ఈ పేరు వినగానే మీకు శంఖు పంచలు గుర్తొచ్చాయా? అయితే మీరు సాంబారులో కాలు వేసినట్టే. నేను ఇక్కడ ప్రస్తావించేది అక్షరాలా మనం పూరించుకునే శంఖం గురించే!!
శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే ఏదైనా మంచి అని, ఖం అంటే జలము అని అర్ధము. కాబట్టి జలము ఉంచే మంచి కలశము అని అనుకోవచ్చును. శంఖంలో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధముగా ఉపయోగిస్తారు. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అనే నానుడి వినే ఉంటారు.
శంఖే చంద్ర మావాహయామి
కుక్షే వరుణ మావాహయామి
మూలే పృధ్వీ మావాహయామి
ధారాయాం సర్వతీర్థ మావాహయామి అని చదువుతూ నీటిని శంఖంలో ఉంచి తీర్థంగా మారుస్తారు. అప్పుడు ఆ తీర్థాన్ని భక్తులకి
అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం
సమస్త పాప క్షయకరం శ్రీ పాదోదకం పావనం శుభం అని అంటూ చేతిలో పోస్తారు.
మన పురాణాల ప్రకారము క్షీర సాగర మధనం అప్పుడు వచ్చిన పదనాలుగు రత్నాలలో శంఖం ఒకటి. అప్పటినుండి అది శ్రీ మహావిష్ణువుకి ఒక ఆయుధముగా మారిందని చెప్తారు. విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి, శంఖం సముద్రతనయ అని అంటారు. వరుణుడు, సూర్యుడు, చంద్రుడు శంఖము యొక్క పీఠ భాగములోను, ప్రజాపతి ఉపరితలం మీద, గంగ మరియు సరస్వతులు ముందు భాగములోను ఉంటారుట.
శంఖము నుండి రెండు రకములుగా ధ్వనిని జనింప చేయవచ్చును.
- ధమనం: ఇందులో చిల్లు ఉన్న చోటని నోటిలో పెట్టుకుని మొత్తం గాలిని శంఖములోనికి పంపడం.
- పూరణం: ఇందులో మన నోటి నుండి వెలువడే గాలి తరంగాలని మాత్రమే శంఖములోనికి పంపడం.
శంఖమును పూరించుట వలన వెలువడే కంపనాలలో వాతావరణములో ఉండే రోగ కారిణిలయిన ఎన్నో క్రిముల్ని నాశనం చేసే శక్తి ఉందని ఎన్నో అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందువలననే దీనిని ఆయుర్వేద శాస్త్రములో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలానే అఖండ దైవిక వస్తువుల్లో శంఖం ఒకటి.

శంఖాన్ని పూరించగా వెలువడే నాదాన్ని శంఖారావం లేదా శంఖాస్వానం అంటారు. శంఖమును గాలితో నింపి పూరించుట వలన ధ్వని జనించే ముందు మనలో సత్వ గుణం మొదలవుతుంది. అది అలా ఒక స్థాయికి చేరుకునేసరికి మనకి ఆనందం కలుగుతుంది. ఈ సత్వ గుణం అలా పెరుగుతూ చైతన్యాన్ని (ఒక రకమయిన శక్తి) పెంచి తద్వారా రజో, తమో గుణాలని దూరం చేస్తుంది. ఈ చైతన్యం మన చుట్టుపక్కలకి వ్యాపించుట వలన చుట్టూ ఉన్న చెడు నశిస్తుంది అని నమ్మకం. ఇక్కడ మనకి పసుపు రంగులో కనిపించేదే చైతన్యం, గులాబీ రంగులో కనిపించేది ఆనంద చిహ్నం, నీలం రంగులో సత్వ గుణం చైతన్యం రూపంలో విస్తరించేటప్పుడు రజో, తమో గుణాలని దూరం చేస్తుందనడానికి చిహ్నం. ఇక్కడ ఉద్భవించే సత్వ గుణ కంపనాలు చాలా సేపటి వరకు ఉండుట వలన పూజా సమయములో దీనిని పూరిస్తూ ఉంటారు. శంఖముని పూరించిన వాళ్ళకే కాదు విన్న వాళ్ళకి కూడా ఉపయోగకరం. అందువలననే ఒక్క సారి శంఖమును పూరించుట వలన, ఆ ధ్వనిని వినుట వలన ఆరునెలల పురాణ శ్రవణం వలన కలిగిన ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతాయిట. శంఖం పూరించగా వచ్చే మధుర ధ్వని ధైర్యాన్ని, ఆశని, లక్ష్యాన్ని, పట్టుదలని, స్థిర చిత్తాన్ని, ఆశావాదాన్ని ఇస్తుంది. దుష్టశక్తులను తరిమికొడుతూ, విజయం మనదే అని ప్రబోధిస్తుంది. శంఖంలో సృష్టికి మూలమైన ఓంకారం ఉంది. శంఖ ధ్వని సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక. శంఖాన్ని శివపూజకు, పూజనందు ఆరతి ఇచ్చేటప్పుడు, ధార్మిక ఉత్సవాలలో, యజ్ఞాలలో, రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన ఖర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణేశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ, ధూపదీప నైవేద్యాలతో పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి.

