Sunday, May 06, 2012

జగన్నాథ పండితరాయలు


పండితులకే పండితునిగా, గురువులకే గురువుగా, ప్రభువుల అభిమాన కవిగా, అలంకారికులలో అగ్రగణ్యుడై, ఇతర దేశ రాజులను సైతం తన కవిత్వమనే వ్యసనానికి బానిసలను చేసిన ప్రఖ్యాత సంస్కృత కవి జగన్నాథ పండితరాయలు. ఈయన పేరు విన్నా, వినకపోయినా ఈయన వ్రాసిన "రసగంగాధర"మనే అలంకార శాస్త్రాన్ని వినని వారు ఉండరేమో! అలంకార శాస్త్రంలో ఈయనని మించిన వారు లేరు అన్న ఖ్యాతిని గడించిన మహానుభావుడు. చక్కని, ఇంపయిన పద్య రచన ఈయన సొంతం. ఈయన దక్షిణ భారత దేశ కవి అయ్యుండీ, ఉత్తర భారత దేశంలో ఎక్కువ కీర్తిని గడించారు. జీవితంలో (ఆ కాలంలోనే) మతాంతర ప్రేమ వివాహం చేసుకుని, తరువాత తప్పు చేసానే అన్న పశ్చాత్తాపంతో గంగలో ఐక్యమయిన మహనీయుని జీవితంలోని కొన్ని ఘట్టాలను మీ ముందుకి తెచ్చే ప్రయత్నమే ఈ టపా. 
వివరాల్లోకి వెళితే, ఈయన తూర్పు గోదావరి జిల్లా ముంగండలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడని అంటారు. ఈయన తన కవిత్వమనే కత్తికి, పాండిత్యమనే సాన పెట్టి, ఏక సంతాగ్రాహమనే ఒరలో బంధించి, భారత దేశంలోని పండితులందరినీ తన పాండిత్యంతో ఓడించి రాజులందరి వద్దా ప్రశంసలు పొందాలనే యోచనతో బయలుదేరారుట. అలా అందరినీ జయించి, ఎన్నో సత్కారాలను పొందుతూ ఢిల్లీలోని ఒక సత్రములో బస చేసారుట. ఉదయమే సంధ్యావందనాదులు చేసుకోవడానికి ఒక చెఱువు వద్దకు వెళ్ళే సమయానికి ఇద్దరు ఘార్జర (గుజరాతీయులు) స్త్రీలు గొడవ పడుతున్నారుట. భాష అర్థం కాని ఈయన తన పని ముగించుకుని సత్రానికి చేరుకున్నారుట. గొడవ పడిన ఇద్దరిలో ఒకామె తనకి న్యాయం చెయ్యవలసినది అంటూ అప్పటి ఢిల్లీ రాజయిన షాజహాన్ కి విన్నవించుకుందిట. ఆయన ఇరువురి స్త్రీల వాదన విని, ఒక నిర్ణయానికి రాలేక సాక్షులెవరయినా ఉంటే చెప్పండి అని అడుగగా వీరిద్దరూ ఒక బ్రాహ్మణ పండితుడు వచ్చాడని చెప్పగా ఆయనని సభకు రాప్పించారుట. మొత్తానికి విషయం ఈయనకి అర్థమయ్యేలా మంత్రిగారు వివరించగా, ఈయన నాకు భాష రాదు కానీ మొదటామె ఇలా అంది, రెండవ ఆమె ఇలా అంది అంటూ విన్నది విన్నట్టు చెప్పారుట. అది మరి ఆయన గ్రాహక శక్తి. దీనితో అత్యంత ఆశ్చర్యచకితుడైన రాజు ఆయనని బ్రతిమాలి మరీ ఆయన ఆస్థానములో కవిగా నియమించుకున్నారుట. ఇలా ఆయన మొఘలు ఆస్థానములో కవిగా స్థిరపడ్డారు. అందుకే కాళిదాసు "న రత్న మన్విష్యతి మృగ్యతే హి తత్" (అనగా రత్నం ఎవ్వరినీ వెతుక్కోదు, రత్నాన్ని మనం వెతుక్కుంటాం) అని అంటారు.
క్రమేణా జగన్నాథునికి కూడా రాజుగారంటే మక్కువ పెరిగింది. ఎన్నో సందర్భాలలో వీరి ప్రతిష్ఠను నిలపెట్టి రాజుగారికి మరింత ఆత్మీయుడయ్యారు. ఇలా వీరిరువురి బంధం మరింత ధృఢమై ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారుట. అటువంటి సందర్భంలో ఒక రోజు రాజు గారు నా గుర్తుగా ఎప్పటికీ మీ వద్ద ఉండేందుకు ఏం కావాలో కోరుకోమన్నారుట. వెంటనే జగన్నాథుడు "ఇయం సుస్తనీ మస్తక న్యస్త హస్తా లవంగీ సదంగీ మదంగీకరోతు" (అనగా ఇక్కడే చక్కగా తిరుగుతూ, తల మీద ఉండే బురఖాని అస్తమానూ సరిచేసుకునే అలవాటున్న అతి రమణీయమణీ, నీ పుత్రికా అయినటువంటి "లవంగి"ని నాకు భార్యగా ఇవ్వండి) అని అన్నారుట. ఆ పదాల పోహళింపు చూడండి ఎంత బాగుందో! విన్న వెంటనే రాజు నిశ్చేష్టుడయ్యి, ఏమి మాట్లాడాలో తెలియక, లేచి వెళిపోయారుట. మనసులో రాజుకి జగన్నాథుడంటే ఇష్టం ఉన్నా, "వివాదశ్చ, వివాహశ్చ సమయో రేవ శోభతే" (అనగా వివాదమయినా, వివాహమయినా సమ ఉజ్జీల మధ్యనే చెల్లుతుంది; దీనినే వియ్యానికయినా, కయ్యానికయినా సమ ఉజ్జీలు ఉండాలి అని మార్చారు) అని అంటారు. నా వద్ద విలువయిన సంపద ఉంది, అతని వద్ద వెలకట్టలేని పాండిత్యం ఉంది అనుకుంటూ ఏమీ పాలుపోక తన భార్యని అడుగగా వద్దని చెప్పిందట. తన కూతురినే అడుగగా మౌనం వహించిందట. మంత్రులు, ఇతరులు అందరూ మౌనంగా ఉండటంతో జగన్నాథుడు అల్లుడయితే తన ముస్లిం సోదరులు తనని చులకనగా చూస్తారు, అలానే జగన్నాథుని వైపు వారు కుల భ్రష్టుడిని చేస్తారు కనుక వారిద్దరికీ వివాహం చేయడం మంచిది కాదు అనుకుని అతనికి దేశ బహిష్కార శిక్ష వేసి పంపేశాడు రాజు.

