ఆదరణ ఉన్నా తెర మరుగయిన కవుల్లో కల్హారుడు ఒకరు. ఈయన పండితులకి ప్రసిద్ధమయిన కాశ్మీర దేశపు సంస్కృత పండితుడు. పన్నెండు - పదమూడవ శతాబ్దపు కవి అని వినికిడి. కాంతా కళ్యాణ కాంత ప్రహసనం అనే హాస్య భరితమయిన ప్రహసనాన్ని (గాథని) రచించి భోజుని కాలంలో ఎన్నో సత్కారాలు పొందినా మన దురదృష్టవశాత్తూ కవి సంబంధిత విషయాలూ, కవి వ్రాసిన ప్రహసనమూ కూడా అందుబాటులో లేవు. భోజుని ఆస్థాన కవులలో మనకి బాగా వినిపించే పేర్లు కాళిదాసు, భవభూతి, దండి మాత్రమే అయినా కల్హారుని పేరు కొన్ని భోజ రాజుని కథల ద్వారా వినిపించటం వలన ఆయన ఉనికి తెలుస్తోంది. అలా నేను విన్న కల్హారుని కథని ఈ టపా ద్వారా చెప్పదలచాను. ఆయన రచనలు, పద్యాలు మనం వినకపోయినా, చదవకపోయినా ఈ కథ ద్వారా ఆయన రచనా శైలి, ప్రతిభ, చమత్కార పద ప్రయోగాలు మనం గుర్తించవచ్చును.
ఒకరోజు భోజుడు, కాళిదాసు., మొదలయిన మహాకవులందరికీ ధనాన్ని ఇస్తున్నాడని విని పుట్టుకతో నిరుపేద అయిన కల్హారుడు కూడా ధారానగారానికి బహుమానాన్ని అందుకోవాలని వచ్చి తన పేరుని నమోదు చేసుకుంటాడు. తన కంటే ముందు వెళ్ళిన కవులు విశేషమయిన సన్మానాలతో, బహుమతులతో తిరిగి వస్తుండటం గమనించి ఈయనకి అసలు లోపల ఏమి జరుగుతోందో చూడాలన్న ఉత్సుకతో ఈయన వంతు వచ్చేవరకూ ఆగలేక ప్రేక్షకుల వరుసలో కూర్చుని సభను తిలకించి వచ్చేవాడు. ఈయన వంతు వచ్చేసరికి కొన్నాళ్ళు పడుతుందని బాధపడుతుండగా ఒక దురాలోచన కలిగింది. అదేమిటంటే రాజాస్థానం మొత్తం బంగారమే కనుక కనీసం ఒక్క చెంబయినా దొంగిలిస్తే ఈ జీవితానికి సరిపోతుంది అని అనిపించింది. ఇహ ఆలస్యం చేయక ఆ రోజునే పొద్దుపోయాక, ఉద్యానవనం ద్వారా సైనికుల కళ్ళు గప్పి మెల్లగా భోజుని శయన మందిరానికి వెళ్ళాడు.
ఆయన మందిరంలో అంతగా కాపలా లేకపోవటంతో, ఎలాగో రాజు వచ్చేముందు ఆహ్వాన సూచకంగా పెద్దగా గంటల మోత ఉంటుంది కనుక ఈ లోపు తను వచ్చిన కార్యాన్ని పూర్తి చెయ్యాలని రాజు గారి బీరువాని తెరిచాడు. తెరవగానే కళ్ళు చెదిరిపోయేలా ఉండే చక్కని వజ్రాల హారం కంట పడింది. దానిని తీసుకుని తన సంచీలో వేసుకుందామనుకోగా"బంగారు హారాన్ని దొంగిలిస్తే పది జన్మల పాటు మూగవాడై పుడతాడు" అనే అర్థమున్న శ్లోకం గుర్తుకువచ్చి నోరుంటేనే కదా నాలుగు రాళ్ళు సంపాదించుకునేది అనుకుని హారాన్ని వదిలేసాడు. బీరువా పై అరలో చేయి పెట్టగా రత్నాలు పొదిగిన వడ్డాణం తగిలింది. దానిని తీసుకుందామంటే "బంగారు వడ్డాణాన్ని దొంగిలిస్తే ఎనిమిది జన్మలు అవిటివాడై జీవిస్తాడు" అనే అర్థమున్న శ్లోకం గుర్తుకొచ్చి కాలూ చేయీ లేకపోతే కైలాసం కూడా నరకమే అనుకొని దానిని కూడా వదిలేసాడు. ప్రక్కకు చూడగా బంగారు తీగతో చుట్టిన మేలి ముత్యాల దండలు కనిపించాయి. వాటిని తీసుకోబోతుండగా"రాజుగారి ముత్యాల హారాన్ని దొంగిలిస్తే ఆరు జన్మలు కళ్ళు లేని వాడిగా పుడతాడు" అనే అర్థమున్న శ్లోకం గుర్తుకొచ్చి నేత్రం లేనిదే జీవయాత్ర లేదు అనుకుని దానిని కూడా వదిలేసాడు. ఇలా ఏ వస్తువు తీసినా ఏదో ఒక శ్లోకం గుర్తుకు రావడమూ తను ఆ ఆలోచన విరమించుకోవడమూ గమనించి అట్టే సమయాన్ని వృధా చేయకూడదని తను ఎప్పటినుంచో కలవరిస్తున్న బంగారు చెంబుని తీసుకుని బయలుదేరబోయాడు.
