Tuesday, October 11, 2011

అందరి మామచందమామ రావే జాబిల్లి రావే అంటూ చిన్న పిల్లలకి గోరుముద్దలు తినిపించినా
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను అంటూ ప్రేయసి తన ప్రియుని కోసం ఎదురుచూసినా
వస్తాడు నా రాజు ఈ రోజు అంటూ ఆనంద పారవశ్యంలో మనసు ఆనంద తాండవం చేసినా
హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి అంటూ క్రొత్త జీవితానికి పునాదిని వేసుకున్నా
రావోయి చందమామ అంటూ తమ గోడుని చందమామతో  పంచుకున్నా
మామా చందమామా వినరావా మా కథ అంటూ కథలను వినిపించినా
పగలే వెన్నెల ని పంచే ఆయన చల్లని దొరవోలె ఎప్పటికీ మనందరికీ మామే.


మీకందరికీ ముందుగా ఆశ్వీయజ శుద్ధ (శరత్) పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పాటికే మీకు ఆ టపా దేని మీద వ్రాస్తున్నా అన్న విషయం అవగతమయ్యి ఉంటుంది. అక్షరాలా అదే మన మామయ్య మీదే! చందమామయ్య అనగానే నాకు చిన్నప్పుడు నేర్చుకున్న పాట ఒకటి గుర్తుకొస్తోంది.

ఉన్నారమ్మా ఉన్నారు నాకు ఇద్దరు మామయ్యలు
ఒక మామయ్యేమో ఇంటిలోనుంటాడు
ఇంకొక మామయ్యేమో ఇంటిమీదుంటాడు
ఇంటిలోన ఉన్న మామ మేనమామ
ఇంటి మీద ఉన్న మామ చందమామ

అవును అసలు చంద్రుడు మనకి మామయ్య ఎలా అయ్యాడు అనే సందేహం ఎప్పుడయినా ఎవరికయినా కలిగిందా? నాకు మాత్రం కలిగింది బాబు! అసలే సందేహాల పుట్టనేమో నివృత్తి అయ్యేదాకా కుమ్మరి పురుగులాగా దొలిచేస్తూ ఉంటాను. నా బాధ భరించలేక మా అమ్మమ్మ నాకు చంద్రుని పుట్టుక గురించి చెప్పింది.

మన పురాణాలను గమనిస్తే అందులో చంద్రుడు పాల సముద్రము నుండి పుట్టిన వాడు అని ఉంది. అలానే మన లక్ష్మీ దేవి కూడా పాల సముద్రము నుండి ఉద్భవించినదే కదా! ఆ వరుసన చూస్తే చంద్రుడు లక్ష్మీ దేవికి సోదరుడు. మనందరికీ లక్ష్మీ నారాయణులు  తల్లిదండ్రులతో సమానులు కనుక చంద్రుడు మనకి మామయ్య అయ్యాడనమాట.

అలాగే మనకి సప్త ఋషులలో మొదటి వారయిన అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. నారాయణుని నాభి నుంచి పుట్టిన బ్రహ్మ, సృష్టిలో తనకి ఒక సహాయకుడు కావాలని అనుకున్నప్పుడు, ఆయన మనో శక్తితో జన్మించిన వారే అత్రి. ఆయన భార్య అనసూయ. ఒక సారి అత్రి మహర్షి చేసిన ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకేసారి ప్రత్యక్షమయ్యారు. త్రిమూర్తులే తమకి సంతానంగా జన్మించాలని అత్రి మహర్షి కోరుకున్నారు. అప్పుడు ఆయనకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు, శివుని అంశతో దూర్వాసుడు మొత్తం ముగ్గురు కుమారులు జన్మించారు.

చంద్రుడు తనకున్న ఆధిపత్యం చేత, చాకచక్యం చేత దేవగురువు బృహస్పతి భార్య అయిన తారను చెరబట్టాడు. వీరికి పుట్టినవాడే బుధుడు. బాహ్యార్ధం తీసుకుంటే చంద్రుడు గురువుగారి భార్యను చెరబట్టడం తప్పు. కానీ అంతరార్ధాలలోకి వెళితే, చంద్రుడు మనసుకి (చంద్రమా మనసో జాతః) ప్రతీక. బృహస్పతి బుద్ధికి, ఆయన భార్య తార వివేకానికీ ప్రతీకలు. మనసు వివేకముతో ఉన్నప్పుడే జ్ఞానము వస్తుంది. ఆ జ్ఞానమే బుధుడు. ఆ విషయాన్ని మనకి చెప్పే సందర్భంలోనే ఈ కథ వస్తుంది.