"విద్వత్త్వం చ నృపత్త్వం చ నై న తుల్యం కదాచన
స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే"

పాండిత్యమూ, రాజరికమూ ఎన్నటికీ సమానం కావు. కానీ రాజయిన వానికి తన దేశంలోనే గౌరవం ఉంటే, విద్వత్తు ఉన్న పండితునికి ఎక్కడయినా గౌరవం లభిస్తుంది, ఎక్కడయినా పూజింప బడతాడు అని అనుకుంటూ బాధతో ఆ దేశము నుండి వెళిపోతాడు. మరొక రాజు వద్ద కవిగా స్థిరపడినా, షాజహాన్ మీద మమకారం మాత్రం ఎన్నటికీ పోలేదు. ఆయన నుండి దూరమయిన బాధతో ఉన్న రోజుల్లోనే ఈయన "రసగంగాధర" అనే అలంకార శాస్త్రాన్ని రచించారు. ఎటువంటి బాధనయినా నయం చేసే ఏకైక మందు గ్రంధ రచనం అని ఈయన అంటారు. షాజహాన్ కూడా ఈయనని మరువలేక, క్షేమ సమాచారాలని తెలుసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రాజు సన్మానం చేయగా దానిని చూసిన జగన్నాథుడు

"ఢిల్లీశ్వరో వా జగదీశ్వరో వా మనోరథాన్ పూరయితుం సమర్థః
అన్యై ర్నృపాలైః పరిదీయమానం శాకాయ వా స్యా ల్లవణాయ వా స్యాత్"

ఈ లోకంలోని కవుల మనసుని గ్రహించి, వారి ప్రతిభకు తగ్గ పారితోషకం ఇవ్వగలిగినది ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు. వారే పరమేశ్వరుడు మరియు మా ఢిల్లీ పాదుషా గారు. మిగతా రాజులు సన్మానానికి ఇచ్చినది కేవలం కవుల ఇంటిలో కూరల ఖర్చుకి కానీ ఉప్పు ఖర్చుకి కానీ సరిపోతుంది అని అన్నారుట. ఈ విధముగా తన వేగుల ద్వారా ఈయన సమాచారాలను తెలుసుకుంటున్న షాజహాన్ ఈయన పరిస్థితి అంతగా బాలేదనీ, తను దేశ బహిష్కారం చేసినా కూడా ఎటువంటి కోపమూ లేక తన పరోక్షంలో కూడా తనని మెచ్చుకోవటం చూసి మళ్ళీ తన వద్దకే పిలిచి తన కూతురయిన లవంగిని ఇచ్చి వివాహం చేశారు. అలా ఆయన తన ప్రేమలో గెలిచి ప్రేయసి చేతిని అందుకున్నారు. వివాహమయిన తరువాత చాలా కాలం వారిరువురూ సంతోషంగానే ఉన్నారు. కానీ మెల్లిగా ఒకరి కోసం ఒకరు కొన్నిటికి దూరమవటం నచ్చక, అన్య వర్ణ-జాతి-మతస్కురాలిని వివాహ మాడటం వలన తను కొన్ని యజ్ఞ యాగాదులకీ, మరికొన్ని ముఖ్యమయిన పూజలకీ దూరం కావటం తట్టుకోలేక మనసులోనే రోదించసాగాడు. కానీ తన భార్యకి మాత్రం ప్రేమానురాగాలలో ఏ లోటూ రానీయలేదు.

ఈయన ఇతర ముఖ్య రచనల గురించి ఒకమారు చెప్పుకోవాలి. అవే చిత్రమీమాంసఖండన (అయ్యప్ప దీక్షితులు గారు అర్థాలంకారాల గురించి రచించిన చిత్రమీమాంస అనే రచనను ఖండిస్తూ వ్రాసినది), అసఫవిలాస, జగదాభరణ (జగత్సింగ్ మేవార్ గౌరవార్థం వ్రాసినది), ప్రాణాభరణ (ప్రాణ నారాయణ అనే రాజుగారి గౌరవార్థం వ్రాసినది), అమృతలహరి (యమునానదిని స్తుతిస్తూ వ్రాసినది), కరుణాలహరి (శ్రీహరిని స్తుతిస్తూ వ్రాసినది), లక్ష్మీలహరి (లక్ష్మీ దేవిని స్తుతిస్తూ వ్రాసినది), భామినీవిలాసం (ప్రతీ ఒక్కరూ చదివి తీరవలసిన పుస్తకం, ముక్తకాలతో అద్భుతముగా రచించారు). 

