Saturday, October 29, 2011

నాగుల చవితి


యోగీశ్వరో మహాశయనా కార్తికేయోగ్ని నందనః |
స్కందః కుమారః సేనాని స్వామీ శంకర సంభవః ||

గాంగేయ స్థామ్ర చూడశ్చ బ్రహ్మచారి షికిధ్వజః |
తారకారి ఉమాపుత్ర క్రౌంచారీశ్చ షడాననః ||

శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిద్ధః సారస్వతౌ గుహః |

సనత్ కుమారౌ భగవాన్ భోగ మోక్ష ఫలప్రదః ||

సర జన్మ గణాధీశా పూర్వజో ముక్తి మార్గకృత్ |
సర్వాగమ ప్రణీతాచ వాంచితార్ధ ప్రదర్శినః ||

అష్ట వింశతి నామాని మదీయానీతి యః పఠేత్ |
ప్రత్యుషే శ్రద్ధయా యుక్తో మూకో వాచ పతిర్భవేత్ ||

మహామంత్ర మయానీతి మామనామాను కీర్తనం |
మహా ప్రజ్ఞా మవాప్నోతి నాత్ర కార్య విచారణా  ||

అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు! మళ్ళీ వచ్చిందేంటిరా బాబూ అనుకుంటున్నారా? మొన్న దీపావళికి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అనుకున్నాం కదా! నాగుల చవితి వచ్చింది అందుకే నేను కూడా వచ్చా!

వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి. భూమి అంతర్భాగాలలో ఉంటూ భూమిని నాశనం చేసే క్రిముల్ని, పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి. అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి మనకి తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి, ఏ రకమయినటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాము. 

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ |
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా ||

అంటూ పుట్టలో పాలు పోసి పడగ త్రొక్కితే పారిపో, నడుము త్రొక్కితే నావాడనుకో, తోక త్రొక్కితే తొలగిపో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ చీకటా వాకిటా తిరుగుతూ ఉంటాము నీ బిడ్డలనుకుని మమ్మల్ని కాపాడు తండ్రీ అని దణ్ణం పెట్టుకుని, నూకని ఆ పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకుని మూకలు మాకివ్వు తండ్రీ అని చల్లి పుట్టమన్ను చెవులకి పెట్టుకుంటాము. మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండటానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజన్నా మనసారా తలుచుకుని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వాస్తవానికి పాములు పాలు త్రాగుతాయా అన్నది చాలా మందికి సందేహమే! పాములు సరీసృపాలు. వీటికి బాగా దాహం వేస్తే దప్పిక తీర్చుకోడానికి పాలే కాదు మనం కోక్, పెప్సి లాంటివి పట్టించినా త్రాగుతాయి. పాలు ఎక్కువగా త్రాగితే వాటి ప్రాణానికే ముప్పు. ఇది పుట్టలో పాల కథ.

మానవ శరీరం పంచభూతాలతో తయారయినదే! అలానే మన శరీరాన్ని ఒక పుట్ట లేదా వల్మీకముతో పోల్చుకుంటే అందులో ఉండే పామే మన వెన్నుముక (వెన్ను పాము) క్రింద ఉండే కుండలినీ శక్తి (అథో కుండలిని). యోగశాస్త్రం ప్రకారం మనకి మూలాధార చక్రంలో ఉండే కుండలినీ శక్తి నిదురించే పాములా ఉంటుందని చెప్తారు. ఆ విధంగా ఈ పాము నిదురిస్తున్నా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విషాన్ని క్రక్కుతూ మనల్ని విషపూరితులని చేస్తుంది. ఆ ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఆ పాము తృప్తి చెందేలా పాలు పోసి మనలో ఉన్న ఆ పాము విషాన్ని క్రక్కకుండా మంచిగా ఉండేలా చేస్తాము. అంటే విషనాగుని దైవ నాగు కింద మారుస్తాము. అప్పుడు మనిషిలోని విషం నశించి శేషతల్పమై మనలోని విష్ణువు సేద తీరుతాడు. ఇది పొట్టలో పాల గురించి.

