Thursday, September 01, 2011

ఎంకి


ఈ పదం వినని వాళ్ళు ఉండరేమో కదా!  కాల్పనిక భావ కవిత్వ (రొమాంటిక్ పొయెట్రీ) ప్రేరణతో తెలుగు కవితాభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ప్రణయ నాయికలలో ఎంకి, ఊర్వశి, శశికళ, వత్సల, హృదయేశ్వరి ముఖ్యమయినవారు. నండూరి వెంకట సుబ్బారావు గారు రచించిన ఎంకి పాటలు అనే గేయ సంపుటిలో ప్రణయ భావుకతకి  క్రొత్త అందాలు సమకూర్చి గోదావరి మాండలికాన్ని విశాఖ రూపక భేదాలతో ప్రయోగించి తెలుగు సాహిత్యంలో ఒక క్రొత్త ఒరవడిని సృష్టించారు.

ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి
మెళ్ళో పూసల పేరు
తల్లో పూవుల సేరు
కళ్ళెత్తితే సాలు
రాసోరింటికైనా
రంగు తెచ్చే పిల్ల.
పదమూ పాడిందంటె
కతలు సెప్పిందంటె
కలకాలముండాలి.
అంసల్లె, బొమ్మల్లె
అందాల బరిణల్లె
సుక్కల్లె నా యెంకి అంటూ ఎంకిని సృష్టించారు నండూరి వారు.

ఎంకి కల్లా కపటం ఎరుగని పల్లె పడుచు. జానపద సౌందర్యానికి ప్రతీక. ప్రణయానికి సంబంధించిన ఎంకి పాటలలో ప్రధానంగా తొలి వలపులు, దాంపత్య జీవితానురాగాలు కలిసిన ఊసులు, బాసలు, వేదనలు, విరహాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఎంకి అనే పాత్రకి నూరేళ్ళు నిండినా ఎప్పటికీ తను అందమయిన ఇరవయ్యేళ్ళ పల్లె పడుచే. ఆమె అమాయకత్వం, అల్లరి చేష్టలు, నాయుడుబావతో ఆమె అనుభవించే ఏకత్వం చదువరులను, శ్రోతలను ముగ్ధులను చేస్తాయి. ప్రేమ, భక్తి, కర్మ ఎంకి పాటల్లో ఒకటిగా వెలువడతాయి, వ్యక్తమవుతాయి. నాయుడు బావకి పూజయినా, సున్నితమయిన పూలయినా, జీవిత  మెరుపయినా అన్నీ ఎంకే.  తనువు తపసుగా, మనసు మంతనముగా, బతుకు పాటగా, పాట యెంకి పల్లదనముగా, నిద్ర అంతా “నారాజు” నీడగా, కలలో కూడా ఎంకి కిలకిలలుగా, జగమంతా నాయుడుబావ సొగసుగా, అద్దములో కూడా ఎంకితో “నిద్దెములు” గా పాట పాడుకుంటారు. “ఎఱ్ఱి నా యెంకి” లో “ఎఱ్ఱి” అంటూనే కవి అనుభవ పూర్వకమయిన జ్ఞానాన్ని మనకు అందిస్తాడు. ఒక విధంగా శ్లేష, ఒకవిధంగా వ్యంగ్యం కనిపిస్తాయి.  శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు చెప్తారు : “మా నండూరి వారి ఎంకి వాల్మీకి సీతమ్మ కంటె గొప్పది. సీతమ్మ ఎప్పుడన్నా కన్నీరు కార్చింది గాని ఎంకి తన బావకి అశుభమవుతుందని కంట తడిపెట్టనంది.” ఈ ఒక్క వాక్యం చాలేమో ఎంకి పాత్ర గురించి చెప్పడానికి.

నన్ను తలుసుకు యెంకి కన్ను మూయాలి! కనుబొమ్మ సూడాలి! కరిగిపోవాలి!
నన్ను కలలో సూసి నవ్వుకోవాలి! కనుబొమ్మ సూడాలి! కరువు దీరాలి!
నిదరలో సిగపూలు సదురుకోవాలి! కనుబొమ్మ సూడాలి! కమ్మగుండాలి!
పిలుపేదొ యినగానె తెలివి రావాలి! కనుబొమ్మ సూడాలి! కతలు తెలియాలి

