Monday, February 04, 2013

తౌర్యత్రిక కళ


మానవుడు మనోహీనుడై జీవించలేడు. కనుక మానవునిగా మహోన్నత స్థితిని పొందాలన్నా, మానసిక ఆనందాన్ని పొందాలన్నా కళల సాన్నిహిత్యం తప్పనిసరి. తనంతట తాను ప్రకాశిస్తూ ఇతరులను సైతం ప్రకాశింపచేసేది కళ. "మనిషిలో మంచిని పెంచి, అమానుష లక్షణాలను త్రుంచి, పురుషోత్తమునిగా మలచుటకు, సర్వమానవ కళ్యాణానికీ, సాంస్కృతిక ఉన్నతికీ, దోహదపరచుటే కళకు ప్రయోజనం" అని ధర్మపురి కృష్ణమూర్తి గారు చెప్పారు. కళకు ఒక నిర్వచనం చెప్పటం అంత సులభం కాదు, ప్రకృతిలోని ప్రతీ దృశ్యమూ కళాత్మకమయినదే. "కళా సమన్వితమయిన జగత్తు సుందరమయినది, సుందరమయిన జగత్తు విశాలమైనది, విశాలమైన జగత్తు అనంత చైతన్యముతో విలసిల్లునది. ఈ బహుముఖ ప్రజ్ఞా తేజస్సు కళ వల్లనే ఆవిర్భవించుచున్నది" అని కళాశబ్దం ప్రస్తుతింపబడినది. మనకున్న 64 కళలలో, కొన్ని (చిత్రలేఖనం, సంగీతము, నృత్యము, నాటకము, మొ.) మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలను చూపిస్తాయి, వాటినే లలిత కళలు అంటారు. ఈ లలిత కళలనే జయదేవుడు గీత గోవిందంలో (మూడవ శ్లోకం) విలాస కళలుగా పేర్కొన్నాడు. వీటిల్లో ప్రథమ గణ్యమైనదీ, పరమోదాత్తమైనదీ, సర్వకాల సర్వావస్థలయందు మానవుని మనుగడతో పెనవేసుకొన్న అపూర్వ కళాసృష్టి, సర్వకళల సమాహార స్వరూపంగా చెప్పబడేదే తౌర్యత్రిక కళ.

సంగీత, సాహిత్య, నాట్య కళల సమాహార స్వరూపమయిన కళను తౌర్యత్రిక కళ అంటారు. ఇటువంటి తౌర్యత్రిక కళలలో ముఖ్యమయినది "హరికథ". సాధారణంగా గాయకుడు గానంలోనూ, సాహిత్యకారుడు సాహిత్యంలోనూ, నాట్యకారుడు నాట్యంలోనూ మాత్రమే తన ప్రతిభను చూపిస్తాడు. కానీ  తౌర్యత్రిక కళగా చెప్పబడుతున్న హరికథను చెప్పేవాడు మాత్రం అభినయ కళను కూడా జతచేసి ఈ మూడిటిలోనూ (సంగీత, సాహిత్య, నాట్యాలలో) ప్రతిభను చూపించాలి. హరికథలు వేదకాలం నుండీ ఉండేవి, అగ్నివేశాది మహర్షులు సృజించగా, బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ నిత్యం హరికథా గానం చేస్తాడు. లవకుశలు ఇరువురూ హరికథా గానం చేసినట్టు రామాయణంలో కూడా ఉంది కదా! హరికథ దివ్యమయిన (దివిభవం దివ్యం - అనగా స్వర్గమున పుట్టినది అనే వ్యుత్పత్తి ఆధారంగా ఇది దివ్యం) కళ. "ఈ హరికథా ప్రక్రియ మహారాష్ట్రలో రెబ్బటిల్లి, తమిళ దేశంలో చిగిర్చి, ఆంధ్ర దేశంలో పూసి, కాసి, ఫలించింది" అని శ్రీ కడలి వీరదాసు గారు (హరికథా మహోత్సవ ప్రత్యేక సంచికలో) తెలియచేశారు.

