పాఠకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. చాతుర్మాస్యాలు కూడా ఈ రోజునుంచే మొదలవడం చేత చాతుర్మాస్య తొలి ఏకాదశి అని నామకరణం చేయడం జరిగినది. తొలి ఏకాదశి పేరుని బట్టి గమనిస్తే మొదటి ఏకాదశి. కానీ కొంచెం ఆలోచించి చూస్తే ఏ రకముగా తొలి లేదా మొదటిది అయ్యింది అనే సందేహం కలగవచ్చు. పూర్వ కాలములో ఈ రోజునే సంవత్సరాది లేదా ఉగాది చేసుకునేవారుట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని కొందరు చెప్తే దక్షిణాయణానికి మొదలు కనుక తొలి అని మరికొందరి అభిప్రాయం.ఏకాదశి అంటే పదకొండు అని అర్ధం. ఏమిటా పదకొండు? అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. అసలు దానికీ దీనికి పొంతనేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇదిగో అక్కడికే వస్తున్నాను. భక్తి తత్వానికి మారుపేరయిన మన భారత దేశంలో ఇదొక పర్వదినం. వీటన్నిటినీ (అంటే ముందు చెప్పిన పదకొండునీ) మన అధీనంలోనికి తీసుకుని వచ్చి అప్పుడు ఐక్యం చేసి దేవునికి నివేదించాలి. దీనివలన మనకి మామూలుగా అలవడే బద్ధకం, రోగములని ఆకర్షించే శక్తి తగ్గి, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందనీ జనుల నమ్మకం. ఇక్కడ అది ఈ నెలలోనే చేయడం వెనుక ఉన్న పరమార్ధం తెలియాలి.
ఆషాఢ మాసంలో వచ్చే ఈ మొదటి (శుద్ధ) ఏకాదశినే తొలి ఏకాదశనీ, ఈ రోజున విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్తాడు కనుక శయన ఏకాదశనీ అనడం జరిగింది. నిజముగా దేవుడు నిద్ర పోతాడా? విష్ణువు అంటే సూర్యుడు అని ఒక అర్ధం ఉంది. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా తిరిగే సూర్యుడు ఈ రోజు మొదలుకుని దక్షిణ దిక్కుకు వాలినట్టు కనిపించడం వలన ఈ రోజు మొదలుకుని దక్షిణాయణం అని దానినే మామూలు పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. అయితే మనకి ఎక్కువగా పండగలన్నీ ఈ దక్షిణాయణంలోనే వస్తాయి. మరి దేవుడే నిద్రపోతుంటే పూజలు ఎవరికి చేయాలి? ఉపవాసాలు ఎవరికి చేయాలి ఎందుకు చేయాలి? అని మామూలు జనాలు అడగవచ్చు. ఈయన నిద్రపోయే రోజులలో కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యాలు అంటారు. ఈ నెలలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జడత్వం సంతరించుకోవడం వలన, అనేకములయిన రోగములు చుట్టుముడతాయి. "లంఖణం పరమౌషధం" అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఉపవాసం వల్ల జీర్ణ కోశములు పరిశుద్ధమౌతాయి.దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. మనస్సునీ, శరీరాన్నీ పరిశుద్ధం చేస్తుంది. వాటిని నివారించడం కోసమే ఉపవాసాలు, పూజలు ఏర్పాటు చేశారు.ఇవే కాక కష్ట పరిస్థితులలోను, భయంకరమయిన రోగాలు వచ్చినప్పుడు, చరమాంకంలోను వచ్చే విపరీతమయిన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పాటు చేయడం జరిగింది.
పురాణ పరముగా చూస్తే:
- మహా సాధ్వి అయిన సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణంలో చెప్పబడింది. అందువల్లనే, ఆ రోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.
- భావిష్య పురాణం ప్రకారం తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, సంకల్పంతో తన శరీరము నుండి ఒక కన్యకను జనింపజేసినట్లు ఆమెనే "ఏకాదశి" అనీ, ఆమె మూడు వరాలు...