బుద్ధిజంలో శంఖం అనేది అష్ట మంగళాలలో (శంఖ, ఛత్ర, కలశ, పుష్ప, గ్రంథి, చక్ర, పతాక, మీన) ఒకటి. బౌద్ధంలో, చైనీస్ బుద్ధిజం లో శంఖ ధ్వనిని కష్టాలపై విజయంగా పేర్కొన్నారు. మనిషి పుట్టుక, జీవనాలకి శంఖం ప్రతీక. మనకి భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని పంచ భూతాలు. ఇక్కడ భూమి అంటే మట్టి - జీవి జన్మకు వేదిక, భూమి చుట్టూ ఉన్న శూన్యప్రదేశమే ఆకాశము - ఇది మన చుట్టూ ఉన్న జనాలని, పర్యావరణాన్ని తెలియచేస్తుంది. ఇక భూమి పైన ఉన్న ప్రకృతి వాతావరణము లో ప్రతి జీవికి కావలసిన గాలి , నీరు , అగ్ని/శక్తి (ఆహారము) జీవపరిణామ క్రమములో వాటంతటవియే సమకూర్చబడి జీవ మనుగడకి తోడ్పడుతున్నాయి. జీవి మరియు పంచభూతాలు కలిస్తేనే ప్రకృతి ఏర్పడుతుంది. ఒకదానినుండి ఒకటి ఉద్భవించాయి. అలా ఉద్భవిస్తూనే ఉంటాయి. ఇది ఒక నిరంతర చక్రం. భూగోళము ఉన్నంతవరకూ ఇలా జరగవలసినదే. వీటిలో ఏ ఒక్కదానికి అంతరాయము కలిగినా ప్రకృతిలో జీవి (ప్రాణి) నశించి భూమి ఉనికే ప్రశ్నార్ధకము ?
మానవుని విజ్ఞాన శాస్త్రము అంతగా అభివృద్ధి చెందని కాలములో అన్నింటిని అతీత శక్తులు గాను, దైవాలుగాను భావించి పంచభూతాలను, లింగాలుగాను, అంగాలుగాను ఊహించి, పూజించి, మనోశక్తిని, మానసిక ఉల్లాసాన్ని పొందేవాడు. అలా మొదలయినదే ఈ శంఖం పూజ కూడా. తరువాత విజ్ఞాన శాస్త్ర పుణ్యమా అని విషయాలని తెలుసుకుని ఈ పాత కాలపు అలవాట్లన్నీ మూఢ నమ్మకాలు అని కొట్టివేయడం జరిగింది. కానీ వీటికి శాస్త్రవేత్తలు జరిపిన అధ్యాయనాలకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని పూర్వ కాలం వాళ్ళు చెప్పిన వాటికి శాస్త్ర సంబంధ ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటిదాకా పురాణ సంబంధిత విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు శాస్త్రవేత్తలు శంఖం మీద జరిపిన అధ్యయనాల గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
మొలాస్కా అనే ఒక రకమయిన అకశేరుకాలు (invertebrates) వాటి రక్షణ కోసం తయారు చేసుకున్న గట్టి కవచమే శంఖం. ఆ జీవులు ఈ కవచాన్ని వదిలి బయటకి వచ్చి మరో కవచాన్ని తయారు చేసుకుంటాయి అలా మనకి శంఖములు వస్తాయి. శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని అనేక ప్రయోగాలు చేసి శాస్త్రవేత్తలు నిరూపించారు. శంఖ భస్మము వల్ల అనేక రోగాలు కూడా నయము అగుచున్నవి. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి, బాగా గాలి ప్రసరణ జరిగి చురుకుగా కూడా ఉంటాము. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాదం వినిపిస్తుంది. ఆ నాదం వినిపిస్తే చాలా మంచిదని జనుల అభిప్రాయం. అలా వినిపించే శంఖములే మంచి శంఖములని కూడా అంటూ ఉంటారు. కానీ పరిశోధనలలో తేలిన విషయం ఏమిటంటే మన చెవులలో జరిగే రక్త ప్రసరణ అలా ఆ ధ్వనిగా వినిపిస్తుంది. పైగా చెవి సంబంధిత దోషాలు లేదా రోగాలున్నా శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుని ఆ శబ్ద రకములని బట్టి కూడా మన చెవి ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు.