యావదాంధ్ర వాఙ్మయములో బహుముఖ వైవిధ్యమును, వైశిష్ట్యమును కలిగిన విశాల సాహిత్య శాఖగానూ, సాహితీ ప్రక్రియలన్నింటిలోనూ పరమోత్కృష్టమైన శాఖగానూ పేరు ప్రఖ్యాతలు పొందిన యక్ష గానమే హరికథగా రూపాంతరము చెందినదని విజ్ఞుల అభిప్రాయము. హరికథా పితామహులుగా ప్రసిద్ధుడైన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన ప్రహ్లాద చరిత్ర అను హరికథావతారికలో యక్షగానాలకు హరికథలకు అభేదం చెప్పారు. అయితే, ఈ రెంటికీ ప్రదర్శన విషయంలో కొంత భేదం కనిపించినా, అంగాలు, కీర్తనలూ, తత్వనలూ అన్నీ ఒకే విధంగా వుంటాయి. మరి రెంటికీ భేదం ఎక్కడుందంటే, యక్షగానంలో బహుపాత్రలను అనేకమంది నిర్వహిస్తే, హరికథలో ఒకే వ్యక్తి బహుపాత్రలను నిర్వహిస్తాడు. అందువలననే యక్షగానము కన్నా కూడా హరికథ ఉత్కృష్టమయినది. ముల్లోకాలనూ పునీతం చేసి, జాతిని తీర్చిదిద్ది, భారతీయ సంస్కృతికి నిజమైన దర్పణంగా నిలిచి, ఆబాల గోపాలాన్నీ ఆహ్లాదపరుస్తూ, అవ్యక్త మధురానుభూతిని ప్రసాదించే మహోన్నతమయిన కళ హరికథ. హరిని కీర్తించుటే హరికథ. "అనగా బ్రహ్మము అనగా వుండునది. బ్రహ్మమును కలిగి వుండి, వినుట ద్వారా బ్రహ్మమును పరిచయం చేసేదే  కథ" అని శ్రీ తంగిరాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నిర్వచించారు. హరికథ చెప్పేవారిని కథకుడు అంటారు. భక్తి రస ప్రధాన పురాణ గాథలలో ఏదైనా ఒక అంశం తీసుకుని, గద్యములు, పద్యములు, గానము, హాస్యము, చతురత, సమయస్ఫూర్తి, మొదలైన వాటిని చొప్పించి శ్రోతలను ఆకట్టుకుంటూ ప్రవచించటమే హరికథ. 

భావంబొప్పవలెన్ ముఖాన నిసలౌ పాండిత్య మేతత్కళా
జీవంబై రససిద్ధి బొందవలె నౌచిత్యంబుపన్యాసవా
ణీవిన్యాసమునన్ ఘటిల్లవలెన్ దానేసర్వపాత్రంబులై
ప్రావీణ్యంబులన్ నటింపవలె విద్వాంసుడు సమ్యద్గతిన్   

అంటూ శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసు గారు కథకుడు బహుపాత్రలను పోషిస్తూ కథకు రక్తినీ, తుష్టినీ చేకూర్చాలని చెప్పారు. కథకుడు సందర్భాన్ని బట్టే కాకుండా సభికులను బట్టి కూడా కథాగమనం కొనసాగించాలి. కనుక ముందుగా బాగా సాధన చేసి వెళ్లి హరికథ చెప్పేసి వచ్చేస్తే అది రక్తి కట్టదు. కథకుడు ఎప్పుడూ కూడా సభికులను ఆకట్టుకొనే విధంగా వ్యాకరణ పండితులున్న సభలో వ్యాకరణ పరిజ్ఞానాన్ని, సాహిత్యజ్ఞులున్న సభలో కవితా ప్రాభవాన్ని, సంగీతజ్ఞులున్న సభలో సంగీత ప్రజ్ఞను ప్రదర్శిస్తూ, పామరులు వున్న సభలో వారిని రంజింప చేసే విధంగా పిట్ట కథలు, ఉప కథలు, హాస్యం జోడిస్తూ మూల కథకు అడ్డు రాకుండా, ప్రచార విషయానికి భంగం కలిగించకుండా సభనంతటినీ ఆకట్టుకుంటూ చెప్పగలిగినవాడే తన లక్ష్యాన్ని సాధించి, ప్రజలలో తాననుకున్న మార్పును తీసుకువచ్చి, వారికి మార్గ దర్శకుడవుతాడు. ఇంకా సూటిగా చెప్పాలంటే హరికథకుడు నవరసాలూ పోషిస్తూ, అన్ని రసాలకూ ఏకాగ్రచిత్తుడై వుండాలి. ఇన్ని చేయాలి కనుకనే హరికథ కష్టమయినా కానీ అన్ని వర్గాల వారినీ అలరిస్తుంది.

