Friday, March 28, 2014

"మన్వ" చరిత్ర


శీర్షిక చూసి అచ్చు తప్పు అని మాత్రం అనుకోకండి, నేను ఇక్కడ వ్రాయదలుచుకున్నది మన్వంతరాల గురించి కనుక ఏదో అలా కలిసొస్తుందని పెట్టాను అంతే. వేరే దేశంలో వున్నవాళ్ళని తప్పకుండా అడిగే ప్రశ్నలు - మీకు టైం ఎంత?, అక్కడ ఉష్ణోగ్రత ఎంత? అని. ఆలోచిస్తే చాలా విచిత్రంగా, కొంచెం అర్థమయినట్టు, అస్సలేమీ అర్థం కానట్టు అనిపిస్తుంది నాకయితే. కాల చక్రానికి, జీవుల ఉనికికి, ఉష్ణోగ్రతకి వున్న సంబంధాన్ని వెతుకుతూ నా పరిధి మేరకు ఆలోచించి వ్రాస్తున్న టపా. తప్పులుంటే సరిదిద్ది, కాస్త ఓపిక చేసుకుని చదవండి. 


ముందుగా మన కాల ప్రమాణాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
2 పరమాణువులు = 1 అణువు
3 అణువులు = 1 త్రెస రేణువు
3 త్రెస రేణువులు దాటడానికి సూర్యునికి పట్టే కాలాన్ని 1 తృటి అంటారు
100 తృటులు = 1 వేధ
3 వేధలు = 1 లవం
3 లవాలు = 1 నిమేషం (మన సెకనులో 16/75వ భాగం)
3 నిమేషాలు = 1 క్షణం
5 క్షణాలు = 1 కాష్ట
15 కాష్టలు = 1 లఘువు
15 లఘువులు = 1 నాడి లేదా 1 ఘడియ
2 నాడులు = 1 ముహూర్తం
7 నాడులు = 1 యామం; 7 1/2 ఘడియలు = 1 ఝాము
8 ఝాములు లేదా 8 యామాలు = 1 రోజు
15 రోజులు = 1 పక్షం
2 పక్షాలు = 1 మాసం లేదా నెల; 40 రోజులు = 1 మండలం 
2 నెలలు = 1 ఋతువు
3 ఋతువులు = 1 ఆయనం
2 ఆయనాలు = 1 మానవ సంవత్సరం
30 మానవ సంవత్సరాలు = 1 నెల (దేవతలకు) - అనగా మన కాల ప్రమాణము కన్నా దేవతల కాల ప్రమాణము 360 రెట్లు ఎక్కువ.
43,20,000 మానవ సంవత్సరాలు = 1 మహా యుగం (1 కృత లేదా సత్య యుగము + 1 త్రేతా యుగము + 1 ద్వాపర యుగము + 1 కలి యుగము = 17,28,000 + 12,96,000 + 8,64,000 + 4,32,000 మానవ సంవత్సరాలు)
71 మహా యుగాలు = 1 మన్వంతర కాలం = ప్రజాపతి ఆయుర్దాయం
14 మన్వంతరాలు = 1 కల్పం 
30 కల్పాలు = 1 మహాకల్పం 

శ్రీ స్కాంద పురాణం ప్రకారంగా ఆ 30 కల్పాలూ - శ్వేత వరాహ, నీలలోహిత, వామదేవ, రత్నాంతర, రౌరవ, ప్రాణ, బృహత్, కందర్ప, సద్యత, ఈశాన, ధ్యాన, సారస్వత, ఉదాన, గరుడ, కౌర్మ, నారసింహ, సమాధి, ఆగ్నేయ, విష్ణుజ, సౌర, సోమ, భావన, సుపుమ, వైకుంఠ, అర్సిస, వలి, వైరజ, గౌరీ, మహేశ్వర మరియు పితృ. 



వీటినే మరికాస్త వివరంగా ఈ చిత్రంలో పొందుపరిచాను. అయితే, ఇందులో క్రొత్తగా చేర్చినది సంధి కాలము. ప్రతీ యుగ కాలానికీ ముందు, వెనుక వుండే కాలాన్నే సంధి కాలం అంటారు. యుగ కాల మొత్తం = యుగ కాలం + యుగానికి ముందు వచ్చే సంధికాలం + యుగానికి తరువాత వచ్చే సంధి కాలం. ఉదా: మానవ కలియుగం తీసుకుందాం 
కలియుగ కాల మొత్తం = కలియుగ కాలం + 2 (కలి యుగ సంధి కాలం)
                          = 3,60,000 + 2 (36,000) = 4,32,000

ఒక యుగం నుండీ మరొక యుగానికి కాల మొత్తాన్నీ, ఆయుర్దాయాన్నీ గమనిస్తే వాటి నిష్పత్తులు ఈ విధంగా వున్నాయి కృత:త్రేతా:ద్వాపర:కలి = 4:3:2:1 కనుక దీనినే నేను 1 మహా యుగం = 10 కలియుగాలు అని అంటాను. ఎందువలననగా, 1 మహాయుగం = కృత యుగం (4 x కలియుగం) + త్రేతా యుగం (3 x కలియుగం) + ద్వాపర యుగం (2 x కలియుగం) + కలియుగం = కలియుగం x (4+3+2+1). అలాగే ప్రతీ మన్వంతరానికీ అటు, ఇటు కూడా సంధి కాలాలు వుంటాయి. 1 మన్వంతర సంధి కాలం 1 కృత యుగ కాలంతో సమానం కనుక 1మన్వంతర సంధి కాలం = 4 కలియుగాలు. 

బ్రహ్మగారి ఆయుర్దాయము వంద సంవత్సరాలు కాగా, ప్రతీ నెలకీ ఒక మహాకల్ప కాలం గడుస్తుంది. మొదటి కల్ప కాలం బ్రహ్మకి పగలు, దానినే సర్గము అంటారు. రెండవ కల్ప కాలం బ్రహ్మకి రాత్రి, దానినే ప్రళయం అంటారు. మళ్ళీ మూడవ కల్ప కాలం సర్గ, నాల్గవ కల్ప కాలం ప్రళయం అవుతాయనమాట! ఈ విధంగా చూసుకుంటే ఇదొక నిరంతర చక్రం. సర్గ కాలంలో సృష్టి జరిగితే ప్రళయ కాలంలో సృష్టంతా నశిస్తుంది.  ప్రళయ కాలంలో సృష్టి ఎలా నశిస్తుంది అంటే: 

చతుర్విధాని భూతాని సమయాంతి పరిక్షయం
తదా తప్త శిఖాకారై రూపేతో ఘర్మ దీధితిః
మయూఖై రగ్ని సదృశైః వమద్భిః పావకచ్ఛటాః
తతో విధాతుర్గాత్రేభ్యః సముత్పన్నా మహాఘనాః 

అనగా పంచ భూతాలలో నాలుగు (ఆకాశం, గాలి, నీరు, భూమి) నశించిపోగా, అయిదవదయిన అగ్ని మాత్రం విజృంభిస్తుంది. ఈ అగ్ని జ్వాలలకే గ్రామాలు, అడవులు, కొండలు, అన్నీ మాడి మసి అయిపోతాయి. కాల్చిన ఇనుప గుండు లాగా భూగోళం మారిపోతుంది. ఆ విధంగా సృష్టంతా నశించిపోతుంది. ఆ తరువాత మళ్ళీ కల్ప కాలం సర్గతో మొదలవుతుంది, మళ్ళీ సృష్టి మన్వంతరాలతో మొదలవుతుంది. మన్వంతర కాలాన్ని పరిపాలించే ప్రభువే మనువు. మనకు 14 మన్వంతరాలు కనుక 14 మనువులున్నారు. వారు  

1) స్వాయంభువుడు - స్వాయంభువ మన్వంతరం      2) స్వారోచిషుడు - స్వారోచిష మన్వంతరం 
3) ఉత్తముడు - ఉత్తమ మన్వంతరం                     4) తామసుడు - తామస మన్వంతరం
5) రైవతుడు - రైవత మన్వంతరం                        6) చాక్షుషుడు - చాక్షుష మన్వంతరం 
7) వైవస్వతుడు - వైవస్వత మన్వంతరం                8) సూర్య సావర్ణి - సూర్య సావర్ణ మన్వంతరం
9) దక్ష సావర్ణి - దక్ష సావర్ణ మన్వంతరం                10) బ్రహ్మ సావర్ణి - బ్రహ్మ సావర్ణ మన్వంతరం
11) ధర్మ సావర్ణి - ధర్మ సావర్ణ మన్వంతరం             12) రుద్ర సావర్ణి - రుద్ర సావర్ణ మన్వంతరం             
13) దేవ సావర్ణి - దేవ సావర్ణ మన్వంతరం              14) చంద్ర సావర్ణి - చంద్ర లేదా భౌమ్య సావర్ణ మన్వంతరం
    
