Monday, June 04, 2012

కుశ(ల)మా



ఈ చిత్రము, శీర్షిక పేరు చూసి ఈ పాటికే మీకు నేను ఈ టపా దేని గురించి వ్రాయబోతున్నానో అర్థమయ్యే ఉంటుంది. సరే ఎక్కువగా ఉపోద్ఘాతం ఇవ్వకుండా మొదలుపెడుతున్నాను.

మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" (Desmostachya bipinnata) ముఖ్యమయినది. 
దీనిని ఆంగ్లములో Halfa grass, Big cord grass, Salt reed-grass అనీ ప్రాంతానికి తగ్గట్టు పిలుచుకుంటారు. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లుపూల పానుపు గుర్తుకొస్తుంది) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.

దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.

అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు). కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలు తేజమును కలిగి ఉండుట. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి.


శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః
నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం

అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:
దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!

అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.

వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.

దర్భల కొనలు విడుదల చేసే తేజము - దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణిం అన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.

వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:
విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ 
నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ

ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవడం మరువకండి.

వీటి గురించి ఒక ప్రత్యేక టపా వ్రాయమని కోరిన రాజా గారికి కృతజ్ఞతలతో....

56 comments:

భాస్కర్ కె said...

manchi amsaalanu thiisukoni chakkaga raasthaaru, meeru botony studenta??

Anonymous said...

ఏ విషయాన్నయినా నీవు శోధించి చెప్పే పద్ధతి గణనీయం. గొప్పగ ఉంది.

Anonymous said...

మార్పొచ్చిందే!!!

వి రఘు వర్ధన్ రావు said...

బాగుందండి .................
చాల బాగ చెప్పారు......దర్బల గురించి...............

రాజ్ కుమార్ said...

ఎప్పటీలాగే.. జ్ఞానాన్ని ప్రసాదించేలాగా ఉందండీ మీ పోస్ట్..
నా ఇంకో డౌటేంటంటే.. మీకు తెలిసిన టాపిక్ మీద రాస్తారా??
రాయాలనుకున్న టాపిక్ మీద రిసెర్చ్ చేసి రాస్తారా??

G K S Raja said...

రసజ్ఞ గారూ! ఏ విషయాన్నయినా కూలంకషంగా పరిశోధించి చక్కని, సరళమయిన భాషలో వివరించడం మీకు నెయ్యితో పెట్టిన విద్య. ధన్యవాదాలు. చెడు కలిగించే కిరణాలు ప్రసరించకుండా కాపాడతాయన్నదానికి శాస్త్రీయమైన ఆధారాలు చూపించారు- బావుంది, కానీ రెండు దర్భలు పెద్ద పాత్రపై పెడితే కిరణాలను ఆపగలవా? 'ఏదో తూతూ మంత్రంగా' అన్నమాట బాగా గుర్తెరిగి చెప్పారు. అన్నిటికంటే -- 'బ్రాహ్మణుడు లేదా పురోహితుడు దొరకనప్పుడు దర్భలు పెట్టి కార్యక్రమం చెయ్యవచ్చు' అన్న సూత్రీకరణతో గొప్ప మేలు జరుగుతుంది. ఒక్కో దర్భ పెడుతూ -- ఆసనం సమర్పయామి, పానీయం సమర్పయామి అంటూ చదువుకు పోతూ గడ్డి -- అదే --పవిత్ర దర్భలు -- పెడుతూ కానిస్తుంటాం కదా!! అదే ఒరవడిలో రెండు గడ్డి పరకలు వేసి- పురోహితుల్ని ఉహించుకొంటే-- ఇక చెప్పేదేముంది-- చాలా బరువు తీరిపోతుంది. మీ విషయ సేకరణ కుతూహలానికి మరోసారి జోహార్లు.
రాజా.
gksraja.blogspot.com

మాలా కుమార్ said...

మా ఇంట్లో వినాయకచవితి కి , మా అత్తగారు , మామగారు శ్రాద్ధకర్మలకు దర్భను వాడతాము .
ఉత్తర రామాయణం లో సీతాదేవి కి ముందుగా ఒక కుమారుడే పుడతాడని , సీతాదేవి నీళ్ళకు వెళుతూ , కొడుకును తీసుకొని వెళ్ళగా , అప్పుడే అటొచ్చిన వాల్మీకి ఊయలలో బాబు కనిపించక , ఏ జంతువో ఎత్తుకెళ్ళిందని భావించి , సీతాదేవి బాబు కనిపించక తల్లడిల్లుతుందని భావించి , ఊయలలో ఓ ధర్భ ను వుంచి బాలుని గా మార్చాడని , అందుకే ఆ బాలునికి "కుశుడు " అని పేరు వుందని ఎక్కడో చదివాను .
ధర్భ గురించి బాగా చెప్పారు .

Subrahmanya Sarma said...

రసఙ్ఞగారు..
బాగా రాశారు అయితే, చిన్న సలహా, ఏమనుకోకండి. మీరు టపాలో సాంప్రదాయం వైపునీ, పద్యాలనీ ఎక్కువగా స్పృశిస్తున్నారు. బానే వుంది. అయితే,
//సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో ............ కొన్ని పరిశోధనలలో కూడా తేలింది.// అని రాసేటప్పుడు దానికి దన్నుగా కొన్ని లంకెలను కూడా ఇవ్వండి. అప్పుడు చెప్పేది పటిష్టంగా ఉంటుంది.
ఇలాంటివి, అంతర్జాలంలో వెతకడం మాలాంటివాళ్ల వల్లకాదు. దొరకకపోతే, ఇవన్నీ అబద్ధాలనీ అనుకునే ఆస్కారం ఉంది.

బులుసు సుబ్రహ్మణ్యం said...

సదాశివ రావు గారి పరిశోధన ఆసక్తి కరం గా ఉంది. దాని గురించి రిఫెరెన్స్ ఇవ్వగలరా ?

టపా లో దర్భల గురించి వివరణ బాగుంది.

Anonymous said...

cool info

Subramanya Shastry said...