మొదట భక్తి తత్వమే ప్రాణంగా హరికథలు ఆవిర్భవించాయి. అద్వైత సిద్ధి మొదలు ఆటవిక విశ్వాసం వరకు ఏ రకంగా ప్రదర్శింపబడినా అది భక్తిగానే పరిగణించారు. వీటి వలన ఆధ్యాత్మిక ప్రభోదం కూడా జరిగేది. ఇటువంటి హరికథల వలన కథకులు మోక్షసాధన కోసం సంగీత, సాహిత్య, నాట్యాలను ఆలంబనగా చేసుకుని, వైష్ణవాన్నీ, శైవాన్నీ సమానంగా భావించి, సామాజికుల చేత కూడా భావింపచేసి సర్వమత సామరస్యాన్ని చాటేవారు. కొంతకాలం ఇటువంటి హరికథలు కేవలం హిందువులకే పరిమితమయ్యి, హైందవ సంప్రదాయాన్ని ఎక్కువగా ప్రదర్శించడం వలన హైందవ మత ప్రచారానికే ఎక్కువగా దోహదం చేస్తూ వచ్చాయి. కాలం గడిచే కొద్దీ, ఇతర మతస్థులైన క్రైస్తవులను, మహమ్మదీయులను కూడా విశేషంగా ఆకర్షించింది. ప్రజల్లో ఏ విషయాన్ని ప్రచారం చేయాలన్నా (అప్పట్లో మరి ప్రచార సాధనాలు తక్కువ కదా!) హరికథా ప్రక్రియే సరైన, శక్తివంతమైన మార్గమని గుర్తించారు. వారి మత ప్రచారానికి ఆలంబనగా "హరి" శబ్దాన్ని అడ్డుగా భావించకుండా ఒక కథా కాలక్షేపంగా వారు ఏసు ప్రభువు జీవిత చరిత్రను, మహమ్మదీయుల చరిత్రలను కూడా కథా రూపాలుగా చేసుకుని వానిని హరికథలుగా మలచుకుని ప్రచార యోగ్యంగా కూర్చుకున్నారు. రాన్రాను కాలానుగుణంగా భగవత్సంబంధిత గాథలే కాక, దేశనాయకులు, క్విట్ ఇండియా, కుటుంబ నియంత్రణ, సమాజాన్ని పీడిస్తున్న అంశాలు, మొదలయినవెన్నో ఇతివృత్తాలుగా చేసుకుని హరికథలు చెప్పటం ప్రారంభించారు. ప్రజల నుండీ ఇటువంటి కథలకు మునుపటి వాటికంటే ఆదరణ, ప్రోత్సాహం ఎక్కువగా లభించాయి.

హరికథలు చెప్పటమే కాదు, వ్రాయటమూ ఒక కళే. శ్రీ రాంపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు "కుమార సంభవము" ను, శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు గారు "అభిజ్ఞాన శాకుంతలం" ను, చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు "మాళవికాగ్ని మిత్రమ్" ను హరికథలుగా రచించారు. వీటి ప్రదర్శనల ద్వారా మన దేశానికే పరిమితమయిన హరికథలను విదేశీయులు సైతం అబ్బురపడేలా చేశారు మన హరికథకులు. శ్రీ అమ్ముల విశ్వనాధం గారు మలేషియాలో, శ్రీ వీరగంధం వెంకట సుబ్బారావు భాగవతార్ గారు అమెరికాలో, శ్రీ బోడావుల సీతారామయ్య భాగవతార్ గారు జర్మనీ, పారిస్, లండన్ వంటి దేశాలలో పలు ప్రదర్శనలిచ్చి, వాటి ద్వారా వారిలో భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పరచడమే కాక, భారతీయ కళల పట్ల వారికి ఉన్నతమైన అభిప్రాయాన్ని కూడా కలిగించారు. ఇంతటి మహోన్నతమయిన హరికథకు పితామహులైన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి గురించి ఒక్క మాటలో (తాతారావు గారి పలుకుల్లో) చెప్పాలంటే: 