మన్వంతరాల గురించి మనకు తెలిసిన విషయాలనన్నిటినీ క్రూడీకరించి చూస్తే సృష్టి పరిణామ క్రమం తెలుస్తుంది. సరిగ్గా ఈ విషయాన్నే వివరిస్తూ IAS అధికారి అయినటువంటి డా.సుఖ్ లాల్ ధని గారు ఒక వ్యాసాన్ని వ్రాశారు. ఆ వ్యాసంలోని ముఖ్యమయిన అంశాలను మనకు తెలిసిన అంశాలతో పోలుస్తూ, నా ఆలోచనలను యిక్కడ వ్రాస్తున్నాను.  

1) స్వాయంభువ మన్వంతరం (ప్రస్తుత కాలానికి 1973-1665 మిలియన్ సంవత్సరాల క్రితం) - Matter evolved into solar system: 
గ్రహాలూ, నక్షత్రాలూ, ఏమీ లేకుండా కేవలం శూన్యం మాత్రమే నిండి వున్న సమయంలో అనుకోకుండా ఎక్కడనుండో ఘర్.. ఘర్.. అనే శబ్దం వచ్చి, దాని నుండీ సృష్టి చక్రం మొదలయ్యింది. చీకటి నుండీ ఒక చిన్న మెరుపు (nebula), ఆ మెరుపు నుండీ క్రమంగా పరిణామ చక్రం మొదలయ్యాయి. ఇవన్నీ వాటంతట అవే, వేరేవాటి ప్రమేయం లేకుండా జరిగిపోయాయి కనుకనే ఈ సమయానికి స్వాయంభువు అనే పేరు కలిసింది. స్వయంభువు అనగా తనంతట తానుగా అని అర్థం కదా! అయితే దీనినే ఆధ్యాత్మికంగా చూస్తే, ప్రణవమయిన "ఓం" అనే శబ్దం నుండీ సృష్టి చక్రం మొదలయ్యింది. అలాగే నిరాకారమయిన జ్యోతి నుండే పరిణామ చక్రం కూడా మొదలయ్యింది. మన పురాణాల (శ్రీ బ్రహ్మ వైవర్త పురాణం) ప్రకారం బ్రహ్మ ముఖము నుండీ స్వాయంభువ మనువు ఉద్భవించాడు. బ్రహ్మ- జ్యోతి స్వరూపుడు కనుక, ఆయన నుండీ వచ్చిన స్వాయంభువ మనువుని పరిణామ చక్రానికి మూలాధార పురుషునిగా పరిగణించి ఉండవచ్చును అని నా అనుకోలు.  

2) స్వారోచిష మన్వంతరం (ప్రస్తుత కాలానికి 1665-1356 మిలియన్ సంవత్సరాల క్రితం) - Sun assumes self-shining quality: 
మొదట చిన్నగా ఆవిర్భవించిన మెరుపు కొంతకాలానికి బాగా వేడెక్కి, మండే గోళంలా మారింది. అనగా చిన్నగా వున్న మెరుపు ఒక స్వయం ప్రకాశిత గోళంలా మారింది కనుకనే ఈ సమయానికి స్వారోచిషము అన్న పేరు సరిపోయింది. స్వారోచిషము అనగా స్వయం ప్రకాశితం అని అర్థం కదా! ఇదే సమయములో, మెరుపు వేర్వేరు స్వయం ప్రకాశిత గోళాలుగా కూడా విభజన చెందింది. శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం ప్రకారం స్వారోచిష మనువు అగ్నిదేవుని పుత్రుడు. కానీ శ్రీ దేవీ భాగవతం పరంగా చూస్తే, స్వారోచిష మనువు స్వాయంభువ మనువు యొక్క మనవడు  (స్వాయంభువుని పుత్రుడైన ప్రియవ్రతుని కుమారుడు). ఇతను 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి అమితమయిన కాంతితో కూడిన దేవీ కృపను మరియు మన్వంతర రాజ్యాన్ని పొందాడు. ఇక్కడ మెరుపు గోళంలా మారి, అనేక గోళాలుగా విభజన చెందడం అనే విషయాన్నే వేరొక తరముగా (next generation) చూపించి వుండవచ్చును. 