సరే కాసేపు ఈ విషయాలని ప్రక్కన పెడితే, చంద్రుని మీద నాకిష్టమయిన కొన్ని మంచి పద్యాల గురించి ముచ్చటించుకుందాం.

కలశపాథోరాశిగర్భ వీచిమతల్లి
కడుపార నెవ్వాని కన్నతల్లి  
అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు
వన్నె వెట్టు ననార్తవంపు పువ్వు
సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు

నతడు వొగడొందు మధుకైటభారి మఱది
కళల నెలవగువాడు చుక్కలకు ఱేడు
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగుల దొర జోడు రేవెలుంగు

చంద్రుని మీద ఇంతకంటే అందమయిన, గొప్ప వర్ణనతో కూడిన పద్యం ఇంకొకటి లేదేమో అనిపిస్తుంది. ఇది అల్లసాని పెద్దన గారు రచించిన మనుచరిత్ర ప్రారంభంలో కృతిభర్త వంశ వర్ణనలో వచ్చే మొట్టమొదటి పద్యం. అసలు అల్లసాని వారి అల్లిక అర్ధం చేసుకున్న వారికి జిగిబిగి అని, అర్ధం కాని వారికి గజిబిజి అని ఊరికనే అన్నారటండీ? ఇక్కడ మనుచరిత్ర కృతిభర్త శ్రీ కృష్ణ దేవరాయులు. ఆయన వంశ (తుళు) ఆదిపురుషుడు చంద్రుడు కనుక ఇలా అభివర్ణించడం జరిగింది. పద్యం అర్ధంలోనికి వెళితే పాల సముద్రం తండ్రి అయితే ఆ సముద్రాన్ని చిలికినప్పుడు ఏర్పడిన తరంగాల నుండి పుట్టినవాడు చంద్రుడు (ఇక్కడ అలని తల్లిగాను, సముద్రుడిని తండ్రి గాను చెప్పారు). శివుని జడ అనే తోటలో పూసే అనావర్తవంపు పువ్వు (అంటే అన్ని ఋతువులలోనూ పూసే పువ్వు అని) చంద్రుడు. సకల దేవతల ఆకలినీ తీర్చే మెట్టపంట చంద్రుడు. దేవతల ఆహారమయిన సుధని లేదా అమృతాన్ని కురిపించేది చంద్రుడేగా మరి అటువంటి ఆయన ఒక మెట్టపంట (అంటే ఎవ్వరూ నాటకుండానే దానంతట అది వచ్చి నిరంతరం పండే పంట అని) అన్నారు. కటిక చీకటిని తినే చేతులతో కన్నె కలువని నవ్వించి, కవ్విస్తాడుట. ఇక్కడ పెద్దనగారి చతురతతో కూడిన చంద్రుని సరసత్వం కనిపిస్తుంది. మిల మిలా మెరిసిపోయే కాంతికి అత్యధిక కొలమానం చంద్రుడు. పదహారు కళలకి చిరునామా చంద్రుడు. అలానే ఈయన విష్ణువుకి బావమఱది , మన్మధునికి మేనమామ కూడాను. అందువలననే మన మామయ్యకి ఇంత ఆకర్షణ ఏమో?

అమరుల బోనపుట్టిక
సహస్ర మయూఖుని జోడు కూడె
సంతమసము వేరు విత్తు
పుంశ్చలీ సమితికి చుక్క వాలు
నవసారస లక్ష్మి తొలంగు బావ 
కోకములకు గుండె తల్లడము
కైరవ మిత్రుడు తోచె తూర్పునన్

ఈ పద్యం మన మామని వర్ణిస్తూ నంది (ముక్కు) తిమ్మన గారు రచించిన పారిజాతాపహరణం లోనిది. పదముల పోహళింపు చూడండి ఎంత చక్కగా ఉందో! దేవతలకి ఆహారపు పెట్టె, సూర్యునితో జత కూడినవాడు, చీకట్లని పోగొట్టేవాడు, ఏ విధముగానయితే మరదళ్ళు బావగారు ఎదురుపడగానే ప్రక్కకి తప్పుకుంటారో అలానే పద్మాలు చంద్రుని రాకతో ముడుచుకుంటాయి, చక్రవాక పక్షులకి గుండె తల్లడిల్లుతుంది ఎందుకంటే చంద్రుడు రాగానే అవి విరహవేదనలో (విడిపోతాయి) మునుగుతాయి, కలువ పూలకి స్నేహితుడు అయిన చంద్రుడు పౌర్ణమి నాడు ఉదయించాడు అని దీని భావం.