అదండీ చక్కగా పుట్టలోను, పోట్టలోను పాలు పోసి ఎంచక్కగా ఈ పండగ చేసుకోండి! మీరు పాలు త్రాగుతూ ఉండండి నేను మళ్ళీ వస్తా!

17 comments:

భాస్కర రామిరెడ్డి said...

అవునండీ మేమంటే పొట్టలో పాలు పోస్తాము. మరి మీఊళ్ళో పుట్టలుండవుకదా? మరి పాలెక్కడపోస్తారు?

రసజ్ఞ said...

@ భాస్కర రామి రెడ్డి గారూ
హహహ మాదే ఊరు అనుకుంటున్నారు మీరు? ఏదేమయినా మాకు నిజంగానే పుట్టలుండవు ఇక్కడ కానీ మా అసలు ఊరిలో ఉంటాయి. నేను కూడా పొట్టలో పోస్తానులెండి పుట్టలో పోసాననుకుని!

సుభ/subha said...

బాగుంది రసగుల్లా.. మీకిన్ని విషయాలు ఎలా తెలుస్తాయో అసలు.. ఇన్ని విషయాలు చెప్పి ఆఖరికి మీరు చేసింది ఏమిటి? పొట్టలో పాలు పోసుకోవడమా? బాగుందమ్మా బాగుంది. సరే అది కూడా మన మంచికి అన్నారు కాబట్టి వదిలేస్తున్నా.

Anonymous said...

రసఙ్ఞ గారూ,
నాకు అసలు నచ్చని పండుగ సాంప్రదాయాల్లో ఇదొకటి. జంతు హింస (ఆహారానికి తప్పించి) ఏ రూపములో ఉన్నా గర్హించాలి. పాములు సరీసృపాలు. వాటికి పాల అవసరము లేదు. విలువైన పాలు దూడలకు దక్కకుండా, మనమూ తాగకుండా అసలు పాలే ఆహారముగా లేని ఒక ప్రాణి తాగుతుందని నమ్మి దానికి పోసి (కొన్నిసార్లు సినిమాలవాళ్ళు, పాములవాళ్ళూ బలవంతంగా తాగిస్తారు) హింసించటం ఏమి ఆచారమో! మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడే ప్రతీ జీవ నిర్జీవ వస్తువుకూ కృతఙ్ఞత చూపించమంటుంది హిందూ ధర్మం. కాబట్టి పాములపై కృతఙ్ణత చూపాలనుకుంటే ఒక దణ్ణంపెట్టొచ్చు లేదా కనబడిన పామునల్లా చంపకుండా ఉంటే చాలు. కనుక పుట్టలో పాలుపోసే ఈ ఆచారాన్ని నిరుత్సాహపర్చాలని నా అభిప్రాయం.

Kalyan said...

@రసజ్ఞ గారు ఎంటండి ఏకంగా పుట్టలోకి వెళిపోయారు జాగ్రత్త సుమ ! :) ఇంతవరకు నాగుల చవితి గురించి నాకు ఏమి తెలియదు, అంటే పండుగ ఉందని తెలుసు అంతే .... సూక్ష్మం గురించి చాలా బాగా చెప్పారు అదే శరీర నిర్మాణం గురించి మరియు ఆ మంత్రము ఎంతో మహిమగలది గా ఉంది నాకు కొత్తగానూ ఉంది .. సంతోషం మంచి విషయాన్ని తెలుసుకున్నాను... ... నేనైతే పుట్టలో పాలు పోయలేదు గాని పొట్టలో అయితే రోజు పోస్తాను...

పుట్టలో ఉన్నావో పూజలందుకుంటావో
మాకేమి తెలియదు
పాలే తాగుతావో లేక పాపాలను అరికదతావో
మేమేమి ఎరుగము
నిను మనసార వేడుకుంటూ
మా నమ్మకమే నీవనుకుంటున్నాం
మాలోని విషమంతా తీసేయవయ్యా
నీ అసిర్వాధములు మాకందించవయ్య
ఓ నాగ రాజ అందుకో మా చవితి వినతులు
అందరికి మంచిచేస్తూ మాలో చీకటిని తొలగించు !!