ఇంతలో దివాణంలో గంటలు మ్రోగాయి అంటే రాజుగారు శయన మందిరానికి వచ్చేస్తున్నారు, ఈ శ్లోకాల కారణంగా ఎంత సమయం వృధా అయ్యింది అనుకుని పట్టుబడితే శిక్ష దారుణంగా ఉంటుంది అని భయపడుతూ రాజుగారి బంగారు మంచం క్రింద నక్కి కూర్చున్నాడు కల్హారుడు. మంచం మీద పరచిన దుప్పటీ నాలుగు వైపులకీ నేలకు ఆనేలా వేయటం వలన అతనికి ఒక గదిలో ఉన్నట్టనిపించి భయపడుతూనే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారేసరికి గంటలు మ్రోగడంతో ఈయన నిద్ర మత్తు వదిలింది. కిటికీలన్నీ తెరిచి కర్పూర హారతులిచ్చి, వందిమాగధులు భోజుని గొప్పదనాన్ని పొగుడుతుండగా, కిటికీలోంచి ఏనుగుల ఘీంకారాలూ, గుఱ్ఱాల సకిలింపులూ వినేసరికి కవితా ప్రియుడైన భోజునికి ఆనందంతో కవిత్వం వచ్చింది.
చేతోహరా యువతయ స్సుహృదోƨనుకూలాః
స ద్బాంధవాః ప్రణయ గర్భగిర శ్చ భృత్యాః
గర్జంతి దంతినివహా స్తరలా స్తురంగాః
.............................. ........................
అంటూ అక్కడ పరిస్థితినీ, కోలాహలాన్నీ కళ్ళకు కట్టినట్టు వర్ణించి ఆఖరి పాదం ఎలా చెప్పి పూర్తి చేయాలా అని ఆలోచనలో పడ్డాడు భోజుడు.
కవిత్వానికి బహుమానం ఇచ్చే భోజుడు ఇలా ఆగిపోయేసరికి ఏమీ ఆలోచించకుండా, తోసుకోస్తున్న కవిత్వాన్ని ఆపుకోకుండా మంచం క్రిందనుంచే
సంమోలనే నయనయో ర్న హి కించి దస్తి (అంటే ఇన్ని భోగాలూ, సంపదలూ అన్నీ కూడా కన్నుమూస్తే ఏవీ ఉండవు) అని పూరించాడు. వేదాంతంతో కూడిన చక్కని కవిత్వం, పైగా ఎలా ముగించాలా అని ఆలోచిస్తున్న శ్లోకం ఇంత చక్కగా చెప్పినతనిని అభినందించాలని మంచం క్రిందకి చూసాడు. కల్హారుడికి మాత్రం శ్లోకాలు వచ్చిన కారణంగా దొంగను కాలేకపోయాను, అలానే కవిత్వం వచ్చిన కారణంగా పట్టుబడిపోయాను అని బాధపడుతూ బయటకి వచ్చి తను దొంగిలించిన చెంబుతో సహా నమస్కరించాడు. భోజుడు మంచం దిగి కల్హారుడిని ఆనందంతో కౌగలించుకుని మొత్తం శ్లోకంలోని ప్రతీ అక్షరానికీ లక్ష చొప్పున బహుమతిని ఇచ్చాడు. అక్షరలక్షలు అనే మాట భోజుని నుంచి వచ్చినదే.