ఎప్పటిలాగానే, మంచి విషయాన్ని ఎంచుకున్నారు రసఙ్ఞగారు. వివరాలు కూడా బాగానే సేకరించారు. కానీ ఈ టపా మిగతావాటిలాలేదు. కొన్ని పెద్ద తప్పులు దొర్లాయి. "శుకర్మలు" అని రాసారు. నాకు తెలుగులో పెద్ద ప్రావిణ్యం లేదుకానీ ఈ పదం ఎందుకో తప్పుగా తోస్తోంది. (పూర్వకర్మ?)

పితృపూజ, తర్పణాదులను అశుభకార్యాలని రాసారు. ఇది ఖచ్చితంగా తప్పు. వీటిని పితృయాగాలకింద పరిగణిస్తారు.

తప్పులెన్నువారు తండోపతండాలు
ఉర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ

ఇలా తప్పులెంచడం నాకు బొత్తిగా నచ్చదు. కానీ, ఇవి కాస్తంత పెద్దవి కావడంతో సాహసిస్తున్నాను. నొప్పిస్తే క్షమించగలరు.

ఫోటాన్ said...

మీరు మంచి రీసర్చర్ రసజ్ఞ గారు..:)
మీ బ్లాగ్ లో చాలా తెలియని, విలువైన విషయాలు వుంటాయి.

MURALI said...

ఎప్పటిలానే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా.

భారతి said...

అద్భతం. చక్కటి విషయ విశ్లేషణ.

అనామిక... said...

chaala bagundi. informative and interesting

ramki said...

Very informative :)

జలతారు వెన్నెల said...

మీ టపా వచ్చేసరికి, అంతవరకు ఎదో సరదా సరదాగా చదువుతున్న మూడ్ లోంచి బయటికి వచ్చి, ఎదో research paper చదివినట్టు serious గా మనసుని లగ్నం చేసి, చదవాలండి రసజ్ఞ గారు. మళ్ళీ same comment నాది
"Informative!"

రసజ్ఞ said...

@ the tree గారూ
ముందుగా మీకు ప్రశంసకు ప్రణామాలు. నేను బోటనీకి ఇంటర్లోనే తిలోదకాలిచ్చేసానండీ. నాది bionanotechnology అండీ! ధన్యవాదాలు!

@ తాతగారూ
మీకు నచ్చినందుకు నెనర్లు! మరి మార్పు మానవ నైజం, పైగా పరిస్థితికి తగ్గట్టు మారాలి కదా అందుకే తాళం వేసేశా :):)

@ రఘు గారూ
దర్భల గురించి నేను చెప్పింది మీకు నచ్చినందుకు థాంక్స్ అండీ:)

@ రాజ్ కుమార్ గారూ
అమ్మో గుట్టు బయట పెట్టేద్దామనే :) ఎక్కువశాతం తెలిసిన వాటి మీదే వ్రాస్తా. తెలియనివి వ్రాయవలసి వచ్చినప్పుడు అందులో ముందుగా నాకు తెలిసిన విషయాలన్నీ క్రూడీకరించి తరువాత కొంచెం గాలించి అప్పుడు పూర్తి చేస్తా అనమాట అది సంగతి. ఎవ్వరికీ చెప్పకండే ;):) ఇది మనిద్దరి రహస్యం :):) మీ స్పందనకి ధన్యవాదాలండీ!

Anonymous said...

/X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట./
హ్మ్... టీక్ కలపలోనుంచి పోగలిగిన X-raysను ఓ గడ్డినుంచి పోలేదనే అబ్జర్వేషన్ ఆశ్చర్యకరమైన విషయమే!!!

ఎపుడైనా ఫ్లైట్ ఎక్కేటప్పుడు, రెల్లు గడ్డి కూరిన సంచిలో బాక్స్ కట్టర్ దాచుకుని వెళ్ళి, ప్రయోగం చేయాలి. ఆఫ్ఘాన్లో తాలిబాన్లు గజాయి సాగుచేయటం మాని, దర్భ సాగుచేస్తున్నట్టు కలలొస్తున్నాయి నాకు. :))

ఈ విషయమై మిస్టర్ రీచెచ్చి కిశోర్ ఏమంటారో?! :P

రసజ్ఞ said...

@ రాజా గారూ
హహహ! అంటే నేను నెయ్యి ఎక్కువ తింటాననేగా మీ ఉద్దేశ్యం :) రెండు దర్భలు పెద్ద పాత్రపై పెడితే కిరణాలను ఆపగలవా? మంచి ప్రశ్న. ఎండలోకి వెళ్ళేటప్పుడు చర్మం పాడవకుండా sun protection cream వ్రాసుకోవటం మంచిది. మనం SPF 100, SPF 30 ఏది వ్రాసుకున్నా చర్మాన్ని రక్షిస్తుంది కానీ ఏది ఎక్కువ రక్షిస్తుంది? ఏది నిజంగా ఆరోగ్యకరం అన్నది మనకు తెలిసిన నాడు వాడవలసినదే వాడతాం కదా! ఇది కూడా అలానే అనమాట :) "ఉహించుకొంటే" ఈ అవిడియా మరీ బాగుంది. ఊహలే ఉంటే తిండి, నీరు, నిద్ర కూడా అక్కర్లేదేమో అంత బద్ధకస్తులం కదా మరి :):) మీ ప్రశంసా, ప్రోత్సాహకరమయిన వ్యాఖ్యకి కృతజ్ఞతలు.

@ మాలా కుమార్ గారూ
అవునా? ఈ కథనం నేను వినలేదండీ! ఒక క్రొత్త విషయం చెప్పారు. మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!

@ సాలగ్రామ సుబ్రహ్మణ్యం గారూ
మీ సలహాకి నెనర్లు. ఇందులో అనుకోడానికేముందండీ? తప్పక ప్రయత్నిస్తాను. నేను గుర్తున్నంత వరకూ, లేదా ఎప్పుడో చదివినవీ అన్నిటినీ ఒక్క చోట చేర్చే ప్రయత్నంలో వాటిని రిఫర్ చేయటం లేదు. ఇకనుండి వెతికి తప్పక చేర్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలండీ!

@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
సదాశివ రావు గారి పరిశోధన గూర్చి నేను చిత్రం గూర్చి గాలిస్తుండగా దొరికిందండీ. విశ్లేషణ పెద్దగా లేదు కానీ ఇదిగోండి ఆ లంకె ఇక్కడ: http://hareraama.in/articles/srimukha/scientific-reason-for-wearing-darbhapavitram/ మీ స్పందనకు ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ పురాణపండ ఫణి గారూ
మెచ్చి స్పందించినందుకు నెనర్లండీ!