మన మామయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. పదహారు కళలతో, ఇరవయి ఎనిమిది (ఇరవయి ఏడు నక్షత్రాలు మరియు అభిజిత్ అనే శ్రవణ నక్షత్రపు ఛాయ) కళత్రాలతో మనల్ని మురిపిస్తాడు. మన మామని వర్ణించని కవులు, ఆస్వాదించని మనుషులు లేరేమో! దేవతలకి అమృతాన్ని పంచే వెన్నెలలో మనం తింటే మనకి కూడా ఆ అమృతం వస్తుంది. చిన్నపిల్లలకి చందమామని చూపిస్తూ వెన్నెలలో గోరుముద్దలు పెట్టడం చాలా ఆరోగ్యం కూడాను. అటువంటి అమృతధార ఈ శరత్ పౌర్ణమి చంద్రుడిలో ఉంటుందిట. కనుక ఈ ఒక్కరోజయినా అందరూ ఆరుబయట వెన్నెలలో భోజనం చేయడం అనాదిగా వస్తున్నది. అయితే ఇక్కడ మీకొక సందేహం కలుగవచ్చు. చంద్రుడు నిరంతరం అమృతాన్ని ఇస్తాడు కదా అయితే ఈ రోజుకే ఎందుకంత ప్రాముఖ్యత అని? మీకు రాకపోయినా నాకు వచ్చిందిలెండి అందుకే సమాధానం ఇస్తున్నా చదివేయండి అదే కంటితో. ఆశ్వీయుజ, కార్తీక మాసాలు శరత్ ఋతువు. ఈ శరత్కాల చంద్రునికి మలినాలు ఉండవు. మబ్బులు కూడా తొలగి ఆకాశం ప్రశాంతంగా ఉండి చంద్రుని వెన్నెల, ప్రకాశం ఎక్కువగా ఉండే కాలం ఇది. ఈ కాలంలో ఏ రోజునయినా వెన్నెలలో అమృతం ఉంటుంది కానీ పౌర్ణమి నాడు నిండుగా ఉంటాడు కదా పైగా ఈ మాసంలో మొదటి పౌర్ణమి కనుక ఈ ఆశ్వీయజ శుద్ధ (శరత్) పౌర్ణమికి ప్రత్యేకత.

మన మామయ్యకి సంబంధించిన కొన్ని లలిత సంగీత పాటలను సేకరించి ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు అసలు విషయం మీకు తెలిసిపోయిందిగా ఇంకెందుకాలస్యం హాయిగా అలా వెన్నెల్లో భోజనం చేసేయండి నా మాట విని. ఈ candle light dinner కన్నా ఎంతో బాగుంటుంది మా మామయ్యతో కూర్చుని సహపంక్తి భోజనం చేయడం. మామయ్యకి వడ్డించడం మరువకండే!


29 comments:

జ్యోతిర్మయి said...

రసజ్ఞ గారు మీరు చంద్రుని గురించి టపా పెడుతున్నప్పుడే నేను కూడా అదే పనిలో వున్నాను. త్వరలో చూపిస్తాను. చందమామను మామ అని ఎందుకంటారో ఇప్పుడే తెలుసుకున్నాను. ధన్యవాదాలు

Anonymous said...

//ఇంకెందుకాలస్యం హాయిగా అలా వెన్నెల్లో భోజనం చేసేయండి నా మాట విని. //kudaradandee...chandrudu baaguntaadu tellagaa challagaa kaanee ikkada chalini todu techchukuntaadu..bayatakelite gadda katteyyadame....
post baagundandee
ennela

Anonymous said...

naa profile to comment cheyyadam veelavaledu endukani?
ennela

nanda said...

hmmmmmmm.............nenu cheppina padyalu inka gurthunnaya meeku..(saradaki).............nice post andee

subha said...

ఎంత రసజ్ఞం గా చెప్పారండీ మామయ్య గురించి. టపాలోని తొలి పలుకులు బాగున్నాయి. అలాగే మీరు చిన్నప్పుడు నేర్చుకున్న పాట కూడా బాగుంది. మీ పేరు కూడా చాలా బాగుందండి.

రసజ్ఞ said...

@జ్యోతిర్మయి గారు
మరెందుకాలస్యం? చక చకా మీ కలాన్ని పట్టి రాసేస్తే మేం కూడా చక చకా చదివేస్తాం. చదివి వ్యాఖ్యానించినందుకు మీకు కూడా ధన్యవాదాలు!