కల్హారుడిని సన్మానించాక భోజుడు చెంబు దొంగిలించటం వెనుక ఉన్న కథని అడిగాడు. అప్పుడు ఆయన
గ తానుగతికో లోకః న లోకః పరమార్ధికః
గుప్త స్సైకతలింగేన నష్ట మ్మే తామ్రభాజనం
అంటూ పద్య రూపంలో గతాన్ని వివరించాడు. ఒకసారి పర్వదినం నాడు గంగా నదిలో స్నానం చేద్దామని నాకున్న పెద్ద ఆస్తి అయిన నా రాగిచెంబును వెంట తీసుకెళ్ళాను. జనాలు ఎక్కువగా ఉండటం వలన నా చెంబు పోతుందేమో (స్నానాంతరం జపం చేసుకునేటప్పుడు అడ్డం) అని ఏవేవో మంత్రాలు చదువుతూ ఒడ్డున బోర్లించి దాని మీద ఇసుకతో శివలింగాకారాన్ని చేసి మొదట్లో రెండు పువ్వులు కూడా వేశాను. ఇహ భయం లేదనుకుని నదిలో దిగి స్నానం చేసి సంధ్య వార్చి జపం ముగించుకుని ఒడ్డున చూస్తే అక్కడ పలు వరుసలలో అన్నీ సైకత శివలింగాలే ఉన్నాయి. కవీ, పండితుడూ, బ్రాహ్మణుడూ అయిన నేను అలా చేయటం వలన అలా చేయాలని ఏ వేదంలోనో, శాస్త్రంలోనో చెప్పారేమో! నదిలో స్నానం చేసే ముందు అందరూ అలానే చెయ్యాలి కాబోసు అనుకుంటూ అందరూ అదే పని చేయటం వలన బోలెడు లింగాలు ప్రత్యక్షమయ్యాయి. ఇహ తరువాత ఏం చెయ్యాలా అనుకుంటూ అందరూ నన్నే చూస్తున్నారు పైగా వాటన్నిటిలో నా చెంబు ఏదో తెలియక మదనపడుతుండగా చేసేది లేక ఏవో మంత్రాలు చదువుతూ (సంబంధం లేకపోయినా సరే!) ఒక శివలింగాన్ని చేతితో చితిపాను. నా ఉద్దేశ్యం ఆ లింగంలో నా చెంబు ఉండచ్చు అని కానీ అది నా చెంబులింగం కాదు. (చెంబులింగం అనే పదం ఈయన ద్వారానే లోకానికి వచ్చింది). అది చూసి అందరూ చెంబులింగాలని చిదిపారు. ఎవరికీ ఏ చెంబులు దొరికాయో కానీ నా చెంబు మాత్రం గంగపాలయ్యింది (గంగా నదీ ఒడ్డున దొంగలపాలయ్యింది అని అర్థం! ఈ పదం కూడా ఈయన ద్వారానే లోకానికి వచ్చింది) అని చెప్పాడు కల్హారుడు. ఈ కథను విన్న భోజుడు మరింత సంతోషించి కల్హారుడు దోచుకున్న చెంబుతో పాటు మరొక బంగారు చెంబుని కూడా ఇచ్చి పంపించాడుట.
ఈ కథ ద్వారా, ఆయన పరిచయం చేసిన చెంబులింగం, గంగపాలయ్యింది అనే పదాల ద్వారా కల్హారుడు మనందరి మధ్యన ఉన్నా ఆయనని మాత్రం తలుచుకోము! ఈయన గురించి నాకు తెలిసినవి చెప్పాను మరింత సమాచారం ఎవరి వద్దనయినా ఉంటే తప్పక తెలియచేయగలరు!
41 comments:
రసజ్ఞ గారు.. ఎప్పటిలాగే మరో కొత్త విషయాన్ని మీ పద్దతిలో చాలా అందంగా తెలియజేసారు.. "చెంబులింగం, గంగపాలయ్యింది " ఇవి విన్నా కాని.. దీని వెనుక ఇంత కథ ఉందని ఇప్పుడే తెల్సుకున్నా.. ధన్యవాదములు.. మీరు ఇలాగే మరిన్ని విషయాలను కొత్త కొత్త టపాల ద్వారా అందిస్తారని ఆశిస్తూ..
మీ టపాలకోసం ఎదురుచూసే ఒక అభిమాని
మీరు ఈ కథ ఎక్కడ సంపాదించారొ నాకు తెలియదు కాని భొజుడు 1000 నుంచి 1050 మధ్యవాడు గా చరిత్రకారుల అభిప్రాయం.
ఆలాగె కలహరుడు రాజతరంగిణి వ్రాసిన కాశ్మిర కవి వీరి కాలం 12 శతాబ్దం గా వున్నది. కనుక ఈ కథ ఆనాటిది కాదు. ఆయినా చెంబులింగం అనె నామధెయాలు తెలుగునాట తక్కువ తమిళనాట వున్నవి .ఆలాగె గంగపాలు తెలుగు పదం .
ఈ లెక్కల గొడవలు ప్రక్కనపెడితె పొస్ట్ చాలా బాగున్నది.