@ తెలుగు భావాలు గారూ
మీరు పెద్దవారు, నన్ను క్షమించమని అడగటం లాంటివి చేయవద్దని మనవి. ఇది తప్పు అని వేలెత్తి చూపించచ్చు, కోప్పడనూవచ్చు. "శుకర్మ" అన్న పదంలో ఉన్న తప్పు ఏదో కాస్త వివరంగా చెప్పమని మనవి. నాకు తెలిసున్నంత వరకూ, శు అనగా మంచి కర్మ అనగా పని. ఆ ఉద్దేశ్యంతోనే నేను వ్రాశాను. మీరు చెప్పినట్టు పితృపూజా, తర్పణాలూ పూర్తిగా అశుభ కార్యాలు కాకపోవచ్చు. కానీ ఇక్కడ నేను ఆ పదం వాడటం వెనుక ఉన్న కారణం: పూజలకీ, శుభ కార్యాలకీ మనం హరిద్రాక్షితలు వాడతాం అలానే తిలల వాడుక ఉండదు. కానీ పైన పేర్కొన్న కార్యక్రమాలకి శ్వేతాక్షితలూ, తిలలు (నువ్వులు) వాడతాం. కనుక దీనిని శుభ కార్యం కానందున అశుభ కార్యం అని చెప్పాను. వీటికీ అపరకర్మలకీ తేడా ఉంది. నా అభిప్రాయంలో తప్పులుంటే తప్పక సరిదిద్ద ప్రార్థన. మీ విశ్లేషణ కోసం ఎదురుచూస్తూ ........ కృతజ్ఞతలు.

@ ఫోటాన్ గారూ
హమ్మయ్యా నేను మంచి రీసర్చర్ అని మీరన్నా గుర్తిచారు ఎంత మంచోరండీ మీరు:) చాలా చాలా థాంక్స్ అండీ!

@ మురళి గారూ
అసలింత ఓపికగా అన్నీ చదువుతూ ఎప్పటికప్పుడు మీ స్పందన తెలియచేస్తున్నందుకు నెనర్లండీ!

రసజ్ఞ said...

@ భారతి గారూ
మీకు నచ్చి, మిమ్మల్ని అబ్బురపరచినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ!

@ అనామిక గారూ
చాలా థాంక్స్ అండీ! మీరు తీరికగా ఇవన్నీ చదవటమే ఆనందం నాకు. ధన్యవాదాలు!

@ రాంకి గారూ
ఇది చదివి స్పందించినందుకు మీకు థాంక్స్ అండీ!

@ జలతారు వెన్నెల గారూ
హమ్మయ్యా బోర్ కొట్టించేస్తోందిరా బాబూ ;):) అనుకోకుండా ఓపికగా చదవటమే కాక స్పందిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండీ!

@ SNKR గారూ
హహహ! మీ వ్యాఖ్యకి తెగ నవ్వేసుకున్నాను. మా క్షేమం కోరి అలాంటి పనులేం చేయకండి మహాప్రభో! అక్కడ మీరు దర్భను సరిగ్గా పరచక రెండు పరకలే వేసి దొరికిపోయి నా పేరు చెప్తే అంతే సంగతులు గోవిందా గోవిందా;) ఇలాంటి కలలేమిటండీ మరీను??? "ఈ విషయమై మిస్టర్ రీచెచ్చి కిశోర్ ఏమంటారో?! :P " ఎందుకండీ ఇలా పిల్లల్ని భయపెడతారు ;):) మీ స్పందనకి ధన్యవాదాలు!

వెంకట రాజారావు . లక్కాకుల said...

'కుశల' టపా లోనూ - పర
వశమగు 'కౌశల్యము' గనపరచి రసఙ్ఞా !
విశదము జేసితి వమ్మా !
ప్రశంశకు తగిన విధమగు రచన యిది సుమా !
----- సుజన-సృజన

రాజ్ కుమార్ said...

ఎక్కువశాతం తెలిసిన వాటి మీదే వ్రాస్తా>>>
మీకు తెలియని విషయాలు మహా అయితే నాలుగైదు, ఉంటాయేమో... అన్ లిమిటెడ్ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుందనుకుంటా మీ మెదడు ;) ;)
అదృష్టవంతులండీ... మీరే కాదు.. మీ బ్లాగ్ ఫాలోవర్స్ కూడా ;)

ramki said...

Avunu.......
Rasagna garu.....naaku eppatinunchoo.....Oka chinna doubt...Ippudu ilaga adigestunna.....pedda doubt ee anukondi... :)
meeru telugu language lo emina special degree lu gatra chesara....
asalu mee telugu chaduvutunte...maa 10th class telugu madam gurthu vastunnaru....ofcourse...aavida kooda intha telugu cheppi vundaru anukuntunna.....
lekapothe ...nenu telugu marchipoyi ina vundali.... :)
oka chinna telugu vakhyam...spashtamina telugu lo rayali ante.....tega alochinchalsi vastondi.... :)
definite ga meeru telugu ni peelchi pippi chesi....rasam tagesinatlunnaru..... :)
nijam cheppali ante....naaku konni telugu padalu ardham kaka...skip kooda chesestunna...like poems...
edithe..em..maa sandehanni nivrutthi cheyyagalaru ani bhavistunna..... :)

వనజ తాతినేని/VanajaTatineni said...

మీ బ్లాగ్ లోకి ప్రవేశించి త్వర త్వరగా చదివేసి ..ఒక కామెంట్ వ్రాసేసి వెళ్ళిపోవడం కష్టం నాకు. ఎందుకంటే..మీరు చెప్పిన విషయాన్ని మెదడు గ్రహించేదాక చాలా సార్లు చదవాలి. అందుకే ఆలస్యంగా ఇలా వస్తూ ఉంటాను. ఎప్పటిలాగానే చాలా ఆసక్తికరమైన,ఎక్కువ సమాచారం ని సౌలభ్యంగా అందించే పోస్ట్. మీ పరిశోధనా శక్తి,మీ ఆసక్తి రెండు అభినందనీయం.
మీదైనా హృదయ స్పందన కల్గిన పోస్ట్ వ్రాసి చాలా రోజులవుతుంది. అలాంటి పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. నాకు రీసెర్చ్ స్కాలర్ రసజ్ఞ పోస్ట్ కన్నా..హృదయం,ఆర్తి ఉన్న రసజ్ఞ పోస్ట్ కావాలి. అవి మీ బ్లాగ్ మొదలెట్టిన తొలినాళ్ళలో ఉండేది. ఇప్పుడు కూడా లేదా అప్పుడప్పుడు అలాటి పోస్ట్ లు వ్రాయండి రసజ్ఞ . అభిమానంతో చెపుతున్న మాటలు ఇవి. అపార్ధం చేసుకోకండి.