1. సదా మీకు ప్రియముగా ఉండాలి.
2. అన్ని తిధులలోను ప్రముఖంగా ఉండి అందరిచే పూజింపబడాలి.
3. నా తిధి యందు భక్తితో పూజించి ఉపవాసము చేసిన వారికి మోక్షము లభించాలి. కోరినట్లు ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. - "విష్ణువు వరం వలన అన్నంలో దాగిన పాప పురుషుడే గాక, బ్రహ్మ పాలభాగము నుంచి క్రిందబడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసమునకు చోటీయమని అడిగినప్పుడు, బ్రహ్మ ఏకాదశినాడు భుజించు వారి అన్నములో నివసించమని వరమీయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి ఉంటారు గనుక ఉదరములో చేరి క్రిములుగా మారి అనారోగ్యం కలుగుతుందన్న హెచ్చరిక" మన పురాణాలు పరోక్షంగా వెల్లడిస్తున్నాయి. అందువలన ముఖ్యంగా ఉపవసించాలని చెప్పబడింది.
ఋక్మాంగద మహారాజుగారి తోటలో నందనవనాన్ని మించిన ఉద్యానవనం ఉందని నారదుడు ఇంద్రునితో చెప్పగా చూసి రమ్మని అప్సరసలని పంపిస్తాడు ఇంద్రుడు. వాళ్ళు రాత్రి పూట ఆకాశ మార్గమున భూలోకములో ఉన్న ఈ తోటలోనికి వచ్చి మొత్తం పూలన్నిటినీ కోసుకెళ్లిపోతారు. మరునాడు పూజకి పూవులు లేకపోవడం వలన ఆరా తీయగా కాపలా భటులు ఎవ్వరూ చూడలేదని చెప్తారు. అప్పుడు కాపలా వాళ్ళని ఎక్కువమందిని పెట్టినా మరునాడు కూడా అదే పరిస్థితి. ఇలా మూడు రోజులు వరుసగా జరగడంతో చర్చ మొదలవుతుంది. భటులంతా కంటి మీద కునుకు లేకుండా చీమని కూడా లోనికి పోనీయకుండా జాగ్రత్త పడినా ఇలా జరుగుతోందంటే ఆకాశ మార్గమున ఎవరో దొంగిలిస్తున్నారని చెప్పడంతో రాజు గారు తోట మొత్తం దేవుని నిర్మాల్యం (పూజకి దేవుని మీద పెట్టి తీసేసిన పూలు, పత్రి మొదలయినవి) చల్లిస్తారు. మరుసటి రోజు ఉదయానికల్లా అప్సరసలు అలా తోటలో నిల్చుని కనిపిస్తారు. పాదములకి దేవుని నిర్మాల్యం తగలడం చేత దైవత్వాన్ని, తిరిగి ఆకాశ మార్గమున ఎగిరిపోయే శక్తిని కోల్పోతారు. అప్పుడు రాజు గారు మంత్రి సలహా మేరకు ఆ రోజు ద్వాదశి కావడం చేత నిన్న అనగా ఏకాదశి నాడు ఎవరయితే భోజనం చేయకుండా, రాత్రి నిద్రపోకుండా ఉన్నారో వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ ఫలితాన్ని వీళ్ళకి ధారపోస్తే తిరిగి అమరత్వం పొందుతారని కావున అలా భోజనం, నిద్ర లేని వాళ్ళని తీసుకుని రమ్మని ఆజ్ఞాపిస్తారు. భటులు నగరమంతా గాలించగా ఒక పూరి గుడిసెలో ఉన్న ముసలి అవ్వ కనిపిస్తుంది. భోజనం చేసావా అంటే నా కోడలు పెట్టలేదని, భోజనం లేకపోవడం వలన రాత్రి నిద్ర పట్టలేదని చెప్పగా ఆ అవ్వను రాజు వద్దకు తీసుకెళతారు. అప్పుడు ఆ అవ్వ తన ఫలంలోని కొంతభాగాన్ని ఆ ముగ్గురికీ ధారపొయ్యగా, అప్సరసలు తిరిగి ఇంద్రుని వద్దకు వెళతారు.