@ నాగేశ్వర రావు గారూ
ఇలా చదువుతూ ప్రోత్సహించే వారు ఉండాలే కానీ తప్పకుండా మరెన్నో మీ ముందుకు తీసుకు రావటానికి ప్రయత్నిస్తాను! ధన్యవాదాలండీ మీ స్పందనకి!
@ రమేశ్ బాబు గారూ
ఈ కథని నేను విన్నానండీ! అలానే కల్హారుడు ఏ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి అన్నది తెలియదు! నేను విన్నంతవరకూ వ్రాశాను! బహుశా మీరు చెప్పినది కూడా అయి ఉండవచ్చునేమో! మీరు చెప్పినట్టు రాజతరంగిణి వ్రాసిన కాశ్మీర కవి మాత్రం కల్హణుడు. కల్హారుడు కాదు! ఆయన, ఈయన వేరు వేరు. ధన్యవాదాలండీ టపా నచ్చినందుకు!
రసఙ్ఞగారూ,
మీవల్ల నేను కొత్త విషయాలు తెలుసుకున్నాను.
కల్హారుని గురించి చాలా అందంగా చెప్పారు. అభినందనలు..
బోడిలింగం, శంభులిగం అని విన్నా కాని చెంబులింగం ఇదే మొదటిసారి వినడం. కల్హార పేరు కూడా ఎక్కడో విన్నట్టుందే! ఏదో కథలో హీరోయిన్ అనుకుంటా...
రసజ్ఞ ,,, విన్నవి,కన్నవి... వాటికి విషయ సేకరణ చేసి.. మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నావు.
అన్నట్టు మీరు సంస్కృత బాష సబ్జెక్ట్ గా ..విద్యార్ది అయి ఉంటారు. అందుకే ఇన్ని విషయాలు అందజేస్తున్నారు. బాగున్నాయి . బాల సాహిత్యం . లో కాలూనండి . మీలాంటి పరిజ్ఞానం కలవారి సాహిత్యం భావి పౌరులకి చాలా ఉపయోగం . బెస్ట్ అఫ్ లక్ రసజ్ఞ . .
మా ‘ రసఙ్ఞ ‘ తాను మాయ జేసెను భళా !
“ గంగ పాలు , చెంబు లింగ మనుచు “
ఔర ! ఔర ! ఔర ! ధారా నగర మందు
‘ తెలుగు నానుడు ‘ లను వెలయ జేసి
చాలా బాగుంది...
కాశ్మీర దేశపు సంస్కృత పండితునికీ , అచ్చమైన తెలుగు నుడులకూ ముడివేసిన కథ ఏమాత్రం సమంజసం కాకున్నా , కథనం బాగుంది . నిజమేనేమో అని భ్రమపడేలా చేసింది . బాగుంది .
మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
ఉగాది శుభాకాంక్షలు రసజ్ఞగారు.చాలా బాగా రాసారు.
రసజ్ఞ గారూ.. మంచి విషయాలను సేకరిస్తూ
మాకు కూడా తెలియచేస్తున్నారు..చాలా బాగుంది.
మీ పరిచయం చాల బాగుంది...ఇలా తెలియని విషయాలు చెపుతున్న మీ లాంటి వారు అరుదు ...మీ బ్లాగులో ఇంకేమి రత్నాలు ఉన్నాయో ఎరుకోవాలి...నందన నామ సంవత్సర శుభాకాంక్షలు
చాలా ఆసక్తికరంగా వుందండీ!
శారద
హన్నా అన్ని సార్లూ మీరే క్రెడిట్స్ కొట్టేస్తున్నారు రసగుల్లా..ఉండడి ఈ సారి మీకు దిమ్మ తిరిగిపోయేలా నేనే ఎవరి గురించన్నా రాసేస్తా.. మనలో మన మాట మేటర్ ఎక్కడ దొరుకుతుందండీ;)..ఇక్కడ అందరూ చెప్పేసిన మాటనే నేను కూడా ఎందుకులెండి చెప్పడం..కానీ ఇది కూడా తెలియని విషయమే.
నందన నామ ఉగాది శుభాకాంక్షలు మీకు:)
@రసజ్ఞ గారు మంచి కవిని కథను పరిచయం చేసారు ... పాండిత్యమున్నా పేదవాడిగా గుర్తింపు లేని వాడిగా ఉండటం చాలా బాధాకరం ... డబ్బులేని వాడు డుబ్బుకు పనికిరాడన్నది నిజమే కాబోలు లేకుంటే అంతటి కవి అన్ని తంటాలు పడాల్సిన అవసరం ఉండదు.. ఏమైతేనేమి కొత్త సంవత్సరానికి కొత్త కవిని పరిచయం చేసారు చాలా సంతోషం .. ఇక పోతే " కవితా ప్రియుడైన భోజునికి ఆనందంతో కవిత్వం వచ్చింది " ఈ వాక్యానికి మాత్రం నాకు తెగ నవ్వోచేసిందండి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకో ;) ........