Krishna said...

Baundandi.Baga rasaru. As ever, informative.
Oka suggestion: mi tapalaki relevant tags pedite search results lo oche avakasam untundi kada? English lo kuda tags petandi please.

Krishna

UG SriRam said...

రసజ్ణ గారు,
మీరు చాలా పాత విషయాలను కొత్త రీతిలో రాస్తున్నారు. మీ టపాలను చదివి ఎన్నో తెలుసుకొన్నాను.

Unknown said...

రసజ్ఞ గారూ!
ఎన్నో తెలియని విషయాలను .....(హ హా...హెడింగ్ చదివి ఈసారేదో పాట మీద రీసెర్చ్ చేశారనుకున్నాం, నిజంగానే తెలెదండీ, ఒప్పేసుకుంటున్నాం...;)
అర్ధం తెలియకున్నా గుడ్డిగా పాటించే ఎన్నిటినో మీరిలా పరిశోధించి, సంస్కృత కాలం నుంచీ నేటి వర్చువల్ సోషల్ నెట్వర్క్ యుగం దాకా వాటి ఖ్యాతీ, ప్రఖ్యాతీ వివరించి చెప్తూ రాస్తున్న విధానం అభినందనీయం.
మీ రచనలన్నీ కలిపి ఒక CD గానో పుస్తకంగానో వస్తే ఇంకా ఎందరినో చేరుతాయి అనిపిస్తుంది.
అభినందనలు !

రసజ్ఞ said...

@ వెంకట రాజారావు . లక్కాకుల గారూ
మీ ప్రశంసతో కూడిన పద్యపు జల్లులో తడిసి ఆనందించాను. అనేకానేక ధన్యవాదాలు!

@ రాజ్ కుమార్ గారూ
భలే వారే నాకు తెలియనివి చాలా ఉన్నాయి. అందరికీ తెలిసిన ఎన్నో విషయాలు నాకు ఇప్పటికీ చాలా మటుకు అర్థం కావు. ఏవో తెలిసిన నాలుగూ ఇక్కడ పెట్టేస్తున్నా. అసలు నాకు తెలిసినవన్నీ వ్రాసేసాక నా బ్లాగులో ఏం పోస్ట్ చెయ్యాలా అన్న సందేహం కూడా ఉంది :) మీ ప్రోత్సాహానికి చాలా చాలా థాంక్స్ అండీ!

@ రాంకీ గారూ
హహహ! మీరు భలే వారే! నేను ఏ కోర్సులూ చెయ్యలేదండీ. "peelchi pippi chesi....rasam tagesinatlunnaru " మరి నా పేరుకి అర్థం అదే కదండీ ;) సార్థక నామధేయురాలిని అవ్వాలి కదా ;) చాలా చాలా థాంక్స్ అండీ!

@ వనజ గారూ
మీ అభిప్రాయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. ఇందులో అపార్థానికి తావు లేదు. మీరు చెప్పినట్టు వ్రాసే ప్రయత్నం తప్పక చేస్తాను. ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ కృష్ణ గారూ
మీ సలహా బాగుందండీ! తప్పక టాగ్స్ పెడతాను. చాలా థాంక్స్ అండీ!

@ శ్రీరాం గారూ
మీ అభిమానానికి చాలా థాంక్స్ మీ కామెంటు పబ్లిష్ చేయవద్దని అన్నందున చేయలేదు. మీ సలహా కూడా బాగుంది. తప్పక చేరుస్తాను. థాంక్యూ!

@ చిన్ని ఆశ గారూ
హహ! పాటల మీద వ్రాసినా రీసేర్చేనా స్వామీ???? :( మీ అభినందనలకు నా అభివందనం. అమ్మో! నేనింకా చిన్న దానిని అప్పుడే అంత పెద్ద పెద్ద హోదాలు వద్దు. ఆ మాటన్నారు అదే చాలు నాకు. కొండంత బలం వచ్చేసింది. నెనర్లండీ!

శ్రీ said...

"కుశలవుల" మీద మీరు సమర్పించిన పరిశోధనా వ్యాసం...
చాలా బాగుంది రసజ్ఞ గారూ!
@శ్రీ

రవిశేఖర్ హృ(మ)ది లో said...

మన సంప్రదాయం లోని మంచిని ఆధునిక దృక్పధంతో పరిశీలించి వ్రాసారు.చక్కని పోస్ట్.

జ్యోతిర్మయి said...

దర్భ కథ ఇదా..బావుంది రసజ్ఞా...మన పూర్వీకుల జ్ఞాన సంపదను మనం ఏ విధంగానూ ఉపయోగించుకోలేక పోతున్నాం కదూ...

రసజ్ఞ said...

@ శ్రీ గారూ
మీ వ్యాఖ్యకి ఎలా స్పందించాలో కూడా తెలియటం లేదు నాకు :( అసలు నేను ఈ టపాలో ఎక్కడా కుశలవుల పేరు ఎత్తనే లేదు. వ్యాఖ్యల్లో మాలా కుమార్ గారు దీని గురించిన ఒక చిన్న కథ చెప్పారు అంతే! మీ స్పందనకి ధన్యవాదాలు!

@ రవి శేఖర్ గారూ
మీకు నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ!

@ జ్యోతిర్మయి గారూ
నిజమేనండీ! ఉపయోగించుకోలేక పోవటమే కాదు అపహాస్యం కూడా చేస్తున్నాం. ఏం చేస్తాం కలికాలం. మీ స్పందనకి ధన్యవాదాలండీ!

శ్రీ said...

