Sunday, July 24, 2011

భావావేశ గుఱ్ఱం


సాలీడులోని అపూర్వమయిన సౌందర్యానికి చంద్రమండలంలోని అవ్వ వడికిన వెన్నెల చీరను చుట్టి, వాలుజడలో గడ్డి పూలను తురిమి, గిజిగాడితో గిలిగింతలు పెట్టించగలిగే భావ కవి గుఱ్ఱం జాషువా. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భముగా ఆయనని ఒక్కసారి స్మరించుకుందాం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు అనడానికి నిలువెత్తు నిదర్శనం గుఱ్ఱం జాషువా. ఈయన 1895 సెప్టెంబర్ 28 వీరయ్య, లింగమాంబ దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. అస్పృశ్యత, దారిద్ర్యం వెంట తరుముతున్నా, కులం పేరుతో జనాలు మాటలతో కుళ్ళపొడుస్తున్నా లెక్కచేయక సాహితీ క్షేత్రంలో ఒక తారగా ఎదగాలన్న పట్టుదలని విస్మరించక కృషితో, పట్టుదలతో ముందుకి సాగి ఆధునిక తెలుగు కవులలో ప్రముఖ స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. నాకు గురువులు ఇద్దరు - పేదరికం, కుల మత భేదం. ఒకటి సహనాన్ని నేర్పితే రెండవది నాలో ఎదిరించే శక్తిని ఇచ్చింది అని ఆయన చెప్పారు.

1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాక, మిషనరీ పాఠశాలలో ప్రాధమికోపాధ్యాయునిగా నెలకు మూడు రూపాయల జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసారు. టాకీ సినిమాలు లేని రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈయన పని. విధముగా మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా ఊరూరా తిరిగే సమయములో  వీరేశలింగం, చిలకమర్తుల ఆశీర్వాదములతో కావ్య జగత్తులో స్థిరపడ్డారు. తిరుపతి వేంకట కవుల ప్రోత్సాహం కూడా తోడయి ఆయనను ముందుకు నడిపింది. తరువాత గుంటూరులోని లూథరన్చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పని చేసారు. అటు పిమ్మట 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసారు. 1946-60 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసారు.జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి లో సభ్యత్వం లభించింది.

చిన్నతనం నుండీ జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవారు. బాల్య స్నేహితుడూ, తరువాతి కాలంలో రచయితా అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నారు. తెలుగులోనూ, సంస్కృతంలోనూ ఉభయ భాషా ప్రవీణ చేశారు. ఈయన 36 గ్రంధాలు, లెక్క లేనన్ని కవితా ఖండికలు రచించారు. గబ్బిలం, బాపూజీ, గిజిగాడు, క్రొత్త లోకం, ఫిరదౌసి, ఆంధ్ర మాత, నేతాజీ, ముంతాజు మహలు, క్రీస్తు చరిత్ర, సాలీడు, చంద్రోదయం, శిశువు, కాందిశీకుడు ముఖ్యమయినవి.

గబ్బిలం (1941): 1939లో విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన వేయిపడగలుకి ప్రతిక్రియగా జాషువా గారు వర్ణ ధర్మాన్ని నిరసిస్తూ 1941లో గబ్బిలం అనే ఖండ కావ్యాన్ని వ్రాసారు. ఇది సంస్కృతంలో కాళిదాసు రచించిన మేఘ సందేశానికి దగ్గరగా ఉంటుంది కానీ ఇందులో ఒక నిరుపేద ఇంటిలో దీపమును ఆర్పటానికి వచ్చిన ఒక గబ్బిలంతో తన కన్నీటి కథని ఈశ్వరునితో (కాశీ విశ్వనాధునితో)  చెప్పమని పంపే అశ్రు సందేశమే గబ్బిలం. ఈ కావ్యం ద్వారా ఖండ కావ్య ప్రక్రియకు జీవం పోసి, ఆంధ్ర సాహిత్యంలో దానికొక విశిష్టతను చేకూర్చారు.
ఫిరదౌసి (1932): పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించారు.

జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నారు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించారు. కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, మధుర శ్రీనాధ, నవయుగ కవి చక్రవర్తి, విశ్వ కవి సామ్రాట్ అనే బిరుదులను పొందారు. పద్మభూషణ, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (క్రీస్తు చరిత్ర కి), కళా ప్రపూర్ణ (ఆంధ్ర విశ్వ విద్యాలయం), మొదలయిన పురస్కారాలనెన్నో అందుకున్నారు. గుంటూరు పట్టణం స్వేచ్ఛా పౌరసత్వాన్నిచ్చి గౌరవించింది. 

భావ కవిత్వానికి ప్రాణమయిన ఆత్మాశ్రయ లక్షణమూ, సౌందర్యారాధనమూ, సంస్కరణాభిమానమూ, ప్రణయ తత్వ విలాసమూ, మానవ మహిమాభివర్ణనమూ, స్పష్టత ఆయన రచనలలో ఉట్టిపడే లక్షణాలు. రసైక దృష్టి ఉంటే ప్రతీ అణువులో కవిత్వం సాక్షాత్కరిస్తుందని నిరూపించిన ఆయన మన గుండెలలో చెరిగిపోని ముద్రని వేసి 1971 జూలై 24 గుంటూరులో అమరుడయ్యారు. ఈయన  వ్రాసిన వాటిలో నేను సేకరించిన కొన్ని రచనలు ఇక్కడ చూడచ్చు.

గబ్బిలం 
పిరదౌసి 
ఆంధ్రమాత 
పాపాయి పద్యములు



7 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

రసజ్ఞ గారూ,
మీకు కృతజ్ఞతలండి.

రసజ్ఞ said...

@మందాకిని గారూ,
మీకు కూడా!!!

రసజ్ఞ said...

@Mohan
థాంక్స్ ఇక్కడ నేను ఆయన కులం పేరు ఎత్తటం ఇష్టం లేక ఈ విషయాలు రాయలేదు. మంచి విషయాలను చెప్పావు.

రసజ్ఞ said...

@మోహన్
ఆ పద్యం దొరికిన వెంటనే ఇక్కడ పెడతాను.

కృష్ణప్రియ said...

బాగుంది.

రసజ్ఞ said...

నెనర్లు కృష్ణప్రియ గారు

Anonymous said...

Hi! I've been following your blog for a long time now and finally got the courage to go
ahead and give you a shout out from Atascocita Texas!
Just wanted to say keep up the excellent work!


My webpage ... dating online (bestdatingsitesnow.Com)