శంఖం అనేది కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్, కార్బొనేట్లతో తయారౌతుంది. ఈ ధాతువులు మన శరీరానికి చేసే మేలు చాలా ఉంది. కాల్షియం ఎముకల ఎదుగుదలకి, మెదడు చురుకుగా పని చేయడానికీ, శరీరంలోని మలినాలని తొలగించడానికీ, కండరాల సంకోచ వ్యాకోచాలకీ అవసరం. అలాగే మెగ్నీషియం మనకి జన్యు పదార్ధములయిన DNA, RNA తయారు కావడానికి కావలసిన ఎంజైములను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అలానే నాడులు సక్రమంగా పని చేయాలంటే ఈ మెగ్నీషియం అవసరం. ఫాస్ఫేట్ అనేది మనకి ఫోస్ఫోలిపిడ్ల రూపంలోనూ, మనకి శక్తికి రూపమయినటువంటి ATP లోనూ ఇంకా DNA, RNA లలోనూ, చాలా రకములయిన ఎంజైముల తయారీలోను కావలసిన అతి ముఖ్యమయిన ధాతువు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయా ధాతువులను తీసుకోవడం వలన మనకి ఎన్నో రోగములు దరి చేరవు కనుకనే దానిలో నీళ్ళని వేసి తీర్థం రూపంలో ఇస్తారు. ఈ తీర్తాన్నే శంఖు తీర్థం అంటారు. దానిలో అనేక లవణాలు కరిగి ఉంటాయి కనుక దీనిని సేవించడం వలన దేహ దారుఢ్యం బాగుంటుంది. వాత, పిత్త దోషాలు హరిస్తాయి. శరీరానికి కాంతి వస్తుంది.

శంఖములని ఆభరణాలుగా కూడా వాడతారు. చేతులకి పెట్టుకునే ఆభరణాలలో వాడితే శంఖ వలయాలు అంటారు, చెవులకి పెట్టుకునే ఆభరణాలలో వాడితే శంఖ పత్రాలు అంటారు, కంఠాభరణాలలో వాడితే శంఖ మణులు అంటారు. ఈ విధముగా తయారు చేసిన శంఖాభరణాలని ఎక్కువగా కరీబియన్, పసిఫిక్ సముద్ర ప్రాంత వాసులు వాడతారు.
శంఖముల రకములు:
మనం బాగా విన్న కొన్ని శంఖాల గురించి చెప్తా. అవే మన కురుక్షేత్రంలో పూరించిన కొన్ని శంఖాలు అన్నమాట. శ్రీ కృష్ణుడు పూరించిన శంఖం పాంచజన్యం, ధర్మరాజు పూరించిన శంఖం అనంతవిజయం (అంతం లేని విజయాల్ని పొందుతాడుట), భీముడు పూరించిన శంఖం పౌండ్రం, అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం, నకులుడు పూరించిన శంఖం సుఘోష, సహదేవుడు పూరించిన శంఖం మణిపుష్పక, కాశీ రాజు పూరించిన శంఖం శిఖండి, దుష్ఠ ద్యుమ్నుడు, విరాటుడు పూరించిన శంఖం సాత్విక. ఇవే కాక మనకి చాలా రకముల శంఖములున్నాయి.