రసజ్ఞ గారూ!
దర్భల ఒక చివరను కుశ
అని రెండవ చివర లవ అంటారు...
లవకుశలు పుట్టినపుడు వాల్మీకి మహర్షి
ఒకరిని లవతో వేరొకరిని కుశతో తుడిచినందువలన
వాళ్ళిద్దరికీ ఆ పేర్లు వచ్చాయి...
అందుకే రెండు చివర్లు కలిసిన దర్భల గురించి చెప్పారని అలా వ్రాసాను...
గమనించగలరు...
@శ్రీ

రసజ్ఞ said...

@ శ్రీ గారూ
మీరు నన్ను మన్నించాలి. మీ "కవి" హృదయాన్ని అర్థం చేసుకోలేదు.
నిజమే వారిద్దరి పేర్లూ దర్భను బట్టీ పెట్టినట్టు వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో ఉంటుంది. కృతజ్ఞతలు!

లక్ష్మీ శిరీష said...

రసజ్ఞ గారు...
మీ బ్లాగ్ చాలా బాగుంటుంది అండి. చాలా కొత్త విషయాలు తెలుస్తాయి ! మీరు ఇంత ఓపిక , తీరిక చేసుకుని .. నా లాంటి వాళ్ళందరికీ ఎన్నో తెలీని విషయాలు తెలియచేబుతున్నందుకు ...చాల చాలా ధన్యవాదాలు !! :)

రసజ్ఞ said...

@ లక్ష్మీ శిరీష గారూ
మీ అభిమానానికి కృతజ్ఞతలండీ! మీకు నచ్చినందుకూ, చదివి ఆదరిస్తున్నందుకూ మీకు కూడా ధన్యవాదాలు!

madhavarao.pabbaraju said...

శ్రీ రసజ్న గారికి, నమస్కారములు.

వివరణాత్మక వ్యాసం. అభినందనలు. శుభకార్యాలేకానీ, అశుభకార్యాలనేవి ఏవీ లేవని నా భావన. పెళ్ళి, ఉపనయనం, మాతృ,పితృ పూజ, గృహప్రవేశం ఇత్యాదివాటిని మనం శుభ కార్యాలంటాము. అదే అపరకర్మలను చేసేటప్పుడు అశుభకార్యాలంటాము. అదే నిజమైతే, వివాహ సమయంలో, `నాంది' అనే ఒక కార్యక్రమం జరుపుతారు. ఇక్కడ, చనిపోయిన మాతృ, పితృ దేవతలందరినీ ఆహ్వానించి, పూజించి, వధూవరులకు శుభం కలుగచేయమని కోరుతారు. ఇది అశుభకార్యం అయితే, పెళ్ళిలో చేయరుకదా! శ్రీశ్రీ కూడా, `మన దేశంలో (భారత దేశంలో) చావుకూడా పెళ్లిలాంటిదే' అని వ్రాశారు. నిజమే మరి! మీరేమంటారు?

మీ స్నేహశీలి,
మాధవరావు.

రసజ్ఞ said...

@ మాధవరావు గారూ
నమస్కారమండీ! ముందుగా మీ అభినందనలకు నా అభివాదాలు!
ఈ వ్యాసంలో శుభ, అశుభ కార్యాలు అనే పదాలు నేను ఏ ఉద్దేశ్యంతో వాడానో తెలుగుభావాలు గారి వ్యాఖ్యకు ప్రతిస్పందనగా బదులిచ్చాను. ఒకసారి చూడ ప్రార్థన. అపరకర్మలకీ, పితృదేవతల పూజలకీ చాలా తేడా ఉందండీ! అపరకర్మలు అనగా మనిషి చనిపోయిన పన్నెండు రోజులదాకా చేసేవి. వాటిని మైలుతో చేస్తారు. అవి అస్సలు మంచివి కావు ఎందుకంటే చనిపోయినవారు ఈ పన్నెండు రోజులూ ప్రేతాత్మలుగా తిరుగుతారు. ఆ తరువాత ఈ అపరకర్మల కార్యక్రమాలు అయ్యాక వాళ్ళు పితృదేవతల స్థానాన్ని పొందుతారు. అప్పుడే వారు దేవతా గణాలలో చేరగలరు. మీరు చెప్పినట్టుగా ఉపనయన సమయములో నంది ముఖం, వివాహ సమయములో స్థాలీ పాకం అప్పుడు పితృదేవతలను ఆహ్వానిస్తారు. వారి ఆశీస్సుల కోసం. అలానే మీరు చెప్పిన ఈ నాంది అనే కార్యక్రమాన్ని అంకురార్పణగా చేస్తారు. పితృదేవతలను దేవతా గణాలుగా భావించి వివాహాది కార్యాలకు ఆహ్వానించినా; తద్దినాలు, తదితరములు శుభ కార్యాలు కాదు అని నా అభిప్రాయం. ధన్యవాదాలు!

madhavarao.pabbaraju said...

శ్రీ రసజ్నగారికి, నమస్కారములు.