ఎందుకో ? ఏమో ! said...

ఇక్కడ బాహ్యం గా ఉన్న ఆ పుట్టలలో పాలు పోయటం అంటే
మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలను నసింప చేసేందుకు జ్ఞానం అనే పాలు పోయ్యలని అంతరార్థం
మన భారతీయ సనాతన సాంప్రదాయం లో ప్రతి కర్మాచరణ లోనూ జ్ఞానమే అంతర్లీనంగా ఉంటుంది
అది గుర్తుంచి నడచుకోవాలి
మంచిది

ఎందుకో ? ఏమో ! said...

రసజ్ఞ గారు !!

ఎంతో సమయం వెచ్చించి సరైన రోజున ఈ వ్యాసాన్ని ఇలా నలుగురికి అందించ గలగటం నిజంగా అభినందనీయం,

మీరు మరోల భావనిచానంటే నాదొక్క చిన్న మనవి
మీ blog title లోనే నవ రస (జ్ఞ) భరితం అన్నారు,
అది కూడా ఉన్నతం గా ఉన్నది , అయితే మనవి ఏమంటార ?

ఈ వ్యాసానికి పెట్టిన Title అలా ఉహించేందుకు చాల adola గా ఉన్నది, నవ రసాలు దేని పాటి కది అలా తీసుకున్నప్పుడే అవి ఒక పూర్ణతను కలిగి ఉంటాయి,

అదే అసందర్భాగా వాటిని వినియోగిస్తే వాటి స్థాయి తగ్గటమే కాక విలువను కోల్పోతాయి.

titile అలా పెట్టారు కనుకనే దానిని సమర్దిన్చేల చివరి line రాయాల్సి వచ్చింది కదూ!

అదే ఒక వేల మీరు వ్రాసిన వ్యాసం యావత్ సనతన ధర్మాన్ని రుషి సంప్రదాయాన్ని ప్రతిబిమ్బిస్తున్నదన్న స్పృహ పెట్టుకుని చుడండి

అప్పుడు ఈ చక్కనైన వ్యాసం title "సంప్రదాయాలు - వాటి వైసిస్ట్యాలు " అని ఉన్నట్లయితే

చివరి line ఇలా ఉండేది

"ఎంతో విశిష్టమైన నిగూఢ రహస్యాలు మన పండుగల వెనుక ఉన్నాయని గుర్తిoచం కదా, ఇంకెందుకు ఆలస్యం
అంతరార్థాన్ని గుర్తిస్తూ , సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆచరిద్దాం "

అంటూ ముగించినట్లితే ఎంత ఘనంగా ఉంటుందో " రసజ్ఞ " అన్న పేరుకు తగినట్లు గా ఉంటుంది ఒక పరి ఆలోచించండి

నా భావంతో ఏకీ భావిస్తే pls change ది title

"రసజ్ఞత్వం అంటే జ్ఞాన సారము " అంతే కాని పుట్ట పొట్ట అనే వికట హాస్యం కాదు
ఈ అభిమాని మీ నుండీ కోరేది రసజ్ఞత్వమే !!

రసజ్ఞ said...

@ సుభా,
ఏం చేయను మరి? ఇక్కడ పుట్టలుండవు కదా! హమ్మయ్యా నా మీద దయుంచి వదిలేసారు లేకపోతేనా? (lol)

@ అరుణ్ గారూ
నేను కూడా ఇదే ఉద్దేశ్యంతో వ్రాయడం జరిగింది కాని పొడిగించలేదు అక్కడ విషయాన్ని. క్షీరదాలలాగా సరీసృపాలు పాలని జీర్ణించుకోలేవు. కాని దప్పిక తీర్చుకోడానికి కొంచెం అయితే సరే కాని ఎక్కువయితే వాటి ప్రాణానికే ముప్పు! మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా పంచుకున్నందుకు ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ కళ్యాణ్ గారూ
వచ్చారు వచ్చారు కళ్యాణ్ మాష్టారు
మెచ్చారు మెచ్చారు నా టపాను
వ్రాశారు వ్రాశారు చక్కని కవితను
తెచ్చారు తెచ్చారు మా ముందుకు
పంచారు పంచారు సంతోషాన్ని మీ వ్యాఖ్యతో! ధన్యవాదాలు!