ఇదంతా గమనించిన రాజు గారు తెలియకుండా చేసినా ఉపవాసానికి, జాగరణకే ఇంత ఫలితం ఉంటే తెలిసి, భక్తి ప్రపత్తులతో చేస్తే ఇంకెంత ఫలితం ఉంటుందా అని ఈ ఏకాదశి వ్రతం గురించి ఆరా తీసి, దాని గురించి మొత్తం తెలుసుకుని తన రాజ్యంలో అందరూ ఇది ఆచరించి తీరవలసినదని ఆజ్ఞాపిస్తాడు. అప్పటినుండీ ప్రతీ ఏకాదశికీ రాత్రి పూట నాటకాలు, కథా కాలక్షేపాలు చేయించేవారు. దానితో అందరూ మోక్షాన్ని పొంది ఎవ్వరు నరకానికి వెళ్ళడం లేదు. దానితో యమధర్మరాజు తన మొరని శ్రీ మహా విష్ణువుకి విన్నవించుకోగా, ఆయన మోహినీ అవతారమెత్తి రాజు గారిని మోహించారు. దానితో రాజు గారు పెళ్లి చేసుకుందాము అని అనుకోగా మోహిని దేవి ఆయనని ఒక కోరిక నాకు నచ్చినప్పుడు అడుగుతా కాదనకూడదు ఈ షరత్తుకి సిద్ధమయితే పెళ్లి చెసుకుంటాననగా ఒప్పుకుని పెళ్లి చేసుకుంటారు. కొన్ని సంవత్సరాలకి వారిద్దరికీ ఒక బాబు పుడతాడు. ఆ బాబుని రాజుగారు ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు. అప్పుడు ఒకసారి వచ్చిన ఏకాదశి నాడు మోహిని దేవి ఆ బాబుని శివునికి బలి ఇవ్వవలసినదిగా కోరుతుంది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఆయన బాబుని చంపబోగా, ఆ ఖడ్గమే పూల మాలయి బాబు మెడలో పడుతుంది. అప్పుడు మెచ్చిన మోహిని దేవి రూపములో ఉన్న శ్రీ మహావిష్ణువు జరిగిన వృత్తాంతాన్నంతా వివరించి, ఇకనించి ఏకాదశి ఉపవాసం ఉండి, జాగరణ చేసినా కానీ ద్వాదశి నాడు మోహిని దేవికి పూజ చేసి, మోహిని దేవి ఒత్తులను వెలిగించి, ఈ కథని తలచుకుని, కథ అక్షింతలని వేసుకోకపోతే ఆ పుణ్యమంతా మోహిని దేవికి వెళిపోతుంది అని చెప్పారు. ఇది తెలియని వాళ్ళు, తెలిసినా మర్చిపోవడం వలనో ఆచరించని వాళ్ళ వలన యమధర్మరాజుకి కుడా కొంత ఉపశమనం కలిగింది. కనుక ఇకనించి మోహిని దేవిని తలచుకోవడం మరువకండి. ఈ వ్రతం చేసుకున్నవారికి సూర్య చంద్ర గ్రహణములలో భూరి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు వివరిస్తున్నాయి .
అలాగే ఈ నెల బహుళంలో వచ్చే ఏకాదశిని పాపనాశిని ఏకాదశి అంటారు. ఆరోజు విష్ణువును పూజించి ఏకాదశివ్రతం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మిక.శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి, లలితైకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే మంచిదని ప్రతీతి. ఇక బహుళంలో వచ్చేది కామిక ఏకాదశి. ఈరోజున వెన్న దానం చేయాలంటారు. భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశిఘడియల్లో హరిని పూజిస్తే కరవుకాటకాలు తొలగిపోతాయని పద్మపురాణంలో ఉంది. విశ్వామిత్రుడికి మాటిచ్చి రాజ్యాన్నీ భార్యాబిడ్డలనూ కోల్పోయిన హరిశ్చంద్రుడు భాద్రపద బహుళ ఏకాదశి(దీన్నే అజ ఏకాదశి అంటారు)నాడు వ్రతం ఆచరించి అన్నిటినీ పొందగలిగాడని పురాణప్రవచనం.ముక్కోటి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి, బహుళంలోది ఉత్పత్తి ఏకాదశి. తొలిఏకాదశినాడు శయనించిన విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి మేలుకునే రోజు కాబట్టి ఈ రోజును ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు భక్తులు.
