ఞతలు!
@ రఘు గారూ
హహహ! అంతా మీ అభిమానమండీ! వీలున్నంతవరకూ తప్పక ప్రయత్నిస్తాను నాకు చేతనయినది! ధన్యవాదాలు!
@ వెంకట రాజారావు . లక్కాకుల గారూ
మాటలకి చక్కని పద్య రూపం ఇచ్చి పదాలని పాదాలలో పొందుపరిచే మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు! అవి తెలుసుకొని నడుచుకోవడమే ముఖ్యం కదండీ! కృతజ్ఞతలు!
@రసజ్ఞ గారు నాకు చిన్నపాటి నుంచి యక్షులు అంటే భలే ఇష్టం హిందీ లో " యక్ష ప్రశ్నః " అనే పాఠం వచ్చింది అప్పటినుంచి తెలుసు వీరు. నేను మా ఫ్రెండ్స్ ని ఎక్కువ సందేహాలు అడుగుతుంటాను నన్ను యక్షుడు అనేవారు ఒకప్పుడు ;) . మొత్తానికి వారి గుట్టు విప్పారు. ఇంతకు ప్రసన్నం ఎలా చేస్కోవాలో చెప్పలేదు :-P చెప్తే బాగుంటుంది . నేనేదో మంత్ర గాడిని అనుకోకండి. విఠలాచార్య గారడీ చూసి మనకు తెలిస్తే బాగుణ్ణు అనిపిస్తుంది. మీరు చెప్పక ఇంకా బలపడింది ఆ నమ్మకం . వీరి గురించి ఏదో ఒక కథ కూడా చదివినట్టు గుర్తు దేవతలకు బుధి చెప్పాలని బ్రహ్మ ఓ యక్షిని ని సృష్టిస్తాడు కూడా. మొత్తానికి అదరగొట్టారు . :)
బాగుంది. అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాల గుట్టు ఇదన్నమాట!
యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులను గూర్చి తెలియజేయగలరు.
యక్షులను ప్రసన్నం చేసుకొనే మార్గాలు నాలుగు చెప్పండి. తేలికైనది అనుసరిస్తాను. చాలా అవసరంగా ఉంది....దహా.
తెలియని విషయాలు చాలా తెలుస్తున్నాయి మీ బ్లాగులో.
మంచి introductory/పరిచయ వ్యాసం. బాగుంది!
తెలుగు యక్షగానాలలో బోలెడంత original imagery, native touch ఉన్న imagery తో నిండిన సాహిత్యం ఉండడానికి అవకాశం ఉంది (అని నేననుకుంటాను!). వీలయినప్పుడు, వాటి వైపు ఒకసారి చూసి, అందమైన, హృద్యమైన భావాలతో నిండివున్న వాటిని వెలికితీసి చూపించే ప్రయత్నం చేయండి. బాగుంటుంది!
ధన్యవాదాలు!
యక్ష ప్రశ్నలు వేసి మొత్తానికి యక్షులను ప్రసన్నం చేసుకున్నావు రసజ్ఞా..మక్కూడా సాక్షాత్కరింపజేశావు. ధన్యవాదాలు.
hii.. Nice Post Great job. Thanks for sharing.
Best Regarding.
More Entertainment
రసజ్ఞ గారూ! అందరికీ సుపరిచయమైన వాడుకలో ఉన్న పదాలను తీసుకుని చాలా బాగా క్షుణ్ణాంగా పెరిశోధించి చక్కగా రాస్తున్నారు. తెలియని విషయాలెన్నో తెలుస్తున్నాయి మీ ద్వారా... :)
Rasagna gaaru okasaari chooda praardhana---
నమ్మొద్దు నమ్మొద్దు 'ఆ' ఆడవాళ్ళను నమ్మొద్దు...@
http://kalibhaaratham.blogspot.in/
అద్భుతం. చాలా బాగున్నదండి.
ధన్యవాదములు.