@ ఎందుకో ఏమో? గారూ
నేను చెప్పదలచుకున్న దానిని మీ మాటలో చక్కగా చెప్పారు! మీ అభిమానానికి ధన్యురాలిని! ఇక్కడ ఒక చిన్న విషయం నేను అపహాస్యం కోసం ఇక్కడ అలా వ్రాయలేదు. మనకి పాలు పోయడం వెనుక ఉన్న కారణాలని వ్రాస్తూ ఇలా రెండింటికి వచ్చేలా పెట్టినది తప్ప కించపరచడానికి కాదు! మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పినందుకు ధన్యవాదాలు! పేరుని మార్చానండీ!

Kalyan said...

@రసజ్ఞ bhale rasesaare bagundhi bagundhi :)

ఎందుకో ? ఏమో ! said...

మీరు నా అభిప్రాయానికి విలువ నిచ్చి టైటిల్ మార్చి నందులకు అభినందనలు,
మీరు నన్ను మన్నించ వలసి ఉన్నది, నేను మీ ఆంతర్యాన్ని గమనిమ్పకుండా లోకానికి నాకు ఎట్లా కనపడు తుందనే ASPECT లో చూడటం అంత సరైన దృష్టి కాదని తెలుసుకున్నాను ...

మొత్తానికి మీరు ఇప్పుడు పెట్టిన టైటిల్ తో మీ చక్కని వ్యాసం నాకు Perfect గా కనిపిస్తున్నది.
దివ్యంగా ఉన్నది !!
మీ వ్యాసానికి జై జై లు, మీకు ధన్యవాదాలు !!

రసజ్ఞ said...

@ కళ్యాణ్ గారూ
ఏదో మీ అభిమానం! ధన్యవాదాలు!

@ ఎందుకో ఏమో? గారూ
మీ అభిప్రాయాలను చెప్పడం తప్పు లేదు! చెప్పకపోతే నాకు తెలియదు కదా మీకే భావం స్ఫురిస్తోందో! ఇప్పుడు చక్కగా ఉంది అన్నారు! సంతోషం! మీకు నా కృతజ్ఞతలు!

Anonymous said...

సనత్ కుమారౌ భగవాన్ భోగ మోక్ష ఫలప్రదః ||

అన్న చోట భగవాన్ భగవాస్ లాగా కనిపిస్తోంది. అచ్చుతప్పులను సవరించ ప్రార్ధన. నాగుల చవితి శుభాకాంక్షలు

రసజ్ఞ said...

ధన్యవాదాలు అజ్ఞాత గారూ! నేను బోల్డ్ చేయడం వలన న్ అన్నది స్ లాగా కనిపిస్తోంది ఇప్పుడు ఆ న్ కాస్త బోల్డ్ తీసేస్తే సరిపోయింది!

కొత్త పాళీ said...

good show.
కొంచెం ఆలోచిస్తే మనిషికీ పాములకీ ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు తోస్తున్నది. కుండలినిని పాముగా వర్ణించడమే కాదు, యోగసూత్రాలని చెప్పిన పతంజలి మహర్షిని కూడా పామురూపంలో సూచిస్తారు.

రసజ్ఞ said...

@ కొత్తపాళీ గారూ
మీరు అంతా చదవడమే కాకుండా నేను మర్చిపోయిన విషయాలని కూడా చెప్తూ చక్కగా ప్రోత్సహిస్తారు! కృతజ్ఞతలు!

Anonymous said...

Whats up very cool web site!! Man .. Beautiful ..
Wonderful .. I will bookmark your web site and take the feeds also?
I am satisfied to find so many useful info right here in the
publish, we need develop extra strategies
on this regard, thank you for sharing. . . . . .

my weblog; dating online - bestdatingsitesnow.com
-