Monday, August 22, 2011

ఉట్టి వీరుడు



అంతా కృష్ణ మయం ఈ జగమంతా కృష్ణ మయం కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ

ఏమిటీ పాట తప్పు రాసా అనుకుంటున్నారా? ఏమీ లేదండీ ఆ పాటలో అంతా రామ మయం కన్నా కృష్ణ మయమే బాగుంటుందని అనిపించింది అందుకనే అలా రాసా. పైగా ప్రతీ మనిషిలోను రాముని లక్షణాలు కనిపించినా  కనిపించకపోయినా కృష్ణుని లక్షణాలు మాత్రం ఏదో ఒక సమయములో ఖచ్చితంగా కనిపిస్తాయి. అంతెందుకండీ! మనకి ముద్దు ముద్దుగా అల్లరి చేసే చిన్న పిల్లలని చూస్తే వెంటనే ఎవరు గుర్తొస్తారు? కృష్ణుడే కదా! అందుకే ఇక్కడ నేను అలాంటి చిత్రాన్నే జతచేసాను. వీడు మా బుల్లి తమ్ముడు.  

శ్రీముఖ నామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం నాలుగవ పాదం, బుధవారం రోజు అర్ధరాత్రి కంసుని చెఱసాలలో కృష్ణుడు పుట్టాడు. దేవకి, వసుదేవులకు ఎనిమిదో సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడన్నమాట. ఆ రోజును ‘శ్రీకృష్ణాష్టమి’గా జరుపుకుంటారు. 

మనకి కృష్ణుడు ఒక మానవుని రూపములో ఉన్న యాదవునిగా తెలుసు. ఇంతకీ కృష్ణుడు ఎక్కడ ఉంటాడు అంటే గ్రహమండలాలని దాటి పైకి వెళ్తూ ఉంటే నక్షత్ర మండలం వస్తుంది, దానిని కూడా దాటితే సప్తర్షి మండలం, అది కూడా దాటితే ధృవపదం వస్తాయి. ఈ ధృవపదాన్నే విష్ణుపదము అనీ, ధృవక్షతి అనీ అంటారు. ఈ ధృవక్షతిలోనే గోలోకము ఉంటుంది. గోలోకములో విష్ణువు కృష్ణుడుగా, ప్రకృతికి స్వరూపమయిన రాధాదేవితో కలిసి పిల్లనగ్రోవిని ఊదుతూ ఆనందిస్తూ, ప్రేమ మయంతో ఉంటాడు. దీనినే బృందావనమని అంటారు. గోలోకానికి పైన గొప్ప అంధకారం వ్యాపించి ఉంటుంది. ఆ అంధకారానికి అవతల విష్ణువు వైకుంఠవాసుడై వెలుగుతూ ఉంటాడు. ధృవుడు సదా విష్ణువును చూస్తూ ఉజ్వల కాంతితో ప్రకాశిస్తే గుంజకు కట్టిన ఆవులాగ సప్తర్షి మండలం అతని చుట్టూరా ప్రదక్షణం చేస్తూంటే, సమస్త నక్షత్ర గ్రహ గణాలతో నిండిన శింశు మార చక్రం అతని క్రిందుగా తిరుగుతూంటుంది. గోలోకానికి దిగువ బ్రహ్మ ఉండే సత్యలోకము, జనలోకము, మహర్లోకము, స్వర్లోకము, భువర్లోకము, భూలోకము అనే ఊర్థ్వలోకాలు ఏడూ; భూలోకానికి దిగువ అథోలోకాలనబడే అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు ఏడూ కలిసి పదునాలుగు లోకాలకు మీదుగా విశ్వశిఖరాగ్రంపై రాధాకృష్ణులు ఉంటారు. 