మీ సమాధానానికి నెనర్లు. ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు మీతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. క్షమించండి. మీరు సంస్కృతం బాగా చదువుకున్నారు, లోతుగా విషయాన్ని పరిశీలన చేస్తారు కాబట్టి, ఆ కోణంలో ఆలోచించి చూడండి.
* అపర కర్మలకు, పితృదేవతల పూజలకీ తేడావుందన్న విషయంలో నేనుకూడా ఒప్పుకుంటాను. అపర కర్మలు మైలతో చేస్తారని; అవి అసలు మంచివి కావని అన్నారు. మైలబడింది మనమా? చనిపోయినవారా? రక్తం, చీము, ఇతర మలినాలతో కూడినది ఈ బతికివున్న శరీరం. అవి మనలో వున్నంత వరకూ మనం మైలతో వున్నవారమే. ఒకసారి ఈ బతికివున్న శరీరంనుండి విముక్తి (మరణం) పొందినప్పుడు, ఆ శరీరం కాల్చబడి, మలినాన్ని పూర్తిగా పోగొట్టుకుంటుంది. ఇక, ప్రేతాత్మ అన్నారు. అంటే చనిపోయినవారి ఆత్మ అని అర్ధం. ఆత్మకూ ఏదీ అంటదు; అమలము; నీరు తడుపజాలదు... మొదలైన విశేషణాలు గీత ద్వారా చెప్పబడివున్నాయి.
* నిన్నటివరకూ ప్రేమతో అమ్మా, నాన్న, అక్కా, అన్నా అని పిలవబడినవారే, నేడు చనిపోతే, వారు అంటరానివారుగా మారిపోతారా? తల్లి, తండ్రీ వీరిరువురూ బతికివున్నప్పుడు, చనిపోయిన తరువాతకూడా దేవతా స్థానాన్నే కలిగివుంటారు. `దేవత' అంటే, మనం అడిగినదాన్ని ఇవ్వగల తేజోమూర్తులు అని అర్ధం. మనకు శరీరాన్ని, జీవితాన్ని ఇస్తున్నారు. అందుకనే వారిని, బతికివున్నప్పుడే, మాతృదేవోభవ; పితృదేవోభవ అని సంభోదిస్తాము. వారు చనిపోయిన తరువాతకూడా అదే స్థానాన్ని కలిగివుంటారు. కాబట్టే,తత్ దినాన్ని మనం గుర్తుచేసుకుంటాము; వారిని పూజిస్తాం. అంటే, బతికివున్నప్పుడు, చనిపోయిన తరువాతకూడా వారు పూజింపబడే అర్హత, స్థానాన్ని కలిగివున్నవారే. మంచి, చెడు; శుభాశుభాములు మనకు మనంగా కల్పించుకున్నవే. ఇవి కాలమానపరిస్థితులనుబట్టి మారిపోతుంటాయి. అతెందుకు, కొన్ని ధర్మాలుకూడా మారిపోతుంటాయి. అయితే, మూల ధర్మాలు మాత్రం మార్పు చెందవు అని భావన.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మాధవరావు గారు,
నమస్కారములు. మీ చర్చలో కల్పించుకుంటున్నందుకు మన్నించండి.
కుటుంబంలో వారు చనిపోయినపుడు చేసే కర్మలు, ఫలాన రోజున చనిపోయారని తలచుకుంటూ చేసే తత్ దినాల్లో దుఃఖం ఎక్కువగానో, కొన్ని సార్లు తక్కువగానో ఉంటుంది. పక్కనున్న వారు దుఃఖంతో ఉంటే , పరాయివారికైనా మనసు పాడవుతుంది. లేదా కనీసం ఉరకలు వేసే ఉత్సాహం ఉండదు.
అదే పెళ్ళి లాంటి కార్యక్రమాల్లో నాంది చేసి పెద్దలను తలచుకున్నా అది వారి ఆశీస్సుల కోసమే, దుఃఖం ఉండదు. ఒకవేళ మరీ దగ్గరివారై పెళ్ళిచేసుకునే వారికి తల్లి,దండ్రి అన్న,అక్క అయి, దుఃఖం వచ్చినా అదికొద్దిసేపే. సంతోషం దుఃఖాన్ని డామినేట్ చేస్తుంది. లేదా పక్కనున్న వారు కూడా సులభంగా అనునయించి/ జోక్స్ వేసి దుఃఖాన్ని పోగొట్టగలరు.
మీరు ఇవన్నీ తెలియని వారు కాదు.
ఇప్పుడు చెప్పండి అపరకర్మలు అశుభాలనీ, వివాహాదులను శుభాలనీ అనవచ్చు కదా. ఇవన్నీ ఆధ్యాత్మిక దృష్టితో పెట్టిన పేర్లు కాదుకదా, లౌకిక జీవనములోని వారు పెట్టినవే. మైల విషయంలో మీరు చెప్పినదంతా కరెక్టే. కాని మైల అని మిగతా వాళ్ళని వాళ్ళ దుఃఖం ప్రభావితం (మానసికంగా) చేయకుండా ఉంచటానికి పెట్టిన మాట అంతే.
తప్పుగా వ్రాసి ఉంటే మన్నించండి.

Anonymous said...

మాధవరావు గారు,
రసజ్ణ మంచి రచయితే కాని కర్మలు అపరకర్మలు అనే వాటిని చర్చించేటంత వయసు,అనుభవం లేదు. ఆ అమ్మాయి చెప్పినదానిలో నాకు తప్పేమి కనపడలేదు. అలాగే మీరు చెప్పినదానిలో తప్పు కనపడటంలేదు. వయసు,నమ్మకం, అనుభవాలను బట్టి ప్రపంచం చూసే కోణం ఎప్పుడు మారూతూంట్టుంది. కర్మ, అపరకర్మ, తత్ దినం లా చర్చ ఇంతటి తో ముగిస్తే బాగుంట్టుంది.

Anonymous said...

/ఇక, ప్రేతాత్మ అన్నారు. అంటే చనిపోయినవారి ఆత్మ అని అర్ధం. /

మాధవరావు గారి లేవనెత్తిన ప్రశ్న, ఆ పైన రసజ్ఞ గారిచ్చిన వివరణ బాగుంది.

మాధవరావుగారు, ప్రేతాత్మ = ఆత్మ అంటున్నారా?

అనానిమస్ 'తత్' అంటేనే బెంబేలెత్తిపోతున్నారు, పుట్టిన ప్రతి వారికి తప్పనిది, వుండాల్సిందీ ఆ 'తత్' మరి! :)

Anonymous said...

ఆ అమ్మాయి ఎదో ముచ్చటగా తెలిసింది రాస్తే, వయసులో పెద్దవారైన మీరు చదివినదానితో ఊరు కోకుండా మళ్లి ఆత్మ, ప్రేతాత్మ అని చర్చ ఒకటా? అసలికి ఆత్మ లేదు ఎమీ లేదు. మళ్లీ ప్రేతాత్మ ఒకటా? పోని ప్రేతాత్మ అనేది ఉందని మీరు అనుకొన్నా, అది ఆత్మ గా ఉంట్టునపుడు ఎమి చేస్తూకూర్చుంది? మనలాగే అంత తిండి తిని, ఆ తినటాని కొరకు ఆదేశం ఈ దేశం తిరిగి ఇంగ్లిష్ చదువులు చదివి, బ్లాగులు రాసుకొంట్టుండేది. ఇక ఈ ఆత్మ గాడు ఎవరైనా రాజకీయ నాకుడు దేశాన్ని దోస్తే నిస్సహాయంగా చూస్తూ బ్లాగులో చేరి వాద ప్రతివాదానలు చేసుకొంట్టు, వ్యాఖ్యలు రాసుకొంట్టు కాలం గడుపుతుంది. ఇది చనిపోయి ప్రేతాత్మ అయ్యాక తేజోమూర్తులు గా మారి మనం అడిగినదాన్ని ఇవ్వగలదా?