3) ఉత్తమ మన్వంతరం (ప్రస్తుత కాలానికి 1356-1047 మిలియన్ సంవత్సరాల క్రితం) - Sun becomes golden yellow star: 
స్వయం ప్రకాశిత గోళంలా వున్న వెలుగు, ఒక నిర్దిష్టమయిన ఆకారాన్ని, పరిమాణాన్ని, ఉష్ణోగ్రతను చేరుకొని, సకల జీవకోటిని, సృష్టిని నిర్వహించగల సామర్ధ్యాన్ని సంపాదించుకుని సూర్యునిగా స్థిరపడింది. అనగా సూర్యుడు ఒక సంపూర్ణ నక్షత్రంగా మారి, అన్నిటికీ అధిపతి అయ్యాడు కనుకనే ఈ సమయానికి ఉత్తమ అనే పేరు బాగా నప్పింది. శ్రీ దేవీ భాగవతంలో  ప్రియవ్రతుని పుత్రుడే ఉత్తముడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు అని వుంది. ఇందాకా అన్వయించుకున్నట్టు తరువాతి తరం మార్పుని సూచిస్తే, ఒకే తరం వున్నదానిలోనే చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుని ఒక స్థానాన్ని పొందింది అనుకోవచ్చుననుకుంట. 

4) తామస మన్వంతరం (ప్రస్తుత కాలానికి 1047-738 మిలియన్ సంవత్సరాల క్రితం) - Era of darkness: 
స్వారోచిష సమయమప్పుడు ఏర్పడిన మిగతా స్వయం ప్రకాశిత గోళాలలో భూమి ఒకటి. అది కొంతకాలానికి ఘనీభవించి తన ప్రకాశాన్ని కోల్పోయింది. దానితో, సూర్యునికి భూమి ఎటువైపు వుంది అన్నదాన్ని బట్టీ పగలు, రాత్రీ ఏర్పడ్డాయి. ఈ సమయంలో జరిగిన ముఖ్యమయిన పరిణామాలు - భూమి ప్రకాశాన్ని కోల్పోవడం (వెలుగు లేకపోవడం),  రాత్రి ఏర్పడటం కనుక దీనికి తామసము అనే పేరు సరయినది. తామసి అనగా చీకటి అని అర్థం కదా! శ్రీ దేవీ భాగవతం ప్రకారంగా తామసుడు కూడా ప్రియవ్రతుని కుమారుడే. ఇందాకా చెప్పుకున్నట్టు ఇది కూడా అదే తరం కనుక ఒక సర్దుబాటుగా తన గుణాన్ని కోల్పోయి వుండవచ్చును.

5) రైవత మన్వంతరం (ప్రస్తుత కాలానికి 738-429 మిలియన్ సంవత్సరాల క్రితం) - Formations of mountains and oceans, etc.: 
కొన్ని మిలియన్ సంవత్సరాల పాటూ భూమి మీద వాన కుండపోతగా కురవటం వలన నదులు, సముద్రాలు, పర్వతాలు, ఏర్పడగా ఇంకా మిగిలిన నీరు మేఘాలుగా ఏర్పడింది. ఆ తరువాతనే భూమి మీద మొదటిసారిగా చలనం మొదలయ్యి, సుడిగాలులు, సుడిగుండాలు, కెరటాలు ఏర్పడ్డాయి. రైవతం అనగా కదలిక, చలనం అనే అర్థాలున్నాయి. శ్రీ దేవీ భాగవతంలో రైవతుడు తామసుని సోదరుడు, ఇతను సర్వ సిద్ధులు లభించే శక్తిని పొందాడు అని వున్నది. బహుశః ఆ శక్తికీ, ఈ చలనానికీ ఏమయినా పొంతన వుందేమో?