రసజ్ఞ గారు
మీకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
Nice one... Rasagnagaru
@ కళ్యాణ్ గారూ
హహహ! మీరు కూడా నాలా సందేహాల పుట్ట అనమాట! వాళ్ళని ఎలా ప్రసన్నం చేసుకోవాలో మీకు నేను చెప్పాలంటే ముందుగా మీరు నన్ను ప్రసన్నం చేసుకోవాలి. హహహ అలాంటి కథలు నాకేం తెలియదు మీకు తెలిస్తే చెప్పండి! ధన్యవాదాలండీ!
@ SNKR గారూ
చాలా థాంక్స్ అండీ! హా అదే అండి ఇప్పుడు తెలిసిపోయిందిగా! యక్షుల గురించి చెప్పేసా కనుక మిగతా వారి గురించి మెల్లిగా వీలు చూసుకుని చెప్తానండీ!
@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
అవునండీ మీకు నిజంగా అవసరమే చంద్రహారాలు చేయిస్తున్నారు కదా! మిగతా జనాలకి ముందు మిమ్మల్ని ప్రసన్నం చేసుకోమని చెప్తా నగలు దక్కుతాయి ము.ము.న. ధన్యవాదాలండీ!
@ వెంకట్ గారూ
ధన్యవాదాలండీ! యక్ష గానాల గురించి ఇక్కడ ఎక్కువ ప్రస్తావిస్తే వ్యాసం ప్రక్క దారి పడుతుంది అనిపించింది. అందుకే అలా సూక్షంగా ముగించా. తప్పకుండా ప్రయత్నిస్తాను.
@ జ్యోతిర్మయి గారూ
హహహ! మొత్తానికి యక్షులు ప్రసన్నమయ్యారుగా ఇంకా ఆలస్యం చేయకుండా కోరేసుకోండి ఏం కావాలో ;) ధన్యవాదాలండీ!
@ chicha.in గారూ
చదివి అభినందించినందుకు మీకు కూడా థాంక్స్ అండీ!
@ చిన్ని ఆశ గారూ
మనం నిత్యం వినే వాటి గురించే మనకి ఎంత వరకు తెలుసు అని తెలుసుకుందామనే నా ఈ ప్రయత్నమండీ! మీరంతా ఇలా చదివి ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండీ!
@ భారతీయుడు గారూ
చదివా అండీ! ఎందుకని ఆడాళ్ళ మీద పడ్డారు!
@ మూర్తి గారూ
మీకు నచ్చి స్పందించినందుకు మీకు కూడా ధన్యవాదాలండీ!
@ శ్రీను గారూ
మీకు కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలండీ! ధన్యవాదాలు!
@ హరి గారూ
థాంక్స్ అండీ!
రసజ్ఞ గారూ.. యక్షుల కబుర్లు బాగున్నాయండీ..
కబుర్లతో పాటూ యక్ష ప్రశ్నలను కూడా
పరిచయం చేయండి.
ఎప్పుడూ వినే/మాట్లాడే అర్ధాలు తెలియని మాటలన్నిటికీ వివరణలు దొరుకుతాయండీ ఇక్కడా.
ధన్యవాదములు..ఎప్పటీలాగానే చక్కని వ్యాసం
రసజ్ఞ గారూ,
యక్షగానం పుట్టింది ప్రస్తుత కర్నాటకలోని తుళునాడులో (అయితే దీని మూలాలు తెలుగుదేశములోనే ఉన్నాయని వాదనలున్నాయి). ఇప్పటికీ తుళు, కన్నడ దేశాల్లో మంచి ప్రాముఖ్యత కలిగిఉంది. కన్నడదేశములో దీన్ని కేళిక, ఆట, బయలాట, దశావతార అనే పేర్లతోనూ పిలుస్తారు. అయితే మనం ఇక్కడ చెప్పుకున్న యక్షులకి, యక్షగానానికీ ఎంతవరకూ సంబంధం ఉంది అనేది సందేహాస్పదం. యక్షగానములో ఉన్న 'యక్ష' అనే పదం పురాతన ద్రావిడ జాతిని సూచిస్తుంది. ఈ యక్ష, నాగ జాతుల కలయికే నేటి మన తెలుగుజాతి పుట్టుకకు కారణమని పరిశోధకుల విశ్వాసం.