ఈ చాతుర్మాస్యాలలో ముఖ్యముగా ఆచరించేవి చాతుర్మాస్య వ్రతం మరియు గోపద్మ వ్రతం. చాతుర్మాస్య వ్రతములో మొదటి నెల కాయగూరలు, రెండవ నెల పెరుగు, మూడవ నెల పాలు, నాల్గవ నెల పప్పు ధాన్యాలు తినకూడదు, మొత్తం నాలుగు నెలలో వచ్చే అన్ని ఏకాదశులు ఉపవాసం చేసి జాగరణ చేయడం వలన మోక్షం లభిస్తుందని నమ్మకం. ముఖ్యముగా ఈ వ్రతాన్ని అన్ని బంధాల నించి విముక్తి కోరుకునే వాళ్ళు చేస్తారు. ఈ నాలుగు నెలలూ ప్రయాణాలు చేయరు, కామ క్రోధాలకు దూరంగా ఉంటారు. గోపద్మ వ్రతమును ఆచరించని మహిళలని యముడు శిక్షిస్తాడని పద్మ పురాణం మనకి తెలియచేస్తోంది. తొలి ఏకాదశి నాడు మొదలుపెట్టి పశువుల కొష్టాలను శుభ్రం చేసి, గోపేడతో అలికి బియ్యపుపిండితో ముప్ఫైమూడు పద్మాలను తీర్చిదిద్ది గంధముతోను, పుష్పములతోను శ్రీహరిని పూజించి ప్రదక్షిణలను చేయాలి. ముప్ఫై మూడు అప్పాలను చేసి వేద పండితులకి దానమివ్వాలి. గోమాతను కూడా శ్రీ మహావిష్ణువుని పూజించిన విధముగానే పూజించాలి. ఈ వ్రత విధానాన్నంతా గమనిస్తే పరిశుభ్రతకి ప్రాధాన్యం ఇచ్చినట్టు అనిపిస్తుంది. నిజమే మరి! ఈ మాసంలోనే పశువుల పాకల వద్ద మురికి ఎక్కువగా చేరే ప్రమాదం ఉంది. మురికి వలన అటు పశువులకి, ఇటు మనకి కూడా రోగాల బాధ పెరుగుతుంది.వీటన్నిటిని బట్టి ఆలోచించి చూస్తే మన సంస్కృతి, సాంప్రదాయం, ఆచారం, అన్నిటిలోనూ మనిషి మనుగడకి కావలసినవే ఎక్కువగా కనిపిస్తాయి.
13 comments:
poojalu,punaskaaraalu,nomulu ..ok
చాలా అందమైన, ముఖ్యమైన విషయాలని చెప్పారు రసజ్ఞ గారు. మన సంస్కృతిలో మన జీవన విధానంలో ఆచరించే వ్రత విధానాల వెనక ఉన్న శాస్త్రీయ దృక్పధాన్ని చక్కగా, అందరికీ అర్ధమయ్యేట్టు ఆవిష్కరించారు. మీరు ఇదంతా వివరిస్తుంటే.. కళ్ళ ముందు మొత్తం వ్రత విధానం, నాలుగు నెలల కాలం అలా గిరగిరా తిరిగింది. ఋక్మాంగద వృత్తాంతం నాకు ఇంతకు ముందు తెలీదు. ఇప్పుడే వింటున్నాను. చాతుర్మాస్య వ్రతం చేస్తారని తెలుసు కానీ.. ఈ రాజు గారి వృత్తాంతం ఒకటుందని తెలీదు. చాలా బాగా చెప్పారండి.