6) చాక్షుష మన్వంతరం (ప్రస్తుత కాలానికి 429-120 మిలియన్ సంవత్సరాల క్రితం) - Emergence of conspicuous life in abundance: 
ఈ సమయంలోనే మొదటిసారిగా గుర్తించదగిన సృష్టి జరిగినది. సముద్రంలోని నీరు ఆవిరయ్యి (దీనికి కావలసిన వేడి సూర్యుని ద్వారా లభిస్తుంది) మరలా భూమిని వాన రూపంలో చేరుకోవడం అనే నిరంతర ప్రక్రియ జరగడం వలన జీవం ఆవిర్భవించింది. ఈ జీవ ఆవిర్భవాన్ని కనుల రూపంలో సూచించారు, అనగా కనులున్న జీవులు (పశు పక్ష్యాదులు) ఆవిర్భవించాయి కనుక చాక్షుష అనే పేరు తగినది. చాక్షుష అనగా చక్షువులు (కనులు) కలిగినవి అని అర్థం కదా! ఈ మన్వంతర ప్రభువయిన చాక్షుషుని ఆవిర్భావం గురించి నాకు పెద్దగా తెలియదు కానీ ఈ మనువు ప్రస్తావన మత్స్య, కూర్మ, వరాహ పురాణాల్లో వస్తుంది. కనుక ఇక్కడ చెప్పుకున్నట్టు జీవుల ఆవిర్భవానికీ, చాక్షుషునికీ సంబంధం వుండవచ్చును. 

7) వైవస్వత మన్వంతరం (120 మిలియన్ సంవత్సరాల క్రితం నుండీ ప్రస్తుత కాలం ...) - Emergence of Man: 
కాల చక్రంలో మనం ప్రస్తుతం శ్వేత వరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో వున్నాము. ఆ ప్రకారంగా, ప్రస్తుత కల్పంలో ఎంత కాలం గడిచిందో చూద్దాం: 
గడచిన మన్వంతరాలు 6 కనుక 6 మన్వంతరాల కాలం = 6 x 71 మహాయుగాలు 
                                                                = 6 x 71 x 10 కలియుగాలు
                                                                = 4260 కలియుగాలు
గడచిన 6 మన్వంతరాలకీ 7 మన్వంతర సంధి కాలాలు = 7 x 4 కలియుగాలు
                                                               = 28 కలియుగాలు
గడచినవి 27 మహాయుగాలు కనుక 27 మహాయుగాలు = 27 x 10 కలియుగాలు
                                                                  = 270 కలియుగాలు
ప్రస్తుతం మనం కలియుగంలో వున్నాము అంటే, కృత, త్రేతా, ద్వాపర యుగాలు గడిచాయి అంటే (4+3+2)=9 కలియుగాల కాలం గడిచింది. అలానే ప్రస్తుతానికి (2014) కలియుగం మొదలయ్యి 5115 సంవత్సరాలు గడిచాయి. వీటి ఆధారంగా,
ప్రస్తుత (28వ) మహాయుగంలో గడచిన కాలం = 9 కలియుగాలు + 5115 సంవత్సరాలు 
                                        = 9 (4,32,000) + 5115 సంవత్సరాలు
                                        = 38,93,115 సంవత్సరాలు 
                                        = 3.9 మిలియన్ సంవత్సరాలు 
ఇహ, ప్రస్తుత కల్పంలో గడచిన కాలం = 6 మన్వంతరాల కాలం + 7 మన్వంతర సంధి కాలాలు + 27 మహాయుగాలు + ప్రస్తుత మహాయుగ కాలం
                                           = (4260 + 28 +  270) కలియుగాలు + 38,93,115 సంవత్సరాలు
                                           = 1972949115 సంవత్సరాలు = 1973 మిలియన్ సంవత్సరాలు లేదా 1.97 బిలియన్ సంవత్సరాలు. 
అనగా, ఈ శ్వేత వరాహ కల్పం మొదలయ్యి 1.97 బిలియన్ సంవత్సరాలు గడిచిందనమాట!