గోలోక బృందావనంలో రాధామాధవులు
ఆయన ధర్మానికి ఆటంకం కలిగించే దుష్ట శక్తులను చంపడం కోసమే పుట్టాడని భగవద్గీతలో ఉంది. ఆ మాటకొస్తే దశావతారాలన్నీ కూడా ఆ ఉద్దేశ్యముతో వచ్చినవే కదా! కృష్ణావతారం ముందుగా ఉన్న అవతారములలో (మత్స్య, కూర్మ, వరాహ,నరసింహ, వామన, పరశురామ, రామ) వేటిలోనూ అల్లరి, చిలిపితనం, కొంటెతనం, సరసం అంతగా కనిపించవు. కేవలం లక్ష్యసాధన కోసం మార్గ దర్శకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కృష్ణావతారం మాత్రం అల్లరి చేస్తూ కవ్విస్తూ  కూడా మన లక్ష్యాలని నేరవేర్చుకుంటూ అందరి మనసుల్నీ గెలుచుకోవచ్చని చెప్తుంది. అరిషడ్వర్గ నాశనం, ఇంద్రియనిగ్రహం, ఆత్మ జ్ఞానం, ఆనందం, ప్రేమామృతం, సత్సాంగత్యం, మొదలయినవెన్నో మనకి తెలియచేసిన అవతారపురుషుడు శ్రీ కృష్ణుడు. ఉట్టులన్నీ కొల్లకొట్టి తీసుకెళ్ళి యాదవులతో పంచుకుంటూ చల్దులారగించినా, కుచేలుని స్నేహంలో సేద తీరినా, గోపికల చీరలన్నీ ఎత్తుకెళ్ళి వాళ్ళని ఆటపట్టించినా, గోవర్ధన గిరిని ఎత్తి జనుల్ని కాపాడినా, కాళింగుని పడగలపైన నృత్య ప్రదర్శన ఇచ్చినా, కురుక్షేత్ర యుద్ధాన్ని రక్తి కట్టించినా, గీతాబోధ చేసినా అది ఆ నల్లనయ్యకే సాధ్యమయ్యింది.  యుద్ధంలో పాంచజన్యాన్ని పూరించి శత్రువుల గుండెల్లో భయాన్ని నింపగల ఈ నల్లనయ్యే అదే చేతితో మురళిని పట్టి పశువులని సైతం ఆనంద డోలికల్లో ముంచగల సమర్ధుడు. భక్తికి, ప్రేమకి ఎప్పుడూ తలవంచుతూ ప్రేమ రసాన్ని పంచిన ప్రేమామయుడు. ఇద్దరమ్మల గారాల కిట్టయ్య చిన్న తులసి దళానికి లొంగాడు అంటే ఆయన హృదయం మనకి తేటతెల్లమవుతోంది.

కృష్ణాష్టమి అనగానే  గుర్తుకొచ్చేవి శ్రీ కృష్ణుని బుల్లి పాదాలు మరియు ఉట్టి కొట్టే సంబరాలు. ఇంటి ముందు చిన్ని కృష్ణుడి పాదాలు వేస్తారు. దేవుడు మన ఇంట్లోకి నడచి వచ్చాడు అన్న భావన కోసం. ఇహ ఉట్టి అంటే చూరుకు తాడుతో ఉచ్చులా కట్టి వేలాడదీసే సాధనం. పల్లెల్లో వండిన ఆహారపదార్దాలను, పాలు, పెరుగు లాంటివి కుండలో పెట్టి చూరు నుంచి వేలాడ తీసిన ఉట్టిలో భద్రంగా పిల్లులకు, కుక్కలకు అందకుండా పెడ్తారు. చిన్ని కృష్ణుడికి వెన్న అన్నా పెరుగు అన్నా మహాప్రీతి అనేది మనందరికీ తెలిసిందే. అలనాడు గోకులంలో ఇళ్లలోని ఉట్లపై గల వెన్న కుండలను చిన్ని కృష్ణుడు దొంగిలించి తన మిత్రబృందంతో కలిసి ఖాళీ చేసేవాడు.
నవనీత చోరుడు అన్న నామం ఆయనకి వెన్నని దొంగలించి తినుట వల్లనే వచ్చినా నవనీతము వంటి మనసు కలిగిన కన్నె పిల్లలందరి మనసును దోచే వాడు కూడా కనుక సార్ధక నామధేయుడయ్యాడు. అందుకే ఆయన్ని ‘వెన్న దొంగ’ అంటూ ముద్దుగా పిలిచేవారు. అందువల్ల గోకులాష్టమి రోజున ‘ఉట్టి కొట్టే’ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఒక చిన్న కుండ లేదా బుడ్డీలని (ఉట్లని) పెరుగు, మజ్జిగ, పూలు, డబ్బులతో నింపి ఎంతో ఎత్తున కడుతారు. దాన్ని పగులకొట్టడానికి యువకులు పోటీ పడుతారు. ఎవరు పగులకొడితే వారు విజేతలు. విజేతలకు బహుమతులూ ఉంటాయి.అందరూ కలిసి ఈ ఉట్టి కొట్టడం ఓ ఆనవాయితీ. ఇలా కొట్టడానికి ఒక అర్థం ఉంది. కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించగలమనే నీతి ఉందని పెద్దలు చెబుతారు.

ఈ కృష్ణాష్టమిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా జరుపుకుంటారు. మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడు ఎక్కువగా జరుపుకుంటున్నారు. మనకంటే ఉత్తర భారతదేశంలో అంటే.. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో బాగా జరుపుతారు. ఉట్టి కొట్టడాన్నే మహారాష్ట్రాలో దహీ హండీ (పెరుగు కుండ) అని అంటారు. దక్షిణ భారత దేశంలో కొంతమంది ఉట్టిని శ్రీరామనవమికీ, మరికొంతమంది సంక్రాంతికీ కొడతారు. కుప్పం నియోజకవర్గంలోని సంక్రాంతి పండుగకు ఉట్టి కొట్టడం మరియు పశువులను వదలడం, భారతీయుల ఆనవాయితీగా నిర్వహిస్తారుట.

నా పదవ తరగతిలో ఒక సారి కృష్ణుడి గుడిలో ఆయనతో ప్రేమలో పడ్డా. అప్పుడు రాసిన చిన్న తవిక ఇది. చదివి మీరు కూడా ఆనందించవచ్చు.

