Thursday, July 14, 2011

ప్రదక్షిణల వృత్తాంతం


మనమందరం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేస్తాం కదా? కానీ ఎందుకని చేస్తాం అన్నది మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. మనం ఏ పనిని చేసినా చేసే దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకుని చేయడం మంచిదన్న భావనతో ఇక్కడ నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో ప్రస్తావించ తలచాను. సంస్కృతములో ప్రదక్షిణం అంటే దక్షిణ ముఖముగా తిరగడం దానినే కుడి చేతి వైపు తిరగడం అంటారు. ఇక్కడ మనం దక్షిణ ముఖముగా (కుడి చేతి వైపు) తిరగడం వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటంటే, మనం కుడిచేతి వైపుగా గుండ్రముగా దేవుని చుట్టూ తిరగడం వలన అయన  మన కుడిభుజము లాగా  ఉండి మనకి కావలసినవాటన్నిటినీ చూసుకుంటారులే అన్న నమ్మకం. పైగా దేవుడిని నాభిగా చేసుకుని అయన చుట్టూ మనం ఒక వృత్తము లాగా తిరగడం వలన మనము ప్రదక్షిణము చేసేటప్పుడు ఎక్కడ ఉన్నా(వృత్తము మీద ఏ బిందువు మీద ఉన్నా) దేవునికి సమానమయిన దూరములో ఉంటాము కనుక ఆయన కృపా కటాక్ష వీక్షణలు అందరి మీద సరి సమానముగా ఉంటాయి. ఇలా చేయడం వలన మనకి కొంత శక్తి వచ్చి తద్వారా మన మనసులో ఉన్న చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలతో ఉంటాము. దీనినే postitive energy  అంటారు.

దీనినే కొంతమంది పండితులు ఇలా సమర్ధించారు. మనకి కనిపించే 'సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది . భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా వున్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి (సూర్యరశ్మి) ని పొందుతోంది.ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది.

అలాగే భక్తులు కూడా ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం 'చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇది మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ (భ్రమణం) చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు. నిజమే మరి మనం కూడా ఆత్మ ప్రదక్షిణలు చేస్తాం. కానీ అది కేవలం పూజా కార్యక్రమం అంతా అయిన తరువాత ఆత్మప్రదక్షిణం చేస్తాం. ఆత్మ అంటే మనకి జీవాత్మ, పరమాత్మ అని రెండు ఉన్నాయి మనిషిలో అంటారు. మనలో ఉండే పరమాత్మని గుర్తించి ఆయనకి చేసే ప్రదక్షిణమే ఆత్మప్రదక్షిణం.ఇక్కడ మనలో ఉండే పరమాత్మని గుర్తించడం ఎలా? అంటే మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించడమే మనలోని మంచిని గుర్తించి ప్రశాంతతని పొందడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలి?
ఈ విషయం మీద ఖచ్చితమయిన నిశ్చయం అయితే లేదు కానీ మనకు తోచినదానిని బట్టి బేసి సంఖ్యలలో అనగా 3, 5, 9,11 ఇలా చేయాలి అంటారు. మరి కొంతమంది మొక్కుకుని  108 చేస్తారు అవి మాత్రం సరి సంఖ్యలో ఉన్నాయేమిటి అనే సందేహం కలుగవచ్చు. అప్పుడు మన ఉపనిషత్తుల సారాన్ని బయటకి తీసి పరిశీలించిన మీదట చెప్పిన విషయమేమిటంటే వైష్ణవాలయాలకి అథమపక్షం నాలుగు  ప్రదక్షిణలు, శైవాలయాలకి అథమపక్షం  మూడు చేయాలని చెప్పారు. ఇక్కడ మనం ఎన్ని చేశాము అనేదానికన్నా ఎంత భక్తితో చేశాము అనేది ముఖ్యం.

ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు స్పష్టం చేయాలి. ఏమిటంటే బ్రహ్మలేని గుడి గుడే కాదు అన్నారు. మనకి తెలిసి బ్రహ్మకి ఒక్క గుడి ఉంది కానీ అయన లేని గుడి అంటే ఏదీ గుడి కింద పరిగణలోనికి రాదు కదా!. ధ్వజస్తంభం బ్రహ్మ గారికి ప్రతీక. కావున ధ్వజస్తంభం ఉన్నవన్నీఆలయాలవుతాయి లేనివి కేవలం మందిరాలవుతాయి. ప్రదక్షిణ చేసే సమయములో దేవునితో పాటు ఈ ధ్వజస్తంభం కూడా మన వృత్తంలోనే ఉండాలి. వైష్ణవాలయాలలో ప్రదక్షిణం చేసేటప్పుడు ఆలయ ముందు భాగానికి దూరముగా వెనుక భాగానికి దగ్గరగా చేయాలి. ఎందుకంటే వైష్ణవాలయాలలో ఆలయ ముందు భాగమున రాక్షసులు, వెనుక భాగమున దేవతలు ఉంటారుట.  అలాగే శైవాలయాలలో ముందు భాగం వైపు దగ్గరగా, వెనుక భాగం వైపు దూరముగా ప్రదక్షిణలు చేయాలి ఇక్కడ వెనుకవైపు రాక్షసులు, ముందు వైపు దేవతలు ఉంటారుట. అందుకేనేమో మన ఆలయాలని ఆ విధముగానే నిర్మించారు.