ఈ సమయంలోనే మొదటిసారిగా మానవుని ఆవిర్భావం జరిగినది. మన పురాణాల ప్రకారంగా మానవుని ఆవిర్భావం జరిగి నేటికి 120 మిలియన్ సంవత్సరాలు పూర్తయ్యింది కానీ మన శాస్త్రవేత్తలు 3.75-4 మిలియన్ సంవత్సరాల క్రితం మానవుని ఉనికి ఉన్నదని తెలుపుతున్నారు. కొంచెం శ్రద్ధగా గమనిస్తే, శాస్త్రవేత్తలు మానవుని ఉనికి తెలిపిన కాలానికి మనం లెక్కించిన ప్రస్తుత (28వ) మహాయుగ కాలం (3.9 మిలియన్ సంవత్సరాలు) దగ్గరగా వుంది. శ్రీ బ్రహ్మ పురాణం ప్రకారం, వైవస్వంతుడు అనగా సూర్యుడు అలాగే వైవస్వత మనువు సూర్యుని కుమారుడు. సూర్యుని ఆవిర్భావం తరువాతనే సకల ప్రాణుల ఆవిర్భావం కూడా జరిగి, ఆ తరువాతనే మానవుడి ఆవిర్భావం జరిగింది అన్నది అన్ని విధాలుగానూ ఆమోదించబడిన విషయం. భారత దేశంలో అటు చరిత్ర పరంగా చూసినా, ఇటు పురాణ పరంగా చూసినా కూడా సూర్య వంశ రాజులే ప్రప్రధమంగా మనల్ని పరిపాలించారు. 

ప్రస్తుత (28వ) మహాయుగం పూర్తి కావడానికి మిగిలి వున్న కాలం = 10 కలియుగాలు (మహాయుగ పూర్తి కాలం) - ప్రస్తుత మహాయుగంలో గడచిన కాలం = (10 x 4,32,000) - 38,93,115 సంవత్సరాలు = 4,26,885 సంవత్సరాలు.

అలాగే ప్రస్తుత మన్వంతరం పూర్తి కావడానికి మిగిలి వున్న కాలం = మొత్తం మన్వంతర కాలం - గడచిన మహాయుగాల కాలం = 71 మహాయుగాలు - 27.8 మహాయుగాలు = (71 x 10 కలియుగాలు) - (270 కలియుగాలు + 38,93,115 సంవత్సరాలు) = 306720000 - 120533115 సంవత్సరాలు
                                   = 186186885 సంవత్సరాలు = 186 మిలియన్ సంవత్సరాలు 

8-14) సావర్ణ మన్వంతరాలు: 
రాబోతున్న మన్వంతరాలన్నీ సావర్ణి అనే పేరుతోనే ముగుస్తాయి. సావర్ణి అనగా ఒకే రంగు కలిగినవి లేదా సమానమయిన (ఒకే విధమయిన) పదార్ధం కలిగినది అనుకోవచ్చును. 

సావర్ణ మన్వంతరాలు అన్నీ కలిపి 7 కనుక వాటి కాలాన్ని చూస్తే, 
7 సావర్ణ మన్వంతరాల కాలం = 7 x 71 మహాయుగాలు = 7 x 71 x 10 కలియుగాలు = 4970 కలియుగాలు
7 మన్వంతరాలకీ 8 మన్వంతర సంధి కాలాలు = 8 x 4 కలియుగాలు
                                                      = 32 కలియుగాలు
కనుక సావర్ణ మన్వంతరాల కాల మొత్తం = (4970 + 32) కలియుగాలు = 5002 x 4,32,000 సంవత్సరాలు = 2160864000 సంవత్సరాలు = 2161 మిలియన్ సంవత్సరాలు లేదా 2.16 బిలియన్ సంవత్సరాలు.
ఇక ఈ శ్వేత వరాహ కల్పంలో మిగిలి వున్న కాలం = సావర్ణ మన్వంతరాల కాలం + ప్రస్తుత మన్వంతరం పూర్తి కావడానికి మిగిలి వున్న కాలం = 2160864000 సంవత్సరాలు + 186186885 సంవత్సరాలు = 2347050885 సంవత్సరాలు = 2347 మిలియన్ సంవత్సరాలు లేదా 2.35 బిలియన్ సంవత్సరాలు. 

మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఈ కల్పాంతంలో సృష్టి నశిస్తుంది కనుక 2347 మిలియన్ సంవత్సరాల తరువాత సృష్టి నశించాలి. మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతీ మన్వంతరానికీ 309 మిలియన్ సంవత్సరాలు పట్టి, మార్పు కనిపిస్తోంది. ఆ మార్పే రాబోతున్న మన్వంతర కాలాలలో జీవుల జన్యువులలో మార్పు కలిగి చివరికి అంతరించిపోవచ్చును. పురాణాల ప్రకారం, ఆఖరున వచ్చే భౌమ్య సావర్ణి కూడా అదే సూచిస్తోంది. 