ఆహా ఎంత అద్భుతమయిన భావన! ఒకసారి సుతారంగా గుండెని తాకి చిలిపిగా గిలిగింతలు పెట్టి మన గుండెలలోనించి వర్ణించలేని భావన సూటిగా, వెచ్చగా ప్రవహిస్తున్నట్టు ఉంటాయి ఆయన మాటల పాటలు. 1917-1918 మధ్య కాలంలో ఆయన మద్రాసు క్రిస్టియన్ కాలేజిలో బి. ఏ. పరీక్షలకి చదువుకుంటున్న రోజులలో ఒక నాడు కాలేజీ నుండి ట్రాం బండిలో వెళ్తుండగా, గొంతులో సన్నని రాగం బయలుదేరిందిట. దానిని పాడాలని ప్రయత్నించగా సాహిత్యం “గుండె గొంతుకలోన కొట్లాడుతాది” అన్న పల్లవి వచ్చిందిట. అదే మననం చేసుకోగా ఇల్లు చేరేసరికి ఆయన వ్రాసిన మొదటి పాట తయారయ్యింది. అలా మన ఎంకి పాటలు ఊపిరి పోసుకుంటే ఆయన వర్ణనకి, భావాలకి తగ్గటుగా ప్రముఖ చిత్రకారుడయిన అడవి బాపిరాజు గారి చిత్రాలు తోడయ్యి  నండూరి - బాపిరాజు ఎంకిని మనందరి ముందుకి తెచ్చారు. తెలుగు దేశములో పేరొందిన మేటి గాయకులు మహారాజశ్రీ పేరుపల్లి రామకృష్ణయ్య గారు ఎంతో శ్రమపడి, మిక్కిలి శ్రద్ధతో ఎంకి పాటలకి స్వర కల్పన చేశారు. అందువలన మన నండూరి గారు పాడిన ప్రతీ ఎంకి పాట ఒకే స్వరముతో ఉంటాయి. శ్రీ గంటి సూర్యనారాయణ గారు ఎంకి పాటలు అనే పుస్తకాన్నిమొదటిసారి ప్రచురించారు. యెంకి పాటలు రెండు భాగాలుగా వెలువడ్డాయి. "పాత పాటలు" తరువాత చాలా కాలానికి అంటే 27 ఏళ్ళ తరువాత "కొత్తపాటలు" వెలువడ్డాయి.

పల్లెజీవిత విధానం, విశ్వాసధనం, గట్టి కట్టుబాట్లు, వాటిని మనసారా గ్రహించటం, ఆచరించటం, పరిణామ పరిణతులకై ఆశయం మనపై చెరగని ముద్రని వేస్తాయి. వ్యక్తి, సంఘం, దైవం, భక్తి, కర్మ, జ్ఞానం - ఎటునుంచీ చూసినా, ఇవన్నీ మనని పలుకరించి ప్రభావితం చేస్తాయి.  అందుకనే శృంగారానికి, వేదాంతానికి, రెండింటి రంగరింపుకి ఎంకిపాటలని మించిన గానం సాహిత్యంలో ఉండదేమో అనిపిస్తుంది. మామూలు వర్ణనలతో, అలంకారాలతో శృంగార క్రీడల్ని, విలాసాలతో ప్రేమను, చైతన్య స్రవంతిని సమవేగంతో, ఆణిముత్యాలవంటి మాటలలో, ఆడించే ఆటలలో, పాడించే పాటలలో, అమోఘమయిన పట్టుతో, పొదుపుతో ఆలపిస్తారు నండూరి. “ముత్యాలపేరు”ను సహృదయతతో చదివినా, విన్నా మనకివ్వబడిన వర్ణచిత్రంతో, తాదాత్మ్యం చెందుతాము. భరతుడి నాట్యశాస్త్రం ప్రకారం, శాంత రసం ప్రతిపాదన జరిగేవరకు ఎనిమిది రసాలన్నీ ఇమిడి వున్నాయని వివరిస్తారు. శాంతం నవమరసం. అది వచ్చాక దానిని ఉత్తమరసంగా ప్రతిపాదించారు. కాని ఒక విధంగా అది రసం కాదు. కొన్ని గేయాల్లో, గేయాల చివరలో శాంత రసానుభూతి కవికి కలిగింది; ఎంకి నాయుడుబావలకు కలుగుతుంది. వాళ్ళ పాత్రల ద్వారా మనకూ కలుగుతుంది.

నండూరి చెప్తారు: “పాటలు అప్రయత్నంగా వచ్చేటట్లు ప్రసాదించిన యెంకికి కృతజ్ఞుడనా? ప్రోత్సాహము చేసి వీపు తట్టిన అధికార్లవారికా? 50 కవిత్వకళా రహస్యాలు తెలియజెప్పిన మా బసవరాజు అప్పరాయనికా? మువ్వురకును.” ఎంకి పాటలు అప్రయత్నంగా వచ్చినవే. సహజంగా, స్వేచ్చతో, ప్రయత్నమున్ననూ, అప్రయత్నమనే భావన కలిగిస్తాయి. అది కవి గొప్పతనం. హృదయం, మనసు, ఆత్మల సమ్మేళణ ఫలితం. మళ్ళీ నండూరి: “తెలుగుతల్లి యొక్క నిజస్వరూపం చూడవలెనని… తెలుగు పస, తెలుగు నుడి, తెలుగు నాదం, తెలుగు రుచి తెలిసికొని మానవ జాతి సాంప్రదాయాలలోగల సొగసు, జీవనమూ,పదిమందికిన్నీ మనసుకెక్కించవలెనని.. ” ఈ గుణాలన్నిటినీ ఎంకిపాటలు మరపురాని పద్ధతిలో వ్యక్తం చేస్తాయి. ఎంకి పాటలు, కొత్త పాటలు వాస్తవము, అనుభవము, భావన, భావము, ఊహ, దర్శనము, జానపదము, సంగీతము, సాహిత్యము, రసము, సంకేతము, భక్తి, జ్ఞానము (వేదాంతము) వీటన్నింటి రంగరింపు.