ఈ ప్రదక్షిణలు మనం కేవలం గుడికీ, ఆత్మకే చేస్తామా? లేదు అగ్నికి చేస్తాం (వివాహసమయములో, హోమాల సమయములో), తల్లి తండ్రులకి చేస్తాం (వాళ్ళనే ఆది దంపతులుగా భావించి), రావిచెట్టు-వేప చెట్టు కలిసి ఉన్న చోట చేస్తాం, గోవుకి చేస్తాం (గోపూజ చేసిన తరువాత) ఇలా చెప్పుకుంటూ పోతే మంచి అన్న దానికి దేనికయినా మనం ప్రదక్షిణలు చేస్తాం తద్వారా మనలోని మంచిని పెంచుకుని ఆనందంగా, నిష్కల్మషంగా బ్రతకవచ్చు. అయితే ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు భక్తి తత్వముతో చేయాలి. మనలో ప్రదక్షిణలని ఎంత సమయములో చేశాము అని ఆలోచించేవాళ్ళు ఉన్నారు కానీ శ్రద్ధతో చేసే వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? భక్తి లేనప్పుడు లేదా ఆత్మ శుద్ధి లేనప్పుడు ఏది చేసినా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా వ్యర్ధమే.అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి, మనస్సుకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది.

9 comments:

శ్రీ said...

ప్రదక్షిణ వెనక ఇంత కథ ఉందా? ధ్వజ స్తంభం గురించి కొత్త విషయం తెలిసింది. Thanks.

Kaaya said...

బిందాస్ సినిమా లో ఎంత చక్కగా ఉండేది ఈ మీ ప్రొఫైల్ ఫొటో పిల్ల.. ఇప్పుడు ఆంటీ లా గా తయారైంది...

రసజ్ఞ said...

@శ్రీ గారు
చదివినందుకు మీకు కూడా ధన్యవాదములు.

రసజ్ఞ said...

@కాయ గారు
అవునండి షీన అందులో బాగుండేది. ఇప్పుడెలా ఉందో చూడలేదండి నేను.

Anonymous said...

రసజ్ఞ గారూ,
సృష్టిలో ఉన్న సమస్త విఙ్ఞానాన్నీ హిందూ జీవన విధానం తనలో ఇముడ్చుకుందని నేను భావిస్తాను. మానవుడి అత్యాశను దృష్టిలో ఉంచుకుని ఆ ఙ్ఞానాన్ని పరోక్షంగా ఆచారాలూ కట్టుబాట్ల రూపములో మనకి మన ఋషులు (ఆనాటి శాస్త్రవేత్తలు) అందించారు ఆ విఙ్ఞాన ఫలాలను మాత్రం పొందేలా చేశారు. అందుకే కేవలము హిందూపురాణాలే చదువుకున్నా నేటి అనేకానేక ఆధునిక పరిశోధనలు సైతం అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం హిందువుల సొంతం. 'విమానం' అనే భావన రామాయణ కాలమునాటికే ఉంటే, IVFకి సంబంధించి కౌరవులంతా అలా పుట్టినవారే! అందుకే మన ఆచార వ్యవహారాలు మనం పదిలపరుచుకుని ఆచరిస్తే ఈ సృష్టిలోని సమస్త విఙ్ఞాన ఫలాలనూ ఏమాత్రం ప్రయాస లేకుండానే అనుభవించేయొచ్చు.

రసజ్ఞ said...

@అచంగ గారు
చాలా చక్కగా చెప్పారండి. నిజమే మనం ఇప్పుడు కొత్తగా కనిపెట్టి నేర్చుకుంటున్నవన్నీ కూడా ఆ కాలంలో వాళ్ళందరూ ఎప్పుడో పాటించారు. ఇప్పుడు మనకి కష్టతరమయిన శస్త్ర చికిత్సలని ఎన్నిటినో ఆ కాలంలోని అశ్వని దేవతలు చేసారని కూడా ఉంది. ఇవన్నీ కూడా మన వేదాలలో ఎప్పుడో పొందుపరిచారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మందికి ఎందుకు చేస్తున్నామో దాని వెనుక ఉన్న కారణాలేమిటో తెలియక మూఢాచారాల కింద కొట్టి పడేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కొంచెమన్నా వాటి వెనుక ఉన్న కారణాలు తెలిస్తే బాగుంటుందన్న చిన్న ప్రయత్నమే ఇది. మన సంస్కృతిని కాపాడుకోవచ్చు.

Anonymous said...

ఆత్మప్రదక్షిణలు చేస్తూ, ప్రదక్షిణలు చేస్తే దేవుడి కరుణాకటాక్స వీక్షణాలు శరీరమంతా పడతాయి, ఏమంటారు. ప్రయత్నించి చేసి చెప్పండి. :)

రసజ్ఞ said...

@Anonymous gaaru
మీరు నిజంగానే అన్నారో లేక సరదాకే అన్నారో తెలియదు కానీ అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు.కానీ ఇక్కడ శరీరమంతా పడతాయన్న ఉద్దేశ్యం మాత్రం కాదు నాలో ఉన్నది ఇక్కడ (అనగా గుడిలో ఉన్న విగ్రహంలో) ఉన్నది ఒకటే అని చెప్పడానికి.

రసజ్ఞ said...

@Mohan
hahahahaha thanks