@ఎన్నెల గారు
అవుతోందండీ మీ రెండు వ్యాఖ్యలూ నాకు వచ్చాయి. ముందుగా మీ స్పందనకు ధన్యవాదాలు. అయ్యో అలాగా అయితే ఇండియా వెళ్ళాక ప్రయత్నించండి!

రసజ్ఞ said...

@నంద గారు
హహహ అవునండీ అలా గుర్తుండిపోయాయి ఏమిటో మరి! నెనర్లు!

@Subha గారు
మీకు చాలా థాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీకు కూడా నా పేరు, నా టపాలో పాట నచ్చినందుకు. అలానే వ్యాఖ్యని చక్కగా నా పేరుతో రాయడం నాకు బాగా నచ్చింది. అదేంటో అండి నా పేరు ఎక్కడ కనిపించినా ఎందుకో బాగా నచ్చేస్తుంది.

kalyan said...

టప టపా తెరచి మొతం టప టపా వివరించారు మామ గురించి... జాబిలీని జిలేబి తినంత తియ్యగా .. జాంగిరి తినంత మధురంగా... జామూను తినంత హాయిగా.. చెపేసారు... అభ ఎంత బాగుందండి తెలుసుకుంటూ ఉంటేను.. మీరు చెప్పిన విధానము ఎంతో బాగుంది... ఆసక్తి కరంగాను ఉందండి

రసజ్ఞ said...

@Kalyan గారు
ఆసక్తికరమయిన విషయాలతో మీ మెదడు, నోరూరించే పదార్ధాలతో మీ కడుపు నిండాయి అదే పదివేలు. ధన్యవాదాలు!

Anonymous said...

కలువల రాజు గురించి మీరు రాసిన టపా నిండుపున్నమి జాబిలి అనడంలో అతిశయోక్తి లేదు. మీరు ప్రస్తావించిన తారాశశాంకం బాగుంది కొత్తగా ఉంది. నాకు తెలిసిన "తారాశశాంకం" యొక్క తాత్విక అన్వయం మరోలా ఉంది. మీతో పంచుకొంటున్నాను. దయచేసి విషయాంతరంగా భావించకండి. అసలుకి చంద్రుడు తారని చెరబట్టడు తారే అతని అందానికి సమ్మోహితయై వెంటవచ్చి తనని స్వీకరించమంటుంది. దానికి చెంద్రుడు తొలుత వారించినా పిదప కాదనలేక మోహానికి వశుడౌతాడు (అది కూడా తప్పే గురుపత్నీ సంగమం మహాపాతకాల్లో మొట్టమొదటిది). కానీ ఇదంతా దివ్యద్రుష్టితో ఎరిగిన బ్రుహస్పతి ముందు ఇంద్రుణ్ణి వర్తమానం పంపుతాడు చంద్రుడికి హితవు చెప్పమని. అందుకు చంద్రుడు " నీవు గౌతముని భార్య అహల్య ని కామించలేదా? అదీ గాక నిత్యం రంభా ఊర్వశీ ఇత్యాది అప్సరసలో అనునిత్యం లోలుడవై ఉండటంలేదా?" అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఇంద్రుడు చెప్పేది లేక తలవంచుకొని వెళ్ళిపోతాడు . ఎంతటి వారైనా తమ తప్పును ఎత్తి చూపినప్పుదు మౌనం వహించడం సహజం. మరుసటి ప్రయత్నంగా బ్రుహస్పతి బ్రహ్మను పంపగా బ్రహ్మను చంద్రుడు " ఓ విధాతా నువ్వు సకలలోకాలకీ తండ్రివి అట్లైన నీ భార్యయైన సరస్వతినెట్లు పెండ్లాడితివీ? ఆమె నీకు వరసకు కుమార్తే కాదా ? " అని పలికెను. అందుకు బ్రహ్మ కూడా తలవంచుకొని వెనుదిరిగాడు. ( నిజానికి బ్రహ్మా సరస్వతుల దాంపత్యం కొన్ని కారణాలవల్ల శాస్త్రరిత్యా సమర్ధనీయం. ఇంద్రుని అహల్య మీద మోహం ఓ శాపఫలం అందుకూ కారణం ఉన్నది) కానీ బదులు చెప్పకపోడానికి కారణం అది వ్రుధా ప్రయాశ కనుక. ఇక్కడ తాత్వికమైన అర్ధం ఇలా ఉంటుంది.