హరికథా ప్రక్రియకు ఆద్యుండు కవితలో
కాళిదాస పోతనలకు సాటి
ఆదిభట్ట బుధుడు అన్నిటన్ మొనగాడు
ఆట పాట మాట లందు మేటి
ఇంతటి అపూర్వమయిన కళ అంతరించిపోకుండా ఎంతో మంది నేర్చుకోవాలనే సదుద్దేశ్యంతో హరికథా శిక్షణకు ప్రత్యేకంగా ప్రప్రధమంగా 10-6-1973న కపిలేశ్వరపురం (రాజమహేంద్రవరానికి 36కిలోమీటర్ల దూరం), తూర్పు గోదావరి జిల్లాలో "హరికథా పాఠశాల"ను శ్రీ యస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు (కపిలేశ్వరపురం జమీందారు)గారు స్థాపించి, ప్రధానాచార్యులుగా శ్రీ కడలి వీరదాసు (శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి శిష్యుడు) గారిని నియమించారు. మన జాతి కళలు కాపాడుకోవలెనన్న ఆశయంతో ప్రభుత్వం వారు ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్ధులలో కొంతమందిని ఎంపిక చేసి స్కాలర్షిప్ కూడా ఇస్తారు. ఈ పాఠశాలలో అయిదు సంవత్సరాల శిక్షణాకాలం పూర్తయిన తరువాత పరీక్షలను నిర్వహించి, "హరికథా ప్రవీణ"  అను ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, వారిని ప్రదర్శనకు యోగ్యులుగా నిర్ణయిస్తుంది. ఈ సంస్థ నుండి తయారైన బాలబాలికలు తెలుగులో మాత్రమే గాక సంస్కృతంలో కూడా హరికథలు చెబుతూ ఎన్నో సత్కారాలు పొందారు. వారిలో ప్రముఖులు దాలిపర్తి ఉమామహేశ్వరి గారు. ఉజ్జయినిలో  కాళిదాస అకాడమీ వారు నిర్వహించే అంతర్జాతీయ సెమినార్ లో ఈవిడిచ్చిన ప్రదర్శనల ద్వారా హరికథా ప్రక్రియకు ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు లభించాయి.

మన రాష్ట్రంలో జానపద కళారూపాలుగా చెప్పబడుతున్న హరికథలు, బుఱ్ఱకథలు, మొదలైన వాటిని ప్రోత్సహించాలని తెలుగు విశ్వవిద్యాలయం వారు హరికథా రచనా పోటీలు, హరికథా ప్రవచనా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి కులపతి గారైన ఆచార్య శ్రీ దోణప్ప గారు రచించిన "తెలుగు హరికథా సర్వస్వం" అనే పుస్తకాన్ని (హరికథకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ పొందుపరుస్తూ) అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. డా. డి. శారద గారు రచించిన "హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనాలు" (ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండీ పి.హెచ్.డి. పొందిన గ్రంధం) అనే పరిశోధనా గ్రంధంలో హరికథల వలన దేశానికి జరిగే మేలు ఎలాంటిదో కూడా బాగా వివరించారు. ఈ రెండు పుస్తకాలనూ క్షుణ్ణంగా చదవటం వలన హరికథా ప్రక్రియల ప్రాచీన స్వరూపం నుండీ ఆధునిక స్వరూపం దాకా ప్రతీ విషయమూ వివరంగా తెలుస్తుంది.

కొన్ని చక్కని హరికథలను ఇక్కడ వినవచ్చును. పాత చలన చిత్రాలలో హరికథలు ఎక్కువగానే కని, వినిపించేవి కానీ ఈ మధ్యన వచ్చిన చిత్రాలలో దేవస్థానం అనే చలనచిత్రంలో చాలా కాలం తరువాత దండిభట్ల నారాయణమూర్తి గారు, స్వర వీణాపాణి గారు రచించిన హరికథలను (సామాజిక) వినిపించి మరచిపోతున్న హరికథా ప్రక్రియను గుర్తుచేశారు.

One must die as an artist to be reborn as a Yogi అన్న అరవిందుని సూక్తి కళాకారులకున్న ఔన్నత్యాన్ని చాటుతోంది. దీనిని ఎప్పుడూ జ్ఞప్తిలో వుంచుకుని, ఇటువంటి కళలను కాపాడుకుంటూ, తరువాతి తరాలకు పంచవలసిన (కనీసం పరిచయం చేయవలసిన) బాధ్యత మనందరి మీదా వుందని భావిస్తున్నాను. హరికథకు పూర్వ వైభవం దక్కాలని మనసారా కోరుకుంటూ...............