మరియు ఈ కవిని గూర్చి ఎక్కడ సమాచారము దొరకట్లేదు... దొరికితే తప్పక మీకు తెలియజేస్తాను...
ఈ సంవత్సరం మీ ఆశయాలకు ఆరంభాలకు అర్థాన్ని చేకూరుస్తుందని కోరుకుంటున్నాను మీకు నందన నామ సంవత్సర శుభాకాంక్షలు :)
@ శ్రీలలిత గారూ
మీ అభినందనలకి అభివాదములండీ!
@ SNKR గారూ
హహహ! కల్హార అంటే తామర అనే అర్థం కూడా ఉంది కదండీ! మీ స్పందనకి ధన్యవాదాలు!
@ వనజ గారూ
మీ బెస్ట్ విషేస్కి చాలా థాంక్స్ అండీ! నేను సంస్కృత బాష సబ్జెక్ట్ గా ..విద్యార్థిని కాదు కాని ఆసక్తి అంతే! నెనర్లండీ!
@ వెంకట రాజారావు . లక్కాకుల గారూ
చక్కని పద్య రూపంలో మెచ్చుకున్నారు ధన్యవాదాలు!
@ కృష్ణ ప్రియ గారూ
బాగున్నారా? చాలా రోజులకి కనిపించారు! మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ dr గారూ
సంస్కృతం భాషలన్నిటికీ తల్లి వంటిది అంటారు కనుక ఆ భాష తెలిసిన పండితుడు తెలుగు భాషకు నుడికారం వేయలేడు అని నేననుకోను. పైగా భోజ రాజుని కథలన్నీ నిజంగా జరిగినవే అని నా అభిప్రాయం! మీ స్పందనకి ధన్యవాదాలు!
@ పరిమళం గారూ
ధన్యవాదాలండీ! మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు!
@ జలతారు వెన్నెల గారూ
మీకు నచ్చినందుకూ, శుభాకాంక్షలకీ కృతజ్ఞతలు! మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు!
@ రాజి గారూ
నా ఆసక్తితో ఇవన్నీ సేకరిస్తూ ఇక్కడ పంచుకుంటున్నాను! మీకు కూడా నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ శేఖర్ గారూ
చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇది! చదివి మీరే చెప్పాలండీ! ధన్యవాదాలు! మీకు కూడా నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
@ శారద గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ సుభా
హహహ! తప్పకుండాను వ్రాసేయండి నేను చదివేస్తా కాని చిన్న అభ్యర్ధన దిమ్మ తిరిగితే పర్లేదు కానీ మరీ మైండ్ బ్లాక్ అవ్వకుండా చూడండే ప్లీజ్ ;) ధన్యవాదాలు! మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు!
@ కళ్యాణ్ గారూ
నిజమేనండీ చాలా బాధపడవలసిన విషయం ఆయన వ్రాసిన పుస్తకం కూడా నాకు దొరకలేదు! ఇది మరీ బాగుందిలే మీకెందుకు నవ్వోచ్చిందో నాకెలా తెలుస్తుంది? మీరే చెబ్దురూ!!! చాలా థాంక్స్ అండీ తప్పకుండా ఇవ్వండి ఆయనకి సంబంధించి ఏ సమాచారం దొరికినా! ధన్యవాదాలండీ! మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు!
శ్రీ రసజ్ఞ గారికి నమస్కారం!
కల్హారుని గుఱించి మీరు చెప్పిన తీరు చాలా ఆకర్షణీయంగా ఉండట వల్ల - నాకు ఆ కవి పేరు అపరిచితం కావటం మూలాన మీ వ్యాసాన్ని ఎంతో ఆసక్తితో చదివాను. మీ కథనశైలి అభినందనీయం. శ్లోకం మనోహరంగా ఉన్నది. అయితే -
1. సంస్కృత వాఙ్మయంలో ఎక్కడా ఈ కవి ప్రస్తావనలు కానరాలేదు. ఆయన పేరుతో ఆ ప్రహసనం ప్రస్తావనలూ ఎవరూ చేయలేదు.
2. కథ భోజరాజు నాటిది కావటమూ అనుమానమే. బల్లాలసేనుని "భోజప్రబంధం"లోనూ, భోజుని రచనలలోనూ, తత్సమకాలికుల ఉదాహరణలలోనూ ఈ కవి నామస్మరణ జరగలేదు.