" పుణ్యస్య ఫల మిచ్ఛంతి పుణ్యం నే చ్ఛంతి మానవాః
న పాపఫల మిచ్ఛంతి పాపం కుర్వంతి యత్నతః"

పుణ్యం చేస్తే వచ్చే ఫలితం కావాలని ప్రతీ వ్యక్తీ కోరుకుంటాడు కానీ పుణ్యం మాత్రం చేయడు. పాపం చేస్తే వచ్చే ప్రతిఫలం రాకూడదని ప్రతీ వ్యక్తీ కోరుకుంటాడు కానీ ఏదో ఒక సమయంలో పాపం చేస్తూనే ఉంటాడు. అలా నేనే కాక నీతో కూడా పాపం చేయించిన నా దోషానికి గంగా స్నానమే సరయినదని తన భార్యతో చెప్పగా ఆవిడ కూడా భర్తకి ధైర్యం చెప్పి ఆయనతో బయలుదేరింది. ఇద్దరూ కాశీ క్షేత్రం చేరుకున్నాక గంగామాతని చూడగానే కన్న తల్లిని చూసిన వెంటనే బిడ్డ ఏ విధముగా తన బాధనంతా చెప్పుకుంటాడో అదే పారవశ్యంతో ఈయన తను చేసిన అపరాధాన్ని చెప్పి మన్నించమంటూ గంగ స్నానం చేసి మెట్లన్నీ ఎక్కి పైన తన భార్యతో నిలబడ్డాడుట. అప్పుడు కళ్ళు మూసుకుని నమస్కరించి బాధతో, మనసులోని బరువునంతా దించుకుంటూ ఆశువుగా పాడినదే గంగాస్తవము లేదా గంగలహరి. అక్కడ జనమంతా చూస్తుండగానే ఒక్కో శ్లోకానికి ఒక్కో మెట్టు చొప్పున గంగానది పైకి వచ్చి సరిగ్గా నూట ఎనిమిది శ్లోకాలు పూర్తయ్యేసరికి భార్యాభర్తలిద్దరినీ తనలో ఐక్యం చేసుకుంది.

ఆ గంగానదీ తరంగాల మౌన ధ్వనిలో లవంగీ జగన్నాథుల హృదయ స్పందనలను ఒక్కసారి మననం చేసుకున్నా చాలు ఒక మహా కవి మన గుండెల్లో నిలిచినట్లే. ఏమంటారు?

27 comments:

SNKR said...

ఏమంటారు? అంటే ఏం చెప్పమంటారు?
షాజహాన్ పాదుషాకు సంస్కృత కవిత్వం అర్థం చేసుకునేంత అనర్గళంగా వచ్చేదని, తాజ్ మహల్లో మనకూ భాగముందని, ఔరంగజేబు మన తూగోజి గారి బామ్మర్దని ఈ కథను బట్టి తెలుస్తోంది. :)
కొత్త విషయాలు చెప్పారు, బాగుంది.

రాజి said...

నిజంగానే ఒక మహాకవిని,కొత్త విషయాలను,రచనలను పరిచయం చేశారండీ..
చాలా బాగుంది..

Anonymous said...

I exactly don't remember but have doubts about the historic authenticity of Jagannatha Raya and Lavangi story. Do you have any proofs?

Anonymous said...

జగన్నాధపండితరాయల్ని గురించిన విషయాలు బాగున్నాయి, ఈ లవంగి ప్రేమ వ్యవహారం మాత్రం పుక్కిట పురాణమని అంటారు. ఫణీంద్రగారన్నట్లు ఆధారులుంటే చూపితే అందరం ఆనందిస్తాం.

వెంకట రాజారావు . లక్కాకుల said...

పండిత రాయల యంతటి
దండి కవి చరిత్ర కూడ దక్కని దగుటన్
దండిగ కల్పనలు గలిపి
పండుగ చేయంగ వలసి వచ్చె రసఙ్ఞా !

బ్లాగు సుజన-సృజన

రసజ్ఞ said...

@ SNKR గారూ
హహహ! మీరు భలే చమత్కారులండీ! ఇంతకీ మన అంటున్నారు మీది కూడా తుగోజీనా? ధన్యవాదాలండీ!