21 comments:

vamkasannam said...

శ్రీమద్ రమారమణ గోవిందో హరి. హరికధ బాగాచెప్పేరే! మీరేంచెప్పినా బాగానే ఉంటుందండి అదేంటో గాని

వనజ తాతినేని/VanajaTatineni said...

సమగ్ర వివరణ తో చాలా చక్కని పోస్ట్ అందించారు. చాలా బావుంది రసజ్ఞ, హరి కథ కి పూర్వ వైభవం దక్కాలని నేను మనఃస్పూర్తిగా కోరుకుంటూ.. హరి కథా కళాకారులను తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకు తగిన కృషి అవసరం కూడా.. నాట్యం,సంగీతం లాగా హరి కథ కి కూడా కోర్స్ ఏమైనా ఉందా? ఆ వివరాలు పొందు పరచండి.ప్లీజ్.

ఈ మీ పరిచయం కూడా చాలా సమాచారాన్ని ఇచ్చి విషయ సేకరణ చేసుకునేవారికి ఉపయుక్తంగా ఉంటుంది.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

రసజ్ఞ గారు,
చిన్నప్పుడు నేనూ హరికథ విన్నానోచ్. హరికథ , బుఱ్ఱకథల్లో నాకు హరికథే నచ్చేదప్పట్లో. కానీ వాటిని మిస్సయిన తర్వాత రెండూ బాగుండేవి అనిపించేది. హరికథల్లో మధ్యమధ్యలో చెప్పే చిన్న పిట్టకథలు ఆసక్తిని పెంచుతూ ఉండేవి. కథకుడు ఎంతగా లీనమయి చెప్పగలిగితే శ్రోతలు అంతగా లీనమయి వినగలరు. ఇప్పుడూ దూరదర్శన్ లో హరికథలు , బుఱ్ఱకథలు ప్రసారంచేస్తున్నారు. క్రమంతప్పకుండా. కానీ అందరికీ అంత బాగా చెప్పడం కష్టమే. (మన బ్లాగుల్లో కూడ చక్కగా వ్రాయగలిగిన వాళ్ళు, వ్రాయాలనే తపన మాత్రమే ఉన్నవాళ్ళ లాగా.) :) హరికథాపాఠశాల గురించి, పి హెచ్ డి చేసినవాళ్ళ గురించి తెలుసుకున్నందుకు సంతోషం కలిగింది.

thanooj said...

harikatha chaala rojula tarvatha meeru naku chadavalnipinche tapaa rasaaru.harikatha neneppudu prathykshamga choodaledu tvllo thappa.naku nijam harikathalo goothanam ippatiki ardamkaledu gaani.kalala(arts)patla nakunna shraddatho chadivanu.nenu art anedi samjaniki upayogapadela unte mnchidinemo kanee art for the sake of art kala kala kosame mamma bhaavananu ekkuva nammuthanu.appudu maatrame kalonee nijayithee alane brathikiuntundhi.anyway thanku meerilantivi inkaa raayandi.

TVS SASTRY said...

చిరంజీవి రసజ్ఞకు ఆశీర్వచనపూర్వక అభినందనలు.క్రమం తప్పకుండా నేను చదివే బ్లాగుల్లో మొట్ట మొదటిది మీదే!మంచి విలువైన సమాచారం అందరితో పంచుకుంటున్నందుకు అభినందనలు.ముందు ముందు మరిన్ని సాహితీ గుబాళింపులు గల వ్యాసాలు మీనుండి మరెన్నో రావాలని ఆశిస్తూ ....

భవదీయుడు,
టీవీయస్.శాస్త్రి

Unknown said...