కావ్యాలు బాగా చదివినట్లుంది మీరు.అలవోకగా శ్లోకాలు,పద్యాలు వివరిస్తారు. .మన సంస్కృతి గురించి తెలుసుకోవటం ఆసక్తికరం. నిజాలో కాదోగాని కావ్యాలన్నీ గొప్ప ఊహాశక్తికి,సృజనాత్మకతకు ప్రతీకలని నా ఉద్దేశం .ధర్మరాజు కు యక్షరాజు వేసిన ప్రశ్నలు ఒక సారి తెలియజేయండి.
రసజ్ఞ గారూ,
యక్ష,గంధర్వ,కిన్నెర,కింపురుషులు అని చిన్నప్పటి నుండీ వినటమే కానీ వివరాలు ఎప్పుడూ తెలుసుకోలేదు. తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఉండేది. చాలా ఆసక్తి కలిగించే వ్యాసం వ్రాసారు.
యక్షుల వివరములను బహు
లక్షణముగ చెప్పినారు రసభరితముగా
ఈక్షణమే నాకు తెలిసె
వీక్షింపగ మీదు బ్లాగు వివరంబులతో.
మీరు చెప్పినదాన్ని నేను కూడా విన్నాను. కాని చాలా మందికి తెలియదు. యక్ష జాతి వేరు రాక్షస జాతి వేరు అని
@ రాజి గారూ
మీకు కబుర్లు నచ్చినందుకు ధన్యవాదాలు! యక్ష ప్రశ్నలు సంస్కృతంలో (ఆంగ్లానువాదముతో) http://www.scribd.com/doc/88949395/Yakshaprasna-Sanskrit-English మరియు తెలుగులో (నేను వ్రాసినది) http://www.scribd.com/doc/88958169/%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B6%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81 చదవండి.
@ రాజ్ కుమార్ గారూ
మీ ప్రోత్సాహంతో మరిన్ని అందించటానికి (నాకు తెలిసినవి, తెలుసుకున్నవి) ప్రయత్నిస్తాను. మీకు కృతజ్ఞతలు!
@ అరుణ్ గారూ
మీరు చెప్పినది వాస్తవమే! పూర్వము యక్షులు చేసే గాన ప్రక్రియ కొంచెం ప్రత్యేకముగా అన్నిటి కలబోతతో ఉండేదిట అందువలనే ప్రస్తుతం మనకి తెలిసిన ఈ ప్రక్రియలో కూడా పద్యం, గద్యం, పాటలు ఇలా అన్నీ కలగలిపి ఉండుట వలన దానికి యక్ష గానం అని పెట్టారని వినికిడి. అయితే మన తెలుగు జాతి పుట్టుక విషయంలో మాత్రం మీరు చెప్పిన దానిని విభేదించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. మీ స్పందనకి ధన్యవాదాలు!
@ రవి శేఖర్ గారూ
కొన్ని చదివి తెలుసుకున్నవయితే కొన్ని విని తెలుసుకున్నాను. నేను చదవాలనుకున్న కావ్యాలలో పెద్ద లిస్టు ఉంది. ఎప్పటికి చదువుతానో ఏంటో? యక్ష ప్రశ్నల గురించి http://www.scribd.com/doc/88958169/%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B6%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81 ఇక్కడ చదవ ప్రార్ధన! ధన్యవాదాలు!
@ మురళి గారూ
నా ఈ వ్యాసం మీకు ఆసక్తికరంగా ఉండటం సంతోషంగా ఉంది! ధన్యవాదాలు!
@ గోలి హనుమచ్ఛాస్త్రి గారూ
మీ అభిప్రాయాలను చక్కని పద్య రూపములో అందించిన మీకు కృతజ్ఞతలు! మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
@ Sai Paada Dhooli గారూ
నిజమే అండీ చాలా మందికి తెలియదు కనుకనే ఈ చిన్ని ప్రయత్నం నాకు తెలిసినంతలో! ధన్యవాదాలు!
చాలా బాగుంది
I was suggested this website by my cousin. I am not sure whether this post is written by him as no one else know such detailed about
my difficulty. You're amazing! Thanks!
Here is my web site - Dating sites (Bestdatingsitesnow.com)
Post a Comment