@ రాజి గారూ
ఇలా మనకు తెలియని వారు ఎంతోమంది మహానుభావులండీ! నెనర్లండీ!

@ వెంకట రాజారావు . లక్కాకుల గారూ
ఎప్పటిలాగే చక్కని పద్య రూపములో అందించిన వ్యాఖ్యకు ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ పురాణపండ ఫణి గారూ, తాతగారూ
నేను ఈ కథని విన్నాను. మా సంస్కృతం మాష్టారు (గంగాధరం గారు) ఎప్పుడూ నాతో మనిద్దరి గురించి గొప్ప అలంకార శాస్త్రం ఉందమ్మా అని ఈ కథని చెప్పేవారు. అయితే మీరు ప్రూఫ్ అంటే నేను గూగుల్ లో వెతకగా రెండు లింకులు దొరికాయి దీనికి సంబంధించి. కాని కథ, కమామీషు నేను చెప్పినదానికన్నా కొంచెం వేరుగా ఉన్నా లవంగీ-జగన్నాథుల గురించయితే ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి.
http://bsv.sulekha.com/blog/post/2007/06/jagannatha-pandita-raya.htm
http://eternal-dharma.org/2012/04/15/a-story-from-the-past---14---jagannath-pandit-lokmanya-tilak--british-rule.aspx

vajra said...

Jaghannatha Panditharayula gurinchi maha abdutham ga chepparu.Meeru chepinattu nenu vinnanu kani..thana story em telvadhu.Thana gurinchi maku telpinanduku dhanyavadhamulu.Mee lanti vari valla naku telugu sahityam,endora mahaneeyula gurinchi telustundi.Appreciated for u r great effort on writings and thoughts.Vandanalu...:) :)

ramki said...

Rasagna garu....
that's a really valuable information.
Good work.

రసజ్ఞ said...

@ వజ్ర గారూ
ఎందఱో ప్రముఖ కవులున్నారండీ! నాకు తెలిసినంతలో ఇలా కొందరిని పరిచయం చేస్తున్నాను మీ లాంటి వాళ్ళ ప్రోత్సాహంతో! మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!

@ రాంకీ గారూ
మీరు మెచ్చినందుకు ధన్యవాదాలండీ!

శేఖర్ (Sekhar) said...

రసజ్ఞ గారు ఇన్ని విషయాలు చెప్తున్నందుకు ధన్యవాదాలు.ఎల్లప్పుడూ సంతోషం గా ఉండండి.

వామనగీత said...

రసజ్ఞ గారు...! టపా చాలా బావుందండి..!
ఈ "ఢిల్లీశ్వరో వ" శ్లోకం మన తెలుగాయనే ఎవరో ఢిల్లీ చక్రవర్తి దగ్గర వినిపించాడని తెలుసు గానీ, ఇంత విపులంగా తెలీదు. చాలా విషయాలు తెలియజేసినందుకు నెనర్లు.

Blog Tariff said...

Today in this generation you like people have....its very great......keep on going...

రసజ్ఞ said...

@ శేఖర్ గారూ
మీరు అన్నిటినీ ఓపికగా చదివి ప్రోత్సహిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలండీ!

@ వామనగీత గారూ
అయితే మీకు ఈ శ్లోకం తెలుసనమాట! సంతోషమండీ! మీకు ఈ టపా నచ్చినందుకు ధన్యవాదాలు!

@ Blog Tariff గారూ
థాంక్స్ అండీ!

పరుచూరి వంశీ కృష్ణ . said...