Anonymous said...

ఏమంటివి? ఏమంటివీ? ఆజ్ఞాత ఇది జ్ఞాన పరీక్ష కాని, వయో పరీక్ష కాదే! కాదు, కాకూడదూ... ఇవి చెప్పిన మీ వయసెంత? అని ఆయన ఆడిగారా? అడిగినా మీరు చెబుతారా? వయో పరిమితులు స్టేట్ గవర్నమెంటు వుద్యోగాలవంటివాటికే పరిమితం అని మీరు ఒప్పుకోవాలి. జ్ఞానోపార్జన్ కేలియే వయసు నహీ హై అని కబీర్ దాస్ ఏదో ద్విపద చెప్పాడు, గుర్తులేదు.

ఆయన కూడా ముచ్చటగానే ముచ్చటగా రాసిన దానిపై ముచ్చటించారు. ఇక్కడ రాసిన మేటరుపై మాత్రమే చర్చ, రాసిన వారి జన్మతేదీపై కాదు. అజ్ఞాత వయోరిజర్వేషన్ వాదన సరైనది కాదు. :)

Snkr

Anonymous said...

"ఇక్కడ రాసిన మేటరుపై మాత్రమే చర్చ"

మంచిదే. ఈనాడు,జ్యోతి పేపర్లలో రోజు చాలా రాస్తారు. వాళ్లని రాసిన వాటిలో ఎన్నిమార్లు నిజానిజాలు ప్రశ్నించారు? ఊరకనే జ్ఞానోపార్జన చేసి ఎమీ చేస్తారు? మనిషికి వాడు చేసే పనికి తగిన జ్ణానం,సంపాదించుకోవటం అవసరం అంతే. చచ్చిన తరువాత ఏమౌతాను? ప్రేతాత్మ ,పిత్రుదేవతల గా మారుతానా? ఎప్పుడు మారుతాను? ఈ ప్రశ్నలకి అంత ఉందా.

ఈ మధ్య మునుపటిలాగా ఇళ్లలో తత్ దిన్నాలు పెడుతున్నట్లు లేరు. ఆ రోజు మాత్రమే చేసే ప్రత్యేక వంటకాలన్ని గుర్తొచ్చినట్లు ఉన్నాయి మీకు, అందువలన దాని ప్రత్యేకతను చర్చించాలని తెగ ఊవ్విళ్ళూరు తున్నారు. చూడబోతే మీరు శంకర్ వైదికి లాగునట్లున్నారు :)

"అనానిమస్ 'తత్' అంటేనే బెంబేలెత్తిపోతున్నారు"

నేను పుడితే కదా! చావు గురించి తలచుకొని బెంబేలెత్తి పోవటానికి ? :) :)

రసజ్ఞ said...

@ మాధవరావు గారూ
నమస్కారమండీ! ఆలస్యముగా స్పందిస్తున్నందుకు మన్నించాలి. నేను సంస్కృతం కొద్దిగానే నేర్చుకున్నానండీ! అంత బాగా తెలీదు నాకు.
సరే ఇహ మీరు చెప్పినట్టు ఆధ్యాత్మిక దృష్టితో చూద్దాం అంటే అలానే నాకు తెలిసున్న మేరకు వివరణ ఇచ్చుకుంటాను. ఆత్మ గురించి మీరు చెప్పినవన్నీ సరి అయినవే. ఆత్మకు ఏదీ అంటదు. వాస్తవమే కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలను చెప్పుకోవాలి. కాళిదాసు "రఘువంశం"లో ఇక్ష్వాకు ప్రజలు అందరూ జ్ఞానులు అని వర్ణిస్తూ
"బాల్యే అభ్యస్త విద్యానాం యౌవ్వనే విషయైషినాం
వార్ధకే మునివృత్తీనాం యోగినాంతే తనుత్యజాం" అంటాడు. బాల్యములో విద్యలభ్యసించి, యవ్వనంలో గృహస్తాశ్రమం స్వీకరించి భోగాలననుభవించి, వృద్ధాప్యంలో వానప్రస్థానికని ముని వృత్తిని చేపట్టి, చివరగా అన్నీ సన్యసించిన వీరి ఆత్మ (యోగాభ్యాసము వలన) శరీరాన్ని వదిలేసి బ్రహ్మరంధ్రము ద్వారా మోక్షాన్ని పొందుతుంది. ఇది క్రమ ముక్తి. ఈ క్రమ ముక్తి ద్వారా ఎవరి ఆత్మయితే శరీరాన్ని వదిలేస్తుందో అటువంటి ఆత్మకి మాత్రమే మీరు చెప్పినవేమీ అంటవు. అందువలననే సన్యసించినవాళ్ళు దేహమును వదిలేస్తే దానికి కర్మ కాండలు, దహన సంస్కారాలు, వారి కుటుంబీకులు మైలు, మొదలయినవి చేయవలసిన అవసరం లేదు. కానీ మమకారాలు పోకుండా, ఈ క్రమ ముక్తిని దాటకుండా భోగాలను అనుభవిస్తూ చనిపోయినవారికి, అనగా బ్రహ్మ జ్ఞానము పొందని వాళ్ళ ఆత్మలకి ఈ పవిత్రత ఉండదు కనుక ప్రేతం అవుతుంది. ఆ ప్రేత విముక్తి కోసం చేసేవి కర్మ కాండలు. అప్పుడు ప్రేత విముక్తి పొందిన ఆత్మ పితృ దేవతలుగా మారుతుంది. మీరు చెప్పిన ఆత్మ పవిత్రత కేవలం క్రమ ముక్తి పొందిన బ్రహ్మజ్ఞానులకి, సన్యాసులకి (దొంగ సన్యాసులకి కాదు) మాత్రమే ఉంటుంది. ఈ ప్రేతం అందరినీ పట్టి పీడించకుండా ఆ కుటుంబీకులకు మాత్రమే మైలు అనేది పెట్టారు. ఈ వివరణలు కూడా గీతలోనే చెప్పి ఉన్నాయి.
చనిపోయినా, బ్రతికున్నా వారిని పూజిస్తునే ఉన్నాం, ఉంటాం కూడా. కాకపోతే కొన్ని ఆ పద్ధతులలోనే చెయ్యాలి. మీరన్నట్టు వివాహాలూ, తద్దినాలూ రెండూ మంచివే అనుకుంటే తద్దినాలు, పితృ పూజలు పచ్చని మామిడి తోరణాలు కట్టి, క్రొత్త బట్టలు వేసుకుని, కాళ్ళకి పసుపు పారాణి వ్రాసుకుని ఎందుకు చేసుకోరు? తద్దినాలకి వంట చేసేటప్పుడు కూడా తడి బట్టతో, బొట్టు లేకుండా వండుతారు. మరెందుకీ వైవిధ్యం? ఎందుకంటే అవి శుభం కాదు కనుక. మీ స్పందనకు ధన్యవాదాలండీ!