ఎటువంటి వారికయినా చక్కగా అర్ధమయ్యే భాషలో ఎన్నో విధములుగా జనుల హృదయాలను దోచుకునే గేయ సంపుటి. ప్రతీ ఒక్కరూ చదివి ఆస్వాదించవలసినవి ఎంకి పాటలు. చదవాలనుకునే వారి కోసం ఇక్కడ జత చేశాను.

యెంకి పాత పాటలు
యెంకి కొత్త పాటలు

12 comments:

Anonymous said...

nee pic pettaalsindi ee postki! oka saari fancy dress competitionki nv enki dresslo vachchaav gurthundaa? sooper asalu. ee post chala baagundi ra keep it up

రసజ్ఞ said...

@అజ్ఞాత గారు
థాంక్స్ అండి కాని ఇప్పుడు ఆ విషయాలన్నీ ఇక్కడ అవసరమంటారా????

Manasa said...

chalaa baagundi rasajnagaaroo. Enki naa all time favourire :)

రసజ్ఞ said...

@మానస గారు
ధన్యవాదములండీ! వావ్ అయితే సేమ్ పించ్. నాకు కూడా ఎంకి చాలా ఇష్టం.

hariprasadcc said...

Nice one ra....... i liked the song
ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి
మెళ్ళో పూసల పేరు
తల్లో పూవుల సేరు
కళ్ళెత్తితే సాలు
రాసోరింటికైనా
రంగు తెచ్చే పిల్ల.
పదమూ పాడిందంటె
కతలు సెప్పిందంటె
కలకాలముండాలి.
అంసల్లె, బొమ్మల్లె
అందాల బరిణల్లె
సుక్కల్లె నా యెంకి

Anonymous said...

ఎంకెవ్వరని లోకమడిగితే ఎలుగు నీడలకేసి ఏలు సూపింతు...

ఎంకి గురించి ఎంత మాట్లాడితే తరుగుతుంది....అంతా అర్ధమయినట్టే ఉండి ఇంకా ఏదో అర్ధం కాకుండా మిగిలిపోయే పాటలు...ఏమయిపోతాయో కొన్నాళ్ళకి ఇంత అందమైన పాటలు...మేలు రతనాల మూటలు..

నా స్నేహితురాలిని నేనే పొగుడుకోడం ఎందుకని పొగడడం లేదోయ్ నిన్ను...

ప్రజలకి మాత్రం చెప్పదలుచుకున్నానొక మాట...మా ఎంకి(రసజ్ఞ) అందమైన జొన్న కంకి, శివుడు జడలో తురుముకున్న చంద్ర వంకి....

రసజ్ఞ said...

@ హరి
ఇది ఒక పాట కాదు. ఆయన రాసిన పాటలన్నిటిలోనించి తీసుకుని వ్రాసినది. అన్నీ పాటలు చదువు నీకు ఇంకా నచ్చచ్చు.

రసజ్ఞ said...

@మోహన్
నిజమే చాలా మందికి అడవి బాపిరాజు గారి ఎంకి బొమ్మకి బాపు బొమ్మకి తేడా తెలియడం లేదు. సంతోషించ దగ్గ విషయం ఏంటంటే ఇంకా ఎంకి అంటే గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. మన ముందు తరాల సంగతి ఏమో? మనకి తెలిస్తేనే కదా వాళ్లకి చెప్పేది. ఇలాంటివి అపురూపమయినవి కాపాడుకోవడం మన బాధ్యత.

నన్ను పొగడద్దులే కాని ఏంటోయ్ నా మీద కవితలే రాసేస్తున్నావ్?

రసజ్ఞ said...

@dp - scorpion king gaaru
mee request pariseelinchina meedata teliyaparusthaam!

రాజ్యలక్ష్మి.N said...

ఎంకి గురించి,ఎంకి పాటల గురించి
సవివరంగా అందించిన మీ టపా బాగుంది.

రసజ్ఞ said...

ధన్యవాదాలు రాజి గారూ!

Anonymous said...

I'm now not positive the place you are getting
your information, however good topic. I must spend some time finding out more or understanding more.
Thank you for magnificent info I was looking for this information for my mission.

Also visit my web site - dating sites (bestdatingsitesnow.com)