తౌర్యత్రిక కళ - ఈ పదం వినటం ఇదే మొదటిసారి, నిజం!
బాగా తెలిసిన కళే అయినా, ఇంత విపులంగా దీని గురించి తెలీదు. కళ ఔన్నత్యం చెప్తూ ఈ వ్యాసం మొదలు కొన్ని వాక్యాలు మీరు కూర్చిన తీరు నిజంగా అద్భుతం. కళని కళ గా వర్ణించటమూ ఓ కళే!
తిరిగి ఈ కళకి పూర్వ వైభవం దక్కాలని మేమూ మనసారా కోరుకుంటూ...
ఈ ప్రాచీన కళ గురించి సమగ్రంగా తెలుసుకుని కళాకారుల పేర్ల ప్రస్థావనతో ఇంత ఆసక్తి కరంగా రాసిన మీకు మనసారా అభినందనలు!

ఫోటాన్ said...

బాగుంది, మంచి విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదములు రసజ్ఞ గారు

Nagesh G said...

మీ టపా చాలా బాగుంది రసజ్ఞ గారు.. మన తూర్పు గోదావరిలోనే ఒక పాఠశాల ఉంది అన్న విషయం నాకు ఇప్పటి వరకూ తెలియదు.. ఎప్పటిలాగే మరొక అరుదైన టపాతో మాకు అరుదైన సమాచారాన్ని తెలియచేసినందుకు కృతజ్ఞతలు..

yugandhar vannemreddy said...

"నవరసభరితం హరికథా తౌర్యత్రికం"
వేదాల సారమంతా వాసుదేవుడే...
ఆ వేదాలలో సామవేదం వంటి వాడినని గీతలో భగవానుడు స్వయంగా అన్నాడు.
సామవేదం సంగీతం గురించి చెబితే...
(సం గీతం) మంచి గీతం దానిక్కావలసిన వస్తువులు ముఖ్యంగా మూడు సాహిత్యం,సంగీతం,నాట్యం ఆ మూడు కలగలసిన ఉన్నతమైనదే తౌర్యం, మూడు కళలు కాబట్టి తౌర్యత్రిక.
ఈ విషయాలు మనందరితో పంచుకున్న (నా{మన}కు తెలియజెప్పిన) సత్యముగానే నవ రస(జ్ఞ)భరితం
శుభాభినందనధన్యవాధములు... :)

Krishna said...

తౌర్యత్రిక కళ అంటే ఏంటో అనుకున్నాను..హరికథ అని చదివాక ఓహ్ ఇది మనకి తెలిసిన విషయమే కదా అనిపించింది. అయినా, కళ ల గురించి, హరికథ ల గురించి తెలియని ఎన్నో విషయాలు పరిచయం చేసారు.


"మొదట భక్తి తత్వమే ప్రాణంగా హరికథలు ఆవిర్భవించాయి..."
ఏ కళ అయినా మొదట మనకి తెలియని ఆ అలౌకిక శక్తి ని తెలుసుకునే ప్రయత్నం లో నే పుట్టడం జరిగి ఉంటుంది అని నా అభిప్రాయం:).

హరికథా కాలక్షేపం అనే గొప్ప పదం ఈ మధ్య అసలు వినిపించట్లేదు. హరికథా భాగవతారులకు శిక్షణ ఇచ్చి ఈ కలకు ప్రాచుర్యం కల్పించే ప్రయత్నాలు జరుగుతుండడం సంతోషకరం!

వాగ్ధానం అనే సినిమా లో ఘంటసాల గారు పాడిన సీత కళ్యాణం హరికథ చాలబాగుంటుంది......
http://www.youtube.com/watch?v=0wlMyvvyCr8

Jaabilliraave said...

చాలా చక్కటి వ్యాసం అదించారు. మంచి శైలి. హరికధ అనగానే మా చిన్నతనం గుర్తుకువచ్చింది. చిన్నతనంలో శ్రీ కోటసచ్చిదానంద శాస్త్రి గారివి, శ్రీ ములుకుట్ల వారివి బాగావిన్నాం. ధన్యవాదాలు

అనంతం కృష్ణ చైతన్య said...

you are an excellent blogger that i have seen,,,,,,,,, really hatsoff.........

mee blog chaduvitey chaalu,,,,,,,,, indian culture gurunchi teliyani naalanti bharateeya agnaanulaku kanuvippu kaligistundi......... hatsoff once again........ :)

Prasad (ప్రసాద్ భళ్ళమూడి) said...