శంఖములు అన్నిటినీ ముఖ్యముగా మూడు రకములుగా విభజించారు. అవేమిటంటే:
౧. దక్షిణావర్త శంఖములు:
వీటిని తమిళములో వలం పురి అని, కన్నడములో బల మురి అని సంబోధిస్తుంటారు. దక్షిణము అంటే కుడి చేతి వైపు మరియు ఆవర్తనము అంటే తెరుచుకొనుట. ఇవి కుడిచేతి వైపు తెరచుకుని ఉండుట వలన ఎడమచేతితో పట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. వీటిని పూజలకి మాత్రమే ఉపయోగిస్తారు. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. వీటిల్లో మళ్ళీ పురుష శంఖాలు, స్త్రీ శంఖములు (వీటినే శంఖిని) అని రెండు రకములున్నాయి. పురుష శంఖములు చాలా గరుకుగా దళసరిగా ఉంటాయి. స్త్రీ శంఖములు మాత్రం చాలా సున్నితంగా పలుచగా ఉంటాయి. ఈ స్త్రీ శంఖములయినటువంటి శంఖిని శంఖములు పూజకి, పూరించడానికి కూడా పనికిరావు. లక్ష్మీ శంఖం,శివ శంఖం, పాంచజన్యం దక్షిణావర్త శంఖములకి ఉదాహరణలు. పాంచజన్యం అనే శంఖం మనకి సుపరిచితమే. శ్రీ మహా విష్ణువు శంఖం పేరు పాంచజన్యం. శ్రీ కృష్ణుడు భారత యుద్ధ సమయంలో పూరించిన శంఖం. ఇది పురుష దక్షిణావర్త శంఖము.
౨. ఉత్తరావర్త లేదా వామావర్త శంఖములు:
ఉత్తరము లేదా వామ భాగము అంటే ఎడమ చేతి వైపు ఆవర్తనము అంటే తెరుచుకొనుట. ఇవి ఎడమచేతి వైపు తెరుచుకుని ఉండుట వలన కుడి చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. ఇవి చాలా సులభముగా లభ్యమవుతాయి. సముద్రపు ఒడ్డున ఎక్కువగా దొరుకుతాయి. వీటిల్ని ఎక్కువగా పూరించడానికి ఉపయోగిస్తారు.
౩. మధ్యమావర్త శంఖములు:
మధ్యలో నోరు ఉన్నశంఖములని అన్నిటినీ మధ్యమావర్త శంఖములు అంటారు. అంటే పూరించగలిగే శంఖములు అన్నీ మధ్యమావర్త శంఖములన్నమాట.
శంఖములు కనిపించు రీతిని బట్టి వాటికి చాలా పేర్లు ఉన్నవి. అవి:
౧. లక్ష్మీ శంఖం:
శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. దీనిని పక్కన ఉన్న మూడు ఉబ్బెత్తు ఆకారాల ద్వారా గుర్తించవచ్చును.
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ లక్ష్మీ దేవిని పూజిస్తే కోరినవి ఇస్తుందిట.
౨. గోముఖ శంఖం:
ఈ శంఖములు గోవు యొక్క ముఖ ఆకారమును పోలి ఉండుట వలన వీటిని గోముఖ శంఖములు అంటారు.
౩. కామధేను శంఖం
౫. సుఘోష శంఖం:
సుఘోష అంటే మంచి శబ్దము అని అర్ధం. ఈ శంఖమును నకులుడు మహా భారత యుద్ధ సమయములో పూరించెను. మంచి వాళ్లకి సుమధురముగా, చెడ్డ వాళ్లకి భరించలేని శబ్దము రావడం దీని ప్రత్యేకత అని చెప్తారు. నాకు దానికి సంబంధించిన చిత్రం దొరకకపోవడం వలన జత చేయుటలేదు.
 |
గరుడ శంఖం |
౬. గరుడ శంఖం:
ఇవి గరుక్మంతుని ఆకారమును పోలి ఉండుటవలన ఆ పేరు వచ్చినది.
౭. మణిపుష్పక శంఖం:
మహాభారత యుద్ధ సమయములో సహదేవుడు పూరించిన శంఖం మణిపుష్పక శంఖం. నాకు దానికి సంబంధించిన చిత్రం దొరకకపోవడం వలన జత చేయుటలేదు.
 |
రాక్షస శంఖం |
౮. రాక్షస శంఖం:
ఈ శంఖాలకి వంటి మీద పెద్ద పెద్ద ముళ్లు ఉండి చూడడానికి భయంకరంగా ఉంటాయి.
 |
శని శంఖం |
౯. శని శంఖం:
ఈ రకములయిన శంఖాలకి నోరు పెద్దదిగా, పొట్ట చిన్నదిగా ఉంటుంది. ఒంటి మీద ముళ్లు ఎక్కువగా ఉంటాయి. అష్టమ శని, కంటక శని మొదలయిన శని సంబంధిత దోషాలని నివృత్తి చేయడానికి ఈ శని శంఖాలని పూజిస్తారు. శని శంఖాన్ని పూజించే వారికి పేదరికం, ఆక్సిడెంట్లు దరి చేరవని నమ్మకం.