@శాండిల్య గారు
మీ స్పందనకి ధన్యవాదములు. మరింకే ఇప్పుడు తెలిసిందిగా ఇకనించి ఏకాదశి ఉపవాసం, జాగరణ చేసినప్పుడు మోహిని దేవిని ద్వాదశి నాడు తలుచుకోవడం మరువకండి లేకపోతే మీ పుణ్యమంతా ఆవిడ తీసేసుకుంటుంది మరి!
@rasagna...........
meeru naa spandanaki danyavaadhaalu cheppadam marchipoyaru.hahhhahahha
@నంద గారు,
మీ స్పందనకి ఎలా ప్రతిస్పందించాలో అర్ధం కాక చెప్పలేదు.
అర్బుతంగా రాసారు. తెలియనివి చాలా ఉన్నాయి. ఈ కథ ఎపుడూ వినలేదండీ. మీకు ఇన్ని ఎలా తెలుస్తాయి?
Interesting! Never heard Rukmangada story and importance of ekadashi. Seriously, Do you follow all these things in these days.
@ మొదటి అజ్ఞాత గారూ
చిన్నపుడు విన్నానండీ ఈ కథ. అప్పటినుండీ ప్రతీ ద్వాదశి నాడూ ఈ కథ అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
@ రెండవ అజ్ఞాత గారూ
ఇప్పుడు తెలిసింది కదండీ మీకు కూడా! నిజంగానే నేను ఇవన్నీ పాటిస్తానండీ. మీ స్పందనకు ధన్యవాదాలు!
రసజ్ఞ గారు, ఈ వ్రతంలో కంచం/విస్తరి కాక రాతిపలక/నేలపై భొజనము చేస్తారనుకుంటా, అవునా?
@ SNKR గారూ
మీ మొదటి వ్యాఖ్యను ఎందుకు తీసేసారో అర్థం కాలేదు! శివుడు, విష్ణువు వేరు వేరు అనుకుని పూజ చేసిన వారి పూజలకి విలువ లేదు అంటారు. ఏ మాసమయినా ఇద్దరూ ఒకటే అనుకుని పూజించాలి. ఇహ మీరడిగిన ఈ విషయం అలాంటి నిబంధన నాకు తెలిసి లేదు. కొంతమంది మొక్కుకుంటారు అటువంటివారు మాత్రమే అలా తినటం తెలుసు. కానీ ఈ నాలుగు నెలలూ వ్రతం ఆచరించేవారు నేల మీద పడుకుంటారు. ధన్యవాదాలండీ!
రసజ్ఞ గారూ,
ఏకాదశి విశిష్టత ని ఎంతో వివరంగా, ఇంకా ఎంతో ఆసక్తి గా చెప్పారు. ఏదో పండగ అని జరుపుకోవటమే తప్ప దీని వెనక ఇంత విశిష్టత ఉందనీ, ఇంత ప్రాముఖ్యమైన పండగనీ ఇప్పుడే తెలిసింది. ఇక నుంచీ ప్రతి ఏకాదశి నాడూ ఈ పండుగ వెనుక వివరంగా చెప్పిన విశిష్టతే కాదు, మీరూ మాకు గుర్తొస్తారు.
ఇలా ఎన్నో మన సాంప్రదాయాలనీ, అలవాట్లనీ పరిచయం చేస్తున్న మీకు అభినందనలు! తెలుగు, సంస్కృత భాషలపైన మీకున్న పట్టు కూడా ప్రతి పోస్ట్ లోనూ కనిపిస్తుంది.
@ చిన్ని ఆశ గారూ
ప్రతీ పండగకీ ఏదో ఒక విశిష్టత తప్పక ఉంటుంది కదండీ, అది తెలుసుకుని చేసుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. మీ అభినందనలకి అభివాదాలు!
I really like your blog.. very nice colors & theme.
Did you make this website yourself or did you hire someone to do it for you?
Plz reply as I'm looking to construct my own blog
and would like to know where u got this from. thank you
Feel free to surf to my web blog; dating online (http://bestdatingsitesnow.com)
Post a Comment