3. మీరు కల్హారునిదని ఉదాహరించిన శ్లోకాన్ని క్రీ.శ. 14-వ శతాబ్ది నాటి వల్లభదేవుడు తన "సుభాషితావళి"లో "ఇది విక్రమాదిత్యునిది" (ఇతి విక్రమాదిత్యస్య) అన్న నిర్దేశంతో ఉదాహరించాడు. అందువలన కూడా ఇది కల్హారుని రచన కావటం సందేహాస్పదమే.
4. సదాశివుని మహాసంకర్షణావతారంలోని శంభులింగం గంగ చెంత వెలసిన కథ సామెతకు మూలమై ఉంటుంది. "శంభులింగం - గంగపాలు" అని ఉండాలి. 5. "చెంబు" శబ్దం "సెంబొన్" (రాగి పాత్ర) అనే ద్రావిడ మాతృకనుంచి వచ్చింది. అందువల్ల ఈ మాళవ-కాశ్మీర గాథకు సంబధితమై ఉండదు.
ఇంతకీ మీరు ఏ పుస్తకంలో నుంచి ఈ ఉదంతాన్ని స్వీకరించారో తెలుసుకొనగోరి ఈ విపులమైన వ్యాఖ్యను వ్రాశాను. దయచేసి ఆ పుస్తకం పేరును, రచయిత పేరును పేర్కొనగోరుతున్నాను. వారేమైనా ఆకరాలను ప్రమాణీకరించారేమో చూడాలనిపించింది.
ఏల్చూరి మురళీధరరావు
రసజ్ఞ గారూ,
తెలియని ఓ గొప్ప కవి ని చాలా బాగా పరిచయం చేశారు.
* అన్ని అర్హతలూ ఎందరికన్నా మెండుగా ఉన్నా కొందరికి జీవితాన దక్కవలసినవి దక్కవు.
కలార్హుడు - పేరులోనే ఉంది ఆ కవి గారి అర్హత.
* ఎట్టకేలకు రాజు గారి దగ్గర తన అర్హత నిరూపించబడింది.
ఇన్ని పదాలు ఈనాటికీ వాడుకలో ఉన్నా ఆ పదాల వెనక దాగి ఉన్న ఓ కవిగారిని వెలికి తీసి పరిచయం చేసిన మీకు ఎలా చెప్పాలీ...తెలుగు భాష కాదు అని అనుకోకపోతే...
హ్యాట్స్ ఆఫ్ టు యూ!
రసజ్ఞ గారూ... ఈ కథ పామాణికత ప్రశ్నార్థకం అయినా చెప్పిన విధానం బావుంది. ఏల్చూరివారి వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను.
ఉగాది శుభాకాంక్షలు రసజ్ఞగారు.చాలా బాగా రాసారు.
రసజ్ఞ గారు
మీకు నందన నామ సంవత్సర శుభాకాంక్షలు
చాలా బాగుందండీ. మీది రొటీన్ బ్లాగ్ కాదు. అందులో ఉండేవి రొటీన్ పోస్టులు కాదు.
ఎవ్వరికీ తెలియని విషయాలు వివరంగా చెప్తారు.
చిన్నప్పుడు ఎక్కడో చదివినట్టూ గుర్తు కల్హరుడు రచించిన కావ్యం రాజతరంగిణీ అనీ (నాకు సరిగ్గా తెలీదు. తప్పయితే లైట్ తీస్కోండి)
నాకర్ధం కాని విషయం ఏంటంటే అరుదయిన విషయాల్లో.. ఈ రేంజ్ రిసెర్చ్ ఏంటండీ? ఎలా తెలుస్తాయ్ ఇలాంటివన్నీ?? ;)
ఉగాది శుభాకాంక్షలండీ.
@ ఏల్చూరి మురళీధరరావు గారూ
ప్రణామములు! నా బ్లాగుకి విచ్చేసి ఈ వ్యాసాన్ని అంత ఆసక్తికరంగా చదివినందుకు, మెచ్చినందుకు ధన్యవాదాలు!
మీరు చెప్పిన పుస్తకాలేమీ నేను చదవలేదు. ఈ కథను మొదటిసారిగా నా చిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పగా విన్నాను. ఆవిడ సంస్కృత పాఠశాలలో చదువుకున్నారు. ఆవిడ నాకు ఈ కథ, శ్లోకం మాత్రమే చెప్పారు కాని ఆ పండితుని (నేను కల్హారుడని చెప్పిన అతని) పేరు మాత్రం తెలియదన్నారు. తరువాత చాన్నాళ్ళకి నేను మా ఊరి గౌతమీ గ్రంధాలయంలో కొన్ని కథలు చదువుతుండగా "డా. మైలవరపు శ్రీనివాసరావు" గారు వ్రాసిన ఒక పుస్తకంలో (నాకు పేరు గుర్తులేదు) ఇదే కథ చదివాను. అందులోనే ఆయన ఆ పండితుని పేరు కల్హారుడనీ, కాశ్మీర దేశపు పండితుడనీ, అలాగే ఆయన వ్రాసిన ప్రహసనం గురించి కూడా చెప్పారు. నేను విన్న కథ, ఆయన వ్రాసిన దానిలో నేను చదివిన కథ రెండూ ఒకటే (ఎటువంటి మార్పులూ లేవు). ఈ టపా వేయడానికి ముందు రోజు కాళిదాసు గురించి చదువుతుండగా ఉన్నట్టుండి ఈ కథ గుర్తుకువచ్చి వెంటనే ఈ టపా వ్రాసేశాను.