ఇంచుమించు 250 మిలియన్ సంవత్సరాల తరువాత అన్ని ఖండాలూ కలిసి ఏక ఖండంగా ఏర్పడతాయని ఒక అంచనా. అలాగే, సూర్యుని ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ వుండటం వలన 300 - 800 మిలియన్ సంవత్సరాల (దాదాపుగా 3 మన్వంతరాల సమయం) తరువాత భూగ్రహం మీద జీవుల ఉనికి ప్రశ్నార్థకం. సూర్యుని శీతోష్ణ స్థితి పెరిగితే ఆ ప్రభావం వలన కలిగే విచ్ఛేదము కూడా పెరిగి, బొగ్గుపులుసు వాయు (నాకు తెలిసినంత వరకూ COని తెలుగులో అలాగే అంటారు) స్థాయిలు తగ్గి మొక్కలు కిరణ జన్య సంయోగ క్రియను (photosynthesis) చేసుకోలేవు. ఇలాగే సూర్యుని ఉష్ణోగ్రత పెరుగుతూ కొన్ని బిలియన్ సంవత్సాలకి అదొక గరిష్ట స్థాయికి చేరుకొని, అన్ని గ్రహాలనూ (లేదా మనం మొదట్లో చెప్పుకున్నట్టు స్వయం ప్రకాశిత గోళాలనన్నిటినీ) తనలో ఐక్యం చేసుకుని, కుదించుకునిపోయి, చిన్న మెరుపులా మారి, ప్రకాశ శక్తిని కోల్పోయి చీకటి స్థితికి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే జీవులు అంతరించిపోయి, సముద్రాలు ఇంకిపోయి సృష్టి నశిస్తుంది. పురాణాల ప్రకారంగా ఈ సమయాన్నే ప్రళయ కాలం అని వుండవచ్చు.  



జైన మత గ్రంథాల ప్రకారం కొన్ని యుగాల సమూహం ఒక కల్పం. ప్రతీ యుగంలోనూ 12 అరములలో (వీటినే విభాగాలుగా పరిగణించవచ్చు) కాలచక్రం పైకి (6), క్రిందకి (6) కదులుతూ వుంటుంది. ఆ ప్రకారంగానే కాలచక్రం పైకి కదిలినప్పుడు ఆ యుగ భాగాన్ని ఉత్సర్పిణి అనీ, క్రిందకి కదిలినప్పుడు అపసర్పిణి అనీ అంటారు. యుగ ఆరంభంలోనూ మరియూ అంతంలోనూ వుండే భాగాన్ని దుషమ (దుఃఖానికి చిహ్నం) అనీ యుగ మధ్యలో వుండే భాగాన్ని సుషమ (ఆనందానికి చిహ్నం) అనీ అంటారు. అనగా ఒక యుగంలో చెడ్డవన్నీ మంచిగా మారి, ఆ మంచివన్నీ క్రమంగా అంతరిస్తూ చెడ్డగా మారిపోతాయి అనుకోవచ్చును. దీనినే మనం చెప్పుకున్న మన్వంతరాల కోణం నుండీ గమనిస్తే క్రమంగా సృష్టి ఏర్పడి, నశించడం అనుకోవచ్చు. వీటన్నిటి బట్టీ చూస్తే ఆయనెవరో అన్నట్టు మనం చెప్పుకునే బ్రహ్మ కాలం, విష్ణు కాలం, మొదలయినవి వేరే గ్రహాలకి చెందిన కాలాలు కావచ్చును. గ్రహాలన్నీ ఏర్పడి, కరిగిపోవడం అనేది ఆమోదించబడిన విషయమేగా! 

ఏమిటో, ఈ మధ్యన మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాను కదూ! కాల చక్రంలో గడుస్తున్న కాలానికి వీడ్కోలు చెప్పి, క్రొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే సమయం రానే వచ్చింది. పేరుకి తగ్గట్టుగా అందరికీ అన్నిటా జయం కలగాలని ఆశిస్తూ కాస్త ముందస్తుగా జయనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.