తార విషయ వస్తువు. చంద్రుడు మనస్సుకి అదిపథి (మన: వికార కారకో చంద్ర:) బ్రహ్మ అంతరాత్మ (inner consciousness) , బ్రుహస్పతి వివేకం, ఇంద్రుడు ధర్మానికీ ప్రతినిధి. కాబట్టి మనస్సు ఒక విషయ వ్యామోహంలో పడితే అది బుద్ధికి దూరమౌతుంది. బుద్ధితో చేసే యత్నాలన్నీ విఫలమౌతాయి ధర్మ పరమైన, వికేకం కలిగించే సుభాషితాలు రుచించవు. (inner consciousness)అంతరాత్మ ప్రయత్నాలూ వ్రుధా అవుతాయి. ఏవో కారణాలు వెతికి ఆ విషయవ్యామోహాన్ని సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తామే గానీ అందునుండీ బయటకి రాలేమని అంతరార్ధం. చంద్రుడు ఈ పపానికి తదుపరి పెద్దమూల్యమే చెల్లించాడు. తారా చంద్రులకి పుట్టిన బుధుడు దైవభక్తి కి చిహ్నం. విషయవ్యామోహాలు తీరాకా కలిగేది మిగిలేదీ ( ముందు వైరాగ్యం)తద్వారా దైవ భక్తి.

Urs Anonymously :)

రసజ్ఞ said...

@అజ్ఞాత గారు
విషయాంతరం ఏముందండీ? అన్ని మంచి విషయాలు చెప్పి! ముందుగా మీకు కృతజ్ఞతలు దీనికి సంబంధించి ఇన్ని విషయాలు తెలియచేసినందుకు. నాకు మీరు చివరలో చెప్పిన పోలికలు తెలుసు కాని ముందు చెప్పిన కథ, వర్తమానం పంపే అంశం తెలియవు. ఇహపోతే ఇన్ని మంచి విషయాలు తెలియచేసి కూడా ఇలా అజ్ఞాతగా ఎందుకున్నారో అర్ధం కాలేదు! మీ వ్యాఖ్యకు మరొకసారి ధన్యవాదాలు!

భాస్కర రామి రెడ్డి said...

రసజ్ఞ గారూ, మీ టపా ఒక ఎత్తైతే, ఈ పాట ఒక్కటి ఒకఎత్తు. పొద్దుటనుంచి ఎన్నిసార్లు విన్నానో గుర్తులేదు.అత్యద్భుతమైన కొరియోగ్రఫీ. ఫ్రెండ్స్ కూ కూడా పంపించాను. ఈ పాట పంచుకొన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు

భాస్కర రామి రెడ్డి said...

sorry song link is missing. I was referring to this link

http://www.youtube.com/watch?v=yfZfR7ecm9c&feature=fvsr

Anonymous said...

Rasagna garu,

Mama kani mama gurinchi chla vivanranga chepparu,
Maa sandehalanu nivrutti chesaru.. Dhanyavadamulu

meeru Chandruni gurunchi vrasaru, bagane undi,,, Surya chandrula madhya aa sambhandam emito kooda konchem vivarana ichi unte inka bagundedi :)

Prakruthi andaru eppudo maripoyaru Rasagna garu, anduke cadle light dinner ani venta paduthunnaru.. kaani aa vennela lo aa ru bayata koorchuni tinte... aaaha aa thrupte verulendi.
Amavasya nadu kooda maku chandrudu kavalani, candle light dinner aarmbhincharu kaabolu, kani adi nundi pournami nadu kooda ade samskruthi ni follow avthunnaru ee Janam..
Mee ee post choosaka atuvanti vallu marithe.. antha kanna andandam undademo anipisthundi kada, kani antha veezy ga mararu kada :P

Emaithenem, mee kavithalu ma lanti vallani (konchem realization kosam alochinchevallu) alochanalloki neettesthunnay (manchi gane nandoy ;))

Meeeku manasara Kruthajnathalu (thanks)

Meeru eppudu santhoshanga undali ani korukuntunnam (appude kada ma lanti vallu kooda untaru)

@ mee sreyobhilashi

రసజ్ఞ said...

@భాస్కర రామి రెడ్డి గారు
మీకు నచ్చి మీ స్నేహితులందరితో పంచుకున్న విషయం తెలియచేసారని చదవగానే నాకు చాలా ఆనందం వేసింది. మీకు కూడా నెనర్లు.