అయితే మీరు ఈయన భోజరాజు కాలం ఆయన కాదేమో అనేసరికి నాకు గుర్తున్నంతవరకు భోజుడే కదా అని గట్టి నమ్మకంతో మీ వ్యాఖ్య చదివాక నిన్నంతా కూర్చుని గూగుల్ లో గాలించగా చిన్న చిన్న మార్పులతో ఇంచుమించు ఇదే కథ ఒకటి కనిపించింది. ఇది దాని లంకె http://bhaktisudha.com/index.php?option=com_content&view=article&catid=938:%E0%B0%AA%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%EF%BF%BD%C2%B1_%E0%B0%A5%20%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%EF%BF%BD%C2%B1_%20&id=933:%E0%B0%B5%E0%B1%88%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%EF%BF%BD%C2%B1_%E0%B0%AF%E0%B1%8A%E0%B0%A6%EF%BF%BD%C2%B1_%E0%B0%A6%E0%B1%80%E0%B0%AA%E0%B0%A8%E0%B0%AE%EF%BF%BD%C2%B1_&Itemid=2
ప్రస్తుతం నేను ఉన్న దేశంలో తెలుగు అన్న పదమే వినిపించదు కనుక నేను మా ఊరు వెళ్ళాక గౌతమీ గ్రంధాలయానికి తప్పక వెళ్ళి ఆ పుస్తకం పేరు, వీలయితే కాపీ సంపాదించి తెలియచేస్తాను. ప్రస్తుతానికి నాకు ఆ పుస్తకం పేరు గుర్తుకు లేదు మన్నించండి! మీరు చెప్పిన బల్లాలసేనుని భోజప్రబంధం ఇవాళే చదవటం మొదలుపెట్టాను! దాని లంకె http://www.scribd.com/doc/86696656/%E0%B0%AD%E0%B1%8B%E0%B0%9C%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AC%E0%B0%82%E0%B0%A7%E0%B0%82
ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసిన వెంటనే తప్పక తెలియచేస్తాను! ప్రస్తుతానికి క్షమించ ప్రార్ధన! మీ వ్యాఖ్యకి కృతజ్ఞతలు!
@ అరుణ్ గారూ
ఈ కథకి సంబంధించిన మరిన్ని విషయాలు, మీరన్నట్టుగా దాని ప్రామాణికత తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే నాకు తెలిసిన ఈ కథని ఇక్కడ మీ అందరితో పంచుకున్నాను! మీకేమయినా విషయాలు తెలిస్తే తప్పక తెలియచేయగలరు! చెప్పిన విధానం నచ్చినందుకు ధన్యవాదాలు!
@ చిన్ని ఆశ గారూ
కల్హారుడు కలార్హుడు బాగా చెప్పారండీ! నిజమే కొంతమందికి ఎంత ప్రతిభ ఉన్నా గుర్తింపు రాదు! ఆయన గురించి ఇంకా ఎన్నో విషయాలు డోలాయమానంలోనే ఉన్నాయి. వాటిని వేలికితెచ్చే చిన్ని ప్రయత్నమే ఇది. ఇది చాలా పెద్ద ప్రశంస థాంక్యూ!
@ లాస్య గారూ
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు! థాంక్స్ అండీ!
@ శ్రీను గారూ
ధన్యవాదాలు మరియూ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు!
@ రాజ్ కుమార్ గారూ
మీ వ్యాఖ్యలు కూడా భలే ఉంటాయండీ! నెనర్లు! మీరు చెప్పిన రాజతరంగిణి వ్రాసినది కల్హణుడు. కల్హారుడు కాదు. హహహ! బాగుంది మీ ధర్మ సందేహం. ఏదో ఉత్సుకతతో ఖాళీ దొరికినప్పుడు ఈ రిసెర్చ్ చేస్తాననమాట! చేసినదానిని ఊరుకోక ఇలా బ్లాగులో పెడతా (అంటే ఇది థెసిస్ అనమాట మీ అందికీ సబ్మిట్ చేస్తే అందులో తప్పొప్పులు చెప్పి, ఇంకా ఏమయినా సంబంధిత సమాచారం ఉంటే తెలియచేస్తారు కదా! అందుకని). మీకు కూడా ఉగాది శుభాకాంక్షలండీ! ధన్యవాదాలు!