రసజ్ఞ said...

@ లక్ష్మీ దేవి గారూ, @ అజ్ఞాత గార్లూ, @ SNKR గారూ
వ్యాఖ్యానించిన అందరికీ ధన్యవాదాలు!

madhavarao.pabbaraju said...

శ్రీ రసజ్న గారికి, నమస్కారములు.

మీ ప్రతిస్పందనకి ధన్యవాదాలు. ఇంకా ఇతర స్నేహితులకి కూడా నా ధన్యవాదాలు. అయితే, మీరిచ్చిన సమాధానాలతో నేను పూర్తిగా సంతృప్తి చెందలేదు. ఎందుకంటే ఇందులో చాలా విషయాలపై సుదీర్ఘ చర్చ జరగాల్సింది వున్నది. అది ఈ మాధ్యమం ద్వారా వీలుకాదు. కాబట్టి ఈ చర్చను ఇక్కడితో మిగిస్తాను నా తరుపునుంచి. మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మీ నుంచి మరిన్ని చక్కటి వ్యాసాలు రావాలని ఆశిస్తూ,
మీ స్నేహశీలి,
మాధవరావు.

రసజ్ఞ said...

@ మాధవరావు గారూ
నమస్కారమండీ! భలేవారే! తప్పకుండా, మన చర్చను నేను అపరకర్మలు, తదితరాల మీద టపా వ్రాసినప్పుడు కొనసాగిద్దాం. నా ప్రయత్నం నేను చేస్తానండీ! మీ అభిమానానికి ధన్యవాదాలు!

Subramanya Shastry said...

You may choose not to publish this comment.

There are very few who have interest in such topics and of those only few can delve to such depths with inquisitive interest. Hence I do not want to, even remotely, make you feel penalized for taking interest in such a topic.

"ఈ ప్రేతం అందరినీ పట్టి పీడించకుండా ఆ కుటుంబీకులకు మాత్రమే మైలు అనేది పెట్టారు" On similar grounds, when someone is born in a family, similar social isolation is followed. Now I hope you'd agree that arrival of a new member in the family by virtue of birth isn't inauspicious?

Basically if I understood you correctly, you are implying that since "ఎందుకంటే అవి శుభం కాదు కనుక” they are "అశుభం." Perhaps this is where the flaw is.

Let's take an example. "I am not in angry mood" does not necessarily mean that "I am in good mood!"

Something which is not auspicious doesn’t necessarily imply being inauspicious. If time permits, I’d attempt a post on this topic from social perspective. The reason for me trying to stress on correct projection - is the fear of people thinking of "పితృ కర్మ" as inauspicious. Already there is considerable disinterest in these ceremonies and people may just find another lame excuse which of course is not your intention.

రసజ్ఞ said...

@ తెలుగు భావాలు గారూ
ఇది అభ్యంతరకరంగా లేనందున ప్రచురించాను.
మీరు అన్ని రకాల మైలునూ కలిపేసి ప్రశ్నిస్తే నేనేం చెప్పగలనండీ, పురిటిశూల, చావు మైలు, మీరు చెప్పినట్టుగా ఇతరేతర social isolation అన్నిటినీ ఒకేలా చూడలేం కదా!
విషయానికొస్తే, నేను దర్భల గురించి వ్రాస్తూ, వాటి ఉపయోగాల్లో అపర్కర్మలు, పితృ తర్పణాలు, మొ., ఉండటం వలన వాటి పేర్లు మాత్రం వ్రాసాను తప్ప నాకు అవంటే ఆసక్తి ఉండి కాదు. అయినా నాకు తెలిసినంతలో నేను వివరణ ఇచ్చుకున్నాను. మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను అక్కడ వాడిన ఉదేశ్యం అపరకర్మలు (పూర్తిగా అశుభాలు), పితృ కర్మలు (శుభాలు కావు కనుక) అశుభం అని వాడాను, అది తప్పయితే సరిదిద్దండి అన్నాను. నిజమే మీరు చెప్పినట్టు విచారంగా లేను అంటే ఆనందంగా ఉన్నాను అని కాదు. దానినే ఇక్కడి సందర్భానికి ఆపాదిస్తే శుభాలు కావు కనుక పితృ కర్మలు అశుభాలు అనటం తప్పన్నారు సరే ఒప్పుకుంటాను. మరి ఇవి శుభాలు, అశుభాలు కాకుండా మధ్యలో ఉన్నాయి కనుక ఏ పదం వాడాలో నాకు తెలియలేదు, మీరే అలా రెండూ కాకుండా మధ్యస్తంగా ఉన్నవాటిని ఏమంటారో తెలియచేసి ఉంటే నాకు నేర్చుకునే, సరిదిద్దుకునే అవకాశం ఉంది కదా! కనుక, తప్పకుండా మీకు వీలున్నప్పుడు వీటి మీద ఒక ప్రత్యేక వ్యాసం వ్రాసినప్పుడు ఇలా మధ్యస్తంగా ఉండే కర్మలని ఏమంటారో వివరిస్తూ వ్రాస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి వ్యాసం మీ నుండీ త్వరలోనే రావాలని ఆశిస్తూ ఎదురుచూస్తుంటాను.

SRISANKARABHARATHI said...

asubha karyam anadam kante pitrukaryam anadam sababu.

Anonymous said...

Hi my friend! I wish to say that this post is amazing, nice written and come
with almost all important infos. I would like to peer more posts like this .


My website: dating sites (http://bestdatingsitesnow.com)