ముందుగా బోల్డెన్ని థాంక్స్ చాలా విషయాలు తెలియ చేసినందుకు ....ఇద్దరు స్త్రీలు గొడవ పడటం -గ్రాహ్యక శక్తి కధ నేను కూడా విన్నాను .. పండిత రాయల వారు హాస్య చతురత కి కూడా బాగా పేరు గాంచిన వారని నేను చదివాను ఒకసారి దరిద్రం తో బాధపడుతున్న పండిత రాయల వారిని ప్రశ్నిస్తే దరిద్ర దేవత నా దగ్గర సుఖం గా ఉంటుందయ్యా ఇన్నాళ్ళూ ! రేపు నేను పొతే దిక్కులేనిదయిపోతుందే అని బాధపడుతున్నాను అన్నారుట నవ్వుతూ !

రసజ్ఞ said...

@ పరుచూరి వంశీ కృష్ణ గారూ
అవునండీ మీరు చెప్పునట్టుగా ఆయనకి హాస్య చతురత, ఆత్మ స్థైర్యం చాలా ఎక్కువే. ఆయన చిన్నతనంలో చాలా దారిద్ర్యాన్ని అనుభవించారు. ఎందుకో వాటన్నిటినీ ఇక్కడ పెట్టడం ఇష్టం లేక పెట్టలేదు. ధన్యవాదాలండీ!

శ్రీ said...

మీరేదో తూగోజి ...అన్నట్లున్నారు... :)
మా స్నేహితులు ముంగండ వాళ్ళు చెప్పేవారు కొన్ని విషయాలు...
నాకు అక్షరాభ్యాసం చేసిన మా తెలుగు మేష్టారి ద్వారా కొన్ని విషయాలు తెలుసు.
మీరు విలువైన సమాచారం విపులంగా అందించారు...
@శ్రీ

ఏల్చూరి మురళీధరరావు said...

శ్రీ రసజ్ఞ గారికి
నమస్కారం!

ముక్తాముక్తంగానే అయినా మౌక్తికాల వంటి మాటలలో ప్రవాసభూములపై ఆంధ్రుల జయకందళిని ఎగురవేసి, కావ్యాలంకార తర్క మీమాంసలలో ప్రాభవత్యాన్ని చాటిచెప్పిన మహాకవిని గుఱించి ప్రాణాభరణంగా వివరించారు. మీ కుశలకథనం చరిత్ర, ఐతిహ్యాల కలనేతగా అమరింది.

పండితరాయల జీవితవిశేషాలేవీ శ్రుతిప్రతీతాలు కావు. ముంగండ అగ్రహారంలో పుట్టినవాడనని, వేగినాటి బ్రాహ్మణుడనని, లక్ష్మీదేవీ పేరుభట్ట విద్వన్మణుల పుణ్యసంతతినని, ఇంటిపేరు ఉపద్రష్ట వారని - వివరాలను స్వయంగా ఆయనే చెప్పుకొన్నాడు. ఆ కుటుంబం వారు, తద్బంధువులైన కోరాడ, ఖండవల్లి, మహీధర కుటుంబాల వారు ఇప్పటికీ ముంగండలో ఉన్నారు. శ్రీ కోరాడ పద్మనాభశాస్త్రి గారు, శ్రీ ఖండవల్లి సూర్యనారాయణశాస్త్రి గారు, డా. మహీధర నళినీమోహన్ గారు మీరు పేర్కొన్న గ్రంథాలను పండితపామరుల కోసం పలురీతుల తెలుగుచేశారు. ఆనాటి "భారతి" పత్రికలో ప్రకటించారు.

మీరిచ్చిన శ్లోకంలో "లవంగీ కురంగీ దృగంగీకరోతు" అని ఉండాలి. ("మదంగీకరోతు" అని ఉండదు. మాం అంగీకరోతు అనాలి కదా)

అతీతకాలవాతూలాహతికి చిద్రుపలు కాకుండా చిరస్మరణీయులైన మహాకవిజీమూతాలను మళ్ళీ ఒకసారి మఱొక్క తరం విద్యార్థుల మనోవిహాయసాలలో విహరింపజేస్తున్న మీ సదుద్యమానికివే అభినందనలు!

సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు

భమిడిపాటి బాలాత్రిపురసుoదరి- బాలల రచయిత్రి said...

http://bhamidipatibalatripurasundari.blogspot.in/

రసజ్ఞ said...

@ శ్రీ గారూ
సందేహమా? మాది తూగోజీనే! ఇదివరకే పరిచయం ఉన్నా అంతా మళ్ళీ ఓపికగా చదివినందుకు మీకు ధన్యవాదాలండీ!

@ ఏల్చూరి మురళీధరరావు గారూ
నమోవాకములు! ఆయన గురించి మరింత విపులంగా తెలిపారు. మీ ఈ వ్యాఖ్య ద్వారా ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలే కాక ఆయన బంధువుల సమాచారం కూడా అందింది. ఈ భారతి పత్రిక గురించి చాలానే విన్నాను కానీ ఏనాడూ చూడను కూడా లేదు. అప్పట్లో సాహితీ సంపదకి చక్కని చిరునామా ఈ పత్రిక అని మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. అటువంటి పత్రికలలో ఇటువంటి ఎందఱో మహానుభావుల సంబంధిత వివరాలు ఉండే ఉంటాయి కనుక అది మన సంపదగా భావించి భద్ర పరచవలసిన అవసరం ఎంతయినా ఉంది. కావున మీ వద్ద ఆ పత్రికా ప్రతులు ఉంటే వాటిని వెలుగులోనికి తెస్తారని ఆశిస్తున్నాను.

ఇహ ఈ శ్లోకం విషయానికి వస్తే, నేను ఇలానే విన్నాను. మీతో వాదించే అంతటి దానిని కాదు కానీ మదంగీకరోతు అంటే మత్ అంగీకరోతు నన్ను అంగీకరించు గాక అని కదా! మీరన్నది కూడా ఇక్కడ అర్థానికి తగినట్లే ఉంది. కురంగీ దృగంగీకరోతు అంటే లేడి వలే చెంచలమైన కన్నులున్న ఈ లవంగీ నన్ను చూచి అంగీకరించుగాక అని కదా! సరిదిద్దినందుకు ధన్యవాదాలు!

మీ అభినందనలకు, అవి చెప్పేందుకు మీరు వాడిన పదజాలాన్నీ చదివి ఎంతో సంతోషించాను. చక్కని ఉపమానాలతో చాలా బాగుంది. మీ ఈ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు అన్న మాట చిన్నదవుతుంది.

kalyan said...

@రసజ్ఞ గారు మీరు అతని చరిత్రతో పాటు ఎన్నో మంచి విషయాలను అందించారు ఆ చతురత కి అభినందనలు :) . నేను గ్రహించిన కొన్ని .

౧. గ్రహాణా శక్తిని పెంపొందించుకోవాలి అనే సూచన

౨. పాండిత్యానికి ఉన్న విలువ

౩. నిజమైన స్నేహం

౪. తన కూతురిని అడిగాడని తనకు సమం కాదని కాకుండా దానిచేత ఎటువంటి అనర్ధాలు జెరుగుతాయో అని ఆలోచించిన రాజుగారి చాకచక్యం.

౫. తన దుఖాఃన్ని కూడా రచనలుగా మార్చిన పండితరాయలు గారి నిబత్తత ( నిజమే మన మనోభావాలను అదుపు చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం )

౬. కులాంతర వివాహాల వలన కలిగే మానస క్షోభ ( అప్పటి వారు కాబట్టి నియంత్రించుకున్నారు కాని ఇప్పుడు అలా జరిగితే విడిపోవడానికి కూడా సిద్ధపడతారు పైగా దాని వలన మన విధిని వదులుకోవలసి వస్తుంది )

౭. భార్యా భర్తలు ఏ పరిస్థితినైనా గెలవాలి కలిసి ఉండాలి అనే అంశం చాలా బాగుంది.

చిన్ని ఆశ said...