నీ ప్రేమ ఒక సముద్రం
నీ విరహం ఒక ఉపద్రవం
నీ పలుకు సుతారమయిన  చిరుగాలి
నీ మౌనం భయంకరమయిన సుడిగాలి
ఎన్ని వేల అయస్కాంతాలు నీలో ఉన్నాయో
ఎంతమందినయినా ఇట్టే ఆకర్షించే శక్తి ఉంది
నీ మనోహర రూపాన్ని చూసిన నయనాలు రెప్ప వేయటం మరిచాయి
మత్స్యమై మా హృదయ కొలనులో నిరంతరం జలకాలాడుతున్నావు



15 comments:

Nivas said...

Very nice post .. Krishnaashtami rojuna manchi post chadivam ..Thanks for the post

రసజ్ఞ said...

@Nivas gaaru
chadivinanduku meeku koodaa thanks

Anonymous said...

pado taragathilo intha baga rasara...
meeru cheppina viseshaalu nijamgaa naku teliyavu enno manchi vishayaalu cheppaaru radha krishnulu ekkada untaaru ani really enjoyed reading this post. thanks a lot!

Anonymous said...

naakeeyana peru pettarano, marinkemainaa karanamo teleedu gani maa chedda istam krishnudante...bagaa rasavoy....maniddaram modatisari kalisindi aayana gudi(ISKON) daggaregaa...pradakshinalu kuda cheyinchaav gudi chuttu...

abaddala putta
maanasa chorudu
sogasu kollagottu bandipotu
pachi venna donga
ayinaa yenduko rojukokkasaraina atani peru vinakapote yendariko teerani benga..

రసజ్ఞ said...

@అజ్ఞాత గారు
అవునండి అప్పుడే కదా మరి మొదటి సారి ప్రేమలో పడింది!!

రసజ్ఞ said...

@మోహన్
థాంక్స్ నీకింకా గుర్తుందా? అప్పుడు నన్ను తిట్టుకున్నావుగా ప్రదక్షిణాలు చేయించానని!!!

murali said...

VERY NICE EXPLICATION AND DEEP INFORMATION HATSOFF TO YOU

రసజ్ఞ said...

@Murali
thanq so much for ur comment

BHARATHeeyudu said...

aithe krishnudu chaala adhrusta vamthudanna maata?? krishnaa emi nee bhaagyam. kaliyuga kaanthalanu saitham neevu vidichi pettutaledhe???

Krishna krishnaa??

entha pani cheayachunti vayya.... neevu bhoomini vadhili velli 5111 samvastharaalu aina.... inkaa nee premakusuma sugamdha parimalaalanu aaswadhimchi... nee RASA ramyaamruthaani maaku andisthunnaa RASAGNA gaariki chiraayuvu, sampoorna samthoshamulu ellappudu kalugacheyumu.

రసజ్ఞ said...

@BHARATeeyudu గారు
ఆయనకేంటండి బాబు! అలా మాయ చేసి వెళ్ళిపోతాడు జనాలందరూ ఇంక తపించిపోతూ ఉంటారు. మీ వ్యాఖ్యకి నెనర్లు

శశి కళ said...

బలె వివరంగా రాశారు.యెక్కడ చదివారు.అన్ని విశయాలు చాలా అందంగా
వ్రాసారు

రసజ్ఞ said...

@శశి కళ గారు
ధన్యవాదాలండి. చిన్నప్పుడు అమ్మమ్మ గోరు ముద్దలు తినిపిస్తూ చెప్పిన విశేషాలే! నేను ఎక్కడా చదవలేదండీ!

భారతి said...

శ్రీకృష్ణుడు ఉట్టిపైనుండు ఘటం నుండి వెన్న తీసుకోవడం అంటే - యోగశాస్త్రరీతిగా లంబికాయోగం ద్వారా బ్రహ్మరంద్రం లోగల సమాధియను అమృతమును గ్రహించుట అని కొందరున్ను, ధ్యానయోగంచే సుషుమ్నాగ్రం ప్రవేశించి బ్రహ్మామృత జ్ఞానం అనుభవించుట అనే అర్ధమును కొందరున్ను చెప్తుంటారు.

ఇప్పుడే ఈ పోస్ట్ చూశాను రసజ్ఞ. చాలా చాలా చక్కగా వుందీ పోస్ట్. మంచి మంచి విషయాలు వివరిస్తున్నందుకు మనసార అభినందనలు రసజ్ఞ.

Anonymous said...

Hurrah! Finally I got a weblog from where I be able to in fact
get valuable information regarding my study and knowledge.



Feel free to visit my blog - dating sites - http://bestdatingsitesnow.com/,

Anonymous said...

Hello there! This post couldn't be written any better!
Reading this post reminds me of my old room mate!
He always kept talking about this. I will forward this
write-up to him. Fairly certain he will have a good read.
Many thanks for sharing!

my blog post; Dating Online (Bestdatingsitesnow.Com)