 |
సర్పాకార శంఖం |
౧౦. రాహు శంఖం మరియు ౧౧. కేతు శంఖం:
ఈ రాహు కేతు శంఖాలు రెండూ సర్పాకారంలో ఉంటాయి కనుక వాటిని సర్పాకార శంఖాలు అని కూడా అంటారు. వీటిని ఆయా గ్రహాల దోష పరిహారార్ధం ఉపయోగిస్తారు.
 |
కూర్మ శంఖం |
౧౨. కూర్మ శంఖం:
ఇవి తాబేలు రూపంలో ఉండటం వలన వాటికి ఆ పేరు వచ్చింది. ఈ శంఖములని గంగా జలముతోనూ పచ్చి పాలతోనూ శుభ్రపరచి ఇంట్లో పెట్టి పూజిస్తే అన్నిటా విజయులవుతారని నమ్మకం.
 |
వరాహ శంఖం |
౧౩.వరాహ శంఖం:
ఇవి వరాహమును పోలి ఉండుటవలన వాటికి ఆ పేరు వచ్చింది.
౧౪. ముత్యపు శంఖాలు:
వీటినుండి ముత్యములు వస్తాయి కనుక వీటికి ఆ పేరు వచ్చినది. కొన్ని శంఖములకి బాగా సాన పెట్టడం వలన ముత్యాల్లా మెరుస్తాయి వాటిని కూడా ముత్యపు శంఖములు అనే సంబోధిస్తారు.
ఇవి వినాయకుని ఆకృతిని పోలి ఉంటాయి. తొండము బాగా కనిపిస్తూ ఉంటుంది. గణేశ శంఖాలలో నీరు నింపి గర్భవతులకు త్రాగించినట్లయితే గ్రుడ్డి, కుంటి, మూగ మొదలైన సంతానం కలగదు అని నమ్మకం. వీటి వలన వాస్తు దోషాలు కూడా పోతాయట.
కొన్ని ఆరోగ్య సంబంధ చిట్కాలు:
- శంఖంలో రాత్రంతా నీటిని ఉంచి మరుసటి ఉదయం ఆ నీటితో చర్మాన్ని రుద్దుకుంటే చర్మసంబంధమైన రోగాలు నయమవుతాయి.
- ఉదయము స్నానము చేశాక శంఖాన్ని ముఖానికి , ఒంటికి రుద్దుకుంటే ముఖం పై ముడుతలు , నల్లమచ్చలు పోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది.
- కడుపు నొప్పి సంబంధిత రోగాల నివారణకు పరగడుపున రాత్రి పన్నెండు గంటలపాటు శంఖం లో ఉంచిన నీటిని ఒక చెంచాడు త్రాగితే పేగులను బాగా శుభ్రపరుస్తుంది.
- శంఖంలో నిలువ చేసిన నీటిని మామూలు నీళ్ళలో కలిపి పరగడుపున ఆ నీటితో కళ్ళు కడుక్కోవాలి . ఇలా రోజూచేస్తే కంటి సంబంధిత రోగాలు మాయమౌతాయి . కళ్ళు ఆరోగ్యం గా ఉండి కళ్ళజోడు వాడవలసిన అవసరము తగ్గుతుంది.
- శంఖంలో నిలువ చేసిన నీటిని చర్మము క్రింద ఉన్న తెల్లమచ్చలు పై రుద్దాలి ఇలా రోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆ మచ్చలు మాయమవుతాయి.
- రాత్రి శంఖాన్ని నీటితోనింపి ఉదయము దానికి కొంచెం రోజ్ వాటర్ కలపాలి. అలా కలిపిన నీటిని జుట్టుకి పట్టించాలి. దీనివల్ల జుట్టు ఆరోగ్యముగా, నల్లగా, ఒత్తుగా తయారవుతుంది.
- చంటి పిల్లలకి శంఖంలో నిలువ చేసిన నీటిని పట్టించడం వలన చాలా ఆరోగ్యంగా తయారవుతారు.
సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహీ తన్నో శంఖ ప్రచోదయాత్ అనేది శంఖ గాయత్రి. దీనిని పఠించడం ఎంతో మంచిది. శంఖం దార్మికతతో పాటు వైజ్ఞానిక సారాన్ని కూడా నింపుకుంది. ఇక్కడ నేను చెప్పినవన్నీ అక్కడా ఇక్కడా చదివీ, విని తెలుసుకున్నవి మాత్రమే.
అదండీ! కథ నా బ్లాగుకి మీరంతా మీ పనుల్లోకి.