Nenu baga chinnappudu vizaglo kanaka maha lakshmi devastanam varu erpaatu chesina Maha Bharatham Harikatha one month vinnanu. Kathakuni peru gurtu ledu kani aayanidi machilipatnam ani gurtu. chala baaga cheppevaru. chala pitta kathalu kooda cheppevaru.idi 38-40 years kindati sangati. prastutam tv lo time kudimchadam valla precise ga cheppestunnaru. Dusi Benerji garani srikakulam lo chala popular. memu kooda ganesh festival lo okasari arrange chesamu. prastutam jeevinchi leru. four years back nizamabad ttd choultry lo ttd arrage chesidi vinnanu. srotalu 20 mandi kooda leru. manam andaram deenini encourage cheyavalisina avasaram undi.

భాను కిరణాలు said...

రసజ్ఞ గారికి అభినందనలతో మీ రచనలను ఎంతగానో ఇష్టపడే ఒక మిత్రుడు..... మీ రచనలు చాలా అద్భుతం గా ఉంటాయి.... విదేశాలలో ఉంటూ కుడా మీరు మన తెలుగు లో ఇంత చక్కగా , ఎంతో ఆసక్తి కరమైన విషయలను మా అందరికి తెలియచేస్తున్నారు... అలాగే scribd లో కుడా మీ గ్రంధాలయం అద్భుతం ............. మీకు ఈ విషయాల్ని వ్యక్తిగతం గానే చెప్పాలి అనుకున్నాను .... కాని మీరు ఎలాంటి contact info ఇవ్వనే లేదు ............మీకు అభ్యంతరం లెకపొతే మీ facebook Id చెప్పగలరు ..... ఎందుకంటే మీలాంటి వ్యక్తులతో స్నేహం లభిస్తే అది నా అధ్రుష్టమే కదా ...నా FB Id .... bhanu vvsr ...... ఎదో ఒక జాబు ఇస్తారని ఆశిస్తున్నాను

రసజ్ఞ said...

@ vamkasannam గారూ
మీరు మరీ మెచ్చేసుకుంటున్నారండీ, ఈ టపాకి మాత్రం ఈ ప్రశంసలన్నీ టపాలో చెప్పిన రెండు పుస్తకాలకీ దక్కుతాయి. నాది కేవలం పరిచయం మాత్రమే! ధన్యవాదాలు!

@ వనజవనమాలి గారూ
మీతో ఏకీభవిస్తున్నాను, ఇప్పుడు హరికథా కళాకారులను తయారు చేసుకోవలసిన అవసరం చాలా వుంది. హరికథ ఒక క్రాష్ కోర్సులాగా లేదా కొంత కాలం నేర్చుకుని మానివేయటం కుదరదు. టపాలో చెప్పినట్టుగా మనం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్లి చెప్పి వచ్చేసేది కాదు, సభికులను బట్టీ, వారి మూడ్స్ బట్టీ కూడా మారుస్తూ ఆకట్టుకుంటూ చెప్పగలగాలి. అందువలన టపాలో చెప్పినట్టు హరికథా పాఠశాలలో అయిదు సంవత్సరాలు కంప్లీట్ కోర్స్ నేర్చుకోవలసి వుంటుంది. కృతజ్ఞతలు!

@ లక్ష్మీదేవి గారూ
ఇప్పుడూ దూరదర్శన్ లో ఇటువంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారా? పోనిలెండి అలాగయినా ఈ కళని ఒకరకంగా కాపాడుకోగలుగుతున్నాం. మీరు ఈ సారి మా రాజమహేంద్రవరం వైపు వస్తే ఈ హరికథా పాఠశాలకు వెళ్ళడం మరవకండి, మీకు బాగా నచ్చవచ్చునని నా నమ్మకం. ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ తనూజ్ గారూ
మీరన్నట్టు కళ కళ కోసమే అనుకుని ప్రదర్శించిననాడే ఎక్కువమందిని ఆకట్టుకుంటుంది కానీ అదే సమయములో సమాజానికి ఉపయోగపడే అంశాలను కూడా ప్రచారం చేయగలిగితే దాని ప్రభావళం వలన కొందరిలో అన్నా మార్పు, చైతన్యం మొదలయినవి కలుగుతాయని నమ్మకం. అప్పట్లో ఒక ప్రచారిక మాధ్యమాలు కళలే కదా! ధన్యవాదాలండీ, తప్పకుండా నాకు తెలుసున్నంతలో ప్రయత్నిస్తాను.