డాక్టర్ రసజ్ఞ గారూ,
భారతీయం-కళలు-పరిశోధన అన్న అంశంపై బ్లాగులోకంలో మొట్టమొదటి పి.హెచ్.డి పట్టా మా "చిన్ని ఆశ" బ్లాగు నుంచి మీకు ఇస్తున్నాము.
మీ పరిశోధనా, ప్రెజెంటేషన్ రెండూ అద్భుతమే. తెరమరుగైన, తెర మీదకే రాని ఎన్నో విషయాలూ, కళాకారులనీ మీరు నలుగురికీ తెలిపి వెలుగులో నిలబెడుతున్న విధానం నిజంగా అభినందనీయం.
అభినందనలు డాక్టర్ రసజ్ఞ గారూ!!!

రసజ్ఞ said...

@ కళ్యాణ్ గారూ
దీని నుంచి మీరు నేర్చుకున్న నీతి బాగుందండీ! అలానే జనుల సమక్షంలో తిట్టాలి, పరోక్షంలో మెచ్చుకోవాలి అంటారు అలానే ఈయన షాజహాన్ గారి పరోక్షంలో కూడా మెచ్చుకోవడం ఆచరించదగినది. అల్ ది బెస్ట్ అండీ! ధన్యవాదాలు!

@ చిన్ని ఆశ గారూ
మీరెంత మంచోరో! నాకు డాక్టరేటు ప్రకటించారు మరి ఆ పట్టా కూడా అందచేస్తే (నాకిష్టమయిన మీ బొమ్మలతో సహా) సంతోషిస్తాను. ఈ పిలుపేదో వింతగా, క్రొత్తగా ఉందండీ. డాక్టరేటు వచ్చినా ఎప్పటికీ రసజ్ఞనే. మీ అభినందనలకి అభివాదాలండీ!

thanooj said...

oka uththamudina pandithudini anthakanna uththamuraalu amayakuralu ayina ayana bharyani thanalo ikyam chesukovadam dwaara ganga nadhi ponde anandam etuvantido vivaristhara

రసజ్ఞ said...

@ తనూజ్ గారూ
ఆయన అన్య మతస్కురాలిని చేసుకున్నందున ఆయనని అంటరాని వాడుగా చూసేవారు చాలా మంది. ఆ రోజుల్లో చాలా దారుణంగా ఉండేది. కందుకూరి గారి సమయంలోనే ఎంత ఉందో మనకి తెలుసు అంటే ఆయనకన్నా ముందు ఇంకా దారుణంగా ఉండేది. కనుక ఆయనని గంగా నదిలో స్నానం చేయకూడదనీ, అపవిత్రుడనీ చాలా నిందలు వేయటం జరిగింది. ఈయన ఆ బాధతోనే గంగా దేవికి ప్రార్థన చేయగా ఆవిడ వీళ్ళిద్దరూ ఏ తప్పూ చేయలేదు, అంటరాని వాళ్ళు కాదు, వాళ్ళూ నా బిడ్డలే అని చెప్పడానికే తనకి తానుగా పొంగి వచ్చి ఐక్యం చేసుకుంది. మీ స్పందనకి ధన్యవాదాలు!

thanooj said...

anti-climax meeru ganga nadhi sthanamlo unte alane chesevaraa.nenitha ala nindandalu vesina vallani ikyam read as murder chesayvaadini

రసజ్ఞ said...

@ తనూజ్ గారూ
నేను ఆ స్థానంలో అంటే ఊహించుకోను కూడా లేనండీ. కానీ మనిషి ప్రాణాలు అయితే నేను తీయలేను. మీ ఆవేశం, బాధ అర్థం చేసుకోగలను కానీ అప్పట్లో అలా ఉండేవారు కాదు కదండీ జనాలు. ఆ కాల పరిస్థితులని బట్టీ ఆలోచించండి చూడండి జరిగినదానిని. ఏదయినా "గతం గతః" అటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవటం మన బాధ్యత! ధన్యవాదాలు!