@శ్రేయోభిలాషి అజ్ఞాత గారు
మీకు ధన్యవాదాలు! మీరు సూర్య చంద్రుల మధ్యన ఉన్న సంబంధం గురించి అడిగారు. అది చెప్పాలంటే మరో పెద్ద టపా అవుతుంది అందుకనే దాని ప్రస్తావన ఇక్కడ తీసుకుని రాలేదు.

Anonymous said...

చక్కని వర్ణన చంద్రుడు ఏదో మా ఇంట్లో ఒక మనిషేమో అన్నంత దగ్గరవాడయ్యాడు మీ ఈ టపాతో ఈయనకి పదహారు కళలని తెలుసుకాని అవేమిటో ఇప్పుడే తెలిసింది! మీరు లలిత సాహిత్యం పాటలకి పెట్టిన చిత్రాలు చాలా బాగున్నాయి. మీ టపా మాత్రం కేకో కేకస్య కేకః

'Padmarpita' said...

చందమామ గురించి చక్కగా చెప్పారు....గుడ్ పోస్ట్!!

Anonymous said...

రసజ్ఞ గారు!
మీ పేరు బాగుంది....అప్పుడేమయిందంటే అంటూ మీరు రాసిన కవిత బాగుంది....అందరి మామ చందమామ గురించి మీ విశ్లేషణ బాగుంది
~అనిత

రసజ్ఞ said...

@అజ్ఞాత గారు
చంద్రుడు ఏదో మా ఇంట్లో ఒక మనిషేమో అన్నంత దగ్గరవాడయ్యాడు అన్నారు మంచిది అసలు మనింట్లో వాడే ప్రతీ ఇంట్లో వాడే! అలా పెరట్లోకెళ్ళి చుడండి అక్కడ ఉంటాడు అలా కిటికీలోనించి చుడండి అక్కడా ఉంటాడు అలా బావిలో చేద వేసి చుడండి అక్కడ కూడా ఉంటాడు. కనుక చంద మామయ్య ఎప్పటికీ మన మామయ్యే! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

రసజ్ఞ said...

నెనర్లు పద్మార్పిత గారు

@అనిత గారు
మీకు బోలెడు థాంకులు నచ్చిన అంశాలన్నీ వరుసపెట్టి చెప్పారు నాకు చాలా ఆనందంగా ఉంది!

Anonymous said...

Rasagna garu,

Dani gunchi kooda oka Tapa rayandi plz....
Naku telisi.. mee tharuvadi tapa... Deepawali gurinche untundi anukunta :) (Naraka chathurdhasi aina sare)....

Mee next post gurinchi wait chesthu..

mee.. Sreyobhilashi

హను said...

చందమామ గురించి చక్కగా చెప్పారు..... intha cheppaka... ayanaki pettakumda tintamaa....

రసజ్ఞ said...

@అజ్ఞాత గారు
హహహ సరే చుడండి మీ అంచనాలను చేరుతానో లేక వమ్ముచేస్తానో! ధన్యవాదాలు!

@హను గారు
నెనర్లు! మరింకెందుకాలస్యం? కానిచ్చేయండి మరి!

Shiva Ganga said...

good one :)

రసజ్ఞ said...

thanks Shiva Ganga gaaru!

Anonymous said...

తప్పకుండా రసజ్ఞ గారూ. మీ బ్లాగుని ఇంతకాలం పూర్తిగా చదవనందుకు చింతిస్తున్నాను. ప్రతిదీ నాకు ఒక అద్భుతమైన టపానే. ఇవాళ అన్నీ చదవడానికే నిశ్చించుకున్నాను.చాలా ఆనందంగా వుంది. మీరు ఇలా రాస్తూనే వుండాలని ఆకాంక్షిస్తున్నాను.

sarma said...

చా....లా బాగుంది

రసజ్ఞ said...

@తొలకరి గారూ
మీ వ్యాఖ్య నాకెంతో స్ఫూర్తినిచ్చింది! అయ్యయ్యో చింతించే అంత పెద్దమాటలు వద్దండీ! అసలంటూ మొత్తం చదివి మీ అభిప్రాయాన్ని చెప్పారు నాకదే చాలు. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానండీ!

@శర్మ గారూ
మీకు చాలా చాలా నెనర్లండి!

భాను కిరణాలు said...

రసజ్ఞ గారు మీరు నిజంగా అద్భుతమండీ బాబు....... మీ ఒక్కో పోస్ట్ చదువుతూ ఉంటే ఒక్కో విషయం మీద నా విజ్ఞానం అమాంతం పెరిగిపోతోంది ...