@ టీవీయస్.శాస్త్రి గారూ
మీ ఆశీర్వచనాలకు, అభినందనలకు నా అభివాదాలు. వీలుని బట్టీ నా వంతు కృషి తప్పక చేస్తూ మీ ఆశను నెరవేరుస్తాను.

@ చిన్ని ఆశ గారూ
కళ ఔన్నత్యం చెప్తూ కూర్చిన వాక్యాలు చాలా మంది ప్రముఖులు చెప్పినవే, నేను కేవలం ఒకసారి వారందరినీ స్మరించుకుంటూ ఇక్కడ వ్రాశాను అంతే! కృతజ్ఞతలు.

రసజ్ఞ said...

@ హర్ష గారూ
నేను వ్రాసిన ప్రతీ వ్యాసం క్రమం తప్పక చదువుతూ ప్రోత్సహించే మీకు నా కృతజ్ఞతలు!

@ NageswaraRao V Gokavarapu గారూ
భలే వారే! మన తూర్పు గోదావరిలోనే వుండటం నిజంగా మన అదృష్టం, ఈ సారి వీలు చిక్కినప్పుడు తప్పక చూడండి. ధన్యవాదాలు!

@ yugandhar vannemreddy గారూ
బాగా చెప్పారండీ, మీకు బాగా అర్థమయ్యిందనమాట! ధన్యవాదాలు.

@ కృష్ణ గారూ
మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను కానీ ఏ కళైనా కి బదులుగా ఏ లలిత కళైనా అని వున్నట్టయితే ఇంకా బావుంటుంది :) నిజమే, ఆ విధంగా అయినా కొన్ని తరాలవారు మర్చిపోకుండా వుంటారు. మనం చెప్పుకోవలసిన విషయం మగవారి కన్నా ఎక్కువగా ఆడవారు ఈ కళపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఘంటసాల గారు పాడిన సీత కళ్యాణం హరికథ పంపినందుకు, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ పింగళి శశిధర్ గారూ
మీరు చెప్పినవారి గురించి విన్నాను తప్ప వారి హరికథలు నేను వినలేదు. శ్రీ అమ్ముల విశ్వనాధం గారు మా కుటుంబానికి బాగా సుపరిచితులు, ఆయన హరికథలు మాత్రం చాలానే విన్నాను. ఈ వ్యాసం ద్వారా మీకు మీ చిన్నతనం గుర్తుకువచ్చినందుకు చాలా సంతోషంగా వుంది, ధన్యవాదాలు!

@ అనంతం కృష్ణ చైతన్య గారూ
మీరు మరీ మునగ చెట్టు ఎక్కించేస్తున్నారండీ, మిక్కిలి ధన్యవాదాలు!

@ ప్రసాద్ గారూ
మీరన్నది నూటికి నూరు శాతం నిజం! ప్రస్తుత కాలంలో ఇటువంటి కళలు ఆదరణకి దూరమయ్యాయి, అక్కడెక్కడికో వెళ్లి (అదీ హరికథ కోసం) విని వచ్చే అంత ఆసక్తి, తీరిక, ఓపిక జనాలకి లేవు. ధన్యవాదాలండీ!

@ భాను కిరణాలు గారూ
మీకు నా గ్రంధాలయం, నా రచనలు నచ్చినందుకు కృతజ్ఞతలు!

సతీష్ కొత్తూరి said...

తౌర్యత్ర కళకు మహిహారం లాంటి ఆదిభట్ల నారాయణ దాసు
గారి ఇంటికి మా ఇంటికి అరకిలోమీటరు ఉండేది. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఆదిభట్ల వారిగురించి తరచూ చెప్తుండేది. హరికథల మీద గౌరవం అలా పెరిగింది. మాది విజయనగరమే అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా. ధన్యవాదాలు రసజ్ఞ గారు. గుర్తు చేసినందుకు

Anonymous said...

What's up to every , because I am in fact eager of
reading this web site's post to be updated daily. It consists of pleasant
information.

Look into my website - dating online - bestdatingsitesnow.com -

KOLLURI VEERAPUSHKAR said...

హరికథలు బాగోవు (మంచి మాటలు వాడరు) అనుకున్నా కాని ఈ టపా చదివాకా తెలిసింది హరికధలంటె ఇవి అని.చెప్పినందుకు ధన్యవాధాలండీ.