ఈ టపా ఎలానో మిస్ అయ్యాను రసజ్ఞా..ఆలస్యంగా చూశాను. అక్షరలక్షలు చేసే కథ చెప్పావు..బావుంది.
నేను చాలా ఆలస్యంగా మీకు మీ కుటుంబ సభ్యులకి నా తరఫున నా కుటుంబ సభుల తరఫున నందన ఉగాది శుభకామనలు తెలుపుకుంటున్నా.
నెనరుంచండి
ఎవ్వరికీ తెలియని విషయాలు వివరంగా చెప్పావు.చాలా బావుంది
@ జ్యోతిర్మయి గారూ
ఎలా అయితేనేమి చదివి మీ అభిప్రాయాలను తెలియచేశారు. ధన్యవాదాలు!
@ తాతగారూ
ఆలస్యం ఏమీ లేదు. ధన్యవాదాలు మరియు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు!
@ చంద్రశేఖర్ గారూ
చాలా థాంక్స్ అండి!
రసజ్ఞ గారూ ! నూతన వత్సర శుభాకాంక్షలు. చిన్నప్పుడు ' చందమామ ' కథలు చదువు చున్న అను భూతిని పొందాను. చక్కని 'కథ'నం, బాగుంది.
@ గోలి హనుమచ్ఛాస్త్రి గారూ
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు! ధన్యవాదాలండీ!
బాగుంది ... కాని చెంబు.. గురించి మాత్రం మీరు చదివింది కల్పన అయ్యి వుండవచ్చు.... సంస్కతంలో మాట్లాడుతూ చెంబు ప్రసక్తి రావడం కోంచెం వింతగా వుంది
@ Sai Paada Dhooli గారూ
ముందుగా మీకు వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు! అన్నీ భాషలకీ సంస్కృతమే మూలమని కదా పెద్దల మాట! అలా చూసుకుంటే తెలుగు సంస్కృతం నుండి వచ్చినదే కదా! కనుక ఆ రెంటికీ పొంతన ఉండటములో ఆశ్చర్యం లేదని నా భావన!
మీ బ్లాగు ఇప్పుడే చూస్తున్నాను. చాలా చక్కగా రాస్తున్నారు! Keep it up.
@ Subrahmanyam Mula గారూ
చాలా చాలా థాంక్స్ అండీ! మీకు నచ్చినందుకు సంతోషం!
హలో రసజ్ఞ గారు ...
నేను చెప్పాలి అనుకున్నవి అన్ని...పైన వాళ్ళు అందరు చెప్పేసారు... :(
ఐతే ఏం...ఆర్టికల్ చాల బావుంది... :)
గుడ్ గోయింగ్ .
@ ramki గారూ
వాళ్ళందరూ చెప్పేశారు కదా అని ఊరుకోకుండా నచ్చింది అని కామెంటినందుకు అనేకానేక ధన్యవాదాలు :)
అనుకోకుండా వేరే దేనికోసమో వెతుకుతుంటే మీ బ్లాగులోని కథ తటస్థపడింది.
శ్రీ మైలవరపు శ్రీనివాసరావుగారు "శ్లోకాల వెనక కథలు" అన్న పేరుతో ఒక చిన్న కథల పుస్తకం వ్రాశారు. అందులోనివే మీరు చెప్పిన కథలు. అట్లాగే ఆ చెంబులింగం గురించి కూడా అందులోనే వున్నది.
గురుర్బ్రహ్మ అన్న శ్లోకం వెనుక ఉన్న కథతో మొదలై లీలావతీ గణితం గురించిన కథ కూడా వుంది. భారత యుద్దంలో కర్ణుడిని పడగొట్టటానికి అర్జునుడు వేసిన బాణాల లెక్క గురించిన శ్లోకం అత్యం అద్భుతంగా వుంటుంది. అందులో quadratic equation తో ఆ సమస్య పరిష్కరించవలసి వుంటుంది. అట్లాగే కాళిదాసు వ్యాసుని చకార కుక్షి అని ఎగతాళి చేసిన వృత్తంతం కూడా వుంది. ఈ అవకాశం తీసుకొని నేను కూడా నా అభిప్రాయం వెలిబుచ్చగలగటం ఎంతో ఆనందంగా వుంది
Thanks very interesting blog!
Visit my page - dating online - http://bestdatingsitesnow.com,
Post a Comment